సమస్యా పూరణం అనేది పద్య ప్రియులకు అత్యంత ప్రీతికరమైన ప్రక్రియ. అనేక అవధానలలో, సాహిత్య రూపకాలలో ఇతరత్రా సమస్యా పూరణను ఆస్వాదిస్తూనే ఉంటాము. ఈమధ్య అంతర్జాలంలో శోధిస్తూ ఉంటే 1995-97 మధ్యకాలంలో జరిగిన సాహిత్య చర్చల్లో అద్భుతమైన సమస్యా పూరణలు కనిపించాయి. వాటిలో రెండింటిని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.
మొదటి సమస్య:
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
ఈ సమస్యకు క్రింది పూరణలు చూడండి.
1.కామముచే పరకాంతా
వ్యామోహపు బతుల సతులు మరి పతి వ్రతలై
యేమనక, దలుప సీతా
రాముని, భార్యలకు నింద రానే వచ్చెన్
2.రాముని ఖ్యాతియు సీతా
రాముడయోధ్యారమణుడు గా, వారి పరం
ధాముడయినను, విధి కదా
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
3.కామతురుడగు బతి ముని
భామల వేషముల దాల్చి భార్య రమింపన్
భూమిన్ ప్రబలంబై యౌ
రా, ముని భార్యలకు నింద రానే వచ్చెన్!
4.ప్రేమను జంపుకు రాముడు
భామను కానలకు పంప బూనిన తోడన్
"దమ్మము, యశమును, గుణ" మను
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
రెండవ సమస్య:
ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!
ఈ సమస్యకు పూరణలు కొన్ని:
1.పదవులు పోయిన పిమ్మట,
ముదివియు వచ్చిన, చెదరుదురందరు, కానీ
వదలదు కూతురు, చాలును
ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!
2.వదలదు మనకీ కట్నము
చదువులు నేర్పినను నడుగుదురతే తండ్రిని
వదలుదు, యందులకే, నా
ముదమగు నొకసుతయు వేయి యల్లుళ్లున్నన్!
3.అదనపు కన్యాశుల్కము
పదితరముల వరకు కూడ బెట్టుట కొరకై
ముదుసలి మదిలో ననుకొనె,
"ముదమగు! నొక సుతయు, వేయి అల్లుళ్ళున్నన్!"
4.చెదరని దీక్షతొ వ్రాసిన
సుధలొలికెడు కావ్యకన్య సుతగా కవికిన్
చదువరు లనుభవ పతులుగ
ముదమగు నొక సుతయు వేయి యల్లుళ్లున్నన్ !
మరి మీరెవరైనా పూరించగలిగితే మీ పూరణలను వ్యాఖ్య రూపంలో ఈ టపాకు పంపండి.
5 కామెంట్‌లు:
కం:
కాముడు రావణ హతకుడు
కోమలి తోడగు గణముల కోతులు అనగా
రాముడె నందుని సుతుడవ
రాముని భార్యలకు నింద రానే వచ్చెన్
రాముడిని మోహించిన వానరులకు ఒక వరమిచ్చాడనీ,
వారే పదహారు వేల గోపికలయ్యారన్న కధ ఉంది.
ఆసందర్భ్హాన్ని ఆధారంగా చిన్న ప్రయత్నం
కం:
పదమనె సిరిపతి పత్నితొ
పదవులు ఊడిన సురగణ పరపతి నిలుపా
కదలని సిరితో పలికెను
"ముదమగు నొక సుతయు వేయి యల్లుళ్ళున్నన్ "!
భూమిని లక్ష్మీ నారాయణుల సుత గానూ
రాజు భూపతి కనక, పదవులు ఊడిన రాజులను
వారి అల్లుళ్ళుగానూ పోలిక చేయటానికి ప్రయత్నించాను.
పెద్దలు తప్పులను దిద్ద గలరు
ఆ మునులు కొల్చిరెవనిని ?
హోమపు ఫలమును దశరథు డెవరికి యిచ్చెన్ ?
సోముని గాంచిన యేమయె ?
రాముని భార్యలకు నింద రానేవచ్చెన్
ఆత్రేయగారి పద్యాలు చాలా బాగున్నాయ్. ఫణిప్రసన్నకుమార్ గారి ఆలోచన కూడా.
సమస్య - రాముని భార్యలకు నింద రానే వచ్చెన్.
కం|| కామారి శంకరుని ప్రియ
భామ శపించెనట! దాని వలనం జవితిన్
సోమునిఁ గన్నంతనె నౌ
రా! ముని భార్యలకు నింద రానే వచ్చెన్.
నమస్కారం!
"ముదమగు నొక సుతయు వేయి యల్లుళ్ళున్నన్"
సమస్యాపూరణం కోసం ఇచ్చిన పై కంద పాదంలో యతిదోషం ఉంది. ఎవ్వరూ గమనించలేదా?
కామెంట్‌ను పోస్ట్ చేయండి