శనివారం 5 డిసెంబర్ 2009

తెలంగాణా గోస!

"అవ్వా కోమట్ల యింటికాడ చెక్కా పల్క శేతికిచ్చినపుడు ముర్సుకుంట బడికి పోయిన. పది పాసైనపుడు పది మందికి చెప్పుక తిర్గితి. పై సదువులకు నేను వోతున్నపుడు తూట్లు పడ్డ టిక్కెట్లోలే సదువుకు తూట్లు వడొద్దు అనుకున్న. గని అన్ని నౌకర్ల అటెండర్లనుంచి అందరు ఆందరోల్లె నిండి పోతండ్రు. మనోల్లకు ఏమి యియ్యనిత్త లేరు. నేనేం జేయాలే" అని ఎల్లయ్య అన్నడు.
.......................................................
.......................................................
"ఔరా! తర్రగాడ్దికొడ్కు లెక్క యెన్కకు మర్రుతావురా. యీడ పుట్టినం. ఈడ పెరిగినం. ఈడ మలమల మాడుడు ఏందిరా. పొయి మనది. పొయి మీద కుండ మనది. పొమ్మనకుంట పొగవెట్టి యెల్లగొట్టాలె. గీయింత దానికే పోనని చెప్పుతండు మొగోడు. ఆ ఈని పిరికితనం సూడే...ఎట్లుందో..."
.......................................................
.......................................................
'ఔను నాయన...అవ్వ అన్నది నిజమే. పగదారునితో కొట్లాటకు వోయెటపుడు గెల్చి రావలె. అట్లా అని ఒక్కపారి ఓడిపోతె మొత్తం ఓడిపొయినట్లు ఎట్లయితది? కాదు. ఒక్కసారి ఫేలయినోల్లు నౌకరి చేసేటోల్లు లేరా...'
.......................................................
.......................................................
"మావోడు సదువాంటండు. ఏం సంగతి. ఇన్నొద్దులు మీ అయ్యవ్వ, మేం మంచిగ సదివిత్తర్రు అని పేరెల్లినం. మావోడు ఇగ సదువా అంటండు. ఏం జేయాల్నయా?" అంటూ ఎల్లయ్య దిక్కు చెయ్యి సూపెట్టుకుంట సెప్పుతండు రంగయ్య.

"నువ్వొద్దెనేనే మన నౌకర్లు మనగ్గాకుంట, మన నీళ్లు మనకు పారకుంట మన బొగ్గు మనకందకుండ మనకగ్గివెట్టిండ్రే...'పంట పండాలె గని తింటె దంగుతదా అన్నట్లు మంచి మంచి సదువులు కోస్తాంద్ర పంటలు దీసెటోల్లు సద్వించవట్టిరి. ఇగ మేమయితే మీరు పంపిచ్చిన పైసలు సాలక ఎస్టీడీలల్ల, క్యాటరింగ్...లాంటి ఎన్నో పనులు జేసుకుంట సద్వితిమి. వాళ్లకు మనకు పోటివెడ్తె ఐతదా...? గట్ల పెట్టి, మనదగ్గర కొలువులు కూడా ఏర్పడ కుంట గుంజుక పోతండ్రు. గట్ల నౌకరైనోడు పందికొక్కోలె వాని కిందికి, వానోని కిందికి పొక్క తోడుకుంటండు. మనకు నౌకర్లు రాకుంట చేత్తండ్రు" అని చెప్పిండు సత్తీస్.

"మన పని మనకు పంచెయ్యాలె. మన నౌకరి పాల్లు మనకు పెట్టాలె. పెట్టేటట్లు చెయ్యాలే" రంగయ్యన్నడు.

"అట్లు వొత్తలేదే? మాది మనోల్లది అనే ఆలోచన రాక మనం అట్ల తెలివికి రాక ఆగమైతన్నం" అని సత్తీస్ అన్నడు.

"ఎందుకురాదూ? గడ్డిని తాడువడితే ఆ తాడు గడ్డామును ఆగవడ్తది గాలికి ఇటు అటు కొట్టుకపోకుంట. గట్టిగ పిడికిలి వట్టి యీడిసి గుద్దితే సచ్చెదాక దెబ్బలేకుంట యాదుంటది. అంతకన్నా అడివా...? ఒగొలు చెప్పిన బుద్ది అప్పట్ది. మీ బుద్ది ఎప్పట్ది. మేం మత్తుగ అంటం గుడ్డెద్దు శేన్లవడ్డట్టు. ఇదే ఏ పని జేసినా కాయంగా జేసుకుంటేనే బతుకుతరు...లేకుంటే ఎప్పటి శిప్ప యేన్గులనే."
.......................................................
.......................................................
"ఔరా! మన తాడికి బతికెతందుకొచ్చి, మనది మనగ్గకుంట గుంజుకుంటే ఊకుండ వడ్తిమి. రేపు మన తమ్ముల్ది గుంజుకోరా...? వాంది. వానితాతది. వానయ్యది. మాయిముంత ఏడదాసిండ్రో గది వాని ఖుద్దుజాగ. మన దగ్గర్కొచ్చి మన యాస మీద, బాషమీద, పండుగలమీద వాని జుల్ము ఏంది? బిచ్చానికొచ్చినోడు ఆమిల్లు గరిస్నట్టు గావట్టే. నువ్వెమంటవ్రా ఎల్లా! చెప్రా"
.......................................................
.......................................................
"మనకు చరిత్ర దెల్సు. యిత్తేసి పొత్తుగూడినోడు పొయిమీది కుండను మాయం జేత్తండు. మనం వొండుకున్నది మనకు వెట్ట వాడెవడు. మన పొయి మంటను గుంజుకున్నడు. యిపుడు మండేది పెయి మంట. అదే కడుపుల ఆకలి మంట. గా మంట సల్లార్పెతందుకు ఎన్నడో ఒగనాడు మంచి కాలమొత్తది. గదేందో మనమే సురువుజేస్తే ఐపోతది గదా...!" అని సత్తీస్ అన్నడు.

"ఔను! గీ ముచ్చట మంచిగుంది. థింక్ పాసిటివ్ వే గా ఆలోచిస్తే అది ఖచ్చితంగా ఐతది. ఒగ పెద్దయన 'నీ సంకల్పం మంచిదైతే శక్తి దానంతట అదే ఉద్భవిస్తది' అన్నట్టు మనం జేసే పని మంచిదైతే అదే బాగైతది. మంచిగైతది" అని ఎల్లం అన్నడు.

"ఇగ రేపు వోదాం క్యాంపస్‌కు" సతీష్.
.......................................................
.......................................................
అవ్వా! రేపు పొద్దుగాల పట్నం బోతన్న. నౌకర్ల కోసం, మన తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధులకోసం, కొలువుల కోసం, అందరం ఒక్కటైయెటట్లు జేస్తం. శెల్లే! ఇగవోతరా సదివెతందుకు.

నాయినా! ఇగ రేపు బోతా. మనకోసం మనం తయారయ్యేటట్లు జేస్త. మన బతుకులకు, మన తెలంగాణకు నా వొంతు నేను శాతనైన కాడ్కి పేరు నిలవెడ్త.


సిద్దెంకి యాదగిరి గారి ఈ "కీలెరిగిన వాత" కథను పూర్తిగా కథాజగత్‌లో చదవండి.

శనివారం 28 నవంబర్ 2009

అంతర్ముఖం, మరో రెండు కథలు!

అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు?

అతడిని ఋషివర్యుడు ఎందుకు వారించాడు?

అతడి జీ(వి)తంపై ఎందరి బ్రతుకులు ఆధారపడి వున్నాయి?

ఋషివర్యుని జ్ఞానబోధ అతడిపై ఏమైనా ప్రభావం చూపిందా?

క్రమశిక్షణాలోపమే ఆత్మహత్యలకు కారణమా?

ఇంతకీ అతడు ఆత్మహత్య చేసుకున్నాడా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అడపా చిరంజీవి గారి డైరెక్టు కథ 'అంతర్ముఖం' కథాజగత్‌లో చదవండి. పనిలో పనిగా అరుణపప్పు గారి 'ఏకాంతంతో చివరిదాకా!', వడలి రాధాకృష్ణగారి 'కొలువు' కథలు కూడా చూడండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని మేము ఉబలాట పడుతున్నాము.

బక్రీద్ శుభాకాంక్షలు!!!


బ్లాగ్మిత్రులందరికీ ఈద్ ఉల్ జుహా పర్వదిన శుభాకాంక్షలు!!!

గురువారం 26 నవంబర్ 2009

మిత్ర సమాగమము - చిత్ర మాలిక!

నవంబరు 14,15 తారీఖులలో కలిసిన మా మిత్ర బృందపు విశేషాలు ఈ క్రింది ఫోటోల్లో!
















బుధవారం 25 నవంబర్ 2009

శ్రీశ్రీ కవిత్వానికి పేరడీలు!!!

ఆధునిక తెలుగు కవిత్వంలో ఎక్కువగా పేరడీకి గురి అయ్యింది శ్రీశ్రీ వ్రాసిన కవిత్వమే. శ్రీశ్రీని లక్ష్యంగా పెట్టుకుని పేరడీలల్లిన వారెందరో! వారందరి పేరడీలలలో కొన్నింటిని ఒక చోట చేర్చి చదివించి ఆనందపరచడమే ఈ టపా లక్ష్యం. ఈ పేరడీల మాతృకలను సులభంగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో వాటిని ఇక్కడ ఇవ్వటం లేదు.

1.మాగాయీ కందిపచ్చడీ
ఆవకాయీ పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారాకిల్లీ
సామానోయ్ సరదాపాటకు

తుప్పట్టిన మోటార్ చక్రం
తగ్గించిన చిమ్నీ దీపం
మహవూరిన రంపప్పొట్టూ
పంగల్చీలిన ట్రాం పట్టా
విసిరేసిన విస్తరి మెతుకులు
అచ్చమ్మ హోటేల్లో చేపలు
సామానోయ్ సరదాపాటకు

నడి నిశిలో తీతువు కూతా
పడి పోయిన బెబ్బులి వేటా
కర్రెక్కిన నల్లి నెత్తురూ
జుర్రేసిన ఉల్లికారమూ
చించేసిన కాలెండర్ షీట్
నపుంసకుడీ థాట్ డెవలప్మెంట్
సామానోయ్ సరదాపాటకు

త్రుళ్ళనిదీ కుళ్ళనిదీనీ
మళ్ళినదీ వెళ్ళినదీనీ
చచ్చేదీ లాభం లేనిది
ఈ జన్మకు పనికి రానిదీ
మనకెప్పుడు కలిసిరానిదీ
సామానోయ్ సరదాపాటకు -జరుక్ శాస్త్రి

2.పిలిచేదీ పిలిపించేదీ
చేరేదీ చేర్పించేదీ
ఆడేదీ ఆడించేదీ
బిరుదాలకు బదులిచ్చేదీ
కవిమతమున కలిసొచ్చేదీ
కవితేనోయ్ నవీన కవులకు
.................
.................
దినపత్రిక దిక్కుల వ్రాతలు
దీవించే సంపాదక నేతలు
అర్థానికి అకాడమీ దాతలు
పలుభాషల ప్రచురణ కర్తలు
కౌగిలి కోరే కృతిభర్తలు
కృత్రిమ సంఘం, కుంటి నడకలు
కావాలోయ్ నవీన కవులకు
.................
................. -కాట్రగడ్డ

3.ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం
c,a,t - కేటువి నీవై
r,a,t - రేటుని నేనై
రాతగ్గ కవిత్వం నీవై
పోతగ్గ ప్రభుత్వం నేనై
తిగ్మాంసూని కిరణంలాగా
ఎగ్మూరు స్టేషను నీవై
మారురంగు మణీలా లాగా
నోరులేను ముక్కను నేనై
కాలానికి ఆక్సిజన్ యిచ్చాం
ఏలాగో తగలడి చచ్చాం
2
పిక్ ఫోర్డువి నీవే ఐతే
రాక్ఫెల్లర్ నేనే ఐతే
నీ తల్లో దవనం తుంచీ
నా తల్లో నరకం పెంచీ
శాంథోం సిఖరం నీవై
ఆంథోనీ ఈడెన్ నేనై
గుడిలోపల దేవివె నీవై
మడికట్టిన పూజారిని నేనై
నీ కంకణ సౌభాగ్యంలో
నా జీవన దౌర్భాగ్యంలో
గది తలుపుకు గడియే వేద్దాం
పదిలంగా ముసుగేశేద్దాం
3
నా లోపలి నీవే మనమై
నీ లోపలి ఊరే నేనై
నీ పగిలిన చిలాయి చుక్కే
నా రగిలిన కొబ్బరి ముక్కే
నా తల్లో నరకం పెంచీ
నీ తల్లో దవనం తుంచీ
అఛ్ఛాడీ చేతివి నీవై
పిచ్చాడి ప్రలాపం నేనై
వడపప్పూ కొబ్బరి నీవై
తడికల గది కవితను నేనై
ఎగ్మూరు స్టేషన్ నీవై
నోరులేని బొమ్మను నేనై,
ఆనందం కంబళి ఐతే
అనురాగం సంబరమైతే
ఘనా- జటా పనసవు నీవై
వటా వటా వాగుడు నేనై
అన్నానికి ఆర్తివి నీవై
కన్నంలో తేలును నేనై
తాడుతెగిన పటంగివి నీవై
జోడులేని విహంగం నేనై
వ్యసనానికి హసనం తెద్దాం
హసనానికి మసనం తెద్దాం
(శ్రీramgaM శ్రీnivaasa Rao తన గేయాల్లో ముఖ్యంగా అద్వైతం అనే
గేయంలో చూపిన మర్గానికి కృతజ్ఞతో - తజ్ఞతతో) -జరుక్ శాస్త్రి

4.ఏ రోడ్డు చరిత్ర చూచినా
ఏమున్నది గర్వ కారణం?
రహదారి చరిత్ర సమస్తం
ధూళి దూసర పరిన్యస్తం,
రహదారీ చరిత్ర సమస్తం
యాతా యాత జన సంయుక్తం
రహదారి చరిత్ర సమస్తం
పథిక వాహన ప్రయాణ సిక్తం,
భూంకార గర్జిత దిగ్భాగం
చక్రాంగ జ్వలిత సమస్తాంగం
రహదారి చరిత్ర సమస్తం
పైజమ్మాలను పాడుచేయడం
...................
...................
హైరోడ్డులు అశోకుళ్ళై
చరిత్రమున ప్రసిద్ధికెక్కెను
..............
..............
లారీరాజం, భారీబస్సూ
రోడ్డురోలర్ బ్రెన్‌గన్ కారీర్
ట్రాంకారూ ఏమైతేనేం
ఒత్తేయును టూత్పేస్టుల ట్యూబల్లే
.....................
.....................
ఒక కారును వేరొక కారూ
ఒక బస్సును వేరొక లారీ
చుంబించే ఆ క్షణమందున
రూల్సన్నీ దాగును యెచ్చట?
..................
..................
ఈ నడివీథికి సంగరముందా?
ఆ రహదారి వాలంబెంతుందీ?
పోసిన రాళ్ళూ నడిపిన్ బళ్ళూ
యివి కావోయ్ బాటల భాగ్యం
...................
...................
రహదారుల మధ్య దారిలో
అగుపించే హంతకులెవ్వరు?
ప్రక్కన పెట్టిన రోలర్ కాదోయ్
దాన్ని గుద్దిన బండ్లెన్ని?
...............
...............
ఏ గీతం? ఏ కాలంలో
సాధించినదీ పరిపూర్ణం?
ఏ జలసూత్రం? ఏ 'కలవింకం'?
చూపించిరి ఈ వికటత్వం
ఎగతాళుల ఈ ప్రతిబింబం?
ఈ భావం, ఈ కిష్కిందం
ఈ భాష్యం, ఈ బాంధవ్యం - మాచిరాజు దేవీప్రసాద్

5.ఏ పాప పైట జారినా
ఏ కాంతుడు ఏమి జేయునో?
పాపల పవిత్ర క్షేత్రం
పడుపు వృత్తి పూజా సత్రం
.................
.................
ఏ పడకను ఎందుకు వేసిరో
ఏ గడపకు సూత్రముండునో?
నిమిషాలు పరుషాలు
నిష్పలితుల జీవితం వ్యర్థం!
.................
.................. -కాట్రగడ్డ

6.ఏ లాబ్ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
శాస్త్రజ్ఞుల చరిత్ర సమస్తం
పరదూషణ పరాయణత్వం

................
................

బలవంతులు విజ్ఞుల జాతిని
బానిసలను కావించారు
పారసైటులు రిసెర్చి గైడులై
చరిత్రన ప్రసిద్ధికెక్కారు
చల్లారిన ఉత్సాహాలు
మరణించిన అంతరాత్మలు
జెఆర్‌పిఎస్‌ల హాహాకారాలు
లాబుల్లో మూలుగుతున్నవి
టైపిస్టులు మెకానిక్కులు
డైరెక్టర్లు, రిజిస్ట్రారులు
మినిస్టర్లు అందరు కట్టిరి
రీసెర్చికి సజీవ సమాధి

ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో
విద్యార్థుల జీవనమెట్టిది
ప్రొఫెసరచ్చేసిన పేపర్ కాదోయ్
దాన్ని వ్రాసిన విద్యార్థెవడు?
................ -కవన శర్మ

7.ఏ సినిమా చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
ఈ సినిమాల చరిత్ర సమస్తం
ప్రొడ్యూసర్లను కాల్చుకు తినటం
....................
....................
ఒక పిక్చర్ నింకొక పిక్చర్
ఒక యాక్టర్ నింకొక యాక్టర్
పీడించే సినీ ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు
ఏ సినిమా ఎందుకు తీసిరో
ఏ పిక్చర్ ఎన్నాళ్ళుందో
జయలలితా జ్యోతిర్లక్ష్మీ
ఇవికావోయ్ సినిమాల్సారం
.................
చిత్రసీమ నాగరికతలో

ఎకస్ట్రాల జీవనమెట్టిది?
చలన చిత్ర నిర్మాణానికి
సిగ్గొదిలిన శ్రీమంతులెందరు?
సినీ ప్రపంచం పద్మవ్యూహం
సినిమా ఒక తీరని దాహం -పురాణం సుబ్రహ్మణ్య శర్మ

8.ఏ సినిమా చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం?
సినీమాల చరిత్ర సమస్తం
నరపీడన పారాయణత్వం

సినిమాల చరిత్ర సమస్తం
స్టార్ హీరోల పాద సేవనం
సినిమాల చరిత్ర సమస్తం
చెంచాల వీరవిహారం

సూపర్స్టార్ పాత్ర ప్రధానం
తారాగణ అతివికారం
సినిమాల చరిత్ర సమస్తం
ప్రేక్షకులను కాల్చుకు తినడం

దర్శకుడే హీరొయిన్లచే
వ్యభిచారం చేయించాడా?
పరకాంతలు తెలుగు భామలై
సినీరంగమున ప్రసిద్ధికెక్కిరి

రాసక్రీడలు లేని చోటు టా
లీవుడ్ లో వెదకిన దొరకదు
హీరోయిన్ తడిసె వర్షమున
లేకుంటే హీరో స్వేదములో

కల్లోలిత సంసారాలు
దిగజారిన సంస్కారాలు
అపహాస్యపు హాహాకారం
సినిమాల్లో నీలుగుతున్నవి

అవివేకం అతిమూర్ఖత్వం
రీమేకులు కాపీ కథలూ
మాయలతో మారు పేర్లతో
సినిమాల్లో కనిపిస్తున్నవి

ఏయన్నార్ ఎంటీవోడు
శొభన్ సూపర్ స్టార్ కృష్ణ
చిరంజీవో ఎవడైతేనేం?
ఒకొక్కడూ శిరభక్షకుడు

నాగార్జున వెంకటేషులు
బాలయ్య పవన్ కల్యాణులు
మహేష్ బాబు ఉదయ్ కిరణ్ చేసిరి
మెదళ్ళతో రస పానీయం

అభిమానుల సందోహంలో
మీడియా ప్రకంపనలలో
ప్రకటనల పరంపరలో
సినిమాలను తీసిన మనుష్యులు

అంతా తమ ప్రయోజకత్వం
తామే ఇక సామ్రాట్టులమని
స్థాపించిన స్టూడియోలు
నిర్మించిన ఫిల్మ్ సిటీలూ

ప్రేక్షకుల చీత్కారంతో
పడిపోయెను పేకమేడలై
పరస్పరం సంగ్రహించిన
స్టోరీలతో సినిమా పుట్టెను

సహజమైన కథానికలు
మధురమైన సినీసంగీతం
అర్థమయ్యే మాటలు, పాటలు
ఇంకానా? ఇకపై ఉండవు

ఒక మహిళకు ఒకరే భర్త
ఒక పురుషునఒకరే పత్ని
ఉండే ఏ సినిమా అయినా
ఇంకానా? ఇకపై ఆడదు

మెగాస్టార్ ఘరానా మొగుడు
గోల్డ్ స్టార్ సమరసింహుడు
యువసామ్రాట్ మాస్ బాస్ బాస్ మాస్
సూపర్ హీరోలే అందరూ

పావలాకి రూపాయి నటన
హీరోయిన్ బికినీ వీక్షణ
సెంటిమెంటల్ చావబాదుడు
కలిపేస్తే సినిమా అయ్యెను

ఏ స్తాలిన్ ఎవడిని నరికెనో
లక్ష్మీ, మాస్ ఏ స్టేప్పేసెనో
నరసిమ్హుడి కంటిచూపులు
ఇంతేనా సినిమా అంటే?

ఏ షూటింగ్ ఎక్కడ జరిగెనో
ఏ సినిమా ఎన్నాళ్ళాడెనో
రికార్డులు గాసిప్ రచనలు
ఇదీ సినీ పత్రికల సారం

హాలివుడ్ వాడిపారేసిన
ఫార్మ్యులా ల జోలికి పోని
కథలేవో కావాలిప్పుడు
వినకుంటే ఇక వాళ్ళిష్టం

ముచ్చటైన సన్నివేశం
వెనకనున్న రచయిత ఎవ్వరు?
మణిరత్నం చీకటి షాట్లో
పనిచేసిన లైట్ బాయ్ ఎవ్వడు?

ఆకాశపు విన్యాసాల్లో
స్టంట్ మేన్ల సాహసమెట్టిది?
హీరోల స్టెప్పులు కాదోయ్
అవి నేర్పిన మేస్టర్ ఎవ్వడు?

ఏ పోరి ఎవడితో తిరిగెనో
ఏ గుంటడు ఎవతిని తార్చెనో
న్యూస్ చానెళ్ళ స్పై కేం స్టింగులు
సృష్టించెను గందరగోళం

పదికోట్లతో తీసిన చిత్రం
అది చూసిన ప్రేక్షకులెవ్వరు?
ఆ సినిమా ఏ కాలంలో
సాధించిన దే పరమార్ధం?

ఏ కథనం ఏ సంగీతం?
ఏ మధనం ఏ సాహిత్యం?
ఏ జన్మల పాపమీ చిత్రం?
ఏం చేస్తాం? ఏమీ చెయ్యలేం!! -మలక్‌పేట్ రౌడీ



8.నిజంగానే నిఖిల ఆంధ్రం
నిండు హర్షం వషిస్తుందా?
భోజనానికి నిజంగానే
భోగ కాలం రహిస్తుందా?
నిజంగానే నిజంగానే
నిఖిల ఆంధ్రం హసిస్తుందా?
తినకముందే మొహం మొత్తే
మోహన్ దాల్ నశిస్తుందా?
................
................
పెరటి కోయిల కరకు కూతల
అరవ భాష్యం శమిస్తుందా?
కరిలు యిరికిన పరువు నరకము
మరచు కాలం క్రమిస్తుందా?
................
................ - మాచిరాజు దేవీప్రసాద్

9.ఏరి తల్లీ నిరుడు మురిసిన
ఇనప రచయితలు
కృష్ణశాస్త్ర పుటుష్ట్రపక్షి
దారితప్పిన నారిబాబూ
ప్రైజు ఫైటరు పాపరాజూ
పలక రెంచేత?
ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం
పండితా నారాధ్యుడాడిన
వంద కల్లల పంది పిల్లల
ఆంధ్ర పత్రిక ఎక్కడమ్మా?
ఎక్కడమ్మా ఎలక గొంతుక
పిలక శాస్త్రుల పనికి మాలిన
తలకు మించిన వెలకు తగ్గిన
రణగొణ ధ్వనులు
ఏవి తల్లీ నిరుడు మురిసిన
హిమసమూహములు - శ్రీశ్రీ

10.ఏవితల్లీ నిరుడు మండిన
ఎండు తాటాకుల్
............
దుర్గబాయీ భర్గు రాణీ
భీకరాన న స్పీకరేది?
లోకైక లీడరు రైతు రంగా
బూకరింపుల బాకులెక్కడ?
ఎన్నికల నోరు తెరిచి కాలం
ఎందరిని కబళించెనమ్మా?
ఏదతల్లీ నిరుడు కురిసిన
వడగళ్ళ గడబిడలు
............ -ఆరుద్ర

11. ...............
అసెంబ్లీలో నిరుడు నిలుచుని
హాలు గడగడలాడు స్వరమున
లోపముల పైకెత్తి చూపిన
లోక సేవకు లేరి తల్లీ?
..............
.............. -చొప్పకట్ల చంద్రమౌళి

12.నందమూరి రామరాయని
నినద భీషణ శంఖమెక్కడ?
నెత్తికెక్కిన అహంభావపు
బజారు భాషల వక్తలేరీ
ఏవి తల్లీ నిరుడు విరిసిన
తెలుగు చోద్యాలు?
................
................
తెలుగు నేతల జాతిపీతల
కోతిమూకల తోకలెక్కడ
పచ్చకార్డులు విసిరి కాలం
పారిపోయిన జాడలేవీ?
.............
............. -అబ్బూరి వరదరాజేశ్వర రావు

13.చక్ర పొంగళి ప్లేటు ఎచ్చట ?
రవ్వ లాడూ ఉండలెచ్చట ?
ఏవి సర్వర్ ! ఆర్డరిచ్చిన
ఇడ్లి పెసరట్టూ ?
శ్రీనాధ మహా కవీంద్రుని
జిహ్వాగ్రమున కరంగిన
వంటకాల్ నేడెక్కడయ్యా
కలవు ? చూపించు !
విజయరాఘవ మందిరంలో
వినిపించిన త్రేన్పు లెచ్చట?
గోప బాలురు నాడు మెక్కిన
మాగాయ పచ్చడేది తండ్రీ !
వేడి సాంబార్ సెగల కేళీ
లోచనోత్సవ రోచులేవీ ?
ఉల్లి వేసిన గట్టి పకోడీ
కర కర ధ్వనులెక్కడయ్యా !
ఎక్కడయ్యా నల్లనయ్యకు
విదురుడిచ్చిన మేటి విందు ?
ఖ్యాతినొందిన భీమ పాకపు
ఘుమ ఘుమలవి ఏవి తండ్రీ !
ఉల్లి దోశ, వడా సాంబార్
మిరప బజ్జీ, సేమ్యాకిచిడీ
రుచుల దేల్చెడి టిఫిన్లేవీ
కానరావేమీ ?
నీళ్ళు తెచ్చిన గాజు గ్లాసును
నేడు కడిగిన జాడ లేవీ ?
ఏవి తండ్రీ ! ఆర్డరిచ్చిన
ఇడ్లి పెసరట్టూ ? -పంతుల జోగారావు

14.అవాకులన్నీ
చెవాకులన్నీ
మహారచనలై మహిలో నిండగ
ఎగబడి చదివే పాఠకులుండగ
విరామ మెరుగక పరిశ్రమిస్తూ
అహోరాత్రులూ అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు
వారికి జరిపే సమ్‌మానాలకు
బిరుదుల మాలకు
దుశ్శాలువలకు
కరతాళాలకు ఖరీదు లేదోయ్
..................
..................
నరాల బిగువూ
కరాల సత్తువ
నవలల వర్షం కురిపించాలని
అవి సినిమాగా తీయించాలని
నవల రచనల కార్ఖానాలను
ప్రారంభిస్తూ
తెగవ్రా(యి)స్తూ
ఆంధ్ర పాఠకుల అలరించే యీ
అశేష రచనా విశేషమందున
సహజత్వానికి
సరళత్వానికి
నవరసాలకూ కథాంశాలకూ
డిమాండు తగ్గే సూచన లేదోయ్
....................
.................... -జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
15.నేను సైతం
తెల్లజుట్టుకు
నల్లరంగును కొనుక్కొచ్చాను
నేను సైతం
నల్లరంగును
తెల్లజుట్టుకి రాసి దువ్వాను.
యింత చేసీ
యింత క్రితమే
తిరుపతయ్యకు జుట్టునిచ్చాను
................... -జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

16.నేను సైతం కులమతాలకు లొంగిపోయి ఓటు వేశాను
నేను సైతం నీతి లేని నాయకులనే ఎన్నుకున్నాను
నేను సైతం పచ్చనోట్ల జిలుగుబిలుగుల కమ్ముడుపోయాను
నేను సైతం దేశమాతకు లెక్కలేని తూట్లుపొడిచాను


శిశిర ఋతువే గ్రీష్మమైనా ధరణీతాపం గుర్తురాలేదే!
మంచుకొండలు కరిగిపోయినా రాతిమనసులో చలనమేలేదే!
లక్షలాది రూకలముందు భూమి విలువే తెలియనేలేదే!
నేను సైతం మానవాళి అంతానికి కారణమయ్యాను

లంచగొండులు డబ్బులడిగితే నాకునేనుగా ఒప్పుకోలేదా?
తక్కినవారిని సైతమీదారిలో వెళ్ళమనినే ప్రోత్సహించలేదా?
దేశవ్యాప్త మహమ్మారి అవినీతికినే కారణంకాదా?
నేను సైతం కోరి నీతిని హత్యచేసిన భ్రష్టుడనయ్యాను

సాటినరులే నేలకూలినా అంతరాత్మకి జాలిలేదసలు
నాకు ముఖ్యం ప్రపంచంలో నేను నా భార్య నా సుతులు
ఎక్కడైనా ఎప్పుడైనా కానరావే మానవుల వెతలు
నేను సైతాన్ జన్మనెత్తి నాకు నేనే శత్రువయ్యాను! -మలక్‌పేట్ రౌడీ


17. ...............
అరే ప్రకాశం
ఒరే గణేశం
ఆకలి లోకం పిలిచింది
పదండి ముందుకు
పదండి తిండికి
పోదాం పోదాం హోటల్‌కి
................ -జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

18.నాగుపాము
కర్రసామూ
పిల్లమోమూ
సిల్లీగా చూడకు దేన్నీ
సిన్మామయమేనోయ్ అన్నీ
................
................
పరిశ్ర మొక చక్రవ్యూహం
ఎక్‌స్ట్రా దొక దిగంబరదేహం
................
................ -విద్యారణ్య కామ్లేకర్

19.పాలసీసా
నేతిడబ్బా
మందు బిళ్ళా
నిఖార్సుగా చూడకు దేన్నీ
కల్తీ మయమేనోయ్ అన్నీ
................
................
కళ్ళూడేదాకా చూడు
కాళ్ళరిగేదాకా తిరుగు
వ్యాపారమొక పద్మవ్యూహం
కల్తీ ఒక తీరని దాహం
..............
.............. -వి.వి.సుబ్బారావు

20.తౌడు బస్తాలు
అరటి గెలలు
ఆవకాయ జాడీలు
కావేవీ రవాణా కనర్హం
అవునౌను లగేజీ ముఖ్యం
.................
................. - గూటూరి

21.ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోవును పేకమేడలై
వేషాలతో మోసాల్ చేసి
సినిమా డైలాగులు చెప్తే
ఓట్లు పడే రోజులు పోయాయ్
సినీ టైపు మాయాజాలం
ఇంకానా, ఇకపై సాగదు
...............
...............
ధనముంటే జరగని పని
భారతమంతా వెదికిన దొరకదు
గతమంతా గడిచే,'ట్రిక్కు'లతో
కాకుంటే వాగ్దానాలతో
.............
............. -జాగర్లపూడి సత్యనారాయణ

22.బూతుని
కామోద్రేకాన్ని
గుప్తాంగ విన్యాసాన్ని నేను
డోలు వాయిస్తే విప్లవం
కాలు జాడిస్తే నర్తనం
వలువ వేదికమీద్ వస్త్ర సన్యాసం
....................
స్తనాలు
విదిలించిన జఘనాలు
వళీ ఆవళులు నా పెట్టుబడులు
నా ఊహ రతీదేవి జోల
కామకేళీ హేల
నా గానం జంబల్ ఊళ
...............
కామాంధులు
మోహావేశులు కామ కేళికి వీక్షకులు
రిరంసువులు నా ప్రేక్షకులు
నేనొక అశుద్ధం
నా దొక దుర్గంధం
అసహ్యం అశ్లీలం నా మార్గం -ప్రసేన్

23.ఇవేమిటీ వింత పరిస్థితులు - పార్టీలో కుమ్ములాట
ఇవేమిటా రణగొణ ధ్వనులు - ఫిరాయింపులు
అవేమిటా గుసగుసలు - పదవీ వ్యామోహం
ఎచటికి పోతావీ రాత్రి - అవతలి పార్టీకి -బి.విజయశేఖర్

24.మరో కంచం మరో లంచం మరో మంచం పిలిచింది
పదండి విందుకు పదండి కాసుకు పోదాంపోదాం పదవుల్లోకి
కాళ్ళు మొక్కుతూ కథల్ చెప్పుతూ పదవి కోసం సిగ్గు విడుస్తూ
ఎత్తులేద్దాం చిత్తుచేద్దాం కనబడలేదా
తరతరాల పదవి పిశాచం -కమలారాం

ఇలా పేరడీలు వ్రాయడం శ్రీశ్రీ కవిత్వానికి గౌరప్రదమైన స్థానాన్ని కల్పించటమే అవుతుంది

మంగళవారం 24 నవంబర్ 2009

ధిక్కార స్వరం!

శ్రీ పంతుల జోగారావుగారి కథానిక ధిక్కార స్వరం కథాజగత్ వెబ్‌సైట్‌లో చదవండి.
ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాము.

ఆదివారం 22 నవంబర్ 2009

బుడ్డా వెంగళరెడ్డి పై సమీక్ష!!!

మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించిన ఎస్.డి.వి అజీజ్ గారి చారిత్రక నవల బుడ్డా వెంగళ రెడ్డి పై 22-11-2009 ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో పాలంకి సత్యనారాయణ గారు సమీక్షించారు.
ఇక్కడ చదవండి.


బ్లాగు ఆర్కైవ్