...

...

18, అక్టోబర్ 2012, గురువారం

భరాగో కథపై జి.యస్.లక్ష్మిగారి విశ్లేషణ

   ఉపకారికి ఉపకారం చెయ్యడం ఏమంత పెద్ద విషయం కాదనీ, అపకారికి ఉపకారం నెపమెన్నకుండ చెసేవాడు నేర్పరి అనీ సుమతీశతకకారులు చెప్పారు.
   కాని ఈ కథ పేరే ఉపకారికి అపకారం చెయ్యడం.
   సుమతీ శతకకారుల్ని గుర్తు చేసుకుంటూ అనుకుంటాను రచయిత పద్యం లో వచ్చేసంధి కలిసినట్లుగానే "నుపకారికి నపకారము!" అనే శీర్షిక పెట్టేరు.
   ఉపకారికి ఉపకారం చెయ్యడం అన్నది అంత పెద్ద విషయమేమీ కాదనీ, అపకారికి ఉపకారం చెయ్యడమే జీవితంలో ధన్యమైనదని సుమతీశతకకర్త చెప్పిన సూక్తి మనకి నరనరంలోనూ జీర్ణించుకుపోయింది.
   కాని ఇక్కడ శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు అదే సూక్తిని మరో కోణం నుంచి ఆవిష్కరించారు.
   "ఉపకారికి కూడా ఒక్కొక్కసారి అపకారం జరిగితే.." అన్న పాయింట్ తీసుకుని దానికి తగ్గట్టు పాత్రలను మలచి కథ నడిపారు.
   భమిడిపాటి రామగోపాలం ఎంత గొప్ప కథకులో తెలియనివారుండరు.
కథంతా ఉత్తమపురుష (first person) లో సాగుతుంది. సౌలభ్యం కోసం ఆయనను మనం పెద్దమనిషిగా పిలుచుకుందాం. ఎప్పుడో ఆయన శృంగవరపుకోటలో పోస్టాఫీసులో క్లర్క్ గా పనిచేస్తున్నప్పుడు, కుర్రాళ్ల బాధ్యతా రాహిత్యం గూర్చి చెపుతూ పోస్ట్ మాస్టర్ రిజిస్టర్డ్ కవరు ఇవ్వద్దని చెప్పినాకూడా, అఖిలాండేశ్వరం అనబడే అతనికి ఈ పెద్దమనిషి కేవలం మానవతా దృక్పథంతో ఆ కవర్ ఇస్తాడు. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు దాటిపోలేదు కూడా. అలాగ ఆలోచిస్తే అతను అతని రూల్ ని అతిక్రమించలేదనే చెప్పుకోవాలి. అలా ఈ పెద్దమనిషి ఉత్తరం సమయానికి ఇవ్వడం వల్ల అఖిలాండేశ్వరం సమయానికి ఇంటర్వ్యూ కి హాజరయి, సెలక్టయి, అంచెలంచెలుగా పైకెదుగుతూ, పెద్దమనిషి రైల్లో కలిసే సమయానికి ఉద్యోగాలకి సెలక్షన్ చేసే స్థాయికి ఎదిగాడు.
ఆ అఖిలాండేశ్వరమే ఈ పెద్దమనిషి కొడుకు ఉద్యోగం పనిమీద హైదరాబాదు వెడుతున్నాడని తెలుసుకుని, ఆపని తన చేతిలో పనే అని చెప్పి, ఉపకారికి ఉపకారం చేద్దామనే ఉద్దేశ్యంతో వివరాలు చెప్పి తనని కలవమంటాడు.

     అంతా బాగానే అవుతుంది. పెద్దమనిషి కొడుకుకి ఉద్యోగం వస్తుంది. స్వయంగా ఆర్డర్ తీసుకునే ఊరు వెడదామని ఆయన హైద్రాబాదు లోనే వుండిపోయినప్పుడు ఈ అఖిలాండేశ్వరం పర్సనల్ సెక్రటరీ నని చెప్పి గంగాధరం అనే ఆయన ఈ పెద్దమనిషిని కలిసి, అబ్బాయి ఆ ఉద్యోగంలో ఎంత తొందరలో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో చెప్పి, తెలిసినవాళ్ళు కనక అందరిలా రెండు లక్షలు ఇవ్వకపోయినా యాభైవేలైనా ఇస్తే బాగుంటుందనీ, ఆ యాభైవేలూ కూడా ఈ పెద్దమనిషి ఎలా సమకూర్చుకోవాలో కూడా సలహా చెప్తాడు.
      ఆ పెద్దమనిషికి విషయం అర్ధమౌతుంది. కొడుకు ఉద్యోగస్తుడవడానికి గంగాధరం కోరినట్టే యాభైవేలూ పట్టికెళ్ళి కమీషనర్ గారికిచ్చి, అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకునే క్షణం లోనే అనుకోని సంఘటన జరుగుతుంది.
అవినీతి నిరోధకశాఖలో డిప్యూటీ సూపరెంటెండేంట్ గా పనిచేస్తున్న ఆ పెద్దమనిషి అల్లుడుగారు హఠాత్తుగా ప్రత్యక్ష్యమయి, ఆ అఖిలాండేశ్వరుణ్ణి రెడ్ హేండెడ్ గా పట్టుకుంటారు.
సాక్ష్యాధారాలన్నీ పకడ్బందీగా సేకరిస్తారు.

ఆ విధంగా ఉద్యోగమిచ్చి ఉపకారం చేసిన అఖిలాండేశ్వరానికి అపకారం జరిగింది.
      కథలో ఈ మలుపు రచయిత హఠాత్తుగా తీసుకొస్తారు. విషయం అర్ధమయ్యే లోపలే సాక్ష్యాలు సేకరించబడతాయి. ఆ విషయం ఆ పెద్దమనిషికి కూడా అప్పుడే తెలుస్తుందనుకోవాలి. ఎందుకంటే పాఠకులకి కూడా ఆ పెద్దమనిషి అల్లుడు అవినీతి నిరోధకశాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్టు అప్పుడే తెలుస్తుంది. అలా లంచం తీసుకుంటున్న ఒక ప్రభుత్వోద్యోగిని పట్టుకుంటూ సాక్ష్యాధారాలను సేకరించడంతో కథ ముగుస్తుంది. 

       అంతటి గొప్ప రచయిత ప్రతిభంతా ఆ ముగింపులోనే కనిపిస్తుంది.
ఎందుకంటే ఒక కథ మంచికథ అని చెప్పుకోవాలంటే కథ చదవడం పూర్తయిన తర్వాత పాఠకుడు ఆ కథ గురించి కాస్త సేపైనా ఆలోచిస్తేనే దానిని మంచికథ అంటారని పెద్దవాళ్ళు చెపుతుంటారు. అలాగే ఈ కథ పూర్తి చేసాక కూడా దీనిగురించి ఆలోచించకుండా వుండలేరు. ముందు అందరికీ వచ్చే సందేహం ఈ విషయం ఆ పెద్దమనిషికి ముందే తెలిసుంటుందా అని. కాని ఆ పెద్దమనిషి కూడా ఆర్డర్ కాగితాలు తీసుకుని అలాగే నిలబడడంతో ఆయనకు తెలీదనే అనుకోవాలి.

      ఈ కథని బట్టి మనకి అర్ధమయ్యేదేమిటంటే మనిషి ఒకటనుకుంటే పరిస్థితులు దానిని మరోవిధంగా మార్చేస్తాయి అని. పాత్రలను తీసుకోవడం లోనూ, సన్నివేశాలను సృష్టించడంలోనూ రచయిత ప్రదర్శించిన తీరు అమోఘం.
     తనకి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసుకునే అవకాశం వచ్చినందుకు అఖిలాండేశ్వరుడు ఆనందించి, మిగిలిన అభ్యర్ధుల దగ్గర రెండు లక్షలు తీసుకుంటున్నా ఈ పెద్దమనిషి సహాయానికి ప్రతిగా కేవలం యాభైవేలే తీసుకుంటాననడం ఆ పాత్రకి తగ్గట్టే వుంది. అలాగే పెద్దమనిషి కూడా ప్రస్తుత పరిస్థితులని అర్ధం చేసుకుని ఆ డబ్బుని తీసికెళ్ళి అతని కివ్వడం కూడా సబబుగానే వుంది. ఈ విషయం తెలిసిన అవినీతిశాఖ లో ఉద్యోగి (పెద్దమనిషిగారి అల్లుడు) తన డ్యూటీ ప్రకారం లంచం పుచ్చుకుంటున్నవాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం విధిని నిర్వహించెనట్టే అనిపించింది.
    ఇలా ఏ ఒక్క పాత్రనూ తక్కువచెయ్యకుండా కేవలం పరిస్థితుల ప్రభావం వలనే ఉపకారికి అపకారం జరిగినట్టు రచయిత చాలా గొప్పగా చెప్పారు.
     మనిషి ఏం చెయ్యాలనుకున్నా పరిస్థితులకి ఎంత బానిసో, ఉపకారం చేసినవారికి కూడా ఎలా అపకారం జరుగుతుందో ఎంతో సూటిగా చెప్పారు.
ఈ కథ అందుకే నాకు నచ్చింది. మహారచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు కథని ఎంతో పట్టుగా, సూటిగా నడిపారు. అనుకోని మలుపుతో ఇచ్చిన ముగింపు కథ పూర్తిచేసాక పాఠకుణ్ణి తప్పకుండా ఆలోచింపచేస్తుంది.



ఈ కథకి లింక్...http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nupakariki-napakaramu---bhamidipati-ramagopalam


1 కామెంట్‌:

Gorti చెప్పారు...

మురళీ మోహన్ గారూ,

నేను చూచిరాతలు-తప్పుడు కూతలు బ్లాగులో పెట్టిన ఒక కామెంటుకి ఆక్కడ జవాబివ్వడం ఇష్టం లేక మీకు నేరుగా సమాధానం ఇస్తున్నాను.

మనకేదయినా రియల్ స్టోరీ తెలిస్తే ఎవరైనా రాసెయ్యచ్చన్న సంగతి నాకు ఇన్నాళ్ళూ తెలియదు. ఇప్పుడు తెలుసుకున్నాను.

రాత ఎక్కడిదో మూలం చెప్పాలన్న పాయింటు మీరు వదిలేసి, ఎవరిక్కావల్సింది వారు ఏరుకున్నారు.

ధన్యవాదాలు.

-బ్రహ్మానందం