...

...

19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పుస్తక సమీక్ష 31 - భారతదేశంలో స్త్రీ!

[పుస్తకం పేరు: భారతదేశంలో స్త్రీ (ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు) పేజీలు:112, వెల రూ.100/-, రచయిత: యస్.డి.వి.అజీజ్,  ప్రతులకు: 8106367175]

ఈ వ్యాసంలో అజీజ్ స్త్రీ గురించి ప్రాథమిక అవగాహన కలిగించడానికి (పాఠకులకు) వ్రాసినట్టు పేర్కొన్నాడు. అయితే భారత దేశపు స్త్రీ గురించి రచయిత తనకు తాను ఒక అవగాహన కలిగించు కోవడానికి వ్రాసినట్టుంది ఈ పుస్తకం. కొన్ని కొన్ని విషయాలు మనకు తెలిసినా వాటి గురించి బహిరంగంగా చర్చించడానికి విముఖత చూపుతాము. కారణం మనం వాటిపై కొన్ని నిశ్చితాభిప్రాయలతో ఉండి ఉంటాము. వాటిని మార్చుకోవడానికి సిద్ధపడము. పైకి మాత్రం సభ్యత సంస్కారం అనే నెపం వేస్తాము. ఈ సుదీర్ఘ వ్యాసంలో అజీజ్ ఆదిమానవుల కాలం నుండి నేటి వరకు స్త్రీల పరిణామ క్రమాన్ని సామాజిక కోణంలో  వివరిస్తూ వచ్చాడు.   సామాజిక అవసరాలను బట్టి పుట్టుకొచ్చిన ఆచారాలు సంప్రదాయాలుగా మారిన వైనం  వివరించాడు. బహుభర్తృత్వం, సతీసహగమనం, బహుభార్యత్వం,వితంతు పునర్వివాహ నిషేధం,  బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, దేవదాసి/ జోగిని/ బసివి వ్యవస్థ, కన్యాదానం, పరదా పద్ధతి, పాతివ్రత్యం, నోములు, వ్రతాలు మొదలైన ఆచారాల వెనుకనున్న కారణాలను చర్చించాడు. స్త్రీల పట్ల వివక్షత, స్త్రీ పురుషుల మధ్య ఘర్షణ-కారణాలు, స్త్రీలపై అత్యాచారాలు, స్త్రీల ఆత్మహత్యలు, భ్రూణహత్యలు, ఉద్యోగం చేసే స్త్రీల సమస్యలు, ఇబ్బందులు, వ్యభిచారం, స్త్రీల పట్ల వ్యాపార దృక్పథం, భోగవస్తువుగా స్త్రీలను చూడటం ఇలా అన్ని విషయాలకు మూలాలను వెదికాడు.  స్త్రీల సామాజిక హోదాలో వచ్చిన మార్పులను ఎత్తి చూపాడు.  లైంగిక స్వేచ్ఛ, కుటుంబ విచ్ఛిత్తి, పెళ్లి లేకుండా సహజీవనం గడపడం, స్త్రీవాదం మొదలైన విషయాలను కూడా ప్రస్తావించాడు. వివిధ రంగాలలో, వృత్తులలో, కళలలో భారత స్త్రీలు సాధించిన ప్రగతిని సోదాహరణగా పేర్కొన్నాడు. వ్యాసాన్ని ముగిస్తూ ఇలా పేర్కొంటాడు. "పురుషుడు ఎంతగా ఎదిగినా స్త్రీ పాదాలముందు దోగాడే పసిపిల్లవాడే! ఆమె సహకారం లేనిదే పురోగతి సాధించలేడు." ఈ వ్యాసం వ్రాయడానికి ఉపయోగ పడిన పుస్తకాల జాబితా పరిశీలిస్తే అవి ఎక్కువభాగం హేతువాదుల, నాస్తికుల రచనలుగా గోచరిస్తాయి. వారి ప్రభావం ఈ పుస్తకంపై స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. రచయిత కొన్ని చోట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలు కొందరిని హర్ట్ చేసేవిగా ఉన్నాయి, ముఖ్యంగా శంకరాచార్యుల పై చేసిన ఆరోపణ.ఓ మతాన్ని కాని, కులాన్ని కానీ, వర్గాన్ని కానీ కించపరచే ప్రయత్నం చేయలేదు అని డిస్క్లయిమర్ ఇచ్చాడు కానీ ఈ పుస్తకం నిండా బ్రాహ్మణ వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. ఆ పాపం రచయితది కాదు అతడు రెఫెర్ చేసిన పుస్తకాలవి.   

3, సెప్టెంబర్ 2014, బుధవారం

మన గురజాడ

[ఆ మధ్య మేము (నేనూ, నాగసూరి వేణుగోపాల్) సంకలనం చేసిన జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు పుస్తకం కోసం సేకరించిన విషయసామాగ్రిలో కొంత మాత్రమే ఆ పుస్తకంలో వినియోగించుకోగలిగాము. ఆ గ్రంథంలో చోటు చేసుకోని రచనలను అడపాదడపా తురుపుముక్క పాఠకులతో పంచుకొంటాను.  1988లో చలసాని ప్రసాద్ సంకలనపరచి విరసం ప్రచురించిన శ్రీశ్రీ వ్యాసాల సంపుటి మనగురజాడపై సర్దేశాయి తిరుమలరావు భారతిలో చేసిన సమీక్ష చదవండి.]

 గురజాడపై ఏమి వ్రాసినా, ఎవరు వ్రాసినా బాగుంటుంది. ఆ వ్రాసేది శ్రీశ్రీ అయితే ఇక చెప్పవలెనా? ప్రస్తుత గ్రంథం శ్రీశ్రీ 1932 నుండి 1976 వరకు అప్పుడప్పుడు వ్రాసిన గురజాడపైని వ్యాసాల సంకలనం. ఇందు 15 వ్యాసాలున్నాయి. రెండు ముత్యాలసరాలు ఛందస్సుమీద. "ముందడుగు" అనే వ్యాసం కామ్రేడుల "సహయాత్రికు"ల కుటుంబ కలహంగా కనిపిస్తుంది. ఈ వ్యాసంలో శ్రీశ్రీ "ప్రపంచం అంతటా కమ్యూనిజాన్ని స్థాపించే ఆఖరు పోరాటం ఇండియాలోనే జరుగుతుందనేది నా దృఢ నిశ్చయం" అంటాడు. శతధాభిన్నమై పోయిన కామ్రేడులకిది ఊరట కలిగించే భరవస అనుకొంటాను. ఈ సమీక్షలో శ్రీశ్రీ కన్యాశుల్క నాటకంపైని వ్రాసిన విషయాలను చర్చిస్తాను. "నాటకమున మధురవాణి వ్యక్తిత్వం పరిపూర్ణముగా ప్రకటింపబడలేదు" అంటాడు శ్రీశ్రీ. నాలాంటివాళ్లేమో మధురవాణి పాత్ర (హామ్లెట్ పాత్రవలె) నాటక పరిధులను దాటి పోయిందనుకొంటాము. నాటకానికంతటికీ మధురవాణి ముఖ్యమైన స్త్రీ పాత్ర అనేది సబబు. రామప్పంతుల మాటల్లో ఆమె తిక్క లంజ. కానీ ఆ తిక్కే వేరు. రామప్పంతుల ధణుతు ఎగురగొట్టిన తిక్క. వసంతసేన పాత్రకంటె మధురవాణి పాత్ర సృష్టి గొప్పదని శ్రీశ్రీ అన్నాడు. ఇది నిజం. వసంతసేన, తగిన మగడు దొరికితే, సవతితనానికైనా ఒప్పుకొనే స్వార్థపరురాలు. బుద్ధిహీనబేల. మధురవాణో, నేటి "విమెన్ లిబ్బరు" వంటిది. నాటకాంతాన కాంతి స్తంభంవలె నిలబడి వుంటుంది. మధురవాణి పాత్రకు సాహిత్య మాతృక ఎక్కడైనా ఉందా అని? తంజావూరు రఘునాథ నాయకాస్థాన విద్వన్మణి మధురవాణి (పేరు ఒకటే చూడండి) కావచ్చును. లేదా పింగళి సూరన "కళాపూర్ణోదయము"లోని కలభాషిణి పాత్ర కావచ్చును. మంచితనంలోనూ, మాటకారితనంలోనూ, పాత్రోన్మీలనంలోనూ, నామ సామ్యంలోనూ మధురవాణి పాత్ర కలభాషిణిని బోలుతుంది.  కన్యాశుల్క నాటకాన్ని సినిమాగా తీసే ప్రయత్నాన్ని శ్రీశ్రీ ఇష్టపడినట్లు లేదు. శ్రీపుల్లయ్యగారు 1950లో తీసిన "కన్యాశుల్కం" సినిమా బాగానే ఉండింది. పూటకూళ్ళమ్మచే గిరీశం చీపురుకట్ట దెబ్బలు తినే "సీను" కళ్ళకు కట్టినట్లుంది. కన్యాశుల్కం బీభత్సరస ప్రధానమైన విషాదాంతనాటకం అని రెండుచోట్ల శ్రీశ్రీ అన్నాడు. కన్యాశుల్కం బీభత్సరసం కలదే. అసహ్యం కలిగించే విషయాలుండడం చేతనూ, కడుపులో త్రిప్పినట్లనిపించే దృశ్యాలుండడం చేతనూ నాటకం బీభత్సమే. ఉదా: గిరీశం పూటకూళ్లమ్మచే చీపురుకట్ట దెబ్బలు తినడం, లుబ్దావధానికి దయ్యం విడిపించే దృశ్యం, తెల్లవారుజామున కాలువగట్టుకు పోతూండే రామప్పంతులను దాసరి వేషంలో వెంకటేశం ఓగత్యపు పాట పాడుతూ అంటుకొనిపోవడం, సారాకొట్టు దృశ్యం, ఇవన్నీ జుగుప్సను కలిగించేవే. నాటకం విషాదాంతం కాదు. ఎందుకంటే కన్యాశుల్కం నాటకం పండోరా పేటికవంటిది. అందుండి ఎన్ని బీభత్సాలు వచ్చినా, అరిష్టాలు వచ్చినా, చిక్కులు, కష్టాలు పైకి దుమికినా అడుగున ఇంకా ఆశ(హోప్) మిగిలిపోతుంది. మానవుని మనుగడకు పరిస్థితులు బాగుపడచ్చుననే ఆకాంక్షే ఏడుగడ. హనుమంతునివంటి చిరంజీవి, త్రికాలజ్ఞుడు రామాయణంలో జీవన్‌భద్రాణి వశ్వతి, తస్మాత్ బ్రతుకుతాను అంటాడు. ఇబ్సెను నాటకం "జనశత్రువు" (An Enemy of the People)ఇదే ఆశను కల్గిస్తుంది. హామ్లెట్ నాటకం తుదిదృశ్యంలో రంగంమీద నాలుగు పీనుగులు పడివున్నా, మనలో "హోప్" పోదు. "కన్యాశుల్కం" అట్టి నాటకం. ఏలాటి ఆశలేని నిజమైన విషాదాంత నాటకాలు సోఫోక్లిసు నాటకం "ఆంటిగొనె" షేక్స్పియరు "లియరు రాజు"(King Lear), సింజ్ వ్రాసిన నాటకం "సముద్ర నావికులు"(Riders to the Sea). ఇంకొక రకపు నాటకాలున్నాయి. నాటకం తుదిలో ఏ అనర్థం జరుగకపోయినా, మోదాంతమే అయినా ప్రేక్షక హృదయాలలో అదోరకమైన సంవేదన(పాథోస్) ఆవరించును. షేక్సుపియరు నాటకాలు "హేమంతగాథ"(The Winters Tale), "సింబలైన్"(Cymbeline), "తుఫాను"(Tempest) అట్టి నాటకాలు. కన్యాశుల్క నాటకమూ ఇట్టి నాటకమే. నాటక పాత్రల నామ్నీకరణం గురించిన శ్రీశ్రీ విమర్శ సరికాదు. లుబ్దావధానులు, కరటకశాస్త్రి పేర్లు అపహాస్యకాలే. నాటకాన ఆరువిధాలయిన హసితాలూ ఉన్నాయి. కన్యాశుల్క నాటకాన్ని రియలిస్ట్ నాటకం (గోర్కీ నాటకం "లోవర్ డెప్త్స్" వలె)అనుకోరాదు. దీని  బాహ్యరూపం ప్రహసనం. ఇందు అసంబద్ధతా(థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్) ధోరణులూ లేకపోలేదు. నాటకోద్దేశం సంస్కరణ. ప్రేక్షకులు విద్యావిహీనులు. అట్టి వారికి వ్రాసిన కన్యాశుల్క నాటకం రాను రాను కాలాన్ని, దేశాన్ని జయించుట రామప్పంతుల మాటలలో చెప్పవలసి వస్తే "అది వేరే కథ". అగ్నిహోత్రావధాని పేరు తప్పుపట్ట పని యుండదు. ఇప్పుడు ఒక సినిమా సుందరి అగ్నిహోత్రి (రతీ అగ్నిహోత్రి) అని పేరు పెట్టుకొంటే లేని ఆక్షేపణ నూరేండ్ల క్రితం ఎనభై పన్నాల వేదం చదివినానని చెప్పికొనే శ్రోత్రియ బ్రాహ్మణుడు పెట్టుకొంటే చేయవలెనా? అన్యాయం!  నికార్సయిన బద్మాషుల పేర్లు రామప్పంతులు, గిరీశం ఎంత సాదాగా రియలిస్టుగా, వారి ఖల స్వభావాన్ని కప్పిపుచ్చుతూ ఉన్నాయో గమనించండి! సందేశాత్మక కావ్య నాటకాలలో పాత్రల పేర్లు అదొక విశిష్టంగా ఉంటాయి. డికెన్సు నవలలు, బన్యన్ "యాత్రికుని పురోగతి"(The Pilgrim's Progress), "ప్రబోధ చంద్రోదయ" నాటకంలోని పాత్రల పేర్లుదాహరణాలు. "సాక్షి" సంఘంలో అందరికంటె బుద్ధిమంతుని పేరు "జంఘాలశాస్త్రి" హాస్యఫోరకంగా వుంది. గిరీశం, రామప్పంతులు, లుబ్ధావధాన్లుది శిథలీకృతమవుతూన్న ఒకానొక సాంఘికవ్యవస్థయొక్క కరాళనృత్యం అన్నాడు శ్రీశ్రీ. నేటివారితో (కన్యాశుల్క నాటకానికి నూరేండ్ల తర్వాతివారు) పోల్చి చూస్తే, రామప్పంతులు, లుబ్ధావధాని, అగ్నిహోత్రావధాని, సత్యహరిశ్చంద్రులవలె, ధర్మరాజువలె కన్పడుతారు. ఆనాటివారు అవినీతి(ఇమ్మారల్)పరులు. నేటి వీరు అనీతి(అ-మారల్)పరులు. కనుక ఎక్కువ ప్రమాదకారులు. హిందూ సంఘం క్యూరెటు (క్రైస్తవ ఫాదరీ సహాయకుడు) కోడిగ్రుడ్డువలె పాక్షికంగా బాగుంటుంది, చెడి వుంటుంది. శ్రీకృష్ణ నిర్యాణమప్పుడూ (ద్వాపర యుగాంతం)ఇట్లే, నేడూ ఇట్లే వుంది. పైగా సౌజన్యారావు,  కరటకశాస్త్రి, మధురవాణి, పరోక్షంగా వీరయ్యపంతులు(కందుకూరి వీరేశలింగం)లాంటి సదాగ్రహులు, ప్రగతిశీలురున్న ఆనాటి వ్యవస్థను శిథిలీకృతమని ఎట్లనగలం? ఇప్పటి వ్యవస్థను ఏమంటాడో శ్రీశ్రీ. గురజాడ కథలలో "మీ పేరేమిటి" తనకు నచ్చినదంటాడు శ్రీశ్రీ. ఈ ఎంపికతో నాకు పేచీలేదు. కాని "పెద్ద మసీదు" లేక "మతము:విమతము" అని పేరుండే కథ గురించి చెప్పుతాను. ఇది గురజాడ వ్రాసిన అతి చిన్న కథ.  (మూడుపుటలు). అన్నిటికంటె గొప్ప కథ. టెరిబుల్ స్టోరీ. ఇతిహాస పరిణామం (ఎపిక్ డైమెన్షన్)కలది. కథ మొదటి వాక్యానికీ, తుది వాక్యానికీ మధ్య వేయి పుటల చరిత్ర వుండి వుంటుంది. ఇసుకరేణువులో ప్రపంచాన్నీ, కాలసూచక గాజు ("అవర్ గ్లాస్")లో అనంతకాలాన్నీ చూపించగల కథ "పెద్ద మసీదు". మీనియేచర్ పెయింటింగ్ వంటిది. గురజాడ కథలు చిన్నవయినా, చాలా తక్కువ సంఖ్యలోనే వున్నా ఇటాలియన్ పునరుజ్జీవన చిత్రకారుడు జార్జియోని గీచిన ఒకే చిత్రం ఒకే బాణీగా భావికాలంవారికి మార్గదర్శకమైనట్లు, తెలుగు చిన్న కథలకు ఒరవడి పెట్టినాయి. గురజాడ గొప్పతనాన్ని శ్రీశ్రీ మొట్టమొదట కనిపెట్టలేదు. కానీ, గురజాడను ఎప్పుడూ తగిన "ఫోకస్"లో ఉంచిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుంది. శ్రీశ్రీ గురజాడ గురించి ఇంత తక్కువ వ్రాసినాడే, ఇంకా ఎక్కువగా ఎందుకు వ్రాయలేదు అనిపిస్తుంది. ఒక్కొక్క వాక్యమే ఒక్క పేరాగ్రాఫుగా నిల్చినాయి. గురజాడను కామ్రేడుగా కూడా చేసినాడు. ఒక వర్గంవారేమో గురజాడ ఒక జమీందారు తాబేదారుడంటున్నారు. "కనిపించని వంద వృక్షాలకన్న" "దేశభక్తి" గీతం మిన్న. సన్మానాలు పొందే లక్ష సామ్రాట్టులకన్న ఒక కామ్రేడ్ గురజాడ మేలు" అని శ్రీశ్రీ తుది వ్యాసంలోని తుది వాక్యం. గురజాడ హెచ్చగుటకు విశ్వనాథ లొచ్చు కానక్కరలేదు. ఈ విపరీత ధోరణినే విశ్వనాథ అభిమానులు, గురజాడ తిరస్కారులు అవలంబిస్తున్నారు. ఈ వాక్యాన్ని శ్రీశ్రీ బ్రాండు ఫ్లిప్పెన్సీ అనుకొన్నా ఇచట ఒకటి చెప్పవలసి వుంది. ఫ్రెంచి రచయిత, నోబెల్ బహుమాన గ్రహీత అయిన ఆండ్రేజీద్‌ను ఎవరో "అందరు ఫ్రెంచి కవులలో గొప్పకవి ఎవరు?" అని అడిగినారట. జీద్ కొంచెం ఆలోచించి "దురదృష్టవశాత్తు విక్టర్ యూగోయే" అన్నాడట. ఈ మాట విశ్వనాథకు చెల్లుతుంది. ఆయన అంటే కొంతమందికి సరిపోకుండిననూ, విశ్వనాథ 20వ శత్తాబ్దంలో అత్యుత్తమ తెలుగుకవి. శ్రీశ్రీ అట్లంటే నేనిట్లా అంటున్నాను. సాహిత్య పరిశోధకులకూ, గురజాడ పఠితలకూ శ్రీశ్రీ "మన గురజాడ" ఒక టార్చిలైటు వలె గురు జాడను చూపించే గ్రంథం అనడంలో నాకు సందేహం లేదు. వ్యాసాల కూర్పు, ఎడిటింగు, ప్రేమ, కృషి. చలసాని ప్రసాద్ ఇందుకు అభినందనీయుడు.