...
18, ఏప్రిల్ 2013, గురువారం
12, ఏప్రిల్ 2013, శుక్రవారం
పుస్తక సమీక్ష - 24 మనసు తడి ఆరనీకు
[పుస్తకం పేరు: మనసు తడి
ఆరనీకు, రచయిత: ఓంప్రకాశ్ నారాయణ వడ్డి, వెల:రూ90/- ప్రచురణ: ఓంప్రకాశ్
ప్రచురణాలయం 28/553, జలాలు పేట, మచిలీపట్నం -1, ప్రతులకు: సాహిత్య నికేతన్,
కేశవనిలయం, బర్కత్‌పురా, హైదరాబాదు మరియు సాహిత్య నికేతన్, గవర్నర్ పేట, విజయవాడ]
మిత్రులు
ఓంప్రకాశ్ నారాయణ కథల సంపుటిలోని కథలగురించి ప్రత్యేకంగా చెప్పవలసినదేమీ లేదు. 28, 29 యేళ్లుగా కథలు
వ్రాస్తున్నా సంఖ్యాపరంగా ఎక్కువ కథలను ప్రకటించనప్పటికీ ప్రకటించిన అన్ని కథలూ నాణ్యమైన కథలే!
రాసికంటే వాసికే ప్రాముఖ్యతనిచ్చే ఓంప్రకాశ్ తన కథల్లో 23 కథలను ఏరి ఈ కథా
సంపుటిలో పాఠకులకందిస్తున్నారు. మార్నింగ్‌వాక్, సీతాపతికి జ్ఞానోదయమైంది కథలు రెండూ సరదా కథలు.
మిగిలిన కథలన్నీ ఏదో ఒక ఆశయాన్ని, ఆదర్శాన్ని తెలియజేస్తాయి. అన్ని కథలూ మనసు
తడిని ఆరనివ్వని కథలే. మచ్చుకు ఈ కథ చదవండి.ఇంత మంచి కథలకు ఏ కథావార్షికలూ చోటు కల్పించకపోవడం నిజంగా
విచారించదగ్గ విషయం. ముందుమాట వ్రాసిన ఆచార్య కొలకలూరి ఇనాక్ గారికి ఓంప్రకాశ్
కథలు నచ్చడంలో ఆశ్చర్యం ఏమీ లేదు, నచ్చకపోతే ఆశ్చర్యపడాలిగాని. ఇక విజయసారథిగారి
ముందుమాటలో రచయిత కుటుంబ నేపథ్యాన్ని వివరించడం కథల నేపథ్యానికి సంజాయిషీ
ఇచ్చినట్లుగా ఉంది. ఇది ఏవిధంగా రచయితకు లాభిస్తుందో అర్థం కావడం లేదు. రచయిత
ఆదర్శభావాలు కథలలో ప్రతిబింబిస్తున్నప్పుడు పాఠకులకు అతని వ్యక్తిగత విషయాలతో పని
వుండదనే అనుకుంటాను.
ఓ
కోకిల పునరాగమనం కథలో ఓంకార్ మార్గరెట్‌ను స్వామీజీ ఆశ్రమానికి ఆహ్వానించడంలో
మతలబు ఏమిటి? మార్గరెట్ ఒకవేళ మతం మార్చుకోవాలని భావించకపోతే ఓంకారే ఆ ప్రతిపాదన
చేసివుండేవాడా? మార్గరెట్ నిర్ణయం మనస్ఫూర్తిగా తీసుకున్న నిర్ణయమేనా? లేక ఆమె
తెలివైనది కనక ఓంకార్ మనసు తెలుసుకుని (ఓంకార్‌తో పెళ్లి తన సాంఘిక అవసరం కనుక)
దానికి అనుగుణంగా మతమార్పిడికి సిద్ధపడిందా? అనే సందేహాలు కలుగుతాయి పాఠకుడికి.
పరమేశ్వరావు పీటర్‌గా మారడం తప్పయితే మార్గరెట్‌ను లక్ష్మిగా మారుస్తూ (చేసిన
తప్పు సరిదిద్దుకోవడం అనే వంక పెట్టి) అదే తప్పును చేయిస్తున్నాడు రచయిత.
అలాకాకుండా ఓంకార్ మనసులోని భావాన్ని పసిగట్టి వాళ్ల నాన్నగారు మతమార్పిడిని
వ్యతిరేకిస్తూ/తిరస్కరిస్తూ లక్ష్మిని కాకుండా మార్గరెట్‌నే తన కోడలిగా అంగీకరించినట్లు ముగించి
ఉంటే బాగుండేది. మొత్తం మీద ఒక మంచి కథల సంపుటిని అందించిన ఓంప్రకాశ్‌నారాయణ వడ్డి
గారికి అభినందనలు!
Labels:
review
14, మార్చి 2013, గురువారం
పాలపర్తి జ్యోతిష్మతి గారి కథ!
పాలపర్తి జ్యోతిష్మతి గారి కథ 'వృక్షవేదన'ను కథాజగత్‌లో చదవండి.
Labels:
katha jagat
12, మార్చి 2013, మంగళవారం
11, మార్చి 2013, సోమవారం
కథాజగత్‌లో సై-ఫై కథ!
అనిల్ ఎస్.రాయల్ గారి కథ నాగరికథ బ్లాగు మిత్రులకు సుపరిచితమే!
అబ్రకదబ్ర అనే ప్రక్షిప్త నామంతో 'తెలు-గోడు'
బ్లాగుద్వారా అనిల్‌గారు మనకు తెలిసినవారే! ఈ కథ ఆంధ్రజ్యోతిలో నవంబరు2009లో అచ్చయింది.
తర్వాత కథ - 2009, వర్తమాన తెలుగు కథ - 2009, త్వరలో(?) వెలువడనున్న సాహిత్య అకాడెమీ
సైన్స్ ఫిక్షన్ కథల సంపుటి మొదలైన సంపుటాల్లోనూ, 2012లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారానూ
వెలుగు చూసింది. ఇప్పుడు కథాజగత్‌లో కూడా చోటు
చేసుకుంది. చదవండి.
Labels:
katha jagat
9, మార్చి 2013, శనివారం
భూసూక్తము - కాల నిర్ణయము
భూసూక్తము అను పేరుతో ఒక కథను డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారు వ్రాసినారు. దానిని తురుపుముక్కలో చదువవచ్చును. ఈ కథ రచనా కాలమెప్పటిదో నిర్ధారించుట ఈ వ్యాసము ముఖ్యోద్దేశము.
1. ఈ కథను సర్దేశాయి తిరుమలరావుగారు వ్రాసిరి. వారు క్రీ.శ.1928వ సంవత్సరములో జన్మించి 1994 మే నెలలో కాలధర్మం చేసినారు. కాబట్టి ఈ కథ 1928-1994 మధ్యకాలంలో రచింపబడింది.
2. కథలో గంగిరెడ్డి మద్రాసులో చదువుతున్న తన కొడుకు భీమిరెడ్డిని చూడటానికి వెళ్ళినప్పుడు అతని గదిలో గోడకు సినిమా యాక్టర్ల ఫోటోలు వ్రేలాడ బడి యుండెను. అవి వరుసగా అశోక్ కుమార్, ఎరోల్ ఫ్లిన్, గ్రెగరీ పెక్‌లవి. అశోక్ కుమార్ బాలివుడ్ నటుడు. ఈయన తొలి సినిమా జీవన్ నయా 1936లో విడుదల కాబడినది. ఎరోల్ ఫ్లిన్ మొదటి సినిమా 1935లో విడుదలయ్యెను. దాని పేరు కేప్టన్ బ్లడ్. ఇక గ్రెగరి పెక్ 1944లో విడుదలైన డేస్ ఆఫ్ గ్లోరీ చిత్రముద్వారా తెరపైకి వచ్చెను. వీటిని పరిగణనలోనికి తీసుకొనిన ఈ కథ 1944కు ముందు రచింపబడలేదు. అనగా 1944-1994 మధ్యలో రచింపబడినదని తాత్పర్యము.
3. రెండవతూరి గంగిరెడ్డి కొడుకును చూడబోయినప్పుడు అతని గదిలో డేవిడ్ థోరూ రచించిన వాల్డెన్, హెన్రీ జార్జి అనే అతను రచించిన ప్రోగ్రెస్ అండ్ పావర్టీ, గాంధీ వ్రాసిన సర్వోదయ, భట్టాచార్య వ్రాసిన సోమెనీ హంగర్సు, విద్వాన్ విశ్వం వ్రాసిన పెన్నేటి పాట మొదలైన చెత్త పుస్తకాలు దర్శనమిచ్చును. వాల్డెన్ 1854లోనూ, ప్రోగెస్ అండ్ పావర్టీ 1879లోనూ, సర్వోదయ 1908లోనూ, భవానీ భట్టాచార్య యొక్క సో మెనీ హంగర్స్ 1947లోనూ వెలువడినవి. ఇక విద్వాన్ విశ్వం పెన్నేటి పాటను 1955లో తెలంగాణా రచయితల సంఘం తొలిసారిగా ముద్రించినది. దీనినిబట్టి 1955 ముందు పెన్నేటిపాట పుస్తకము భీమిరెడ్డి వద్ద ఉండుటకు ఆస్కారము లేదు. అనగా ఆ పుస్తకమును రచయిత ప్రస్తావించినాడని అన్నచో ఈ కథ 1955 తరువాతనే రచింపబడినదని అవగాహన చేసుకొన వచ్చును. కావున ఈ కథా రచనా కాలము 1955 -1994 కు కుదించబడినది.
4. ఇక కథ చివరి రెండు పేరాలలో భీమిరెడ్డి వినోబాభావే వలన ప్రేరేపితుడయ్యి ఆతని అనుచరునిగా మారినట్లు బోధపడును. ఇక ఈ కథ ఆఖరి వాక్యము యిట్లున్నది. ఆనాడే ఆచార్య వినాబాభావే భూదాన యజ్ఞార్థము యావత్తు ఆంధ్రదేశ పదయాత్ర ఆరంభించి ఉండెను. భూదానోద్యమము 1951లో ఆంధ్ర రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి గ్రామంలో ఆరంభింపడినది. ఇచ్చట ఒక సంగతి గమనార్హము. ఈ ఉద్యమము ముందుగనే అనుకొని ప్రారంభించిన ఉద్యమము కాదు. అప్పటికి అప్పుడు అసంకల్పితముగా పుట్టినది. గాంధీ అనుయాయి యైన వినోబాభావే కమ్యూనిష్టు ప్రభావం కల పోచంపల్లి హరిజనవాడలను 1951 ఏప్రిల్ 18వ తేదీన సందర్శించినప్పుడు అక్కడి దళితులు ఆయుధాలను పట్టి కమ్యూనిష్టులకు సహకరించడానికి కల కారణాలను తెలుసుకొన గోరినప్పుడు కమ్యూనిష్టులు వారికి భూములను ఆశచూపినట్లును వారికి భూములున్నయెడల హింసామార్గమునకు స్వస్తి పలుకగలరనియు తెలుసుకుని వారి సమస్యను ఊరి పెద్దలకు తెలుపగా ఆశ్చర్యకరముగా రామచంద్రారెడ్డి అను భూస్వామి 100 ఎకారల భూమిని హరిజనులకు ఇచ్చునట్లు ప్రకటించెను. ఆ విధముగా భూదానోద్యమునకు బీజము పడినది. ఆ తరువాత ఈ ఉద్యమము 1957 వరకు పెద్ద ఎత్తున భారత దేశమంతయు ఒక ఊపు యూపి 1957 తర్వాత క్రమేపీ సన్నగిల్ల జొచ్చెను. భూదానోద్యమునకు పూర్వము వినోబా పేరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అంత సుపరిచితమైనది కాదు. ఆ ఉద్యమము ద్వారానే ఆయన భారతీయులకు ఆరాధ్య పురుషుడైనాడు. కథ చివరి వాక్యము ప్రకారము 1951లో వినోబా భావే ఆంధ్ర రాష్ట్రమంతయు భూదాన యజ్ఞార్థము పదయాత్ర ఆరంభించినాడనుకొందము. అప్పటికి భీమిరెడ్డి వినోబాభావే అనుయాయిగా మారుటకు అవకాశము లేదు. దీనిని బట్టి వినోబాభావే ఆంధ్ర దేశ పదయాత్ర మరొక సారి (రెండవసారి) చేసియుండవచ్చును. అప్పటికి ఆతడు పాపులరు కావచ్చును. అదియునుగాక పైన పేర్కొన్న 3వ అంశము ప్రకారము కథ 1955కు మునుపటిది కాదు. వినోబాభావే కథలో ఉదహరించిన ప్రకారము పదయాత్ర 1955 - 1957 మధ్య కాలములో చేసి ఉండవచ్చుననునది నా ఊహ. సాధారణముగా కవి లేదా రచయిత ఒక అంశముపై స్పందిచవలసి వచ్చినప్పుడు ఆ విషయము జరిగిన కొద్ది కాలములోనే స్పందించగలడు.ఆ అంశము చల్లారిన తరువాత రచించిన పేలవముగా ఉండును. కారంచేడు సంఘటనపై 2012లో కవిత్వము వెలయించుట అసాధ్యము కాదు కానీ కష్ట సాధ్యము. కావున పై కథ భూదానోద్యమము పతాక స్థాయిలో ఉన్నప్పుడు (ఒకటి రెండు సంవత్సరములు అటూ ఇటూ) వ్రాసి ఉండవచ్చును. అదియునూ గాక కథలో వాడ బడిన భాష (సరళ గ్రాంథికమా?) 1970ల తరువాత వెలువడిన రచనలలో కానరాదు. దీనిని బట్టి ఈ కథ 1956 -1960 ల మధ్య కాలంలో వెలువడి ఉండవచ్చునని సూత్రీకరిస్తున్నాను. విజ్ఞులెవరైనా ఇంకా ఖచ్చితమైన కాలమును నిర్ధారించెదరు గాక.
Labels:
SDTR
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

.jpg)

