...

...

29, జనవరి 2013, మంగళవారం

'చినుకు'లో సమీక్ష!


విశ్వజీవి విద్వాన్ విశ్వం
- ఎం.ఆర్.వి.సత్యనారాయణమూర్తి


బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వంపై విలువైన సమాచారంతో కూడిన పుస్తకాన్ని పాఠకులకు అందించిన సంపాదకుల్ని ముందుగా అభినందించాలి. విశ్వంగారు లెక్కలేనన్ని పుస్తకాలు రాసినా తెలుగు సాహితీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన విశ్వం కావ్యం 'పెన్నేటి పాట'.

రాయలసీమ ప్రజల కష్టాల్ని చూసి కన్నీటి సంద్రమైన మానవతావాది విశ్వం. ఇరవై ఒక్కమంది ప్రముఖులు విశ్వంగారి జీవితాన్ని, సాహిత్యాన్ని పరిశీలించి రాసిన వ్యాస సంపుటి 'సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం' అనే గ్రంథం.

తరతరాలుగా బహుముఖ పాండిత్య ప్రతిభ కల్గిన కుటుంబంలో జన్మించిన విశ్వం కలం నుండి జాలువారిన కందాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి. ఆయన రచనలో సర్వమానవ సౌహార్ధం ఏర్పడాలన్న కాంక్ష బలీయంగా కన్పిస్తుంది.

'కవి యొక్క రచనా పద్ధతిని బట్టి వాని జీవితమును నిర్ణయించలేమ'ని విశ్వనాథ సత్యనారాయణ వ్యాసంలోని వాక్యాలని ఆరుద్ర 'మేఘ సందేశం - విద్వాన్ విశ్వం' లో ఖండిస్తారు. శిల్ప లక్షణాలు వేరు, జీవితం వేరు అనే సిద్ధాంత ప్రచారం కేవలం అద్వైతులకే చెల్లిందని చురక వేస్తారు. విశ్వం శిల్ప లక్షణాలు జీవితానికి భిన్నమైనవి కావని ఆరుద్ర నొక్కి చెప్పారు. విశ్వం 'రాయలసీమ మించుల సితారు పచ్చల బజారు' అన్న ఆర్తి నిదానంగా వ్యాపించడం విశేషం.

ప్రకృతి చూపే నిర్దయతో ఆధిపత్య వర్గాలు చేసే అన్యాయాలతో, ఎడతెగని కరవులతో నిండిన రాయలసీమ పరిస్థితిని 'పెన్నేటిపాట'లో దర్శించవచ్చని, ఎంతో బలంగా, సామాజిక ఆవేదనతో రచించబడ్డ కావ్యం పెన్నేటి పాట అని అద్దేపల్లి తన వ్యాసంలో పేర్కొన్నారు.

మాతంగకన్య  హస్త పద్మంలోంచి ఆ మాణిక్య వీణను అంది పుచ్చుకొని అపూర్వ వాద్య మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని చిరకాలం నుంచి అలరింపచేస్తున్న విద్వత్కవి విశ్వంగారని పిలకా గణపతి శాస్త్రి అభినందించడం విశేషం.

వ్యావహారిక భాషలో గంగా ప్రవాహంగా సాగే విశ్వంగారి అనువాదం తననెంతో ఆకట్టుకునేదని ఏటుకూరి బలరామమూర్తి అంటే, రచయితలనీ, రచయిత్రులనీ ప్రోత్సహించి వారి ఎదుగుదలకు సహకరించిన విశాల హృదయుడు విశ్వంగారని మాలతీచందూర్ కొనియాడారు.

'విద్వాన్ విశ్వం మీటిన మాణిక్యవీణ' పేరుతో వెలుదండ నిత్యానందరావు రాసిన వ్యాసం ('చినుకు'లో ప్రచురితం) పాఠకుడ్ని ఆలోచింపచేస్తుంది. 'మాణిక్యవీ'లో ప్రస్తావించిన వివిధ అంశాలను వ్యాసకర్త సందర్భోచితంగా వివరించిన తీరు బాగుంది. ముప్పయ్ ఏళ్ళకి పైగా ఒక విశిష్టమైన కాలమ్‌ని సమర్థవంతంగా నడిపిన ధీశాలి విశ్వం అని కితాబునిస్తూ, ఇంతటి విలువైన మాణిక్యవీణల్ని పుస్తకరూపంలో ఎవరూ తేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు.

'సమన్వయమూర్తి విద్వాన్ విశ్వం' అన్న వ్యాసంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ విశ్వంగారిని పత్రికా రచయితగా ఆయన సాధించిన విజయాన్ని స్పర్శించారు. వాదాలతో గిడసబారి పోయే ప్రస్తుత పరిస్థితిలో విద్వాన్ విశ్వంగారి విశాల దృక్పథం నేడు వాంఛనీయమన్నది అక్షరసత్యం.

సాహిత్యాభిమానుల గుండెల్లో స్థిరుడైయున్న విశ్వంగారి ఆలోచనా సరళి, పాండిత్యం, విశాలభావాలు మరింతగా తెలుసుకోవడానికి ఈ వ్యాస సంపుటి ఎంతో ఉపకరిస్తుంది.

(చినుకు మాసపత్రిక జనవరి 2013 సంచికలో ప్రచురితం)

కామెంట్‌లు లేవు: