...

...

13, అక్టోబర్ 2013, ఆదివారం

వైశ్వనాథము వివాదాలమయమూ...

   
       పళ్ళున్న చెట్టుకే రాళ్ళదెబ్బలు అని సామెత. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కీర్తిశేషులు కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని అభిమానించే వారున్నట్టే విమర్శించేవారు కూడా వున్నారు. 60వ దశకంనుండీ విశ్వనాథ రచనలపై వాదవివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లు చాలాకాలం కొనసాగింది. ఇటీవలి కాలంలో మళ్లీ బ్లాగుల్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ విశ్వనాథ సాహిత్యంపై విశ్లేషణలు మొదలు కావడంతో పాత సంగతులను తిరగ తోడుతున్నాను కాస్త కాలక్షేపమవుతుందని. ఇక్కడ వెలువరిస్తున్న అభిప్రాయాలేవీ నా స్వంతం కాదని గుర్తించమనవి.

           1. 1961 జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు భారతి సంచికలలో కొత్త సత్యనారాయణ చౌదరి అనే ఆయన విశ్వనాథ విశ్వామిత్రసృష్టి, విశ్వనాథ వైలక్షణ్యము, విశ్వనాథ - ప్రయోగ వైలక్షణ్యము, మరో రెండు వ్యాసాలూ వరుసగా ప్రకటించారు. అంతకు ముందు బందరు నుండి వెలువడే తెలుగువిద్యార్థి పత్రికలో కూడా రామాయణ కల్పవృక్ష కావ్యపరిశీలన గావించారు.  రామాయణ కల్పవృక్షం కావ్యంపై తొలి విమర్శాపరంపర ఈ వ్యాసాలు.

          కల్పవృక్షములో ఆడ-మగ పాత్రలు ముప్పాతిక మువ్వీసం విశ్వనాథ మనోవృత్తికి సూటిగా సరిపోయిందంటారు చౌదరిగారు. ప్రత్యేక ముద్ర పొందిన ఆ పాత్రలలో విశ్వామిత్ర పాత్రను తీసుకుని వాల్మీకి సృష్టించిన విశ్వామిత్రునికి, వైశ్వనాథ విశ్వామిత్రునకీ వున్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపారు. "ఈ విశ్వనాథుని విశ్వామిత్రుడొక దొంగ సన్నాసి. ఆ చూపులు - ఆ నవ్వులు, ఆ దెప్పిళ్లు - ఆ దాగుడు మూతలు ఆ వెకలి నవ్వులు రోత వేయుచున్నవి. ఇక్కడ అక్షరాల కవీశ్వరుని తత్త్వమే విశ్వామిత్రపాత్రలో దూరి యింత పని చేసెనేమోయని స్ఫురించుచున్నది.ఈ కావ్యమునకు విశిష్టత మాట ఎట్లున్నను, బంగారు వంటి బ్రహ్మర్షి, మహామేథావి, మహా తేజస్వి  అయిన విశ్వామిత్రుడు, వట్టి భ్రష్టుడై, వెకిలియై, టక్కరియై అసభ్య ప్రవర్తనముచే నవ్వులపాలయ్యెనని " అంటారు. ఇంకా కల్పవృక్షంలోని న్యూనోపమల్ని, అనుచిత అసంబద్ధ పద ప్రయోగాల్నీ చర్చించారు. మేనకా దుష్యంతుల శృంగార ఘట్టాన్ని వర్ణించిన పద్యాలనే కొన్ని కొన్ని మార్పులు చేసి  సీతారాముల శృంగార వర్ణనలో సైతం అప్పుతెచ్చుకున్నారని ఆక్షేపిస్తారు. గ్రాంథికమని పేరుపెట్టుకొనిన కావ్యంలో గొబ్బరికాయలు, బునాదులు, గానుగ పుల్లలు వంటి పరుషాది పదములను శిష్టులంగీకరింపరని కొత్త సత్యనారాయణ చౌదరిగారి అభియోగం. ఇంకా కల్పవృక్షములోని వింతప్రయోగములను, నిరర్థక, అప్రయుక్త, క్లిష్ట, పరుష, గ్రామ్య, ప్రక్రమభంగ, వచన వ్యత్యాస, వైరి సమాస, విరుద్ధ, విపరీత థీప్రద, పతత్ప్రకర్ష, వ్యాకీర్ణాది దోషాలను ఎత్తి చూపారు. 

           2. 1961 అక్టోబరు 15 విజయదశమినాడు చెన్నపురి ఆంధ్ర మహాసభ వారు విశ్వనాథ సత్యనారాయణగారిని సన్మానించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ "నామీద ఒక ప్రఖ్యాత పత్రికలో విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు వ్రాస్తున్నవారు పండితులే. ప్రచురిస్తున్న వారు పండితులే. అయితే ఈ విమర్శలు ఎంతవరకు సమంజసం, ఎంతవరకు నిలుస్తాయి అని వారు ఆలోచించడంలేదు. విద్వాంసులైనవారే ఇలా ఎందుకు చేస్తున్నారో బోధపడకుండా ఉంది. అసలు ఇలా చేయడం భావ్యమా? న్యాయమా? ఇది భాషాద్రోహం కాదా? సాహిత్యానికి తీరని అపచారం కాదా? ఈపని భారతి పత్రిక మర్యాదకు తగునా? నేను పెద్దవాణ్ణి అయ్యాను. బహుశా ఎంతోకాలం జీవించను. నాపైన కోపంవుంటే పిస్తోలుతో కాల్చవచ్చునే. మేడ మీద ఒంటరిగా పడుకుని ఉంటాను. చిన్న సల్ఫ్యూరిక్ యాసిడ్‌బుడ్డి విసిరితే చాలునే కోపం తీర్చుకొనడానికి. అలా చేయక ఇలా చేయడం ఎందుకు. నేను తప్పులు వ్రాయలేదని అనను. కాని, పత్రికలో చూపించినవి మాత్రం, దోషాలు కావని సంస్కృతంలో ఎ,బి,సి,డీలు వచ్చిన వాడైనా చెప్పగలడు. అయినా భారతి వీనిని ప్రచురిస్తూ ఉంది. భారతి ప్రసిద్ధి, స్థాయి ఇదివరకే పోయింది. ఇప్పటి దాని స్థితి వీనిని బట్టి తెలుస్తున్నది. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించవలదని ఆ పత్రికవారికి విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ తన ఆవేదనను తెలియజేశారు.  అదే సభలో శ్రీశ్రీగారు మాట్లాడుతూ విశ్వనాథవారి గురువుగారైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రుల వారు ద్రాక్షాపాకంలో రచనలు సాగించగా విశ్వనాథ సత్యనారాయణగారు పాషాణపాకంలో వ్రాస్తారని ఆరోపించారు. తనకు సంస్కృతం రాకపోయినా, వాల్మీకిరామాయణం చదివితే అర్థమయినట్టే ఉంటుందని, కాని విశ్వనాథవారు వ్రాసిన రామాయణం చదివితే తనకు తెలుగు బాగా వచ్చినా ఏమీ అర్థం కాదనీ, అలా ఎందుకు వ్రాయాలనీ ప్రశ్నించారు. అంతకు ముందు యామిజాల పద్మనాభస్వామి ప్రసంగిస్తూ విశ్వనాథపై వస్తున్న విమర్శలకు సమాధానాలు తాము వ్రాయగలమని శపథం చేశారు.  

            3. ఈ సన్మానం తరువాత చాలా చర్చ జరిగింది. అవన్నీ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వచ్చింది. ఈ చర్చనంతటినీ భారతి 40 పేజీల అనుబంధంగా 1962జనవరిలో తీసుకువచ్చారు. చాలామంది పండితులు ఈ చర్చలో తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. విశ్వనాథ సత్యనారాయణ, కొత్త సత్యనారాయణ చౌదరి, శ్రీశ్రీలే కాకుండా ఈ చర్చలో ఆవుల గోపాలకృష్ణమూర్తి,సి.కనకాంబరరాజు,కె.లక్ష్మీనారాయణ, కాదంబరి వెంకటరత్నం, ఎన్.టి.పి.వి.రామానుజాచార్యులు, వక్కలంక రామారావు,వావిలాల రామమూర్తి, తుమ్మల సీతారామమూర్తి, జంధ్యాల వెంకటేశ్వర్లు, ధూళిపాళ శ్రీరామమూర్తి, శాంతిశ్రీ, శనగపల్లి సుబ్బారావు, పి.శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, స.ధర్మారావు, మోచర్ల కౌస్తుభమణి, జి.వి.కె.ఎన్ మూర్తి,వి.కస్తూరి, ఆలపాటి వరదయ్య మొదలైన వారు పాల్గొన్నారు. కొంతమంది విశ్వనాథ పక్షం వాదించగా, మరికొంతమంది వ్యతిరేకంగా వాదించారు. కొందరు పండితుల సమక్షంలో సభ ఏర్పాటు చేసి కల్పవృక్షంలోని గుణదోషాలపై నిర్ణయించాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. కొంతమంది హేళన చేశారు. అయితే ఒకరు చేసిన ఈ వ్యాఖ్య గమనిచదగింది. "అసలు చర్చ ఇంత రభసగాను, రగడగాను తయారవడానికి రామాయణ కల్పవృక్ష విమర్శ నిమిత్త మాత్రమయిందిగాని అసలు ఈ కచ్చకు మూలకందము వేరే ఉన్నది. అది విశ్వనాథవారు చేసే ప్రసంగాలు, వారి శిష్యులు చేసే ప్రచారము, సాహిత్య రంగంలో వారంటే ఉన్న ప్రాతికూల్యం, దాలిగుంటలో నిప్పులాగా ఇన్నాళ్ళు రాజుకుంటూ,రాజుకుంటూ ఉంది. అది ఇవ్వాళ భగ్గుమని లేచింది. విశ్వనాథ వారు నన్నయ,తిక్కనలతో సమానులేకాక, వారికంటే కూడా ఘనులని వారి శిష్యకోటిలో కొందరు ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఎవరన్నా కాదంటే కొట్టడానికి వస్తారు. విశ్వనాథవారు కూడా స్వయంగా అది నమ్ముతారు."

        4. తరువాత దాలిగుంటలోని నిప్పు 1980లో మరోసారి భగ్గుమంది. దాని గురించి తరువాత వ్రాస్తాను.           
   


కామెంట్‌లు లేవు: