...

...

3, ఏప్రిల్ 2012, మంగళవారం

రాచపాళెం వారి సమీక్ష!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తురుపుముక్క శుభాకాంక్షలు అందజేస్తోంది. శ్రీరామచంద్రుని కరుణా కటాక్షవీక్షణాలు మీపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.


ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రిక 'అక్షర' పేజీలో సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై డా.రాచపాళెం చంద్ర శేఖర రెడ్డిగారి విపులమైన సమీక్ష ప్రచురితమైంది. చదవండి. 


సమీక్ష పూర్తి పాఠం ఈ క్రింద చదవండి.


     తెలుగు సాహిత్య రంగంలో ఇప్పుడు నాలుగు పనులు జరుగుతున్నాయి. 1. రచయితల సాహిత్య సర్వస్వ ప్రచురణ 2. షష్టిపూర్తి, శతజయంతుల సందర్భంగా రచయితలపైన విశే్లషణలతో ప్రత్యేక సంచికల విడుదల, 3. బహుమతుల పురస్కారాల హడావిడి 4. కొత్తగా వచ్చిన రచనను అనేక స్థలాలలో ఆవిష్కరించి సమీక్షలు చేయించడం. వీటిలో దేనితోనూ సంబంధం లేని వ్యాస సంకలనం ‘‘సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం.’’ విద్వాన్ విశ్వం మీద అనేకులు ఇదివరకే రాసిన విమర్శలు, విశ్వంగారి రచనలలో ఎన్నిక చేసిన విమర్శలు, ఫ్యూచర్లూ, సమీక్షలతో కూడిన సంచిక ఇది. నాగసూరి వేణుగోపాల్, కొడీహళ్ళి మురళీమోహన్‌లు దీనికి సంపాదకులు.

      మరో మూడేళ్ళలో విద్వాన్ విశ్వం శత జయంతి (2015) జరగబోతున్నది. అప్పుడు విశ్వం గురించి ఏమిచేయాలో నిర్ణయించుకోడానికి వీలుగా ఇప్పటికే ఆయన మీద వచ్చిన విశే్లషణల్ని ఈ సంచికలో చేర్చారు. విద్వాన్ విశ్వం కవి, నవలా రచయిత, పాత్రికేయుడు, కాలమ్ రచయిత, సమీక్షకుడు, అనువాదకుడు, ప్రగతిశీల చింతనాశీలి, కార్యకర్త, స్వాతంత్య్రానంతరం అభ్యుదయ సాహిత్యానికి రాయలసీమనుండి పుట్టుకొచ్చిన ప్రతినిధులలో ఒకరు విశ్వం. మాణిక్యవీణ, నలుపుతెలుపు శీర్షికలతో సాహితీ సామాజికాంశాలను వ్యాఖ్యానించిన పాత్రికేయ రచయిత అయిన విశ్వం వామపక్ష రాజకీయ క్రియాశీలి. ఈ వాస్తవాలను ప్రతిబింబిస్తున్నది ఈ సంకలనం.

           విద్వాన్ విశ్వం అనగానే ‘విశ్వం’ అనే పదం చుట్టూ సంచరిస్తారు అందరూ. ఈ సంపాదకులు కూడా ఈ సంచికను నాలుగు భాగాలుగా విభజించి విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ అని పేర్లు పెట్టారు. ఈ నాలుగు పదాలూ విశ్వానివే అయినా సంపాదకులు వాటిని అర్థవంతంగా ఉపయోగించుకున్నారు. విశ్వజీవిలో విశ్వంమీద ఇరవయ్యొక్క మంది రాసిన వ్యాసాలు చేర్చారు. తక్కిన మూడు భాగాలలో విశ్వం నిర్వహించిన మాణిక్యవీణ, నలుపు తెలుపు శీర్షికలనుండి ఎన్నిక చేసిన సాహితీ సామాజిక వ్యాసాలు, విశ్వం రాసిన పీఠికలు, సమీక్షలు, ఆయన ఇచ్చిన సందేశాలు, ఇంటర్వ్యూలు ఉన్నాయి.

          కల్లూరు అహోబలరావు విశ్వంను మానవతావాదిగా నిర్వచించగా, విశ్వనాథ గొప్ప జాతీయవాదిగా పేర్కొన్నారు. ఎం.ఎ రెడ్డి సాటిలేని మేటి సాహిత్యరత్న దీపమని వర్ణించగా సమాజశ్రేయస్సుకు పాటుబడిన సాహితీ ఋత్విక్కుగా కలువగుంట రామమూర్తి నిర్ధారించారు. యాదాటి కాశీపతి విశ్వం కవిత్వంలో విశ్వమే ప్రదర్శితమైందని కొనియాడారు. పెన్నేటి కావ్యం గురించి విమర్శకులు విస్తృతంగా అభిప్రాయాలు చెప్పారు. అది సీమ రైతాంగ హృదయవేదన అని ఏటుకూరి బలరామమూర్తి అంటే, సీమ దారిద్య్రం దైన్యం కలిగించిన నిర్వేదసారంగా భూమాన్ పేర్కొన్నారు. నిస్సహాయ నిర్వేదంలోనూ కావ్యకమనీయత దెబ్బతినలేదని రాళ్ళపల్లి పేర్కొన్నారు. విశ్వం వైదుష్యంలాగే ఆయన సాహిత్యం కూడా వైవిధ్యశోభితమని దివాకర్ల వివరించగా, ఆయన సాహిత్యంలో సర్వమానవ సౌహార్దం పట్ల తపన ఉందన్నారు రాళ్ళపల్లి. ఒక ప్రాంత నిర్దిష్ట జీవిత చిత్రణ  పెన్నేటి పాటతోనే మొదలైందని అద్దేపల్లి పేర్కొనగా, తనకు తెలంగాణా అంటే ఆవేశం వచ్చినట్లు విశ్వానికి రాయలసీమ అనగానే ఆవేశం పొంగుకు వస్తుందని దాశరథి పరవశించారు.

          ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులు కొందరిలో విశ్వం ఒకరని ఆరుద్ర అంటే, సంప్రదాయాన్ని ఆదరించినా ఛాందసాన్ని అంగీకరించని వ్యక్తిగా పున్నమరాజు పేర్కొన్నారు. తన లాంటి రచయిత్రులంతా పైకి రావడానికి విశ్వం ప్రోత్సాహమే కారణమని మాలతీచందూర్ చెప్పుకోగా, అపారమైన అనుభవంతో విశ్వం నేర్చుకున్నది ఆత్మవిశ్వాసమన్నారు మిక్కిలినేని. మాణిక్యవీణ ఆయన విస్తృత పరిజ్ఞానానికి సాక్ష్యమని మహీధర కీర్తించగా, అందులో ఆయన చేసిన హితబోధ నేటి రాజకీయ నాయకులకు కూడా అనుసరణీయాలన్నారు వెలుదండ. విభిన్న వాదాలతో గిడసబారిపోయే ప్రస్తుత పరిస్థితిలో విశ్వం విశాల దృక్పథం ఎంతో వాంఛనీయమని నాగసూరి వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆయనకు సీమ సమస్తమూ తెలుసని ‘సీమసాహితి’ తొలి సంచిక సంపాదకీయం పేర్కొంది.

         విశ్వం వ్యాసాలలో మనకు రతనాల వంటి అభిప్రాయాలెన్నో లభిస్తాయి. ‘‘ఈ నవ్యకావ్య ప్రపంచాన్ని కొత్త కొలమానాలతో కొలవవలసి వస్తున్నది.’’ అంటూ ఆధునిక కవిత్వ పరిశీలనకు కొత్త ప్రమాణాల అవసరాన్ని పేర్కొన్నారు. అయిదున్నర దశాబ్దాల క్రితం, ఇది నేటికీ శిరోధార్యం. రాయలసీమ కరువుమీద 1955లో పెనే్నటి పాట రాసినా 1970లో దేశవ్యాప్తంగా 84 జిల్లాలలో వచ్చిన కరువును గుర్తించారు. ప్రపంచీకరణవల్ల ప్రపంచం ఒక కుగ్రామం అవుతున్నదని ప్రచారం జరుగుతున్నది ఇవాళ. విశ్వం 1971లో దేశాలకూ ఖండాలకు మధ్యనున్న దూరమే కాదు గ్రహాలకూ ఉపగ్రహాలకూ మధ్యనున్న దూరంకూడా తగ్గిపోతున్నదని గుర్తించారు విశ్వం. స్వరాజ్యం నిజమైన ప్రజారాజ్యం చెయ్యడానికి విప్లవం తీసుకురావాలన్న విశ్వం మాట కాలం చెల్లిందనగలమా! 1914లో కట్టమంచి చెబితే పండితులు విసుక్కున్నారు గాని విశ్వం ‘‘ఏ సందర్భంలో ఏది ఉచితమో దానిని సమర్థంగా ఉపయోగించుకోవడంలోనే కవి చరితార్థుడౌతాడు’’అని ప్రబోధించారు. ‘తెలుపు నలుపు’ శీర్షిక విశ్వంను సాహిత్య తత్వవేత్తగా అధ్యయనం చెయ్యవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుండగా మాణిక్యవీణ ఆయన సామాజికాలోచనలను వివరిస్తున్నారు. అడివి బాపిరాజు, తరిమెల నాగిరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కాళిదాసు ‘మేఘసందేశం’, దాశరథి ‘తిమిరంతో సమరం’, రంగనాయకమ్మ ‘కళ ఎందుకు?’, కరుణకుమార ‘బిళ్ళల మొలత్రాడు’ వంటి రచయితలు, రచనలను విశే్లషించారు విశ్వం. ఇదంతా చూస్తే విశ్వంను రచయితగానే గాక, సాహిత్యతత్వవేత్తగా, సాహిత్య విమర్శకుడుగా కూడా చూడవలసి ఉందనిపిస్తుంది. చివర నాగసూరి విశ్వంతోనూ, విశ్వం శ్రీశ్రీతోనూ చేసిన సంభాషణలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. నేటి తరం కవులు, రచయితలు తెలుసుకోవలసిన విషయాలతో ఈ సంచికను సమకూర్చిన సంపాదకులకు అభినందనలు.

- రాచపాళం చంద్రశేఖరరెడ్డి 





కామెంట్‌లు లేవు: