[పుస్తకం పేరు: వంశీమోహనము - శ్రీకృష్ణ స్వర్వస్వం, సంపాదకులు: డా.టి.శ్రీరంగస్వామి, వెల: రూ.250/-, ప్రచురణ: శ్రీలేఖ సాహితి(సాహిత్య సాంస్కృతిక సంస్థ), ఇంటి నెం. 14-5/2, మండల కార్యాలయము ఎదురుగ, హసన్‌పర్తి, వరంగల్లు 506 371, ప్రతులకు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ మరియు దాని శాఖలు]
భారతీయ వాఙ్మయంలో ప్రత్యేకించి సంస్కృతాంధ్రాలలో శ్రీకృష్ణుని దర్శనాన్ని వివరించి విశ్లేషించే 32 వ్యాసాల సంపుటమిది. శ్రీకృష్ణుని బహుముఖమయిన అన్ని పార్శ్వాలనూ స్పృశించే ఈ గ్రంథానికి శ్రీకృష్ణ సర్వస్వం అనే నామాంతరం కూడా సరిపోయింది. కోవెల సుప్రసన్నాచార్య, కపిలవాయి లింగమూర్తి, సముద్రాల లక్ష్మయ్య, ఆముదాల మురళి, ఎన్.అనంతలక్ష్మి, తంగిరాల వెంకటసుబ్బారావు, ధారా రామనాథశాస్త్రి, హెచ్.ఎస్.బ్రహ్మానందం, వి.ఎ.కె.రంగారావు, అంబికా అనంత్,జి.ఎస్.మోహన్, కోలవెన్ను మలయవాసిని, ద్వారం లక్ష్మి, సామల సదాశివ, టి.శ్రీరంగస్వామి, రావి ప్రేమలత మొదలయిన దిగ్గజాలు శ్రీకృష్ణ తత్త్వాన్ని విశ్లేషించిన వైనాన్ని ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.
శ్రీకృష్ణుడు క్రీ.పూ.3228లో జన్మించి 125 సంవత్సరాలకు పైన జీవించాడనీ, మహాభారత యుద్ధం నాటికి శ్రీకృష్ణుని వయసు 90 యేళ్ళని, తన జీవితకాలంలో పూతన, శకటాసుర, తృణావర్త, వత్సాసుర, బకాసుర, అఘాసుర, ధేనుకాసుర, ప్రలంబ, శంఖచూడ, వృషభాసుర, రజక, చాణూర, ముష్టిక, కంస, కాలయవన, శంబరాసుర, నరకాసుర, రుక్మి, బాణాసుర, పౌండ్రక వాసుదేవ, సుదక్షణ ద్వివిద, శిశుపాల, దంత్రవక్త, విదూరధ, వ్యోమాసుర, ముర,సాళ్వ మొదలైన 29 మంది దుష్టులను సంహరించినట్లు ఈ పుస్తకం ద్వారా తెలుస్తుంది.
భాగవత రహస్యమంతా శ్రీకృష్ణోపనిషత్తాత్పర్యంగా రూపొందిందని నిరూపించే వ్యాసంతో ప్రారంభమయిన ఈ పుస్తకంలో మేఘకావ్యమ్, గర్గ సంహిత, రాధికోపనిషత్తు, శ్రీకృష్ణకర్ణామృతము, రాధికా స్వాంతనము, గీతాగోవిందము కృష్ణస్తవరాజం మొదలైన రచనలలో శ్రీకృష్ణుని వివిధ రూపాలలో సాక్షాత్కరింపజేసే వ్యాసాలున్నాయి. మీరా, అన్నమయ్య, పురందరదాసు మొదలైన అనేక వాగ్గేయకారుల కీర్తనలలో శ్రీకృష్ణ ప్రశస్తిని వ్యక్తపరిచే వ్యాసాలేకాక, హిందుస్తానీ సంగీతంలో శ్రీకృష్ణభక్తిని వివరించే రచనకూడా ఈ పుస్తకంలో పాఠకులకు కనువిందు చేస్తుంది. భగవద్గీతలోనూ, భారత, భాగవతాల్లోనూ పాండవపక్షపాతిగా, గీతాచార్యునిగా, అవతార పురుషునిగా, గోపబాలకుడిగా శ్రీకృష్ణుని రూపించే వ్యాసాలు, తమిళనాడులోని శ్రీకృష్ణారణ్య క్షేత్రాలను వివరించే వ్యాసం కూడా ఈ పుస్తకంలో వున్నది. విశ్వనాథ సత్యనారాయణ కావ్యాలలోనూ, వేంకట పార్వతీశ కవుల బృందావన కావ్యంలోనూ శ్రీకృష్ణ వర్ణనలు తెలిపే రచనలు ఈ పుస్తకంలో చోటుచేసుకున్నాయి. ప్రబంధ సాహిత్యంలోనూ, జానపద వాఙ్మయములోనూ, శతక సాహిత్యంలోనూ, నాటక సాహిత్యంలోనూ, సినిమా పాటల్లోనూ, నవలల్లోనూ శ్రీకృష్ణ దర్శనాన్ని చేయిస్తుందీ పుస్తకం. పర్యావరణ పరిరక్షణలో శ్రీకృష్ణుని పాత్రను కూడా మనకు తెలియజేస్తుంది. కేవలం ఆధ్యాత్మిక జగత్తుకే కాకుండా సాహిత్యాభిలాషులకు,సామాన్య పాఠకులకు ఎంతో ఆసక్తిని కలిగించే రచన యిది. ఈ మధ్య కాలంలో చదివిన పుస్తకాలలో నాకు బాగా నచ్చిన పుస్తకం ఈ వంశీమోహనము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి