...

...

31, జులై 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 20


ఆధారాలు: 

అడ్డం: 
1. వెనుదిరిగిన కామన్ సెన్స్!
3. ఇది వదిలితే చచ్చినట్టే!
5. విజయనగరంలో జరుపుకునే ప్రసిద్ధి చెందిన ఉత్సవము మన లష్కర్‌లో బోనాలు వంటిదే?
7. పాడ్యమి తరువాత! తదియకు ముందా?
9. విరోధము, భిన్నత, వేరు, మారు.
10. పెత్తనం లాంటిదే కలగాపులగం అయ్యింది.
11. ఎంత వైరాగ్యమైతే మాత్రం ఇలా తిరగేసి రాయాలా?
14. ఎస్.డి.వి. అజీజ్ చారిత్రక నవల! ఈ పుస్తకానికి ఈ బ్లాగరే పబ్లిషర్!
15. lymerick శ్రీశ్రీ చేతిలో ఇలా మారిపోయింది :)
16. అసెంబ్లీ లేదా పార్లమెంటు స్థానం!
నిలువు:
1. పాకిస్థాన్ మాజీ సైనిక నియంత!
2. సకుటుంబ సమేతంగానే !
4. సామాన్యుడు. ఇతడి స్వగతం కస్తూరి మురళీకృష్ణ కెరుక!
5. నేనూ నా వింతలమారి ప్రపంచమూ అంటూ ఒక మహత్తరమైన దృశ్యకావాన్ని అందించిన దళిత కవి?
6. మొదటి అక్షరం ఎగిరిపోయిన కిరోసిన్ దీపము! లాంతరుకు చెల్లెలా? :))
7. ఖైదీలు కోరేది?
8. తలక్రిందలైన ఏ.పి.డైరీ పాలు!
9. స్టైల్ ఆఫ్ యాక్షన్ ఒక్కొక్కరిది ఒక్కో తీరు!
12. ఆలోకనం రచయిత్రిని కథాజగత్‌లో వెదకండి!
13.  అనితర సాధ్యం ఇతని మార్గం!

కవితాభిషేకం! - 26


శ్రీ వక్షోజ కురంగనాభ మెదపైఁ జెన్నొంద విశ్వంభరా
దేవిన్ దత్కమలా సమీపమున బ్రీతి న్నిల్పినాడో యనం
గా వందారు సనందనాది నిజభక్త శ్రేణికిం దోచుఁ రా
జీవాక్షుండు కృతార్థుఁజేయు శుభదృష్టిం కృష్ణరాయాధిపున్.

ఉల్లమునందు నక్కటిక మూనుట మీ కులమందుఁగంటి మం
చల్లన మేలమాడు నచలాత్మజ మాటకు లేఁత నవ్వు సం
ధిల్లఁ గిరీటిఁ బాశుపత్ దివ్య శరాఢ్యునిఁ జేయు శాంబరీ
భిల్లుఁడు కృష్ణరాయల కభీష్ట శుభ ప్రతిపాది గావుతన్.

ఉదయాచలేంద్రంబు మొదలు నెవ్వని కుమా
          రతకు క్రౌంచాచల రాజమయ్యె
నా వాడపతి శకంధర సింధురాధ్యక్షు
          లరిగాఁవు లెవ్వాని ఖరతరాసి
కాపంచగౌడ ధాత్రీపదం బెవ్వాని
          కసి వాఱుగా నేఁగునట్టబయలు
సకల యాచక జనాశాపూర్తి కెవ్వాని
          ఘన భుజాదండంబు కల్ప శాఖి

ప్రబల ’రాజాధిరాజ’ ’వీరప్రతాప’
’రాజపరమేశ’ బిరుద బిభ్రాజి యెవ్వఁ
డట్టి శ్రీకృష్ణదేవరాయాగ్రగణ్యు
డొక్కనాడు కుతూహలం బుప్పతిల్ల

భువన విజయాఖ్య సంస
ద్భవన స్థిత భద్రపీఠిఁ ప్రాజ్ఞుల గోష్ఠిన్
కవితామధురిమ డెందము
దవులన్ గొలువుండి సదయితన్ ననుఁ బల్కెన్.

సప్త సంతానములలోఁ ప్రశస్తి గాంచి
ఖిలముగా కుండునది ధాత్రి కృతియ కాన
కృతి రచింపుము మాకు శిరీష కుసుమ
పేశల సుధామయోక్తులఁ పెద్దనార్య!  

శ్రీఖండ శీతనగ మ
ధ్యాఖండ క్షోణి మండలాఖండల! వి
ద్యాఖేలన భోజ! సుధీ
లేఖద్రుమ! కృష్ణరాయ! లీలామదనా!

శ్రీవేంకటేశ పదప
ద్మావేశిత సదయహృదయ! హరినిటల నట
త్పావక పరిభావి మహః
ప్రావృత నిఖిలాశ! కృష్ణరాయ మహీశా!

హిందూరాజ్య రమాధురంధర! భుజాహిగ్రామణీ కంచుక
త్కుంద స్వచ్ఛయశోగుళుచ్ఛ! యవనక్షోణీధవస్థాపనా
మందీభూత కృపాకటాక్ష! యసకృన్మాద్యత్కళింగాంగనా
బందీగ్రాహ విగాహితోత్తర కుకుబ్దాటీ సమాటీకనా!
        
                                             - అల్లసాని పెద్దన 


30, జులై 2010, శుక్రవారం

కవితాభిషేకం! - 25

శ్రీతిరుమలరాయ! జయ
శ్రీ తరుణీరమణ! సుగుణశీతల! యాకా
శీతలసేతు ధరాతి ధు
రాతత భుజదండ! మూరురాయర గండా!

శ్రీ క్షితి రక్షా దక్షణ
వీక్షా దక్షిణ భుజాగ్ర! వివిధారిపురీ
శిక్షణ ఫాలేక్షణ! శుభ
లక్షణ ధౌరేయ! తిరుమల మహారాయా!

శ్రీ రంగరాయ కలశాం
భోరాశి నిశా సహాయ! భూభువనధురా
ధౌరేయ! వీరగోష్ఠీ 
ధీరాద్భుత సాంపరాయ! తిరుమలరాయా!

శ్రీ సదృశ వెంగళాంబా
భాసుర లాక్షాంఘ్రిశంఖపద్మ శుభాంక్
ప్రాసాద కేళి రసిక! సు
ధీ సన్నుత గుణనికాయ! తిరుమలరాయా!

శ్రీ రామ చరణ వందన
పారీణ యపార రణ్య కృపారీణ, ధను
ర్నారాచ నవ్యదివ్య
ద్వీరాచరితాంక గేయ తిరుమలరాయా!

             - రామరాజ భూషణుడు (భట్టుమూర్తి)  

29, జులై 2010, గురువారం

బహుమతి పొందిన కథా విశ్లేషణలు!!!

తెలుగు బ్లాగర్లకు మేము నిర్వహించిన కథాజగత్ కథావిశ్లేషణ పోటీలో బహుమతి పొందిన విశ్లేషణలు ఇక్కడ చదవండి. కొడిగట్టరాని చిరుదీపాలు - రచన : అంబికా అనంత్ విశ్లేషణ : సి.ఉమాదేవి
కాంతిని ప్రజ్వరిల్లడం దీపలక్షణం.దీపం కొడిగట్టిందా, వెలుగు కాంతి విహీనమై దీపపు ఉనికే ప్రశ్నార్థకమవుతుంది. పిల్లలు తల్లిదండ్రుల కంటి పాపలు,వారింట వెలసిన చిరుదీపాలు. అమ్మా నాన్నల వెన్నెల వెలుగులు ఈ దీపాలు.మరి ఈ దీపాలు కొడిగట్టితే...? పర్యవసానం దారుణంగా ఉంటుంది. ఈ హెచ్చరిక నేపథ్యంగా చెప్పబడిన కథ అంబికా అనంత్ గారి కొడిగట్టరాని చిరుదీపాలు. కథా ప్రారంభంలోనే చెప్పినట్లు పెద్ద కంపెనీ డైరక్టర్ అయిన ఆనంద్,పేరు మోసిన గైనకాలజిస్టుగా డాక్టరు విమల దంపతులు ఆనందానికి చిరునామానే! వారి ఆనందంలో పాలుపంచుకుంటూ, మనవడితో ఆడుకుంటూ తన శేషజీవితాన్ని సంతోషంగా గడిపే ప్రకాశ రావు ఆనంద్ తండ్రి. కూతురి,అల్లుడి పని ఒత్తిడి,తీరికలేని దినచర్య అతడిని నిత్యము బాధిస్తూనే ఉంటుంది. ఇక వారి ఒక్కగానొక్క కొడుకు విజయ్ పదేళ్ల వయసు వాడే కాని ఆధునిక టెక్నాలజీలో తాతకన్నా నాలుగు ఆకులు ఎక్కువే చదివినవాడు. తల్లిదండ్రుల ఒడిలోకాక కంప్యూటర్ ఒడిలో సేదతీరడం నేర్చుకున్నవాడు. సమయాభావంవల్ల తమతో గడపలేని సమయాన్ని కంప్యూటర్ తో గడపమని తాము దగ్గరలేని లోటును అది భర్తీ చేస్తుందని అపోహపడ్డారు ఆనంద్,విమల. కాని మీటలునొక్కే చిన్నారిచేతులు పీకలునొక్కే స్థాయికి చేరగలవని ఊహించలేకపోయారు. కంప్యూటరును తమబిడ్డ ఎలా వినియోగిస్తున్నాడు? అందులో ఏ కార్యక్రమాలను వీక్షిస్తున్నాడు? ఆడే ఆటలేమిటి? స్నేహితుల దగ్గర కాపీ చేసుకునే సి.డిలు ఎలాంటివి? ఇవన్నీ పెద్దలు తెలుసుకోవాలి. పిల్లలు కంప్యూటర్ గూటిలో పొదిగే ఆలోచనలను పసికట్టలేకపోతే జరిగే అనర్థాలకు తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యమే కారణం. అందుకే ఆనంద శిబిరమైన ఇల్లు ప్రకాశరావు ఆకస్మిక మృతితో ఆనంద్,విమల జీవితంలో ఆనందపు పుట చిరిగి పోయింది. ప్రశాంతంగా సాగిపోయే జీవనంలో ప్రకాశరావు మరణం పోలీసులతోసహా అందరు ఆశ్చర్యపోయేలా చేస్తుంది. అతడిది సహజ మరణంకాదు. ఎవరో తలపై గట్టిగా మోదడంతో మరణం సంభవించినట్టుంది అని అందరికీ అర్థమవుతుంది. దొంగతనంకాలేదు. నగలు పోలేదు. అతడి మరణం ఒక మిస్టరీగా మారిపోతుంది. తాతపోయినప్పటినుండి విజయ్ కలత నిద్రే! తాత జ్ఞాపకాలతో కొడుకు బాధపడుతున్నా డనుకుంటుంది విమల. విమల తన సీనియర్ డాక్టర్ వర్మ దగ్గరకు కొడుకును తీసుకుని వెళ్తుంది. అతడు పిడియాట్రిక్ సైకియాట్రిస్ట్ రమేష్ తో కలిసి విజయ్ మానసిక స్థితిని పరీక్షిస్తాడు. పాఠకులలో ఆలోచనలను రేపి బాధ్యతలేని తల్లిదండ్రులు భుజాలు తడిమి చూసుకునేలా కథనమిక్కడ ఉద్వేగభరితంగా వుంది. రచయిత్రి రచనలో కథా పరిణితి పెరిగిన సందర్భమిదే. మనదేశం పూర్తిగా అమెరికాగా మారిపోయిందా అని భయం పొటమరిస్తుంది. కంప్యూటర్ లో చెస్ ఆడవచ్చుకదా అనే సలహా విజయ్ కు పాత చింతకాయ పచ్చడిలా తోచింది. అవన్నీ ఔట్ డేటెడ్ అంటాడు. షాడోవారియర్,బ్లడ్,కార్మెగెడ్డాన్ వంటి క్రూయల్ గేమ్స్ గురించి ఉద్వేగభరితంగా,ఉద్రేకపూరితంగా విజయ్ చెప్తున్నప్పుడు వర్మ అంతా గ్రహిస్తాడు. ఓడిపోతానేమోనన్న భయంతో, తానే గెలిచి తీరాలన్న పట్టుదలతో డాక్టరు రమేష్ గొంతు పట్టుకున్న విజయ్ లాంటి పిల్లలు తయారుకాకూడదు అనుకుంటే కుక్కలున్నాయి జాగ్రత్త అన్నచందాన,క్రూరమైన గేమ్ సి.డిలున్నాయి జాగ్రత్త అని కంప్యూటరుపై బోర్డు పెట్టాల్సివస్తుంది. వీడియో గేమ్స్,కంప్యూటర్ గేమ్స్ ఆడని చిన్నారులు లేరు. చాక్లెట్ల కోసం మారాము చేసే పిల్లలు నేడు గేమ్స్ సి.డిలకై మారాము చేయడం గమనార్హం. పిల్లల కేరింతలు విని మురిసిపోయేవారు ఆ కేరింతలు ఏ కారు క్రిందో మనిషిని తొక్కేస్తున్న సి.డి.గేమ్ తాలూకు వికటానందమేమో చూడండి. బుద్ధిబలానికి,మేధో వికాసానికి కంప్యూటరు వినియోగపడాలే కాని కేకలు,అరుపులు పిల్లల వీరత్వం అని భ్రమసే తల్లిదండ్రులూ బహు పరాక్! వీరత్వమనుకుని క్రూరత్వానికి బానిసలయితే దీపకాంతులతో వెలగవలసిన పసిజీవితాలు మలిగిపోతాయన్న నిజాన్ని ఉరుకులు పరుగుల మీదున్న నేటి పెద్దలు గ్రహించాలి. ఈ నిజాలను తన పదునైన కథనం ద్వారా హెచ్చరించిన అంబికా అనంత్ గారు అభినందనీయులు. మృత్యుభయాన్ని హరించి మృత్యుక్రీడలకు పసిపిల్లలు బలవుతున్నారు. నిప్పుల నృత్యాలు, పుర్రెల విందులు,యాక్సిడెంట్ల విన్యాసాలతో మృగయావినోదం పొందే చిన్నారుల మనసులు కలుషితమై పోతున్నాయి. కరుణ స్థానంలో కార్పణ్యానికి స్థావరమైన వారి ఆలోచనలు వినాశనానికి దారితీయకముందే పెద్దలు జాగ్రత్త పడాలని కాస్త ఘాటు దృశ్యపరంగానే చెప్పారు అంబికా అనంత్ గారు. అమెరికాలో తన సహాధ్యాయులను,టీచరును షూట్ చేసిన ఆన్ డ్రూ గోల్డెన్,మిల్ జాన్సన్ ల ప్రవర్తనకు ఇంచుమించు సరిధాటిగా ప్రవర్తించిన విజయ్ ప్రవర్తనకు ఎవరు బాధ్యులు? గేమ్ లో తన స్కోరును మించిపోతున్న తాత స్కోరును కట్టడి చేయాలంటే తాత జీవిత స్కోరునే నొక్కేసిన విజయ్ లాంటి పిల్లలు సమాజంలో తయారైతే మొత్తం సమాజమే రోగగ్రస్థమవుతుంది అని జాగ్రత్తలు సూచిస్తందీ కథ. శైలి,శిల్పంవంటి విషయాలనుకాక కథకు తీసుకున్న అంశం ముఖ్యపాత్ర పోషించడం ఈ కథను గొప్పకథల జాబితాలోకి చేరుస్తుంది. తెరతీయగరాదా - రచన : కోడూరి శ్రీరామ మూర్తి విశ్లేషణ : చామర్తి మానస గుండె తలుపు తట్టిన తలపులన్నీ మైమరపించే కథలు కాలేవు. మంచి కథలో మంచి భాష ఉండాలి.భావోద్వేగం పండాలి.అంతర్లీనంగా మనసును స్పందింపజేసే కథాంశం , చివరి వరకూ చదివించగలిగిన పట్టూ ఉండాలి.మనకి తెలీకుండానే కథలో ఇమిడిపోయేటంత అద్భుతంగా రచన సాగాలి.ఈ లక్షణాలతో, దాదాపు నలభై ఏళ్ళ క్రితం రాయబడ్డ ఒక కథకు విశ్లేషణే నా ఈ రచన. కొన్ని కథలు సమకాలీన సమస్యలను అతి గొప్పగా చిత్రిస్తాయి. చదివిన రోజున, 'ఆహా..' అనిపించినా , రెండో సారి చదివేటప్పటికే చప్పబడిపోతాయి. మరికొన్ని కథలుంటాయి. అవి ఎల్ల వేళలా ఆలోచనలను రేకెత్తిస్తూనే ఉంటాయి.ఎందుకంటే, అవి మనలో నుండి పుట్టినవి. మనిషిని మనిషిగా చిత్రించేవి. అద్దంలా మారి అక్కడ మనని మనకే చూపిస్తాయవి. మహామహుల ఆలోచనల ఆల్చిప్పల్లో పడి, ఆణిముత్యాలల్లే మారి బయటకు వస్తాయి. కోడూరి శ్రీ రామమూర్తి గారి "తెరతీయగరాదా.." నాకలాంటి ఆణిముత్యమంటి కథలానే తోచింది. వారి రచన ఒక ప్రవాహంలా సాగుతుంటే, ఆ ఒరవడిలో పడి కొట్టుకుపోవడంలో ఎంత సంతోషం..! పాత్రల తాలూకు ఉద్వేగపు కెరటాలు ఉవ్వెత్తున ఎగసి మానస తీరాలను తాకుతున్నప్పుడు చెమ్మగిల్లిన కన్నులతో ఆఖరి వాక్యాన్ని ముగించి నిట్టూర్చడంలోనూ ఎంతటి పారవశ్యం..! స్థూలంగా చెప్పాలంటే, ఇది నాలుగు మనసుల కథ. రచయిత ప్రతి పాత్రలోనూ పరకాయ ప్రవేశం చేసి, వాళ్ళ మనసులోని భావాలని అక్షరాలుగా మార్చి కథ రాసారేమో అన్నంత సహజంగా సాగుతుందీ రచన. బహుశా ఆ శైలే ఈ కథకి నిజమయిన బలమేమో.. ప్రాణమిత్రుడు శేఖర్ ప్రేమ కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నాడని బెంగపడి, అతని ఆ స్థితికి కారణమైన అమ్మాయిని నిలదీయాలని ఆరాటపడే రామనాథ్,పైకి మొండిగా, తల బిరుసు గల అమ్మాయిగా కనిపించినా, తన మనసులో ఏముందో ఎవ్వరికీ తెలియబరచక, తెలియబరచలేక,ఆఖరి వరకూ మనం అర్థం చేసుకోలేని ఆవేదనతో తల్లడిల్లిపోయిన ఇందిర,1970 కాలంలో అప్పుడప్పుడే తొలగిపోతున్న జమీందార్ భోగాలను, వారి సహజ లక్షణాలను, ఆలోచనా విధానాలను జ్ఞప్తికి తెచ్చే శ్రీనివాసుగారి పాత్ర ఈ కథకు మూల స్థంబాల్లాంటివి. కథ విషయానికి వస్తే, ఇందిర పాత్ర మన మనసుల్ని కుదిపేస్తుంది. రామనాథ్ పాత్ర ద్వారా మనం ఉహించుకున్న ఇందిర, కథ ముగిసే వేళకి, ఆయనకి రాసిన ఉత్తరంతో ఆవిష్కృతమయిన అంతరగంతో కొత్తగా కనపడి, ఆలోచనలను మెలి తిప్పుతుంది. ఆ కాలం జమీందార్లకు స్వతహాగా ఉండే కళాపోషణను, వారి సాహిత్యాభిలాషను శ్రీనివాసరావుగారి పాత్ర ద్వారా కథలో స్పష్టపరచిన తీరు అమోఘం.ముఖ్యంగా త్యాగరాజ కీర్తనలను ప్రస్తావిస్తూ .."'ఖగరాజు నీయానతి విని వేగ చనలేదో - గగనంబు కిలకూ బహుదూరం బనినాడో -' అన్న పాదాన్ని ఉదహరించడం, దానికొక వినూత్నమైన విశ్లేషణను జోడించడం ఎందరో సంగీత ప్రియులకు ఆనందాన్ని పంచడంలో అబ్బురమేముంది..? రచయితలోని కవి హృదయానికి ఇదొక మచ్చు తునక మాత్రమే సుమా..! ఆధునిక భావాలున్న మనిషిని కనుక ఇందిర శ్రీనివాసరావు గారి దగ్గర కొరడా దెబ్బలు తినడం వంటి వాక్యాలను సహించలేకపోయిన మాట వాస్తవం. సమస్యలను ఎదుర్కొనగలిగిన సమర్ధత లేని వ్యక్తులు, తమలోని బలహీనతలను జయించే ప్రయత్నం చేయక, అనుసరణీయం కాని ఒక మార్గాన్ని ఎంచుకుని తప్పించుకోవాలనుకోవడం ఎంత వరకు సబబు అన్న సందేహం, నన్ను ఆఖర్లో కాస్త కలవర పెట్టింది.ఆమె చదువుకున్న అమ్మాయి కనుక, శిధిలమయిపోతున్న గోడలను దాటి బయటకు వచ్చి కుటుంబాన్ని తీర్చిదిద్దుకోగల సమర్ధతను ఆ పాత్ర నుండి ఆశించినా, ఎదురు తిరగక అణిగి ఉండటాన్ని అంగీకరించలేకపోయినా, నా ఈ ఆలోచనలనన్నింటినీ సమాధాన పరచగల రసవత్తరమయిన కథనమేదో నా నోరు నొక్కేసింది. నిజానికి రెండోసారి చదివినప్పుడు, ఇందిర పాత్రలోని ఆ నిస్సహాయతా, నిజాయితీలే కథకి అందమేమో అనిపించిన విషయాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించకుండా ఉండలేకపోతున్నాను. "మత్సరమే కాదు మనిషి గుండెల్లో గూడుకట్టుకున్న తెరలు మరెన్నో ఉన్నాయి. మనిషి ఆ తెరని తీయనూ లేడు. వాటి సంగతి మరచి ప్రశాంతంగా వుండనూ లేడు " అన్న నిష్టుర సత్యాన్ని నిండైన కథగా మలచి, "..ధర్మాది మోక్షముల పారద్రోలుచున్న నాలోని మత్సరమను తెరతీయగరాదా..." అన్న త్యాగరాజ కీర్తనను ఆధారంగా చేసుకుని శీర్షికను ఎంచుకోవడం , దాని ప్రస్తావనతోనే కథను ముగించడం సముచితం. ప్రతి కథకీ ముగింపే కీలకమైనదన్న విషయం మనందరికీ తెలిసిందే.ఆఖరికి మంచి గెలిస్తే మంచి కథనేస్తాం చప్పున. అదే చెడు గెలిస్తే, నమ్మలేనిదేదో జరిగినందుకు నిర్లిప్తంగా పుస్తకాన్ని మూసేస్తాం. ఆంగ్లంలో ఒక చక్కటి వాక్యం ఉంటుంది.. " Man will believe only what he wants to believe.." అని. అది అక్షర సత్యం.అయితే, కథల్లో, ఇలా మంచీ చెడూ అని నిర్ణయించ వీలు కాకుండా ముగిసేవి కొన్ని ఉంటాయి. మరపు రాని కథల్లో వాటికంటూ ఒక చోటు వెదుక్కునే ముందు, పాఠకుల మస్తిష్కాల్లో తిష్ఠ వేసుకుంటాయి. "తెరతీయగరాదా.." ఈ మూడో కోవకే చెందుతుందో లేదో తెలియాలంటే,ఇందిర జీవితాన్ని చదివి ఆమె నిర్ణయం తప్పో-ఒప్పో నిర్దారించాలంటే, కథాజగత్ లోకి అడుగిడి ఈ కింద ఇవ్వబడిన 1969 నాటి అరుదైన కథను చదవడమొక్కటే మార్గం. రంగు తోలు - రచన : నిడదవోలు మాలతి విశ్లేషణ : శ్రీలలిత ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే మనుషులందరూ భిన్న జాతులకు చెందిన వారయినా అందరిలోనూ ప్రవహించేది ఎర్రని రక్తమే అని భిన్నత్వం లో ఏకత్వం చూపించడం. ప్రాణి భూమ్మీద పడగానే ఆడా మగా నిర్ధారించుకున్నాక వెంటనే తలయెత్తే ప్రశ్న తెలుపా నలుపా అని చెప్పుకోడంలో తప్పు లేదేమో. ఒకే యింట్లో వున్న తోబుట్టువుల మధ్య కూడా ఈ భేద భావం కనిపిస్తుంది. మరీ కొందరిళ్ళల్లో అయితే అన్నదమ్ముల పిల్లల మధ్య తేడాలు చెప్పడానికి తెల్లసూర్యం నల్ల సూర్యం అని అనడం కూడా మామూలే. ఒకింటి వాళ్ళు, ఒక ప్రాంతంవాళ్ళ మధ్యలోనే ఇటువంటి అనుభవాలున్ననీలవేణి మరి పాశ్చాత్యదేశాల్లో నివసించాల్సి వచ్చినప్పుడు జరిగిన అనుభవాల సారమే ఈ కథ. మనిషి సంఘజీవి. ఒక్కడూ వుండలేడు. నలుగురితో కలిసి మెలిసి వుండాలనుకుంటాడు. ఆ కలవడం కూడా తనవాడయితే బాగుంటుందని సహజంగానే అనిపిస్తుంది. ఒక అపరిచిత వ్యక్తి మనకి ఎదురయితే ముందు మనం అతని భౌతిక స్వరూపాన్ని చూస్తాం. నలుపా--తెలుపా, పొడుగా--పొట్టా, లావా--సన్నమా, పెద్దా--చిన్నా, ఇలాగ. వెంటనే మనకి తెలీకుండానే మన మనసులోఒక అభిప్రాయం యేర్పడిపోతుంది. కాని అన్నింటికన్నా మనం ముందు గుర్తించేది ఒంటి రంగు. పుట్టు ఛాయా, పెట్టు ఛాయా అని పైపైన ఎన్ని పూతలు పూసుకున్నా అసలు ఒంటి రంగు పట్టినట్టు తెలుస్తుంది. అలా గుర్తించినప్పుడు దానికి సంబంధించిన పరిణామాలూ అలాగే వుంటాయి. అవి మనవాడే కలుపుకుందాం అన్న భావనా అయివుండవచ్చు లేకపోతే మనవాడు కాదనే భేదభావం కానీ, లేదా ఒక్కొక్కసారి వివక్ష కానీ అయివుండవచ్చు. మూడేళ్ళపాప ఒక్కత్తీ రోడ్డు మీద తల్లి కోసం ఏడుస్తూ వుంటే, ఆ పిల్ల ఒంటి రంగు చూసి దూరం నుంచే సానుభూతి వాక్యాలు పలుకుతూ, నీలవేణిది కూడా ఆ పిల్ల లాగే తెల్లతోలు కాదని గుర్తించి, మీ పిల్లని చూసుకోవాలి కదా అన్నప్పుడు కలిగిన ఆశ్చర్యం కన్న-- అంత చిన్న పిల్ల కూడా కేవలం నీలవేణి ఒంటి రంగు చూసి తన జాతే ననుకుంటూ వచ్చి కాళ్ళకు చుట్టుకు పోవడం ఆమెకు మరింత ఆశ్చర్యం కలిగిస్తుంది. తర్వాత నీలవేణిని రోడ్డు మీద అటకాయించి కొందరు వ్యక్తులు ఆమె బేగ్ లాక్కుంటున్నప్పుడు ఒక నల్లతోలు మనిషి ఆమె కోసం వాళ్ళతో దెబ్బలాడి గాయాల పాలవడంతో, పోలీసులూ, వైద్య సదుపాయం రావడంతో, కథ ముగిసినా ఆ సమయం లో నీలవేణి మనోభావాలు రచయిత్రి బాగా వివరించారు. మనుషులు భౌతికంగా కనపడడానికి రకరకాల రంగుల్లో వున్నా ఆ మనుషులందరికీ లోపల రక్తం రంగు మటుకు ఒక్కటే కదా.. అదే ఎరుపు అంటూ మనుషులందరిలోనూ వున్న ఏకత్వాన్ని ఎత్తి చూపించడం ముగింపుకి అందమిచ్చింది.

కవితాభిషేకం! - 24చం. మెలికలుదీఱి నిట్టనగు మీసము సౌరు, గభీరముద్రతో
     నలరు మొగంబు, జానువులునంటెడు బాహులు, వామభాగమం
     దొలయు సుధీర్ఘ ఖడ్గము, మహోన్నత వక్షము గల్గు కృష్ణరా
     యల శుభమూర్తి మా కనుల కబ్బెడుగా తలంచు మాత్రలోన్.

చం. అలఘపరాక్రమంబు, కరుణాంచితదృష్టి, అఖండపాండితీ
     కలిత కవిత్వ వైభవము, కావ్యరమావరణంబు, నిత్య ని
     స్తుల సుకవి ప్రకాండ పరితోషణముల్ గల్ కృష్ణదేవరా
     యలను స్మరింపనేర్చుటే కృతార్థత యాంధ్ర కవీంద్రకోటికిన్.

                                                  -కప్పగల్లు సంజీవమూర్తి. 

28, జులై 2010, బుధవారం

అతిథి సత్'కారం'

ఎమ్బీయస్ ప్రసాద్ గారి కథ అతిథి సత్'కారం' కథాజగత్ లో ప్రకటించాము. చదివి మీ అభిప్రాయాన్ని తెలియపరచండి.

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 19 సమాధానాలు!


అడ్డం: 
1. మురిసే మేఘాలూ, కురిసే రాగాలూ ________ _____ నా గుండెలోనా నీ చూపులే జల్లుగా.... బుల్లెమ్మ బుల్లోడు సినిమాలోని వాన పాట!   - కురిసింది వానా
3. తొలి పొద్దులో కనిపించే మంచు బిందువు.  - నీహారిక
5. హెలికాప్టర్లు!  - లోహవిహంగములు
7. నెల నడిమి వెన్నెల హాయి కనబడదు ____ రేయి జిక్కి పాట జయసింహలో! - అమాస
9. శ్రీశ్రీ పూరించమన్నది. పదబంధప్రహేళిక కాదు :-)  - పర్జన్య శంఖం (గర్జించు రష్యా! గాండ్రించు రష్యా! పర్జన్యశంఖం పూరించు రష్యా! - శ్రీశ్రీ)
10. ఆత్మస్తుతి చేసుకోవడానికి ఒక జాతీయం. - డప్పు వాయించు
11. బీరాలు, ప్రగల్భాలు! - డంబాలు
14. నలకూబరుడు! - కుబేర తనయుడు
15. ముదితల సింగారంలో మూర్ఖత్వమున్నదా? - ముదిగారం
16. కఠినముగా అనిపించే మేక! - ముఖవిలుంఠిక
నిలువు:
1. సుధాముడు. శ్రీకృష్ణుని అత్యంత ప్రియమైన స్నేహితుడు! - కుచేలుడు
2. హిందీలో మనం. ముందు నానాపాటేకర్ ముందు. చివర వాస్కోడిగామా చివర. వెరసి పలు ఆర్భాటములు! - నానా హంగామా
4. కలవరపెట్టు - కలత పరచు
5. స్వరాజ్యము నా జన్మహక్కు అని చాటినది. - లోకమాన్య తిలకు
6. యమధర్మరాజు. -  లులాయ వాహనుడు (లులాయము = దున్నపోతు) 
7. నరకబడనిది! - అఖండం
8. వదులు. - సడలు
9. హరి త్రపము చేక్లోరోఫిల్ పొందెనా? - పత్రహరితము
12. లేత ఎండ! - బాలాతపము
13. కార్యాచరణకు ఇది అవసరమా? - ప్రణాళిక
ఈ పజిల్‌ను పూరించడానికి ప్రయత్నించిన చదువరి, భమిడిపాటి సూర్యలక్ష్మి, ప్రసీద గార్లకు అభినందనలు!

కవితాభిషేకం! - 23


గీ. సర్వవిధముల సన్మార్గ సరణిమించి
    ప్రజల సన్మాన సాదర ప్రౌడిగాంచి
    చిరతరంబగు వైభవ శ్రీల బెంచి
    ధర్మ వేదాంత సాహిత్య తత్వ మంచి
    తముగ బోధించి, రాణించు ధరణినాథు
    కృష్ణరాయలఁ బ్రణుతించి కీర్తి నెంతు.

                           - యస్. యన్. రామస్వామి  

27, జులై 2010, మంగళవారం

కథాజగత్ కథావిశ్లేషణ పోటీ ఫలితాలు!


ఇంతవరకూ ఎంతో ఉత్కంఠతతో ఎదురు చూస్తున్న పోటీ ఫలితాలు వెలువడ్డాయి. ఈ పోటీకి ముందు ముగ్గురు నిష్ణాతులైన న్యాయనిర్ణేతలను పెడదామనుకొన్నాము. అయితే పోటీకి వచ్చిన ఎంట్రీలు కేవలం 17 మాత్రమే కావడంతో ఒక్కరు మాత్రం న్యాయనిర్ణేతగా ఉంటే చాలనుకున్నాము. మా అభ్యర్థనను మన్నించి న్యాయనిర్ణేతగా ఉండటానికి అంగీకరించిన డా.దేవరాజు మహారాజుగారికి మా కృతజ్ఞతలు. వారు ఎంతో బిజీగా ఉండికూడా ఈ పోటీ తీర్పును వెలువరించడంలో సమయాన్ని వెచ్చించినందుకు వారికి మా ధన్యవాదాలు. ఇక ఈ పోటీ ఫలితాలు డా.దేవరాజు గారి మాటల్లోనే...  

తీర్పు 
  
తెలుగు కథానికా శతజయంతి సందర్భంగా 'తురుపుముక్క' నిర్వాహకులు కథాజగత్‌లో వంద కథలు ప్రకటించారు. ఆ వంద కథల మీద సమీక్షావ్యాసాల పోటీ నిర్వహించారు. నియమ నిబంధనలకు అనుగుణంగా నిలిచిన సమీక్షల్ని మాత్రమే నిర్వాహకులు స్వీకరించి, రెండు దశలుగా వడబోసి, చివరగా నాకు పదిహేడు సమీక్షా వ్యాసాలు, ఆయా కథల ప్రతులు అందించారు. 
ఇక నేను చేసిన పని ఏమిటంటే...ముందుగా సమీక్షావ్యాసాలన్నీ చదివాను. ఆ సమీక్షలు కలిగించిన ఉత్సుకత ఆదారంగా ఆయా కథల్ని కూడా చదివాను.
కథలోని భావాన్ని, స్ఫూర్తిని, మానవీయ విలువల్ని, అంతర్జాతీయ అవగాహనని, ప్రాంతీయ ప్రత్యేకతల్ని అంది పుచ్చుకుని, రాసిన సమీక్షా వ్యాసాల్ని వేరు చేశాను. అప్పుడు ఎనిమిది వ్యాసాలు మిగిలాయి. 
స్వోత్కర్ష లేకుండా, కథా రచయితలమీద పిచ్చి అభిమానం ప్రకటించకుండా కేవలం విషయ ప్రధానంగా, లోతైన విశ్లేషణతో, తమదైన శైలిని, మంచి భాషని నిలుపుకున్న సమీక్షా వ్యాసాలు వేరు చేశాను.  
చివరగా - నేటి తరం పాఠకులకు అనువైన విధంగా స్నేహ పుర్వకంగా హెచ్చరిస్తూ, అత్యవసరంగా జాగ్రత్త వహించాల్సిన అంశాలను సమీక్షకులు ఎంత బలంగా ఎత్తి చూపారు అనే విషయమ్మీద దృష్టి కేంద్రీకరించి ఎన్నుకున్న వ్యాసాలను ఒక వరుస క్రమంలో పెట్టాను. అవి ఈ విధంగా వచ్చాయి. 
మొదటి స్థానం: సి. ఉమాదేవి - కొడిగట్టరాని చిరుదీపాలు: అంబికా అనంత్ కథ. 
రెండవస్థానం: చామర్తి మానస - తెరతీయగ రాదా: కోడూరి శ్రీరామమూర్తి కథ 
మూడవస్థానం: శ్రీలలిత - రంగుతోలు : నిడదవోలు మాలతి 
విజేతలకు అభినందనలు!  
ఎక్కువమంది మహిళలే బ్లాగులు నిర్వహిస్తున్న విషయం కూడా ఈ పోటీ వల్ల తేటతెల్లమయింది. 
- డాక్టర్ దేవరాజు మహారాజు
కవి, రచయిత, ప్రొఫెసర్ 
న్యాయ నిర్ణేత 
పోటీలో మొదటి బహుమతి(2116/-) పొందిన సి.ఉమాదేవి, రెండవ బహుమతి(1116/-) గెలిచిన చామర్తి మానస, మూడవ బహుమతి (516/-)నందుకొంటున్న శ్రీలలిత గారలకు తురుపుముక్క శుభాభినందనలు తెలియ జేస్తున్నది. వారు వెంటనే తమ వివరాలను (ఎవరి పేరు మీద చెక్ పంపాలి, చిరునామా, ఫోన్ నెంబరు, ఇ మెయిల్ అడ్రసు వగైరా) mmkodihalli@gmail.comకు పంపవలసినదిగా కోరుతున్నాము. విజేతలకు బహుమతులను స్పాన్సర్ చేసినవారు
క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 19


ఆధారాలు: 

అడ్డం: 
1. మురిసే మేఘాలూ, కురిసే రాగాలూ ________ _____ నా గుండెలోనా నీ చూపులే జల్లుగా.... బుల్లెమ్మ బుల్లోడు సినిమాలోని వాన పాట!
3. తొలి పొద్దులో కనిపించే మంచు బిందువు.
5. హెలికాప్టర్లు!
7. నెల నడిమి వెన్నెల హాయి కనబడదు ____ రేయి జిక్కి పాట జయసింహలో!
9. శ్రీశ్రీ పూరించమన్నది. పదబంధప్రహేళిక కాదు :-)
10. ఆత్మస్తుతి చేసుకోవడానికి ఒక జాతీయం.
11. బీరాలు, ప్రగల్భాలు!
14. నలకూబరుడు!
15. ముదితల సింగారంలో మూర్ఖత్వమున్నదా?
16. కఠినముగా అనిపించే మేక!
నిలువు:
1. సుధాముడు. శ్రీకృష్ణుని అత్యంత ప్రియమైన స్నేహితుడు!
2. హిందీలో మనం. ముందు నానాపాటేకర్ ముందు. చివర వాస్కోడిగామా చివర. వెరసి పలు ఆర్భాటములు!
4. కలవరపెట్టు
5. స్వరాజ్యము నా జన్మహక్కు అని చాటినది.
6. యమధర్మరాజు.  
7. నరకబడనిది!
8. వదులు.
9. హరి త్రపము చేత క్లోరోఫిల్ పొందెనా? 
12. లేత ఎండ!
13. కార్యాచరణకు ఇది అవసరమా?

కవితాభిషేకం! - 22


సీ. కవికోటి బోషించి గ్రంథముల్ వ్రాయించి
              ’యాంధ్ర భోజుండ’ని ఖ్యాతి బెంచె,
    రాజుల నోడించి ’రాజాధిరాజ మ
              హరాజ’ బిరుద విఖ్యాతి గాంచె,
    గజపతీంద్రుల రణాంగణమందణచి ’మూరు
              రాయల గండ’డన్ ప్రణుత నించె
    విశ్వంబు వెఱగొంద ’వీరప్రతాప మా
              ర్తాండ’ సత్కీర్తి నొందంగ మించె,

గీ. రాజకీయ కార్యముల, సారస్వతమున
    దక్షిణాపథమేలిన ధరణి పతుల
    నింత రాజింక లేడను నంతవాడు
    కృష్ణరాయల బోలు భూమీశుడున్నె.

                        - దుర్భాక రాజశేఖర శతావధాని.


26, జులై 2010, సోమవారం

కవితాభిషేకం! - 21సీ. ఎదురైనచోఁ దన మదకరీంద్రము నిల్పి
                  కేలూత యొసగి యెక్కించుకొనియె,
    తన పేర కృతులందుకొనువేళ పురమేగ
                  పల్లకీల్దమ కేలఁబట్టి యెత్తె,
    అడిగిన సీమలయందగ్రహారంబు
                  అరుదైన పసిడి పెళ్లెరము లిచ్చె,
    బిరుద నామంబుల బిలిచి సన్మానించె 
                  గండపెండేరంబు కాల దొడిగె,

    ఇట్టి కృతికర్త, కృతి భర్త యింతకు మును
    పుట్టి యుండడు, ఇప్పుడు పుట్టలేదు
    పుట్టబోఁడింక మీదట గట్టి మాట
    యెట్టి యాక్షేపణలు నుండదిది సవాలు.

                         - జోస్యము జనార్ధనశాస్త్రి 

25, జులై 2010, ఆదివారం

కవితాభిషేకం! - 20
సీ. శ్రీల బెంపొంద దక్షిణ హిందు సామ్రాజ్య
                   మేలె నెవ్వాడు మహిష్ట శక్తి,
    దేశభాషలయందు దెనుగు లెస్సనెడు నా
                   నుడి బేర్మి నెవ్వడను గ్రహించె,
    అష్టదిగ్గజములన్ యశన్య్ గాంచిన పెద్ద
                   నాదుల నెవడెంతొ యాదరించె,
    ఆముక్త మాల్యదాఖ్య గంథ రచన బ్ర
                   బంధ మార్గము గానబఱచె నెవడు.

గీ. మూరురాయర గండాంక వీరుడాంధ్ర
    భోజ నరపతి సత్కవి రాజనంగ
    బిరుదములు బొందె నెవడట్టి సరస హృదయు
    డలరె’శ్రీకృష్ణ దేవరాయాధి’ పుండు.

                   - రావూరు దొరస్వామిశర్మ 


24, జులై 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 18 సమాధానాలు!

కవితాభిషేకం! - 19శా. వీర శ్రీ నరసింహశౌరి పిదప న్విశ్వంభరా మండలీ
    ధౌరంధర్యమునన్ జగంబు ముదమంద 'న్నాగమాంబా' సుతుం
    డారూఢోన్నతి 'కృష్ణరాయడు' విభుండై రత్న సింహాసనం
    బారో హించె, విరోధులు న్గహన శైలా రోహముంజేయగన్ .సీ. ఉదయాద్రి వేగయత్యుద్ధతి సాధించె
              వినుకొండ మాటమాత్రనహరించెఁ
    గూటము ల్సెదరంగఁ కొండవీడ గలించె
              బెల్లముకొండ యచ్చెల్ల జెఱిచె
    దేవరకొండ యద్వృత్తి భంగముసేసె
              జల్లిపల్లె సమగ్రశక్తిఁ దులిచె
    గినుకమీఱ ననంతగిరి క్రిందుపడఁజేసె
               గంబంబు మెట్టు గ్రక్కునఁ గదల్చె

తే. బలనికాయము కాలిమట్టులనె యడఁచుఁ
    గటకమును నింక ననుచు నుత్కలమహీశుఁ
    డనుదినమ్మును వెఱచు నెవ్వనికి నతఁడు
    రాజమాత్రుండె శ్రీకృష్ణరాయ విభుఁడు

సీ. చక్రవర్తి మహాప్రశస్తి నాడును నేడు
            చెలగి ధర్మ క్రమ స్థితి ఘటించె
    భూభృద్ధరణ విస్ఫూర్తి నాడును నేడు
            గోరక్షణ ఖ్యాతిఁ గుదురు పఱిచె
    సాధు బృందావన సరణి నాడును నేడు
            వంశానురాగంబు వదలడయ్యె
    సత్యభామా భోగసక్తి నాడును నేడు
            నా కల్ప మవని నింపార నిలిపె

తే. నాడు నేడును యాదవాన్వయము నందు 
    జననమందెను వసుదేవ మనుజ విభుని
    కృష్ణుడను పేర సరసేంద్రు కృష్ణదేవ
    రాయడను పేర నాది నారాయణుండు
కం. ప్రతివర్ష వసంతోత్సవ
     కుతుకాగత సుకవి నికర గుంభిత కావ్య
     స్మృతి రోమాంచ విశంకిత
     చతురాంతఃపుర వధూప్రసాదన రసికా!

కం. తిరుమల దేవీ వల్లభ
     కరుణామయ హృదయ! రాజకంఠీరవ! యీ
     శ్వర నరస భూపురంధర
     వరనందన; బాసదప్పవర గండాంకా!

                                       -నంది తిమ్మన 

23, జులై 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 18ఆధారాలు: 

అడ్డం: 
1. ఇటీవల వెలువడిన గోరటి వెంకన్న పాటల పుస్తకం! 
3. భారతీయ క్రికెట్‌లో మేటి మన హైదరాబాద్ క్రీడాకారుడు. ముందు తరం వాడు.
5. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సమాధి ఉన్నది?
7. పాలవాడు కలిపే నీళ్లలో ఆనవాయితి!
9.మగవాడైన తొలి మానవుడు ఆడం _____ నుంచి హవ్వ(తొలి మహిళ) జన్మించినట్లు పుక్కిటి పురాణం!
10. ఇతడైనా తినాల్సింది లవణమన్నమే! ఐతే 3,4 అక్షరాలు తారుమారు.
11.  గుబులులో గుబులు!
14.  మన రాష్ట్రంలో ఎప్పుడూ ఉండేవి కదా? టఫ్ సిచ్యువేషన్స్!
15.  జొన్నలగడ్డ దంపతుల కలం పేరు?
16. నాయుడోళ్ళింటి కాడ __ __ __ కింద నాయుడేమన్నాడే పిల్లా.
నిలువు:
1.  పెద్దన యింటిపేరు కాసాని కాదు. మేడసాని అసలే కాదు :-)
2.  లచ్చికోడలి మగడు!
4.  నక్సలైట్లచే బలికాబడిన మాజీ మంత్రి!
5.  ఆంగ్ల సచిత్రవార పత్రిక.
6. loco కోపము కారము కలగలసిన జగత్ కళ్యాణములు!  
7.  దివాకర్‌బాబును ఆరా తీయండి.
8.  ఎ.పి.జె.అబ్దుల్ కలాం కనమన్నది బిడ్డల్ని కాదు.
9.  ఏయ్ బావయ్యా పిలక బావయ్యా అంటూ సినారె ఆటపట్టించింది ఇతడినే! 
12. తెలిసిన  
13. గారడి వాడు ప్రదర్శించేది?

కవితాభిషేకం! - 18

సీ||   ఆరొక్క రాగాల ఆలాపనల్ రాతి
                 కంబాలఁ జెక్కిన ఖ్యాత నగరి
       ఏడొక్క దిగ్గజా లేడాది పొడగున
                భువన విజయమేగు భూష నగరి 
       మూరు రాయరగండ మూర్ధన్య రత్నమౌ
                వికటఁపు వీథుల విశ్రుత పురి
       ఏడు ప్రాకారము లేర్పడఁ గట్టిన
                ప్రాంచద్భవనముల ప్రాకట పురి 


ఆ.వె||  ఎలమి మాధవుడిల యేర్పడఁ జూపిన,
         శశకములల చెలఁగి సారమేయ
         ములనుఁ దరిమి కొట్టు నేలఁ వెలసినట్టి
         అలఁరు కృష్ణరాయు హంపి నగరి.ఉ||    కాసుల పేరులెన్నిటినొ - గాదిలిఁ గూర్చియు శ్రీనివాసుకున్,
        దోసిలి నొగ్గి నో సుమవ - ధూటిని విష్ణువు కిచ్చినాడవో,
        భాసురమొప్ప హంపినల - ప్రాణములిచ్చితో రాలకున్, ధరా
        భాసిత భూవరా! జ్వలిత - భాస్కర శోభిత కీర్తి నీదయా!

చం||   స్తుతమతి యైన ఆంధ్రకవి - ధూర్జటి పల్కుల కేలగల్గెనో
        అతులిత మాధురీ మహిమ! - హంపి విరాజిత, రాజరాజుకున్
        ప్రతిపదమైనయట్టి మహ - రాజగు శ్రీనిధి కృష్ణరాయనిన్
        అతిశయ ప్రాపువంబొ?కవి - హంసల తోడగు కావ్యగోష్టులో?


                                                       రవి