బిలబిలాక్షులేమొ తిలలను పెసలనే
కాదు, కంకి గింజ కానబడిన
పొడిచి,పొడిచి రాల్చి పొలిపుచ్చు పంటను
జడుపుతోడగాని విడిచిపోవు
పై పద్యాన్ని చదివితే వెంటనే మనకు శ్రీనాథుని ఈ క్రింది చాటు పద్యం గుర్తుకు వస్తుంది.
కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?
శ్రీనాథుడేమో బిలబిలాక్షులు తిలలు పెసలు తినిపోయాయని వాపోతుంటే
పైన ఉదహరించిన పద్యం చెప్పిన కవి తిలలు పెసలే కాదు అవి జొన్న కంకులను కూడా వదలవయ్యా
బాబూ అని అంటున్నాడు. ఇలా శ్రీనాథుని ఆక్షేపించడం
అల్లాటప్పా కవుల వల్ల సాధ్యమయ్యే పని కాదు. దానికి చాలా సత్తా కావాలి. అలాంటి సత్తా, సారం కలవాడు కాబట్టే ఈ కవి కాళిదాసు
కుమారసంభవ, మేఘసందేశ, రఘువంశాదులను, బాణుని కాదంబరిని, భారవి కిరాతార్జునీయాన్ని, మాఘుని
శిశుపాలవధను, దండి దశకుమార చరిత్రను, కల్హణుని రాజతరంగిణిని, సోమదేవభట్టు కథాసరిత్సాగరాన్ని
తెలుగు పాఠకులకు అరటి పండు వొలిచి ఇచ్చినట్లు అందజేయగలిగాడు. అంతటి సత్తా కలవాడు కాబట్టే పదిహేనో యేటనే కవిత్వం
చెప్పడం ప్రారంభించి ఇరవయ్యవ యేటనే విరికన్నె అనే తొలి కావ్యాన్ని ప్రకటించగలిగాడు.
ఒకనాడు, నా హృదయం, పెన్నేటి పాట మొదలైన జీవత్‌కావ్యాలను సృజించగలిగాడు. ఈయన కవి మాత్రమే
కాదు పండితుడు, రాజకీయవేత్త, పత్రికా సంపాదకుడు, సంఘసేవకుడు కూడా. అలాంటి వ్యక్తి గురించి
ఒకటి రెండు విషయాలు ఇక్కడ ముచ్చటించుకుందాం.
ఈయన 1938 ప్రాంతంలో తరిమెల నాగిరెడ్డితో కలిసి నవ్యసాహిత్యమాల
పేరుతో ఒక పుస్తక ప్రచురణ సంస్థను అనంతపురంలో ప్రారంభించి సుమారు 22 గ్రంథాలను ప్రచురించాడు. వాటిలో ఎక్కువ భాగం ఈయన వ్రాసినవి, అనువాదం చేసినవి
ఉన్నాయి. సమీక్ష, ఫాసిజం, లెనిన్, ఏమిచెయ్యడం, పాపం మొదలైన పుస్తకాలను వ్రాసి ఈ నవ్యసాహిత్యమాల
ద్వారా ప్రకటించి ప్రజలను చైతన్య పరిచాడు.
నవ్యసాహితి అనే పేరుతో ఒక పత్రికను
సైతం తరిమెల నాగిరెడ్డితో కలిసి నడిపాడు. ఆకాశవాణి
అనే రహస్య పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. రాజద్రోహం నేరం క్రింద తరిమెలనాగిరెడ్డి,
పప్పూరు రామాచర్యులు మొదలైనవారితో కలిసి కారాగారవాసం చేశాడు. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలలో చురుకుగా పాల్గొని
జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా, రైతుసంఘ కార్యదర్శిగా, క్షామనివారణ సంఘకార్యదర్శిగా,
జిల్లా రైతుమహాసభకు ఉపాధ్యక్షుడిగా, అనంతపురం మండల ఆంధ్రమహాసభకు కార్యదర్శిగా సేవలనందించాడు.
కేవలం ఉపన్యాసాల ద్వారా, ఉద్యమాల ద్వారా కాక ఇంకాస్త లోతుగా
దిగి జనంలో ముఖ్యంగా ఆలోచనాపరులైన యువతలో రాజకీయాలు శాస్త్రీయంగా తెలపాలన్న ఆశయంతో
రాజకీయాలనుండి తప్పుకుని పత్రికా రచనవైపు ఈయన తన దృష్టిని సారించాడు. హైదరాబాదులో మీజాన్
పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరి కొన్నాళ్లు పనిచేశాడు. తరువాత ప్రజాశక్తి దినపత్రిక సంపాదకుడిగా, ఆంధ్రపత్రిక
దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఆంధ్రజ్యోతి దినపత్రికలో సహాయ సంపాదకుడిగా, ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా,
ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక సంపాదకుడిగా అవతారం
ఎత్తి తెలుపు-నలుపు, అవీ... ఇవీ..., ఇవాళ, మాణిక్యవీణ మొదలైన శీర్షికలను నడిపాడు. ఎన్నో
గేయాలను, వ్యాసాలను, పద్యఖండికలను, సమీక్షలను వ్రాశాడు. అనువాదాలను చేశాడు. పత్రికా సంపాదకుడిగా పదవీవిరమణ చేసిన తరువాత తిరుమల
తిరుపతి దేవస్థానం వారి ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకుడిగా వేదాలతో పాటు ఎన్నో
సంస్కృత గ్రంథాలను అనువాదం చేశాడు. నిజాం రేడియోలోనూ,
మద్రాసు ఆకాశవాణి ద్వారాను ఎన్నో ప్రసంగాలు చేశాడు.
కొన్ని లక్షల పుటల వాఙ్మయాన్ని సృజించి అశేష పాఠకులను ప్రభావితం
చేసిన ఈ మహానుభావుడి గురించి ఎంతని చెప్పగలం. ఏమని చెప్పగలం. ఒక ముక్కలో చెప్పాలంటే
ఈయన పేరు విద్వాన్ విశ్వం!
(ఈరోజు విద్వాన్ విశ్వం 100వ జయంతి )
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి