...

...

29, అక్టోబర్ 2012, సోమవారం

కొడిగట్టరాని చిరుదీపాలపై శైలజామిత్ర విశ్లేషణ!


ఒకప్పుడు కుటుంబం ఆంటే అమ్మ నాన్న, పిల్లలు, వీలయితే నానమ్మ, తాతయ్య వారందరితో పాటు కనీసం నలుగురు లేదా కనీసం అయిదు మంది పిల్లలతో  అందరూ కలిసి ఉండేవారు. . నేడు ఎవరికీ వారే యమునా తీరే అన్న చందంగా అమ్మ నాన్న  ఒకరో లేక ఇద్దరో పిల్లలతో జీవిస్తూ, అదే జీవితమని మురిసిపోయే రోజులు వచ్చాయి. పోనీ ఇదివరకటిలా అమ్మ వంటింటిలో కనిపిస్తోందా ఆంటే అదీలేదు. అమ్మ కూడా ఉద్యోగం పేరిట ఉదయం వెళితే రాత్రి వరకు రాకపోవడం, వచ్చిన కాసేపు అలసటగా ఏదో తిన్నాను అనిపించి నిద్రపోవడంతో కన్న బిడ్డలు ఎలా ఉన్నారు? స్కూల్ లో ఎలా ఉన్నాడు? అతని స్నేహితులు ఎవరు? ఎదిగిన పిల్లలయితే తాము లేనప్పుడు ఇంట్లో పిల్లలు ఏమి చేస్తున్నారు? కంప్యూటర్ ముందు కుర్చుని ఎవరితో చాట్ చేస్తున్నారు? ఇవన్నీ గాలికి వదిలేసారు. ఏదో పిల్లో పిల్లవాడో ఎవరైతేనేమి ఒక ఖరీదైన స్కూల్ లో చేర్చాలి. చేతికి అడిగినంత డబ్బు ఇవ్వాలి. అని ఆలోచిస్తున్నారే తప్ప మరేమీ ఈ కాలపు తల్లి తండ్రులలో కనబడటం లేదు.  అదీ కాకుండా ఉన్న ఒక్క బిడ్డని అతి గారాబం చేయడం కూడా ఒక తప్పుగా పరిణమిస్తోంది. విమల ఆనంద్ ది చక్కని జంట. పేరుకు తగ్గట్లుగా వారికో కుమారుడు పేరు విజయ్ తన చిన్నతనంలోనే తన తల్లి తండ్రులు తనతో ఏమాత్రం సమయాన్ని కేటాయించలేక పోతున్నారని బాధపడేవాడు. అలా అనుకుంటూనే అలవాటు పడిపోయాడు. అయితే ఎలా? పనికిరాని విడియో గేమ్స్ ఆడటం నేర్చుకున్నాడు. ఆంటే ఇక్కడ విడియో గేమ్స్ అన్నీ అలాంటివని కాదు. కొన్ని ఉదాహరణకు షాడో వారియర్, బ్లడ్, ఆర్మ గడ్దాస్ ,ఫ్రాన్కిన్స్టిన్ లాంటివి అన్నమాట. 
ఇవిలా ఉంచితే ఉన్నట్లుండి ఆ ఇంటికి పెద్ద దిక్కయిన ప్రకాశరావు ను తలపై మోది ఎవరో చంపేశారు. అయితే ఎవరు? డబ్బుకోసం కాదు. మరే ఇతర శత్రువులు అతనికి లేరు. మరెలా ఎవరు చంపారు? అనే ఆలోచనతో కొడుకు ఆనంద్ చాలాకాలం సతమతం అయ్యాడు. తర్వాత తాతగారు పోయినప్పటి నుండి రాజేష్ మౌనంగా ఉన్న కారణంగా వారి తల్లి తండ్రులు రాజేష్ ను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకుని వెళతారు. ఒకవేళ ఆయన మరణం ఈ పసితనానికి షాక్ గా మారిందేమో అని వారి అనుమానం. గైనకాలజిస్ట్ అయిన రాజేష్ తల్లి విమలకు ఈ  డా. వర్మ క్లాస్ మాటే అదీ కాకుండా స్నేహితుడు కూడా. దాంతో మరింత శ్రద్ధతో గమనిస్తాడని వీరు తీసుకుని వచ్చారు. కాస్సేపు మౌనంగా ఉన్నా మరి కాస్సేపు మెల్లగా మాట్లాడటం మొదలు పెట్టి తన అలవాట్లను, తనకు తాతయ్యకు మధ్య నిరంతరం సాగే ఆటలు గురించి చెప్పడంలో ఆ చిన్న వయసులోనే ఆ ముఖంలో ఏదో తెలియని ఉన్మాదం డాక్టర్ గమనించాడు.అప్పటికి అనవసరమేమో ఆనుకున్నా తల్లి విమల తీసుకుని వెల్లి పోయినా మరుసటి రోజూ రాజేష్ ఆడే ఆటలు గమనించాలని ఇంటికే డాక్టర్ రావడం జరిగింది. ఇక ఆపై రాజేష్ అదే వికృతమయిన ఆటలను చూసి ఆశ్చర్యపడి ఏదో అనుమానంతో  డాక్టర్ వర్మ షాడో వారిఎర్ లో తనను మించి స్కోరు ఎవరికీ రాదని అంటుంటే డాక్టర్ కూడా ఆడటమే కాదు. ఏకంగా రాజేష్ ను దాటిపోవడం కూడా జరిగింది. దాంతో తట్టుకోలేని రాజేష్, డాక్టర్ గొంతు పట్టుకున్నాడు. ఆవేశంతో ఆ ముఖం ఎర్రబడి వికృత రూపం దాల్చడంతో వెంటనే అక్కడే ఉన్న తల్లితండ్రులు పట్టి ఆపేరు. విశ్రాంతిగా పడుకోపెట్టారు. తల్లిగా విమల విల విల లాడింది.
డాక్టర్ వర్మ, రాజేష్ ను  మెల్లగా ట్రాన్స్ లోకి తీసుకెళ్ళి ఒక్కో ప్రశ్న అడుగుతుంటే  తాత తో తాను ఆడటం, ఎప్పుడూ ఓడిపోయే తాత గెలిచిపోతుండటం తాను తట్టుకోలేక పోయానని. అందుకే అక్కడే ఉన్న ఇనప క్యారిఎర్ తో తలపై మోదానని దాంతో తాతయ్య  అదీ మళ్లీ లేవకుండా పోయాడని చెప్పడం విని అక్కడివారంతా నిశ్చేష్టులయ్యారు.
 ఈ కధలో వస్తువు బావుంది. శిల్పం బావుంది.  నేడు సమాజానికి ఒక హెచ్చరిక గా కూడా ఉంది.  నేడున్న విజ్ఞానం ఎంతగా శాడిజం పిల్లలలో పెంచుతోందో తెలియజేసారు. తల్లి తండ్రులు కేవలం డబ్బు సంపాదించే మెషీన్స్ లా తయారవ్వడం ద్వారా పిల్లల మానసిక స్తితి ఎంతగా విక్రుతరుపం దాల్చుతోందో తెలియజేసారు. కాకుంటే కధా గమనంలో డాక్టర్ ను ఒకచోట వర్మ అని మరోచోట రమేష్ అని చెప్పడం పొరపాటుగా జరిగిందేమో కాని కధా పరంగా ఈ కధ సామాజిక దృక్పధం కలిగిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు.. కధను పూర్తిగా చదవడానికి చూడండి  

(శైలి బ్లాగు సౌజన్యంతో)

సూర్యలో నా వ్యాసం!


27, అక్టోబర్ 2012, శనివారం

నాయుడుగారి కథ!

సాదనాల వేంకటస్వామి నాయుడు గారి కథ వేటగాడు కథాజగత్‌లో చదవండి. కథపై మీ అభిప్రాయం తెలియజేస్తే సంతోషం. 

24, అక్టోబర్ 2012, బుధవారం

విజయ దశమి శుభాకాంక్షలు!!!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులు మరియు వారి కుటుంబసభ్యులు అందరికీ తురుపుముక్క విమిపర్వదినాన శుభాకాంక్షలను తెలియజేస్తున్నది.

21, అక్టోబర్ 2012, ఆదివారం

పాప కోరిక

కరీంనగర్ జిల్లాకు చెందిన కవయిత్రి,కథారచయిత్రి అయిన శ్రీమతి గరిశకుర్తి శ్యామలగారి పాపకోరిక కథను కథాజగత్‌లో చదవండి.

19, అక్టోబర్ 2012, శుక్రవారం

నా కథపై మణినాథ్ కోపల్లె గారి విశ్లేషణ!


బహుమానం - స్వరలాసిక(కోడీహళ్లి మురళీమోహన్)


కథ విశ్లేషణకి ఎంచుకున్న కథ ఇది.

సాధారణంగా ట్రైన్ ఆక్సిడెంట్ జరిగింది... అంటే....
ముందుగా వచ్చే ప్రశ్న ఎంతమంది మరణించారు?
ఆస్తి నష్టం ఎంత..?
ఆక్సిడెంట్ ఎలా జరిగింది..?
ఎవరైనా కావాలని చేసారా?
ఎవరైనా పెల్చేశారా?

ఇలా అంతు లేని ప్రశ్నలు... జవాబు లేని ప్రశ్నలు... ఉద్భవిస్తాయి కాని సంఘటనని పరిశీలించిన తరువాతే ఫలితాలు వెల్లడి తెలుస్తాయి.

ప్రయాణికుల భద్రతా... ప్రయాణికుల అసౌకర్యాలు.... ఎంక్యిరీస్ ఇలా ఎన్నో ఉపద్రవాల మధ్య రైలు ప్రమాదం గురించిన ప్రశ్నలు ఉద్భవిస్తాయి ....

కాని ఎవరి ప్రమేయం లేకుండా ప్రకృతి వల్ల కూడా రైల్వే ట్రాక్ డామేజ్ అవుతే కుడా మేజర్ accidents అయ్యే అవకాశం వుంది.

రచయిత ఆ విషయాన్ని చెప్పలనుకున్నారు.

రైలు పట్టాల మీద నడిచినంత సేపు బాగానే వుంటుంది.

అలా వెళ్ళటానికి వెనక ఎందరి కృషి వుంటుందో ఈ కథ తెలుస్తుంది.

రెండు పట్టాల మధ్య సరియైన సయోధ్య లేకపోతె రైలు పట్టాలు తప్పుతుంది.

కథలో రైల్వే సూపర్ వైజర్ రహమతుల్ల 60 డిగ్రీల మండు టెండలో తన డ్యుటీలో భాగంగా రైల్వే ట్రాక్ చెక్ చేస్తున్నపుడు... ముందుగా

కొన్ని రైలు పట్టాల మధ్య కంకర సరిగా లేక పోవటం గమనిస్తాడు. అందుకు రైల్వే ట్రాక్ లో కొంత భాగం సిమెంట్ స్లీపెర్స్, కొంత భాగం స్టీల్ స్లీపెర్స్ వుండటం వల్ల కంకరకి పట్టు ఉండక జారిపోటం, మట్టి మిగిలిపోవటం అవుతుంటుంది.దానికి కారణం (కంకర) బాలస్ట్ తక్కువ కావటం, పని ఒప్పుకున్నా కాంట్రాక్టర్ పని సగం లో వదిలేసి వెళ్ళిపోటం అని అనుకుంటాడు

"అసలు తన చేతి కింద ముప్పైమూడు మంది గ్యాంగ్‌మెన్లు ఉన్నా ఎప్పుడు సగానికి పైగా ఇతర పనులకు పురమాయిస్తాడు తన జూనియర్ ఇంజినీర్ (జే.ఇ) లింగారెడ్డి. మిగతా వాళ్లలో లీవు పెట్టిన వాళ్లు, పనికి ఎగనామం పెట్టిన వాళ్లు పోనూ గ్యాంగ్ బలం ఏడెనిమిది మంది కంటే మించదు. ఇంత తక్కువ మందితో పని నెట్టుకు వస్తున్నా పై అధికారులనుండి మాటలు పడటం తప్పలేదు" అని అనుకుంటాడు

మరి కొంత దూరం వెళ్ళినపుడు రైల్ పట్టాలు వంగిపోయి, వంకర్లు తిరిగి వుండటం చూస్తాడు. బక్లింగ్ అంటారు దాన్ని. అదే సమయం లో అదే ట్రాక్ పైకి ఎ.పి express వచ్చే సమయం అవటం వచ్చే ఉపద్రవాన్ని ఎలా ఆపాలో అర్థం కాదు రహమతుల్లకి .. అయినా వెంటనే స్పందించి కూలీ లని పిలిచి, హేల్పెర్ లని పిలిచి డేంజర్ ఫ్లాగ్ ని రైల్ పట్టాల పై పాతిస్తాడు. ఆ పని పూర్తి కాకుండానే రైల్ వచ్చేస్తుంది. లక్కీ గ రామయ్య పాతిన డిటో నేటేర్స్ ని పేల్చు కుంటూ రైల్ ఆగి పోతుంది. ఒక్క రెండు మూడు మీటర్స్ దాటితే పెద్ద ప్రమాదం సంభవించేది. డ్రైవర్ సమయానికి స్పందించటం వాళ్ళ ఆ రైలు ఆగిపోతుంది.

రైల్లోని జనం ఊపిరి పీల్చుకుంటారు. పెద్ద ప్రమాదం తప్పినందుకు...

ఆ తరువాత రైల్వే ట్రాక్ బాగు చేయటానికి రహమతుల్ల చాల కష్ట పడతాడు.

వంగిపోయిన రైల్ పట్టాలు కట్ చేసి వేరేవి అతుకు వెయ్యాలంటే చాల సమయం పడుతుంది.

పరిస్తితి అర్థం చేసుకున్న రహమతుల్ల వెంటనే జే. యి. తో ఫోన్ లో మాట్లాడి కట్టింగ్ మేచిన్ , వెల్డింగ్ మేచిన్ కావాలని అడిగి తెప్పించటం. పని వాళ్ళు, కట్ చేసిన రైల్ ముక్కల్లో (పట్టా ముక్కలు ) కొత్త రైల్ పట్టా అతుకు వేయటం... ఇలా చాల పనులు వేగవంతం చేసి... పట్టాలు బాగు చేసి express రైల్ ని క్షేమం గా గమ్యం చేరేటట్లు చేస్తాడు.

ఈ సమయంలో అనేక రైళ్ళకి రాక పోకలకి అంతరాయం కలుగుతుంది.

కాని సమయ స్ఫూర్తి తో superviser రహమతుల్ల చేసిన పని అక్కడున్న వారందరూ శ్లాఘిస్తారు.
ఆ ఆనందం తో మనస్పూర్తి గా సంతృప్తితో ఇంటికి వెళ్ళిన అతనికి ఆ తరువాత పై అధికారుల నుంచి మేమో వస్తుంది. డ్యూటీ సరిగా చేయనందుకు.... అనేక రైళ్ళ సమయాలకు ఆటంకం కలిగినందుకు
ప్రయానికులకి తీవ్ర అసౌకర్యం కలిగినందుకు. అతనిపై చర్య తీసుకోవాల్సిందిగా వచ్చిన ఉత్తర్వు అది.....

కాని ఈ కథలో రహమతుల్ల చేసిన దేశసేవ, అలుపెరగని నిస్వార్ధం, పని మీద ఏకాగ్రత, ప్రమాదం జరగ కుండ చుసిన సమయ స్ఫూర్తి, కొన్ని గంటల పాటు మండు టెండలో విశ్రాంతి లేకుండా పని చేయటం, చేసే పనిలో సాధక బాధకాలు. అన్ని అతనికే తెలుసు.

ఇతని సేవని గుర్తించని ప్రభుత్వం తిరిగి అతని పైనే చర్య తీసుకోవాలనుకోవటం ఎంత వరకు సమంజసం అనే ప్రశ్న ఉదయిస్తుంది.

జరిగిన సంఘటన పై విచారణ లేకుండా.... న్యాయ విచారణ లేకుండా అతనికి ఉతర్వ్యులు పంపటం ఈ కథకి కొస మెరుపు.

ఈ కథలో రచయిత రైలు కి సంబంధించిన అనేక పదాలు వాడారు.

సామాన్యులు ఆ పదాలని అర్థం చేసుకుంటే ఈ కథ లోని సారాంశం బోధ పడుతుంది.

చాల కథలలలో మాదిరి కుటుంబ కలహాలు, సూటిపోటి మాటలు అనవసర సంభాషణలు మనకి ఈ కథ లో కనిపించవు.

కథ లో వాడిన terminology చాల కొత్తగా వుంది..

ఈ కథ కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని అనటం లో సందేహం లేదు.

రచయిత ఈ కథలో వాడిన ఆంగ్ల పదాలు కొన్ని .......

బావుటా, డిటొనేటర్లు 'బ్యానర్ ఫ్లాగ్ డౌన్ లైన్, బ్లాక్‌స్మిత్ ఎస్.ఇ.,ఏ.డి.ఇ. మోపెడ్ ట్రాలీ కళాశిల,
ట్రాక్‌, స్ట్రెసస్ ,మూడో స్లీపరు క్లిప్పులు, కె.ఎం.పి.హెచ్, క్లిప్పులు, అలైన్‌మెంట్ ప్యాకింగ్ గ్యాస్ కటింగ్, హాక్‌సా బ్లేడ్ల, రైలు , డీ స్ట్రెస్సింగ్‌ ప్లాన్, వెల్డింగ్, కాషన్ఆర్డర్‌ .... ఇలా ఎన్నో అర్ధమయ్యే చిన్న చిన్న నూతన (ఆంగ్ల) పదాలు కథలో వాడుకున్నారు.....

ఈ కథ తెలుగుదే అయినా పైన ఉదహరించిన పదాలకు తెలుగులోనే చెబితే అర్థం మారిపోయే అవకాశాలున్నాయి. అందుకే ఆంగ్ల పదాలయితీనే సరిగా వాడుకోవటం జరుగుతుంది.


ఈ కథ నిజంగా నూతన కథాంశం అనటం లో సందేహం లేదు.


రైలు అంటే రైలు బండి, రైలు పట్టాలు అనే అందరు అనుకుంటారు 
కాని ఒక రైలు పట్టాల పైకి రావాలంటే ఎందరి కృషో అవసరమని ఈ కథ ద్వార అర్థమవుతుంది. 
మణి కోపల్లె

(వసంతసమీరం బ్లాగు సౌజన్యంతో)


18, అక్టోబర్ 2012, గురువారం

భరాగో కథపై జి.యస్.లక్ష్మిగారి విశ్లేషణ

   ఉపకారికి ఉపకారం చెయ్యడం ఏమంత పెద్ద విషయం కాదనీ, అపకారికి ఉపకారం నెపమెన్నకుండ చెసేవాడు నేర్పరి అనీ సుమతీశతకకారులు చెప్పారు.
   కాని ఈ కథ పేరే ఉపకారికి అపకారం చెయ్యడం.
   సుమతీ శతకకారుల్ని గుర్తు చేసుకుంటూ అనుకుంటాను రచయిత పద్యం లో వచ్చేసంధి కలిసినట్లుగానే "నుపకారికి నపకారము!" అనే శీర్షిక పెట్టేరు.
   ఉపకారికి ఉపకారం చెయ్యడం అన్నది అంత పెద్ద విషయమేమీ కాదనీ, అపకారికి ఉపకారం చెయ్యడమే జీవితంలో ధన్యమైనదని సుమతీశతకకర్త చెప్పిన సూక్తి మనకి నరనరంలోనూ జీర్ణించుకుపోయింది.
   కాని ఇక్కడ శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు అదే సూక్తిని మరో కోణం నుంచి ఆవిష్కరించారు.
   "ఉపకారికి కూడా ఒక్కొక్కసారి అపకారం జరిగితే.." అన్న పాయింట్ తీసుకుని దానికి తగ్గట్టు పాత్రలను మలచి కథ నడిపారు.
   భమిడిపాటి రామగోపాలం ఎంత గొప్ప కథకులో తెలియనివారుండరు.
కథంతా ఉత్తమపురుష (first person) లో సాగుతుంది. సౌలభ్యం కోసం ఆయనను మనం పెద్దమనిషిగా పిలుచుకుందాం. ఎప్పుడో ఆయన శృంగవరపుకోటలో పోస్టాఫీసులో క్లర్క్ గా పనిచేస్తున్నప్పుడు, కుర్రాళ్ల బాధ్యతా రాహిత్యం గూర్చి చెపుతూ పోస్ట్ మాస్టర్ రిజిస్టర్డ్ కవరు ఇవ్వద్దని చెప్పినాకూడా, అఖిలాండేశ్వరం అనబడే అతనికి ఈ పెద్దమనిషి కేవలం మానవతా దృక్పథంతో ఆ కవర్ ఇస్తాడు. అప్పటికి సాయంత్రం అయిదుగంటలు దాటిపోలేదు కూడా. అలాగ ఆలోచిస్తే అతను అతని రూల్ ని అతిక్రమించలేదనే చెప్పుకోవాలి. అలా ఈ పెద్దమనిషి ఉత్తరం సమయానికి ఇవ్వడం వల్ల అఖిలాండేశ్వరం సమయానికి ఇంటర్వ్యూ కి హాజరయి, సెలక్టయి, అంచెలంచెలుగా పైకెదుగుతూ, పెద్దమనిషి రైల్లో కలిసే సమయానికి ఉద్యోగాలకి సెలక్షన్ చేసే స్థాయికి ఎదిగాడు.
ఆ అఖిలాండేశ్వరమే ఈ పెద్దమనిషి కొడుకు ఉద్యోగం పనిమీద హైదరాబాదు వెడుతున్నాడని తెలుసుకుని, ఆపని తన చేతిలో పనే అని చెప్పి, ఉపకారికి ఉపకారం చేద్దామనే ఉద్దేశ్యంతో వివరాలు చెప్పి తనని కలవమంటాడు.

     అంతా బాగానే అవుతుంది. పెద్దమనిషి కొడుకుకి ఉద్యోగం వస్తుంది. స్వయంగా ఆర్డర్ తీసుకునే ఊరు వెడదామని ఆయన హైద్రాబాదు లోనే వుండిపోయినప్పుడు ఈ అఖిలాండేశ్వరం పర్సనల్ సెక్రటరీ నని చెప్పి గంగాధరం అనే ఆయన ఈ పెద్దమనిషిని కలిసి, అబ్బాయి ఆ ఉద్యోగంలో ఎంత తొందరలో ఎంత ఎత్తుకు ఎదుగుతాడో చెప్పి, తెలిసినవాళ్ళు కనక అందరిలా రెండు లక్షలు ఇవ్వకపోయినా యాభైవేలైనా ఇస్తే బాగుంటుందనీ, ఆ యాభైవేలూ కూడా ఈ పెద్దమనిషి ఎలా సమకూర్చుకోవాలో కూడా సలహా చెప్తాడు.
      ఆ పెద్దమనిషికి విషయం అర్ధమౌతుంది. కొడుకు ఉద్యోగస్తుడవడానికి గంగాధరం కోరినట్టే యాభైవేలూ పట్టికెళ్ళి కమీషనర్ గారికిచ్చి, అపాయింట్ మెంట్ ఆర్డర్ తీసుకునే క్షణం లోనే అనుకోని సంఘటన జరుగుతుంది.
అవినీతి నిరోధకశాఖలో డిప్యూటీ సూపరెంటెండేంట్ గా పనిచేస్తున్న ఆ పెద్దమనిషి అల్లుడుగారు హఠాత్తుగా ప్రత్యక్ష్యమయి, ఆ అఖిలాండేశ్వరుణ్ణి రెడ్ హేండెడ్ గా పట్టుకుంటారు.
సాక్ష్యాధారాలన్నీ పకడ్బందీగా సేకరిస్తారు.

ఆ విధంగా ఉద్యోగమిచ్చి ఉపకారం చేసిన అఖిలాండేశ్వరానికి అపకారం జరిగింది.
      కథలో ఈ మలుపు రచయిత హఠాత్తుగా తీసుకొస్తారు. విషయం అర్ధమయ్యే లోపలే సాక్ష్యాలు సేకరించబడతాయి. ఆ విషయం ఆ పెద్దమనిషికి కూడా అప్పుడే తెలుస్తుందనుకోవాలి. ఎందుకంటే పాఠకులకి కూడా ఆ పెద్దమనిషి అల్లుడు అవినీతి నిరోధకశాఖలో ఉన్నతోద్యోగం చేస్తున్నట్టు అప్పుడే తెలుస్తుంది. అలా లంచం తీసుకుంటున్న ఒక ప్రభుత్వోద్యోగిని పట్టుకుంటూ సాక్ష్యాధారాలను సేకరించడంతో కథ ముగుస్తుంది. 

       అంతటి గొప్ప రచయిత ప్రతిభంతా ఆ ముగింపులోనే కనిపిస్తుంది.
ఎందుకంటే ఒక కథ మంచికథ అని చెప్పుకోవాలంటే కథ చదవడం పూర్తయిన తర్వాత పాఠకుడు ఆ కథ గురించి కాస్త సేపైనా ఆలోచిస్తేనే దానిని మంచికథ అంటారని పెద్దవాళ్ళు చెపుతుంటారు. అలాగే ఈ కథ పూర్తి చేసాక కూడా దీనిగురించి ఆలోచించకుండా వుండలేరు. ముందు అందరికీ వచ్చే సందేహం ఈ విషయం ఆ పెద్దమనిషికి ముందే తెలిసుంటుందా అని. కాని ఆ పెద్దమనిషి కూడా ఆర్డర్ కాగితాలు తీసుకుని అలాగే నిలబడడంతో ఆయనకు తెలీదనే అనుకోవాలి.

      ఈ కథని బట్టి మనకి అర్ధమయ్యేదేమిటంటే మనిషి ఒకటనుకుంటే పరిస్థితులు దానిని మరోవిధంగా మార్చేస్తాయి అని. పాత్రలను తీసుకోవడం లోనూ, సన్నివేశాలను సృష్టించడంలోనూ రచయిత ప్రదర్శించిన తీరు అమోఘం.
     తనకి చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసుకునే అవకాశం వచ్చినందుకు అఖిలాండేశ్వరుడు ఆనందించి, మిగిలిన అభ్యర్ధుల దగ్గర రెండు లక్షలు తీసుకుంటున్నా ఈ పెద్దమనిషి సహాయానికి ప్రతిగా కేవలం యాభైవేలే తీసుకుంటాననడం ఆ పాత్రకి తగ్గట్టే వుంది. అలాగే పెద్దమనిషి కూడా ప్రస్తుత పరిస్థితులని అర్ధం చేసుకుని ఆ డబ్బుని తీసికెళ్ళి అతని కివ్వడం కూడా సబబుగానే వుంది. ఈ విషయం తెలిసిన అవినీతిశాఖ లో ఉద్యోగి (పెద్దమనిషిగారి అల్లుడు) తన డ్యూటీ ప్రకారం లంచం పుచ్చుకుంటున్నవాళ్ళని రెడ్ హేండెడ్ గా పట్టుకోవడం విధిని నిర్వహించెనట్టే అనిపించింది.
    ఇలా ఏ ఒక్క పాత్రనూ తక్కువచెయ్యకుండా కేవలం పరిస్థితుల ప్రభావం వలనే ఉపకారికి అపకారం జరిగినట్టు రచయిత చాలా గొప్పగా చెప్పారు.
     మనిషి ఏం చెయ్యాలనుకున్నా పరిస్థితులకి ఎంత బానిసో, ఉపకారం చేసినవారికి కూడా ఎలా అపకారం జరుగుతుందో ఎంతో సూటిగా చెప్పారు.
ఈ కథ అందుకే నాకు నచ్చింది. మహారచయిత శ్రీ భమిడిపాటి రామగోపాలంగారు కథని ఎంతో పట్టుగా, సూటిగా నడిపారు. అనుకోని మలుపుతో ఇచ్చిన ముగింపు కథ పూర్తిచేసాక పాఠకుణ్ణి తప్పకుండా ఆలోచింపచేస్తుంది.ఈ కథకి లింక్...http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/nupakariki-napakaramu---bhamidipati-ramagopalam


15, అక్టోబర్ 2012, సోమవారం

సూర్యలో నా వ్యాసం!

    సూర్య దిన పత్రిక 8 అక్టోబర్ 2012 సంచికలో సాహిత్యం పేజీ అక్షరంలో నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు అనే శీర్షికతో ఒక వ్యాసం వచ్చింది. డా.శ్రీనివాస్ అంకే ఈ వ్యాసాన్ని వ్రాశారు. ఆ వ్యాసాన్ని ఇక్కడ చదవండి. ఈ వ్యాసం పై నా స్పందనను పరిమిత విశ్లేషణ పేరుతో ఈ రోజు సూర్యదినపత్రిక అక్షరం పేజీలో ప్రకటించారు. దాని పూర్తి పాఠం ఇక్కడ యిస్తున్నాను. చదివి మీ అభిప్రాయం చెప్పండి.


        అక్టోబర్ 8 సంచికలోని అక్షరం పేజీలో డా.శ్రీనివాస్ అంకే గారి 'నిక్కమైన సాహిత్య చరిత్రకారుడు' అనే శీర్షికలో 'కవిత్వవేది' కల్లూరు వేంకటనారాయణరావుగారి గురించి వ్రాసిన వ్యాసం చదివి చాలా సంతోషించాను. రావుగారి 'ఆంధ్రవాఙ్మయ చరిత్ర సంగ్రహము', 'వీరేశలింగ యుగము' అనే గ్రంథాల గురించి రచయిత చక్కగా విశ్లేషించారు. 


    అయితే ఈ వ్యాసంలో డా.శ్రీనివాస్ గారు ఎంత సాహిత్య చరిత్రకే పరిమితమైనా కల్లూరు వేంకటనారాయణ రావుగారి ఇతర రచనలను ప్రస్తావించక పోవడం వల్ల కల్లూరు వారిని కేవలం సాహిత్య చరిత్రకారుడిగా మాత్రమే పాఠకులు భావించే ప్రమాదం వుంది. వ్యాసంలో ఒక చోట 'ఆయన వ్యక్తిగతంగా పద్య కవి కూడా' అని పేర్కొన్నప్పటికీ అది సరిపోదు. 


        బోధార్షే అనే గుప్తనామం కలిగిన కల్లూరు నారాయణరావుగారు పై రెండు గ్రంథాలేగాక అహల్యా సహస్రాక్షీయము, శ్రీ కృష్ణార్జునీయము అనే నాటకాలనూ, పుష్పాంజలి, శ్రీ విద్యారణ్య చరితము, షాజహాన్, శ్రీమదశోక చరిత్రము మొదలైన పద్యకావ్యాలను వ్రాశారు. ఈ రచనలన్నింటిలోనూ తలమానికము అనదగింది అశోకచరిత్రము. శాంతి సామ్రాట్టు అనే నామాంతరం కల ఈ చారిత్రక పద్య కావ్యము భారత జాతీయోద్యమ స్ఫూర్తితో రాయలసీమ నుండి వెలువడిన చారిత్రక ప్రబంధ త్రయములో ఒకటిగా పేరుపొందింది. దుర్భాక రాజశేఖర శతావధాని గారి రాణాప్రతాప సింహ చరిత్ర, గడియారం వేంకట శేషశాస్త్రి గారి శివభారతము మిగిలిన రెండు చారిత్రక ప్రబంధ కావ్యాలు. ఈ అశోక చరిత్రను రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ, చిలుకూరి నారాయణరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నిడదవోలు వెంకటరావు, తుమ్మల సీతారామ మూర్తి చౌదరి, నండూరి రామకృష్ణమాచార్య, విశ్వనాథ సత్యనారాయణ ప్రభృతులు ప్రశంసించారు. ఏడు కాండములు, 1400 పైచిలుకు పద్యాలతో శోభిల్లిన ఈ మహాకావ్యాన్ని డా.శ్రీనివాస్ గారు తమ వ్యాసంలో కనీసం మాట మాత్రంగా నైనా ప్రస్తావించక పోవడం శోచనీయమే కాదు కవిత్వవేదికి చేసిన అపచారం కూడా!

       ఇక ఈవ్యాసం చివరలో 'రాయలసీమలో కవిత్వవేది తర్వాత సాహిత్య చరిత్ర రచన చేసినవారు కల్లూరు అహోబలరావుగారు' అని అంటున్నారు. వేంకటనారాయణరావుగారి వీరేశలింగ యుగము అహోబలరావుగారి రాయలసీమ రచయితల చరిత్రల మధ్య ఈ ప్రాంతం నుండి మరికొన్ని సాహిత్య చరిత్రకు సంబంధించిన రచనలు వచ్చాయి. అవి టేకుమళ్ళ కామేశ్వరరావు(వీరు విజయనగరానికి చెందిన వారయినా రాయలసీమలో ఎక్కవ కాలం జీవించారు) గారి 'నా వాఙ్మయ మిత్రులు', 'పూర్వ కవుల చరిత్ర', జానమద్ది హనుమచ్ఛాస్త్రి గారి 'మా సీమకవులు'. 


     రాయలసీమ రచయితల చరిత్ర గురించి డా.శ్రీనివాస్ గారు తమ అభిప్రాయాన్ని చెబుతూ ఇందులో కులం, గోత్రం, వంశం వంటివాటికి ఇచ్చినంత ప్రాధాన్యత సాహిత్యానికి ఇవ్వలేదని అంటున్నారు. అలాగే ఇందులో కేవలం  కవుల రచనలు, ఒకటి రెండు పద్యాలను ఉటంకించడంతో జనాదరణ పొందలేదని అభిప్రాయపడుతున్నారు. చరిత్ర అన్నాక తారీఖులు, దస్తావేజులూ, కులగోత్రాలు, వంశ చరిత్రలతో సహా అన్ని విషయాలనూ రికార్డు చేయవలసి ఉంటుంది. వాటివల్ల ప్రస్తుతం మనకు ఉపయోగం కనిపించకపోయినా ఏనాటికైనా వాటి అవసరం రావచ్చు. రాయలసీమ రచయితల చరిత్ర ఉద్దేశాన్ని కల్లూరు అహోబలరావుగారు తమ సంపాదకీయంలో స్పష్టంగా చెప్పారు. 'హూ ఈస్ హూ ఆఫ్ రాయలసీమ రైటర్స్' అను ఈ రాయలసీమ రచయితల చరిత్ర పరిశోధనా గ్రంథముగా పరిశోధకులకు ఉపయోగపడుతుందని అహోబలరావుగారు తలచారు. భావితరము వారికి, చరిత్రకారులకు ఈ గ్రంథము ఎన్సైక్లోపీడియా వలె ఉపయోగపడాలని భావించారు. కవిత్వవేది కల్లూరు వేంకటనారాయణరావుగారు రాయలసీమ రచయితల చరిత్ర మొదటి సంపుటానికి వ్రాసిన మున్నుడిలో 'ఉత్తమ గ్రంథ రచయితలను చదువరులకు పరిచితులుగా జేసియున్కి, యెంతయు ప్రశంసనీయము. అందునను వారివారి జన్మదేశకాలములను, అందిన సన్మానములను వారి సహజ స్వభావములను, చక్కగా స్పష్టముగా, నభివర్ణించుటయే కాక, వారివారి కృతులలోని పద్యరత్నములను కూడ నాంధ్రులకు తనివిదీర నుదాహరణము లిచ్చియుండుట సమంజసముగా నున్నది' అని అంటున్నారు. 


  అహోబలరావుగారికి ఉన్న పరిమిత వనరులతోనూ, గ్రంథ విస్తరణభీతితోనూ రచయితల పరిచయాలు కొన్ని క్లుప్తంగా చేసిఉండవచ్చు కానీ ఈ నాలుగు సంపుటాల రాయలసీమ రచయితల చరిత్ర  డా.శ్రీనివాస్ అంకే గారి దృష్టిలో జనాదరణ పొందక పోయినా దాని ఆశయాన్ని పూర్తిగా నేరవేర్చినదని ఒప్పుకోక తప్పదు. సాహిత్య చరిత్రకు, పరిశోధనకు కావలసిన దినుసు ఈ సంపుటాల్లో పుష్కలంగా లభిస్తుంది. రాయలసీమలో పరిశోధకులకూ, విమర్శకులకూ అప్పటికీ, ఇప్పటికీ కొదవలేదు.

12, అక్టోబర్ 2012, శుక్రవారం

పాలకంకుల శోకం ; (


సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి గారి పాలకంకుల శోకం కథను కథాజగత్‌లో చదవండి.

6, అక్టోబర్ 2012, శనివారం

సంస్కారంపై మణిగారి అభిప్రాయం!


       కథాజగత్‌లో "సంస్కారం" అనే కథ "కాకాని చక్రపాణి" గారిది!

ఈ కథ పై నా విశ్లేషణ :

        మనిషికి సంస్కారం ఎంతో అవసరం. ఈ మాట అందరు ఎరిగి ఉన్నదే! ఆ సంస్కారం కుసంస్కరమా కాదా అని తెలిసేది ఆ వ్యక్తీ ప్రవర్తనని బట్టి వుంటుంది. పెరిగిన వాతావరణం నుంచి వుంటుంది. మారుతున్న సమాజంతో పాటు మనుషుల ప్రవర్తనలో కూడా మార్పు వచ్చినదనటానికి నిదర్శనం ఈ కథ 

        బతికినన్నాళ్ళు భార్య భర్తల అనురాగాలు కుటుంబ ప్రేమాభిమానాలు ఒక బంధం లోనే ఇమిడి ఉండేవి. స్త్రీలు కూడా ఎన్నో   బాధలు   పడ్డా తన కుటుంబం కోసం చాల త్యాగాలు చేసేవారు. కాని భర్త అంత్య దశలో కూడా ('పోయాడు, పీడాపోయింది' అని గొణుక్కుంది ఆమె, నిర్జీవమై పడి ఉన్న తన భర్త హరినారాయణ శవం వంక చూస్తూ. ) మనుషుల ఆలోచనల్లో  మార్పు వచ్చిందనటానికి ఈ కథ ఒక ఉదాహరణ. పడిన కస్టాలు, బాధలు ఆమెని ఇలా ఆలోచింప చేసాయి సుఖం అన్నది ఎరుగదు. ఎంతో   మానసిక క్షోభ   పడితేనో  తప్ప....  మనసు గాయపడి ఇలాటి ఆలోచనలు వస్తాయి??. 

     శవ జాగారం చేస్తూ భర్త మరణిస్తే భాగ్యలక్ష్మి  అంతరంగంతో  ఈ కథ మొదలవుతుంది. . తన పెళ్లి, అత్తా మామల విసుర్లు, గయ్యాళి అత్తా, సౌమ్యుడు   అయిన మామ... చెడు తిరుగుళ్ళ భర్త...., అత్తా పోలికలు  బుద్ధులు   పుణికి పుచుకున్న కూతురు, మామ లాంటి ఆలోచనలతో కొడుకు ....... ఈ పాత్రల సంభాషణలతో కథ నిండి వుంటుంది.  

     అంతిమ సంస్కారానికి  ఇంటితో డబ్బుతో ముడిపెట్టి కూతురు, కొడుకు తండ్రి శవం ముందు పెట్టుకుని యాస్తి లావా దేవిలు మాట్లాడుకోవటం, డబ్బువుండి   కూడా  తండ్రి దహన సంస్కారాలకి  ఆస్తితో లింకు పెట్టి డబ్బుఇచ్చిన సోదరి అమల....  దానితో ఇంటితో సంబంధం తెంచు కోవటం.....     జగదీష్ (కొడుకు)  చివరికి హైదరాబాదు పోవాలి అని తల్లితో అంటూ తదుపరి కార్యక్రమాలకి   శ్రీ కారం చుట్టటం తో కధ ముగుస్తుంది. 

      అమల తన తండ్రి ఇంటిని స్వాధీన పరచుకోవటం లో ఎంతో తెలివిగా ప్రతిదానికి వాటా లేస్తూ ఇవ్వవలసిన లక్షల డబ్బుకు వేలల్లో లెక్క  చూపుతుంది. అంతా స్వార్థం.... ప్రతిది లెక్క కడుతుంది. తండ్రి దహన సంస్కారాలకి కూడా ఖర్చులో చూపుతూ,  తను ఎంతో జాలి గుండె కలదానిని అని  పదివేలు అందిస్తుంది. "ప్రేత సంస్కారం జరగకపోతే ఆ జీవుడు స్వర్గానికీ, నరకానికీ కాకుండా అలమటిస్తాడు. నీకివ్వాల్సిన అరవై వేలూ ఇప్పుడే ఇచ్చేస్తాను" అంది అమల.

        ఈ కథలో శవ యాత్ర సమయం లో చేయవలసిన కర్మ కాండల విషయం లో జరిగే సత్యాలు ఇవి....  ఎవరు పంచుకుంటారు ఈ భారాన్ని, ఈ భాద్యతలు   అని సొంత పిల్ల మధ్య వైరాన్ని చక్కగా చూపించారు రచయిత

      నాకు తెలిసి ఒకరికి చివరి సంస్కారాల విషయంలో కూడా దహన సంస్కారాలకి ధనం లేకపోతె పోయిన వ్యక్తి వంటిమీద సొమ్ముని తీసుకుని  డబ్బు ఇచ్చిన సొంత  పిల్లలూ    వాళ్ళు వున్నారు.  పది రోజుల   కార్యక్రమానికి  కూడా ఆ వ్యక్తి వంటి మీద సొమ్ములే అవసరమయ్యాయి.   

       డబ్బు ఎంతటి ద్వేషాగ్నులు రగులుస్తుందో,  ఆప్యాయతానురాగాలు   ఎలా కొరవడతాయో ఇందులో తెలుస్తుంది.
                                                                                                                                                         
                                                                                 - కోపల్లె మణినాథ్
(మణిమయూరం బ్లాగు సౌజన్యంతో)

5, అక్టోబర్ 2012, శుక్రవారం

అమ్మో!


ఈ వార్త చదివాక పాత టపా గుర్తుకు వచ్చింది.

3, అక్టోబర్ 2012, బుధవారం

ప్రవాహం తిరోగమించదు

నల్లూరి రుక్మిణిగారి కథ ప్రవాహం తిరోగమించదు కథాజగత్‌లో చదవండి