...

...

11, జనవరి 2018, గురువారం

వదరుఁబోతు

వదరుఁబోతు పుస్తకం పై నా సమీక్ష గ్రంథాలయ సర్వస్వం పత్రిక జనవరి 2018 సంచికలో ప్రచురింపబడింది. 



"వదరుఁబోతు"కు వందేళ్ళు
- కోడీహళ్లి మురళీమోహన్
ఇరవయ్యవ శతాబ్దపు రెండవ దశకం చివరలో అనంతపురం నుండి  యువకులు కొందరు వదరుఁబోతు అనే పేరుతో కరపత్రాల రూపంలో కొన్ని అమూల్యమైన వ్యాసాలను అందించారు. వ్యాసాలలో లభ్యమైన 22 వ్యాసాలను 1932లో సాధన ముద్రణాలయం పక్షాన పప్పూరు రామాచార్యులు ప్రకటించారు. తరువాత 1935లో రెండవ ముద్రణ పొందింది. 1986లో పప్పూరు రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యుల ఆధ్వర్యంలో మూడవ ముద్రణ వెలుగు చూసింది.   వ్యాసాలు వెలువడి వంద సంవత్సరాలు పూర్తయిన  సందర్భంగా వేమన అధ్యయన అభివృద్ధి కేంద్రం తరఫున డా|| అప్పిరెడ్డి హరినాథరెడ్డి   పుస్తకాన్ని ప్రస్తుతం పునర్ముద్రించి పాఠకలోకానికి అందిస్తున్నారు.  మొదటి రెండు ముద్రణలలోని విషయాలకు అదనంగా పుస్తకంలో ఆదోని పురాణసంఘం వ్యాసాలు మూడు, పానుగంటి లక్ష్మీనరసింహారావు గారి సాక్షి వ్యాసము ఒకటి, టాట్లర్ మరియు స్పెక్టేటర్ వ్యాసాలకు సంబంధించిన చిత్రాలు, వదరుఁబోతు మొదటి రెండు ముద్రణల ముఖచిత్రాలు మొదలైనవి అనుబంధంలో చేర్చారు.

            వదరుఁబోతు వ్యాసాలను వ్రాయడానికి ఈ వ్యాసకర్తలకు  ప్రేరణనిచ్చింది 1709-11 మధ్యలో రిచర్డ్ స్టీల్ వ్రాసిన టాట్లర్ అనే వ్యాస సంచయము. వ్యాసకర్తలు విద్యార్థులు, ఉద్యోగులు కావడంతో బహిరంగంగా మాట్లాడేందుకు అవకాశం లేక, ఒక వేళ ఉన్నా కీర్తికాంక్ష కోరుకోక మఱుగున ఉంటూ లోకహితార్థమై హృదయాంతరాళంలో కలిగే భావోద్వేగాలను రాతల రూపంలో వదరుతూ ఆత్మసంతృప్తికై వ్యాసాలను వ్రాశామని తెలుపుకొన్నారు వ్యాసకర్తలు తమ పేర్లను ప్రకటించకపోయినా వ్యాసాలలోని సంకేతాక్షరాల ద్వారా వారి సంఖ్య ఆరు అని తేలింది. వారిలో పప్పూరు రామాచార్యులు, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, కర్నమడకల గోపాలకృష్ణమాచార్యులు, కర్నమడకల రామకృష్ణమాచార్యులున్నారని తరువాతి పరిశోధనలు అంచనా వేస్తున్నాయి వ్యాసాలు సుమారు 55 వెలువడ్డాయి. వ్యాసాలలో లోకపరిశీలన, అనుభవం, పరోపకార గుణం, విలువలతో కూడిన విద్య, కళాశాలల ఆవశ్యకత, దేశాభ్యుదయం, స్వదేశీవస్తూత్పత్తి, మూఢవిశ్వాసాల నిరసన, కీర్తికండూతి, ఆడంబరం, పరాయి సంస్కృతి, అనవసరధన వ్యయం ఇత్యాదుల వ్యతిరేకత, సత్యసంధత, కవిత్వ తత్త్వం, నాటక తత్త్వం, తెలుగు సంస్కృత సాహిత్యాల వికాసం , ఆధ్యాత్మికం, హాస్యం, వ్యంగ్యం,  తదితర అంశాలు కానవస్తాయి.

ఈ వ్యాసాలలోని భాష సరళ వ్యావహరికంలో ఉంది. భావంలోను, భాషలోనూ పరమ గ్రాంథిక వాతావరణం నెలకొన్న రోజులలో ఆధునిక భావాలను, భాషను తమ వ్యాసాలలో చొప్పించారు. ఈ వ్యాసాలలో సందర్భానుసారంగా తెలుగు, ఆంగ్ల సూక్తులు, సామెతలు, లోకోక్తులు, ఉపకథలు, పద్య పంక్తులు, జానపద గేయాలు ఉపయోగించారు. వేమన పద్యాలు మొదలుకొని కూనలమ్మ పదాల దాకా, వాల్మీకి మొదలుకొని ఎడిసన్ దాకా, శిబి చక్రవర్తిని మొదలుకొని సదయుని ఉదంతం దాకా ఈ వ్యాసాలలో మనకు కనిపిస్తాయి. ఈ వ్యాసాలు ఉత్తమ పురుషలో, ఆత్మస్వగతంగా చెబుతున్నట్లు సందేశాత్మకంగా కొనసాగాయి.

ఈ వ్యాసాలు లిఖించబడి నూరేళ్ళు గడిచినా ప్రస్తుత పరిస్థితులకు కూడా వీటి ఆవశ్యకత ఎంతో వుందని భావించి ఈ పుస్తకం పునర్ముద్రణ చేయడం ద్వారా హరినాథరెడ్డి తెలుగు సమాజానికి ఎంతో మేలు చేశారు.  ఈ పుస్తకం ప్రతి విద్యార్థి, యువకుడు, సాహిత్యాభిలాషి తప్పక చదవాలి. ఈ పుస్తకం చదివిన ప్రతి పాఠకుడు ఉత్తేజం పొందగలరు అనడంలో సందేహం లేదు. అయితే ఈ పుస్తకం పునర్ముద్రణలో కొన్ని చిన్న చిన్న లోపాలు ఉన్నాయి. ప్రూఫులు చూడడంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సింది. ఉదాహరణకు హాస్యకళ అనే వ్యాసం (50వ పేజీ)లో 'చూచితిరా! దేహము బంగారు వన్నె; కన్నులు విశాలములు; ఎత్తయిన నాసిక; రోమరహితమైన యంగములు! ఇట్టి సౌందర్యవతిని బడయుటకు భర్త యెంతో పుణ్యము చేసియుండవలయును. నిజమే, కాని సీతకు (మన వలె కుఱుచగనో గొప్పగనో తోఁక యొకటి యున్న) నెంత బాగుగా నుండి యుండును!' పై వాక్యాలలో బ్రాకెట్లలో ఉన్న భాగం ఎగిరి పోయింది. ఆ భాగం వుంటే పాఠకులు మరింత హాస్యాన్ని ఆస్వాదించే వీలుండేది.   ఇలాంటి పొరబాట్లు తరువాతి ముద్రణలో సవరించుకోగలరని ఆశిస్తున్నాను.

 






కామెంట్‌లు లేవు: