సూర్య దిన పత్రిక 8 అక్టోబర్ 2012 సంచికలో సాహిత్యం పేజీ అక్షరంలో నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు అనే శీర్షికతో ఒక వ్యాసం వచ్చింది. డా.శ్రీనివాస్ అంకే ఈ వ్యాసాన్ని వ్రాశారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ చదవండి. ఈ వ్యాసం పై నా స్పందనను పరిమిత విశ్లేషణ పేరుతో ఈ రోజు సూర్యదినపత్రిక అక్షరం పేజీలో ప్రకటించారు. దాని పూర్తి పాఠం ఇక్కడ యిస్తున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.
అక్టోబర్ 8 సంచికలోని అక్షరం పేజీలో డా.శ్రీనివాస్ అంకే గారి 'నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు' అనే శీర్షికలో 'కవిత్వవేది' కల్లూరు వేంకటనారాయణరావుగారి గురించి వ్రాసిన వ్యాసం చదివి చాలా సంతోషించాను. రావుగారి 'ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము', 'వీరేశలింగ యుగము' అనే గ్రంథాల గురించి రచయిత చక్కగా విశ్లేషించారు.
అయితే ఈ వ్యాసంలో డా.శ్రీనివాస్ గారు ఎంత సాహిత్య చరిత్రకే పరిమితమైనా కల్లూరు వేంకటనారాయణ రావుగారి ఇతర రచనలను ప్రస్తావించక పోవడం వల్ల కల్లూరు వారిని కేవలం సాహిత్య చరిత్రకారుడిగా మాత్రమే పాఠకులు భావించే ప్రమాదం వుంది. వ్యాసంలో ఒక చోట 'ఆయన వ్యక్తిగతంగా పద్య కవి కూడా' అని పేర్కొన్నప్పటికీ అది సరిపోదు.
బోధార్షే అనే గుప్తనామం కలిగిన కల్లూరు నారాయణరావుగారు పై రెండు గ్రంథాలేగాక అహల్యా సహస్రాక్షీయము, శ్రీ కృష్ణార్జునీయము అనే నాటకాలనూ, పుష్పాంజలి, శ్రీ విద్యారణ్య చరితము, షాజహాన్, శ్రీమదశోక చరిత్రము మొదలైన పద్యకావ్యాలను వ్రాశారు. ఈ రచనలన్నింటిలోనూ తలమానికము అనదగింది అశోకచరిత్రము. శాంతి సామ్రాట్టు అనే నామాంతరం కల ఈ చారిత్రక పద్య కావ్యము భారత జాతీయోద్యమ స్ఫూర్తితో రాయలసీమ నుండి వెలువడిన చారిత్రక ప్రబంధ త్రయములో ఒకటిగా పేరుపొందింది. దుర్భాక రాజశేఖర శతావధాని గారి రాణాప్రతాప సింహ చరిత్ర, గడియారం వేంకట శేషశాస్త్రి గారి శివభారతము మిగిలిన రెండు చారిత్రక ప్రబంధ కావ్యాలు. ఈ అశోక చరిత్రను రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నిడదవోలు వెంకటరావు, తుమ్మల సీతారామ మూర్తి చౌదరి, నండూరి రామకృష్ణమాచార్య, విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతులు ప్రశంసించారు. ఏడు కాండములు, 1400 పైచిలుకు పద్యాలతో శోభిల్లిన ఈ మహాకావ్యాన్ని డా.శ్రీనివాస్ గారు తమ వ్యాసంలో కనీసం మాట మాత్రంగా నైనా ప్రస్తావించక పోవడం శోచనీయమే కాదు కవిత్వవేదికి చేసిన అపచారం కూడా!
ఇక ఈవ్యాసం చివరలో 'రాయలసీమలో కవిత్వవేది తర్వాత సాహిత్య చరిత్ర రచన చేసినవారు కల్లూరు అహోబలరావుగారు' అని అంటున్నారు. వేంకటనారాయణరావుగారి వీరేశలింగ యుగము అహోబలరావుగారి రాయలసీమ రచయితల చరిత్రల మధ్య ఈ ప్రాంతం నుండి మరికొన్ని సాహిత్య చరిత్రకు సంబంధించిన రచనలు వచ్చాయి. అవి టేకుమళ్ళ కామేశ్వరరావు(వీరు విజయనగరానికి చెందిన వారయినా రాయలసీమలో ఎక్కవ కాలం జీవించారు) గారి 'నా వాఙ్మయ మిత్రులు', 'పూర్వ కవుల చరిత్ర', జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి 'మా సీమకవులు'.
రాయలసీమ రచయితల చరిత్ర గురించి డా.శ్రీనివాస్ గారు తమ అభిప్రాయాన్ని చెబుతూ ఇందులో కులం, గోత్రం, వంశం వంటివాటికి ఇచ్చినంత ప్రాధాన్యత సాహిత్యానికి ఇవ్వలేదని అంటున్నారు. అలాగే ఇందులో కేవలం కవుల రచనలు, ఒకటి రెండు పద్యాలను ఉటంకించడంతో జనాదరణ పొందలేదని అభిప్రాయపడుతున్నారు. చరిత్ర అన్నాక తారీఖులు, దస్తావేజులూ, కులగోత్రాలు, వంశ చరిత్రలతో సహా అన్ని విషయాలనూ రికార్డు చేయవలసి ఉంటుంది. వాటివల్ల ప్రస్తుతం మనకు ఉపయోగం కనిపించకపోయినా ఏనాటికైనా వాటి అవసరం రావచ్చు. రాయలసీమ రచయితల చరిత్ర ఉద్దేశాన్ని కల్లూరు అహోబలరావుగారు తమ సంపాదకీయంలో స్పష్టంగా చెప్పారు. 'హూ ఈస్ హూ ఆఫ్ రాయలసీమ రైటర్స్' అను ఈ రాయలసీమ రచయితల చరిత్ర పరిశోధనా గ్రంథముగా పరిశోధకులకు ఉపయోగపడుతుందని అహోబలరావుగారు తలచారు. భావితరము వారికి, చరిత్రకారులకు ఈ గ్రంథము ఎన్సైక్లోపీడియా వలె ఉపయోగపడాలని భావించారు. కవిత్వవేది కల్లూరు వేంకటనారాయణరావుగారు రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటానికి వ్రాసిన మున్నుడిలో 'ఉత్తమ గ్రంథ రచయితలను చదువరులకు పరిచితులుగా జేసియున్కి, యెంతయు ప్రశంసనీయము. అందునను వారివారి జన్మదేశకాలములను, అందిన సన్మానములను వారి సహజ స్వభావములను, చక్కగా స్పష్టముగా, నభివర్ణించుటయే కాక, వారివారి కృతులలోని పద్యరత్నములను కూడ నాంధ్రులకు తనివిదీర నుదాహరణము లిచ్చియుండుట సమంజసముగా నున్నది' అని అంటున్నారు.
అహోబలరావుగారికి ఉన్న పరిమిత వనరులతోనూ, గ్రంథ విస్తరణభీతితోనూ రచయితల పరిచయాలు కొన్ని క్లుప్తంగా చేసిఉండవచ్చు కానీ ఈ నాలుగు సంపుటాల రాయలసీమ రచయితల చరిత్ర డా.శ్రీనివాస్ అంకే గారి దృష్టిలో జనాదరణ పొందక పోయినా దాని ఆశయాన్ని పూర్తిగా నేరవేర్చినదని ఒప్పుకోక తప్పదు. సాహిత్య చరిత్రకు, పరిశోధనకు కావలసిన దినుసు ఈ సంపుటాల్లో పుష్కలంగా లభిస్తుంది. రాయలసీమలో పరిశోధకులకూ, విమర్శకులకూ అప్పటికీ, ఇప్పటికీ కొదవలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి