ఈ రోజు (10 మే 2012) నేటి నిజం దినపత్రికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై తంగిరాల చక్రవర్తి గారి సమీక్ష ప్రచురితమైంది.
ఆ రివ్యూ తాలూకు పూర్తి పాఠమిదిగో!
ఆ రివ్యూ తాలూకు పూర్తి పాఠమిదిగో!
విప్లవ ఋషి - విద్వాన్ విశ్వం
కన్నీటి నుడులెన్నో కూర్చి పెన్నేటి పాటగా తీర్చి/ రాళ్లలో మేల్కొల్పినావు రసదిగ్ధ భావామృతార్చి/ మాణిక్య వీణపై నీవు మత్యంగుళులు సాచినావు/ పదునైన లోకవృత్తాలు అదునెరిగి పలికించినావు అంటారు పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి విద్వాన్ విశ్వం గార్ని శ్లాఘించుతూ... నాటి సి.పి.ఐ.జాతీయ కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు మొదలు దాశరథి, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, మిక్కిలినేని, మాలతీ చందూర్, మహీధర రామ్మోహనరావు, ఏటుకూరి బలరామమూర్తి, వేలూరి శివరామ శాస్త్రి, తిరుమల రామచంద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ,దివాకర్ల వేంకటావధాని గార్ల విలువైన అభిప్రాయాలు విద్వాన్ విశ్వంగారి సాహితీ విరూపాక్షుణ్ని చూపిస్తాయి. అకాడెమీలు, సాహిత్య సంస్థలు, సాంసృతిక శాఖలు చేయాల్సిన మహత్తర పని సాహితీ పిపాసులైన సామాన్యులు ఈ బృహత్గ్రంథానికి సంపాదకత్వం (ప్రచురణ భారం) నెత్తికెత్తుకోవడం శ్లాఘనీయమైన అంశం. పీఠికలో అన్నట్లు విద్వాన్ విశ్వం గారిపై కనీసం 10-12 పి.హెచ్.డిలు చేయాల్సిన సాహితీ కృషి వుంది. ప్రాచీన కావ్యాలపై పట్టు వామ పక్ష భావజాలంతో రచనలు చేయగల కవులు అరుదుగా వుంటారు. శేషేంద్ర, దాశరథి వారి కోవకే చెందుతారు విద్వాన్ విశ్వంగారు కూడా. గోర్కీని ఎంత గొప్పగా ఆదరిస్తారో కాళిదాసు కవిత్వాన్ని, బాణుడి వచనాన్ని అదే స్థాయిలో ఆరాధిస్తారు. విశ్వం అనగానే గొప్ప సమన్వయం తారస పడుతుంది వీరి రచనల్లో. పాళీ భాషలో గుణాఢ్యుడు రచించిన 'కథాసరిత్సాగరం'ను సంస్కృతంలోకి సోమదేవ సూరి అనువదిస్తే దాన్ని 12 సంపుటాలుగా ఆంధ్రీకరించారు విద్వాన్ విశ్వ్వం. దీన్ని గొప్ప కాంట్రిబ్యూషన్గా చెప్పాల్సి వుంది. మీజాన్ పత్రిక నుండి టి.టి.డి ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిదాకా ఎన్నో ఎత్తులు ఎదిగిన విద్వాన్ విశ్వంగారి సాహితీ కృషిని ప్రధానాంశాలతో చక్కగా సంపాదకులు ఈ పుస్తకాన్ని రూపొందించారు. రసహృదయుల్ని అలరింపజేశారు.
బాణుడు సంస్కృతంలో రాసిన కాదంబరి తెలుగులోకి అనువదించిన సాహసీ, సాహితీవేత్తా విశ్వం గారు. రాయలసీమ కన్నీటి పాటే విశ్వంగారి పెన్నేటి పాట. దీన్ని తెలుగుసాహిత్యంలో సువర్ణ లిఖితంగా పేర్కొనాలి. ఈ కష్టజీవుల కన్నీటి పాట సీమాంధ్రలో ప్రచురణకు నోచుకోక పోతే 1956లో తెలంగాణా రచయితల సంఘం ప్రచురించడం దానికి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ పీఠిక రాయడం ఓ విశేషం. 1935లోనే వీరి విరికన్నె కావ్యాన్ని చిలుకూరి వారికి అంకితం ఇవ్వడం దగ్గరనుండి తెలుపు - నలుపు, మాణిక్యవీణ, సాహితీ వ్యాస సమీక్షలు... ఇలా... ఎన్నో... ఎన్నెన్నో... అంశాలు ఈ పుస్తకంలో సువాసనలు గుబాళించే గొప్ప అక్షర మాలగా యీ గ్రంథాన్ని సాహితీప్రియులకు అందించిన అబ్జ క్రియేషన్స్ ఎంతైనా అభినందనీయులు. శ్రీశ్రీ చేసిన ఇంటర్వ్యూ ఈ గ్రంథానికి ఓ హైలైట్. యాదాటి కాశీపతి, డా.అద్దేపల్లి వ్యాసాలు బాగున్నాయి. ప్రతికవి, రచయిత అధ్యయనం చేయాల్సిన కవుల్లో విద్వాన్ విశ్వం ఒకరు. అభ్యుదయ సాహిత్య ఆలోచనాపరుల కరదీపిక ఈ గ్రంథం.
- తంగిరాల చక్రవర్తి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి