...

...

9, నవంబర్ 2011, బుధవారం

పాండవ పక్షపాతి


ఒకసారి శ్రీకృష్ణదేవరాయలు తన నిండుకొలువు భువనవిజయంలో కవిపండితులను ఉద్దేశించి ధర్మరాజు తమ్ములు మంచివారా? శ్రీరాముని తమ్ములు మంచివారా? అని ప్రశ్నించాడట. దానితో సభ రెండుగా చీలిపోయి ఒక పక్షము ధర్మరాజు తమ్ములు మంచివారంటే మరొక పక్షము శ్రీరాముని తమ్ములు మంచివారని పరిపరి విధాలుగా వాదించ సాగారట. అష్టదిగ్గజ కవులు కూడ రెండుగా విడిపోయారట. తమ వాదాన్ని సమర్థించడానికి నానా తంటాలు పడ్డారట.  అయితే వారి వాదనలు సహేతుకంగా లేదని శ్రీకృష్ణదేవరాయలు తన ధర్మసందేహాన్ని తానే నిర్ణయించ దలచి ఇట్లన్నాడు. "రాముని కంటే రాముని తమ్ములు బలహీనులు. అందువల్ల వారు తమ అన్నగారి మాట వినితీరాలి. బహీనులయి బలవంతుని మాట వినడంలో ఏం గొప్ప ఉంది. ఇక ధర్మరాజు కంటే అతని తమ్ములు బలవంతులు, ప్రయోజకులూను. విశేషించి పాండవులకు అన్ని కష్టాలు ధర్మరాజు మూలంగానే వచ్చింది. అన్నగారి కంటే బలవంతులై కూడా అతని మూలంగా అష్టకష్టాలు అనుభవించీ భీమార్జున నకుల సహదేవులు ధర్మరాజు మాట జవదాటలేదు. ప్రయోజకులైనవారు అప్రయోజకుడి మాట శిరసావహించడం గొప్ప విషయమే కదా? అంచేత ధర్మరాజు తమ్ముళ్ళే మంచివారని నా అభిప్రాయం." సభ కరతాళధ్వనులతో దద్దరిల్లింది. వెంటనే తెనాలి రామకృష్ణుడు లేచి "ప్రభువుల వారు ఆ అవతారమందే కాకుండా ఈ అవతారమందు కూడ పాండవ పక్షపాతియే కదా" అన్నాడట. శ్రీకృష్ణదేవరాయలు దానికి ఉబ్బిపోయి ఉంటాడని ప్రత్యేకంగా చెప్పాలా? :)    

(చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి మనోరమ పత్రిక నుండి)    

2 కామెంట్‌లు:

రసజ్ఞ చెప్పారు...

ఎంత చక్కగా చెప్పారండీ! ఛతురోక్తులను వేయడంలో తెనాలి రామలింగని తరువాతనే ఎవరయినా!

కంది శంకరయ్య చెప్పారు...

చాలా బాగుంది. ధన్యవాదాలు.
దీనికి నా పద్యానుకృతి ‘శంకరాభరణం’లో ప్రకటించాను.
http://kandishankaraiah.blogspot.com/2011/11/blog-post_6008.html