తీగలాగితే...
- స్వరలాసిక
"ఎడిటర్ గారికి
- ఈ వారం మీ పత్రికలో
ప్రచురించిన సూరిబాబు గారి గులాబిముళ్ళు కథ ఇంటర్‌నెట్ నుండి కాపీ కొట్టబడింది.
పాత్రల పేర్లు మార్చి క్లైమాక్స్ కొంచెం మార్చినంత మాత్రాన పాఠకులు కనుక్కోలేరని
సూరిబాబు భావించినట్టున్నారు. ఇరవై ఏళ్ల క్రితం అయితే సూరిబాబు లాంటి రచయితల ఆటలు
సాగేవి. ఇప్పుడలా కాదు. సమాచార విప్లవం ఇలాంటి రచయితల అసలు స్వరూపాన్ని బయట
పెట్టేస్తోంది. ఈ కథకు మూలమైన ఇంగ్లీషు కథ ప్రచురింపబడిన వెబ్‌సైట్ యు.ఆర్.ఎల్. లింకును
క్రింద ఇస్తున్నాను. చదివి నా ఆరోపణ నిజం అవునో కాదో మీరే నిర్ధారించుకోండి. మూల
రచయిత పర్మిషన్ తీసుకుని కథను అనువదించి ఉంటే ఆ విషయం పాఠకులకు తెలియజేయాల్సిన
బాధ్యత కూడా సదరు రచయితకు ఉంటుంది. మన పత్రికలు ఇలాంటి కాపీ కథలను అరికట్టడానికి
కొన్ని ఎథిక్స్ పాటించాలి. కాపీరాయుళ్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి వారి రచనలను
బహిష్కరించాలి. అప్పుడే పాఠకులను గౌరవించినట్లు అవుతుంది. గమనించగలరు - పరమానందం" అదీ ఇ-మెయిల్ సారాంశం.
ఆ మెయిల్ చదువి నవ్వుకున్నాను. సూరిబాబు గత మూడు
దశాబ్దాలుగా తెలుగు పత్రికారంగాన్ని దున్నేస్తున్న గొప్ప రచయిత. అతని
కథలు,సీరియళ్లు,ఫీచర్లు దాదాపు అన్ని తెలుగుపత్రికల్లోనూ వస్తోంది. అలాంటి రచయితను
వదులుకోవడానికి మేమే కాదు ఏ పత్రికా సిద్ధంగా లేదు.
ఈ పత్రికలో
సబ్ఎడిటర్‌గా చేరకముందు నుండీ తను సూరిబాబు అభిమాని. పాఠకుల అభిరుచుల్ని
ఎప్పటికప్పుడు పసిగట్టి వాటికి అనుగుణంగా రచనలు చేయడం సూరిబాబుకు మాత్రమే తెలిసిన
విద్య. కాబట్టే ఇంతకాలంగా ఆంధ్రుల అభిమాన రచయితగా వెలుగొందుతున్నాడు. అలాంటి
సూరిబాబుపై ఇతనెవడో చేసిన ఆరోపణను సీరియస్‌గా తీసుకోలేము.
అయినా ఇప్పుడు
నైతికవిలువలకు అర్థం పూర్తిగా మారిపోయింది.
ఇదివరకటిలా మడి కట్టుకుని కూర్చోవటం
ఇప్పుడున్న పోటీ వాతావరణంలో కుదరని పని. మీడియా విస్తరించిన కొద్దీ రచనలకూ,
రచయితలకూ డిమాండ్ పెరిగింది. అందులోనూ సూరిబాబులాంటి రచయితలకు మరీ డిమాండ్
పెరిగిపోయింది. అయినా ఏ రచయితైనా ఎన్నని కొత్త కొత్త
కథలను సృష్టించగలడు? ఇప్పుడు తెలుగులో సృజన సేచురేషన్ పాయింటును దాటిపోయింది.
కాబట్టి కొత్త అయిడియాలకు రచయితలు ఇతర భాషా రచనల వైపు చూస్తున్నారు. పత్రికల
వాళ్లు కూడా ఈ పరిణామాల్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అంతేకాదు రచయితలకు
కొన్ని హింట్లను పత్రికలే యిస్తున్నాయి. తను కూడా సూరిబాబుకు "ఈ ప్లాట్ చూడు
గురూ మనకు పనికి వస్తుందేమో" అని కొన్ని పాత విదేశీ కథలను అందించిన సందర్భాలు
అనేకం.
ఐతే సూరిబాబు ఏ కథను
కాపీ(నిజానికి మేం ఎడిటర్లం కాపీ అనే పదాన్ని వాడకూడదు. ఇన్స్పిరేషన్ లేదా ఇన్‌ఫ్లూయన్స్
అనాలి) చేసినా ఎవరూ సులభంగా కనుక్కోలేంత పకడ్బందీగా ఆ కథను మార్చివేసి స్వంత కథ
అనిపించేటట్టు చేస్తాడు. అలాంటిది ఈ పరమానందమెవడో గట్టి పిండమే సూరిబాబు ఫలానా కథ
ఫలానా చోటనుండి కాపీకొట్టాడని చెప్పగలుగుతున్నాడు.
ఈ గులాబిముళ్లు కథకు
మూల కథ ఎలా వుంటుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ మెయిల్‌లో ఇచ్చిన లింక్‌ను
నొక్కాను. ఫిక్షన్ మాఫియా డాట్ నెట్ అనే వెబ్‌సైటులో అలెక్స్ అనే రచయిత రాసిన
డార్క్ ఎకో అనే కథ ఓపెన్ అయ్యింది.
జాగ్రత్తగా
పరిశిలిస్తే తప్ప ఈ కథకూ గులాబిముళ్లు కథకూ ఒకటే ప్లాట్ అని అర్థం కాదు. అయితే
నన్ను అంతకన్నా ఆశ్చర్య పరచిన విషయం మరొకటుంది. ఇదే కథను నేను రెండ్రోజుల క్రితం
చదివాను. వృత్తి(?)లో భాగంగా పాతికేళ్లనాటి పాత ఇలస్ట్రేటెడ్ వీక్లీ తిరగేస్తుంటే
కనిపించి చదివింప జేసిన కథ అచ్చం ఇలాగే ఉంది!
వెంటనే లైబ్రరీకి
పరుగులాంటి నడకతో చేరాను. కార్పొరేట్ మీడియా సంస్థ నుండి వెలువడుతున్న మా పత్రికకు
అతిపెద్ద లైబ్రరీనే ఉంది. రెండ్రోజుల క్రితం చదివిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ బౌండ్‌ను
రేక్ నుండి తీసి ఆ కథకోసం వెదకసాగాను.
ఎక్కువ
శ్రమపడకుండానే ఆ కథ కనిపించింది. శ్రద్ధగా మరోసారి చదివాను. కథ పేరు ది పర్పుల్
కలర్ హ్యాండ్ బాగ్. రచయిత్రి అనితా నంబూద్రి. సందేహం లేదు ఈ కథను చదివే డార్క్ ఎకో
కథ రాసి ఉంటాడు ఆ రచయిత. సునామీ, రిసెషన్ లాంటి కొత్తపదాలు కొన్ని చొప్పించి పాత
కథను కొత్తగా మలిచాడు అలెక్స్.
ఆ బైండు పుస్తకాన్ని
మూసేస్తుండగా ఒక పేజీలో లెటర్స్ టు ఎడిటర్ శీర్షికలో పర్పుల్ హ్యాండ్ బ్యాగ్ అనే
పదాలు కనిపించాయి. ఆ ఉత్తరం చదివాను. ఆ కథ పడిన నాలుగు వారాల తర్వాతి సంచిక అది.
ఎవరో అనితా నంబూద్రి కథ ఒక చైనీస్ కథకు మక్కీకి మక్కీ కాపీ అని రాశారు. ఆ కథ పేరూ,
కథా రచయిత పేరూ, ఆ కథ ప్రచురించిన చైనా పత్రిక తేదీ
వివరాలు అన్నీ ఆ ఉత్తరంలో ఉన్నాయి.
నాకు ఉత్సుకత
మరింతగా పెరగ సాగింది. దీని సంగతి ఏమిటో పూర్తిగా తేల్చాలని మనసులో ఒక స్థిర
నిర్ణయానికి వచ్చాను. ఫేస్‌బుక్‌లో మిత్రుడైన జెంగ్ లాంగ్ కు ఈ వివరాలన్నీ ఇస్తూ
అసలు సంగతి కనుక్కోమని ఒక ఇ-మెయిల్ పెట్టాను. వారం రోజుల లోపే అతని నుండి రిప్లై
వచ్చింది.
నేను పేర్కొన్న
చైనీస్ రచయిత తనకు స్నేహితుడేననీ, అతడిని నేను పంపిన వివరాలు అడిగితే ఆ కథ
వ్రాసింది ఆ రచయితేనని తెలిసిందనీ,
ప్రచురించిన పత్రిక వివరాలు అన్నీ సరిపోయాయని లాంగ్ బదులు ఇచ్చాడు. తనకు ఆ కథ
రాయడానికి ప్రేరణ ఇండియాలోని రాకేష్ వర్మ అనే రచయిత రాసిన అంధేరే ఖులా దర్వాజా అనే
హిందీ కథ అనీ ఆ కథను అప్పట్లో వస్తున్న నయీ దునియా అనే పత్రికలో చదివాననీ సదరు
రచయిత లాంగ్‌కు వివరించినట్టు ఆ
మెయిల్ లోని సారాంశం.
నాకు భలే ఆశ్చర్యం
వేసింది. ఆ అంధేరే ఖులా దర్వాజా కథ విషయమై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. ఆ కథ
ఒక కన్నడ కథనుండి కాపీ
అయినట్టు ఆ విషయం కోర్టుదాకా వెళ్ళినట్టు నాకు బాగా జ్ఞాపకం. ఇక నా అన్వేషణ 'నయీ
దునియా'పై పడింది. చాలా కష్టపడితేగానీ ఆ కథ పడిన పత్రిక సంచిక తరువాతి సంచికలూ
దొరకలేదు. మొత్తానికి ఎలాగైతేనేం సాధించాను. అంధేరే... కథ పూర్తిగా చదివాను.
మధ్యలో చైనీస్ కథ చదవలేదు కానీ పర్పుల్... కథకూ ఈ కథకూ ఎక్కువ పోలికలే కనిపించాయి.
ఇక నయీ దునియా పాత
సంచికలనుండి ఆ కన్నడ కథ కూపీలాగాను. కథ పేరు మొదివే హుడిగి. రాసింది రామణ్ణ
శ్యానభోగ. సంపిగె అనే పత్రికలో వచ్చింది. నా అదృష్టం కొద్దీ నాకు కన్నడం చదవడం
మాట్లాడటం వచ్చు. ఒక రెండు వారాలు కష్టపడిన తరువాత ఆ సంపిగె పత్రిక
సంపాదించగలిగాను. ఆత్రంగా మొదివే హుడిగి (పెళ్ళి కూతురు) కోసం చూశాను. దొరికింది.
ఆ కథ పూర్తిగా చదివాక ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది.
మరుసటి రోజు
సూరిబాబు నా సీటు వద్దకు వచ్చాడు
తన వీక్లీ ఫీచర్ అందివ్వడానికి. "కూర్చో గురూ! నీకో ఇంట్రెస్టింగ్ విషయం చెబుతాను"
అంటూ పరమానందం మెయిల్ నుండి మొదివే హుడిగి దాకా అంతా పూసగుచ్చినట్టు వివరించాను.
నా మాటలు వింటున్నప్పుడు అతని మొహంలో రంగులు మారసాగాయి. చివరగా మొదివే హుడిగి కథను
టూకీగా తెలుగులో చెప్పినప్పుడు అతని మొహంలో ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు
కనిపించింది.
"ఇప్పుడు
జ్ఞాపకం వస్తోంది. ఈ రామణ్ణ అనే అతను నా కథను కన్నడంలోకి అనువదించడానికి నా
పర్మిషన్ అడిగాడు. నేను నా అనుమతిని తెలుపుతూ ఉత్తరం రాశాను కూడా. అయితే తర్వాత
అతని నుండి ఏ కమ్యూనికేషన్ లేదు. ఆ సంగతి నేనూ మరిచి పోయాను"
"వారినీ!
గులాబి ముళ్ళు కథకి మూలం 'దులపర బుల్లోడ' కథా? నా కథను నేనే కాపీ
కొట్టానన్నమాట" సూరిబాబు వదనంపై నవ్వులు మొగ్గలు వేశాయి.
నేనూ చిద్విలాసంగా
నవ్వాను. ఆ బుల్లోడి కథకు మూలకథను అన్వేషించాలనే ఆలోచన నా మనసులో
క్రమేపీ రూపు కట్టుకోసాగింది.
(ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం 30-12-2012 సంచికలో ప్రచురితం)
2 కామెంట్‌లు:
మొత్తానికి డొంకంతా కదిలిందన్నమాట...
-- లక్ష్మిఫణి
kathanikalO nUtanatvam mariyu kApIrAyullaku cempa pettugaa undi.
----chennuri sudarshan
కామెంట్‌ను పోస్ట్ చేయండి