సగటున 150 పేజీలతో వెలువడిన ఒక సాహిత్య మాసపత్రికతో పన్నెండు పుటల ఒక రాజకీయ వారపత్రికను సరిపోల్చడం చాలామందికి అసంబద్ధంగా తోచవచ్చు. కానీ శ్రీసాధనపత్రిక తన ప్రాంతంలో కలిగించిన రాజకీయ చైతన్యంతోపాటు ఆకాలంలో ఆ పత్రిక చేసిన సాహితీ కృషి మాత్రం ముమ్మాటికీ భారతితో పోల్చదగినదే. 1926లో పప్పూరు రామాచార్యుల సంపాదకత్వంలో ప్రారంభమైన ఈ పత్రిక వావిలాల గోపాలకృష్ణయ్య, సర్దేశాయి తిరుమలరావు, ఆచార్య ఎన్.జి.రంగా, తిరుమల రామచంద్ర, ఐదుకల్లు సదాశివన్ వంటి ఎందరో ప్రముఖుల మన్ననకు పాత్రమైంది. రాయలసీమలో అనేక ఆధునిక సాహిత్య ప్రక్రియల వికాసానికి పట్టుకొమ్మగా నిలిచిన శ్రీసాధన పత్రిక సంచికలను ప్రెస్ అకాడెమీకానీ, విశ్వవిద్యాలయాలు కానీ, రాజ్యాభిలేఖా గారము కానీ భద్రపరచలేక పోయి ఈ తరం సాహిత్యాభిమానులకు, పరిశోధకులకు తీవ్రమైన అన్యాయం చేశాయి. యువ పరిశోధకుడు డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఈ పత్రిక పాతసంచికలను అనంతపురం లలితకళాపరిషత్‌లో వున్న గ్రంథాలయంలో గుర్తించి శిథిలావస్థలో ఉన్న వాటిని ఎంతో శ్రమకోర్చి ఎత్తి వ్రాసుకుని ఈ పత్రికను మళ్ళీ వెలుగులోనికి తెచ్చాడు.
శ్రీసాధన పత్రికలో ప్రచురింపబడిన కవిత్వం, కథలు, స్కెచ్‌లు, నాటికా సాహిత్యం, లేఖాసాహిత్యం, యాత్రా చరిత్రలు, పుస్తక విమర్శలు, పుస్తక పరిచయాలు, సాహిత్య విమర్శావ్యాసాలు, చారిత్రక వ్యాసాలు మొదలైన వాటినన్నీ వివరిస్తూ విశ్లేషిస్తూ డా.అప్పిరెడ్డి వ్రాసిన వ్యాసాల సంకలనం ఈ 'సీమసాహితీ స్వరం శ్రీసాధన పత్రిక'. జాతీయోద్యమం, సంఘసంస్కరణ, ప్రజల జీవన స్థితిగతులు, కరువులు, క్షామనివారణ, సాగునీటి సమస్యలు, సహకారోద్యమం,స్వదేశీ వస్త్ర ఉద్యమం, స్త్రీవిద్య, వితంతు సమస్యలు, సామ్యవాద సిద్ధాంతము, మానవీయ సంబంధాలు, ఓట్ల రాజకీయాలు, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలు మొదలైన ఎన్నో విషయాలపై ఈ పత్రికలో వెలువడిన సాహిత్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది. ఇంకా ఈ పత్రికలో వచ్చిన ప్రకటనలు, వార్తల ఆధారంగా ఆ సమయంలో వెలువడిన పుస్తకాలు, నాటక ప్రదర్శనలు, సాహిత్య సంస్థల కార్యకలాపాలు, సమకాలీన పత్రికల వివరాలు విపులంగా తెలిపాడు రచయిత. సుగాత్రీ శాలీనుల లేఖాసంవాదము, భవానీ లేఖలు, కోమలి లేఖలు, ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు వంటి చాలా ఆసక్తిని కలిగించే అంశాలు ఈ పత్రికలో చోటుచేసుకున్నాయి.
శ్రీసాధన పత్రిక సంపాదకులు, దాని పాఠకులు ఎంతటి నిష్పాక్షికమైన, నిర్భయమైన, ఘాటైన విమర్శలు చేసేవారో ఈ క్రింది ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది.
1.కనపర్తి వరలక్ష్మమ్మ దత్తమండలాలలో తను పరిశీలించిన అంశాలను వివరిస్తూ గృహలక్ష్మిలో వ్రాసిన వ్యాసానికి ఈ పత్రిక ఇలా స్పందించింది. 'ఈ వాక్యాలలో స్త్రీల అభివృద్ధికి పనికొచ్చు ముక్క యొక్కటిలేదు. దత్తమండలంవారి దారిద్ర్యము నెత్తి పొడుచుటయు వారి భాష తెలుగు కాదనుటయు నిందలి యుద్దేశ్యము. ఆంధ్రవిశ్వవిద్యాలయ కార్యస్థాన ప్రచారమావిధముగా కూడా సాగుచున్నది. వ్యాసకర్తిణి శ్రీమతి వరలక్ష్మమ్మగారు దత్తమండలములో నేభాగమునో మంచమునకు నోచని హీనజాతివారి సంబంధమునెరింగియుండవలయును.'
2. అనంతపురంలో ప్రదర్శింపబడిన రంగూన్‌రౌడీ అనే నాటకంపై ఒక పాఠకుని విమర్శ. 'రంగూన్ రౌడి పాత్రధారి శ్రీ వేమూరి గగ్గయ్య తానొక గొప్ప యాక్టరునని, సినిమా నటుడనని తానేమి చేసిననూ చెల్లునను భావం ప్రతి వాక్కునందును, చర్యయందును స్ఫురించుచుండెను. వారి అభినయము కళకు, రసమునకు దూరమై కేవలము మెకానికల్‌గా నుండెనన్న అతిశయోక్తి కాదు. అన్నపూర్ణ పాత్ర పోషించిన శ్రీమతి పసుపులేటి కన్నాంబ ఏడ్పంతయూ పాటలోనే ఏడ్చిరి. సినిమాలలో పాడుటకు యవకాశములు తక్కువగుటచే ఆలోపమును ఈ మూలముగా భర్తీ పెట్టుకొనతలచి నట్లుండెను. పాటపాడు నపుడు కన్నాంబగా, మాట మాట్లాడినపుడు అన్నపూర్ణగా ఆ పాత్ర తుదివరకు పోషించినది. ప్రభావతి పాత్ర ధరించిన శ్రీమతి ఋష్యేంద్రమణి గాత్రము మాత్రమే మిగిలినది. పాత్ర ప్రదర్శన, భావప్రకటన పూర్తిగా నశించింది. అద్దెకు తెచ్చుకున్న మసిగుడ్డలు, పరదాలు ఇట్టి పరికరములు పాత్రలతో శ్రీరాజరాజేశ్వరీ నాట్యమండలివారు క్షామ నిలయమైన మా రాయలసీమను దోచుకొనుచున్నారు. కానీ సహజ సంగీతాభిమానులైన ఈ రాయలసీమవాసులు వారిని పోషించుచున్నారు. మరియు గొప్ప సినిమా యాక్టర్లని పామరజనులు ముగ్ధులై తమ కష్టార్జితమును వీరిపాలు చేసి పశ్చాత్తాప పడుతున్నారు.'
ఈ పత్రికలో బేవినహళ్ళి కరణం కృష్ణారావు, కిరికెర రెడ్డి భీమరావు, విద్వాన్ విశ్వం, తలమర్ల కళానిధి, బత్తలపల్లి నరసింగరావు, శొంఠి శ్రీనివాసమూర్తి, చిలుకూరు నారాయణరావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, కల్లూరు అహోబలరావు, కుంటిమద్ది శేషశర్మ, పి.ఎస్.ఆచార్య, కందాళ శేషాచార్యులు, హెచ్.నంజుండరావు, టి.శివశంకరపిళ్ళె, రాళ్లపల్లి గోపాలకృష్ణ శర్మ, కలచవీడు శ్రీనివాసాచార్యులు, జనమంచి సుబ్రహ్మణ్య శర్మ, జనమంచి శేషాద్రిశర్మ, బళ్ళారి రాఘవాచార్యులు, ఎస్.రాజన్న కవి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు మొదలైన ఎందరో సీమరచయితల రచనలు వెలుగుచూశాయి.
ఈ పత్రికలో బేవినహళ్ళి కరణం కృష్ణారావు, కిరికెర రెడ్డి భీమరావు, విద్వాన్ విశ్వం, తలమర్ల కళానిధి, బత్తలపల్లి నరసింగరావు, శొంఠి శ్రీనివాసమూర్తి, చిలుకూరు నారాయణరావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, కల్లూరు అహోబలరావు, కుంటిమద్ది శేషశర్మ, పి.ఎస్.ఆచార్య, కందాళ శేషాచార్యులు, హెచ్.నంజుండరావు, టి.శివశంకరపిళ్ళె, రాళ్లపల్లి గోపాలకృష్ణ శర్మ, కలచవీడు శ్రీనివాసాచార్యులు, జనమంచి సుబ్రహ్మణ్య శర్మ, జనమంచి శేషాద్రిశర్మ, బళ్ళారి రాఘవాచార్యులు, ఎస్.రాజన్న కవి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు మొదలైన ఎందరో సీమరచయితల రచనలు వెలుగుచూశాయి.
ఈ పత్రిక పప్పూరు రామాచార్యులు మరణించే(1972)వరకూ వెలువడినదని ఈ పుస్తకంలో ఉంది. కానీ ఆ తరువాత కూడా ఈ పత్రికను రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు కొంత కాలం నడిపాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ పత్రిక మరి కొంతకాలం నడిచి ఆగిపోయింది. ఈ పత్రికను నేను 1978-80 మధ్యకాలంలో చదివినట్టు గుర్తు. విద్వాన్ విశ్వం 1938-39లో ఈ పత్రికలో విశ్వభావన అనే శీర్షిక నడిపాడని తెలుస్తున్నది. కానీ ఆ సమాచారం ఈ పుస్తకంలో లేదు. మొత్తం మీద డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి శోధించి వెలువరించిన ఈ పుస్తకం ద్వారా శ్రీసాధన పత్రిక మళ్ళీ సాహిత్యాభిమానులకు చేరువైనట్లయ్యింది. ఇప్పటికైనా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు కానీ, ప్రభుత్వం కానీ చొరవ చూపి ఈ పత్రికను స్కాన్ చేసి అంతర్జాలంలో అందరికీ అందుబాటులో లభించేటట్లు చూడాలి.
[పుస్తకం పేరు : సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక, సంపాదకుడు :డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పుటలు :268, వెల:రూ200/- ప్రతులకు: శ్రీమతి జెన్నె(ఎం)మాణిక్యమ్మ పబ్లికేషన్స్,రెండవ అంతస్తు,రూమ్ నెం.7, మహమ్మద్ కాంప్లెక్స్,ఉపాధ్యాయ భవన్ ఎదురుగా, ఆదిమూర్తి నగర్,అనంతపురము 515 001]
[పుస్తకం పేరు : సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక, సంపాదకుడు :డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పుటలు :268, వెల:రూ200/- ప్రతులకు: శ్రీమతి జెన్నె(ఎం)మాణిక్యమ్మ పబ్లికేషన్స్,రెండవ అంతస్తు,రూమ్ నెం.7, మహమ్మద్ కాంప్లెక్స్,ఉపాధ్యాయ భవన్ ఎదురుగా, ఆదిమూర్తి నగర్,అనంతపురము 515 001]
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి