...

...

22, ఫిబ్రవరి 2009, ఆదివారం

చెప్పుకోండి చూద్దాం!కి - సమాధానాలు.

1.కస్తూరి మురళీ కృష్ణ
2.నవ్య దీపావళి ప్రత్యేక సంచిక-2008 లో ప్రచురింప బడింది.
3.'రాతలు - కోతలు' కస్తూరి సాహిత్య లోకం, murali's chacolate factory
4.అసిధార, అంతర్మథనం
5.ఇద్దరి పేర్లలో మురళి అనే పదం ఉంది. ఇద్దరూ రైల్వే శాఖలో సికందరాబాద్‌లో పనిచేస్తున్నారు.
6.ఇద్దరూ తోడికోడళ్ళు.
7.లెక్కలేనన్ని సార్లు.
8.పఠాభి (తిక్కవరపు పట్టాభి రామి రెడ్డి)
9.'సరస్వతీపుత్ర' శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులు ఈ కావ్యాన్ని అతి పిన్న వయసులో వ్రాశారు. వారు విద్వాన్ పరీక్షకు ఈ కావ్యాన్ని ఒక పాఠ్యాంశంగా చదివారు. తాము రాసిన పుస్తకాన్నే చదివి పరీక్ష వ్రాయడం ఒక వింత అనుభవం.
10.అనంతపురం మండలానికి చెందిన కోగిర జై సీతారాం అనే కవికి కవికాకి అనే బిరుదు ఉంది. వీరు కావ్‌కావ్ శతకము, కాకిగోల మొదలైన కావ్యాలు వ్రాశారు.

21, ఫిబ్రవరి 2009, శనివారం

పొడుపు కథ!

మా అమ్మాయి ఏదో కావాలని అంటే వెతకడానికి పాత ట్రంకు పెట్టె తెరిచాను. అందులో అనుకోకుండా పొడుపుకథలు అనే పుస్తకం కనిపించింది. చల్లా రాధాకృష్ణ శర్మ గారు సంకలనం చేయగా పబ్లికేషన్ డివిజన్ వారు ప్రచురించారీ పుస్తకాన్ని. ఆరేడేళ్ళ క్రితం పిల్లల కోసం బుక్ ఎక్జిబిషన్‌లో కొన్నట్టున్నాను ఈ పుస్తకాన్ని. చాలా ఇంట్రెస్టింగ్‌గా చదివించిన ఈ పుస్తకాన్ని ఇంతవరకూ చదవకుండా ఎలా మిస్అయ్యానబ్బా! పొడుపు కథలూ వాటి జవాబులూ చదువుతూ ఉంటే చాలా సంతోషం వేసింది. కొన్ని మీతో పంచుకోవాలని అనిపించింది. కానీ ఈ పొడుపు కథలు చాలా మందికి తెలిసే వుంటుందనే అనుమానం. ఈ పొడుపు కథల్లో చివరి పొడుపు కథ ఒకటి పద్య రూపంలో ఉంది. (అంటే అదొకటే పద్యరూపంలో ఉందని కాదు.180నుండి 205 సంఖ్య గల పొడుపులు పద్యాల్లో ఉన్నాయి.) ఎవరో ఒక నెరజాణ ఈ పొడుపు కథను పొడిచినట్లుంది. దీని జవాబుమాత్రం ఈ పుస్తకంలో లేదు. మీకెవరికైనా తెలిసి ఉంటే దయచేసి చెప్పండి. జవాబు నాకూ తెలియదు.
సిరియు వృక్షంబు ధనపతి పరిమళంబు
ననలు డగురయు నుపవనం బసియు నావ;
అందు మూడేసి వర్ణంబు లమరు, శబ్ద
మధ్య మాక్షర పంక్తి నా మగని పేరు.

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం!

ఈ క్రింది ప్రశ్నలకు సమాధానం చెప్పగలరేమో ప్రయత్నించండి.
1. "ఒక కన్నీటి చుక్క!" కథా రచయిత ఎవరు?
2. ఆ కథ మొదటి సారిగా ఏ పత్రికలో ఎప్పుడు ప్రచురింప బడింది?
3.ఆ కథా రచయిత నిర్వహిస్తున్న తెలుగు బ్లాగు, ఇంగ్లీష్ బ్లాగుల పేర్లు ఏమిటి?
4.ఆ కథా రచయిత వ్రాసిన నవలల పేర్లు రెండు చెప్పగలరా?
5.ఈ బ్లాగరుకూ ఆ కథా రచయితకు కల 'సారూప్యత' లేమిటి?
6.ఆ కథలోని పాత్రలు సుజాతకూ, రేణుకకూ మధ్య కల సంబంధమేమిటి?
7. ఆ కథలో సుజాత ఎన్నిసార్లు ఏడ్చింది?
8. భావ కవిన్మాత్రం కాను. నేనహంభావ కవిని అని చాటుకున్న కవి ఎవరు?
9. పెనుగొండ లక్ష్మి అనే కావ్యం ప్రత్యేకత ఏమిటి?
10.కవికాకి అన్న బిరుదు ఉన్న కవి ఎవరు?

పై ప్రశ్నలలో 1నుండి7 వరకు సమాధానాలకై క్లూ కొరకు నా కథాజగత్ బ్లాగును చూడండి.

13, ఫిబ్రవరి 2009, శుక్రవారం

కథాజగత్తులో మరో కథ!

నా బ్లాగు కథాజగత్‌లో ఒక కథ చేరింది. రచయిత పేరు రాధేయ. వీరు వచన కవిగా సుప్రసిద్ధులు. మగ్గం బతుకు, తుఫాను ముందటి ప్రశాంతి, జ్వలనం, క్షతగాత్రం, దివ్యదృష్టి మొదలైనవి వీరి పేరెన్నిక గన్న కావ్యాలు. ప్రస్తుతం ప్రకటించిన కథ మౌన హింస 1995లో వ్రాశారు. ఈ కథ హిందీతో సహా పలు భారతీయ భాషల్లోకి అనువదించ బడింది. ఈ కథ మీకోసం.

12, ఫిబ్రవరి 2009, గురువారం

తెలుగు బ్లాగులూ.. సమస్యా పూరణమూ..

ఈ ఫిబ్రవరి నెలలో తెలుగు బ్లాగుల్లో పద్యపూరణల జోరు బాగా కనిపిస్తోంది. మొట్ట మొదటగా ఈబ్లాగులో(ఫిబ్రవరి 4) సమస్యా పూరణం అనే శీర్షిక క్రింద రెండు సమస్యలను ఇచ్చాను. అవి
1.రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
2.ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!
పై రెండు సమస్యలకు ఇదివరకే పూరించిన పద్యాలను చెరో నాలుగింటిని పేర్కొని అవే సమస్యలను ఎవరినైనా పూరించమని కోరాను.
ఆత్రేయ గారి పూరణ:
1.కాముడు రావణ హతకుడు
కోమలి తోడగు గణముల కోతులు అనగా
రాముడె నందుని సుతుడవ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్‌
2.పదమనె సిరిపతి పత్నితొ
పదవులు ఊడిన సురగణ పరపతి నిలుపా
కదలని సిరితో పలికెను
"ముదమగు నొక సుతయు వేయి యల్లుళ్ళున్నన్‌ "!
ఫణి ప్రసన్న కూమార్ పూరణ:
ఆ మునులు కొల్చిరెవనిని ?
హోమపు ఫలమును దశరథు డెవరికి యిచ్చెన్ ?
సోముని గాంచిన యేమయె ?
రాముని భార్యలకు నింద రానేవచ్చెన్

ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 5) చింతా రామకృష్ణారావు గారు
తప్పక యిచ్చెద. వ్రాయుడు.
నిప్పుకుచెదబట్టె నయ్య! నేర్పరి యింట
తప్పుగ వ్రాయగ తగదయ.
ఒప్పుగ నది భారతాన యున్నదె చెపుమా!
అంటూ మీ కవితామృతాన్నందించండి అని కోరారు.
వీరి సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.ఆత్రేయ:
అప్పుగ తెచ్చిన డబ్బుతొ
గొప్పగ వడ్డిని గెలిచిన గోమటి తెలివీ
చెప్పులు కొరకగ కుంటిన
నిప్పుకు చెదబట్టెనయ్య నేర్పరి యింటన్‌
2.ఊక దంపుడు:
గొప్ప నిజాయితి పరుడని
అప్పనముగపదవినీయ హస్తపు రాణే
విప్పిరి సంచులు సభలో
నిప్పుకు...చెద పట్టెనయ్య! నేర్పరి యింటన్.
3.ఫణి ప్రసన్న కుమార్:
తుప్పిడె గాంఢీవమునకు
గప్పున సడి లేక గాలి కదలక యుండెన్
అప్పయు నెలుకలు కొరికెను
నిప్పుకు చెద పట్టెనయ్య నేర్పరి యింటన్
4.పుష్యం:
అప్పడు అంతట వెదకెను
నిప్పుకు, చెదబట్టెనయ్య 'నేర్పరి' ఇంటన్!
తప్పగ తాగిన అతడిక
నిప్పెట్టతలచె గుడిసెకు, 'నేర్పరి' కాడే!
5.చింతా రామకృష్ణారావు:
అప్పుల సొమ్మది. కాలెను
నిప్పుకు ! చెద పట్టెనయ్య! నేర్పరి! ఇంటన్
గొప్పగు గ్రంధములన్నియు
తిప్పలు పడుచుంటినయ్య! తీర్పగదయ్యా!
6.చదువరి:
చెప్పులు నాకెడు కుక్కల
తప్పుడు కూతల నెదిర్చి తద్బ్లాగరులే
మెప్పును పొందిరి గొప్పగ
నిప్పుకు చెదబట్టదెపుడు నేర్పరి యింటన్‌
పై పూరణల్లో ఫణి ప్రసన్న కుమార్ పూరణ ఒక్కటే భారతార్థంలో ఉంది.

డా. ఆచార్య ఫణీంద్ర తమ "నండూరి రామకృష్ణమాచార్య సాహిత్య పీఠం" బ్లాగులో(ఫిబ్రవరి 6)సమస్యను పరిష్కరించండి అంటూ
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్! అనే సమస్యనిచ్చారు.
దీనికి స్పందనగా ఈ క్రింది పూరణలు వచ్చాయి.
1.జిగురు సత్యనారాయణ:
ఆకృతి దాల్చగ కూటమి
ఆకలన సమయము వచ్చినంత తెరాసా
కైకొనెను పెక్కు సీట్లన్
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!!
2.ఆత్రేయ:
పైకము, పదవులు చాలక
శోకించెడి రైతుల వ్యధ చూడక రాజుల్
మైకున అరచిరి ఓటిడ -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్
2.డా. ఆచార్య ఫణీంద్ర:
నాకిడవలె పలు సీట్లని,
లేకున్నను పొత్తులింక లేవని చెప్పెన్
ఆ కే.సీ.ఆర్. బాబుకు -
సైకిలుపై కారు ఎక్కి స్వారీ చేసెన్!

ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 6) చింతా రామకృష్ణారావు గారు మనం కూడా సమస్యా పూరణ చేసి చూద్దామా?1. అంటూ
పరమ శివునితో లక్ష్మియు పవ్వళించె అనే సమస్యనిచ్చారు.
ఈ సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.జిగురు సత్యనారాయణ:
కొండ పైన కాత్యాయిని కోరియుండె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె
విష్ణుతో నడి సంద్రాన విభ్రమముగ
ఇల్లు వాకిలి లేనట్టి యింతులయ్యె!!
2.ఫణి ప్రసన్న కూమార్:
హరియు లోకపాలన సేసి అలసి జాలి
మీరి యోగనిద్రను చనె మరచె నన్ను
పరగె కాపురమ్మిటని వాపోయి పల్కె
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె.
3.రాఘవ:
ప యనఁగ పయనించును గాఁన పవనుఁడు, మఱి
రమ యనంగ యనంగమాత మణిరమణి,
శూలి శివుడు, పదములొకచోటఁ జేరఁ
పరమశివునితోఁ లక్ష్మియు పవ్వళించె!
4.సనత్ శ్రీపతి:
నాథు డిచ్చిన గోరింట నూరి, తరుణి
తనయ 'లక్ష్మి ' చేతికి బెట్టె, తనివి తీర
నూత్న రీతి విరించి తొ, నాటి నుండి
పరమ శివునితో, లక్ష్మియు పవ్వళించె.
5.ఆత్రేయ:
పరవశమునాట లాడెడి
పరమాత్మల చంకనెత్తి పడకకు జనగా
పరతన బేధము లెరగక
పరమ శివుని తోడ లక్ష్మి పవళించెనయా!

మలక్‌పేట రౌడీగారు తమ రౌడీ రాజ్యం బ్లాగులో (ఫిబ్రవరి 10) క్రింది సమస్యల నిచ్చారు.
1. రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై ...

2. హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా ...

3. భర్త అల్లుడయ్యె భామకపుడు
వాటి పూరణలు:
1.భావకుడన్:
రాజా, పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై,
రోజాలున్నవి వాడి ముళ్ళుయును వీరోచిత్తము న్వీడియున్,
రేజాలన్నదికన్ శశి ప్రణయము రేపంచున్. హన్న! మా
యాజాలంబది గన్న విర్సె గనులున్ యాశ్చర్యమున్చేటలై.
2.డా. ఆచార్య ఫణీంద్ర:
భువికి మరియు సిరికి ధవుడు శ్రీనాథుండు!
రాముడాడె పెండ్లి భూమి సుతను -
ఏమి చిత్ర మిద్ది - రామావతారాన
భర్త అల్లుడయ్యె భామ కపుడు!
3.డా. సీతాలక్ష్మి(మలక్‌పేట రౌడీగారి అమ్మగారు):
జాజుల్మల్లెల సోయగాలు కళలై జాణల్ సమాయత్తలై
మైజాఱుల్ సరిచేసి నీటమునుగన్ మాధుర్యముల్ మీరగా
రాజీవానన మోర్పు చంద్రుడగుచున్ రమ్యమ్ముగా పల్కెనో
రాజా పున్నమి రాత్రి పూచె సరసిన్ రాజీవముల్ చిత్రమై
4.డా. సీతాలక్ష్మి:
సూకరమయి నాడు సుదతి బ్రోచిన హరి
చెట్టబట్టి పృధ్వి చేయిబట్టె
దాశరధిగ ధరణి తనయను పెండ్లాడ
భర్త అల్లుడయ్యె భామకపుడు

ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 11) చింతా రామకృష్ణారావు గారు మనం కూడా సమస్యా పూరణ చేసి చూద్దామా?2. అంటూ
మణులు మాటలాడె మనసు కరుగ అనే సమస్యనిచ్చారు.
వీరి సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.నరహరి:
కాస్త లేటు యయ్యె కార్యాల యమునను
అలిగి మంచమెక్కె ఆలి నాదు
తీపి మాట లాడ తిరిగి నాదు ప్రియ
మణులు మాట లాడె మనసు కరుగ
2.ఊక దంపుడు:
"పిలువ బిగువె?" యనుచు పేర్మిబంపరమణీ
మణులు, మాటలాడె- మనసు కరుగ
పిల్లవాని కటను పెళ్లి చూపులయందు;
వధువు యగుట నేడు వరుస కలిసి
3.రవి:
ఇంచుక యొక సమస్య ఇంపుగ పూరణ
సేయుమన్న యెడనె సై యని వెంటనె
కలము గొన్న వారు ఎలమి నెజ్జన శిరో
మణులు మాటలాడె మనసు కరుగ.
4.ఆత్రేయ:
గుణ గానము తగు నెరపి క
రుణ జూడమనిన వినని తరుణమున భృంగా
రుణ బహుమతీయ తరుణా
మణి మాటలాడె ముదముగ మనసులు కరుగన్
5.జిగురు సత్యనారాయణ:
కారు వీరు నీకు పరులు బాంధవులగు
తాల్మి లేక చంప తగునె? అనుచు
ధర్మ రాజు తోడ దాయాదుల నిజ ర-
మణులు మాటలాడె మనసు కరుగ
6.జిగురు సత్యనారాయణ:
బీద సాదలకును బియ్యము, కూరలు,
వెచ్చములు కొనంగ వెతలనుచును
నాయకాళి తోడ నయముగను రమణీ
మణులు మాటలాడె మనసు కరుగ
7.రాఘవ:
మాదు తల్లినుండి మమ్మల్ని బలిమితో
వేరుసేసి సానవెట్టి మీర
లమ్ముకుందురనుచు నాశ్యర్యముగఁ గలన్
మణులు మాటలాడె మనసు కరుగ
8.ఫణి ప్రసన్న కూమార్:
వేణుగానము సోకి వీనులు పులకింప
విరిసె దుద్దులలోని వింత రవ్వ
మరునితో పోరి వగరు పైయెద సెగల
ఎరుపెక్కె కంఠాన వెలయు కెంపు
ఇంపైన సఖుని తలంపులకు నొదిగె
పాపిట ముత్యాళి పరవశమున
జతగాని మరుకేళి జతగూడు తలపుచే
చుంబించె కటియందు కులుకు పచ్చ

చెలుని చూచుకాని చెంతకు పోబోదు
తెలుపలేదు సిగ్గు తమకములచె
రమణి బాధలెల్ల రమ్యముగ మెరిసి
మణులు మాటలాడె మనసు కరుగ
9.డా. ఆచార్య ఫణీంద్ర:
సాన బెట్టు వాడు మేని నరుగదీయ
వజ్రములకు మెరుగు వచ్చు వరకు -
"ప్రాణ మిట్లు తీయ భావ్యమా నీ"కంచు
మణులు మాటలాడె మనసు కరుగ!
10.రాకేశ్వర రావు:
బెట్టుఁ జేసియున్న బ్రేకిన్సుపెక్టర్‌కి
"మణులు మాట లాడె మనసు కఱుగ"
అంచు నేనుఁ జూపె లంచము, సొమ్ము చేఁ
బట్టకతను బండిఁ బట్టు కెళ్ళె!
11.రాకేశ్వర రావు:
గోపని విడిపించఁ గోరి తానీషాకి
ధనము నిచ్చి నిద్దరి నడుగంగ
"అప్పు యుంటి మతని కంచు" ఆ రామల
క్ష్మణులు మాట లాడె మనసు కఱుగ

మలక్‌పేట రౌడీగారు తమ రౌడీ రాజ్యం బ్లాగులో (ఫిబ్రవరి 11) పూరింపబడని సమస్య
హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా ...తో పాటు మరో సమస్య నిచ్చారు.
అది
వాణి వార వనితలందు వాసికెక్కె
ఈ సమస్యలకు క్రింది పూరణలు వచ్చాయి.
1.డా. ఆచార్య ఫణీంద్ర:
కరము నధర్మమార్గమున, కామముతోడ నియంతవోలె సో
దరుని కళత్రమౌ "రుమ"ను దారగ చేకొనె "వాలి" ధూర్తుడై!
ఎరిగియునద్ది స్నేహితుని కేర్పడ న్యాయము, జానకీ మనో
హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే గదా!
2.డా. సీతాలక్ష్మి:
అరయగ వాలి నీతి విడనాడి రుమన్ చెరబట్టి త్రోలెసో
దరుని దురాత్ముడై పరమ దైన్యము నందెను సూర్య పుత్రుడున్
వెరవున రాజధర్మమగు వెట నెపమ్మున జానకీ మనో
హరుడు నియంతయౌ హరిని యంతము సేయుట పాడియే కదా
3.జిగురు సత్యనారాయణ:
వరునిగ చేది భూవరుని వాసిగ నెన్నిక జేసి యుండగా
పిరికితనంబు జూపి తను పిల్లను దొంగిలి వెళ్లె గొల్లడున్
గరికకు తూగునే ఖలుడు? కాంచగ కట్టడి లేక రుక్మిణీ
హరుడు నియంతయౌ,హరిని యంతము సేయుట పాడియే కదా!!
4.ఊక దంపుడు:
ఆధునికకాల మందున, ఆంధ్ర సాహి
తీజగతిన, చింతామణి తేజెరిల్లె
పద్య మందు; గద్యముగన హృద్య "మధుర
వాణి" వార వనితలందు వాసికెక్కె
5.డా. ఆచార్య ఫణీంద్ర:
వార వనిత నొక్క ప్రధాన పాత్ర జేసి,
అల్లినాడు "కన్యా శుల్క"మనెడి గొప్ప
నాటకమ్మును "గురజాడ" నాడు! - "మధుర
వాణి" వార వనితలందు వాసికెక్కె!
6.డా. సీతాలక్ష్మి:
పారిజాత ప్రసూనమై పరిమళించి
పలుకు తేనెల నందించు ప్రజ్ఞ కలిగి
రసతరంగిణి వలపుల రాణి మధుర
వాణి వార వనితలందు వాసికెక్కె
ఆంధ్రామృతం బ్లాగులో(ఫిబ్రవరి 14) చింతా రామకృష్ణారావు గారు మనం కూడా సమస్యా పూరణ చేసి చూద్దామా?3. అంటూ
'కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్' అనే సమస్యనిచ్చారు.
వీరి ఈ సమస్యకు క్రింది పూరణలు వచ్చాయి.
1.ఊక దంపుడు:
ఒడి నుండుబాల యదివడి
వడిగా ఎదిగిగె సొగసును వయసును బొందన్
అడిగియె, అన్నయ్యచివరి
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్
2.జిగురు సత్యనారాయణ:
కడు నెయ్యపు వరుడు, సదా
యెడంద శోభిల్లు పేర్మి, యీడుకు జోడౌ,
ముడి పెట్టగనాడపడచు
కొడుకునకుం కూతునిచ్చె కోమలి ముదిమిన్!!
3.రాఘవ:
గుడిగుడిగుంతల ప్రాయము
చిడిపితనము పోని వయసు చేయగ పెండ్లిన్
జెడలల్లి బొమ్మలకు తన
కొడుకునకుం గూతునిచ్చెఁ గోమలి ముదిమిన్.
4.రాఘవ:
ఉడుమండలపతిముఖునికి
వడిగలవానికి దశరథవరతనయునకున్
పుడమి తననేలు భూపతి
కొడుకునకుం గూతునిచ్చెఁ గోమలి ముదమున్.

ఈవిధంగా మన బ్లాగరులు మంచి మంచి పూరణలతో తమ ప్రతిభను చాటుతూ వుండటం మనమందరమూ గర్వించదగిన విషయం. ఈ సమస్యాపూరణ విజయోల్లాసానికి "తురుపుముక్క" నాంది పలకడం మహదానందంగా ఉంది.

బుజ్జిగాడి బెంగ

చల్లగాలి ఎంచక్కా ఆగి ఆగి వీస్తోంది. వెనకాలే మట్టివాసన వస్తోంది. ఆ వాసన ఎంతో బావుంటుంది. అందుకే గట్టిగా పీల్చాను.
వెంటనే మాథ్స్ రీడర్ పక్కన పడేసి కిటికీలో నుంచి బయటకు తొంగి చూశాను. గాలి నెమ్మదై చిటపట చినుకులు మొదలయ్యాయి.
చప్పున లేచాను. బయటకు పరిగెత్తాలనుకొని గుమ్మందగ్గరే ఆగిపొయాను. సన్నగా పర్షం మొదలైంది. కింద పడ్డ చినుకులు ముత్యాల్లా పైకిలేస్తున్నాయ్. ముచ్చటేస్తుందలా చూస్తుంటే.....! కన్రెప్పలు టపటపలాడించాను.
ఆకాశంలోంచి రాలిపడే ఆ నీటిబుగ్గల్ని అలా చూడడమంటే భలే సరదా.
వర్షంపడ్తుంటే భలేగా వుంటుంది మరి. చల్లని ఇస్‌క్రీం చప్పరిస్తున్నంత ఆనందం కలుగుతుంది. చెల్లాయికి తెలీకుండా క్రీంబిస్కట్స్ నేనొక్కన్నే తింటున్నంత సంబరంగానూ ఉంటుంది.
చెప్పొద్దూ! నాలో ఉత్సాహం ఉరకలు వేస్తొంది. మరే ఎగిరి గంతేయాలనిపిస్తోంది.


యువ రచయిత ఎనుగంటి వేణుగోపాల్ వ్రాసిన ఈకథ పూర్తిగా చదవాలనుకుంటున్నారా? ఇంకేం ఇక్కడ ఒక నొక్కు నొక్కండి

8, ఫిబ్రవరి 2009, ఆదివారం

ప్రకటన

ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి సత్యవాడ (ఓగేటి) ఇందిరాదేవి గారి కథ రాత్రౌ తరతి నర్మదా నా బ్లాగు కథాజగత్‌లో ప్రకటింప బడింది. చదివి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తెలుపగోర్తాను.

7, ఫిబ్రవరి 2009, శనివారం

పద్య ప్రణీతం

మునుపటి టపాలో చెప్పినట్లు మా అమ్మాయి చి. ప్రణీత పాల్గొన్న తరతరాల తెలుగు పద్యం అనే కార్యక్రమం భక్తి టీవీలో 26.01.2009 తేదీ రాత్రి 9.30 గంటలకు మరియూ 31.01.2009 శనివారం రాత్రి 8.30 గంటలకు ప్రసారం ఐయ్యింది. ఆ కార్యక్రమం లోని కొన్ని ఘట్టాలు మీకోసం.

4, ఫిబ్రవరి 2009, బుధవారం

సమస్యా పూరణం

సమస్యా పూరణం అనేది పద్య ప్రియులకు అత్యంత ప్రీతికరమైన ప్రక్రియ. అనేక అవధానలలో, సాహిత్య రూపకాలలో ఇతరత్రా సమస్యా పూరణను ఆస్వాదిస్తూనే ఉంటాము. ఈమధ్య అంతర్జాలంలో శోధిస్తూ ఉంటే 1995-97 మధ్యకాలంలో జరిగిన సాహిత్య చర్చల్లో అద్భుతమైన సమస్యా పూరణలు కనిపించాయి. వాటిలో రెండింటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.

మొదటి సమస్య:
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
ఈ సమస్యకు క్రింది పూరణలు చూడండి.

1.కామముచే పరకాంతా
వ్యామోహపు బతుల సతులు మరి పతి వ్రతలై
యేమనక, దలుప సీతా
రాముని, భార్యలకు నింద రానే వచ్చెన్

2.రాముని ఖ్యాతియు సీతా
రాముడయోధ్యారమణుడు గా, వారి పరం
ధాముడయినను, విధి కదా
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్

3.కామతురుడగు బతి ముని
భామల వేషముల దాల్చి భార్య రమింపన్
భూమిన్ ప్రబలంబై యౌ
రా, ముని భార్యలకు నింద రానే వచ్చెన్!

4.ప్రేమను జంపుకు రాముడు
భామను కానలకు పంప బూనిన తోడన్
"దమ్మము, యశమును, గుణ" మను
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్



రెండవ సమస్య:

ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!


ఈ సమస్యకు పూరణలు కొన్ని:
1.పదవులు పోయిన పిమ్మట,
ముదివియు వచ్చిన, చెదరుదురందరు, కానీ
వదలదు కూతురు, చాలును
ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!

2.వదలదు మనకీ కట్నము
చదువులు నేర్పినను నడుగుదురతే తండ్రిని
వదలుదు, యందులకే, నా
ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!

3.అదనపు కన్యాశుల్కము
పదితరముల వరకు కూడ బెట్టుట కొరకై
ముదుసలి మదిలో ననుకొనె,
"ముదమగు! నొక సుతయు, వేయి అల్లుళ్ళున్నన్!"

4.చెదరని దీక్షతొ వ్రాసిన
సుధలొలికెడు కావ్యకన్య సుతగా కవికిన్
చదువరు లనుభవ పతులుగ
ముదమగు నొక సుతయు వేయి యల్లుళ్లున్నన్ !

మరి మీరెవరైనా పూరించగలిగితే మీ పూరణలను వ్యాఖ్య రూపంలో ఈ టపాకు పంపండి.

పుస్తక సమీక్ష ! - 4 కాగితాల బొత్తి

[కాగితాల బొత్తి, కథా సంపుటి రచన, ప్రచురణ: ఎమ్బీయస్ ప్రసాద్, ఇ-101,సత్యనారయణ ఎంక్లేవ్, మదీనాగూడ, హైదరాబాదు 500 049 ఫోన్:040-23047638 వెల: రూ. 50/-, పేజీలు:127]
ఎమ్బీయస్ ప్రసాద్ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది హాసం పత్రికా, పడక్కుర్చీ కబుర్లూను. కథకులుగా వీరి ప్రజ్ఞా పాటవాలను నిరూపించే "అచలపతి కథలు", "రాంపండులీలలు", "పొగబోతు భార్య" మొదలైన పుస్తకాలను చదివిన వారికి ఎమ్బీయస్‌ను ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగితాల బొత్తి అనేది వీరి తాజా కథాసంపుటి. ఇందులో వైవిధ్యభరితమైన కథలు ఉన్నాయి. సీరియస్ కథలు కొన్ని, థ్రిల్లింగ్ కథలు కొన్ని, సరదా కథలు కొన్ని, అనువాద కథలు కొన్ని దీనిలో ఉన్నాయి. ఈ కథలన్నీ పాఠకులను ఆసక్తిగా, సరదాగా చదివిస్తాయని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.ఎందుకంటే ఎమ్బీయస్ రచనా శైలి అటువంటిది.
మొదటి కథ "కాగితాల బొత్తి"లో కథను నడిపే తీరు కొత్తగా కనిపిస్తుంది."తరాలు తీరాలు" అనే కథ కొత్త తరం అభిలాషను పాత తరం హుందాగా అంగీకరించాలనే సందేశాన్నిస్తుంది.తన కొడుకు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళడం ఇష్టంలేక స్వార్థంతో తాను చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, తన తండ్రి విశ్వనాథం ఇలాగే తనను దూరప్రాంతానికి ఉద్యోగానికి పంపడానికి విఫల యత్నం చేసిన సంగతి గుర్తుకు వస్తుంది మాధవరావుకి. మాధవరావు పట్టుదలను చూసి విశ్వనాథం ప్రవర్తించినట్టుగా మాధవరావు తన కొడుకు రవి పట్ల ప్రవర్తించక పోవడంతో విశ్వనాథం రవికి అండగా నిలుస్తాడు. చివర్లో మాధవరావు తన తండ్రి ఔదార్యాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడతాడు. వరకట్నాన్ని మరో పార్శ్వంలో చూపిస్తారు రచయిత "సుధ నిర్ణయం" అనే కథలో.ఈ కథతో పాటు "సమరంలో సమిధలు", "ఏ గూటి చిలక..." కథలు రచయితలోని ఫెమినిజం కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. "ఆఖరి క్షణాలు", "కొత్త ఊపిరి", "ఫ్యూజ్ పోయింది" కథలకు రొమాంటిక్ టచ్ ఇచ్చారు ఎమ్బీయస్ ప్రసాద్.మనకు నచ్చని వాస్తవాలను అంగీకరించడానికి మనసొప్పక అందమైన కల్పనలతో సంతృప్తి పడే మానవ నైజం గురించి "మనిషిలో మనిషి" కథ వివరిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆత్మ వంచన మనసుకు రిలీఫ్ ను ఇస్తుంది అని ఈ కథలో ఎమ్బీయస్ ప్రసాద్ అభిప్రాయం.ఈ కథలో రచయిత పాత్ర తన ఊహ అబద్ధమైనందుకు ఒకింత ఫ్రస్ట్రేషన్‌కు గురి అవుతుంది.ఇటువంటి సందర్భం ప్రతి రచయితకూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది."సమరంలో సమిధలు" వార్‌బేబీస్ గురించి తెలుగులో వచ్చిన ఏకైక కథ. రచన పత్రికలో కథల పోటీకి ఈ కథను పంపితే బహుమతి రాకుండా సాధారణ ప్రచురణకు నోచుకోవడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దానికి కారణం మనకు "మనిషిలో మనిషి" కథలో కనిపిస్తుంది. మన సమాజం ఇంకా వావి వరసలు లేని సంబంధాలను (కొన్ని మతాలలో, కొన్ని దేశాలలో అంగీకార యోగ్యం కావచ్చు గాక) అనైతికం అని భావించే స్థితిలో ఉంది."మెతక మనిషి","ఉడుం మేష్టారు" అనువాద కథలు ఆకట్టుకుంటాయి. "సాక్షి"కథలో ముగింపు మనము ఊహించని మలుపు తిరుగుతుంది.ఈ సంపుటిలోని కొన్ని అనువాద కథలు చదివితే అవి అనువాదం అని చెప్పక పోతే స్వంత కథలనే భ్రమించే అవకాశాలు మెండు. అలాగే "సమరంలో సమిధలు", "కొత్త ఊపిరి" లాంటి కథలు అనువాద కథలేమో అని పొరబడే ప్రమాదం ఉంది.ఈ పుస్తకంలో మరొక విశేషం "ప్రవాసి". ఈ కథకు ఒరిజినల్ రచయితా, అనువాదకుడు రెండూ ఎమ్బీయస్ కావడం ఈ కథ ప్రత్యేకత.కథాభిమాను లందరూ చదవాల్సిన పుస్తకమిది.