...

...

5, జూన్ 2012, మంగళవారం

విద్వాన్ విశ్వం సాహితీ విరాట్ రూపం

రాజకీయ సాహిత్య సామాజిక రంగాల్లో అవిరళమైన కృషి చేసిన రాయలసీమ రత్నం - విద్వాన్ విశ్వం. అయితే ఆయన నిజాయతీ, నిబద్ధత కలిగిన సంపాదకుడిగా, 'పెన్నేటి పాట'వంటి గ్రంథ రచయితగా అసామాన్య కీర్తిమంతుడు. ఆధునిక పంచకావ్యాల్లో ఒకటొగా 'పెన్నేటి పాట' తెలుగు సాహిత్య చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందింది. విద్వాన్ విశ్వం సాహితీ విరూపాక్షుడు. ఆయన వ్యక్తిత్వం, సాహిత్య వ్యక్తిత్వం దర్పణంగా ఈ మంచి పుస్తకాన్ని వెలువరించారు అబ్జ క్రియేషన్స్ (హైదరాబాదు) వారు. ఆలోచనీయమైన, అధ్యయనావశ్యకమైన, విలువైన సమాచారగతమైన ఈ వ్యాస సంపుటికి సంపాదకత్వం వహించిన ప్రసిద్ధ రచయితలు డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్.

ఈ వ్యాస సంపుటిలో నాలుగు అధ్యాయాలున్నాయి. 'విశ్వజీవి'లో విశ్వంగారి జీవితాన్ని, సాహిత్యాన్ని, వారిపైగల అభిప్రాయాల్ని, వారితోగల పరిచయాల్ని వివరించే వ్యాసాల్ని పొందుపరిచారు. 'విశ్వరూపి'లో విశ్వంగారు నడిపిన శీర్షికలు తెలుపు - నలుపు, మాణిక్యవీణలతో పాటు మరికొన్ని వ్యాసాలున్నాయి. 'విశ్వభావి'లో రచయిత మాటలౌ, పీఠికలు, పుస్తక సమిక్షలూ వచ్చాయి. 'విశ్వమేవ'లో విశ్వంగారి సందేశాలు, ఇంటర్వ్యూలు వున్నై. మొదటి అధ్యాయంలో సాహితీ ప్రముఖులైన విశ్వనాథ, వేలూరి, దివాకర్ల, దాశరథి, ఆరుద్ర, అనంతకృష్ణశర్మ, మిక్కిలినేని, ఏటుకూరి బలరామమూర్తి, కల్లూరు అహోబలరావు, మహీధర రామ్మోహనరావు వంటి వారి వ్యాసాలు కాక నేటి లబ్ధప్రతిష్టులు అద్దేపల్లి, మాలతీచందూర్, వెలుదండ నిత్యానందరావు, నాగ్సూరి మొదలైన సాహితీపరుల వ్యాసాలున్నాయి. ఈ 20 వ్యాసాల్లోనూ విశ్వం గారి గురించిన ప్రశస్త విషయాలూ, విశేష విషయాలూ ఎంతో వివరణాత్మకంగా ప్రస్తావించబడినై. వీటిలోని సమాచారం ఈతరం పాఠకులకు ఎంతో స్ఫూర్తిదాయంగా వుంది. 

'విశ్వం జీవితమే ఆయనకొక దృక్కోణాన్ని అందించింది' అంటూ ఆ దృక్కోణం ద్వారా ఆయన రచనల్లో స్థూలంగా చెప్పిన అంశాల్లోని సూక్ష్మార్థాల్నీ, ఆయన సూక్ష్మంగా చెప్పిన వాటిల్లోని స్థూలార్థాల్నీ విశ్లేషణాత్మకంగా చెప్పారు - యాదాటి కాశీపతిగారు. ఈ అధ్యాయానికి నిండుతనాన్నీ, విశిష్టతనీ తెచ్చిన ఎంతో ముఖ్యమైన వ్యాసం వారిది. రాజకీయ, సాహిత్య, సామాజిక రంగాల్లో విశ్వం కృషికి దర్పణంగా వుందీ వ్యాసం.

అలాగే 'సమన్వయ మూర్తి విద్వాన్ విశ్వం' అనే తమ సమగ్ర వ్యాసంలో నాగసూరి వేణుగోపాల్ 'విశ్వంగారి ఆలోచనా సరళి, పాండితీ సమన్వయం, విశాల దృక్పథం, నేటి రచయితలకు, పాత్రికేయులకు ఎందుకు స్ఫూర్తిదాయకమో సోదాహరణంగా వివరించారు. తనదైన ప్రత్యేక వ్యాసరచనా విలక్షణతతో, ప్రణాళికతో - నాగసూరిగారి వ్యాసంలో కొండంత విశ్వంకి తన ప్రతిభాదర్పణం పట్టారు.


విశ్వంగారు నిర్వహించిన శీర్షికల్లో తెలుపు - నలుపు మాణిక్యవీణ వ్యాసాల్లో ఎన్నికగన్న వాటిని రెండో అధ్యాయంలో చేర్చారు. వీటన్నిటా విశ్వంగారి ప్రతిభావ్యుత్పత్తి ద్యోతకమవుతూ వున్నై. అన్నిటా సమాజం గుండె చప్పుళ్లని విశ్వంగారు విని, సంవేదనాత్మకంగా, ఆలోచనీయంగా పాఠకులకు వినిపించిన విధానానికి అబ్బురం కలుగుతుంది. ఆనాటికి వర్తమాన సామాజికాంశాల్ని వారు గవేషించిన తీరుకి ఆశ్చర్యపోతాము. ఉదాహరణకు 1.12.70 నాటి మాణిక్యవీణ వ్యాసం ఇలా మొదలవుతుంది. 'అనుభవిస్తున్నప్పటి తీవ్రతను ఏ బాధ అయినా తర్వాత గోల్పోతుంది/ నడుస్తున్నప్పుడు  పడిన వేసట గమ్యం చేరుకున్న తర్వాత మఱుగున పడిపోతుంది/ సరికొత్త తరం వారికి తెలంగాణా అలనాటొ రూపు ఎంత ఊహించుకున్నా కానరాదు/ పాతతరం వాఇకైనా అప్పటి అనుభవాలు కొన్ని పరగడుపున బడిపోవడం సహజం. ఆ తర్వాత ఆయా విశేషాల్ని చదువుతాము.' ఇదీ విశ్వం శైలి. ఈ శైలిలో పఠితని ఒక మూడ్‌లోకి లాక్కొచ్చే గుణంతో పాటు, రచనని చదివించే గుణాన్ని సమకూర్చే నేర్పూ గోచరిస్తుంది.

మూడవ అధ్యాయం 'విశ్వభావి'లో విశ్వంగారు రాసిన పీఠికలు, సమీక్షలు ఉన్నాయనుకున్నాం. వీటిలో రంగనాయకమ్మ నవల 'కళ ఎందుకు?'కు రాసిన 'ఆముఖం' - విశ్వంగారి రచనలోని వొంపు వాటాల్నీ, ఎత్తుపల్లాల సొబగుల్నీ; అక్షరంతో చదువరి గుండెని తాకే పదశక్తినీ తెలుపుతుంది. తెలుగు వచన రచనలోని సరళత్వాన్నీ, సరసత్వాన్నీ, గాఢతనీ, సాంద్రతనీ - ఒక్కచోట చూసి చదివి ఆనందించే అదృష్టాన్నిస్తుందీ 'ఆముఖం'. అదే సందర్భంలో ఎంతో పదునైన భావజాలాన్ని విసిరి ఆలోచనా ప్రేరకంగా నిలుస్తోంది.




నాలుగో అధ్యాయంలోని ఇంటర్వ్యూల్లో విశ్వంగారి నిర్భీతీ, నిబద్ధతా, లోకజ్ఞతా, సాహిత్య విజ్ఞతా - అన్నీ పారదర్శకంగా కనిపిస్తాయి. 'జానపద కవిత్వమెంత సజీవంగా వుందో, అదే విధంగా పురాణ కవిత్వం కూడా నేటికీ నిలిచే వున్నది. దానికి కారణం రెండింటిలోనూ వున్నటువంటి రసస్ఫోరకత్వమే' అన్నవారి ప్రకట దీనికి ఒక ఉదాహరణ.

ఈ పుస్తకం సంపాదకులిద్దరూ ఒక కష్టసాధ్యమైన పనిని జయప్రదంగా పూర్తిచేశారు. విద్వాన్ విశ్వం వ్యక్తి జీవితంలోనూ, సాహిత్య వ్యక్తిత్వంలోనూ వున్న బహువిధ పార్శ్వాల్నీ, బహుముఖ కోణాల్నీ తెలుసుకునే అవకాశాన్ని తెలుగు పాఠకులకందించి సాహితీలోకానికి గొప్పమేలు చేశారు. అభినందనీయులు!!
                                                                                               -విహారి

(పాలపిట్ట జూన్ 2012 సంచికలో ప్రచురితం)

    

కామెంట్‌లు లేవు: