...

...

31, జనవరి 2010, ఆదివారం

తెలుగు కథానికా శతజయంతి ముగింపు ఉత్సవాలు!


గత ఏడాది ఫిబ్రవరి 6,7 తేదీలలో విజయనగరంలో గురజాడ అప్పారావు గారు నివసించిన గృహంలో అట్టహాసంగా ప్రారంభమైన తెలుగు కథానికా శతజయంతి ఉత్సవాలు అన్ని జిల్లాల వారీగానూ, ప్రాంతాలవారీగానూ సదస్సులు,చర్చా వేదికలు నిర్వహించుకుని ఈ రోజు ఆ ఉత్సవాల ముగింపు సమావేశం  హైదరాబాద్ లోని ఆంధ్ర సారస్వత పరిషత్‌లో ఘనంగా జరిగింది. డాక్టర్ వేదగిరి రాంబాబు గారి ఆధ్వర్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటలవరకూ ఈ సమావేశాలు జరిగాయి. ఈ సదస్సుల్లో కథానికకు వందేళ్ళు( 23 జిల్లాల కథానిక తీరుతెన్నుల వ్యాసాల సంపుటం), వియోగి, రాచపూటి రమేష్, ఎ.వి.యంల సంపాదకత్వంలో వచ్చిన మినీ కథా సౌరభం, కొలకలూరి ఇనాక్ దళిత కథానికలు, యర్రంశెట్టి శాయి హాస్య కథానికలు,  పి.వి.ఆర్ శివకుమార్ కథానికలు మొదలైన పుస్తకాలు ఆవిష్కరింప బడ్డాయి. కథానికా పరిణామ వికాసాలు, కథానిక - నూత్న దృక్పథాలు, కథానికా సంపుటాలు, సంకలనాల ప్రచురణ - విక్రయ సమస్యలు,థానిక- భవిష్యద్దర్శనం మొదలైన విషయాలపై కూలంకషంగా చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో సర్వశ్రీ మునిపల్లె రాజు, కొలకలూరి ఇనాక్, పోరంకి దక్షిణామూర్తి, బి.ఎన్.స్వామి, వీరాజీ, విహారి, శిరంశెట్టి కాంతారావు, బి.ఎస్.రాములు, కాలువ మల్లయ్య, రావూరి భరద్వాజ, పోతుకూచి సాంబశివరావు, తుమ్మల రామకృష్ణ, వాసా ప్రభావతి, పెద్దిబొట్ల సుబ్బరామయ్య, పోరంకి దక్షిణామూర్తి, అబ్బూరి చాయాదేవి, ఆడెపు లక్ష్మీపతి, పోలాప్రగడ రాజ్యలక్ష్మి మొదలైన ప్రముఖ కథారచయితలు అనేకమంది హాజరైనారు. ఈ సమావేశాలలో  నా కథాజగత్ విషయం ప్రస్తావింప బడడమే కాకుండా సమావేశాల చివర్లో జరిగిన వందమందికి సత్కారంలో నన్నుకూడా శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.

30, జనవరి 2010, శనివారం

పజిలును పూర్తి చెయ్యండి!

నేను ఇచ్చిన క్రాస్‌వర్డు పజిల్‌ను ఫణి ప్రసన్న కుమార్, జ్యోతి, ఊకదంపుడు గార్లు కలిసి చాలా భాగం పూర్తిచేశారు. ఈ క్రిందివి మాత్రం మిగిలి పోయాయి. వాటిని పూరించాల్సి ఉంది.


అడ్డం: 1,13,15,17,21,24,34,42,67,69.  
నిలువు:1,4,7,9,14,16,18,25,29,35,41,48,55,63,73,83.

ఇంతకు ముందే చెప్పినట్లు ఈ పజిల్‌లోని పదాలన్నీ హ్రస్వాక్షరాలతో ఉన్నవే. దీర్ఘాక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు ఈ పజిల్‌లో లేవు. వారం రోజుల దాకా ఎవరైనా పూరిస్తారేమో వేచి చూద్దాం. లేకపోతే వచ్చే ఆదివారం (ఫిబ్రవరి 7) ఈ పజిల్ సొల్యూషన్ ప్రకటిస్తాను.

29, జనవరి 2010, శుక్రవారం

అంతా మన మంచికే!

యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ద్రౌపది నవలకు సాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించడం పట్ల చెలరేగిన దుమారం మనకందరికీ తెలిసిందే. టీ.వీ చానళ్లలో, పత్రికలలో, బ్లాగుల్లో ఎక్కడ చూసినా ఇది చర్చనీయాంశమైపోయింది. ఈ నవలలో ద్రౌపది పాత్ర చిత్రణలో రచయిత అనౌచిత్యాన్ని ప్రదర్శించాడనీ, కామ ప్రవృత్తి గలిగిన ఓ నీచమైన వ్యక్తిగా ద్రౌపదిని చూపించాడనీ, భారతీయ పౌరుడి మనోభావాలను దెబ్బతీసేదిగా ఈ నవల ఉందనీ, ఈ పురస్కారాన్ని వెనుకకు తీసుకోవలసిందిగా కొందరు డిమాండ్ చేస్తున్నారు. సాహిత్య అకాడెమీని, ఈ నవల ఎంపికలో న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన జూరీ సభ్యులను వీరు దుమ్మెత్తిపోస్తున్నారు కూడా. వీరిలో కొంతమంది దృష్టిలో యార్లగడ్డ లక్ష్మీ ప్రసాదు తుచ్ఛుడైపోయాడు. ఈ విమర్శించే వాళ్ళలో చాలామంది అసలు నవలను చదవలేదని, చదువకుండానే ఆ నవలలో ఏముందో తెలుసుకోకుండానే నానా యాగీ చేస్తున్నారని, రచయిత ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడంలో వీళ్ళు విఫలమయ్యారనీ మరో వర్గం వాదన. 


అయితే ఈ వివాదాన్ని కొంతమంది 'అంతా మన మంచికే' అని అనుకుంటున్నారు. అలా భావించి దాన్ని సొమ్ముచేసుకుంటున్నారు. ఈ వివాదం ద్వారా లభించిన పబ్లిసిటితో పుస్తకం సేల్స్ ఖచ్చితంగా పెరిగి ఉంటాయి. ఇప్పటికే మూడు సార్లు ప్రింటయిన ఈ నవల ఇంకెన్ని రీప్రింట్లు తీసుకుంటుందో వేచి చూడాలి. 


ఇక నవ్య వీక్లీ వారు యార్లగడ్డ తరువాతి నవల సత్యభామను సీరియల్ గా ప్రకటించారు. త్వరలో రాబోయే ఈ నవల ఇంకెన్ని వివాదాలకు స్థానం కల్పిస్తుందో,ఈ సత్యభామలో ఎన్నెన్ని వికారాలను దర్శించాల్సి ఉందో, ఈ సారి ఏ జ్ఞానపీఠానికో మరో దానికో ఈ రచయిత టెండర్ పెట్టబోతున్నాడో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

26, జనవరి 2010, మంగళవారం

పాఠకులారా మిమ్మల్ని క్షమించలేను - నామిని సుబ్రహ్మణ్యం నాయుడు

నిన్న సోమవారం (25 జనవరి 2010) ఆంధ్రజ్యోతి దినపత్రిక సాహిత్యపేజీ వివిధలో నామిని ప్రసంగ వ్యాసం ప్రచురించారు. ప్రతి ఒక్కరూ చదివి తీరాల్సిన వ్యాసమిది. ఈ వ్యాసంలో వీరు చాలా ముఖ్యమైన విషయాలు చెప్పారు. వాటిలో కొన్ని మీకొసం వారి మాటల్లోనే.
"అమర రాజా బ్యాటరీస్ ఎవరైనా ఎందుకు కొంటారు? చీకటి నుంచి వెలుగులోకి వెళ్లడానికి కొంటారు. శాంతా బయోటెక్నిక్స్ వారి షాన్‌వాక్ ఇంజెక్షను డబ్బులు పెట్టి ఎందుకు కొంటారు? హెపటైటిస్ బి బారిన పడకుండా దేహాన్ని కాపాడుకోవడానికి కొంటారు. ఎసుట్లో బియ్యం వేసుకుని మీరంతా అన్నం ఎందుకని వండుకుని తింటారు? రైతుల్ని ఉద్ధరించడానికి కాదు మీరు అన్నం తినేది, మీ దేహానికి పిండిపదార్థాలు కావాలని చెప్పి! ........................................................................................................................................... 
చూసినారా? నా 'ప్రోడక్టు'ను నాకు సహాయం చేయడానికి ఆయన కొనుక్కొంటున్నాడు. అదాయన మంచితనం కావచ్చు కానీ, నాకు అవమానం. అట్లాంటివాళ్లు ఎవ్వరూ నా పుస్తకాలు కొనుక్కోకూడదు. ఇది నా రోషం! కర్నాటక ప్రభుత్వాన్ని కాస్త ఆర్థికంగా ఆదుకున్నట్టు వుంటుందని కాదు మనం మన దేహాలకు మైసూర్ శాండిల్ సబ్బు పూసుకునేది, దుర్వాసనను పోగొట్టుకొనడానికి! ప్రజా సాహిత్యం చదవడం వల్లా మనకూ, మన కుటుంబాలకూ ఎన్నో ప్రయోజనాలున్నాయి."
"బెల్టులకూ, బ్యాడ్జీలకూ, బూట్లకూ, యూనిఫాం డ్రస్సులకూ, పుట్టినరోజు కేకులకే కాదు డబ్బు ఖర్చుపెట్టాల్సింది, ఇట్లాంటి పుస్తకాలకు కూడా అని చెప్తా. ................................................................................................. వాళ్లిద్దరు 'పర్మిషన్' ఇచ్చే ఒక్క పని చేయకపోవడం వల్ల ఎన్ని మంచిపనులు చేయలేకపోయారంటే - పిల్లలు ఇంటికెళ్లి ఒక పుస్తకం గురించి తల్లిదండ్రులతో ముచ్చటించే భాగ్యాన్ని లేకుండా చేసినారు. తల్లిదండ్రులతో ఒక పుస్తకం కొనడానికి, డబ్బు డిమాండ్ చేసే అదృష్టాన్ని లేకుండా చేసినారు."
"నా దగ్గరకి వచ్చేసరికి నా విద్వత్తునూ, నా పుస్తకాన్నీ చూసీ చూడనట్టు చూసి, నా నిరుద్యోగాన్నీ, నా అవస్తల్నీ, నా సైకిల్నీ, నా బీదరికాన్నీ ఎక్కువ భాగం చూసేసి, నాకు సహాయాలు చేసి మంచితనాన్ని చాటుకుంటున్నారు. ................................................................................................... డబ్బుతో సంబంధం లేకుండా ఏ.ఆర్.రహమాన్‌కీ, మాడుగుల నాగఫణిశర్మకీ సన్మానాలు జరిగినట్లే దరిద్రంతో సంబంధం లేకుండా నా బోటి ప్రజా రచయితలకు కూడా సన్మానాలు జరగాలి."
నామిని సుబ్రహ్మణ్యం నాయుడి ఆవేదన మీకు పూర్తిగా తెలియాలంటే ఈ వ్యాసం పూర్తిగా చదవండి.

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు!




వందనము దేశ భక్తుల 
కందించిరి స్వేఛ్ఛ మనకు అంజలొనర్తున్ 
అందరికి శుభాకాంక్షలు 
సుందర గణతంత్ర దినపు సందడి వేళన్

24, జనవరి 2010, ఆదివారం

నుమాయిష్!

70వ అఖిల భారత వస్తుప్రదర్శనశాల ఈరోజు మా సందర్శనచే పావనమయింది. సగటు హైదరాబాదు పౌరుడికి ప్రతి యేటా ఒక సాంప్రదాయంగా, ఒక కట్టుబాటుగా, ఒక తప్పనిసరిగా నిర్వహించవలసిన విధిగా మారిపోయింది ఈ ఎక్జిబిషన్‌ను దర్శించడం. అంతగా ఈ నగరవాసుల జీవితాలతో పెనవేసుకుపోయింది ఈ ఎక్జిబిషన్. నా మటుకు నేను హైదరాబాదులో ఉన్న ఏ సంవత్సరమూ ఈ ఎక్జిబిషన్‌ను మిస్ అయిన దాఖలాలు లేవు. మునుపు ఉన్నంత ఉత్సాహం లేకపోయినా ఈ రోజు కుటుంబ సమేతంగా ఎక్జిబిషన్ అంతా కాళ్ళరిగేలా కలియ తిరిగాను. ఈ ఎక్జిబిషన్ తాలూకు ఫోటోలు కొన్ని మీకోసం.









కనుక్కోండి చూద్దాం!

సీనియర్ కథా రచయిత మునిపల్లె రాజు గారి కథ కస్తూరి తాంబూలం కథాజగత్‌లో ప్రకటించిన విషయం మీకు తెలిసిందే. మీలో చాలామంది ఇప్పటికే ఆ కథను చదివే ఉంటారు. ఆ కథలో రచయిత ఒక చిన్న (చిన్నదే సుమా!) పొరబాటు చేశారు. అదేమిటో మీరు కనిపెట్టగలరా? 


అలాగే ఇంతకు ముందు నేను ఇచ్చిన క్రాస్‌వర్డు పజిల్‌ ను జ్యోతిగారు, ఊకదంపుడుగారు,ఫణి ప్రసన్న కుమార్ కలిసి సగం పూరించారు. మిగిలిన పజిల్‌ను ఎవరైనా పూర్తి చేయగలరా? మీకొక చిన్న హింట్ ఇస్తాను. ఈ పజిల్‌లోని పదాలన్నీ హ్రస్వాక్షరాలతో ఉన్నవే. దీర్ఘాక్షరాలు, గుణింతాలు, ఒత్తులు, సంయుక్తాక్షరాలు ఈ పజిల్‌లో లేవు.

22, జనవరి 2010, శుక్రవారం

వస్తున్నాయొస్తున్నాయి...

రాబోయే రోజుల్లో కథాజగత్‌లో మీరు చదవబోయే కథల వివరాలు.
1.ఇఛ్ఛాపురపు రామచంద్రం - ప్రారబ్ధోత్సవం  √   
2.రాగతి రమ - కారులో షికారు   √   
3.అల్లాడ స్నేహలత - ఆ ఒక్క మాటే!  
4.గుమ్మడి రవీంద్రనాథ్ - ప్రేమంటే...  
5.టి.ఎస్.ఎ.కృష్ణమూర్తి - ఎర్రని ఎరుపు  
6.శారదా అశొకవర్ధన్ - ఈ పిల్లకు పెళ్లవుతుందా?  
7.ఎస్వీ.కృష్ణ - కడలి కెరటం  
8.ఎస్వీ.కృష్ణజయంతి - విందైన వంటకం  
9.అల్లూరి గౌరిలక్ష్మి - స్వయంవరం  
10.శశిశ్రీ - రాతిలో తేమ  
11.బద్ది నాగేశ్వర రావు - ఆంతర్యాలు  
12.గూడూరి సీతారాం - నారిగాని బతుకు  
13.శైలజా మిత్ర - సరికొత్త సూర్యోదయం  
145.బి.వి.ఎన్.స్వామి - పగలు, రాత్రి... ఒక మెలకువ  
15.పంజాల జగన్నాథం - నేను సైతం 
16.కన్నోజు లక్ష్మీకాంతం - పాపం! నారాయణరావు 

17.తిరుమలశ్రీ - ఎలిబీ
18.వరిగొండ కాంతారావు - అంతిమం 
19.అంబికా అనంత్ - కొడిగట్టరాని చిరుదీపాలు 
20. నాగసూరి వేణుగొపాల్ -రిగ్గింగ్ 
మీరు చేయ వలసినదల్లా కొంచెం సమయం వెచ్చించి ఈ కథలన్నీ చదవటమే!

21, జనవరి 2010, గురువారం

కస్తూరి తాంబూలం - ఐదు కారణాలు!!!

మునిపల్లె రాజుగారి కథ కస్తూరి తాంబూలం తెలుగు కథ శతవార్షికోత్సవ ప్రత్యేక కానుక కథాజగత్‌లో ప్రకటింపబడింది. ఈ కథనే కథాజగత్‌లో ప్రకటించేందుకు మునిపల్లె రాజుగారు ఎందుకు ఎంపిక చేసుకొన్నారంటే -  


1.Technical గా perfect short story అని, Range, Depth, Ending కూడా European లాక్షణికుల్ని, content wise - Indian లాక్షణికుల్ని సమృద్ధిగా సంతృప్తి పరచే, శిల్పం, శైలి చక్కగా ఒకే లయలో ఉన్నాయని వడలి మందేశ్వరరావు, చిన వీరభద్రుడు వంటి సాహితీవేత్తలు, శ్రీ విరించి వంటి సద్విమర్శకులు మెచ్చుకొన్నారు కాబట్టి

2.మునిపల్లె రాజుగారిని పాఠకులు Humanist values రచయిత గానే గుర్తుచేసుకొంటారు కాబట్టి

3.Too much of sentimentation లేకుండానే ఆ values ను పోషించిన కథ కాబట్టి

4. సరదా కథల Life చాలా Short కాబట్టి

5. Website దర్శించేవాళ్లు - సాధారణ పాఠకులకన్నా ఒక పై కక్ష్యలో ఉంటారు కాబట్టి  


కథ చదివి రాజుగారితో ఏకీభవిస్తారో, విభేదిస్తారో తెలియజేయండి.

19, జనవరి 2010, మంగళవారం

పజిలును పూరించండి!

నేను క్రాస్వర్డుపజిలు సాల్వుము -2 అనే పేరుతో ఒక టపాలో యిచ్చిన పజిల్‌కు ఇంతవరకూ ఎలాంటి స్పందనా లేదు. బహుశా పొద్దు గడిలో లాగా అక్కడే పూరించే అవకాశం లేకపోవడం ఒక కారణం కావచ్చు. అధిక సంఖ్యలో అడ్డం నిలువు కలిపి మొత్తం 95 ఆధారాలను కనిపెట్టడం మరో కారణం అని నేను భావిస్తున్నాను. అంతా పూరించడం కష్టం అని అనుకుంటే ఎంతవరకు పూరించగలరో అంతే సమాధానలు కౌంటర్ల రూపంలో పంపండి. సరి అయిన సమాధానాలు పజిల్‌లో నింపగలను. ఎక్కువ మంది కలిసి కట్టుగానైనా పూర్తిచేయగలరేమో చూద్దాము. అన్నట్టు ఈ పజిల్‌లో ఉన్న ప్రత్యేకత ఏమిటో కనిపెట్టారా? పజిల్‌ను సాల్వు చేసేకొద్దీ ఆ ప్రత్యేకత ఏమిటో మీకే తెలిసిపోతుంది.

ఆదర్శ కుటుంబం

మంథా భానుమతిగారి కథానిక ఆదర్శ కుటుంబం వర్తమాన కథాకదంబం కథాజగత్ వెబ్సైట్‌లో ప్రకటింపబడింది. ఈ కథను చదివి మీ అమూల్యమైన అభిప్రాయాలను తెలియజేయండి.

అహోబిల యాత్రా విశేషాలు!

ఈ సంక్రాంతి పండుగకు మేము ప్రొద్దుటూరు వెళ్ళాము. అక్కడినుండి 16వ తేదీ అహోబిలంకు వెళ్ళాము. ఆ యాత్ర తాలూకు ఫోటోలు ఇక్కడ చూడండి.




























12, జనవరి 2010, మంగళవారం

సంక్రాంతి కానుక!

తెలుగు కథాభిమానులకు సంక్రాంతి కానుకగా డా.కాకాని చక్రపాణిగారి కథ సంస్కారం కథాజగత్‌లో అందిస్తున్నాము. ఈ కథకు బెండపూడి కనకసుందరరావు స్మారక కథల పోటీలో ప్రథమ బహుమతి వచ్చింది. మరో విశేషమేమంటే ఇదే పోటిలో రెండవ బహుమతి పొందిన కథ చల్లారిన పాలు కూడా కథాజగత్‌లో చదవవచ్చు. ఈ కథను శ్రీమతి ఆచంట హైమవతిగారు వ్రాశారు. ఈ రెండు కథలను చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

9, జనవరి 2010, శనివారం

మీకోసం మరో క్రాస్‌వర్డు పజిల్. ఇంతకు ముందు యిచ్చిన పజిల్‌ను ఎవ్వరూ పూరించలేక పోయారు. ఈ పజిల్ అయినా మిమ్మల్ని ఆకట్టుకుంటుందేమో చూద్దాం. సమాధానాలను వ్యాఖ్యల రూపంలో పంపండి.



 
ఆధారాలు :  
అడ్డం:  
1. ఇందిరా గాంధియేనా?! (3,3) 4. రాజకీయ నాయకుల ప్రవృత్తియేనట! ఔనా?(3) 6. వచనంలో వ్రాసింది కదూ?(3,3) 10. నెల్లూరు దగ్గరలో ఉన్న జలపాతాల 'కొన'!(2) 11. డజను తోక నరికి తిరగేస్తే జంధ్యాల వారి సీతకు అటునుండి రెండుంటాయి. (2) 12. సమగ్రలోనే సమానవత్వమున్నది.(3) 13. ఇతర కళలో పొల్లు.(3) 15. అలవరించుటలో అవేష్టకము.(3) 17. వరవరరావుతో పోటీ పడగలమా? (4) 21. నగవరను సరిచేస్తే ఎఱ్ఱబాఱుతుంది. (4) 23. ఎక్కువ పనిచేస్తే వచ్చేది. (4) 24. ప్రచురణను స్ఫురింపజేసే ప్రియవచనము. (4) 25. సాగదీయకున్నా పరిఖాతమే. (4) 28. భరవ రహిత ఉత్పలమాల. (4) 30. నాగభూషణుడిలో తలను కుదిస్తే భూషణము. (2) 32. హైలో హైలెస్సా హంస కదా నా ___. (3) 33. ప్రాంగణమున నడవచ్చా?(3) 37. పదకొండు అడ్డమే! (2) 39. పసలో పసలేదు కాబట్టి తిరగబడింది. (2) 42. లలజతకూడితే కెరటం. (4) 43. నాగరికత లోని కథ. (2) 45. పది తిరిగితే అదృష్టమే! (2) 47. అవ్వ తల కాదు అటు ప్రక్క. (4)  50. ఒక నక్షత్రం. (2) 53. పూజ చేయించేటప్పుడు పంతులు మనలను అనుకోమనేది. (256. కుడి కాదు. వామము. (3) 57. పార్వతీ దేవి. జగజ్జని కదా! అందులోనే ఉంది. (3) 59. ఈ తాజా కూరగాయలు దురుదదురదలాడుతోంది. (2) 61. లగడపాటి లో దిండు. (4) 65. ఈ సహనం ఉండాలని అందరూ అంటారు. (4) 67. పున్నమి కాదు కదా? (4) 68. తూర్పుకు ఎదురు మరపడవలో వెదుకు. (4)  69. పుష్పవతి (4) 72. తత(తం)గ(గం)లేని శార్దూల విక్రీడితం? (4) 74. భక్తులేకాదు, కాకారాయుళ్లు కూడా దీనిని చేస్తారు. (3) 76. ఎటు చూసినా బంగారమే! (3) 78. ప్రజ! జయప్రకాష్ నారాయణ పార్టీ? (3) 81.డవడి నడి లేక సరిగ్గా ఉంటే అందులో ఈ టిఫెన్ దొరుకుతుంది. (2) 82. గానకోకిల ఈ మంగేష్కర్. (2) 84. కాళీయుడు గిరిధారికి వశమైన వాడా? (4,2) 85. నిద్ర పోయేటందుకు చాలా మందికి ఇది అవసరం. (3) 86. అయ్యప్ప స్వామి. (4,2) 
నిలువు:  
1. వెంకటరమణ చివరలు వదిలి సరిచేస్తే అంగ్లంలో జా వస్తుంది. (4) 2. శృతి వెంట ఈ నటి ఉంటుందా? (2) 3. శీర్షాసనం వేసిన మన్మథ (3) 4. నడవడిక (3) 5. వాకు (3) 7. పెంచగల మేకపోతు (3) 8. యంత్రమును తిప్పితే రాగతి యింటిపేరుగల రచయిత్రి. (2) 9. చులకన కాదు సూక్ష్మము. (4) 12. ఆచూకి, అనుక్రమము (2) 14. ఇరవైలో వై తీస్తే కల్లే కానీ తిరగబడింది. (2) 16. వగలాడి లాడి లాగేయడం పరిపాటి (2) 18. నేర్పరి (3) 19. ఈ చీకట్లో మల్లెతోట వెనకాల కలుసుకొమ్మని ఓ సినిమా పాట. (3) 20. కొండ. కదలనిది కదా? (3) 22. రస్న రుచి తెలుసుకోవడానికి సాగదీయాలి కదా! (3) 25. ఇరవై నిలువు కూతురు. 57 అడ్డమే. (4)26. తనఖాలో ఖా తనఖా పెడితే మిగిలింది. (2)  27. కడ చివర లేదు కాబట్టే చివర (2)  28. సగం మేడ! (2)  29. మలో పరితాపము (2)  31. ల్లా మున పొడి అక్షరాలలో (2)  32. కత్తి మహేష్ బ్లాగు పేరులోని ఆద్యంతాలు. ఒక గేయ విశేషమా? (2)33. సాధ్యం కాలేదు అనటాన్ని తెలంగాణా యాసలో ___ పడలేదు అని అంటారు.(2) 35. మండనము మధ్యలో తిరగబడిన అశ్వగతి విశేషము. (2) 36. అలవోలో కినుక. (3)38.టకట ఆద్యంతాలు లేవు. (2) 40. ఛలో! (2) 41. గాలికుంటు వ్యాధి. (3) 44. తమతమున సతము లేదే? (2) 46. శ్రమలో శాంతం? (2) 48. అడ్డం 47కు వ్యతిరేకమే కానీ కలగాపులగం అయింది.(4) 49. ఎడదలో పరితాపమున్నది. (2) 51. ఘటనలో అదృశ్యమైనది. (2) 52. జప బోల్తా కొట్టింది. (2) 54. మీ, మా కలిస్తే (2) 55. తహతహలాడిన ఒకటే తల్లక్రిందలై కన్యాత్వం చెడిన స్త్రీగా మారింది. (2) 56. ఎడమలో ఆలస్యము. (2) 58. గడబిడలో మాయం బిడ. (2) 60. నవ పథంలో రంథ్రము. (2) 62. లహరి చివర గుడిలేదు. (3) 63. అడ్డం 86లో దాగియున్న అందము. (3) 64. కడ వరకు దుత్తను వెదుకుము. (3) 66. జమలోన పుట్టుక. క్రింద నుండి పైకి. (3) 69. రసనస సరిచేస్తే సమీపం! (4) 70. భస జరిగే చోటు మన శాసన ___. (2) 71. ముష్టి లేని ముదనష్టి. (2) 72. మతలబులో రిలీజియస్. (2) 73. సవద్వయం సూక్ష్మమా? (4) 75. ఈ నెల తోక తెగింది. (3) 76. అడ్డం 85లో వయ్యెస్సార్ జిల్లా. (3) 77. కలకత్తాలోని కంటి వ్యాధి. (379. నిలువు ఇరవైరెండే. కాకుంటే క్రిందనుండి చదవాలి. (3) 80. అవరించిన నరకుట కనబడుతుంది. (2) 83. పడగ. ఫణికి ఉండేది. (2)

5, జనవరి 2010, మంగళవారం

యువర్ అటెన్షన్ ప్లీజ్!

మా సంస్థ ప్రచురించిన ఎస్.డి.వి.అజీజ్ గారి బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవలపై కొల్లూరి సోమశంకర్‌గారి అభిప్రాయం ఇక్కడ చదవండి.