...

...

21, ఆగస్టు 2011, ఆదివారం

పుస్తక సమీక్ష -21 తప్పుల తడక 'తెలుగు వెన్నెల'

                                                                                                                                                                                                                                                         
 ప్రపంచ తెలుగు రచయితల 2వ మహాసభలను పురస్కరించుకుని కృష్ణాజిల్లా రచయితల సంఘం రెండు ప్రత్యేక సంచికలను విడుదలచేసింది. తెలుగుపున్నమి పేరుతో సుమారు 700 పేజీలకు పైగా ఉన్న ప్రత్యేక సంచికను 600/-రూపాయల ధర నిర్ణయించి వెలువరించారు. మరొక ప్రత్యేక సంచిక తెలుగు వెన్నెల (సుమారు 160పుటలు) మాత్రం మహాసభలకు హాజరైన ప్రతినిధులకు ఉచితంగా ఇచ్చారు. ఈ తెలుగువెన్నెలలో మండలి బుద్ధప్రసాద్ గారి 'తెలుగుభాష - గమనం - గమ్యం' అనే ముందుమాట, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి 'లక్ష్యప్రస్తావన', విస్కాన్సిన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ఎరిక్ గారి సందేశం, గుత్తికొండ సుబ్బారావు, జి.వి.పూర్ణచందు గార్ల నివేదిక మొదట కనిపిస్తాయి.


     ఈ సంచికలో విశ్వనాథ సత్యనారాయణ, పొట్లూరి సుబ్రహ్మణ్యం, జానమద్ది హనుమచ్ఛాస్త్రి,మంగళగిరి ఆదిత్య ప్రసాద్, సన్నిధానం సువర్చలా సుబ్రహ్మణ్యం, ఎమ్.వి.జె.భువనేశ్వరరావు, కోడూరు పాండురంగారావు, త్రిపురనేని హనుమాన్ చౌదరి, గోగినేని యోగ ప్రభావతీ దేవి, పన్యారం సాంబశివరావు, కాలనాథభట్ట వీరభద్రశాస్త్రి, చొక్కాపు నారాయణస్వామి, పి.వి.సుబ్బారావు, నడమల గంగాధరరెడ్డి, పి.బాబివర్ధన్, సర్వా సీతారామ చిదంబర శాస్త్రి, వి.వి.కృష్ణశాస్త్రి, ఎల్లూరి శివారెడ్డి, ఎ.వి.కె.సుజాత, తాళ్ళపాక నటరాజ, టి.ఎస్.ఏ.కృష్ణమూర్తి, కొండూరి సీతారామచంద్రమూర్తి, గుడిసేవ విష్ణుప్రసాద్, వి.ఉమామహేశ్వరి, ముశం దామోదరరావు, జె.వి.సత్యవాణి, ముదిగొండ శాస్త్రి, దామెర విజయసారథి, కె.ఎస్.ఆర్ బాలకృష్ణ శాస్త్రి, కె.రామకృష్ణ, కొట్టి రామారావు, గాజుల సత్యనారాయణ, కె.శ్రీనివాసరావు, పోలేపెద్ది వేంకట హనుమచ్ఛాస్త్రి గార్ల వ్యాసాలున్నాయి. ఎమ్.వి.జె.భువనేశ్వరరావుపై ఉన్న అవ్యాజమైన ప్రేమతో ఆయన వ్రాసిన ఆంధ్రుల సంస్కృతీ వైభవం అనే వ్యాసాన్ని రెండుసార్లు ప్రచురించారు.

        తొడుపునూరి సరోజ, వియోగి, విశాలవియోగి, శింగిసెట్టి సంజీవరావు, కోడూరు వేంకటేశ్వరస్వామి, గంధం వేంకాస్వామి శర్మ గార్ల కథలున్నాయి ఈ సంచికలో. ఇంకా వూసల రజనీగంగాధర్, యస్.దామోదరరావు, అధికార్ల నీలకంఠం, ఆర్యమఠారి బాలాజీరావు, సూర్యదేవర రవికుమార్, రామడుగు వెంకటేశ్వరశర్మ గార్ల కలం నుండి వెలువడిన పద్యకవితలు చోటు చేసుకున్నాయి. 

    ఇంకా ఈ ప్రత్యేక సంచికలో 50 వరకు వచన గేయ కవితలు చోటు చేసుకున్నాయి. మేడిచర్ల ప్రకాశరావుగారి కొన్ని జోకులు కూడా ఈ ప్రత్యేక సంచికలో చూడవచ్చు.  

   ఇటువంటి ప్రత్యేక సంచికల తయారీలో చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెలుగు భాషా సంస్కృతుల పరిరక్షణకై, వాటి మనుగడకై పరితపించిన ప్రపంచ తెలుగు రచయితల మహాసభల సందర్భంగా విడుదలైన ప్రత్యేక సంచిక కాబట్టి. కానీ ఈ పుస్తకం తీసుకురావడంలో కూర్పరులు ఎంత నిర్లక్ష్యం వహించారో ఈ పుస్తకం చదివిన వారికి అర్థం అవుతుంది. ప్రూఫులు సరిగ్గా చూడలేదనే విషయం లెక్కలేనన్ని అచ్చుతప్పుల వల్ల బోధ పడుతుంది. జాదమద్ది, విశ్వనాధ, పటనం, వైబవం, కంటం, స్వరపైటిక, సాట్య శాస్త్రం, వ్యవ్థ(వ్యవస్థ కు వచ్చిన అవస్థ), గ్రీఆమ్యం, మైళనము, ఆంధ్రభూబి,శింవలెంక,దేవీ నవరాత్రుములు, పరుషోత్తం, ఇల్లిందర సరస్వతీదేవి మచ్చుకు కొన్ని.  ఈ సంచిక చివరలో సభలకు హాజరయిన/నమోదు చేసుకున్న ప్రతినిధుల పేర్లు, చిరునామాలు ప్రకటించారు. చిత్రంగా వీరినందరినీ కృష్ణాజిల్లా రచయితల సంఘం జీవిత సభ్యులను చేసేశారు. అందుకే ఇవి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు కావనీ, కృష్ణా జిల్లా రచయితల సభలని కొన్ని వ్యంగ్యోక్తులు వెలువడ్డాయి. ఈ సమీక్షకుని పేరు కూడా ముద్రారాక్షసానికి బలయ్యింది. సాక్షాత్తూ ఈ మహాసభల కార్యనిర్వాహక అధ్యక్షుల వారి ఇ-మెయిల్ చిరునామాయే తప్పుగా ప్రచురింపబడ్డాక ఇక వేరే వారి సంగతి చెప్పేదేముంది?

    అన్నం ఉడికిందో లేదో చూడటానికి ఒక మెతుకును పట్టి చూస్తే సరిపోతుంది. అలాగే ఈ తెలుగు వెలుగు ఎంత అపరిపక్వంగా ఉందో తెలుసుకోవడానికి ఈ క్రింది  ఉదాహరణ ఒక్కటి చాలు.

     జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి 'నేనెరిగిన శంకరంబాడి సుందరాచారి' వ్యాసంలో '1989లో పెండ్లాడి బ్రతుకుచెడి చిత్తూరు బోర్డు హైస్కూల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుడనై చక్కని దేశికుడని పేరు పొందితిని.'అని శంకరంబాడి సుందరాచారి జానమద్ది వారికి వ్రాసిన లేఖలో పేర్కొన్నట్లు ఉంది. 1977 ఏప్రిల్ 8న మృతి చెందిన సుందరాచారికి మరణించిన పన్నెండేండ్లకు పెళ్ళి చేసిన ఘనత మన కృష్ణా జిల్లా రచయితల సంఘానికే దక్కుతుంది. 

5 కామెంట్‌లు:

cbrao చెప్పారు...

ఇంతటి నిర్లక్ష్యమా? !!!!!!!!

కొత్త పాళీ చెప్పారు...

విచారించాల్సిన విషయం

అజ్ఞాత చెప్పారు...

మాస్టారూ,

అంత వివరంగా పరిశీలించిన మీ ఓపిక్కి మెచ్చుకోవాలి !

kasturimuralikrishna చెప్పారు...

కోతిహళ్ళి ఇది వెన్నెలలోని అచ్చుతప్పు) మురళీ మోహన్ గారూ, మీరు నా ఫేవరేట్ అచ్చుతప్పు గురించి ప్రస్తావించనేలేదు. విహంగవీక్షణంలోనే ఇన్ని తప్పులు దొరికాయి. ఒక్కసారి విశ్వనాథ వారి వ్యాసం చదివి దాన్లోని అచ్చుతప్పులు రాయండి చాలు, ఏమాత్రమయినా ఆయన ఆత్మ శాంతిగా వుంటే అదీ పోతుంది. దాంతో నా కలలోకి వచ్చి, తెలుగుభాషోద్ధరణ అనే ప్రహసనం రాయించి పోతారేమో అని నా ఆశ.

mmkodihalli చెప్పారు...

సి.బి.రావుగారూ అవునండీ!

కొత్తపాళీగారూ నిజమేనండీ!

ఫణిబాబుగారూ ఇన్ని అచ్చుతప్పులతో ఉన్న ఆ పుస్తకం పూర్తిగా చదవాలన్న ఆసక్తి పోయిందండీ. ఇంకా వివరంగా పరిశీలించడం కూడానా?

కస్తూరి మురళీకృష్ణగారూ! "నా కలలోకి వచ్చి, తెలుగుభాషోద్ధరణ అనే ప్రహసనం రాయించి పోతారేమో అని నా ఆశ" వ్రాయండి. మీకు అడ్డు ఎవరు?