ప్రపంచ తెలుగు రచయితల రెండవ మహాసభలు విజయవాడలో ఈ నెల 13వతేదీ నుండి 15వ తేదీవరకు జరిగాయి. ఈ సభలలో ప్రతినిధిగా పాల్గొనే అవకాశం నాకు దక్కింది. ఈ మహాసభల విశేషాలను తురుపుముక్క పాఠకులతో పంచుకునే ఉద్దేశంతో ఈ టపా వ్రాస్తున్నాను.
ప్రారంభ సమావేశం శనివారం ఉదయం తుమ్మలపల్లివారి క్షేత్రయ్య కళాక్షేత్రం(వేటూరి సుందర రామమూర్తి వేదిక)లో ఘనంగా జరిగింది. సి.నా.రె, రామోజీరావు, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, జి.వి.పూర్ణచందు, వరప్రసాద్ రెడ్డి (శాంతా బయోటెక్), కె.శ్రీనివాస్(ఆంధ్రజ్యోతి),మాలతీ చందూర్, కాళీపట్నం రామారావు, అగ్రహారం కృష్ణమూర్తి(కేంద్ర సాహిత్య అకాడెమీ) తదితరులు వేదిక పైనుండి తమ తమ సందేశాలను వినిపించారు. ఈ ప్రసంగాల సారాంశాన్ని క్రోడీకరిస్తే తెలుగుకు కష్టకాలం వచ్చిందనీ,తెలుగుకు తీరని అన్యాయం జరుగుతోందనీ, ఆంగ్లంపై మోజు తగ్గాలనీ, బడినుంచి భాషోద్ధరణ జరగాలనీ, టీవీలు వచ్చాక పల్లెల్లో కూడా తెలుగుభాష ఆంగ్ల పదాలతో కలుషితమైపోతుందనే ఆవేదన, ఆందోళనలే తప్ప ఆ సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు ఏవీ లభించలేదు. ఈ సమావేశంలో ప్రత్యేక సంచికలు తెలుగు వెన్నెల, తెలుగు పున్నమిలను ఆవిష్కరించారు.
మధ్యాహ్నం నుంచీ ప్రతినిధుల సదస్సులు బెంజ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఎస్.వి.ఎస్ కల్యాణమంటపంలో ప్రారంభమయ్యాయి. మొదటి సదస్సు సురవరం ప్రతాపరెడ్డి వేదికపై తెలుగుకు సంబంధించిన చరిత్ర, సంస్కృతుల ప్రాచీనత, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను చర్చించింది. ప్రతిజిల్లాకు సమగ్రమైన చరిత్ర అవసరమని, చారిత్రక ఆధారాలను కాపాడేందుకు పురావస్తు శాఖ సమర్థవంతంగా పనిచేయాలని, రాజకోటలను పరిరక్షించేందుకు, పునర్నిర్మించేందుకు అవసరమైన నిధులు ప్రభుత్వం కేటాయించాలనీ, ఇంకా పరిష్కరింపబడని శాసనాలను, నాణేలను, తాళపత్రాలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలనీ, రచయితలు, కవులు పురావస్తు, చారిత్రకాధారాల విలువపై అవగాహన కలిగి ఉండటమే కాకుండా వాటి విలువను సామాన్యులకు అర్థమయ్యేలా వివరించాలనీ వక్తలు పేర్కొన్నారు. వకుళాభరణం రామకృష్ణ, మండలి బుద్ధ ప్రసాద్, వి.వి.కృష్ణశాస్త్రి, చెన్నారెడ్డి, హర్షవర్ధన్, శ్రీపాద సుబ్రహ్మణ్యం,పొత్తూరి వెంకటేశ్వరరావు, ఏబికె ప్రసాద్, బి.సుబ్రహ్మణ్యం తదితరులు ప్రసంగించిన ఈ సదస్సుకు రాళ్ళబండి కవితాప్రసాద్ సమన్వయం చేశారు.
తరువాతి సదస్సులో రాష్ట్రేతరాంధ్రులు ఎదుర్కొంటున్న సమస్యలపై మండలి వెంకటకృష్ణారావు వేదికపై చర్చ జరిగింది. గౌరీశంకర్ సమన్వయకర్తగా వ్యవహరించిన ఈ సదస్సులో తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒరిస్సా తదితర ప్రాంతాలనుండి వచ్చిన ప్రతినిధులు తమతమ సమస్యలను సభముందు వెళ్ళబోసుకున్నారు. ఎక్కడెక్కడ తెలుగు భాష విస్తరించి ఉందో అక్కడ దాన్ని పరిరక్షించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని, తెలుగు సాహిత్యగ్రంథాలను పంపి పిల్లలు తెలుగు నేర్చుకునేలా ఇక్కడి సంస్థలు, రచయితలు, ప్రభుత్వం ప్రోత్సహించాలని, తమ యాసను అవమానించేలా రచయితలు,సినీ కవులు తమ రచనల్లో వాడకూడదని విజ్ఞప్తి చేశారు. పుష్పలత, బెల్లంకొండ నాగేశ్వరరావు, ఆర్ధి రఘునాథవర్మ, సా.వెం.రమేష్ తదితరులు ప్రసంగించారు.
ఆ తర్వాత మో వేదికపై జరిగిన ప్రత్యేక కవిసమ్మేళనంలో చాలామంది ప్రముఖ కవులు పాల్గొన్నారు. కె.బి.లక్ష్మి సమన్వయం చేశారు. అనంతశ్రీరామ్, ఆశావాది ప్రకాశరావు, పాటిబండ్ల రజని వంటి కొందరి కవితలు మినహా మిగిలిన కవితలు సదస్యులను ఆకట్టుకోలేకపోయింది. అనంతరం ప్రతినిధుల కవిసమ్మేళనం కూడా చప్పగాసాగింది.
రెండవరోజు గుఱ్ఱం జాషువా వేదికపై సాహిత్యరంగంపై చర్చ జరిగింది. కన్నడ రచయిత భైరప్ప, గొల్లపూడి మారుతీరావు, శలాక రఘునాథ శర్మ, శిఖామణి, ఎస్.గంగప్ప, రేవూరి అనంతపద్మనాభరావు, కడియాల రామమోహన్ రాయ్, ఎస్.వి.రామారావు, బాబీవర్ధన్, శంకరనారాయణ, కస్తూరి మురళీకృష్ణ,రావి రంగారావు, ఝాన్సీ కె.వి.కుమారి తదితరులు ఎన్నో విలువైన సూచనలు చేశారు. రచయితల సహకార సంఘం ఏర్పాటు, సాహిత్య అకాడెమీ పునరుద్ధరణ, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వశాఖ, తెలుగు పుస్తకాలను ఇతరభాషలలో అందుబాటులోకి తేవడం, పిల్లలకు శతకసాహిత్యాన్ని నేర్పించడం, మాండలికాలకు ఒక ప్రత్యేకమైన నిఘంటువు నిర్మించడం వంటివి అందులో కొన్ని.
తరువాతి సదస్సు గిడుగురామ్మూర్తి వేదికపై మాతృభాషల మనుగడ, మాండలికాల వినియోగం, తెలుగుభాషకు ప్రాచీనహోదా అనంతర చర్యలు మొదలైన విషయాలపై చర్చ జరిపింది. ఆధునిక నిఘంటు నిర్మాణం, మాండలికాల పదకోశ నిర్మాణం మొదలైన అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ సదస్సులో బూదాటి వెంకటేశ్వర్లు, వెలివెల సిమ్మన్న, యు.వి.నరసింహమూర్తి, ద్వానాశాస్త్రి, సామల రమేష్, కాలువ మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
సాహిత్య పత్రికలు రేపటి మనుగడ అనే సదస్సు కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు వేదికపై జరిగింది. విజయబాబు, కొమ్మినేని శ్రీనివాస్, రాజశుక, నండూరి రాజగోపాల్, కొల్లా శ్రీకృష్ణారావు, జల్దంకి ప్రభాకర్, వై.శ్రీరాములు, పాలెపు బాబు మొదలైన పత్రికా సంపాదకులు ప్రసంగించారు. సాహిత్య పత్రికల స్థాయికి రచనలు వెలువడటం లేదన్నది వీరి ప్రధాన ఆరోపణ. తదనంతరం సాహితీ సంస్థల ప్రతినిధుల సమావేశం కొమర్రాజు లక్ష్మణరావు వేదికపై, మహాకవి దాశరథి వేదికపై ప్రతినిధుల కవిసమ్మేళనం జరిగాయి.
చివరి రోజు స్వాతంత్ర్య దినోత్సవ సభ గరిమెళ్ళ సత్యనారాయణ వేదిక పై జరిగింది. ఈ సందర్భంగా దేశభక్తిని చాటే పాటలను పాడారు. హిందీ రచయిత్రి ప్రతిభారాయ్, బెంగాలీ రచయిత్రి ఉషా చౌదరి, ఇంద్రనాథ్ చౌదరి ఈ సదస్సులో అతిథులుగా విచ్చేసి తమ సందేశాలు వినిపించారు. ఆతర్వాత సాంకేతికంగా తెలుగు భాషాభివృద్ధి అనే అంశంపై సి.పి.బ్రౌన్ వేదికపై సదస్సు నిర్వహించారు. సదస్సు ప్రారంభంలో శ్రీరమణీయ అనే కొత్త ఉచిత యూనీకోడ్ ఫాంట్‌ను విడుదల చేశారు. కూచిభొట్ల ఆనంద్ సమన్వయ కర్తగా ఈ సభనిర్వహించబడింది. సాంకేతిక పరిపుష్టికి ప్రభుత్వం చేస్తున్న కృషిని అమర్నాథరెడ్డి వివరించారు. వీవెన్ అంతర్జాలంలో తెలుగు వినియోగంపై ఒక పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ సమర్పించారు. చావాకిరణ్ వికీపీడియా గురించి సదస్సుకు తెలియజేశారు. ఇంకా మైనేని దుర్గాప్రసాద్, గారపాటి ఉమామహేశ్వరరావు తదితరులు తమ సందేశాలను వినిపించారు.
మధ్యాహ్నం ముగింపు సమావేశం జరిగింది. జస్టిస్ గ్రంథి భవానీప్రసాద్, జయప్రకాష్ నారాయణ, లగడపాటి రాజగోపాల్ తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా మహాసభలు కొన్ని తీర్మానాలను చేసింది. వాటిలో అందరూ తెలుగు భాషనే మాట్లాడటం, తెలుగుకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, అధికార భాషా సంఘం కార్యవర్గాన్ని ప్రభుత్వం వెంటనే నియమించటం, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీని పునరుద్ధరించడం, జీ.వో 86ను అమలు చేయని పాఠశాలల గుర్తింపు రద్దు చేయటం, తెలుగు మాధ్యమంలో చదివిన ఉద్యోగార్థులకు మౌఖిక పరీక్షల్లో అయిదు మార్కులు అదనంగా కేటాయించటం ముఖ్యమైనవి.
ఈ మూడు రోజుల సంబరాలలో అనేక మంది రచయితలతో పరిచయ భాగ్యం కలగటం ఒక అదృష్టం. మన బ్లాగర్లు నవ్వులాట శ్రీకాంత్, కౌటిల్య, రెహ్మానుద్దీన్ షేక్, వీవెన్, చావా కిరణ్, కస్తూరి మురళీకృష్ణ ఈ సదస్సుకు హాజరయ్యారు. నేను, కస్తూరి మురళీకృష్ణ,రెహ్మానుద్దీన్ షేక్, కౌటిల్య, శ్రీకాంత్ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ నివసించిన ఇంటికి వెళ్లి అక్కడ ఏర్పాటు చేసిన పుస్తకాలను, విశ్వనాథ వారి పురస్కారాలనూ, జ్ఞాపికలను, వారు ఉపయోగించిన వస్తువుల ప్రదర్శనను తిలకించాము. అక్కడ సుమారు ఒక గంట సేపు గడిపాము. ఆ సందర్భంలో కౌటిల్య, కస్తూరి మురళీకృష్ణ, శ్రీకాంత్‌ల మధ్య నడిచిన సాహిత్యపరమైన సంభాషణను నేను, రెహ్మాన్ ఎంతో ఆసక్తిగా విన్నాము. సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పురావస్తు ప్రదర్శన, పుస్తక ప్రదర్శన, తెలుగు వెలుగుల చిత్రాల ప్రదర్శన బాగా ఆకట్టుకుంది. ఈ మహాసభలలో అందరికీ విపరీతంగా నచ్చింది కమ్మనైన భోజన ఫలహారాలు. ఈ విషయమై నిర్వాహకులను అభినందించితీరాలి.
ఈ మహాసభలలో అసంతృప్తిని మిగిల్చిన విషయాలూ కొన్ని ఉన్నాయి. సుమారు 1200 కు పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ మహాసభలలో విదేశాలనుండి ఒక్కరంటే ఒక్క రచయితకూడా పాల్గొనక పోవటం చేత ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అనే పేరుకు సార్థకత చేకూరలేదని కొందరు బాహాటంగా విమర్శించారు. (సిలికానాంధ్రకు చెందిన కూచిభొట్ల ఆనంద్ హాజరైనా అతను ప్రతినిధిగా కాక ఒక సదస్సుకు సమన్వయకర్తగా మాత్రమే వ్యవహరించారు.) కొన్ని 'పెద్ద తలకాయలు' కనిపించక పోవటంపై కావాలని వారిని దూరంగా పెట్టారన్న విమర్శలు వినిపించాయి. దీనిని సమర్థించినట్లే నిర్వాహకులు కొందరికి ఆహ్వానం పంపకపోటం, చివరినిముషంలో తూతూ మంత్రంగా వారిని ఫోనుద్వారా పిలవటం జరిగిందని తెలియ వచ్చింది. తెలంగాణా ఉద్యమ ప్రభావం ఈ సదస్సుపై బాగా కనిపించింది. 1200 మంది ప్రతినిధుల్లో తెలంగాణా ప్రాంతం వారి సంఖ్య పట్టుమని పాతిక కూడా లేకపోవడం ఒక లోటు. అలాగే వామపక్ష భావాలు గల రచయితలను, సాహితీ సంస్థలను దూరంగా ఉంచారు. మొదటిరోజు ప్రతినిధుల నమోదు కార్యక్రమం ఒక ప్రహసనంగా సాగింది. క్యూలో గంటలకొద్ది నిలబడిన వారిని కాదని ఇష్టం వచ్చినట్లుగా నమోదు కార్యక్రమం నిర్వహించారు. ప్రతినిధులకు జ్ఞాపికలను కౌంటర్లలో పంపిణీ చేయటం కూడా విమర్శకు దారితీసింది. వేదికపై ఎవరైనా ప్రముఖుని చేతులమీదుగా జ్ఞాపికలను ప్రదానం చేసి ఉంటే అదొక తీయని జ్ఞాపకంగా మిగిలి ఉండేదని కొందరు వ్యాఖ్యానించారు. ఈ సభల్లో సరుకు లేదని ప్రాచీనాంధ్ర గ్రంథమాల జగన్మోహన రావు చేసిన వ్యాఖ్య ఈ సభల తీరుతెన్నులపై కొందరి అభిప్రాయాలకు అద్దం పడుతోంది. సభలో సుదీర్ఘ ఉపన్యాసాలుండవని ప్రకటించిన నిర్వాహకులు వాటిని నిరోధించలేక పోయారు. కొందరు వక్తలు తాము మాట్లాడవలసిన అంశాన్ని వదిలి సందర్భరహితమైన ఉపన్యాసాలతో ప్రతినిధుల సహనాన్ని పరీక్షించారు. వక్తల సందేశాన్ని శ్రద్ధగా వినమని పక్కవారితో మాట్లాడవద్దని పదే పదే వేదిక ముందున్నవారికి విజ్ఞప్తి చేసిన నిర్వాహకులు వేదిక పైనున్న వారు ప్రసంగాన్ని వినకుండా ఒకరి చెవులు ఒకరు కొరుకుతుంటే ఆ సంగతిని పట్టించుకోకపోవటం కనిపించింది. ఏమైనా ఇవి చిన్నచిన్నలోపాలు. ఇంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నప్పుడు ఇలాంటి చిన్నచిన్న పొరబాట్లు సహజం. మొత్తం మీద ఈ మహాసభలు విజయవంతంగా జరిగి పాల్గొన్న ప్రతినిధుల్లో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపినాయి అనటంలో సందేహం లేదు.
ఈ మహాసభల నిర్వహణలో ఎవరి కృషినైనా ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే అది వాలంటీర్లుగా వ్యవహరించిన విద్యార్థినీ విద్యార్థులు వారి ఉపాధ్యాయులూ అందించిన సేవ. వారి సహకారమే లేకుంటే నిర్వాహకులు ఇబ్బంది పడేవారేమో!
ఈ వ్యాసంలో వేదికపై ప్రసంగించినవారి అందరి పేర్లు ఉదహరించకపోవడం ఉద్దేశపూర్వకం కాదని, నా జ్ఞాపకశక్తి వల్ల కలిగిన పొరపాటని గ్రహించమని విజ్ఞప్తి.
11 కామెంట్లు:
నేను పాల్గొనలేకపోయాను అని కొంచెం మనసు బాధగా వుండేది ఆ లోటును కొంత మీరు తీర్చారు.
నేను కూడా కవిసామ్రాట్ గారింటికి వచ్చాను, అది మీరు రాయలేదు :(
బాధపడకు రెహ్మాన్! నీ పేరును కూడా చేర్చాను.
నివేదిక బాగుందండి. సందేశాలను వినిపించిన పెద్దలు (ఆంధ్రజ్యోతి కె. శ్రీనివాస్ వంటివారు) సందేశాలను వినిపించడమే కాకుండా, తాము వాటిని ఎలా అమలు చేస్తామో కూడా చెబితే బాగుండేది. లేక చెప్పారా? ఆంధ్రజ్యోతిలో ఇంగ్లీషును విరివిగా వాడుతూంటారు. ఇకనైనా అది తగ్గుతుందేమో చూడాలి.
బాగా క్రోడీకరించారు.
మీ రిపోర్ట్ బాగుంది..అవి కేవలం కృష్ణ జిల్లా రచయితల మహా సభలు..మాత్రమే..
ధన్యవాదములండీ.
కోతిహళ్ళి(కావాలని చేసిన పొరపాటు) మురళీమోహన్ గారూ, పున్నమి, వెన్నెల పుస్తకాల గురించి అ కు రావొత్తు ఇచ్చిన దాని గురించీ కాస్త రాస్తే బావుండేది. నివేదిక నివేదికలా వుంది. కానీ, ఇలాంటి కార్యక్రమం నిర్వహణ చాలా కష్టమయిన పని. అవునూ, యార్లగడ్డ వారికి నేను సౌశీల్య ద్రౌపది పుస్తకం ఇచ్చిన సంగతి, నేను రెండునిముషాలే మాట్లాడినా, ఆ సమయానికి మీరు సభ వదిలి భోజనానికి వెళ్ళిన సంగతి ప్రస్తావించలేదేమి?
మురళి మోహన్... నీ రిపోర్ట్ బాగుంది. రచయితల సభలకు రావాలని మనసులో ఉన్న అప్పటికే ఉజ్జైన్ ప్రోగ్రాం ఫిక్స్ అయి పోవడంతో రాలేక పోయాను. ఆ లోటును మీ నివేదిక తీర్చింది. ధన్యవాదాలు.
జాన్ హైడ్ కనుమూరిగారూ, చదువరిగారూ, ఆ.సౌమ్యగారూ, పెరుగురామకృష్ణగారూ, వూకదంపుడువారూ, వడ్డి ఓంప్రకాశ్ నారాయణగారూ మీ కౌంటర్లకు ధన్యవాదాలు.
కస్తూరి మురళీకృష్ణగారూ తెలుగు వెన్నెల గురించి వెరే టపా వ్రాశాను. తెలుగు పున్నమి గురించి మీరు వ్రాయండి.
నివేదిక నివేదికలా ఉంది అన్నారు. నివేదిక నివేదికలా కాక మరెలా ఉండాలి?
"ఇలాంటి కార్యక్రమం నిర్వహణ చాలా కష్టమయిన పని" నిజమే. మున్ముందు నిర్వహించబోయే కార్యక్రమాలలోనైనా ఇలాంటి పొరబాట్లు చేయకూడదనే వాటిని ప్రస్తావించాను.
"యార్లగడ్డ వారికి నేను సౌశీల్య ద్రౌపది పుస్తకం ఇచ్చిన సంగతి, నేను రెండునిముషాలే మాట్లాడినా, ఆ సమయానికి మీరు సభ వదిలి భోజనానికి వెళ్ళిన సంగతి ప్రస్తావించలేదేమి?" వాటినెలాగూ మీరు ప్రస్తావిస్తారని తెలుసు. అందుకే మీకే వదిలేసాను :-)
మీరు సభను కళ్లారా చూసి వ్రాసారు సర్. అభినందనలు. నేను తప్పనిసరిగా రిపోర్ట్ ఇవ్వాల్సిన కారణంగా అనేకమంది అక్కడికెళ్ళి వచ్చిన వారి సాధక బాధకాలు ఫోన్ చేసి మరీ తెలుసుకున్నాను. కాని చెప్పిన వారే అక్కడి విషయాలు, పొరపాట్లు చెబుతూనే తమ పేరు సూచించ వద్దని వేడుకోవడంతో అక్కడికి వెళ్ళని నేను విపులంగా రాస్తే అర్థవంతంగా ఉండదని వివరాలు రాసి ఊరుకున్నాను. తర్వాత ఎక్కడ ఇలాంటి సభలు జరిగినా సగం మంది బాధపడటం, మరికొంతమంది ఆనందపడటం మామూలే. అందరికి సరైన విలువ ఇవ్వడం మనకైనా కష్టమే.
కామెంట్‌ను పోస్ట్ చేయండి