...

...

4, ఫిబ్రవరి 2009, బుధవారం

పుస్తక సమీక్ష ! - 4 కాగితాల బొత్తి

[కాగితాల బొత్తి, కథా సంపుటి రచన, ప్రచురణ: ఎమ్బీయస్ ప్రసాద్, ఇ-101,సత్యనారయణ ఎంక్లేవ్, మదీనాగూడ, హైదరాబాదు 500 049 ఫోన్:040-23047638 వెల: రూ. 50/-, పేజీలు:127]
ఎమ్బీయస్ ప్రసాద్ పేరు వినగానే ఠక్కున గుర్తుకు వచ్చేది హాసం పత్రికా, పడక్కుర్చీ కబుర్లూను. కథకులుగా వీరి ప్రజ్ఞా పాటవాలను నిరూపించే "అచలపతి కథలు", "రాంపండులీలలు", "పొగబోతు భార్య" మొదలైన పుస్తకాలను చదివిన వారికి ఎమ్బీయస్‌ను ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు.కాగితాల బొత్తి అనేది వీరి తాజా కథాసంపుటి. ఇందులో వైవిధ్యభరితమైన కథలు ఉన్నాయి. సీరియస్ కథలు కొన్ని, థ్రిల్లింగ్ కథలు కొన్ని, సరదా కథలు కొన్ని, అనువాద కథలు కొన్ని దీనిలో ఉన్నాయి. ఈ కథలన్నీ పాఠకులను ఆసక్తిగా, సరదాగా చదివిస్తాయని ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు.ఎందుకంటే ఎమ్బీయస్ రచనా శైలి అటువంటిది.
మొదటి కథ "కాగితాల బొత్తి"లో కథను నడిపే తీరు కొత్తగా కనిపిస్తుంది."తరాలు తీరాలు" అనే కథ కొత్త తరం అభిలాషను పాత తరం హుందాగా అంగీకరించాలనే సందేశాన్నిస్తుంది.తన కొడుకు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళడం ఇష్టంలేక స్వార్థంతో తాను చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో, తన తండ్రి విశ్వనాథం ఇలాగే తనను దూరప్రాంతానికి ఉద్యోగానికి పంపడానికి విఫల యత్నం చేసిన సంగతి గుర్తుకు వస్తుంది మాధవరావుకి. మాధవరావు పట్టుదలను చూసి విశ్వనాథం ప్రవర్తించినట్టుగా మాధవరావు తన కొడుకు రవి పట్ల ప్రవర్తించక పోవడంతో విశ్వనాథం రవికి అండగా నిలుస్తాడు. చివర్లో మాధవరావు తన తండ్రి ఔదార్యాన్ని తెలుసుకొని పశ్చాత్తాప పడతాడు. వరకట్నాన్ని మరో పార్శ్వంలో చూపిస్తారు రచయిత "సుధ నిర్ణయం" అనే కథలో.ఈ కథతో పాటు "సమరంలో సమిధలు", "ఏ గూటి చిలక..." కథలు రచయితలోని ఫెమినిజం కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. "ఆఖరి క్షణాలు", "కొత్త ఊపిరి", "ఫ్యూజ్ పోయింది" కథలకు రొమాంటిక్ టచ్ ఇచ్చారు ఎమ్బీయస్ ప్రసాద్.మనకు నచ్చని వాస్తవాలను అంగీకరించడానికి మనసొప్పక అందమైన కల్పనలతో సంతృప్తి పడే మానవ నైజం గురించి "మనిషిలో మనిషి" కథ వివరిస్తుంది. కొన్ని సందర్భాలలో ఆత్మ వంచన మనసుకు రిలీఫ్ ను ఇస్తుంది అని ఈ కథలో ఎమ్బీయస్ ప్రసాద్ అభిప్రాయం.ఈ కథలో రచయిత పాత్ర తన ఊహ అబద్ధమైనందుకు ఒకింత ఫ్రస్ట్రేషన్‌కు గురి అవుతుంది.ఇటువంటి సందర్భం ప్రతి రచయితకూ ఎప్పుడో ఒకప్పుడు ఎదురవుతూనే ఉంటుంది."సమరంలో సమిధలు" వార్‌బేబీస్ గురించి తెలుగులో వచ్చిన ఏకైక కథ. రచన పత్రికలో కథల పోటీకి ఈ కథను పంపితే బహుమతి రాకుండా సాధారణ ప్రచురణకు నోచుకోవడం కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే దానికి కారణం మనకు "మనిషిలో మనిషి" కథలో కనిపిస్తుంది. మన సమాజం ఇంకా వావి వరసలు లేని సంబంధాలను (కొన్ని మతాలలో, కొన్ని దేశాలలో అంగీకార యోగ్యం కావచ్చు గాక) అనైతికం అని భావించే స్థితిలో ఉంది."మెతక మనిషి","ఉడుం మేష్టారు" అనువాద కథలు ఆకట్టుకుంటాయి. "సాక్షి"కథలో ముగింపు మనము ఊహించని మలుపు తిరుగుతుంది.ఈ సంపుటిలోని కొన్ని అనువాద కథలు చదివితే అవి అనువాదం అని చెప్పక పోతే స్వంత కథలనే భ్రమించే అవకాశాలు మెండు. అలాగే "సమరంలో సమిధలు", "కొత్త ఊపిరి" లాంటి కథలు అనువాద కథలేమో అని పొరబడే ప్రమాదం ఉంది.ఈ పుస్తకంలో మరొక విశేషం "ప్రవాసి". ఈ కథకు ఒరిజినల్ రచయితా, అనువాదకుడు రెండూ ఎమ్బీయస్ కావడం ఈ కథ ప్రత్యేకత.కథాభిమాను లందరూ చదవాల్సిన పుస్తకమిది.

కామెంట్‌లు లేవు: