...

...

29, జనవరి 2013, మంగళవారం

'చినుకు'లో సమీక్ష!


విశ్వజీవి విద్వాన్ విశ్వం
- ఎం.ఆర్.వి.సత్యనారాయణమూర్తి


బహుముఖ ప్రజ్ఞాశాలి, తెలుగు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వంపై విలువైన సమాచారంతో కూడిన పుస్తకాన్ని పాఠకులకు అందించిన సంపాదకుల్ని ముందుగా అభినందించాలి. విశ్వంగారు లెక్కలేనన్ని పుస్తకాలు రాసినా తెలుగు సాహితీ ప్రియుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన విశ్వం కావ్యం 'పెన్నేటి పాట'.

రాయలసీమ ప్రజల కష్టాల్ని చూసి కన్నీటి సంద్రమైన మానవతావాది విశ్వం. ఇరవై ఒక్కమంది ప్రముఖులు విశ్వంగారి జీవితాన్ని, సాహిత్యాన్ని పరిశీలించి రాసిన వ్యాస సంపుటి 'సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం' అనే గ్రంథం.

తరతరాలుగా బహుముఖ పాండిత్య ప్రతిభ కల్గిన కుటుంబంలో జన్మించిన విశ్వం కలం నుండి జాలువారిన కందాలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసాయి. ఆయన రచనలో సర్వమానవ సౌహార్ధం ఏర్పడాలన్న కాంక్ష బలీయంగా కన్పిస్తుంది.

'కవి యొక్క రచనా పద్ధతిని బట్టి వాని జీవితమును నిర్ణయించలేమ'ని విశ్వనాథ సత్యనారాయణ వ్యాసంలోని వాక్యాలని ఆరుద్ర 'మేఘ సందేశం - విద్వాన్ విశ్వం' లో ఖండిస్తారు. శిల్ప లక్షణాలు వేరు, జీవితం వేరు అనే సిద్ధాంత ప్రచారం కేవలం అద్వైతులకే చెల్లిందని చురక వేస్తారు. విశ్వం శిల్ప లక్షణాలు జీవితానికి భిన్నమైనవి కావని ఆరుద్ర నొక్కి చెప్పారు. విశ్వం 'రాయలసీమ మించుల సితారు పచ్చల బజారు' అన్న ఆర్తి నిదానంగా వ్యాపించడం విశేషం.

ప్రకృతి చూపే నిర్దయతో ఆధిపత్య వర్గాలు చేసే అన్యాయాలతో, ఎడతెగని కరవులతో నిండిన రాయలసీమ పరిస్థితిని 'పెన్నేటిపాట'లో దర్శించవచ్చని, ఎంతో బలంగా, సామాజిక ఆవేదనతో రచించబడ్డ కావ్యం పెన్నేటి పాట అని అద్దేపల్లి తన వ్యాసంలో పేర్కొన్నారు.

మాతంగకన్య  హస్త పద్మంలోంచి ఆ మాణిక్య వీణను అంది పుచ్చుకొని అపూర్వ వాద్య మాధుర్యంతో ఆబాలగోపాలాన్ని చిరకాలం నుంచి అలరింపచేస్తున్న విద్వత్కవి విశ్వంగారని పిలకా గణపతి శాస్త్రి అభినందించడం విశేషం.

వ్యావహారిక భాషలో గంగా ప్రవాహంగా సాగే విశ్వంగారి అనువాదం తననెంతో ఆకట్టుకునేదని ఏటుకూరి బలరామమూర్తి అంటే, రచయితలనీ, రచయిత్రులనీ ప్రోత్సహించి వారి ఎదుగుదలకు సహకరించిన విశాల హృదయుడు విశ్వంగారని మాలతీచందూర్ కొనియాడారు.

'విద్వాన్ విశ్వం మీటిన మాణిక్యవీణ' పేరుతో వెలుదండ నిత్యానందరావు రాసిన వ్యాసం ('చినుకు'లో ప్రచురితం) పాఠకుడ్ని ఆలోచింపచేస్తుంది. 'మాణిక్యవీ'లో ప్రస్తావించిన వివిధ అంశాలను వ్యాసకర్త సందర్భోచితంగా వివరించిన తీరు బాగుంది. ముప్పయ్ ఏళ్ళకి పైగా ఒక విశిష్టమైన కాలమ్‌ని సమర్థవంతంగా నడిపిన ధీశాలి విశ్వం అని కితాబునిస్తూ, ఇంతటి విలువైన మాణిక్యవీణల్ని పుస్తకరూపంలో ఎవరూ తేకపోవడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేసారు.

'సమన్వయమూర్తి విద్వాన్ విశ్వం' అన్న వ్యాసంలో డాక్టర్ నాగసూరి వేణుగోపాల్ విశ్వంగారిని పత్రికా రచయితగా ఆయన సాధించిన విజయాన్ని స్పర్శించారు. వాదాలతో గిడసబారి పోయే ప్రస్తుత పరిస్థితిలో విద్వాన్ విశ్వంగారి విశాల దృక్పథం నేడు వాంఛనీయమన్నది అక్షరసత్యం.

సాహిత్యాభిమానుల గుండెల్లో స్థిరుడైయున్న విశ్వంగారి ఆలోచనా సరళి, పాండిత్యం, విశాలభావాలు మరింతగా తెలుసుకోవడానికి ఈ వ్యాస సంపుటి ఎంతో ఉపకరిస్తుంది.

(చినుకు మాసపత్రిక జనవరి 2013 సంచికలో ప్రచురితం)

23, జనవరి 2013, బుధవారం

అనంతపురం సభ విశేషాలు!

పుష్పంతో ఆహ్వానిస్తున్న ఉద్దండం చంద్రశేఖర్.

డా.రాధేయ

వెన్నెల ఆశయాలను వివరిస్తున్న మధురశ్రీ 

సాహితీ విరూపాక్షుడు పుస్తకాన్ని విశ్లేషిస్తున్న సింగమనేని

ఎం.వెంకటేశ్వరరావు పుస్తకం గురించి ప్రసంగిస్తున్న టి.రాజారాం

'ఆ అరగంట చాలు' పై సాత్విక్

కస్తూరి మురళీకృష్ణ  - రైటర్స్ రెస్పాండ్

ఎం.వెంకటేశ్వరరావు - 'ధన్యవాదాలు' 

వెన్నెల అధ్యక్షులు ఉద్దండం

స్థానిక రచయితలు చిలుకూరి దేవపుత్ర,  సింగమనేని నారాయణ

జ్ఞాపికను అందజేస్తున్న డా.అమళ్లదిన్నె వెంకటరమణ ప్రసాద్

సూర్యసాగర్‌తో సాత్విక్

చూశారా మీ కోటలో పాగా వేశా!

కోగటం విజయభాస్కర్ రెడ్డితో ఎం.వి.ఆర్.

పిచ్చాపాటి

వెన్నెల సభ్యులతో గ్రూప్ ఫోటో

21, జనవరి 2013, సోమవారం

మూడు పుస్తకాలు మూడు పరిచయాలూ...


అనంతపురంలో మా సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం, ఆ అరగంట చాలు, అదివో... అల్లదివో!  పుస్తకాలను పరిచయం చేస్తూ  వెన్నెల సహృదయ సాహిత్య వేదిక వారు నిర్వహించిన మూడు పుస్తకాలు - మూడు పరిచయాలు కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. అనంతపురంలోని సాహిత్యాభిమానులందరూ హాజరై ఈ సభను దిగ్విజయం చేశారు. వక్తలు పుస్తకాలను ప్రేక్షకులకు చక్కగా పరిచయం చేశారు. అక్కడ మా పుస్తకాల అమ్మకాలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి. సభను నిర్వహించిన ఉద్దండం చంద్రశేఖర్, మధురశ్రీ బృందానికి మా కృతజ్ఞతలు! సభ తాలూకు ఫోటోలు, వార్తలు కొన్ని ఇక్కడ చూడండి. మరికొన్ని మరో టపాలో!




ఈనాడులో వచ్చిన వార్తాంశం 

సూర్యదినపత్రికలో వచ్చిన వార్త!

సాక్షి దినపత్రికలో...



15, జనవరి 2013, మంగళవారం

14, జనవరి 2013, సోమవారం

సంక్రాంతి కానుక!


బ్లాగు మిత్రులు, వారి కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు! ఈ సందర్భంగా సంక్రాంతి కానుకగా డా.కె.ఎల్.వి.ప్రసాద్ గారి కథ అడుగుజాడలు కథాజగత్‌లో అందిస్తున్నాం. చదివి ఆనందించండి.    

10, జనవరి 2013, గురువారం

ప్రతిజ్ఞ!


I love my country and I am proud of its rich and varied heritage.

I shall always strive to be worthy of it.
I shall give my parents, teachers and all elders respect and treat everyone with courtesy.
To my country and my people, I pledge my devotion. In their well-being and prosperity alone, lies my happiness.

భారతదేశం నా మాతృభూమి. భారతీయులందరు నా సహోదరులు.
నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను. సుసంపన్నమైన, బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వకారణం. దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను.
నా తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయుల్ని, పెద్దలందర్ని గౌరవిస్తాను. ప్రతివారితోను మర్యాదగా నడుచుకొంటాను. జంతువుల పట్ల దయతో ఉంటాను.
నా దేశంపట్ల , నా ప్రజలపట్ల సేవనిరతితో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. వారి శ్రేయోభివృధ్ధులే నా ఆనందానికి మూలం. జై హింద్.

నేషనల్ ప్లెడ్జ్‌ను వ్రాసింది మన తెలుగువాడైన పైడిమర్రి వెంకటసుబ్బారావు అని ఈరోజే తెలుసుకున్నాను!


7, జనవరి 2013, సోమవారం

శ్రీనుగాడి తత్వమీమాంస!


    మెడకాయ వంకరగా పెట్టి కాసేపు దీర్ఘంగా ఆలోచించి ""అలా భగవంతుని వెలుగులో మనమూ ఒక వెలుగై కలిసిపోతే ఏమిటమ్మా లాభం?" అడిగాడు శ్రీను.

    "లాభమని చిన్నగా అంటావేమిట్రా? ఎన్నెన్నో జన్మలెత్తుతూ రోగాలు రొష్టులూ, దరిద్రమూ దుఃఖాలతో బ్రతకాల్సిన అవస్థ వుండదు గదా!"

    "అమ్మా! నాకైతే ఎల్లకాలం అలా వెలుగులో వెలుగై ఉండాలని లేదే! మళ్లీ మళ్లీ పుట్టాలనిపిస్తుంది. మన గేదె ఈనినప్పుడు నువ్వొండిపెట్టే జున్నులాంటి జున్నూ, కొత్త అటుకులూ, జొన్న ఊచ బియ్యం, తంపటేసిన పచ్చేరు శనక్కాయలూ మళ్లీ మళ్లీ తింటూ వుండకపోతే ఎలాగే! అసలు మామిడి పళ్లు తింటూ ఉండకపోతే ఎలా? ప్రొద్దున్నే మన ఊరు చెరువులో రంగురంగుల తామర్లనీ - దాని చుట్టూ చెట్లకి వెళ్లాడే గిజిగాళ్లని చూస్తుండకపోతే ఇంకేం బ్రతుకు?"

    "ఓరి సన్యాసి! అసలు బ్రతుకే వద్దని, బ్రహ్మలో ఐక్యమైపోవాలని గదరా భక్తులు పాటుపడేది!"

    "అదేనమ్మా! అలా కుదర్దు నాకు. ఎప్పుడూ బ్రతికుంటూ మాయాబజార్, మల్లీశ్వరి లాంటి సినిమాలు లెక్కలేనన్ని సార్లు చూస్తుండాలి. బస్సుల్లో, రైళ్లలో, మోటార్ సైకిల్ మీద ఝామ్మంటూ తిరుగుతుండాలి. పెద్దాణ్ణయి మన దేశమంతా తిరిగి రావాలి. మళ్లీ జన్మలోనైనా అమెరికా, ఇంగ్లాండ్ చూసిరావాలి. ఇవన్నీ ఏం లేకుండా ఏమిటో వెలుగులో వెలుగై కూర్చుంటే ఏం జరుగుతుందిటా?"

    "ఒరే శ్రీనుగా! ఎప్పుడైనా నీతో వాదించి గెలవగలిగానేట్రా? లోకమంతా కాచి వడబోసిన ముసలాళ్లా మాట్లాడతావయ్యే!" లోలోపల కొడుకు తెలివికి మురిసిపోతూ అంది తిరువెంగళమ్మ.

   నంబూరి పరిపూర్ణ గారి ఈకథ కథాజగత్‌లో పూర్తిగా చదవండి.  

4, జనవరి 2013, శుక్రవారం

కొడిగట్టిన దీపాలు!


జాస్తి రామకృష్ణ చౌదరిగారి కథ కొడిగట్టిన దీపాలు కథాజగత్‌లో చదవండి.

2, జనవరి 2013, బుధవారం

పుస్తక సమీక్ష -23 ఆ అరగంట చాలు


[పుస్తకం పేరు: ఆ అరగంట చాలు, రచయిత: కస్తూరి మురళీకృష్ణ, వెల :రూ 100/- ప్రాప్తి స్థానం: కస్తూరి ప్రచురణలు, ప్లాట్ నెం.32, దమ్మాయిగూడ, రఘురాం నగర్ కాలనీ, నాగారం పోస్టు, హైదరాబాదు 500 083, నవోదయ బుక్ హౌస్, ఆర్యసమాజ్ మందిరం ఎదురుగా, కాచిగూడ క్రాస్ రోడ్స్, హైదరాబాద్ 500 027  కినిగె మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రేతల వద్ద] 

భయానక కథల సంపుటి అని అట్టపైన కనిపిస్తుంది కనుక దానికి మానసికంగా సిద్ధపడే ఈ పుస్తకాన్ని చదవాలి. ఈ తరహా కథలు వారం వారం పత్రికల్లో చదివితే ఒక రకంగా ఉంటుంది కానీ పదిహేను కథల్ని వరుసగా చదివితే మటుకు భీభత్స రసం అంటే ఏమిటో అనుభవంలోకి వస్తుంది. జీవితంలో అన్ని రసాలూ చవి చూడాలి గనుక ఇదో తరహా అనుభూతి. మొదటి కథలో భయానకం పలచగా ఉండి తరువాతి కథల్లో క్రమేపీ చిక్కబడుతూ చివరి కథకు వచ్చేసరికి తారాస్థాయికి చేరింది అనిపిస్తుంది. చేయితిరిగిన రచయిత కాబట్టి ఈ కథలన్నీ చదివిస్తాయనడంలో సందేహం లేదు. అసలు ఈ పుస్తకం తేవడంలో రచయిత ఉద్దేశమేమిటి? ఈ కథల ద్వారా రచయిత ఏం చెప్పదలచుకున్నాడు? ఈ కథల పరమార్థం ఏమిటి? ఎటువంటి సందేశం వీటి ద్వారా లభిస్తుంది? ఈ రచయిత దెయ్యాలు, భూత ప్రేత పిశాచాలు ఉన్నాయని నమ్ముతున్నాడా? నమ్మడంలేదా? మొదలైన సంశయాలను పక్కనపెట్టి ఈ పుస్తకాన్ని చదివితే బాగానే ఎంజాయ్ చేయవచ్చు. ప్రతి కథ చివరలో మనం ఊహించలేని మలుపును తిప్పుతారు రచయిత. అన్ని కథలు వేటికవే వైవిధ్యంగా ఉన్నాయి. కలకానిదీ,తెల్లపొగ, సాలీడు గూడులో.., అవాహనం కథలు ఎక్కువ నచ్చాయి. మిగతా కథలు కూడా బాగున్నాయి. ఈ పుస్తకం చదవబోయే పాఠకులకు నాదొక సలహా. అన్ని కథలు  ఒకేసారి కాకుండా ఒక కథకు మరొక కథకు మధ్య కనీసం ఓ అరగంట వ్యవధి యిచ్చి చదవండి. ఆ అరగంట చాలు మీరు ట్రాన్స్‌ లోనుండి బయటపడటానికి.