...

...

4, నవంబర్ 2012, ఆదివారం

'అంతర్ముఖం' అంతరార్థం!


అడపా చిరంజీవిగారి అంతర్ముఖం  కథ నాకు ఎంతగానో నచ్చింది. ఆత్మహత్యకు సిధ్ధపడ్డ వ్యక్తి  నిర్ణయం  మార్చుకుని ఆత్మహత్య వద్దని నిర్ణయింప చేసే కధలలో ఒకటి.   మనిషిలోని మనసుకి ఒత్తిడి, నిరాశ కలిగినప్పుడు దానినుంచి విముక్తి చెందటానికి,  శరీరాన్ని కూడా బలవంతంగా అంతం చేసి ఆత్మహత్య  ద్వారా అన్ని సమస్యలకీ  పరిష్కారం దొరుకుతుందను కోవటం  చాలా మూర్ఖత్వం. ఆత్మహత్య  పరిష్కారం కాదన్న  విషయాన్ని చాలా చక్కగా కథలో ఇమిడ్చారు. ఆత్మహత్య చేసుకునే ముందు పడే వేదనని రచయిత    క్లుప్తంగానైనా, ఎంతో బాగా వర్ణించారు.
జీవితమంటే జీవించ తగ్గదన్న అర్థం స్ఫురిస్తుంది. కాని జీవితంలో ఎంత మంది జీవితాలు జీవించటానికి హితముగానూ, జీవించ తగ్గవిగాను ఉన్నాయని ఆనందిస్తున్నారు అని ప్రశ్నిస్తే?... దానికి అనేకానేక హేతువులతోనూ, సమర్థింపులతోనూ  కొరతలతోనూ కూడుకున్న జవాబులు లభిస్తాయి. ఎంతో తాత్వికత కలిగిన మనుషులు తప్ప తమ జీవితాలను  నిండుగానూ తృప్తికరంగానూ పరిగణించలేరు. సాధారణ మానవులు తమ జీవితాలను నిండుతనం లోపించటానికి అనేకానేక కారణాలను పేర్కొంటారు.  కొందరు తీరని ఆశలని  పేర్కొంటే, మరికొందరు జీవిత పరమావధిని అందుకోలేక పోయామని బాధ పడవచ్చు. 
ఇహ పర సుఖాలను ప్రతివారు  వారి వారి  పరిధికి తగ్గట్టు కాంక్షించవచ్చు, కాని పుట్టిన ప్రతి జీవి తన మరణాన్ని గురించి తనకు తెలియకుండానే ఒక ఊహకి అందని కధని  అల్లుకుంటాడు. జనులంతా తమ ప్రమేయం లేకుండానే  ఈ భువిలోకి రావటం జరుగుతుంది... అలానే ఏదో ఒక నాడు తమ ప్రమేయం లేకుండానే ఈ జగతిని వీడి పోవలసి ఉంటుంది... ఈ రెండిటికీ కూడా కొందరు  భగవంతుడిని నమ్మితే మరికొందరు  ఏదో అలౌకిక శక్తి కారణమని నమ్ముతారు. మన జీవన    మరణాలను  మన కర్మలే నిర్ణయిస్తాయన్న  విషయాన్ని మన కర్మ సిధ్ధాంతం బోధిస్తోంది. సాధ్యమైనంత  సంతోషంగా మలచు కోవలసిన జీవితాన్ని అసంతృప్తితో అంతం చేసుకోవడం ఏ విధంగా న్యాయం ?   

ఆత్మహత్యకి సిధ్ధ పడ్డవారిచే అన్యులు బలవంతంగా  కారణాలని చెప్పించటం కాక ప్రశాంతతని సృష్టించి అతడి చేతే కారణాలని ఆసాంతం  ఋషివర్యుడు  చెప్పించిన శైలి  బాగుంది.
ప్రభుత్వ ఉద్యోగులు మితమైన ఆదాయంతో కనీస  అవసరాలని కూడా తీర్చుకోలేక, సమాజంలోని పలువురి విలాసవంతమైన జీవితాల్ని చూసి, తాము  కనీస  కోరికలను కూడా  తీర్చుకోలేక పోతున్నామేనని బాధ పడుతున్నట్లు దైనీయంగానూ, దాన్ని సమర్థిస్తున్నట్లు   సన్నివేశాన్ని సృష్టించి, దాన్ని   విశ్లేషణాత్మకమైన  కోణం వైపుకు మళ్ళించిన తీరు కధకే హైలైటు. ప్రతీ మనిషి జీవించటం ద్వారా సమాజంలో మరికొంత మందికి బతికే అవకాశం లభిస్తోందన్న పాయింటు పాఠకులని కూడా అలోచింప చేస్తుంది. ప్రతీ మనిషి తన స్థాయినుంచి పై  మెట్టుకి ఎదగాలన్న తపనతో పడే పోరాటాని సమర్ధిస్తున్నట్లు వ్రాస్తూనే, అసంబధ్ధమైన కోరికలు ఆవరించటమే అన్నిట్లకీ మూల కారణమని, వాటిని  తృణ ప్రాయంగా ఎంచి విముక్తి చెందిన నాడే జీవితం చరితార్ధమౌతుందని మునివర్యునిచే చెప్పించి, మార్మికమైన నీతిని, కథ ద్వారా బోధించారు రచయిత.  
అరి షడ్వర్గాలని జయించేటంతటి గొప్పతనం సామాన్య మనుషులలో లేక పోయినా ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలని  జయించటానికి తాత్కాలికంగా వాటిని వాయిదా వేయటమే  మంచి ఉపాయమని  సూచించించారు. మరీ పొడుగైన కథలు చదివే తీరిక యువతకి ఉండదు, క్లుప్తతలోనె కథా వస్తువు, నీతి విశ్లేషణ, ఇలా ఎన్నెన్నో చొప్పించిన ఘనత రచయితది.   హీరో ఆత్మహత్యని వాయిదా వేయడం అతన్ని అంతర్ముఖునిగా మారుస్తుంది...
జీవితంలో ధ్యేయాలని,  ఆకంక్షలని, ప్రేమించిన మనస్సులని అందుకోలేక డిప్రెషన్నుకిలోనై   నిరాశతో దుడుకుగా,  ఆత్మహత్యలనే  శరణు  జొచ్చుతున్న యువత,  తమ సన్నిహితులకి  తమ మరణం ఎంతటి దుఃఖానికి  గురి చేస్తుందో ఆలోచించి క్షణికమైన ఉద్రిక్తతను అదుపులో పెట్టుకున్నట్లైతే  ఎన్నెన్నొ యువ జీవాలు కాపాడ బడుతాయి. 
కథకి ముఖ్యుడైన హీరోకి గాని, ఋషివర్యునికి గాని, ఏ పేరూ  పెట్టకుండానే ఆ పాత్రధారులని గూర్చి లోతుగా చదువరిని  ఆలోచింప చేసే రచయిత కథా శిల్పం మెచ్చుకో తగ్గది. ఋషి అతడిని అంతర్ముఖినిగా చేసి ఆలోచింప చేసి, ఇంకే బోధనల్ని, జీవిత సులువుల్ని మళ్ళీ బోధించకుండా ధ్యానంలో మునిగి పోవటం కథకి ఎంతో గంభీరత్వాన్ని  అందిస్తుంది. 
హీరొకి మరణం నుంచి  విముఖత ఏర్పరచి బ్రతుకుపై ఇష్టం కలిగినప్పుడు వచ్చే ఉప్పెనలాంటి ఆనందానుభూతికి  పాఠకులని కూడా కొని పొయి హేతువాదాన్ని ద్రుఢ  పరిచిన రచయిత ప్రశంసనీయులు.  

- లక్ష్మీమాధవ్

(భావతరంగాలు బ్లాగు సౌజన్యంతో) 

కామెంట్‌లు లేవు: