...

...

31, మార్చి 2012, శనివారం

కొత్త ఆవకాయ రుచి లాంటి కధ

(శ్రీదేవీ మురళీధర్‌గారి కథ అమ్మమ్మగారిల్లు కథపై సాయిపద్మ మూర్తిగారి విశ్లేషణ)                             
మనలో చాలామంది ఏదన్నా ఇబ్బంది వచ్చినా టక్కున అనే మాట ” నా చిన్నప్పుడు ..మా వాళ్ళింట్లో అలా కాదు.. మా నాన్నమ్మ ఉంటేనా.. మా అమ్మమ్మ గారింట్లో“. ఒకసారి ఆలోచిస్తే, అలా అనగలిగే జ్ఞాపకాలు ఎంత మంది సొంతం? అన్న ప్రశ్న ఉదయిస్తుంది. కానీ, కొంత కాలం క్రితం తురుపుముక్క ‘కథా జగత్‘ లో అలాంటి కథ ఒకటి చదవటం జరిగింది. అదే శ్రీదేవీ మురళీధర్ గారు రాసిన “అమ్మమ్మ గారిల్లు“. యధాలాపంగా మొదలెట్టిన ఈ కథలో మనకి తెలుయకుండానే జోరబడిపోతాం. ఇది ఒక చిన్నపిల్లవాడు శేషు కథ. వేసవి సెలవులన్నీ అమ్మమ్మ తాతల వాత్సల్యంలో పెరిగిన చిన్న విత్తు లాంటి కథ. ఎదుగుదల అంటే మన డ్రాయింగ్ రూం లో మరుగుజ్జు మహా వృక్షం కాదు.. ప్రకృతి తో, తరతరాలకు వారసత్వంలా వస్తున్న విలువలతో పూర్తిగా మట్టిలో నుంచి లేచి తన వ్యక్తిత్వంతో ఎంతో మందికి నిలువ నీడ, భవిష్యత్ అడుగు జాడ ఇవ్వాలి అన్న విషయం.. అందంగా చెప్తుందీ ఈ కథ.  

ఆ చెప్పటం కూడా, చాలా చిన్న విషయమైన ఆవకాయ ద్వారా చెప్పిస్తారు రచయిత్రి. . తర్వాత తరానికి తను పెట్టె ఆవకాయ పాళ్ళు ఎక్కడ తెలియకుండా పోతాయోనని, జాగ్రత్తగా దాచిన అమ్మమ్మ, చనిపోయినప్పటికీ, ఎప్పటికీ ఆ మనవడి మనసులో చిరంజీవి. చదువుతుంటే, ఇంట్లో పెద్దవాళ్ళు చనిపోతే, చదువులు దెబ్బ తింటాయి అని అని వాళ్ళని తీసుకురాకుండా వచ్చే తల్లి తండ్రులు, ఇద్దరూ ఉద్యోగాలు చేసుకుంటూ, పోషకాహారం పెట్టాలి కానీ కుదరటం లేదు అని వాపోయే వాళ్ళూ, అత్తగారు పోయారు ఇంక వంటల్లో సలహాలేవరిస్తారు అని దిగులు పడే కోడళ్ళూ, తప్పక చదవాల్సిన కధ ఇది.  
చైల్డ్ సైకాలజీ అంటూ.. బిహవియర్ నేర్చుకోవాలంటూ, ఏ క్లాసు లో పడితే ఆ క్లాసు లో మోయలేని బరువులు మోస్తూ తిరిగే మన చిన్నారులకి కావలసిందేమిటో వివరంగా చెప్పబడింది ఈ కథలో.  హబ్బే..ఇవన్నీ మాకు తెలుసండీ అనే వాళ్లకి.. శేషు వ్యక్తితానికి, మిగాతావారికీ ఉన్న తేడా, జీవన మాధుర్యం కూడా మనకి చెప్పకనే చెబుతుంది. ఒక నిముషం మనందరం పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోనేలా చేసిన ఈ కథకి రుణపడిపోతాం.  
గాభారాపడి పెద్ద బాల శిక్ష పుస్తకాలు కొనే వాళ్ళు, తెలుగు చదవద్దు అన్నారు మావాడి కాన్వెంట్ లో..!!, ఎలా నేర్పించాలో ఏమిటో అని బాధ పడే దేశ విదేశీ తల్లులూ, తండ్రులూ, ఎలా చెప్తే పిల్లలు నేర్చుకుంటారో ఈ కథ చదివి తెలుసుకోవచ్చు. కొంచం ఈ కథ నిడివి ఎక్కువ ఉంటె బాగుంటుందని అనిపించింది నాకు. ఎందుకంటె తెలుగులో ఈ మధ్య కాలంలో అచ్చమైన తెలుగు కథలు అరుదుగా వస్తున్నాయి. వచ్చినా, నగర సంస్కృతి కథలే ఎక్కువ ఉంటున్నాయి. దానితో, కథలు కూడా అపార్ట్ మెంట్ గోడల్లా ఎవరికీ సొంతం కాకుండా ఉంటున్నాయి. పల్లె జీవితంలో నేర్చుకోవలసిన విషయాలూ, కుటుంబాల్లో కనుమరుగవుతున్న విలువలూ, ముఖ్యంగా సాహిత్యం, కళల పట్ల ఆదరణ ఇలాంటివి కూడా రచయిత్రి సూచనప్రాయంగా చెప్పి ఉంటె బాగుండును అనిపించింది.  
ఇంగ్లీషులో ” చికెన్ సౌప్ ఫర్ ది సౌల్” అని కథలుంటాయి. చాలా చిన్న చిన్న, మనం మరచిపోతున్న జీవిత సత్యాలతో ఉండే ఆ కథలు చదువుతున్నప్పుడు అనిపించేది, ఇంత సాహిత్య వారసత్వం ఉన్న తెలుగులో ఇలాంటి కథలెందుకు రావూ అని…బహుశా అలాంటి సున్నితత్వం కూడా పాళ్ళు తెలియని ఆవకాయలా, వ్యాపార వస్తువయ్యిందా అనుకున్నంతలో,  ఈ కథ నా కళ్ళు తడయ్యేలా చేసింది.. ఎక్కడినుండో మా అమ్మమ్మ..” వంటా, జీవితం..ఒకటేనమ్మలూ..అన్నీ సరిగ్గా కుదిరితేనే రుచి..!” అని చెప్పనట్టు అనిపించింది. ఉరుకుల పరుగులే జీవితమనుకున్న మాలాంటి వాళ్లకి మంచి కథని అందించినందుకు శ్రీదేవి గారికి ధన్యవాదాలు.  
తురుపుముక్క కథాజగత్ లో  ప్రచురితమైన ఈ కథ చదవాలనుకునే మిత్రుల సౌలభ్యం కోసం.. ఈ కథ లింక్: 
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/am-mam-magarillu---sridevi-muralidhar
                                 (తమ్మిమొగ్గలు బ్లాగు సౌజన్యంతో)

ఓ కథల వర్క్‌షాపులో తయారైన కథ!

హ్యాపీడేస్ సినిమా చూశారా? చూసే వుంటారు లెండి. టీవీ ఛానళ్లలో వేసిన సినిమానే మళ్ళీ మళ్ళీ వేస్తుంటే చూడకేం చేస్తాం. ఇంతకీ సంగతేమిటంటే ఆ సినిమాలో కాలేజీ లైఫులోని మధురమైన జీవితాన్ని చూపిస్తే పి.వరలక్ష్మిగారి కథ అన్ హ్యాపీడేస్‌లో కొందరి కాలేజీ లైఫులోని దుర్భరమైన జీవితం మన కళ్లకు కట్టినట్లు చూపుతోంది. కథాజగత్‌లో ఈ కథ చదివి మీ అభిప్రాయం చెప్పండి.

25, మార్చి 2012, ఆదివారం

ప్రేమంటే..!


(గుమ్మడి రవీంద్రనాథ్‌గారి ప్రేమంటే కథపై అనూరాధగారి విశ్లేషణ)


కొన్ని కొన్ని పదాలను నిర్వచించడం చాలా కష్టం.అలాంటి ఒక పదం ప్రేమ.
తల్లి తండ్రులకు తమ బిడ్డల పై ప్రేమ ఉంటుంది.
సోదరీ సోదరులకు తమ తోబుట్టువుల పైన...
భార్యకు,భర్త పైన....భర్తకు భార్య పైన...
స్నేహితులకు ఒకరి పైన ఒకరికి ప్రేమ...
ప్రేమ అనేది ఒక అనుభూతి,దాన్ని నిర్వచించలేము.


పైన ఉదహరించిన ప్రేమలన్నీ కూడా,ఏదో ఒక సంబంధం వారి మధ్య ఉండటం వల్ల కలిగినది.(రక్త సంబంధం,స్నేహ సంబంధం)అసలు ఏ సంబంధం లేకుండా మన చుట్టూ ఉన్న మనుషుల మీద ప్రేమ తో మెలగడం ఎంత మందికి సాధ్యమవుతుంది?ఎదుటి వారి నుంచి ఏమీ ఆశించకుండా వారి పట్ల ప్రేమతో మెలగడం ఎంతమందికి సాధ్యమవుతుంది?

ప్రస్తుత కాలం లో ప్రేమ అంటే యువతీ యువకులకు సంబందించిన విషయం గా మారిపోయింది.దీనికి మీడియా,సినిమాలు ప్రధాన కారణం.తాము ఇష్టపడిన అమ్మాయి తమను ఇష్టపడక పొతే యాసిడ్ దాడులు, కత్తిపోట్లు సర్వ సాధారణ విషయాలు గా మారిపోయాయి. ప్రేమ అంటే తీసుకోవడం కాదు, ఇవ్వడం అని చెప్పిన గుమ్మడి రవీంద్రనాథ్ గారి కథ ప్రేమంటే  నాకు నచ్చింది.ఈ కథ లో నాయిక, నాయక పాత్రలు ప్రేమంటే 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం అని తెలియ చెపుతారు.

ఈ కథ లో నాకు నచ్చిన అంశాలు:

1.ఇప్పటి పిల్లలను మనం చూస్తూనే ఉన్నాము, చిన్న చిన్న వైఫల్యాలకే కుంగి పోయి ఆత్మహత్యలు చేసుకోవడం. కానీ శశాంక్‌ అంధత్వానికి గురైనప్పటికీ తన వైకల్యం గురించి  కుంగిపోకుండా, తనకు ఎంతో ఇష్టమైన సైన్స్ గ్రూప్ నుంచి ఆర్ట్స్ గ్రూప్ కి మారి చదువు లో విజయాన్ని సాదించటం ఎంతో స్పూర్తినిచ్చే విధం గా ఉంది.

2.శశాంక్ వయసుకు మించిన పరిణితి చూపించడం. తనకు అంధత్వం ప్రాప్తించినదని తెలిసిన తరువాత.... నువ్వు నన్నింకా ప్రేమిస్తూ ఉండాలని ఆశపడటం దుర్మార్గమవుతుందని నాకనిపిస్తోంది దృశ్యా! లవ్ నెవర్ క్లెయింస్, ఇట్ ఆల్వేస్ గివ్స్! చూపులేని నేను నీలాంటి అందమైన అమ్మాయి స్నేహాన్నీ, ప్రేమనీ కోరుకోవడంలో స్వార్థం ఉంటుందనిపిస్తోంది. అందుకే ప్లెయిన్‌గా చెప్పేస్తున్నాను. నేను నీకు రైట్‌ఛాయిస్‌ని కాను అని చెప్పటం బాగుంది. 

౩.ఇక ఈ కథ లో ఇంకో ముఖ్యమైన పాత్ర దృశ్య. చాలా సాధారణమైన అమ్మాయి. చదువుకునే రోజుల్లో ఆ వయసుకు తగ్గట్లు ప్రవర్తించినా, ప్రేమలో మోసపోయి తిరిగి శశాంక్ దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడుగుతుంది. తను ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి తిరిగి తన దగ్గరకు వచ్చి పెళ్లి చేసుకోమని అడిగితే, కోరుకున్నది దక్కుతున్నది అని సంబర పడకుండా, శశాంక్ తనకు పెళ్లి అయ్యిందని అబద్దం చెప్పటం(దృశ్య తన మీద జాలి తో పెళ్లి చేసుకుంటానని అన్నదేమో అనే సందేహం ఉండి ఉండవచ్చు.) ... అది, దృశ్య ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకోవటానికి కారణ మవటం బాగుంది.

4.దృశ్య... శశాంక్ కి పెళ్లి అయిపొయింది కాబట్టి ఇక తన గురించి నాకు ఎందుకు లే అని అనుకోకుండా "ప్రేమంటే 'ఇవ్వడం' అన్న మాటను నమ్మి శశాంక్ కు  చూపు 'ఇవ్వడం' కోసం మూడేళ్ళపాటు నిద్రాహారాలు లెక్కచేయకుండా పరిశోధనలు జరిపి శశాంక్ చూపు తెప్పించడం. ఇది కొంచం నాటకీయంగా ఉన్నా కథ కాబట్టి అంత పట్టించుకోనక్కర లేదనుకుంటున్నాను. 

5.శశాంక్ దృశ్య ను పెళ్లి చేసుకుందామా అని అడగటం, అంతకు ముందు దృశ్య తన మీద జాలితో పెళ్లి చేసుకుంటానని అన్నదేమో అనే సందేహం ఉండి ఉండవచ్చు.ఇప్పుడు ఆ సందేహం తీరి పోవటంతో శశాంక్ తనే దృశ్యకు ప్రొపోజ్ చేయటం బావుంది.

ఇక పొతే ఉప సంహారం

"ప్రేమించడాన్నీ... ప్రేమంటే 'ఇవ్వడం' అన్న భావననీ కేవలం 'ఇద్దరు వ్యక్తుల మధ్య ఉండే విషయం'గా కాక మనచుట్టూ ఉండే మనుషులందర్నీ ప్రేమించడం అన్న ఆలోచనకు కార్యరూపంగా  ఉచితం గా పేదవారికి సేవ చేయటం కోసం హాస్పిటలూ, ఆశ్రమ పాఠశాల నిర్వహించటం, ఇవ్వడంలోని ఆనందాన్ని చిన్న వయసునుండే వాళ్ళ పాప మానస కు నేర్పటం...

శశాంక, దృశ్య లాంటి వాళ్ళు మరింత మంది మన సమాజం లో ఉంటే స్వర్గం ఇలలోనే ఉంటుంది కదా! ప్రస్తుతం  ఇలాంటి పాజిటివ్ ఆలోచనలను పెంపొందించే కథల అవసరం ఎంతైనా ఉంది.

పూర్తి కథ చదవటానికి....

http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/premante---gum-madi-ravindranath 

(ఇది నా ప్రపంచం బ్లాగు సౌజన్యంతో)

సంపెంగ

అనంతపురం జిల్లా మేటి కథకుల్లో ఒకరైన సడ్లపల్లె చిదంబరరెడ్డి గారి కథ సంపెంగ కథాజగత్‌లో చదవండి. 

ఈనాడులో విద్వాన్ విశ్వం!

ఈనాడు ఆదివారం (25-03-2012) సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై జి.రా. గారి సమీక్ష వచ్చింది. తురుపుముక్క పాఠకులకోసం ఆ సమీక్ష క్లిప్పింగు ఇదిగో.



24, మార్చి 2012, శనివారం

గరిశకుర్తి కథ!

"దేవుడు మనిషికి రెండుకళ్ళిచ్చినా చూసేది ఒకే దృశ్యాన్ని. కానీ మనిషికెందుకో సమదృష్టి అలవడలేదు" అంటున్నారు గరిశకుర్తి రాజేంద్రగారు తమ కథ పదిరూపాయల నోటులో. ఈ కథను కథాజగత్‌లో చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.

23, మార్చి 2012, శుక్రవారం

మాలికాపదచంద్రిక - 6


నేను తయారు చేసిన పజిల్ మాలికా పద చంద్రిక - 6ను మాలిక పత్రికలో చూడండి.
http://magazine.maalika.org/2012/03/19/%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF%E0%B0%95%E0%B0%BE-%E0%B0%AA%E0%B0%A6%E0%B0%9A%E0%B0%82%E0%B0%A6%E0%B1%8D%E0%B0%B0%E0%B0%BF%E0%B0%95-6-%E0%B0%B0%E0%B1%82-1000-%E0%B0%AC%E0%B0%B9%E0%B1%81/
తెలుగులో ప్రస్తుతం అత్యధిక పారితోషికం ఇస్తున్న పజిల్ యిదే. మీరూ ప్రయత్నించి చూడండి.  

22, మార్చి 2012, గురువారం

ఉగాది శుభాకాంక్షలు!

మిత్రులు శ్రేయోభిలాషులు అందరికీ నందన నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు! ఈ సందర్భంగా తురుపుముక్క పాఠకులకు ఒక అపురూపమైన కానుక. 1962 సంవత్సరంలో ఆంధ్రపత్రిక ఉగాది సంచికలో ప్రచురింపబడిన దాశరథి కవిత మధు మాధురి లో నుండి కొంత భాగం ఇక్కడ చదవండి. 


20, మార్చి 2012, మంగళవారం

ఈవారం పత్రికలో సమీక్ష!

ఈవారం జనవార్త వారపత్రిక తాజా సంచిక(మార్చి 11-24,  2012)లో టి.ఉడయవర్లు గారు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథాన్ని సమీక్షిస్తూ వ్రాసిన వ్యాసం ఇక్కడ చదవండి.






19, మార్చి 2012, సోమవారం

బుజ్జిగాడిబెంగ కథపై మాలాకుమార్ అభిప్రాయం!

      బాల్యం . . . ఎంత అపురూపమైనది. చిన్నప్పటి ఆటలు, పాటలు, చిలిపి అల్లరులు జీవితాంతం మరువలేనివి .అమ్మతో కథలు కథ గా చెప్పించుకొని మురిసిపోని వారెవరు? బాల్య స్నేహితులంటే ఎంత మురిపెం . . . తూనీగల్లా గెంతుతూ ముచ్చటపడేసేది బాల్యం. ఆటల్లో మోచేయి కొట్టుకొని, మోకాలు డోక్కుపోయి రక్తాలు కారుతున్నా ఆటల్లో దెబ్బ అరిటిపండే! పైగా పెద్దయ్యాక తమ పిల్లలకు ఆ దెబ్బలగురించి కబుర్లు చెప్పటం ఎంత బాగుంటుంది కదూ! స్కూల్ నుంచి వస్తూనే స్కూల్ బాగ్ లోపలికి గిరాటేసి, అమ్మ ఇచ్చిన పాలు హడావిడిగా తాగేసి, మూతైనా తుడుచుకోకుండా ఆటలకు పరుగులు పెట్టటం, అలసిపోయి వచ్చి, ఏదో స్నానం చేసాము, చదువుకున్నాము అనిపించుకొని, నిద్రతో కూరుకు పోతున్న కళ్ళను బలవంతాన తెరుచుకుంటూ, అమ్మ చెప్పే కథలను వింటూ, అమ్మ చేతి ముద్దలు తింటూ , అలానే పీట మీద నిద్ర కొరగటం, అమ్మ ఎత్తుకెళ్ళి 'పిచ్చితల్లి అలిసిపోయింది' అని మురిపెం గా అంటూ పడుకోపెట్టటం . . . అబ్బ అవన్నీ తలుచుకుంటూవుంటే మళ్ళీ చిన్నారి తల్లి ఐపోవాలనిపించదూ !!!!! మరి ఈ కాలం పిల్లలకు ఆ మురిపాలు దక్కుతున్నాయా ????? చదువులు, రాంకులూ అంటూ పోటీ చక్రం లో వాళ్ళ బాల్యం బంధీ ఐపోయింది .ఆటలూ లేవు . అల్లరులూ లేవు. పొద్దున్నే స్కూల్, ఇంటికి రాగానే ట్యూషన్, హోంవర్క్ ఇంతే జీవితం. మహా ఐతే వీడియో గేమ్స్ఆడుకోవటం అంతే కదా...

            అలా బంధీ ఐపోయిన ఓ చిన్నారి స్వగతమే, ఎనుగంటి వేణుగోపాల్ గారు రచించిన కథ " బుజ్జిగాడి బెంగ " 


       బుజ్జిగాడి కి వానపడె ముందు వచ్చే మట్టి వాసన అంటే చాలా ఇష్టం. వానలో తడవట మంటే మరీ ఇష్టం. ఆకాశం లొంచి రాలిపడే ఆ నీటి బుగ్గలను అలా చూడటమంటే భలే సరదా .ఎగిరి గంతేయాలనిపిస్తుంది .వర్షా కాలం వచ్చిందంటే చాలు "రెయిన్ రెయిన్ , కం ఎగేయిన్ " అనే రైం అస్తమానమూ పాడుకుంటూ వుంటాడు. వర్షం వచ్చినప్పుడు తడవాలనుకుంటాడు . కాని వీలవదు. ఎందుకంటే వాడి చెల్లాయి డైనొసార్ లా వదల కుండా వెంబడించి , డాడీకి చెప్పేస్తుంది :( పాపం బుజ్జిగాడు !

       వాళ్ళ డాబా కెదురుగా గుడిసెలో వున్న శీను గాడిలా మట్టిలో ఆడుకోవాలని , రెండు జేబుల్లోనూ మట్టివేసుకొని గెంతాలని వుంటుంది . కాని వీలవదు . మార్నింగ్ లేస్తాడా... లేవగానే ట్యూషన్ .ట్యూషన్ నుంచి వచ్చి స్నానం చేసి రెడీ అవుతాడా, స్కూల్ బస్ సిద్దం . సాయంత్రం హోంవర్క్ .తర్వాత మళ్ళీ ట్యూషన్. ట్యూషన్ అయ్యాక కాసేపు స్టడీ.ఇవన్నీ అయ్యేసరికి రాత్రి తొమ్మిదవుతుంది. అన్నం తినిపించి పడుకోపెడతారు. మార్నింగ్, ఈవినింగ్ రెండుసార్లు ట్యూషన్ ఎందుకంటే సెకండ్ యూనిట్ లో సెకండ్ రాంక్ వచ్చిందని! హుం. . . ఆ చిన్నివాడికి ఎంత కష్టం అని గుండె పట్టుకు పోవట్లేదు?

       చివరికి వాడి డాడీ వాడిని వానలో ఆడుకోనిస్తాడు. కాని ఎప్పుడు, వాడికి మళ్ళీ ఫస్ట్ రాంక్ వచ్చినప్పుడు.

       ఇలా వున్న బుజ్జిగాడి స్వగతం చదువుతుంటే మనకూ బెంగ వచ్చేస్తుంది. ప్రతి వాక్యం లోనూ వాడి బాధ మన కళ్ళలో నీళ్ళు, ఇదేమిటి ఈ కాలం పిల్లలు ఇలా మెకానిక్ గా ఐపోయారు అనిపిస్తుంది. అసలు నాకైతే చదువుతున్నట్లుగా లేదు , ఓ బుజ్జిగాడు నా ముందు కూర్చొని చెపుతున్నట్లుగా అనిపించింది . అంతలా హృదయాలను తాకేట్లుగా రాసారు రచయిత ఎనుగంటి వేణుగోపాల్ గారు. చాలా సరళ మైన భాష లో, ఓ చిన్నపిల్లవాడు చెపుతున్నట్లుగానే రాసారు. అన్ని సంఘటనలు, మన ఇంట్లోనో , పక్కింట్లోనో జరుగుతున్నట్లుగా వున్నాయి. చిన్నపిల్లలున్న ప్రతి తల్లీ తండ్రి తప్పక చదవ వలిసిన కథ ఇది.

      ఏదైనా ఒక నీతి చెప్పాలంటే అది కథలో భాగమవ్వాలి కాని, ఆ కథ ఓ డాక్యుమెంటరీ సినిమాలా ఓ నీతి సూత్రం చెపుతున్నట్లుగా వుండకూడదు, అని నా అభిప్రాయం . ఈ కథలో బుజ్జిగాడి బాధ లో మనం లీనమవుతామే కాని, ఏదో సందేశాత్మక కథ చదువుతున్నట్లుగా వుండదు . పూర్తిగా చదివిన తరువాత పిల్లలను చదువు కోసం ఇలా బాధ పెట్టకూడదు అనిపిస్తుంది. అది నాకు చాలా నచ్చింది.

ఇంత మంచి కథ ను మిస్ కావద్దు . " బుజ్జిగాడి బెంగ " ను " కథా జగత్ " లో చదవచ్చు .




18, మార్చి 2012, ఆదివారం

ఆశయం

తొలితరం బ్లాగరు బ్లాగాడిస్తా రవి వ్రాసిన కథ ఆశయం ఇప్పుడు కథాజగత్‌లో. ఇంతకు ముందు చదివి వున్నా మరొక్కసారి చదవండి. ఇంతకు ముందు చదవక పోతే ఇప్పుడు మిస్ కాకండి.

17, మార్చి 2012, శనివారం

సాహితీకడలికి అక్షరనీరాజనం సముద్రం!


(పాపినేని శివశంకర్ గారి సముద్రం కథపై సి.ఉమాదేవిగారి విశ్లేషణ)

    సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యాలి? ఇదీ కథ ప్రారంభం! ఛాయిస్ లో వదిలేద్దామనిపించే ప్రశ్న. కథాగమనంలో లోతు తెలిసేకొలది జవాబుకు ఎదురుచూస్తూ అదే ప్రశ్న చర్విత చర్వణమై మనల్ని నిలదీస్తుంది. పాపినేని శివశంకర్ గారి కథనం నర్తించిన తీరు నల్లేరుపై నడకేయైనా సాహితీ భాండాగారంలోని అరిసెలు,గారెలు,బొబ్బట్లనదగ్గ సాహితీరుచులను చవిచూపిన రీతి మాత్రం అభినందనీయం.

      తన స్నేహితుడైన వనమాలిలోకి సాహితీ ప్రవేశం చేసిన రచయిత తాను తడిమిన మైలురాళ్ల జ్ఞాపకాలతో పాఠకులను మమేకం చేస్తూ గావించిన కలం కవాతు కొత్తదనాన్ని సంతరించుకుని పఠనాసక్తిని, రచనానురక్తిని చిప్పిలచేసి సాహితీసౌరభాన్ని గుబాళింపచేసింది. శ్రీశ్రీ, తిలక్, చలం, షేక్సిపియర్ ఒకరా, ఇద్దరా! ఎందరో సాహితీ పిపాసులను అల్లనల్లన తడిమి సువర్ణాధ్యాయాన్ని కనులముందు సాక్షాత్కరింపచేయడం కథ విశిష్ఠతను ద్విగుణీకరింపచేసింది.

   వృత్తిలో ప్రవృత్తిని మిళితంచేసి సామాజిక అవగాహనను ఒక సమాచారంగా కాక సృజనాత్మకంగా వనమాలి తన విద్యార్థులకు బోధపరచే విధానాన్ని వివరిస్తూ పాఠాలలోకికాక పుటలలోకి విస్తరించడం అనే వాక్య ప్రయోగం సముచితం, సందర్భయోగ్యం.పుస్తకంలో ఐక్యం కావడమంటే ఇదే.

    రాహుల్ సాంకృతాయన్ ఓల్గాసే గంగా, ప్రేమ్ చంద్ రంగభూమివంటి సాహితీ సృజనకారులను వీరి కలం స్పృశించినవేళ చరిత్ర మనోయవనికపై చలనచిత్రమవుతుంది.

    వుయ్ ఆర్ ది హాలో మెన్, వుయ్ ఆర్ ది స్టఫ్డ్ మెన్...టి.ఎస్.ఎలియట్ వేదనాక్షరాలు నేడు ఎల్లెడల కనబడుతున్న మనిషి డొల్లతనాన్ని, కృత్రిమ పూర్ణత్వాన్ని మరోమారు వనమాలి ముఖత పలికిన వైనాన్ని గుర్తు చేయడం నేటి సమాజ ముఖచిత్రాన్నిఅంజనం వేసి చూపడమే!

    వనమాలి సహధర్మచారిణి కమలినిని పెళ్లి చూపులలో చూసినప్పుడు పరస్పర వివరాలగురించికాక అన్నా కెరినినా గురించే మాట్లాడినపుడే ఆమెకర్థమైంది అతడి జ్ఞాన దాహం.సాహితీ సముద్రాన్ని ఔపోసన పట్టేంత కాంక్షతో ఎదగడం రచయిత తడిమిన ప్రతి రచనలోను ప్రస్ఫుటమవుతుంది. సముద్రమంతా అల్లకల్లోలమైనా, తాను మాత్రం సాహితీ సముద్రాన్ని ఈదుతూ ఉండిపోవడం సామాన్యుల ఊహకందని విచిత్రం! అయితే మనిషిని తనలో కలిపేసుకున్న పుస్తకానికే అగ్రతాంబూలం.

    ఇంట్లో పుస్తకాల అరలు,గ్రంథాలయంలో బారులు తీరిన పుస్తకాల బీరువాలు వనమాలిని పలకరించే నిత్య నేస్తాలు. మూర్తిమత్వమందిన పుస్తక రాశుల నడుమ మనుష్యుల మధ్యకన్నా మిన్నగా గడిపే వనమాలి అంశగల పుస్తకప్రియులు నేడు ఎందరో వున్నారన్నది అక్షరసత్యం.

    ఎందుకు చదవాలి పుస్తకాలు అనుకునేవారిని చేష్ఠలుడిగి చూస్తాం! సాహితీ జీవనమే పరమావధిగా భావించిన వనమాలికి సన్మానం జరగడం అసాధారణమేమిగాదు.కాని ఇంతటి విజ్ఞానం తమను అందలమెక్కించలేదని, ఎప్పటికి క్రింది మెట్టు పైనే వున్నామన్న కూతురు విమల ఆక్రోశం, తండ్రిపై ఉక్రోషం ఆమె దృక్పథం దృష్ట్యా న్యాయసమ్మతమే అనిపించినా ఆర్థిక సోపానాలకేకాని జ్ఞాన సోపానాలకు విలువలుండవా ఈ సమాజంలో అని గుండె గుబులు పడుతుంది. దూరంగా ఉండీ మనసులు దగ్గరకాలేకున్న వారసులకు ధనసంపద మాత్రమే వారసత్వానికి పనికివచ్చి,జ్ఞానసంపద తాకరానిదైనపుడు వనమాలి స్థితప్రజ్ఞత ముఖేష్ పాటలో రచయిత పాపినేని శివశంకర్ గారు ఉటంకించడం.. యహా పూరా ఖేల్ అబీ జీవన్ కా, తూనే కహా హై ఖేలా, చల్ అకేలా, చల్ అకేలా... హాట్సాఫ్!

    స్టీఫెన్ హాకింగ్స్ బ్లాక్ హోల్స్ స్మాల్ యూనివర్స్ గురించి అవసానదశలోను ఆలోచించగల ఆసక్తి... ఆశక్తి!విభిన్నమార్గాలలో సాహితీ సముద్రం తను నడయాడిన దారిని మరింత విస్తృతపరుస్తూ మన జీవనంలో కోరుకున్నవారికి కోరినట్లు లభించినా ఏమవుతాయో ఈ పుస్తకాలన్నీ! అటు వనమాలిలోను నిర్లిప్తత!  అతని తలగడ ప్రక్కనే పెర్కిన్స్ పుస్తకం, బోర్లాతెరిచిపెట్టి! మనసులో దుఃఖాన్ని ఎవరో ఏతమేసి తోడిపోసినా తీరనిబాధ పుంజీలు తెంపుకుంటుంది. కథాగమనానికి పాత్రల పరిధి స్వల్పమైనా కథనానికది కొదువకాలేదు. పఠనాసక్తిగల పాఠకులతో పంచుకోవాలనుకునే ఈ కథను సమీక్షకు ఎంచుకున్నాను. ఎటు చూసినా పుస్తకాల దొంతరలు! రెపరెపలాడుతున్న పుస్తకకెరటాలు అలలు అలలుగా చుట్టు కమ్ముకొస్తుంటే నిండు సాహితీ సముద్రాన్ని ఎక్కడ పారబొయ్యగలం? వనమాలి పాత్ర ద్వారా పుస్తక ప్రియుల అంతరంగాన్నిసాహితీసముద్రంగా అభివ్యక్తీకరించిన రచయితకు ధన్యవాదాలు.

   కథాజగత్ లో ప్రచురితమైన ఈ కథను క్రింద ఇచ్చిన లింకులో చదవగలరు.


(చిన్ని గుండె చప్పుళ్లు బ్లాగు సౌజన్యంతో)


13, మార్చి 2012, మంగళవారం

పుస్తక సమీక్ష 22 - తెలంగాణా ఆడబిడ్డ నాయకురాలు నాగమ్మ


[పుస్తకం పేరు: నేను... నాయకురాలు నాగమ్మని మాట్లాడుతున్నా..! ఆత్మ కవిత కవులు: కె.వి.నరేందర్, సంగెవేని రవీంద్ర; వెల: 50/-; ప్రతులకు: విశాలాంధ్ర, నవోదయ, ప్రజాశక్తి అన్ని బ్రాంచీలు]

పల్నాటి చరిత్రలో ప్రధాన భూమిక వహించిన నాగమ్మ స్వగతం ఈ దీర్ఘకవితలో చదవవచ్చు. నాయకురాలు నాగమ్మ స్వస్థలం తెలంగాణా ప్రాంతమైన కరీంనగర్ జిల్లా ఆరవెల్లి గ్రామం అనే అంశాన్ని హైలైట్ చేస్తూ వ్రాసిన ఈ దీర్ఘ కవితలో ఆమెను విలన్‌గా చిత్రిస్తూ పురుషాధిక్య సమాజం చేసిన కుట్రను కవులు ఎండగడుతున్నారు. భారతదేశపు తొలి మంత్రిణిగా నాగమ్మకు తగిన గుర్తింపు రాలేదని ఆవేదన చెందుతున్నారు.

ఈ పుస్తకంలో ఆరవెల్లి గ్రామంలో ఉన్న నాగమ్మ గుడికి చెందిన ఫోటోలు అనుబంధంగా ఇచ్చారు. పల్నాటి చరిత్ర పై వచ్చిన పుస్తకాలు, సినిమాలలో ఆరవెల్లి ప్రస్తావన వచ్చిన సందర్భాలను ఈ పుస్తకంలో ఉటంకించారు.

పుట్టిన ఊరిని వదిలి ఎక్కడో పల్నాటికి వలసవెళ్ళి తనేమిటో నిరూపించుకున్న తొలి మహిళా మహామంత్రిణి నాగమ్మ గురించి తెలంగాణా ప్రాంతానికి చెందిన పరిశోధకులు నిర్లిప్తంగా ఉండటాన్ని ప్రశ్నిస్తున్నారు కె.వి.నరేందర్, సంగెవేని రవీంద్ర గార్లు. ఇది కొంతవరకు సబబే.

అయితే ఎన్.టి.రామారావు నటించిన పల్నాటి యుద్ధం సినిమాకు చెందిన సి.డి.కవర్‌పై నాగమ్మ పాత్రధారిణి భానుమతి ఫోటోలేక పోవడంపై ఒక వైపు యాదృచ్ఛికమేమోననే అనుమానం వ్యక్తం చేస్తూ మరో వైపు దీని వెనుక  సాంస్కృతిక, చారిత్రక కుట్ర ఉందేమోనని వీరు సంశయిస్తున్నారు.  ఇది ప్రతి విషయంలోనూ తెలంగాణాకు అన్యాయం జరిగిపోతుందని నిరూపించాలని తాపత్రయపడే సగటు తెలంగాణావాది మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నది.  సి.డి.కవర్‌పై భానుమతి ఫోటో లేకపోవడం అల్పాతి అల్పమైన విషయం. ఇందులో చారిత్రక కుట్ర, సాంస్కృతిక కుట్ర లాంటి పెద్ద పెద్ద మాటలు వాడడం వీరి అసహనానికి అద్దం పడుతోంది. నిజంగానే తెలంగాణావాసి అయిన నాగమ్మ పాత్రను కించపరిచే కుట్ర జరిగివుంటే దానిని నిరూపించడానికి ఆ సినిమాలో భానుమతి పాత్రను తక్కువ చేసి చూపించారా? ఆ సినిమా పై అలనాటి పత్రికల్లో వచ్చిన రివ్యూల్లో భానుమతి పాత్ర గురించి ప్రస్తావించారా? లేదా? ప్రస్తావిస్తే మిగితా పాత్రలతో పోలిస్తే ఎక్కువగా లేదా తక్కువగా పేర్కొన్నారా? ఆ సినిమా పోస్టర్లలో, స్టిల్స్‌లో ఎన్.టి.ఆర్., గుమ్మడిలతో పాటుగా భానుమతి చిత్రం ఉందా లేదా? మొదలైన విషయాలను పరిశీలించి చూడాల్సి వుంది. ఇవేవీ చేయకుండా కుట్ర జరిగి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేయడం చూస్తే వీరి పట్ల జాలి చూపించడం తప్ప ఏమీ చేయలేము.


11, మార్చి 2012, ఆదివారం

నీ సామ్రాజ్యంలో నువ్వే రాజువి!

డాక్టర్ ఎం.సుగుణారావు గారి కథానిక నీ సామ్రాజ్యంలో నువ్వే రాజువి! కథాజగత్‌లో చదవండి. 

9, మార్చి 2012, శుక్రవారం

రవళించిన రాగగీతి

ప్రచారాల కోసం, పేరుప్రతిష్టల కోసం వెంపర్లాడి భార్యా బిడ్డలను యిబ్బందికి గురి చేస్తున్న తండ్రికి కూతురు కనువిప్పు కలిగించిన వైనం ఎం.ఆర్.వి.సత్యనారాయణ మూర్తి గారి కథ రవళించిన రాగగీతి కథలో చదవండి. 

8, మార్చి 2012, గురువారం

పరిష్కారం!

"  పల్లెల్లో అన్ని వృత్తులూ సమానమే. పల్లె శరీరమైతే అన్ని వృత్తులు చేసేటోళ్లు కళ్ళు, కాళ్ళు, చేతులు,  ముక్కు,  చెవుల్లాంటి వారు. అన్నీ సక్రమంగా ఉంచితేనే ఆరోగ్యం"  అంటున్నారు తేజోమూర్తుల ప్రకాశరావు గారు తమ కథ పరిష్కారంలో. ఆ విషయమేంటో కథాజగత్‌లో ఆ కథను చదివి తెలుసుకోండి.

AVKFబుక్ లింక్‌లో సాహితీ విరూపాక్షుడు!

అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించిన సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథం ఇప్పుడు AVKF వారి బుక్‌లింక్‌లో లభ్యమౌతున్నది. 
వివరాలకు ఈ లంకెను నొక్కండి.
http://www.avkf.org/BookLink/display_titled_book.php?book_id=13007 
 కావలసినవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. 

6, మార్చి 2012, మంగళవారం

ఆవిష్కరణ సభపై మీడియా కవరేజీ!

నిన్న జరిగిన విద్వాన్ విశ్వం, సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం  పుస్తకాల ఆవిష్కరణ సభ విశేషాలు ఈరోజు దాదాపు అన్ని దినపత్రికల్లో వార్తాంశంగా వచ్చింది. వాటిలో కొన్ని క్లిప్పింగులను తురుపుముక్క పాఠకుల కోసం ఇక్కడ పొందుపరుస్తున్నాము. 
సాక్షి
ఆంధ్రజ్యోతి 
ఆంధ్రప్రభ 
నమస్తే తెలంగాణ 
సూర్య 
నేటి నిజం 



5, మార్చి 2012, సోమవారం

విశాలాంధ్రలో సమీక్ష!

విశాలాంధ్ర దినపత్రిక ఈరోజు(05-03-2012) సాహిత్యం పేజీలో మేము ప్రచురించిన సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకంపై జానమద్ది హనుమచ్ఛాస్త్రిగారి సమీక్ష ప్రచురింపబడింది. 



సమీక్ష పూర్తి పాఠం ఇదిగో - 



సంపాదకులు: డా.నాగసూరి వేణుగోపాల్‌, కోడిహళ్ళి మురళీ మోహన్‌. ప్రచురణ అబ్జ క్రియేషన్స్‌, సాహితీ సాంస్కృతిక సంస్థ, హైదరాబాద్‌. ప్రతులకు కోడిహళ్లి మురళీమోహన్‌ -9111-బ్లాక్‌ 9ఎ జనప్రియమహానగర్‌, మీర్‌పేట, హైదరాబాద్‌ -97. వెల రూ.200/- ఫోన్: 9701371256


విజయనగరసామ్రాజ్యంలో భాగంగా వెలిగినది రాయలసీమ. ఈ సీమలో జన్మించిన కవి పండితులకు, పరిశోధకులకు, పాత్రికేయులకు, వారి ప్రజ్ఞాపాటవాలకు సముచితమైన గుర్తింపు లభించలేదు. ఆ లోటును కొంతవరకైనా తీర్చుటకు చేసిన ప్రయత్నఫలితమే ఈ గ్రంథం...


ఆధునిక రాయలసీమ వాఙ్మయచరిత్రలో బహుముఖ ప్రజ్ఞానిధిగా వెలిగిన విద్వాన్‌ విశ్వంగారి విరాట్‌ స్వరూపాన్ని, కొంతలో కొంత వారి జీవన, రచనా రీతులను నాలుగు అధ్యాయాలుగా విభజించి రచించారు సంపాదక మిత్రులు డా.నాగసూరివేణుగోపాల్‌, కోడిహళ్లి మురళీమోహన్‌.... విభిన్న భావాలు కల ఇరువది మంది కవి, పండిత, రచయితలు, విద్వాన్‌ విశ్వంగారి రచనల గురించి, వారి వ్యక్తిత్వ విశేషాలను గురించి చెప్పిన అభిప్రాయాల సమాహారమే ఈసాహితీ విరూపాక్షుడు. విద్వాన్‌ విశ్వంగా తెలుగుపాఠకులకు సుపరిచితులైన విశ్వరూపాచారి అనంతపురం జిల్లా తరిమెలగ్రామంలో మధ్య తరగతి కుటుంబంలో 1915లో జన్మించారు. కొంతకాలం పండితుల వద్ద కావ్య నాటకాదులను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు.సంస్కృత, ఆంధ్ర, ఆంగ్లములపై మంచి పట్టు సాధించారు.


దివాకర్ల వెంకటావధాని, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, తిరుమల రామచంద్ర, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాథ, ఆరుద్ర, మహీధరరామమోహనరావు, అద్దేపల్లి రామ్మోహనరావు మొదలగు వారు విశ్వంగారి రచనలపై వివిధ కోణాలలో చిత్రించారు. విశ్వంగారు కావ్యాలు నిర్మించారు. కథలు కల్పించారు. విమర్శలు వెలయించారు, సమీక్షలు సంకరించారు. సంస్కృతం నుండి పాశ్చాత్య భాషల నుండి అసంఖ్యాకంగా, రచనలను అనువదించారు. 1938లో, నవ్యసాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ద్వారా పలురచనలు ముద్రించారు. వారి రచనలన్నిటిలో మేరుశిఖరం, వారి పెన్నేటిపాట! రాళ్ళపల్లి వారు 'పెన్నేటి పాట'కు రాసిన ముందుమాటలో వారిది మానవ హృదయము. ఊహకన్న అనుభవమే మూలాధారంగా వెడలిన పరవశ రచన వీరి పెన్నేపాట! అని విశ్లేషించారు. నేటి రాయలసీమ కన్నీటిపాట. ఈ కావ్యంలో విశ్వంగారి కవితావిరూపాక్షుడు తాండవించినాడని, భాష, అర్థం, భావం ఛందస్సు అన్నీ ఆ తాండవానికి పక్కవాద్యాలుగా వాయించామని శర్మగారు వ్యాఖ్యానించినారు. ఈ కావ్యాన్ని మొదట అచ్చువేయించిన వారు తెలంగాణ రచయితల సంఘం:


విశ్వం రాసిన ''ఒకనాడు'' కావ్యేతివృత్త 1893 అక్టోబరు 4న జరిగిన ఒక వాస్తవ సంఘటన. బ్రిటిష్‌ సైనికుల మానభంగం నుండి ఇద్దరు హిందూమహిళలను రక్షించడానికి రైలుగేటు కాపలాదారు గూళపాలెం హంపన్న ప్రాణాలర్పించిన రోజు అది. చదివిన వారు కన్నీరు కారుస్తూ, హంపన్నకు నివాళులర్పిస్తారు. ఆంధ్రప్రభ వారపత్రిక సంపాదకులుగా, 'మాణిక్యవీణ' మీటుతూ రాసిన వ్యాసాలు విశ్వంగారి అపారమైన లోకానుశీలనకు అద్దం పట్టినాయి. ఉద్దండపండితులైనీవేలూరి శివరామశాస్త్రి విశ్వంగారి అంతరంగాన్ని తమ వ్యాసంలో ఆవిష్కరించినారు. మహీధర రామమోహనరావు విశ్వంగారు సమకాలీన రాజకీయ నాయకుల చిత్తవృత్తిని ఎత్తి చూపినారు. నాగసూరి వేణుగోపాల్‌ విశ్వంగారి కుటుంబ జీవితం తెలుగు పాత్రికేయులకు స్ఫూర్తి దాయకమన్నారు.


తెలుపు-నలుపు వ్యాసాలలో కొందరు సమకాలీన రచయితల కృతులను రసహృదయులై విశ్లేషించారు. అడవి బాపిరాజు పరవశించి నాట్యం చేస్తూ పాడిన "ఉప్పొంగి పోయింది గోదావరీ తాను" అనే పాటలోని హృదయాన్ని సజీవంగా కట్టెదుట నిల్పినారు. 'మాణిక్యవీణ' లో బంగ్లాదేశ్‌ స్వాతంత్య్ర సమరానికి అందరూ సహకరించాలన్నారు. రాయలసీమ కరువు కాటకాలకు చిక్కి ప్రాణాలు కోల్పోయిన వైనాన్ని చూపి పాఠకులను 'అయ్యో' అని విలపింపచేశారు. మహామహోపాధ్యాయ, చిలుకూరి నారాయణ రావుగారి భాషాశాస్త్ర విజ్ఞానం తెలుసుకొని, వాడుక భాషలో గొప్పరచనలు రాయవచ్చునని నిరూపించారు. స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని రాజాజీ, ప్రకాశం, గిరి గార్లతో, మిత్రుడు తరిమెలనాగిరెడ్డితోపాటు గడపిన జైలు జీవితాన్ని తెలిపారు.


ఈ పుస్తకంలో "జీవితంలోంచి కొత్త కవుల ప్రభవం" శీర్షికలో, విద్వాన్‌విశ్వం- శ్రీశ్రీలు జరిపిన ముఖాముఖి తప్పక చదవాల్సిందే.


-జానమద్ది హనుమచ్ఛాస్త్రి  


విజయవంతంగా జరిగిన ఆవిష్కరణ సభ!

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం మరియు కేంద్రసాహిత్య అకాడమీ వారి మోనోగ్రాఫు విద్వాన్ విశ్వం పుస్తకాల ఆవిష్కరణ సభ చాలా వైభవంగా జరిగింది. 

వయోధిక పాత్రికేయ సంఘం మరియు అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ సంయుక్తంగా నిర్వహించిన ఈ సభకు డా.జి.యస్.వరదాచారి అధ్యక్షత వహించారు. సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకాన్ని డా.కె.వి.రమణాచారి ఆవిష్కరించగా ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్ తొలి ప్రతిని స్వీకరించారు. అనంతరం విద్వాన్ విశ్వం మోనోగ్రాఫును ఆచార్య కేతు విశ్వనాథ రెడ్డి ఆవిష్కరించగా తొలి ప్రతిని డా.జి.ఎస్.వరదాచారి గారు స్వీకరించారు. అనంతరం ఈ పుస్తకాలను టి.ఉడయవర్లు, ఆచార్య పి.సుమతీనరేంద్రగారలు వరుసగా సభకు పరిచయం చేశారు.

డా.కె.వి.రమణాచారి, కె.శ్రీనివాస్, డా.కేతు విశ్వనాథరెడ్డిగార్లు సభలో ప్రసంగించారు. 

సంపాదకుల తరఫున డా.నాగసూరి వేణుగోపాల్ తమ స్పందనను తెలియజేశారు. నా విన్నపాన్ని మన్నించి సభకు హాజరైన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. 

1, మార్చి 2012, గురువారం

విద్వాన్ విశ్వం పుస్తకం పై కౌముది సమీక్ష!



కౌముది అంతర్జాల పత్రిక మార్చి సంచికలో మేము వెలువరించిన సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకం పై సమీక్ష వచ్చింది. చదవడానికి ఈ క్రింది లింకు నొక్కండి.