...

...

21, జూన్ 2012, గురువారం

మాతృదేవోభవ అనే పదానికి న్యాయం చేసిన కథ!

(మాతృన్యాయం కథపై సి.ఉమాదేవిగారి విశ్లేషణ ఇక్కడ చదవండి)


         ఈ కథకు సమీక్ష రాయడం ప్రారంభించిన రోజే కన్నవారిని కాదంటే భరణం కట్టాల్సిందే అనే వార్తను చదవడం తటస్థించింది. ఆదాయవనరులు, కుటుంబసభ్యుల సంఖ్యనుబట్టి మార్గదర్శకాలుకూడా జారీ చేసినట్లు వార్త చెప్తోంది.తల్లిదండ్రుల సంరక్షణ, వయోవృద్ధుల నిబంధనలు-2011 అమల్లోకి వస్తే తల్లిదండ్రులకిక అన్యాయమే జరగదు, పిల్లలు సేవలు చేస్తుంటే వారి పని ఇక కాళ్లూపుతూ కూర్చోవడమేనని అనుకుంటారేమో!


         కథావస్తువును ఎంచుకునేటప్పుడు పాతవిషయాన్నికాక కొత్తదనానికై అన్వేషణ జరగడం సహజం.వృద్ధులైన తల్లిదండ్రులు-పిల్లల నిరాదరణ అన్నసమస్య నిత్యనూతనం కాదుకాని అదొక రావణకాష్ఠం. నేటియవ్వనమే రేపటి వార్ధక్యం కదా?అద్భుతమైన మార్పు ఆవిష్కరింప బడితే తప్ప ఈ విషయం పాతబడదు.మరి ఈ మార్పు ఎక్కడ ప్రారంభమవాలి? మనిషిలోనా?మనుగడలోనా?పిల్లల ప్రవర్తనాతీరును, తల్లిదండ్రులపట్ల వారి ఉదాసీనతను సమాజం ఆక్షేపించాలా లేక ప్రభుత్వం జోక్యం చేసుకోవాలా?ఇలాంటి ప్రశ్నలెన్నిటినో లేవనెత్తిన కథలోని మలుపులు చూద్దాం.



   న్యాయవాది రాఘవరావు నేరస్థుడిని శిక్షింపచేయడంలో తన వాగ్ధాటినే పదునైన కత్తిగా వాడటంలో దిట్ట.అటువంటి న్యాయవాది, తన పొరుగుననే వున్నవృద్ధదంపతులు దుర్గాంబ,అనంతపద్మనాభంలు కొడుకు ఇంట, కోడలిచేత పడుతున్న అగచాట్లను నిశితంగా గమనించేవాడు. ఆ నేపథ్యంలో వారి కొడుకు, కోడలిపై క్రిమినల్ నెగ్లిజన్స్ నేరంగా ప్రతిపాదించి, విధింపచేసే శిక్ష కఠినమైనదే అవుతుంది.

     శారీరక బాధలకు పరిష్కారం వైద్యం. మందులు,సర్జరీలు అనారోగ్యాన్ని జయించలేనపుడు విముక్తిగా మరణాన్ని కోరుకుంటాడు మనిషి. అయితే మానసిక, శారీరక బాధేదైనా పిల్లల ప్రేమపూర్వక పలకరింపులే అమ్మానాన్నలకు చలివేంద్రం. ఇవి కొరవడిన అనంతపద్మనాభం తమ పుత్రుడు తమను శారీరక, మానసిక బాధలకు గురి చేస్తున్నాడని న్యాయవాది రాఘవరావు ద్వారా కోర్టుకు ఫిర్యాదు చేస్తాడు. ఇక కోర్టు వాతావరణాన్ని కథనానికి తగినట్లు చిత్రీకరించడంలో శ్రీనివాస్ గారు నూటికి నూరు శాతం సఫలీకృతులైనట్లే.

   న్యాయవాది ఆస్తుల వివరాలు ప్రశ్నించినపుడు దుర్గాంబ తడబడుతుంది. ఆ తడమాటుకు తన చురచుర చూపులతో అనంతపద్మనాభం చురకలంటిస్తాడు. కథాశిల్పంలో ఈ ఎత్తుగడ కథాపఠనంపై ఉత్సుకతను పెంచింది. ముగింపుఎలా ఉంటుందోనన్న ఆతృతకు మొగ్గ తొడిగింది. తల్లిదండ్రులమీద దయలేని పుత్రులను చెదలతో పోల్చిన వేమన మానవత్వంలేని పుత్రులను కాస్తంత ఘాటుగానే విమర్శించాడు. అదే తనమాటగా నొక్కిచెప్పాడు న్యాయవాది రాఘవరావు. కొడుకుకోసం తమ ఆస్తులన్నీ కరిగించేసుకున్న దుర్గాంబ, అనంతపద్మనాభంల కొడుకు సాయికిరణ్ ను కఠినంగా శిక్షించాలని రాఘవరావు కోర్టును కోరడం సామాజి స్పృహ వున్న ఎవరిచేతనైనా ఆమోదింపబడే న్యాయమే.



   డిఫెన్స్ లాయర్ ప్రవీణ్ క్రాస్ ఎగ్జామిన్ కు ఉపక్రమించినపుడు దుర్గాంబ పేరు లలితమ్మగా మారడం కథాగమనానికేం అడ్డుకాలేదు.



      మనవడు తేజను బడికి తీసికెళ్లినపుడు జరిగిన ప్రమాదంలో తేజ, అనంతపద్మనాభం ఇద్దరు గాయపడతారు. ఆ రోజు పుట్టినరోజు కూడా కావడంతో వేసిన కొత్తబట్టలు మట్టికొట్టుకుపోయి గాయాలైన తేజకు మందు రాస్తున్న కోడలు దివ్య దగ్గర, భర్తకు కూడా కాస్త మందు తీసుకోబోయిన అత్తను విసురుగా తోస్తుంది కోడలు.ఫలితం... గోడను గుద్దుకుని తల చిట్లి సొమ్మసిలి పడిపోతుంది దుర్గాంబ.ఈ సంఘటనే అనంతపద్మనాభాన్ని కోర్టు ముంగిట నిలిపింది. అయితే కోర్టులో దుర్గాంబ సమాధానాలు అందరిని ఆశ్చర్యపరిచే దిశగా సాగుతాయి.అటు కొడుకు ఇటు భర్త! ఎవరి పరువు భంగపడరాదు. వారిద్దరి మర్యాద తనపైనే ఆధారపడి ఉన్నాయని ఆమెకు తెలుసు. భర్త బాధపడినా కొడుకు చిన్నబోయినా ఆమెకు బాధే! సమాజంలో జరిగే తప్పుకు సమాజం బాధ్యత ఉండదా?ఈ ప్రశ్న దుర్గాంబ సంఘర్షణలోనుండి ఉత్పన్నమవుతుంది.



      ఒకప్పుడు పాఠశాలల్లో మోరల్ సైన్స్ పేరిట వారానికి ఒక పీరియడైనా వుండేది.కాని ఆ సమయాన్నికూడా లెక్కలు,కెమిస్ట్రీ, ఫిజిక్స్, కంప్యూటరు కబ్జా చేస్తున్నాయి.కాసులొచ్చే చదువులకే క్లాసులలో ప్రాధన్యత పెరిగి సమాజానికి ఉపయోగపడే పాఠాలు మృగ్యమవుతున్నాయన్న నిజాన్నితల్లి దుర్గాంబ పాత్ర ద్వారా రచయిత చక్కగా వినిపించారు.



     పెద్దలకు,పిల్లలకు నడుమ అత్మీయబంధమే గృహపాలనలోని మూలసూత్రంగా గుర్తింపునందుకున్ననాడు శ్రీనివాస్ గారి చేతిలో పురుడు పోసుకున్నఈ కథకు ఊపిరందుతుంది.చివరకు టి.వి. సీరియళ్లలోని అత్తా కోడళ్ల హింసనాదాలు కూడా మనుషులదారేకాక మనసులదారే తప్పేటట్లు చేస్తున్నాయి,నీతిపాఠాలు నేటి పిల్లలకు దూరమయాయంటూ దుర్గాంబ కార్చిన కన్నీరు కన్నతల్లులందరిదీ. ఆవేశంలో జరిగే అనర్థాలలో ఇది కాకతీళయంగా జరిగిన ఒక సంఘటనే తప్ప మరేమి కాదంటూ,ముందుగా పథకరచన జరగలేదన్న సూక్ష్మాన్ని హుందాగా తెలిపిన దుర్గాంబ మాటలు అందరిని మాటరానివారిని చేసాయి.కోడలి దురుసుతనానికి,కొడుకు నిర్లిప్తతకు తగిన శిక్ష పడాలని వాంఛించిన అనంతపద్మనాభం ఆవేశానికి దుర్గాంబ పలుకులు హిమవర్షమే!ఇక చివరకు వారి కొడుకు సాయికిరణ్ కు ఏ శిక్ష పడుతుందోనని ఆతృతగా చూస్తుంటే తల్లిదండ్రులను యాత్రలకు తీసికెళ్లమని న్యాయమూర్తి సూచించినపుడు శ్రవణకుమారుని కథ గుర్తుకు వస్తుంది.మరి అన్యాయానికి న్యాయం చేసిన మాతృన్యాయమూర్తి చేసింది సబబేనా అని ప్రశ్నించుకుంటే విభిన్నస్పందనలు వినిపిస్తాయి.ఎన్నివిన్నా చివరకు చెప్పగలిగేదొకటే....మాతృదేవోభవ!



   సున్నితమైన సామాజిక అంశాన్ని తీసుకుని దాని వెనుకగల మూలకారణాలను దుర్గాంబ పాత్ర ద్వారా తెలియచేసి చర్చకు వేదిక కాగల అంశాలనెన్నింటినో మనముందుంచిన రచయిత గంగా శ్రీనివాస్ గారు అభినందనీయులు.


      మాతృన్యాయం కథను క్రింద ఇవ్వబడిన లింకులో చదవండి.


(చిన్నిగుండె చప్పుళ్లు బ్లాగు సౌజన్యంతో)

19, జూన్ 2012, మంగళవారం

కాపీ రాయుళ్లను ఏం చేయాలి?

అనుకోకుండా ఈరోజు కూడలి చూస్తే కథాలహరి అనే పేరుతో వస్తున్న బ్లాగులో నా కథాజగత్‌లో వచ్చిన కథలు కొన్ని కనిపించాయి. కొంత ఆశ్చర్యంతో ఆ బ్లాగును ఓపెన్ చేసి చూస్తే అందులో కథాజగత్‌లో వచ్చిన కథలన్నీ యథాతథంగా నేను వాడిన ఫాంట్లు కలర్లతో సహా అలాగే కాపీ చేసి ఉన్నాయి. నేను కథాజగత్‌ను అంతర్జాలంలో తెలుగు కథకు తగిన ప్రాచుర్యం కలిగించాలనే ఉద్దేశంతో ప్రారంభించాను. మొదట బ్లాగుగా ప్రారంభించి అందులోని యిబ్బందుల్ని అధిగమించడానికి వెబ్‌సైటుగా మార్చాను. యిప్పటి వరకు 225 కు పైగా కథల్ని ప్రచురించాను. అన్ని కథలనూ ఆయా కథా రచయితల అనుమతి తీసుకుని నా వెబ్‌సైట్‌లో ప్రచురించాను. ఆయా కథలు ప్రచురింపబడిన పత్రికలను కూడా తేదీతో సహా కథ క్రింద పేర్కొన్నాను. కథాజగత్‌కు రచయితలనుండి పాఠకులనుండి మంచి స్పందన లభించింది. నేను రెండేళ్ళకు పైగా కష్టించి ప్రకటించిన కథల్ని అజయ్ వెల్లంకి అనే శాల్తీ రెండు వారాల్లో తన కథాలహరి బ్లాగులో కాపీ చేసేశాడు. కనీసం ఎక్కడా కథాజగత్‌నుండి ఈ కథల్ని తీసుకున్నట్టు పేర్కోలేదు. ఇలా మన బ్లాగుల్లోని/వెబ్సైట్లలోని కంటెంటును మన అనుమతి లేకుండా కాపీ కొట్టే వారిపై మనం ఏం చేయగలం? మీ సలహా కావాలి.

రహస్యం

ఆర్.దమయంతి గారి కథ రహస్యం కథాజగత్‌లో చదివి హృదయ సౌందర్య రహస్యాన్ని తెలుసుకోండి.

13, జూన్ 2012, బుధవారం

గ్రంథాలయ సర్వస్వంలో విద్వాన్ విశ్వం!

గ్రంథాలయ సర్వస్వం జూన్ 2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై శ్రీ బత్తుల వెంకటరామిరెడ్డిగారి సమీక్ష వచ్చింది. 











నడుస్తున్న చరిత్రలో ముక్తవరం పార్థసారథి గారి సమీక్ష!

నడుస్తున్న చరిత్ర మాసపత్రిక జూన్ 2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకంపై శ్రీ ముక్తవరం పార్థసారథి గారు సమీక్ష వ్రాశారు. ఆ   సమీక్ష  ఈ క్రింది లింకులో చూడవచ్చు.


http://teblog.kinige.com/?p=1866

8, జూన్ 2012, శుక్రవారం

యోజనలో సమీక్ష!

యోజన అభివృద్ధి మాసపత్రిక జూన్ 2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై ఎం. సుబ్బరాజుగారు సమీక్ష వ్రాశారు. తురుపుముక్క పాఠకులకోసం ఆ సమీక్ష పాఠం ఇక్కడ. 



సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం (వ్యాస సంకలనం) 


       తొందరలో 2015లో రాబోతున్న విద్వాన్ విశ్వంగారి శతజయంతిని దృష్టిలో పెట్టుకుని ఆ సాహితీ పూర్ణచంద్రుడికి డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌గారలు ఉడుతాభక్తితో ఈ గ్రంథాన్ని అడ్వాన్స్ నైవేద్యంగా తీసుకురావడమన్నది హర్షదాయకమైన విషయం. లోగడ ఆయన కలం నుండి ఆంధ్రప్రభలో వెలువడే 'మాణిక్య వీణ' నుంచి ఎన్ని అక్షర సుగంధాలు వెలువడ్డాయో తెలియని సాహితీ ప్రేమికులు తెలుగు నేల మీద లేరనే చెప్పాలి. కొండంత దేవుడికి కొండంత పత్రి తేలేక పోయినా విశ్వంగారి మేరు శిఖర సమాన వ్యక్తిత్వాన్ని చక్కగా సోపపత్తికంగా ఇందలి వ్యాసాలలో మనం గమనించగలుగుతాం!
         
      సాహితీవిరూపాక్షుడైన విశ్వంగారు నిర్వహించిన పత్రికలలోని శీర్షికలు, సమీక్షలు, సందేశాలు, ఇంటర్వ్యూలు ఇంకా ఎన్నో గుదిగుచ్చి ఈ గ్రంథానికో నిండుదనం తీసుకొచ్చారు సంపాదకులు. విషయాన్ని నాలుగు అధ్యాయాల్లో పొందుపరిచారు. వారు నాగిరెడ్డి అనే వారితో కలిసి 'నవ్యసాహితి'అనే పత్రికను నిర్వహించిన భోగట్టా కూడా ఈ గ్రంథంలో ఉటంకించారు. విశ్వంగారు తొలిదశలో రాజకీయాలకు సన్నిహితులుగా తలమునకలైవున్నా పత్రికా సంపాదకత్వం బాటలో పయనిస్తున్నాని చెప్పడం వారికి మాతృభాష పట్ల, స్వజాతి జనుల పట్ల గల ప్రేమ వ్యక్తం అవుతున్నది.
          
విరికన్నె, పాపం, రాతలు గీతలూ, నా హృదయం వీరి కలమ్నుండి వెలువడ్డ లఘుకృతులైతే పెన్నేటిపాట, ఒకనాడు అనేవి కావ్యకన్నికలు. అయితే విద్వాన్ విశ్వంగారు అసంఖ్యాకములైన అనువాదాలు చేసియున్నారు. అవి సంకృత భాషనుండి, పాశ్చాత్య భాషలనుండీ జరిగినా అది ప్రక్రియాపరంగా చెప్పాలనంటే నవలలు, నాటకాలు, కథలు, కావ్యాలు, సిద్ధాంత గ్రంథాలు ఇలా ఎన్నో లెక్కకు మించి దర్శనమిస్తాయి. పైగా అనువాదమన్నది అనుకున్నంత తేలికైన విషయం కాదు. అది కత్తి మీద సాము వంటిదని అనుభవమున్న ప్రతి ఒక్కరికీ తెలిసిన అంశం. ఈ గ్రంథం చదవటం ద్వారా పాఠకులకు ముఖ్యంగా వారి రచనలో కనిపించే లోతైన ఆలోచనలు, సమన్వయవాదం, అవగాహన, అర్హులైనవారికి తగిన గౌరవం లభించాలన్న ఆతృతలు వీటికి తోడు అద్భుతమైన గతకాల జ్ఞాపకాల దొంతరలకు సాక్ష్యంగా ఈ పుస్తకం దర్శనమిస్తుంది.

సంపాదకుల శ్రమకూడా తక్కువని చెప్పలేం. ఒక వ్యక్తి తాలూకు ఔన్నత్యాన్ని పలువురికీ విశదపర్చగలందులకు చేసిన గట్టి కృషిగా నిలుస్తుంది. ఇదొక విలక్షణమైన గ్రంథం అని చెప్పుకోవచ్చు. వ్యక్తిగా, మేధావిగా, రచయితగా విశ్వంగారిలోని పలుకోణాల్ని ఆవిష్కరిస్తూ పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. సంపాదకుల కృషిని అభినందించకుండా ఉండలేము.

- ఎం.సుబ్బరాజు



6, జూన్ 2012, బుధవారం

పొత్తూరి వారి సమీక్ష!

విద్వాన్ విశ్వం గారి జీవితంపై 2011 ఉత్తరార్థంలో రెండు పుస్తకాలు వెలువడ్డాయి. ఒకటి కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించిన మోనోగ్రాఫ్. రెండవది ఇక్కడ సమీక్షితున్న 'సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం' అనే సంకలన గ్రంథం.


రెండు ప్రచురణలలోనూ ప్రముఖ మీడియా వ్యాఖ్యాత డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ గారి కృషి ఉంది. సాహిత్య అకాడమీ ప్రచురణ ఆయన వ్రాసిన గ్రంథమే. 'సాహితీవిరూపాక్షుడు ...' డాక్టర్త్ నాగసూరి వేణుగోపాల్, శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ సహ సంపాదకత్వంలో వెలువడినది.


అకాడమీ ప్రచురణలో డాక్టర్ వేణుగోపాల్ గారు చేసిన మూర్తిమత్వ చిత్రణ ఒక్కటే కనిపిస్తుంది. 'సాహితీవిరూపాక్షుడు ...'లో విశ్వం గారితో పరిచయం ఉన్న పలువురి అభిప్రాయాలే గాక ఆయన పత్రికలలో నిర్వహించిన కొన్ని శీర్షికలలోని రచనలూ, వ్యాసాలూ కూడా ఉన్నాయి.


సంపాదకులు తమ 'నివేదన'లో 'సాహితీవిరూపాక్షుడు ...' గ్రంథం విశ్వంగారి విరాట్ స్వరూపాన్ని పూర్తిగా ఆవిష్కరించలేకపోయినప్పటికీ 'కొంతలో కొంత వారి జీవన రచనా రీతులను' తెలియజేస్తుందన్నారు. 


నిజమే. మూడు ముఖ్యమైన రంగాలలో విశ్వం గారు చేసిన కృషి తెలియజేసి, ఆయన సంపూర్ణ మూర్తిమత్వాన్ని 263 పేజీల గ్రంథంలో ఆవిష్కరించడం సాధ్యం కాదు. ఐనప్పటికీ, గ్రంథంలోని విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ అనే నాలుగు అధ్యాయాలు దేనికది సంపూర్ణంగానే కనిపిస్తాయి. వైవిధ్యం కలిగిన రచనలు అందులో ఉండటమే అలాంటి భావన కలిగిస్తుంది. ఈ నాలుగు 'విశ్వ' పదబంధాలూ విశ్వంగారు సృష్టించినవే కావడం ఒక విశేషం.


విశ్వం గారు కృషి చేసిన మూడు ముఖ్యమైన రంగాలలో మొదటిది ప్రజాసేవ. యువకుడిగా ఆయన అనంతపురం జిల్లా కాంగ్రెస్‌లో నీలం సంజీవరెడ్డిగారితో సమస్థాయిలో నాయకత్వ బాధ్యత నిర్వహించారు.


సాహిత్య రంగం రెండవది. ఆయన రచించిన 'పెన్నేటి పాట' లాంటి రచనలు ఆయన సమకాలీన సాహితీవేత్తలెందరి నుంచో ప్రశంసల నందుకున్నాయి. విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయనను 'సరస కవి' అన్నారు. "విశ్వం గారు తెలుగు సాహిత్యంలో 'పెన్నేటి పాట' రచించి, నార్ల వారికి అంకితం చేసి, రాళ్లపల్లి వారి మెప్పుబడసి అస్మదాదులను అలరించాడు" అన్నారు దాశరథి గారు.


"ఆయన సనాతనాధునాతన సంప్రదాయ సేతువులు. శాస్త్ర సంవిత్సముద్ర పారీణులు" అని ప్రశంసించారు ఆచార్య దివాకర్ల వేంకటావధానిగారు. విశ్వం గారు నార్ల వెంకటేశ్వరరావు గారితో కలసి పత్రికలలో పనిచేశారు. ఆయన అభిమానానికి, విశ్వాసానికి పాత్రులైనారు.


2015 విశ్వంగారి శతజయంతి సంవత్సరం. దేశ సేవ, సాహిత్యం, పత్రికలు అనే మూడు రంగాలలో విశ్వంగారి విశిష్ట సేవలను గురించి తెలుసుకోవటం కొత్త తరాలకు, ముఖ్యంగా రచయితలకు, జర్నలిస్టులకు ఉపయోగకరం.


విశ్వంగారు భౌతిక శరీరాన్ని వదలిన రెండు పుష్కరాలకు 'సాహితీవిరూపాక్షుడు ...' గ్రంథం వెలువడి నవతరాల ఈ అవసరాన్ని తీరుస్తున్నది. దేశ సేవ ఎలా కళంక రహితంగా చేయాలో, సాహిత్యాన్ని ఎలా ప్రజోపయోగం కావించాలో, పత్రికారచనలో ఎలాంటి ప్రమాణాలను పాటించాలో, విశ్వం గారి జీవితం ఎలా ఆదర్శప్రాయమో ఈ గ్రంథం అవగాహన కలిగిస్తుంది - కొంతలో కొంత కాదు తగినంతగా...!


- పొత్తూరి వెంకటేశ్వరరావు

(ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక జూన్ 2012 సంచికలో ప్రచురితం)