...

...

18, జనవరి 2009, ఆదివారం

పుస్తక సమీక్ష ! - 3 తెరిణెకంటి ముట్టడి

[తెరిణెకంటి ముట్టడి - చారిత్రక నవల, రచన- యస్.డి.వి.అజీజ్, పేజీలు-79,వెల- రూ.50/-(5డాలర్లు), ప్రతులకు యస్.డి.వి.అజీజ్,46/634,బుధవార పేట, కర్నూలు-518 002 సెల్ల్:+91 99894 48353]
"చరిత్ర చదవటం వల్ల మనిషిలోని సంకుచిత భావాలు దూరం అవుతాయి. అంధ విస్వాశాలు, మూఢనమ్మకాలు తొలగిపోతాయి. విశాల దృక్పథం ఏర్పడుతుంది. ఈ కాలంలో కూడా మనిషి మతం కోసం మారణ హోమం సాగించటం, కులాల కోసం కుమ్ములాడుకోవడానికి కారణం? మనిషి పరిణామ చరిత్ర పట్ల, సామాజిక చరిత్ర పట్ల సరియైన అధ్యయనం లేక పోవడమే! సామాజిక అవగాహన లేని వ్యక్తి శాస్త్రవేత్త అయినా సామాన్యడితో సమానమే!" అంటారు రచయిత తమ ముందు మాటలో. క్రీ.శ.1801లో కర్నూలు మండలంలోని తెరిణె కల్లు (తెర్నేకల్లు అని వాడుకలో వుంది) గ్రామపు ప్రజలు బ్రిటీషు వారిపై జరిపిన పోరాటాన్ని అజీజ్ గారు ఈ నవలలో వివరించారు. మెకంజీ కైఫీయతులను, జిల్లా గెజిట్ ను పరిశీలించి లభ్యమైన సమాచారం తో రచయిత ఈ నవలకు రూపాన్ని ఇచ్చారు.తెలుగు నాట బ్రిటీష్ వారు విధించిన శిస్తుకు వ్యతిరేకంగా తెరిణెకల్లు గ్రామ ప్రజలు గ్రామపెద్ద నేతృత్వంలో 15రోజులపాటు కుంఫిణీ సైన్యం పై జరిగిన భీకర పోరాటం ఇందులో మనకు కనిపిస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాట చరిత్రలో ఈ ఘటనను బ్రిటీషు వారిపై జరిగిన తొలి రైతాంగ తిరుగుబాటుగా రచయిత పేర్కొంటున్నారు.ఈ గ్రామస్థుల బలిదానం తర్వాతి తరాల వారికి ఉత్తేజాన్ని కలిగించి బ్రిటీష్ వారిపై సమరభేరి మోగించడానికి స్ఫూర్తిని రగిలించింది.
నిజాం నవాబు అలిఖాన్ అసఫ్ జాహి తన ఆధీనంలో వున్న బ్రిటీష్ సైన్యం ఖర్చు ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో దత్తమండలాలను బ్రిటీషు వారికి గుత్తకు(లీజుకు) యిచ్చి వారిని వదిలించుకుంటాడు. పాలెగాళ్ల పెత్తనం కారణంగా కప్పం వసూలు చేయడం తలనొప్పిగా మారడం కూడా ఆ ప్రాంతాన్ని బ్రిటీష్ వారికి అప్పగించడానికి ఒక కారణం. థామస్ మన్రో ఆ ప్రాంతానికి ప్రిన్సిపల్ కలెక్టర్ గా నియమింపబడతాడు. మన్రో బ్రిటీష్ అధికారి అయినా తన చర్యల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొంటాడు.తన సామర్థ్యంతో పాలెగాండ్ర వ్యవస్థను నిర్మూలించి రైత్వారీ విధానాన్ని ప్రవేశ పెడతాడు. ఆ ఏడు తీవ్రమైన కఱవుతో సరిగ్గా పంటలు పండలేదు. బలవంతంగా అయినా శిస్తు వసూలు చేయమని మద్రాసు నుండి గవర్నరు ఆజ్ఞను అనుసరించి తన మనస్సు అంగీకరించక పోయినా మన్రో తప్పని సరై ఆదేశిస్తాడు.తెరిణె కల్లు గ్రామ పెద్ద ముతుకూరి గౌడప్ప ఈ ఆదేశాలను ధిక్కరిస్తాడు. పంటలే సరిగా లేనప్పుడు శిస్తు వసూలు చేయలేమని వచ్చే ఏడాది పంటలు సరిగా పండితే శిస్తు వసూలు చేసి పంపుతామని అధికారులకు స్పష్టం చేస్తాడు గౌడప్ప.ఈ ధిక్కారాన్ని సహించని బ్రిటీషు సైన్యాధికారి విలియం థాక్రే తెరిణెకల్లు గ్రామంపై దండెత్తడానికి పూనుకుంటాడు. థామస్ మన్రో ఆ సమయానికి అందుబాటులో లేకపోవడంతొ కలెక్టర్ మాథ్యూస్, థాక్రేకు తన ఆమోదాన్ని తెలుపుతాడు. బ్రిటీషు సైన్యం తమపై దాడికి సిద్ధమవడంతో తెరిణెకల్లు ప్రజలు వారిని వీరోచితంగా ఎదుర్కోవడానికి సన్నద్ధులవుతారు. రెండువర్గాల మధ్య 15రోజుల పాటు భీకర పోరాటం జరుగుతుంది. ఇరువైపులా వందల సంఖ్యలో చనిపోతారు. చివరకు గౌడప్పను, మరో ఇద్దరిని బ్రిటీషు సైనికులు పట్టుకుని వారిని ఉరితీస్తారు.స్థూలంగా ఇదీ కథ.ఈ కథను ఆసక్తి కలిగేలా నడపడంలో రచయిత కృతకృత్యులైనారు. అయితే ఇంకా విస్తృతంగా కథను అల్లగల అవకాశం ఉన్న ఇతివృత్తం ఇది. రచయిత ఎందుకో 73 పేజీల తోనే సరిపుచ్చారు.ఏమైనా చారిత్రక సంఘటనలను ప్రజలకు చేరవేసే అజీజ్ గారి ఈ ప్రయత్నం ప్రశంసనీయమైనది. చరిత్రపట్ల ఇష్టమున్న ప్రతి ఒక్కరూ చదివి ఆనందిచవలసిన నవల ఇది.

15, జనవరి 2009, గురువారం

మనవి

17-01-2009 శని వారం భక్తి టీ వీ లో రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు తరతరాల తెలుగు పద్యం అనే కార్యక్రమం వస్తుంది. దీనిని సుప్రసిద్ధ అవధాని శ్రీ గరికపాటి నరసింహారావు గారు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం లో కవితా కౌమార్యం అనే ఆవృత్తిలో చిన్నపిల్లల పద్యాలు వుంటాయి. మా అమ్మాయి ప్రణీత ఈ కార్యక్రమంలో పాల్గొనింది. బ్లాగ్మిత్రులందరు ఈ కార్యక్రమాన్ని చూసి చిరంజీవిని ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

12, జనవరి 2009, సోమవారం

అంకెలతో తమాషా!

సుభద్ర 50రాగిని జూచి ఇట్లనియె" నాథా! నీకు నా 100నములు. నిన్ను వివాహ మాడుటకు ది4ణించుచున్నాను. క్షణమొక యుగం5ర్భరముగా నున్నది. నీ1000క్కడి నుండి బయట పడు మార్గము జూపుము" అనిన ఆ కపట వేషధారి ఇట్లు నుడివె. "రమణీ! నా నో2కొని పోవుచున్నది. 1న్నులో నీరు తెమ్ము. 6క్మిణీ పతి 400క్మిణీ దేవి నిన్నూ కాపాడుచున్నారు. మ40టి వారు చూచిన కీడు3ను.ఈ రహస్యమును ఇంకొన్ని దినములు 10లముగా కాపాడుము. లేకున్న మిక్కిలి 30తీరును. త్వరలో శుభ100000ణములు కనబడుచున్నవి. అంత వఱకు ఓపిక బట్టుము."
రాప్తాT OBరెడ్D కV EటువంTV Aన్నో వ్రాUను.
మురళీ మోహన్ EటువంTV Aన్నో కాP చేUను.

