...

...

11, సెప్టెంబర్ 2012, మంగళవారం

ఆచార్య వినోబాభావే 117వ జయంతి సందర్భంగా...


(డాక్టర్ సర్దేశాయి తిరుమలరావుగారి రచనలను పరిచయం చేస్తూ డా.నాగసూరి వేణుగోపాల్‌గారి సహసంపాదకత్వంలో ఒక పుస్తకాన్ని వెలువరించాలని సంకల్పించాను. అందులో భాగంగా తిరుమలరావుగారి రచనలు సేకరించే క్రమంలో ఆయన కేవలం విమర్శకుడిగానే కాక సృజనాత్మక రచయితగా కూడా  నిరూపించే రెండు నాటికలు ఒక కథ లభ్యమైనాయి. అందులో ఈ కథ అముద్రితమైనది. ఎక్కడా ప్రకటింపబడలేదు. ఈ కథను తురుపుముక్క పాఠకులకు అందించాలనే ఉద్దేశంతో చక్కని సందర్భం కూడా కలిసిరాగా ఇక్కడ ప్రకటిస్తున్నాను. చదివి మీ అభిప్రాయాలు తెలియజేయండి. చక్కని అభిప్రాయాన్ని తెలియజేసిన వారికి త్వరలో సర్దేశాయి తిరుమలరావుగారిపై వెలువడనున్న పుస్తకం కాంప్లిమెంటరీ కాపీ పంపబడుతుంది.- కోడీహళ్లి మురళీమోహన్)   

భూ సూక్తము (రేనాటి రేగడి నేలల కథ)
"యస్.డి.టి."

         జ్యేష్ఠమాసము. అశ్వపురి స్టేషను వైపునకు ఒక రెండెడ్ల సవారి బండి పోవుచుండెను. అది మాపు. మోడములు సీసపుటావిరివలె అవరించి యుండెను. అవి నిజమైన మేఘములో లేక ప్రొద్దుటినుండి విడువకుండ గాలివీచుచుండుట చేత రేగిన నల్లరేగడి మన్నో. ఊరి పొలిమేరలలోనుండిన పొలములకు గొబ్బరము వేయుటకు మరికొన్ని బండ్లు వెనుక వచ్చుచుండెను. సవారిబండిలో ఏబదిఏండ్ల ఒకాయన, ఆయన కుమారుడు పదునెన్మిదేండ్లవాడు మెయిలు బండినెక్కుటకు పోవుచున్నారు. బండి చక్రములు నల్లరేగడి పొలములలో పోవుచున్నప్పుడు భూదేవికి తలపాపట తీర్చినట్లు గీట్లు పడుచుండెను. ఆయమ్మ పెద్దముత్తైదువకదా. అటు నీలాకాశము. ఇటు కాలావని. ఒక చెట్టులేదు. ఒక గుట్టలేదు. అంతయు నల్లని చదును నేల.


       స్టేషనులోనికి వచ్చిరి. మెయిలు బండి వచ్చెను. అది రెండు నిముసాలే ఆగును. ఎక్కువ మాట్లాడిన అంతమాత్రమైన నిలవననును. బండిలో వచ్చిన వారిర్వురు ఆదరబాదరగ రైలెక్కుటకు ప్రయత్నించుచుండిరి. ఇంతలో రెండవ క్లాసు పెట్టెలో నుండి "ఇష్ట్లారండి" అను పిలుపు వినవచ్చెను. అటు చూచిరి. ఒక జంగముస్వామి కాషాయ వస్త్రములు కట్టుకొని యుండెను. తలకు ఎఱ్ఱని రుమాలు, మెడలో రుద్రాక్షమాలలు, నొసట విభూతి ధరించి యుండెను. అతడున్న పెట్టెలో ఎక్కిరి. ఎక్కిన వారిలో పెద్ద "నమస్కారం స్వామీ! రక్షిస్తిరి. లేకుంటే రాత్రివరకు పడిండాల్సొచ్చేది" అని సీటుసర్ది కొడుకుని కూర్చొనుమని మఱల సాగించెను. "నేను రామాపురం రెడ్డి గంగిరెడ్డిని. మావాడు స్కూల్ ఫైనలు ప్యాసయినాడు. మదరాసులో కాలేజీలో చేర్చుదామని పోతున్నాను. స్వామికి నమస్కారం చేయరా భీమిరెడ్డీ" అని మందలించుచు "నాకేదో వేయిఎకరాల రేగడి ఉన్నది స్వామీ. నాకు చదువంటలేదు. ఈ తరం వాళ్లయిన బాగుపడని అని అనుకొన్నాను" ఇంక ఏమేమో చెప్పుచు పోవుచుండెను. స్వామి మాట్లాడకుండ తల మాత్రమూచు చుండెను. మెయిలుబండి వేగముగ ముందుకు పోవుచుండెను. భీమిరెడ్డి తలపులంతకంటె వేగముగ వెనుకకు సాగిపోవుచుండెను. మొన్ననే ఏరువాక పున్నమ. వారి ఎద్దే తూరుపు సీమకోడె రంగడు కరిత్రెంపెను. రాతిదూలము గుంజెను. రాత్రి బ్యాండు మేళములతో మెరవణి చేసిరి. ఇది అనుకొన్నపుడు భీమిరెడ్డి కేడ్పువచ్చెను. మద్రాసు చదువు వలదనిపించెను. భూములున్నవి కదా అనిపించెను.

     నిజమే. వారు పృథ్వీపుత్రులు. పాదపములకువలె వారి వ్రేళ్లుకూడ భూమిలో పాతుకొని యున్నవి. వారు ఆహారసారమును భూమినుండియే పీల్చుదురు. భూమి వారికాణాచి. నల్లరేగడి నేలలోని చెట్లను చూడుడు! వానిని పెఱికి వేయుడు. వానిని మరల నాటలేము. అవి నశించినవనియే అర్థము. కాని వానిని పెకిలించివేయుట కష్టము. అచటి జనులు అంతే. వారిని వారి భూమినుండి తొలగింపుడు. మఱి ఊపిరి పీల్చలేరు. వారి రక్తమాంస స్నాయుమజ్జాస్థులు అన్నియు భూమియే. ఆ మృత్తికామయములే. మధుకైటభుల మేదస్సీ భూమి. ఈ భూమియే ఈ పృథ్వీపుత్రుల మేదస్సు నాక్రమించినది. ఇది అతిశయోక్తి కాదు స్వభావోక్తి కావున సామాన్యము. అచటి చెట్లును సామాన్యమైనవి. తమ కోమల కుసుమ సౌరభ్యమున గాలి తెమ్మరలను గుబాళింప జేయలేవు. మధుర రసాన్వితమైన ఫలముల మనకీలేక పోవచ్చును. కాని తమ శీతలచ్ఛాయల వలన మనకు హాయిగొల్పును. హరితమును జీవరాశి కొసగి జీవకణముల నమరముగావించును. ఆ జీవరస వాహినికి మూలములు - ఏ జీవరసము ఎన్ని ప్రళయములు వచ్చినను, ఎన్ని గ్రహములు పెటిలి పకిలినను, ఎన్ని నక్షత్రములు చల్లారి పోయినను, ఎన్నెన్ని ధూమకేతువులు తమ వజ్రనిభమైన తోకలతో భూమిని తాడించినను నిరర్గళముగ నూత్న నూత్నముగ యుగయుగాల ప్రవహించినదో - ప్రవహించుచున్నదో - ప్రవహించునో! మరి ప్రజయో? చెట్లవలనే! ప్రపంచ మానవ చరిత్రలో భయానక దండయాత్రలు జరిగినవి. నాగరికతలు, వ్యవస్థలు రూపుమాసినవి. సామ్రాజ్యములు శిథిలమయినవి. ఒక్కొక్క సారి కావ్య సంగీత శిల్పాది కళలు కూడ వికృత విరసములైనవి. మానవ పతనమునకే దోహదకారులైనవి. అహో! మానవులు సమూలముగ నశింతురా అన్న సమస్య వచ్చినపుడు "లేదు" అని నిరూపించినదెవరు? పృథ్వీపుత్రులు. కారణము? వారి తల్లి భూమి. తండ్రి ఇంద్రుడు. అన్నదమ్ములు మిత్రావరుణులు. ఈ ప్రజ సోమకాసురుడు వేదములెత్తుకొని పోయినప్పుడిట్లే ఉండిరి. రోమను చక్రవర్తి నీరో తన నగరము కాలునప్పుడానందించినప్పుడిట్లే యుండిరి. ఈన్‌స్టీన్ తన "రిలెటివిటి" సిద్ధాంతము ప్రకటించినప్పుడిట్లేయుండిరి. హిరోషిమా నగరముపై అణుబాంబుపడి అనంత జీవరాశి తృటిలో తుదముట్టినపుడిట్లే యుండిరి. లిప్త లిప్తకు తన జీవమును బలిఖండములుగ సంపూర్ణముగ వ్రేల్చి మన మధ్యనుండి ఒక మహాపురుషుడు వెళ్లిపోవుచున్నపుడిట్లే యుండిరి. ఇది వారి స్థాణుత్వము కాదు. ఇది వారి చైతన్యము. అది వారి మృతత్వపు సంగతి కాదు. అమరత్వపు సంగతి. 

  భీమిరెడ్డికేడ్పు వచ్చుటకు కారణము తాను భూమినుండి పెల్లగింపబడినట్లు అనిపించుట.


        మెయిలుబండి నంచెర్ల స్టేషనులో కూతమాత్రమువేసి పొగలు క్రక్కుచు రోకలి బండవలె దొర్లిపోయెను. 


* * *

      మూడు నెలలైనవి. మనవాడెట్లున్నాడో చూతమని మద్రాసుకు పోయెను గంగిరెడ్డి. హాస్టలులోని కొడుకురూముకు పోయెను. దానికి 'మాష్టర్' బీగముండెను. ఆ పల్లెటూరి భారీ మనిషినిజూచి ప్రక్కరూములోని యువకు లందరు వచ్చిరి. ఇంజనీరింగు కోర్సు చదువు ఆచార్ వచ్చి వేఱు బీగముచెవితో భీమిరెడ్డి గది వాకిలి తెఱచెను. వెంటనే లోనుండి గుప్పుమని సువాసన వచెను. అందఱు లోనికి పోయిరి. ఒక ప్రక్క గోడకు ఎవరో యువతీయువకుల రంగుల ఫోటోలుండెను. 

        గంగిరెడ్డి వానిని చూచి "ఇవి ఎవరివప్పా" అని యువకులనడిగెను. ఒక విద్యార్థి "అవి రెడ్డీ! సినిమా - సినిమా ఫోటోలు. ఈఫోటో అశోక్‌కుమార్‌ది. ఇది ఎరోల్‌ఫ్లిన్‌ది. ఇది గ్రిగరీపెక్‌ది" అని చెప్పుచుండెను. గంగిరెడ్డి వేఱు గోడపైన యువతుల ఫోటోలుచూచి తానే "ఇవి ఆడ ఆక్టర్ల ఫోటోలా?" అని అడిగెను. అలమారులో చూచెను. ఫిల్మిండియా, అభిసారిక మున్నగు పత్రికలు రాసులు పడి ఉండెను. ఒక ప్రక్కన గాజు సీసాలు రంగురంగులవి డబ్బీలు ఫ్యాన్సి షాపులోవలె అమర్చబడి యుండెను. "నాయనలారా! ఇవన్ని ఏమి?" అని చిఱునవ్వుతో అడిగెను ముసలిరెడ్డి.  "సినిమా పత్రికలండి. మీవాడు అన్ని సినిమా పత్రికలు కొనును. వెనుకటి పది సంవత్సరముల పాత సినిమా పత్రికలన్నీ కొన్నాడు. బైండు చేయించండి" అని అపహాస్యముగ ఒకడనెను. "ఓ తప్పకుండ చేయిస్తాను. కాలికోబైండు చేయిస్తాను. నాకేమి మావాడు పైకొస్తే అంతే చాలు" అని రెడ్డి అనెను. "ఔనౌను" అని ఒక యువకుడనెను. హిహిహీ అని అందరు నగిరి. "ఈ సీసాలో" అని ఆయన వారినడిగెను. "ఇవి స్నోలు, పౌడరులు హేరాయిలు" ఒక కొంటెవాడు జాబితా ఇచ్చుచు పోవుచుండెను. "మావాడు అతినాజూకులెండి. అన్నమైన లేకుండా ఉంటాడుగాని ఇవిలేకుంటే ఉండనేలేడు" అని నవ్వుచు గంగిరెడ్డి ఊగిపోవుచుండెను. తన కుమారుడు మేరుపర్వతమెక్కినట్లు ఉబ్బిపోవుచుండెను. ఈ మూడునెలలలో పంపిన తొమ్మిదినూర్లు కొడుకు సార్థకపఱచినట్లు భావించుచుండెను. ఇంతలోనే భీమిరెడ్డి వచ్చెను. దవడలు, గడ్డము బాగుగా గీకబడి తళతళలాడు చుండెను. కళ్లు ఈచుకొనిపోయినట్లుండెను. ఉలన్ ట్రౌజరు, లినన్ స్లాక్ ధరించిన అల్ట్రామాడర్న్ యూత్ కొడుకుని చూచి వాత్సల్యముతో "బాగున్నావేంరా నాయనా" అని అడిగెను. "ఈ ఫోటోలు ఎవరివిరా చాలాబాగున్నవి" అని కొడుకునడిగెను. భీమిరెడ్డి "నా హీరోలవి నాయనా" అని నీరసమైన గొంతుతో చెప్ప తండ్రి తన పుస్తి మీసాలు రెక్కలు విప్పి యాడ అహాహా అని అట్టహాసము గావించెను.


* * * 

     "ఇదేమి వీడు మూడుసార్లు మనియార్డరు చేసిన దుడ్లను వెనుకకు పంపినాడు. జాబైన వేయలేదు. అయ్యో ఏమిగతి ఆయెనో చూచైన వస్తాను" అని దిగులుజెంది గంగిరెడ్డి మద్రాసుకు పోయెను. కొడుకున్న గదికి పోయెను. వాకిలి వేసియండెను. ఊరక గడిమాను వేయబడియుండెను. తలుపులుతీసి లోనికి పోయెను. ప్రక్కగదిలోని విద్యార్థి అచటికి వచ్చెను. "మావాడేమైనాడు నాయనా చెప్పు. ఏమి రూమంతా ఇట్లు బోసిగ ఉన్నది" అని ఆతురతతో ప్రాధేయపడెను.

     "మీవాడు ఆ పత్రికలు, ఫోటోలు ఎన్నడో కాల్చివేసినాడు. సెంటు సీసాలు పగులగొట్టినాడు. ఇదిగోచూడండి ఇవేవో పుస్తకాలు కొన్నాడు. డేవిడ్ థోరూ వ్రాసిన వాల్డెన్, హెన్రీజార్జి అనువాడు వ్రాసిన ప్రోగ్రెస్ అంద్ పావర్టీ, గాంధీ వ్రాసిన సర్వోదయ, భట్టాచార్య అనేవాడు వ్రాసిన సోమెనీ హంగర్సు, విద్వాన్ విశ్వమట ఆయన వ్రాసిన పెన్నేటిపాట ఇంకా ఏవేవో చెత్త పుస్తకాలు కొన్నాడు." అని చెప్ప ఆ ముసలివాడు "అయ్యో! ఆ వాడెంత చెడిపోయినాడు. ఇంకేమి దిక్కు స్వామి!" అని వాపోవసాగెను. ఈ పుస్తకములు చదువ భీమిరెడ్డి చెడెనా? అట్లయిన దేశమంతయు నిట్లే చెడిన నెంత బాగుండును!! ఆ యువకునందీ మార్పుకు కారణమేమో?

     ఉత్తుంగ హిమశిఖరములపై దేవదారువులు బారుగా నిల్చియుండుటకు కారణమేమి? దేవాలయపు గోడల పగుళ్ల మధ్యనుండి రావిమొక్క ఎదుగును. అచ్చట బీజమెవరు వేసిరి? ఒకభావము మనుష్యుని మెదడనే క్షేత్రమందు పడుటకు కారణము వెదుక పనిలేదు. అది కార్యకారణసంబంధము లేని ఒక దివ్య సంఘటన. సూర్యకిరణముల తాకిడికి కమలములు వికసించును. అది కిరణముల వైశిష్ట్యమా? కమలముల వైశిష్ట్యమా? చందురుని నుండి వెలువడ్డ వెండివెలుతురుకు కలువలు హసింప అది తొగలరాయని ప్రభావమా? కలువల నైజమా? మాఘావృతాకాశమున తళుక్కుమని మెఱసి ఉఱిమినపుడు బండక్రింద జీవసమాధిలో నుండు కప్ప చటుక్కున ఎగిరి చైతన్యవంతమైనది. అది మేఘ ప్రభావమా? మండూక విశిష్టతయా? సూర్యునిదే వైశిష్ట్యము, చంద్రునిదే ప్రభావము, మేఘమే కారణమని భావాంబరవీధిలో వివశత్వ విహారులగు కవులు సెలవిచ్చిరి. కమలములదే, కలువలదే, కప్పలదే గొప్పయని నేడు మనమందుము. దివ్యమనఃపరిణామమును, ఆత్మానుభుతిని కల్గించు మహాభావములు దేహికలో ప్రవేశించుటకు సూక్ష్మాతిసూక్ష్మరూపములో వేచియుండుని. వానిదేమియు గొప్పకాదు. అవి సార్వదేశీయము, సార్వకాలీనములు. కాని వాని నాత్మీయము గావించుకొను మనఃప్రవృత్తిలో ఉన్నది గొప్పతనము. అట్టి అనుభావమేదో భీమిరెడ్డికి గలిగినది. 

     గంగిరెడ్డి కుంది కుమిలి పోవుచున్నాడు. రోషదుఃఖములు కలిసి అతని నూగించినవి. అట్టి అవస్థలో అతడుండగా భీమిరెడ్డి వచ్చెను. ఖద్దరుపంచె, జుబ్బా, పల్లెవాటు ధరించి  ఉండెను. గడ్డము మాసియుండెను. మొగమున ఒకవిధమైన జ్యోతి వెలుగు చుండెను. అతనివెనుక కొందఱు రైతులు వచ్చుచుండిరి. కొడుకును చూడగనే గంగిరెడ్డి గద్గదస్వరమున "ఇదంతా ఏమి నాయనా!" అని వాపోయెను. "మన ఆదర్శవీరుని కరుణాకటాక్షం నాయనా!" అని భీమిరెడ్డి ప్రశాంతముగ ప్రత్యుత్తరమిచ్చెను. ఇదివఱకే రగిలి పోయిన గంగిరెడ్డి "ఎవడురా నీవీరుడు?" అని మంటలు గ్రక్కుచు గాండ్రించెను. "వినోబాభావే" అని తీయని గొంతుతో చెప్పుచు భీమిరెడ్డి దరహాసచంద్రికలు వెదజల్లెను.

     ఆనాడే ఆచార్య వినాబాభావే భూదాన యజ్ఞార్థము యావత్తు ఆంధ్రదేశ పదయాత్ర ఆరంభించి ఉండెను.   

కామెంట్‌లు లేవు: