...

...

26, జులై 2015, ఆదివారం

రాయలసీమ కథారత్న పేటికలు

మొదటితరం రాయలసీమకథలు పుస్తకంపై చెన్నై ఆకాశవాణి బి స్టేషన్లో 25-07-2015 ఉదయం ప్రసారమైన తెలుగు కార్యక్రమంలో సమీక్ష వచ్చింది. సమీక్షించిన వారు ప్రముఖ కథారచయిత శ్రీవిరించిగారు! అదే సమీక్ష 20-07-2015 సోమవారం సూర్య దినపత్రిక అక్షరం పేజీలో ప్రచురింపబడింది. చదివి పుస్తకంపై శ్రీవిరించి గారి అభిప్రాయాన్ని తెలుసుకోండి.

7, జులై 2015, మంగళవారం

పుస్తక సమీక్ష - 33 గోదావరి పుష్కరాలు - మధురానుభూతులు

[పుస్తకం పేరు : గోదావరి పుష్కరాలు - నా అనుభవాలు, రచన: డాιι సప్పా దుర్గాప్రసాద్, పేజీలు: 36, వెల: రూ30/-, ప్రతులకు: నటరాజ నృత్య నికేతన్, దానవాయిపేట, రాజమండ్రి]
“నృత్య ప్రపూర్ణ” డాιι సప్పా దుర్గాప్రసాద్  గోదావరి పుష్కరాలతో తనకున్న అనుబంధాన్ని వివరించిన చిన్ని పుస్తకం ఇది. 1920 నుండి 1956 వరకు వచ్చిన నాలుగు గోదావరి పుష్కరాల గురించి తెలుసుకున్న విశేషాలను, 1967 నుండి 2003 వరకు వచ్చిన నాలుగు గోదావరి పుష్కరాల గురించి తెలిసిన విశేషాలను కళ్ళకు కట్టినట్టు వివరించారు రచయిత.   చివరి రెండు పుష్కరాలలో, అంటే 1991, 2003 సంవత్సరాలలో వచ్చిన గోదావరి పుష్కరాలలో,  దుర్గా ప్రసాద్‌గారు క్రియాశీలక  పాత్రను నిర్వహించారు. పుష్కరాల సాంస్కృతిక సలహా సంఘ సభ్యుడిగా వ్యవహరించారు. "పుష్కర తీర్థం", "భక్త అన్నమయ్య", "ఓంకార గణపతి" మొదలైన నృత్య రూపకాలకు సంగీత, నృత్య దర్శకత్వం వహించి శిష్యులతో కలిసి ప్రదర్శించారు. "ఆంధ్ర నాట్య" ప్రదర్శనలు ఇచ్చారు. "పుష్కర గౌతమి" అనే నృత్య రూపకాన్ని రచించి దూరదర్శన్ కోసం దర్శకత్వం వహించి నిర్మించారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు  కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో "గోదావరి పుష్కర స్వాగత గీతా"నికి నృత్య దర్శకత్వం నెరవేర్చి అందులో నృత్యం చేశారు. వీరి ఈ కార్యక్రమాలన్నీ పుష్కరాల సమయంలో ప్రజామోదాన్ని పొంది విజయవంతమయ్యాయి.  ఈ పుష్కరాల సందర్భంగా వీరికి ప్రభుత్వం నుంచి సన్మాన సత్కారాలు జరిగాయి. ఈ పుష్కరాల వలన శ్రీయుతులు పంతం పద్మనాభం, ఎ.సి.వై.రెడ్డి, రావుల సూర్యనారాయణ మూర్తి, మాడుగుల నాగఫణి శర్మ, రాజీవ్ శర్మ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కె.రాఘవేంద్రరావు, సునీల్ వర్మ,జవహర్ రెడ్డి మొదలైన ప్రముఖ వ్యక్తులతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పుష్కరాలు సప్పా దుర్గాప్రసాద్‌గారి నాట్య కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి దోహదపడ్డాయి. పవిత్రమైన గోదావరీ పుష్కరాల నిర్వహణ అనే చారిత్రక ఘట్టాలలో భాగం వహించడం సప్పా దుర్గా ప్రసాద్ గారి పూర్వజన్మ సుకృతం. ఈ మధురమైన విశేషాలను దుర్గాప్రసాద్‌గారు ఈ చిన్ని పుస్తకంలో నమోదు చేశారు.  
  అంతే కాకుండా   పుష్కరుడంటే ఎవరు? అతని జన్మ వృత్తాంతం ఏమిటి? ఏయే రాశులలో ఏయే నదులకు పుష్కరాలు వస్తాయి? మొదలైన ప్రశ్నలకు ఈ పుస్తకంలో సవివరమైన సమాధానాలు లభిస్తాయి.  ఈ పుస్తకంలో పొందుపరచిన చిత్రపటాలు పాఠకులను అలరిస్తూ ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి.   ఈ ఏడాది జరుగనున్న గోదావరీ పుష్కరాలు కూడా వీరికి విశేషమైన అనుభవాలను,  సశేషమైన తియ్యటి అనుభూతులను మిగులుస్తుందని ఆశిద్దాం.


(సాహితీకిరణం మాసపత్రిక జూలై 2015 సంచికలో ప్రచురితం)

4, జులై 2015, శనివారం

కొలాజ్

పత్రికలలో స్వైరవిహారం చేస్తున్న మొదటి తరం రాయలసీమకథలు