9, జనవరి 2009, శుక్రవారం

పోతన్న చల్ది భాగోతం!

భాగవతంలో పెరుగన్నం గురించి ఎంత చక్కని పద్యముందో చూడండి.

"మీగడ పెరుగుతో మేళవించిన చల్ది
ముద్ద డావలి చేత మొనయ నునిచి
చెలరేగి కొసరి తెచ్చిన యూరుగాయలు
వ్రేళ్ళ సందుల యందు వెలయ నిరికి
సంగడీల నడుమ చక్కగ కూర్చుండి
నర్మ భాషణముల నగవు నెరపి
యాగభోక్త కృష్ణుడ మరులు వెలుగంద
శైశవంబు మెరసి చల్ది గుడిచె."

దీన్ని చదివిన ఒక కవి (పారనంది క్ష్మీ రసింహం) గారి చమత్కారం

తిను పెరుగు అన్నమని
చెప్పిన కవి పోతన
పిలువబడెను మారుపేరున
తిండిపోతననా? తిండిపోతనా?

8, జనవరి 2009, గురువారం

"ఘుమ ఘుమలు"

ఇంకొక కట్ అండ్ పేస్ట్ టపా!


" అల్లము పచ్చడి తలవగ నుల్లము
నుప్పొంగు నదిరి నూగాడు లయన్,
ఆ(హా) మజ్జిగ మిరపకాయ లావరసంబున్,
జర్రున జుర్రిన జారును హృదయము ధృతిలో..

చిక్కని పెరుగున తురిమిన చక్కని కొబ్బరి పచ్చడి,
డెందమునకు బంధమేయు శాకము కందా బచ్చలి,
పంతి భోజనములు, కొసరి వడ్డింపులూ,
పరమాన్నపు భక్ష్యాదులు, పండ్ల రసంబుల్..

గుమ్మడి కాయ పులుసు గుండె తడుపు,
గుబులు పుట్టించులే గుత్తి వంకాయ,
అరటి పువ్వు కూర, దోసావకాయ,
అరటాకులొ యారగింపు, మా రుచి చూడన్..

కమ్మనైన నేయి, గుమ్మ పాలు,
వెన్న మీగడలౌర, గడ్డ పెరుగు,
గోంగూర పప్పు, గోముగా తాళింపు,
మనసు దోచెడి పొడులు, ఒరుగులొడియాలు

" గోగు చిగురు, చింత చిగురు, మునగ చిగురు తో వెరసినా,
మెంతికూర, పాలకూర, చుక్కకూర తో కలసినా,
దోసకాయ, వోగ కాయ, టొమటో ల జతగూడినా,
కమ్మనైన యర వేచిన, పప్పు తలువ తాళలేము.. "

" పాకమందు ప్రప్రథమ స్థానము యీ శాకములది,
మది మెచ్చిన, మనసిచ్చిన కూరలెన్నో కలవండి,
కొత్తిమీర, జీలకర్ర, వేపుడుల్లి కారములను,
గుబులు పుట్టించునౌర, గుత్తి వంకాయ కూర..

డెందమునకు బంధమేయు శాకము కందా బచ్చలి,
అందరు మెచ్చెడి రుచి కల, యాకు కూర తోటకూర,
వంకాయల్లము కలిసిన వంక(పెట్ట)లేని కూరయిది,
చిట్టి వడియాలు కలిపి, చిత్తు దీర భుజియించుడి..

పనస పొట్టు కూరండి, పరవశించి దినగ రండి,
అరటి కాయ శాకమిది, యాదమరచి యారగింప,
అట నిట కొబ్బరి కలిపిన యతి చక్కని శాకమండి,
మప్పితముగ ఘుప్పించుడి, పప్పు కూర యిదెనండి... "

" సొర కాయల సోయగాలు, మునగకాళ్ళ ఢప్పళాలు,
పండు గుమ్మడితో కలిసి ముల్లంగీ, క్యారెట్టులు,
ఆరగించకుండానే అందమైన రుచిని తెలుపు,
నాధరువుల మేటి యిది యతి చ(చి)క్కని మజ్జిగ పులుసు,

ఆకలాకలంటుంటే యడగకుండ కడుపు నింపు,
మది లోపలి మగత దీర్చు, నిది తియ్య(ని) పులుసు,
వెచ్చటన్నముంటేను, మెచ్చిన జత యుంటేను,
మచ్చుకి రుచి చూసిననూ, వదల లేని పచ్చి పులుసు,

ముక్కల పులుసు, బచ్చలి పులుసు, ఆవపులుసు, పప్పు పులుసు,
యెండు మిరప పోపు పొగిచి, పసుపు, యింగువ సొబగులద్ది,
కరివేపా తళుకిస్తే, కొత్తిమీర కులుకులిస్తే,
ఘుమ ఘుమ ఘుమ లాడించును, యా చవులను అదిలించును. "

" మెంతి చారు, శొంఠి చారు, యులవ చారు, యుల్లి చారు,
పప్పు చారు, యావ చారు, మిరియాల్చారు, మజ్జిగ చారు,
ఉరికించును, యుడికించును, ఉల్లాసపు ఊపిచ్చును,
ఉడుకి ఉడుకుతుండగానే, మది నూయలలూగించును....


కడుపు నిండింది మరికొన్ని ఇంకో సారి.

7, జనవరి 2009, బుధవారం

హైకూ కైకూ?

మరొక కట్ అండ్ పేస్ట్ టపా!


హైకూ


ద్విపద ఉండగా
జపానీసు హైకూ
మనకు కైకూ?



ద్విపద


మన దేశి వృత్తము ద్విపద యుండగను
జాపాను వారి హైకు మనకు కైకు?

ముత్యాల సరాలు

మనకు కల ముత్తియపు సరముల
మరచి పోయి జపాను వారిది
పదియు నేడక్షరాల్ కలిగిన
హైకు కైకనెదన్!

కూనలమ్మ పదాలు

తెలుగు చందాలలో
పోవు పంథాలలో
కలవు అందాలులే
హై-కూనలమ్మా!

ద్విపద

మరతురో మనకున్న మంచి ద్విపదను
పొరుగింటి హైకన్న పుల్ల కూర గని



మత్తేభం
.


ఒక సందేహము `హైకూ మీద తల యెత్తెన్ దాని సిగ్గోసిరా
యొక హైకేమిటి జేసె గాని, మనకే పొద్దైననా భాషలో
నొక చందంబును మెచ్చి దాని వెనకో యీభాషలో నున్న వే
రొక చందంబును జూచి దాని వెనకో పోకున్నచో తోచదా?


తేట గీతి.


సంస్కృతంబున వృత్తాలు చాల వనిన,
జాతి యుప జాతి పద్యాలు చాల గలవు
ఇంట తిన రోసి హోటళ్ళ వెంట తిరిగి
నట్లు యీరీతి వెంపర లాడ నేల?


సీసం.

వ్రాయ గల్గిన వాడు వ్రాయ బూనెడునెడ
తగినన్ని చందముల్ తనకు లేవె?
కల్పనా చాతురి కనులకు గట్టింప
మన చందముల కేమి మహిమ లేదె?
రస పోషకంబులై రాణించ జాలిన
కమనీయ చందమే కాన రాదె?
వేయేండ్ల నుండి కవీంద్రులు వాడిన
చందంబు లన్నియు చచ్చు బడెనె?

ఆటవెలది.

యెందు చేత మనకు యీనాడు తెలుగులో
నున్న చంద మెల్ల సున్న యయ్యె?
యెందు చేత నేడు యితర భాషల నుండి
యీ యెరువు దెచ్చుకొను బుద్ధి పొడమరించె?


చంపక మాల.


అటులని క్రొత్త క్రొత్త చిగురాకులు వేయక నెల్ల కాలమొ
క్కటి యగు రీతిబట్టి జన గా దొక భాషకు నట్టులయ్యు నా
ర్భటమున వారసత్వముగ వచ్చిన సంపద నొల్లరోసి వే
రిట గల మంచి చందముల వేటలు మంచివి గావు చూడగన్.

సీసం.
ఏభాష నుండైన యేమైన దేవచ్చు
కన్న భాషకు ఉట్టి గట్ట రాదు
క్రొత్త భావంబుల గుప్పించ వచ్చును
పాతయే రోతని పలుక రాదు
కొంగ్రొత్త పలుకుల కూర్మి జేర్పగ వచ్చు
ఉన్నవాటిని విసర్జింప రాదు
నూత్న ధోరణులతో నింగి ముట్టగ వచ్చు
తెలుగుతనము తుంగ ద్రొక్క రాదు

ఆటవెలది.

భాష నభివృద్ధి జేయుట పాడి గాని
వృద్ధి పేరిట నాత్మ సంశుద్ధి లేక
నవసరము లేని యెరువుల నచ్చటచట
దేబిరించెడు కర్మ మిదేల మనకు?

4, జనవరి 2009, ఆదివారం

సాహిత్యోపనిషత్

ఊకదంపుడు, వాగ్విలాసము టపాలు చూసిన తర్వాత ఇటీవలే అంతర్జాలంలో శోధించగా కనబడిన(చదివిన) శ్రీ శ్రీ - ఆరుద్రల సంవాదమును ఇక్కడ మీతో పంచుకోవాలని అనిపించింది. ఇది ఆరుద్ర గారి "సినీవాలి" లోనిది అనుకుంటున్నాను.



"స్వవిషయసూచిక"
(సాహిత్యోపనిషత్).


ఆరుద్ర
-------

ఏమయ్యా కవీ
నాదో మనవి
నువ్వెందుకు రాస్తున్నావ్
నూక లివ్వకపోయినా భావాల
మేక లెందుకు కాస్తున్నావ్?

శ్రీ శ్రీ
--------

చెప్పిందే చెప్పిందే మళ్ళీ చెప్పడం
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కొందరి కిష్టం
చెప్పింది చెప్పి మెప్పించాలని
చేస్తున్నాను నేను నా రచనల్లో ప్రయత్నం
అదే అనుకుంటాను కవిత్వం
అనుకరణం అనవసరం
అంతేకాదు అనర్ధకం
అందుకనే దేవుణ్ణి సహా ఇమిటేట్ చెయ్యడం
మానెయ్యడం
అదీ నా ప్రయత్నం
అదే నా కవిత్వం
ఈ మేకలే నాలోని పెద్దపులికి ఆహారం
నా కవిత్వం ఆ వ్యాఘ్రం ఆకలి ఆహారం

ఆరుద్ర
-------

అచ్ఛా స్వేచ్ఛాజీవీ
చర్చకి చోటిచ్చావు
ఎవరూ చెప్పింది చెప్పడం
ఇలా చెప్పి మెప్పించడం
అదే నన్నమాట కవిత్వం అంటే
ఐతే కొందరు మెచ్చనంటే?

శ్రీ శ్రీ
---------

మెచ్చకుంటే మించిపోయెను

ఆరుద్ర
-------

ఇది గురజాడకి
ఇమిటేషన్ కదూ?

శ్రీ శ్రీ
---------

ఇమిటేషన్ కాదు కొటేషన్
ఇదివరకు కవులను మింగెయ్యాలనే
ఆకలి కాదిది
నిన్నటినుంచి ఇవాళ లాగ
నిరుటి కవులనుంచి నేటి కవులు పుడతారు
కందం రాసినవాడు కవేగాని
అంతింతో కందపద్య మల్లగలాడెల్లా
ఎంతమాత్రమూ కవికాడు

ఆరుద్ర
-------

ఒప్పుకొన్నాను తప్పకుండా ఈ సంగతి
చెప్పావుకావు ఈ మెప్పుగురించి

శ్రీ శ్రీ
---------

రుచీ, ఔచిత్యం ఇవీ ముఖ్యం మెప్పుకి
కవికోరే మెప్పు గండపెండేరం కాదు
సమానధర్ముల హృదయస్పందనం శిరఃకంపనం
అదీ గీటురాయి అసలైన కవిత్వానికి
వానలాగ ప్రజల హృదయాలల్లో వర్షించి
కొత్త భావాల బీజాలు జల్లేది కవిత్వం
ప్రజలు చప్పట్లు కొట్టే భావాలకి
పద్యాల రూపం ఇస్తే చాలదు
ప్రజాస్వామ్యాన్ని అంగీకరిస్తూనే కవి
మెజారిటీకి అందని ఊహలు వెదకాలి
ఆ తర్వాత అతని మైనారిటీ ఓటు
ఆక్రమిస్తుంది ప్రజాహృదయంలో చోటు
ఏమైనాసరే కవిత్వం
మేలుకొల్పాలి కాని జోగొట్టగూడదు
అంతేనంటావా లేక----

ఆరుద్ర
-------

అప్పుడప్పుడది జోల ముప్పు ముంచుకొస్తే కేక...
అప్పుడప్పుడు అవుతుంది జీవితం దుఃఖభాజనం
అప్పుడు వెలుగు చూపించడం కవిత్వ ప్రయోజనం
అప్పుడప్పుడు జనం కళ్ళకి కప్పుతాయి ఏవో పొరలు
అప్పుడు కవిత్వం తొలగించాలి ఆయా తెరలు
బాధపడుతుంది ఒకప్పుడు గాయపడిన మనస్సు
గాధలను చెప్పి ఊరడించడమే కవియొక్క తపస్సు
అప్పుడప్పుడు అధికారులకీ పోతుంది కామన్‌సెన్స్
ఇప్పుడిప్పుడు పురోగమిస్తోంది మనయొక్క దేశం
ఇది కవిత్వానికి అనువైన నిజమైన సన్నివేశం
ఎప్పుడో మానిషాదతో పుట్టిందట మొదటి కవిత్వం
ఎప్పుడైనా అలాంటి ఘటనతో పుట్టడమే దాని తత్వం
అక్రమం జరగడం కవితకి నాందనేది ముఖ్యం
అంతటా అంతర్లీనంగానే ఉండాలి భరతవాక్యం
కవిత్వం సైన్స్, కారాదు కవి రచన కఠినమైన థిసిస్
కావాలి అది ఎడారిలో ఒయాసిస్సు అనుభవాల తేట సరస్సు
అందరికీ ఉపయోగపడాల్సినదే కవిత్వం
కొందరికి ఊహకందక పోవచ్చు లోని రహస్యం
అప్పుడు సామాన్య మానవుడికి చేయూత
ఇవ్వాలా సహృదయుడైన వ్యాఖ్యాత?


శ్రీ శ్రీ
---------

కవిత్వమ్మీద కవిత్వంకూడా కవిత్వమే
అది ఎప్పటికైనా తెలిసిపోయే రహస్యమే
ఈలోగా ఎవరైనా తికమక పడుతున్నప్పుడు
వ్యాఖ్యాత జోక్యం చేసుకోక తప్పదు
భావాల సరిహద్దులవద్ద కాపలా కాయాలి కవి
ప్రపంచాన్ని ప్రజానీకానికి విశదం చేయాలి కవి
చక్రాల్లో చక్రాల్లాగా అర్ధాల్లో అంతర్ధాలుంటాయి
కొంతమట్టుకే బోధపడవచ్చు కొందరికి
ఇంకా అందులో ఏముందో చెబుతాడు వ్యాఖ్యాత
అర్ధంకాని రహస్యం లేనట్టే అసలే బోధపడనిదంటూ ఏదీ
ఉండదు
అన్ని కళల్లాగే కవిత్వం కూడా
ఏక కాలంలో రెండు లెవెల్స్ లో పనిచేస్తుంది
అందుకే అసలైన కవిత్వం
ఏకకాలంలోనే పండిత పామరజన రంజకం
ఎవరో అనగా విన్నాను
"మనుష్యులంతా సమానులే గాని
కొందరు మరికొంచెం ఎక్కువ సమాను"లని
విదూషకుడి నోటంట వచ్చే నిజం లాంటిదిది
మనుష్యుల్లో హెచ్చు తక్కువలు సర్దుదాం మొదట
మనసుల్లో ఎగుడు దిగుడులు సర్దుకొంటా యాపిదప
సరేగాని నేనొకటడుగుతాను చెప్పు
ఛందస్సుల నియమ బంధంలో లేదా ముప్పు?



ఆరుద్ర, శ్రీశ్రీ లను స్మరించుకొనే అదృష్టం కలిగించినందులకు ఊకదంపుడు, రాఘవ గార్లకు కృతజ్ఞతలు.