ఇది
కొత్తగా నేను పరిశోధించి వ్రాస్తున్నదేమీ
కాదు. ఇదివరకే అనంతపురం జిల్లా గ్రామాల పేర్లు పుట్టుపూర్వోత్తరాల గురించి చిలుకూరి నారాయణరావు, ఆదవాని హనుమంతప్ప, సర్దేశాయి తిరుమలరావు మొదలైనవారు శ్రీసాధనపత్రిక, భారతి మొదలైన
వాటిలో వ్యాసాలు వ్రాశారు. చర్చలు చేశారు. ఇది వాటి పునశ్చరణ
మాత్రమే. ఈ
గ్రామాల పేర్ల
వ్యుత్పత్తి తెలుసుకొంటే అనేక ఆసక్తికరమైన విషయాలు
తెలుస్తాయి. అయితే ఈ వ్యాసంలో
అనంతపురం జిల్లాను పరిపాలించిన ప్రభువులు వారి పరివారం పేరు
మీదుగా ఏర్పడిన వూర్ల పేర్లకు మాత్రమే
పరిమితమవుతున్నాను.
క్రీస్తు
పూర్వం 3వ శతాబ్దం నుండే
ఈ ప్రాంతంలో జనావాసాలున్నట్లు ఎర్రగుడి అశోకుని శాసనాలవల్ల తెలుస్తున్నది. అశోకుని కాలం నుండి క్రీస్తు
శకం 7వ శతాబ్దంలో ఈ
ప్రాంతాన్ని పరిపాలించిన నోలంబుల వరకు ఇక్కడి చరిత్ర
లభించడం లేదు. నోలంబుల తరువాత
గాంగులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.
ఈ గాంగుల పేరుమీద గంగలకుంట, గంగంపల్లి, గంగాదేవిపల్లి, గంగినేపల్లి మొదలైన గ్రామాలున్నాయి. గాంగ
వంశీకుడైన మారసింహుని పేరుతో
మరూరు, మరుట్ల మొదలైన గ్రామాలు వెలిసాయి.
గాంగుల
తర్వాత ఈ ప్రాంతాన్ని చోళులు
పరిపాలించారు. చోళసముద్రం, చోళేమర్రి, చౌళూరు మొదలైన ఊర్ల పేర్లు చోళ
రాజుల వల్ల ఏర్పడినవి. తరువాత
పడమటి చాళుక్యులు ఈ ప్రాంతాన్ని ఆక్రమించారు.
గుత్తికోటను 6వ విక్రమాదిత్యుడైన త్రిభువనమల్ల
విక్రమాదిత్యుడు క్రీ.శ.1076-1126ల
మధ్య పరిపాలించినట్లు శాసనాలు వెల్లడిస్తున్నాయి. ఇతని పేరుమీద మల్లాపురము,
మల్లాగుండ్ల, మల్లాకాల్వ, మల్లాపల్లి, మల్లేనిపల్లి, మల్లేపల్లి మొదలైన గ్రామాలు వెలిసాయి. తరువాత
12వ శతాబ్దంలో హొయసలులు గుత్తి పరిసర ప్రాంతాలను ఏలారు.
గుత్తిని జయించిన వీరబళ్ళాలుని(1191-1253) పేరిట వీరాపురము ఏర్పడింది.
తరువాత రాజులు యాదవులు. యాదవరాజైన సింగన్న (1210-1247) పేరుమీద శింగనమల, శింగవరము , యెఱ్ఱశింగేపల్లి మొదలైన గ్రామాలున్నాయి.
ఆ
తర్వాత ఈ ప్రాంతం ఓరుగల్లు
కాకతీయుల ఏలుబడిలో కొంతకాలముంది. రాణీ రుద్రమ్మ పేరుతో
రుద్రంపేట ఈ జిల్లాలో ఉంది.
ఆ తర్వాత మహమ్మదీయులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు.
పిమ్మట ఈ నేల విజయనగర
రాజుల వశమయ్యింది. బుక్కరాయల పేరిట బుక్కపట్టణం, బుక్కాపురం,
బుక్కరాయసముద్రం అనే ఊళ్లు
వెలసినాయి.
బుక్కరాయల
మంత్రి పేరు అనంతరుసు. ఇతని
పేరుమీద ఈ జిల్లా ముఖ్య
పట్టణము అనంతపురంతో పాటు అదే పేరు
గల మరో రెండు ఊళ్లు
(మడకశిర, గుత్తి సమీపంలో), రాళ్ళ అనంతపురం అనే
మరో ఊరు ఉన్నాయి. జిల్లా ముఖ్యపట్టణమైన అనంతపురం మొదటి పేరు అనంతసాగరం
అదే క్రమేణా అనంతపురంగా మారింది. బుక్కరాయలకు అనంతమ్మ అనే భార్య ఉన్నట్లు
ఆమె పేరుమీద అనంతసాగరమేర్పడినట్లు ఒక వాదన ఉంది.
కానీ పరిశోధకుడు చిలుకూరి నారాయణరావు బుక్కరాయల భార్యపేరు దేమాంబ అని నిర్ధారించినారు. బుక్కరాయని
కొడుకు వీరవిరుపణ్ణ పెనుకొండ సామంతరాజుగా ఉన్నాడు. అతని పేరుమీద విరుపాపురము
ఉంది. ప్రౌఢదేవరాయపురం
(ఈనాటి వేములపాడు), దేవరాయపురం (నేడు కల్లూరుగా పిలువబడుతున్నది)
ప్రౌఢదేవరాయని పేరుమీద వెలువడిన గ్రామాలు.
కృష్ణదేవరాయలకు
ముందు పాలించిన నరసనాయకుని పేరిట ఈ జిల్లాలో
నాలుగు నరసాపురములున్నాయి. ఇక కృష్ణదేవరాయల పేరుతో
రెండు కృష్ణాపురములు, క్రిష్టిపాడు మొదలైన గ్రామాలున్నాయి. కృష్ణదేవరాయల కాలమునాటి బంగారు తిమ్మరాజు పేరిట నాలుగు తిమ్మాపురములున్నాయి.
సదాశివరాయని ప్రతినిధి అయిన రామరాజు పేరిట
రామగిరి, రామరాజుపల్లి, మూడు రాంపురములు
ఏర్పడ్డాయి. తిరుమలదేవరాయని పేరుతో తిరుమలదేవరాయపురం వెలిసింది.
ఆరవీడు
వంశపు రాణులపేరుతో వెంకటాంపల్లి, వెంగలమ్మ చెఱువు, నాగసముద్రం అనే గ్రామాలు ఉన్నాయి.
ఆరవీడు పేరుతో ఒక గ్రామం తాడిపత్రి
సమీపంలో ఉంది. శ్రీరంగరాజు
పేరుతో శ్రీరంగాపురమున్నది. వెంకటరాయలు పేరుతో వెంకటరాయనిపల్లి, వెంకటాపురము గ్రామాలున్నాయి. కొందరు సేనాధిపతులు ఇతర పాలెగాళ్ళ పేరుతో
దానాయని చెఱువు, నాగినాయని చెఱువు, జగరాజుపల్లి, మల్లారెడ్డిపల్లి, కోనేటినాయని పాళ్యం, తిమ్మానాయనిపాళ్యం, మద్దినాయని పాళ్యం మొదలైన ఊళ్ళు వెలిశాయి.
వీరిలో కోనేటినాయుడు అనే పాలెగాడు ప్రసిద్ధుడు.
ఆరవీటి
వంశపతనము తరువాత ఈ జిల్లాపై మహారాష్ట్రులు,
మహ్మదీయులు దండెత్తినారు. మహరాష్ట్రీయుడైన మురారిరావు తన తండ్రి హిందూరావు
పేరుతో హిందూపురంను నెలకొల్పాడు. అక్కజాంపల్లి, అప్పాజిపేట, లోకోజిపల్లి, విఠాపల్లి మొదలైన గ్రామాలు మహరాష్ట్రీయుల ఏలుబడికి గుర్తులు. మహమ్మదీయ
పాలకుల పేరు మీద అమీన్
పల్లి, ఖాదరుపేట, షేక్ సాని పల్లి,
సతార్లపల్లి, సైదాపురము, హుసేన్ పురము, ఆలంపురము, కరీంరెడ్డి పల్లి మొదలైన గ్రామాలు
ఈ జిల్లాలో ఉన్నాయి. ఇక పాలెగార్ల పేరు
మీద సిద్ధాపురము, సిద్ధరాంపురము, సిద్ధరాశ్చెర్ల, ప్రసన్నేపల్లి, బసాపురము మొదలైన గ్రామాలున్నాయి.
పైన
పేర్కొన్న గ్రామ నామధేయాల వ్యుత్పత్తి
ఆయా పాలకుల/వ్యక్తుల పేరుమీద వెలువడినట్లు చారిత్రక ఆధారాలు పెక్కింటికి ఉంటే మిగిలిన వాటి
సంభావ్యతను చారిత్రకులు ఊహించినారు. అలా ఊహించడానికి ఆయా
గ్రామాల సాంఘిక, సాంస్కృతిక, చారిత్రక పరిస్థితులు కొంత కారణం కావచ్చును.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి