...

...

17, నవంబర్ 2014, సోమవారం

స్వకీయ విలాప కదంబము by నల్లి

మానవ రుధిరపానమే నాకు ఆహారమను మాట నిజమేకాని నావంటి జీవరాసులు భూలోకమున లేవా? ఇంతకు నేజేసిన పాపమేమి? సృష్టికర్త నిర్ణయించిన తీరున నా జీవయాత్ర సాంతముగ కొనసాగించు నిచ్చతో, మానవకోటికి కొంచెముగనో గొప్పగనో లాభకారిగ నుండవలెనను తలపు తప్ప మఱియొకటి నాకు లేదు. చూడుడు. టీ మొదలగు వెలగల నిషావస్తువుల సహాయము  కోరకయే మానవులు నన్ను నమ్మ బలుకుకొని నిద్రాపిశాచమును జయించుచున్నారు. కావున ముఖ్యముగ విద్యార్థుల పాలిటికి దైవసమానురాలను కానా? కుబేరుని వంటి ధనికుల గృహములలో నేనును నా సఖులును నిశాచరులవలె మంచముల మీద తిరుగుచు ఇంటివారి నొక్కమారైనను రాత్రులలో కనులు మూయనియ్యకుండ జేసి తమ యాస్తులను భద్రపఱచుకొన హెచ్చరించుచున్నాను. ఒక కాసైనను వారు మానవ భటుల మీదల శలవు చేయ నవసరము లేకుండ జేయు మాకన్న మహోపకారులు కలరా! ........................................................................................

మిగతా భాగాన్ని క్రింది లంకెలో వెదికి చదువుకోండి.


8, నవంబర్ 2014, శనివారం

సై సై నారపరెడ్డీ!

విద్వాన్ విశ్వం గారి పెన్నేటిపాటలో దొంగసుంకన్న కట్టినపాట :)

2, నవంబర్ 2014, ఆదివారం

శ్రీ సాధనపత్రిక ఇప్పుడు అంతర్జాలంలో!!!

ఆమధ్య నేను సీమసాహితీస్వరం శ్రీసాధనపత్రిక అనే పుస్తకాన్ని సమీక్షిస్తూ శ్రీసాధనపత్రిక పాతసంచికలు పాఠకులకు, పరిశోధకులకు అందుబాటులో లేకపోయాయనే అభిప్రాయాన్ని వెలిబుచ్చాను. దాన్ని చదివిన శ్రీ కైపనాగరాజ గారు తమ వద్ద ఉన్న సాధనపత్రిక భాండారాన్ని ఇంటర్నెట్టులో అందరికీ లభ్యమయ్యేలా పెట్టమని నాకు అందజేశారు. వారి సహకారంతో సాధనపత్రికను ఇక్కడ ప్రతిరోజూ ఒక సంచిక చొప్పున  పొందు పరుస్తున్నాను. చదివి 20వ శతాబ్దపు పూర్వార్థ భాగంలో సీమ వాసుల రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్యవైభవాన్ని ఆస్వాదించండి. ఈ విషయంలో సహకరించిన రవికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 
   

21, అక్టోబర్ 2014, మంగళవారం

విద్వాన్ విశ్వం శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ!

విద్వాన్ విశ్వం శతజయంతి ఉత్సవాల ప్రారంభ సభ కొంపెల్ల శర్మ గారి తెలుగు రథం ఆధ్వర్యంలో ఈ రోజు సాయంత్రం త్యాగరాయగానసభలో జరిగింది. భూమన్ గారు కీలకోపన్యాసం చేశారు. కొంపెల్ల శర్మగారు విద్వాన్ విశ్వం సాహితీ విశేషాలను సభకు పరిచయం చేశారు. కాదంబరిగారు(విశ్వం గారి కుమార్తె) తమ తండ్రితో గల అనుబంధాన్ని, జ్ఞాపకాలనూ వివరించారు. ఉభయరాష్ట్రాలలో అనేక ప్రాంతాలలోను, హైదరాబాదులోనూ విశ్వం గారి శతజయంతి సందర్భంగా అనేక కార్యక్రమాలను నిర్వహించాలని వక్తలు అభిప్రాయపడ్డారు. సభలో నేనూ, త్యాగరాయగానసభ అధ్యక్షులు కళావెంకటదీక్షితులు కూడా పాల్గొన్నాము. 





  

ఆంధ్రభూమి

నమస్తే తెలంగాణా


ఈనాడు

ప్రజశక్తి

 ఈనాడు

ఆంధ్రజ్యోతి

అచ్చరపు సేద్యకాడు

బిలబిలాక్షులేమొ తిలలను పెసలనే
కాదు, కంకి గింజ కానబడిన
పొడిచి,పొడిచి రాల్చి పొలిపుచ్చు పంటను
జడుపుతోడగాని విడిచిపోవు

పై పద్యాన్ని చదివితే వెంటనే మనకు శ్రీనాథుని ఈ క్రింది చాటు పద్యం గుర్తుకు వస్తుంది.

కృష్ణవేణమ్మ గొనిపోయె నింతఫలము
బిలబిలాక్షులు తినిపోయె తిలలుపెసలు
బొడ్డుపల్లెను గొడ్డేరి మోసపోతి
నెట్లుచెల్లింతు టంకంబు లేడునూర్లు?

శ్రీనాథుడేమో బిలబిలాక్షులు తిలలు పెసలు తినిపోయాయని వాపోతుంటే పైన ఉదహరించిన పద్యం చెప్పిన కవి తిలలు పెసలే కాదు అవి జొన్న కంకులను కూడా వదలవయ్యా బాబూ అని  అంటున్నాడు. ఇలా శ్రీనాథుని ఆక్షేపించడం అల్లాటప్పా కవుల వల్ల సాధ్యమయ్యే పని కాదు. దానికి చాలా సత్తా కావాలి.  అలాంటి సత్తా, సారం కలవాడు కాబట్టే ఈ కవి కాళిదాసు కుమారసంభవ, మేఘసందేశ, రఘువంశాదులను, బాణుని కాదంబరిని, భారవి కిరాతార్జునీయాన్ని, మాఘుని శిశుపాలవధను, దండి దశకుమార చరిత్రను, కల్హణుని రాజతరంగిణిని, సోమదేవభట్టు కథాసరిత్సాగరాన్ని తెలుగు పాఠకులకు అరటి పండు వొలిచి ఇచ్చినట్లు అందజేయగలిగాడు.  అంతటి సత్తా కలవాడు కాబట్టే పదిహేనో యేటనే కవిత్వం చెప్పడం ప్రారంభించి ఇరవయ్యవ యేటనే విరికన్నె అనే తొలి కావ్యాన్ని ప్రకటించగలిగాడు. ఒకనాడు, నా హృదయం, పెన్నేటి పాట మొదలైన జీవత్‌కావ్యాలను సృజించగలిగాడు. ఈయన కవి మాత్రమే కాదు పండితుడు, రాజకీయవేత్త, పత్రికా సంపాదకుడు, సంఘసేవకుడు కూడా. అలాంటి వ్యక్తి గురించి ఒకటి రెండు విషయాలు ఇక్కడ ముచ్చటించుకుందాం.

ఈయన 1938 ప్రాంతంలో తరిమెల నాగిరెడ్డితో కలిసి నవ్యసాహిత్యమాల పేరుతో ఒక పుస్తక ప్రచురణ సంస్థను అనంతపురంలో ప్రారంభించి సుమారు 22 గ్రంథాలను ప్రచురించాడు. వాటిలో ఎక్కువ భాగం ఈయన వ్రాసినవి, అనువాదం చేసినవి ఉన్నాయి. సమీక్ష, ఫాసిజం, లెనిన్, ఏమిచెయ్యడం, పాపం మొదలైన పుస్తకాలను వ్రాసి ఈ నవ్యసాహిత్యమాల ద్వారా ప్రకటించి ప్రజలను చైతన్య పరిచాడు.   నవ్యసాహితి అనే పేరుతో ఒక పత్రికను సైతం  తరిమెల నాగిరెడ్డితో కలిసి నడిపాడు. ఆకాశవాణి అనే రహస్య పత్రికకు సంపాదకుడిగా ఉన్నాడు. రాజద్రోహం నేరం క్రింద తరిమెలనాగిరెడ్డి, పప్పూరు రామాచర్యులు మొదలైనవారితో కలిసి కారాగారవాసం చేశాడు. జిల్లా కాంగ్రెస్ రాజకీయాలలో చురుకుగా పాల్గొని జిల్లా కాంగ్రెస్ కార్యదర్శిగా, రైతుసంఘ కార్యదర్శిగా, క్షామనివారణ సంఘకార్యదర్శిగా, జిల్లా రైతుమహాసభకు ఉపాధ్యక్షుడిగా, అనంతపురం మండల ఆంధ్రమహాసభకు కార్యదర్శిగా సేవలనందించాడు.

కేవలం ఉపన్యాసాల ద్వారా, ఉద్యమాల ద్వారా కాక ఇంకాస్త లోతుగా దిగి జనంలో ముఖ్యంగా ఆలోచనాపరులైన యువతలో రాజకీయాలు శాస్త్రీయంగా తెలపాలన్న ఆశయంతో రాజకీయాలనుండి తప్పుకుని పత్రికా రచనవైపు ఈయన తన దృష్టిని సారించాడు. హైదరాబాదులో మీజాన్ పత్రికలో సహాయ సంపాదకుడిగా చేరి కొన్నాళ్లు పనిచేశాడు. తరువాత  ప్రజాశక్తి దినపత్రిక సంపాదకుడిగా, ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్ ఎడిటర్‌గా, ఆంధ్రజ్యోతి దినపత్రికలో సహాయ సంపాదకుడిగా,     ఆంధ్రప్రభ దినపత్రికకు అసోసియేట్ ఎడిటర్‌గా, ఆంధ్రప్రభ సచిత్రవారపత్రిక సంపాదకుడిగా  అవతారం ఎత్తి తెలుపు-నలుపు, అవీ... ఇవీ..., ఇవాళ, మాణిక్యవీణ మొదలైన శీర్షికలను నడిపాడు. ఎన్నో గేయాలను, వ్యాసాలను, పద్యఖండికలను, సమీక్షలను వ్రాశాడు. అనువాదాలను చేశాడు.  పత్రికా సంపాదకుడిగా పదవీవిరమణ చేసిన తరువాత తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకుడిగా వేదాలతో పాటు ఎన్నో సంస్కృత గ్రంథాలను అనువాదం చేశాడు.  నిజాం రేడియోలోనూ, మద్రాసు ఆకాశవాణి ద్వారాను ఎన్నో ప్రసంగాలు చేశాడు. 

కొన్ని లక్షల పుటల వాఙ్మయాన్ని సృజించి అశేష పాఠకులను ప్రభావితం చేసిన ఈ మహానుభావుడి గురించి ఎంతని చెప్పగలం. ఏమని చెప్పగలం. ఒక ముక్కలో చెప్పాలంటే ఈయన పేరు విద్వాన్ విశ్వం!

(ఈరోజు విద్వాన్ విశ్వం 100వ జయంతి )

      





19, సెప్టెంబర్ 2014, శుక్రవారం

పుస్తక సమీక్ష 31 - భారతదేశంలో స్త్రీ!

[పుస్తకం పేరు: భారతదేశంలో స్త్రీ (ఆదిమకాలం నుండి ఆధునిక కాలం వరకు) పేజీలు:112, వెల రూ.100/-, రచయిత: యస్.డి.వి.అజీజ్,  ప్రతులకు: 8106367175]

ఈ వ్యాసంలో అజీజ్ స్త్రీ గురించి ప్రాథమిక అవగాహన కలిగించడానికి (పాఠకులకు) వ్రాసినట్టు పేర్కొన్నాడు. అయితే భారత దేశపు స్త్రీ గురించి రచయిత తనకు తాను ఒక అవగాహన కలిగించు కోవడానికి వ్రాసినట్టుంది ఈ పుస్తకం. కొన్ని కొన్ని విషయాలు మనకు తెలిసినా వాటి గురించి బహిరంగంగా చర్చించడానికి విముఖత చూపుతాము. కారణం మనం వాటిపై కొన్ని నిశ్చితాభిప్రాయలతో ఉండి ఉంటాము. వాటిని మార్చుకోవడానికి సిద్ధపడము. పైకి మాత్రం సభ్యత సంస్కారం అనే నెపం వేస్తాము. ఈ సుదీర్ఘ వ్యాసంలో అజీజ్ ఆదిమానవుల కాలం నుండి నేటి వరకు స్త్రీల పరిణామ క్రమాన్ని సామాజిక కోణంలో  వివరిస్తూ వచ్చాడు.   సామాజిక అవసరాలను బట్టి పుట్టుకొచ్చిన ఆచారాలు సంప్రదాయాలుగా మారిన వైనం  వివరించాడు. బహుభర్తృత్వం, సతీసహగమనం, బహుభార్యత్వం,వితంతు పునర్వివాహ నిషేధం,  బాల్యవివాహాలు, కన్యాశుల్కం, వరకట్నం, దేవదాసి/ జోగిని/ బసివి వ్యవస్థ, కన్యాదానం, పరదా పద్ధతి, పాతివ్రత్యం, నోములు, వ్రతాలు మొదలైన ఆచారాల వెనుకనున్న కారణాలను చర్చించాడు. స్త్రీల పట్ల వివక్షత, స్త్రీ పురుషుల మధ్య ఘర్షణ-కారణాలు, స్త్రీలపై అత్యాచారాలు, స్త్రీల ఆత్మహత్యలు, భ్రూణహత్యలు, ఉద్యోగం చేసే స్త్రీల సమస్యలు, ఇబ్బందులు, వ్యభిచారం, స్త్రీల పట్ల వ్యాపార దృక్పథం, భోగవస్తువుగా స్త్రీలను చూడటం ఇలా అన్ని విషయాలకు మూలాలను వెదికాడు.  స్త్రీల సామాజిక హోదాలో వచ్చిన మార్పులను ఎత్తి చూపాడు.  లైంగిక స్వేచ్ఛ, కుటుంబ విచ్ఛిత్తి, పెళ్లి లేకుండా సహజీవనం గడపడం, స్త్రీవాదం మొదలైన విషయాలను కూడా ప్రస్తావించాడు. వివిధ రంగాలలో, వృత్తులలో, కళలలో భారత స్త్రీలు సాధించిన ప్రగతిని సోదాహరణగా పేర్కొన్నాడు. వ్యాసాన్ని ముగిస్తూ ఇలా పేర్కొంటాడు. "పురుషుడు ఎంతగా ఎదిగినా స్త్రీ పాదాలముందు దోగాడే పసిపిల్లవాడే! ఆమె సహకారం లేనిదే పురోగతి సాధించలేడు." ఈ వ్యాసం వ్రాయడానికి ఉపయోగ పడిన పుస్తకాల జాబితా పరిశీలిస్తే అవి ఎక్కువభాగం హేతువాదుల, నాస్తికుల రచనలుగా గోచరిస్తాయి. వారి ప్రభావం ఈ పుస్తకంపై స్పష్టంగానే కనిపిస్తూ ఉంది. రచయిత కొన్ని చోట్ల వెలిబుచ్చిన అభిప్రాయాలు కొందరిని హర్ట్ చేసేవిగా ఉన్నాయి, ముఖ్యంగా శంకరాచార్యుల పై చేసిన ఆరోపణ.ఓ మతాన్ని కాని, కులాన్ని కానీ, వర్గాన్ని కానీ కించపరచే ప్రయత్నం చేయలేదు అని డిస్క్లయిమర్ ఇచ్చాడు కానీ ఈ పుస్తకం నిండా బ్రాహ్మణ వ్యతిరేకత కనిపిస్తూనే ఉంది. ఆ పాపం రచయితది కాదు అతడు రెఫెర్ చేసిన పుస్తకాలవి.   

3, సెప్టెంబర్ 2014, బుధవారం

మన గురజాడ

[ఆ మధ్య మేము (నేనూ, నాగసూరి వేణుగోపాల్) సంకలనం చేసిన జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు పుస్తకం కోసం సేకరించిన విషయసామాగ్రిలో కొంత మాత్రమే ఆ పుస్తకంలో వినియోగించుకోగలిగాము. ఆ గ్రంథంలో చోటు చేసుకోని రచనలను అడపాదడపా తురుపుముక్క పాఠకులతో పంచుకొంటాను.  1988లో చలసాని ప్రసాద్ సంకలనపరచి విరసం ప్రచురించిన శ్రీశ్రీ వ్యాసాల సంపుటి మనగురజాడపై సర్దేశాయి తిరుమలరావు భారతిలో చేసిన సమీక్ష చదవండి.]

 గురజాడపై ఏమి వ్రాసినా, ఎవరు వ్రాసినా బాగుంటుంది. ఆ వ్రాసేది శ్రీశ్రీ అయితే ఇక చెప్పవలెనా? ప్రస్తుత గ్రంథం శ్రీశ్రీ 1932 నుండి 1976 వరకు అప్పుడప్పుడు వ్రాసిన గురజాడపైని వ్యాసాల సంకలనం. ఇందు 15 వ్యాసాలున్నాయి. రెండు ముత్యాలసరాలు ఛందస్సుమీద. "ముందడుగు" అనే వ్యాసం కామ్రేడుల "సహయాత్రికు"ల కుటుంబ కలహంగా కనిపిస్తుంది. ఈ వ్యాసంలో శ్రీశ్రీ "ప్రపంచం అంతటా కమ్యూనిజాన్ని స్థాపించే ఆఖరు పోరాటం ఇండియాలోనే జరుగుతుందనేది నా దృఢ నిశ్చయం" అంటాడు. శతధాభిన్నమై పోయిన కామ్రేడులకిది ఊరట కలిగించే భరవస అనుకొంటాను. ఈ సమీక్షలో శ్రీశ్రీ కన్యాశుల్క నాటకంపైని వ్రాసిన విషయాలను చర్చిస్తాను. "నాటకమున మధురవాణి వ్యక్తిత్వం పరిపూర్ణముగా ప్రకటింపబడలేదు" అంటాడు శ్రీశ్రీ. నాలాంటివాళ్లేమో మధురవాణి పాత్ర (హామ్లెట్ పాత్రవలె) నాటక పరిధులను దాటి పోయిందనుకొంటాము. నాటకానికంతటికీ మధురవాణి ముఖ్యమైన స్త్రీ పాత్ర అనేది సబబు. రామప్పంతుల మాటల్లో ఆమె తిక్క లంజ. కానీ ఆ తిక్కే వేరు. రామప్పంతుల ధణుతు ఎగురగొట్టిన తిక్క. వసంతసేన పాత్రకంటె మధురవాణి పాత్ర సృష్టి గొప్పదని శ్రీశ్రీ అన్నాడు. ఇది నిజం. వసంతసేన, తగిన మగడు దొరికితే, సవతితనానికైనా ఒప్పుకొనే స్వార్థపరురాలు. బుద్ధిహీనబేల. మధురవాణో, నేటి "విమెన్ లిబ్బరు" వంటిది. నాటకాంతాన కాంతి స్తంభంవలె నిలబడి వుంటుంది. మధురవాణి పాత్రకు సాహిత్య మాతృక ఎక్కడైనా ఉందా అని? తంజావూరు రఘునాథ నాయకాస్థాన విద్వన్మణి మధురవాణి (పేరు ఒకటే చూడండి) కావచ్చును. లేదా పింగళి సూరన "కళాపూర్ణోదయము"లోని కలభాషిణి పాత్ర కావచ్చును. మంచితనంలోనూ, మాటకారితనంలోనూ, పాత్రోన్మీలనంలోనూ, నామ సామ్యంలోనూ మధురవాణి పాత్ర కలభాషిణిని బోలుతుంది.  కన్యాశుల్క నాటకాన్ని సినిమాగా తీసే ప్రయత్నాన్ని శ్రీశ్రీ ఇష్టపడినట్లు లేదు. శ్రీపుల్లయ్యగారు 1950లో తీసిన "కన్యాశుల్కం" సినిమా బాగానే ఉండింది. పూటకూళ్ళమ్మచే గిరీశం చీపురుకట్ట దెబ్బలు తినే "సీను" కళ్ళకు కట్టినట్లుంది. కన్యాశుల్కం బీభత్సరస ప్రధానమైన విషాదాంతనాటకం అని రెండుచోట్ల శ్రీశ్రీ అన్నాడు. కన్యాశుల్కం బీభత్సరసం కలదే. అసహ్యం కలిగించే విషయాలుండడం చేతనూ, కడుపులో త్రిప్పినట్లనిపించే దృశ్యాలుండడం చేతనూ నాటకం బీభత్సమే. ఉదా: గిరీశం పూటకూళ్లమ్మచే చీపురుకట్ట దెబ్బలు తినడం, లుబ్దావధానికి దయ్యం విడిపించే దృశ్యం, తెల్లవారుజామున కాలువగట్టుకు పోతూండే రామప్పంతులను దాసరి వేషంలో వెంకటేశం ఓగత్యపు పాట పాడుతూ అంటుకొనిపోవడం, సారాకొట్టు దృశ్యం, ఇవన్నీ జుగుప్సను కలిగించేవే. నాటకం విషాదాంతం కాదు. ఎందుకంటే కన్యాశుల్కం నాటకం పండోరా పేటికవంటిది. అందుండి ఎన్ని బీభత్సాలు వచ్చినా, అరిష్టాలు వచ్చినా, చిక్కులు, కష్టాలు పైకి దుమికినా అడుగున ఇంకా ఆశ(హోప్) మిగిలిపోతుంది. మానవుని మనుగడకు పరిస్థితులు బాగుపడచ్చుననే ఆకాంక్షే ఏడుగడ. హనుమంతునివంటి చిరంజీవి, త్రికాలజ్ఞుడు రామాయణంలో జీవన్‌భద్రాణి వశ్వతి, తస్మాత్ బ్రతుకుతాను అంటాడు. ఇబ్సెను నాటకం "జనశత్రువు" (An Enemy of the People)ఇదే ఆశను కల్గిస్తుంది. హామ్లెట్ నాటకం తుదిదృశ్యంలో రంగంమీద నాలుగు పీనుగులు పడివున్నా, మనలో "హోప్" పోదు. "కన్యాశుల్కం" అట్టి నాటకం. ఏలాటి ఆశలేని నిజమైన విషాదాంత నాటకాలు సోఫోక్లిసు నాటకం "ఆంటిగొనె" షేక్స్పియరు "లియరు రాజు"(King Lear), సింజ్ వ్రాసిన నాటకం "సముద్ర నావికులు"(Riders to the Sea). ఇంకొక రకపు నాటకాలున్నాయి. నాటకం తుదిలో ఏ అనర్థం జరుగకపోయినా, మోదాంతమే అయినా ప్రేక్షక హృదయాలలో అదోరకమైన సంవేదన(పాథోస్) ఆవరించును. షేక్సుపియరు నాటకాలు "హేమంతగాథ"(The Winters Tale), "సింబలైన్"(Cymbeline), "తుఫాను"(Tempest) అట్టి నాటకాలు. కన్యాశుల్క నాటకమూ ఇట్టి నాటకమే. నాటక పాత్రల నామ్నీకరణం గురించిన శ్రీశ్రీ విమర్శ సరికాదు. లుబ్దావధానులు, కరటకశాస్త్రి పేర్లు అపహాస్యకాలే. నాటకాన ఆరువిధాలయిన హసితాలూ ఉన్నాయి. కన్యాశుల్క నాటకాన్ని రియలిస్ట్ నాటకం (గోర్కీ నాటకం "లోవర్ డెప్త్స్" వలె)అనుకోరాదు. దీని  బాహ్యరూపం ప్రహసనం. ఇందు అసంబద్ధతా(థియేటర్ ఆఫ్ ది అబ్సర్డ్) ధోరణులూ లేకపోలేదు. నాటకోద్దేశం సంస్కరణ. ప్రేక్షకులు విద్యావిహీనులు. అట్టి వారికి వ్రాసిన కన్యాశుల్క నాటకం రాను రాను కాలాన్ని, దేశాన్ని జయించుట రామప్పంతుల మాటలలో చెప్పవలసి వస్తే "అది వేరే కథ". అగ్నిహోత్రావధాని పేరు తప్పుపట్ట పని యుండదు. ఇప్పుడు ఒక సినిమా సుందరి అగ్నిహోత్రి (రతీ అగ్నిహోత్రి) అని పేరు పెట్టుకొంటే లేని ఆక్షేపణ నూరేండ్ల క్రితం ఎనభై పన్నాల వేదం చదివినానని చెప్పికొనే శ్రోత్రియ బ్రాహ్మణుడు పెట్టుకొంటే చేయవలెనా? అన్యాయం!  నికార్సయిన బద్మాషుల పేర్లు రామప్పంతులు, గిరీశం ఎంత సాదాగా రియలిస్టుగా, వారి ఖల స్వభావాన్ని కప్పిపుచ్చుతూ ఉన్నాయో గమనించండి! సందేశాత్మక కావ్య నాటకాలలో పాత్రల పేర్లు అదొక విశిష్టంగా ఉంటాయి. డికెన్సు నవలలు, బన్యన్ "యాత్రికుని పురోగతి"(The Pilgrim's Progress), "ప్రబోధ చంద్రోదయ" నాటకంలోని పాత్రల పేర్లుదాహరణాలు. "సాక్షి" సంఘంలో అందరికంటె బుద్ధిమంతుని పేరు "జంఘాలశాస్త్రి" హాస్యఫోరకంగా వుంది. గిరీశం, రామప్పంతులు, లుబ్ధావధాన్లుది శిథలీకృతమవుతూన్న ఒకానొక సాంఘికవ్యవస్థయొక్క కరాళనృత్యం అన్నాడు శ్రీశ్రీ. నేటివారితో (కన్యాశుల్క నాటకానికి నూరేండ్ల తర్వాతివారు) పోల్చి చూస్తే, రామప్పంతులు, లుబ్ధావధాని, అగ్నిహోత్రావధాని, సత్యహరిశ్చంద్రులవలె, ధర్మరాజువలె కన్పడుతారు. ఆనాటివారు అవినీతి(ఇమ్మారల్)పరులు. నేటి వీరు అనీతి(అ-మారల్)పరులు. కనుక ఎక్కువ ప్రమాదకారులు. హిందూ సంఘం క్యూరెటు (క్రైస్తవ ఫాదరీ సహాయకుడు) కోడిగ్రుడ్డువలె పాక్షికంగా బాగుంటుంది, చెడి వుంటుంది. శ్రీకృష్ణ నిర్యాణమప్పుడూ (ద్వాపర యుగాంతం)ఇట్లే, నేడూ ఇట్లే వుంది. పైగా సౌజన్యారావు,  కరటకశాస్త్రి, మధురవాణి, పరోక్షంగా వీరయ్యపంతులు(కందుకూరి వీరేశలింగం)లాంటి సదాగ్రహులు, ప్రగతిశీలురున్న ఆనాటి వ్యవస్థను శిథిలీకృతమని ఎట్లనగలం? ఇప్పటి వ్యవస్థను ఏమంటాడో శ్రీశ్రీ. గురజాడ కథలలో "మీ పేరేమిటి" తనకు నచ్చినదంటాడు శ్రీశ్రీ. ఈ ఎంపికతో నాకు పేచీలేదు. కాని "పెద్ద మసీదు" లేక "మతము:విమతము" అని పేరుండే కథ గురించి చెప్పుతాను. ఇది గురజాడ వ్రాసిన అతి చిన్న కథ.  (మూడుపుటలు). అన్నిటికంటె గొప్ప కథ. టెరిబుల్ స్టోరీ. ఇతిహాస పరిణామం (ఎపిక్ డైమెన్షన్)కలది. కథ మొదటి వాక్యానికీ, తుది వాక్యానికీ మధ్య వేయి పుటల చరిత్ర వుండి వుంటుంది. ఇసుకరేణువులో ప్రపంచాన్నీ, కాలసూచక గాజు ("అవర్ గ్లాస్")లో అనంతకాలాన్నీ చూపించగల కథ "పెద్ద మసీదు". మీనియేచర్ పెయింటింగ్ వంటిది. గురజాడ కథలు చిన్నవయినా, చాలా తక్కువ సంఖ్యలోనే వున్నా ఇటాలియన్ పునరుజ్జీవన చిత్రకారుడు జార్జియోని గీచిన ఒకే చిత్రం ఒకే బాణీగా భావికాలంవారికి మార్గదర్శకమైనట్లు, తెలుగు చిన్న కథలకు ఒరవడి పెట్టినాయి. గురజాడ గొప్పతనాన్ని శ్రీశ్రీ మొట్టమొదట కనిపెట్టలేదు. కానీ, గురజాడను ఎప్పుడూ తగిన "ఫోకస్"లో ఉంచిన ఘనత శ్రీశ్రీకే దక్కుతుంది. శ్రీశ్రీ గురజాడ గురించి ఇంత తక్కువ వ్రాసినాడే, ఇంకా ఎక్కువగా ఎందుకు వ్రాయలేదు అనిపిస్తుంది. ఒక్కొక్క వాక్యమే ఒక్క పేరాగ్రాఫుగా నిల్చినాయి. గురజాడను కామ్రేడుగా కూడా చేసినాడు. ఒక వర్గంవారేమో గురజాడ ఒక జమీందారు తాబేదారుడంటున్నారు. "కనిపించని వంద వృక్షాలకన్న" "దేశభక్తి" గీతం మిన్న. సన్మానాలు పొందే లక్ష సామ్రాట్టులకన్న ఒక కామ్రేడ్ గురజాడ మేలు" అని శ్రీశ్రీ తుది వ్యాసంలోని తుది వాక్యం. గురజాడ హెచ్చగుటకు విశ్వనాథ లొచ్చు కానక్కరలేదు. ఈ విపరీత ధోరణినే విశ్వనాథ అభిమానులు, గురజాడ తిరస్కారులు అవలంబిస్తున్నారు. ఈ వాక్యాన్ని శ్రీశ్రీ బ్రాండు ఫ్లిప్పెన్సీ అనుకొన్నా ఇచట ఒకటి చెప్పవలసి వుంది. ఫ్రెంచి రచయిత, నోబెల్ బహుమాన గ్రహీత అయిన ఆండ్రేజీద్‌ను ఎవరో "అందరు ఫ్రెంచి కవులలో గొప్పకవి ఎవరు?" అని అడిగినారట. జీద్ కొంచెం ఆలోచించి "దురదృష్టవశాత్తు విక్టర్ యూగోయే" అన్నాడట. ఈ మాట విశ్వనాథకు చెల్లుతుంది. ఆయన అంటే కొంతమందికి సరిపోకుండిననూ, విశ్వనాథ 20వ శత్తాబ్దంలో అత్యుత్తమ తెలుగుకవి. శ్రీశ్రీ అట్లంటే నేనిట్లా అంటున్నాను. సాహిత్య పరిశోధకులకూ, గురజాడ పఠితలకూ శ్రీశ్రీ "మన గురజాడ" ఒక టార్చిలైటు వలె గురు జాడను చూపించే గ్రంథం అనడంలో నాకు సందేహం లేదు. వ్యాసాల కూర్పు, ఎడిటింగు, ప్రేమ, కృషి. చలసాని ప్రసాద్ ఇందుకు అభినందనీయుడు.


29, జులై 2014, మంగళవారం

చేరా పీఠిక

 ఇటీవలే కన్నుమూసిన ఆచార్య చేకూరి రామారావుగారు నా సమీక్షావ్యాసాల సంపుటి గ్రంథావలోకనమ్‌కు పీఠికను అందించారు. ఈ పీఠిక కోసం వారితో వారం పదిరోజుల సాన్నిహిత్యం ఏర్పడింది. తన ఇంటిముందు 'ఇచట పీఠికలు వ్రాయబడును' అని ఒక బోర్డు తగిలించుకొనమని ఒక మిత్రుడు సలహా ఇచ్చినట్లు నాతో సరదాగా అనేవారు. వారికి నివాళిని అర్పిస్తూ నా పుస్తకానికి వ్రాసిన పీఠికను తురుపుముక్క పాఠకులకోసం ఇక్కడ ఇస్తున్నాను.





17, జులై 2014, గురువారం

కనుక్కోండి చూద్దాం?

పై ఫోటోలో ఉన్న వ్యక్తిది మనం సాహిత్యరంగంలో ప్రముఖంగా తరచూ వింటున్నపేరే. 1985ప్రాంతాలలో తీసిన ఈ చిత్రంలో ఉన్నదెవరో గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేక పోయారా? అయితే ఇక్కడ నొక్కండి. 

13, జులై 2014, ఆదివారం

తెలంగాణా ఆత్మబంధువు!

ఈ రోజు (13 జులై 2014) ప్రజాశక్తి దినపత్రిక ఆదివారం అనుబంధం సోపతిలో

9, జులై 2014, బుధవారం

పుస్తక సమీక్ష -30 అక్షరాభిషేకం!


డా.రాధేయగారి అభినందన సంచిక 'అవిశ్రాంతమూర్తికి అక్షరాభిషేకం' పై నేను వ్రాసిన సమీక్ష సాహితీకిరణం తాజాసంచికలో ప్రచురింపబడింది. ఐతే స్థలాభావం వల్లనేమో సమీక్ష పూర్తిగా కాకుండా కుదించి వేశారు. ఇక్కడ పూర్తి పాఠం చదవవచ్చు.

అవిశ్రాంతకవితామూర్తికి అక్షరాభిషేకం
అనంతపురంలోని స్పందన అనంతకవుల వేదిక 2013 మే 19 తేదీన సుప్రసిద్ధ కవి, విమర్శకులు డా.రాధేయగారికి 'జీవన సాఫల్య పురస్కారం' అందజేసింది. సందర్భంగా అనంతకవుల మదిలో రూపుదిద్దుకున్న ఆలోచన ఫలితమే అభినందన సంచిక. జెన్నె ఆనందకుమార్, వి.చంద్రశేఖరశాస్త్రి(చం), ఉద్దండం చంద్రశేఖర్, మధురశ్రీ, ఆకుల రఘురామయ్య, ..నాగేంద్ర ప్రభృతుల కృషితో డా.రాధేయగారి మూడున్నర దశాబ్దాల సాహితీప్రస్థానమూ, ఉమ్మడిశెట్టి సాహితీ పురస్కార రజతోత్సవమూ, 31 సంవత్సరాల అధ్యాపక పదవీ విరమణ సందర్భమూ కలుపుకుని అభినందన సంచిక వెలుగు చూసింది..
ప్రత్యేక సంచికలో కీర్తిశేషులు జానమద్ది హనుమచ్ఛాస్త్రి, శ్రీయుతులు బన్న అయిలయ్య, కొలకలూరి ఇనాక్, బి.హనుమారెడ్డి, కె.శివారెడ్డి, అద్దేపల్లి రామమోహనరావు, ఎన్.గోపి, రావి రంగారావు, మసన చెన్నప్ప, ఎస్జీడీ చంద్రశేఖర్, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, కొండేపూడి నిర్మల, కత్తి పద్మారావు, తేళ్ళ సత్యవతి, మునుగోటి సుందరరామశర్మ, సడ్లపల్లె చిదంబరరెడ్డి, సంకేపల్లి నాగేంద్ర శర్మ, సబ్బని లక్ష్మినారాయణ, వి.పి.చందన్రావు, కొండపల్లి నీహారిణి, పాతూరి అన్నపూర్ణ, కె.జి.వేణు, నందవరం కేశవరెడ్డి, అశ్రుజల కవి కె.వి.రమణారెడ్డి, సి.హెచ్.ఆంజనేయులు, అంగలూరి అంజలీదేవి, బండి సత్యనారాయణ, కర్రా కార్తికేయశర్మ, మందరపు హైమవతి, కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి, సంగవేని రవీంద్ర, ఎన్వీ రఘువీరప్రతాప్, వనపట్ల సుబ్బయ్య, మౌనశ్రీ మల్లిక్ మొదలైన ఎందరో ప్రముఖులు రాష్ట్రం నలుమూలల నుండే కాక ముంబై మొదలైన సుదూర ప్రాంతాల నుండి తమ అభినందన సందేశాలను అందజేయడంతోపాటు రాధేయగారితో వ్యక్తిగతంగానూ, సాహిత్యపరంగానూ తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. శిష్యత్రయం పెళ్ళూరు సునీల్, సుంకర గోపాల్, దోర్నాదుల సిద్దార్థ గురువుగారితో తమకున్న అనుబంధాన్ని, వారి పేరు మీద నెలకొల్పిన కవితాపురస్కారం నేపథ్యాన్ని వివరించారు. 


గొల్లాపిన్ని శేషాచలం, మధురశ్రీ, ఆకుల రఘురామయ్య, పాళెం వెంకటకొండారెడ్డి, కెరె జగదీష్, దాట్ల దేవదానం రాజు, కె.వి.రామానాయుడు, సిరికి స్వామినాయుడు, మల్లెమాల వేణుగోపాలరెడ్డి, జూటూరి షరీఫ్, కిలపర్తి దాలినాయుడు, మోపూరు పెంచల నరసింహం, వి.సూర్యారావు, బీరం సుందరరావు, బొగ్గరపు రాధాకృష్ణమూర్తి, చం, మిద్దె మురళీకృష్ణ, ముకుందాపురం పెద్దన్న, జెన్నె అభిషేక్ తదితరులు వచన కవితల్లో రాధేయగారిపై తమ అభిమానాన్ని చాటుకున్నారు.  అమళ్ళదిన్నె వేంకటరమణ ప్రసాద్, కోడీహళ్లి మురళీమోహన్, ఒంటెద్దు రామలింగారెడ్డి, ఎం.సింహాద్రి మొదలైనవారు పద్యప్రసూనాలను సమర్పించినారు.
డా.రాధేయగారి కవితా సంపుటులపై మానేపల్లి సత్యనారాయణ, జినేంద్ర, కుందుర్తి ఆంజనేయులు, అద్దేపల్లి రామమోహనరావు, టి.గౌరీశంకర్, టి.ఎల్.కాంతారావు, గూడ శ్రీరాములు, వైశాఖి, ఆవంత్స సోమసుందర్, విహారి, కల్పనారెంటాల, దర్భశయనం శ్రీనివాసాచార్య, నందిని సిధారెడ్డి, రాచపాళెం చంద్రశేఖరరెడ్డి, విరియాల లక్ష్మీపతి, పత్తిపాక మోహన్, కె.శివారెడ్డి ప్రభృతుల వ్యాసాలు ఈ అభినందన సంచికలో చొటుచేసుకున్నాయి. డా.రాధేయగారి విమర్శనా గ్రంథాలయిన కవిత్వం ఓ సామాజిక స్వప్నం/సంస్కారం/సత్యంలపై  ద్వా.నా.శాస్త్రి, మాకినీడి సూర్యభాస్కర్, కొప్పర్తి వెంకటరమణమూర్తి, కె.బయ్యపురెడ్డి, దేవరాజు మహారాజు, పి.రమేష్ నారాయణ గార్ల అమూల్యాభిప్రాయాలు దీనిలో ఉన్నాయి.  ఆధునిక కవిత్వానికి ప్రతిష్ఠాత్మక పురస్కారం ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు ప్రారంభమైన 1988 నుండి 2012 దాకా అవార్డుసభల వివరాలు  ఫోటోలతో సహా వివరంగా ఇచ్చారు. ఈ జాబితాను పరిశీలిస్తే ఈ అవార్డు విశిష్టత, ప్రామాణికత సులభంగా తెలిసిపోతుంది.  ఇంకా ఈ అభినందన సంచికలో డా.రాధేయగారి జీవన రేఖలు,  డా.రాధేయగారి అంతరంగాన్ని ఆవిష్కరింపజేసే చిల్లర భవానీదేవిగారి ఇంటర్వ్యూ, వారి జీవితం కవిత్వం గురించిన ఎ.ఎ.నాగేంద్రగారి వ్యాసం కూడా ఉన్నాయి.
కడపజిల్లా ముద్దనూరు మండలం యామవరం గ్రామంలో ఓ సామాన్య చేనేత కుటుంబంలో జన్మించిన వి.ఎన్.సుబ్బన్న 1982లో హిందీ ఉపాధ్యాయునిగా ఉద్యోగజీవితం ప్రారంభించారు. పదవీ విరమణ కావించే సమయానికి డిగ్రీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకులుగా ఎదిగారు. ఉన్నత చదువులు చదుకోవాలనే బలమైన కాంక్షతో ఎం.ఏ.ప్రైవేటుగా చదివి 2008లో శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి "ఆధునికాంధ్ర కవిత్వానికి సీమ కవుల దోహదం" అనే అంశం మీద పరిశోధనచేసి డాక్టరేటు పట్టా పుచ్చుకున్నారు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు నిర్వర్తిసూనే వీరు కవిత్వం వైపు తమ దృష్టిని సారించారు. చిన్నతనంలో చదివిన సాహిత్యం ప్రభావంతో శ్రీశ్రీ ప్రేరణతో కవితలల్లడం ప్రారంభించారు. వీరి తొలికవిత 'ఇదా నవభారతం?' 1972లో ప్రచురింపబడింది. ఆ తర్వాత రాధేయ అనే కలంపేరుతో అంచలంచెలుగా వీరు కవిగా ఎదిగి 'మరోప్రపంచం కోసం(1978)', 'దివ్యదృష్టి(1981)', 'జ్వలనమ్(1983)', 'తుఫాను ముందటి ప్రశాంతి(1986)', 'ఈ కన్నీటికి తడిలేదు(1991)', 'క్షతగాత్రం(2003)', 'మగ్గం బతుకు(2006)', 'అవిశ్రాంతం(2009)' అనే ఎనిమిది కవితాసంపుటులను వెలువరించారు.  ఈ పుస్తకాలు వీరికి ఎన్నో అవార్డులూ, రివార్డులూ సంపాదించిపెట్టి వీరిని జాతీయకవిగా ఎదగడానికి దోహదం చేశాయి.
వీరి కథలు సుమారు పాతికదాకా ప్రచురింపబడ్డాయి. 1988లో తమ యింటిపేరు మీద ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డు నెలకొల్పి ప్రతియేటా ఒక ఆధునిక ఉత్తమ కవితా సంకలనాన్ని ఎంపికచేయించి ఆ కవిని సత్కరించే కార్యక్రమాన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. ఈ అవార్డు తెలుగు సాహిత్యజగత్తులోని అత్యుత్తమ పురస్కారాలలో ఒకటిగా పేరుగడించడానికి వీరి నిబద్ధతే ముఖ్యమైన కారణం. ఈ అవార్డు ఎంపికలో ప్రాంతీయాభిమానం, పక్షపాత ధోరణులకు తావివ్వరు. అవార్డు ఎంపికలో వీరి ప్రమేయం ఉండదు. న్యాయనిర్ణేతల నిర్ణయానికే కట్టుబడి ఈ అవార్డు ప్రదానం చేయడం వల్ల ఇదొక ప్రతిష్ఠాత్మక అవార్డుగా గుర్తింపు పొందింది. ఈ అవార్డును అందుకున్నవారిలో సౌభాగ్య, శిఖామణి, సుధామ, అఫ్సర్, పాపినేని శివశంకర్, ఆశారాజు, కందుకూరి శ్రీరాములు, దర్భశయనం శ్రీనివాసాచార్య, చిల్లర భవానీదేవి, నాళేశ్వరం శంకరం, విజయచంద్ర, జూపల్లి ప్రేమ్‌చంద్, అన్వర్, దాసరాజు రామారావు, పి.విద్యాసాగర్, కొప్పర్తి, మందరపు హైమవతి, ప్రభు, గంటేడ గౌరునాయుడు, తైదల అంజయ్య, పెన్నా శివరామకృష్ణ, యాకూబ్, కోడూరి విజయకుమార్, సిరికి స్వామినాయుడు, కొండేపూడి నిర్మల, శైలజామిత్ర ఉన్నారు.
అవార్డు పరిశీలనకు వచ్చిన అనేక కవితా సంపుటాలతోబాటు రాష్ట్రం నలుమూలల నుండి ఎందరో కవిమిత్రులు పంపిన కవిత్వపుస్తకాలనూ, వివిధ పత్రికలలో ప్రచురింపబడే కవిత్వాన్నీ ఎంతో మమేకంతో చదివే రాధేయ ఆ కవితలలోని వస్తువుని పరిశీలించడం మొదలుపెట్టారు. అక్షరం, పుస్తకం, కుర్చీ, రోడ్డు, పేపర్ బాయ్, నులకమంచం, పోస్ట్‌మేన్, గోదావరి, నయాగర ఇలా  విభిన్న వస్తువులను తీసుకుని వివిధ కవులు వాటిని ఏవిధంగా తమ కవిత్వంలో వ్యక్తం చేశారనే అంశాన్ని విశ్లేషిస్తూ వందల కొద్దీ వ్యాసాలను వ్రాసి వివిధ పత్రికలలో ప్రచురించారు. మంచి కవితా వాక్యాలు కనిపిస్తే చాలు అవి వ్రాసింది మహాకవి అయినా కొత్తగా వ్రాస్తున్న కవి అయినా వాటిని ఈ వ్యాసాలలో కోట్ చేయడం రాధేయగారి నైజం. ఇలా యువకవులెందరినో గొప్ప కవుల సరసన నిలబెట్టి వారికి చైతన్యాన్ని, ఉత్తేజాన్ని కలిగిస్తారు రాధేయ. ఈ వ్యాసపరంపర రాధేయగారిని ఒక గొప్ప విమర్శకునిగా నిలబెట్టింది. ఈ వస్తు వైవిధ్య విశ్లేషణా వ్యాసాలలో కొన్నింటిని ఇప్పటివరకు కవిత్వం ఓ సామాజిక స్వప్నం, కవిత్వం ఓ సామాజిక సంస్కారం, కవిత్వం ఓ సామాజిక సత్యం అనే పేర్లతో మూడు సంపుటాలుగా వెలువరించారు. ఈ పుస్తకాలు అనేక పురస్కారాలను వీరికి సంపాదించి పెట్టింది.  యువస్వరాలు అనే కవితా సంకలనం, రా.రా.పై ఎక్స్‌రే ప్రత్యేక సంచికలకు సంపాదకత్వం నిర్వహించారు. రాజ్‌కోట్‌లో జరిగిన సర్వభాషా కవిసమ్మేళనం, రెండవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు,  నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభలలో పాల్గొని తమ కవితాగళాన్ని వినిపించారు. వీరి కవిత్వమూ, కథలూ ఇంగ్లీషు, హిందీ, కన్నడ తదితర భాషల్లో తర్జుమా కాబడింది. 
డా.రాధేయగారి సమగ్ర సాహిత్య స్వరూపాన్ని ఆవిష్కరిస్తున్న ఈ అభినందన సంచిక యువకవులకు, సాహిత్యాభిమానులకు స్ఫూర్తిదాయకంగా ఉంది. ఈ అభినందన సంచిక తీసుకువచ్చిన అనంత కవిబృందానికి అభినందనలు!

[పుస్తకం పేరు: అవిశ్రాంత కవితామూర్తికి అక్షరాభిషేకం, ప్రచురణ:శ్రీమతి జెన్నె(ఎం) మాణిక్యమ్మ పబ్లికేషన్స్, అనంతపురం, పుటలు:178, వెల:రూ250/- ప్రతులకు: డా.రాధేయ, కవితానిలయం, 13-1-606-1, షిర్డీసాయినగర్,రెవెన్యూకాలనీ, అనంతపురం 515001]   

15, జూన్ 2014, ఆదివారం

6, జూన్ 2014, శుక్రవారం

మే నెల కథ!

మే నెలలో కథాజగత్‌లోఎక్కువ మంది చదివిన కథ ఏదో తెలుసుకోవాలంటే ఇక్కడ   నొక్కండి.

5, జూన్ 2014, గురువారం

పుస్తక సమీక్ష -29 రాయలసీమ భారతి - శ్రీ సాధన పత్రిక

సగటున 150 పేజీలతో వెలువడిన ఒక సాహిత్య మాసపత్రికతో పన్నెండు పుటల ఒక రాజకీయ వారపత్రికను సరిపోల్చడం చాలామందికి అసంబద్ధంగా తోచవచ్చు.  కానీ శ్రీసాధనపత్రిక తన ప్రాంతంలో కలిగించిన రాజకీయ చైతన్యంతోపాటు ఆకాలంలో ఆ పత్రిక చేసిన సాహితీ కృషి మాత్రం  ముమ్మాటికీ  భారతితో పోల్చదగినదే.  1926లో పప్పూరు రామాచార్యుల సంపాదకత్వంలో ప్రారంభమైన ఈ పత్రిక వావిలాల గోపాలకృష్ణయ్య, సర్దేశాయి తిరుమలరావు, ఆచార్య ఎన్.జి.రంగా, తిరుమల రామచంద్ర, ఐదుకల్లు సదాశివన్ వంటి ఎందరో ప్రముఖుల మన్ననకు పాత్రమైంది.  రాయలసీమలో అనేక ఆధునిక సాహిత్య ప్రక్రియల వికాసానికి పట్టుకొమ్మగా నిలిచిన శ్రీసాధన పత్రిక సంచికలను ప్రెస్ అకాడెమీకానీ, విశ్వవిద్యాలయాలు కానీ, రాజ్యాభిలేఖా గారము కానీ భద్రపరచలేక పోయి ఈ తరం సాహిత్యాభిమానులకు, పరిశోధకులకు తీవ్రమైన అన్యాయం చేశాయి. యువ పరిశోధకుడు డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి ఈ పత్రిక పాతసంచికలను అనంతపురం లలితకళాపరిషత్‌లో వున్న గ్రంథాలయంలో గుర్తించి శిథిలావస్థలో ఉన్న వాటిని ఎంతో శ్రమకోర్చి ఎత్తి వ్రాసుకుని ఈ పత్రికను మళ్ళీ వెలుగులోనికి తెచ్చాడు.

శ్రీసాధన పత్రికలో ప్రచురింపబడిన కవిత్వం, కథలు, స్కెచ్‌లు, నాటికా సాహిత్యం, లేఖాసాహిత్యం, యాత్రా చరిత్రలు, పుస్తక విమర్శలు, పుస్తక పరిచయాలు, సాహిత్య విమర్శావ్యాసాలు, చారిత్రక వ్యాసాలు మొదలైన వాటినన్నీ వివరిస్తూ విశ్లేషిస్తూ డా.అప్పిరెడ్డి వ్రాసిన వ్యాసాల సంకలనం ఈ 'సీమసాహితీ స్వరం శ్రీసాధన పత్రిక'.  జాతీయోద్యమం, సంఘసంస్కరణ, ప్రజల జీవన స్థితిగతులు, కరువులు, క్షామనివారణ, సాగునీటి సమస్యలు, సహకారోద్యమం,స్వదేశీ వస్త్ర ఉద్యమం, స్త్రీవిద్య, వితంతు సమస్యలు, సామ్యవాద సిద్ధాంతము, మానవీయ సంబంధాలు, ఓట్ల రాజకీయాలు, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక, ధార్మిక అంశాలు మొదలైన ఎన్నో విషయాలపై ఈ పత్రికలో వెలువడిన సాహిత్యాన్ని ఈ పుస్తకం వివరిస్తుంది.  ఇంకా ఈ పత్రికలో వచ్చిన ప్రకటనలు, వార్తల ఆధారంగా ఆ సమయంలో వెలువడిన పుస్తకాలు, నాటక ప్రదర్శనలు, సాహిత్య సంస్థల కార్యకలాపాలు, సమకాలీన పత్రికల వివరాలు విపులంగా తెలిపాడు రచయిత.  సుగాత్రీ శాలీనుల లేఖాసంవాదము, భవానీ లేఖలు, కోమలి లేఖలు, ఆదోని పురాణ సంఘం ఉపన్యాసాలు వంటి చాలా ఆసక్తిని కలిగించే అంశాలు ఈ పత్రికలో చోటుచేసుకున్నాయి.

శ్రీసాధన పత్రిక సంపాదకులు, దాని పాఠకులు ఎంతటి నిష్పాక్షికమైన, నిర్భయమైన, ఘాటైన విమర్శలు చేసేవారో ఈ క్రింది ఉదాహరణలు చూస్తే తెలుస్తుంది.
1.కనపర్తి వరలక్ష్మమ్మ  దత్తమండలాలలో తను పరిశీలించిన అంశాలను వివరిస్తూ గృహలక్ష్మిలో వ్రాసిన వ్యాసానికి ఈ పత్రిక ఇలా స్పందించింది. 'ఈ వాక్యాలలో స్త్రీల అభివృద్ధికి పనికొచ్చు ముక్క యొక్కటిలేదు. దత్తమండలంవారి దారిద్ర్యము నెత్తి పొడుచుటయు వారి భాష తెలుగు కాదనుటయు నిందలి యుద్దేశ్యము. ఆంధ్రవిశ్వవిద్యాలయ కార్యస్థాన ప్రచారమావిధముగా కూడా సాగుచున్నది. వ్యాసకర్తిణి శ్రీమతి వరలక్ష్మమ్మగారు దత్తమండలములో నేభాగమునో మంచమునకు నోచని హీనజాతివారి సంబంధమునెరింగియుండవలయును.'
2. అనంతపురంలో ప్రదర్శింపబడిన రంగూన్‌రౌడీ అనే నాటకంపై ఒక పాఠకుని విమర్శ. 'రంగూన్ రౌడి పాత్రధారి శ్రీ వేమూరి గగ్గయ్య తానొక గొప్ప యాక్టరునని, సినిమా నటుడనని తానేమి చేసిననూ చెల్లునను భావం ప్రతి వాక్కునందును, చర్యయందును స్ఫురించుచుండెను. వారి అభినయము కళకు, రసమునకు దూరమై కేవలము మెకానికల్‌గా నుండెనన్న అతిశయోక్తి కాదు. అన్నపూర్ణ పాత్ర పోషించిన శ్రీమతి  పసుపులేటి కన్నాంబ ఏడ్పంతయూ పాటలోనే ఏడ్చిరి. సినిమాలలో పాడుటకు యవకాశములు తక్కువగుటచే ఆలోపమును ఈ మూలముగా భర్తీ పెట్టుకొనతలచి నట్లుండెను. పాటపాడు నపుడు కన్నాంబగా, మాట మాట్లాడినపుడు అన్నపూర్ణగా ఆ పాత్ర తుదివరకు పోషించినది. ప్రభావతి పాత్ర ధరించిన శ్రీమతి ఋష్యేంద్రమణి గాత్రము మాత్రమే మిగిలినది. పాత్ర ప్రదర్శన, భావప్రకటన పూర్తిగా నశించింది. అద్దెకు తెచ్చుకున్న మసిగుడ్డలు, పరదాలు ఇట్టి పరికరములు పాత్రలతో శ్రీరాజరాజేశ్వరీ నాట్యమండలివారు క్షామ నిలయమైన మా రాయలసీమను దోచుకొనుచున్నారు. కానీ సహజ సంగీతాభిమానులైన ఈ రాయలసీమవాసులు వారిని పోషించుచున్నారు. మరియు గొప్ప సినిమా యాక్టర్లని పామరజనులు ముగ్ధులై తమ కష్టార్జితమును వీరిపాలు చేసి పశ్చాత్తాప పడుతున్నారు.'   

ఈ పత్రికలో బేవినహళ్ళి కరణం కృష్ణారావు, కిరికెర రెడ్డి భీమరావు, విద్వాన్ విశ్వం, తలమర్ల కళానిధి, బత్తలపల్లి నరసింగరావు, శొంఠి శ్రీనివాసమూర్తి, చిలుకూరు నారాయణరావు, పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, కల్లూరు అహోబలరావు, కుంటిమద్ది శేషశర్మ, పి.ఎస్.ఆచార్య, కందాళ శేషాచార్యులు, హెచ్.నంజుండరావు, టి.శివశంకరపిళ్ళె, రాళ్లపల్లి గోపాలకృష్ణ శర్మ, కలచవీడు శ్రీనివాసాచార్యులు, జనమంచి సుబ్రహ్మణ్య శర్మ, జనమంచి శేషాద్రిశర్మ, బళ్ళారి రాఘవాచార్యులు, ఎస్.రాజన్న కవి, రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ, గాడిచర్ల హరిసర్వోత్తమరావు మొదలైన ఎందరో సీమరచయితల రచనలు వెలుగుచూశాయి. 

ఈ పత్రిక పప్పూరు రామాచార్యులు మరణించే(1972)వరకూ వెలువడినదని ఈ పుస్తకంలో ఉంది. కానీ  తరువాత కూడా ఈ పత్రికను రామాచార్యుల కుమారుడు పప్పూరు శేషాచార్యులు కొంత కాలం నడిపాడు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ పత్రిక మరి కొంతకాలం నడిచి ఆగిపోయింది. ఈ పత్రికను నేను 1978-80 మధ్యకాలంలో చదివినట్టు గుర్తు.  విద్వాన్ విశ్వం 1938-39లో ఈ పత్రికలో విశ్వభావన అనే శీర్షిక నడిపాడని తెలుస్తున్నది. కానీ ఆ సమాచారం ఈ పుస్తకంలో లేదు.  మొత్తం మీద డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి శోధించి వెలువరించిన ఈ పుస్తకం ద్వారా శ్రీసాధన పత్రిక మళ్ళీ సాహిత్యాభిమానులకు చేరువైనట్లయ్యింది. ఇప్పటికైనా శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం వారు కానీ, ప్రభుత్వం కానీ చొరవ చూపి ఈ పత్రికను స్కాన్ చేసి అంతర్జాలంలో అందరికీ అందుబాటులో లభించేటట్లు చూడాలి.

[పుస్తకం పేరు : సీమ సాహితీ స్వరం శ్రీ సాధన పత్రిక, సంపాదకుడు :డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి, పుటలు :268, వెల:రూ200/- ప్రతులకు: శ్రీమతి జెన్నె(ఎం)మాణిక్యమ్మ పబ్లికేషన్స్,రెండవ అంతస్తు,రూమ్ నెం.7, మహమ్మద్ కాంప్లెక్స్,ఉపాధ్యాయ భవన్ ఎదురుగా, ఆదిమూర్తి నగర్,అనంతపురము 515 001]  

4, మే 2014, ఆదివారం

ఏప్రిల్ మాసం కథలు!

ఏప్రిల్ నెలలో కథాజగత్‌లోని కథలలో ఎక్కువమంది చదివిన కథ శివ సోమయాజుల గారి శ్రీరాముడికో "లైకు". తరువాతి స్థానాలను వరుసగా వంశీకంఠస్ఫూర్తిగారి ఎండమావులు, శ్రీకంఠస్ఫూర్తి గారి పరోపకారార్థం,  దగ్గుమాటి పద్మాకర్ గారి s/o అమ్మ, ఓగేటి ఇందిరాదేవిగారి రాత్రౌ తరతి నర్మదా సంపాదించుకున్నాయి.

21, ఏప్రిల్ 2014, సోమవారం

20, ఏప్రిల్ 2014, ఆదివారం

మరో రెండు కథలు!

"మనమంతా కర్మజీవులం నాయనా! పాప పుణ్యాల పరిధిలో పరిభ్రమిస్తున్న వాళ్ళం. ఈ భిక్షగాళ్ళు కర్మజీవులు. బ్రతుకు గతి తప్పిన స్థిత్లో వేరే దారిలేక, ఈ స్థితికి దిగజారిన వాళ్ళు. ఎవరూ కావాలని దిగజారి పోరుకదా! ఒకరిముందు దేహీ అనే జన్మ ఎంత దౌర్భాగ్యమో ఊహించండి! ఏదో మనకు ఉన్నంతలో, మనం తిన్నంతలో ఎంతోకొంత..."

    భిక్షపతి మాటలు కనకారావుకు మింగుడు పడలేదు. 'ఈయనేదో వేదాంతం కబుర్లు చెబుతున్నాడుగానీ, లోపల మరో మనిషి ఉన్నాడు. అందరి ముందు ఇలా ధర్మం చేయడంలో అంతరార్థం ఏదో ఉండేఉంటుంది. మందిలో మంచివాళ్ళలా నటించి... ముఖ్యంగా ఈ రైలు ప్రయాణాల్లో మోసాలు చేసేవాళ్ళని, ఎంతమందిని చూడటంలేదు. ఈ వానపాముకూడా అలాంటివాడే సందేహం లేదు.'

ప్రముఖ కథారచయిత శ్రీకంఠస్ఫూర్తిగారి పరోపకారార్థం కథలో ఆ వానపాము గురించి వివరంగా తెలుసుకోండి. వారి అబ్బాయి వంశీకంఠస్ఫూర్తి కథ  'ఎండమావులు'ను కూడా కథాజగత్‌లో చదవండి.

13, ఏప్రిల్ 2014, ఆదివారం

పుస్తక సమీక్ష - 27 వీవర్స్ & లూమ్స్

[పుస్తకం పేరు: Weavers&Looms, రచయిత: Dr.P.Ramesh Narayana, ప్రచురణ:ఉమ్మడిశెట్టి సాహితీ ప్రచురణలు, అనంతపురము ప్రతులకు: డా.రాధేయ, కవితానిలయం,13-2-172, షిరిడినగర్, రెవిన్యూ కాలనీ,అనంతపురం 515001 వెల: రూ100/- $10]
వర్తమాన కవులలో సుప్రసిద్ధులు, ప్రముఖ విమర్శకులు, ఉమ్మడిశెట్టి సాహితీఅవార్డు వ్యవస్థాపకులు అయిన డా.రాధేయగారి మాగ్నమ్ ఓపస్ మగ్గంబతుకు దీర్ఘకావ్యానికి ఆంగ్లానువాదం ఈ Weavers&Looms. ఈ పుస్తకంలో ఎడమవైపు తెలుగు మూలము కుడివైపు పేజీలలో ఇంగ్లీషు అనువాదము ప్రచురించారు. అనువాదకులు డా.రమేష్‌నారాయణ Reflections on Human Nature అనే పుస్తకం ద్వారా ఇదివరకే తమ సత్తాను చాటుకున్నవారు. అనువాదం చాలా సరళంగా, ఎక్కడా సారస్యం చెడకుండా హాయిగా సాగింది. ముక్కస్య ముక్కః అన్నట్లుగా ఉన్న ఈ అనువాదం మూలరచన యొక్క సారాంశాన్ని తెలుగు తెలియని పాఠకులకు అందజేయడంలో పూర్తిగా సాఫల్యం చెందింది అనవచ్చు.

రమేష్‌నారాయణగారి అనువాదనైపుణ్యానికి శాంపిల్ క్రింద చూడండి.

"మేధావుల్లారా!
గుప్పెడు పత్తి మా మొహాన కొడితే
మూరెడు వస్త్రం నేసి మీకందిస్తాం!
ప్రతి ఎన్నికలముందు నేతలు పంచే
పచ్చనోట్లు మాకొద్దు
కష్టించిన చేతుల్లోని
మా కంచంలో కొంచెం అన్నం పెట్టండి చాలు"
 మూలరచనలోని ఈ భాగానికి రమేష్‌నారాయణగారి అనువాదం ఇలా ఉంది.

O! Intellectuals!
A fistful of cotton if you throw on our face
Weaving a measure of cloth we hand it over to you!
Before each election what the leaders distribute
Currency notes we do not require
In the toiled hands
Into our dish plate it is enough if some food is kept!    

ఈ పుస్తకంలో ఈ అనువాద కావ్యానికి ముందు 'మగ్గం బతుకును పొలిమేర దాటించిన అనువాదం' అంటూ ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి వ్రాసిన పీఠిక, మూలరచయిత, అనువాదకులిరువురి ముందు మాటలు,'వీవర్స్ & లూమ్స్ - సాహిత్య పరిచయం' పేరుతో సుమారు 52పేజీల వివరణాత్మకమైన వ్యాసం ఉన్నాయి. చివరలో మగ్గంబతుకుపై ప్రముఖుల ప్రశంసలు, డా.రాధేయ, డా.రమేష్‌నారాయణగార్ల సంక్షిప్త పరిచయాలు ఉన్నాయి.  

సాధారణంగా ఏదయినా ఒక పుస్తకం ఆంగ్లంలోనికి కాని, హిందీ లేదా ఇతరభాషలలోనికి కాని అనువాదం చేయడంలో అర్థం పరమార్థం మన సాహిత్యాన్ని విస్తృతంగా ఇతర భాషలవారికి పరిచయం చేయడమే కావాలి. దానికి తగినట్లుగా అనువాద పుస్తకం రూపొందించాలి. 132 పేజీలున్న ఈ పుస్తకంలో కేవలం 21 పేజీలలో మాత్రమే ఇంగ్లీషులిపి కనిపిస్తుంది. ఈపుస్తకం తెలుగురాని ఇంగ్లీషు పాఠకులను(తెలుగు తెలిసిన పాఠకులకు ఇంగ్లీషు అనువాదం అక్కరలేదు) ఏవిధంగా ఆకర్షిస్తుందో తెలియదు. టెక్నికల్‌గా ఈ పుస్తకాన్ని ఇంగ్లీషు పుస్తకంగా పరిగణించలేము. తమ కావ్యాన్ని తెలుగుదేశపు ఎల్లలు దాటించి దేశవిదేశాలోని పాఠకులకు అందిచాలన్న ఉద్దేశమే ఉంటే ప్రచురణకర్తలు మరింత జాగ్రత్తలు తీసుకోవలసి వుండేది. కనీసం సాహిత్యపరిచయం వ్యాసం అయినా ఇంగ్లీషులో వ్రాసివుంటే బాగుండేది.  


8, ఏప్రిల్ 2014, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 63


ఆధారాలు:

అడ్డం:

1.కందుకూరి రామభద్రరావుగారి బిరుదము.

2.అందే నారాయణస్వామిగారికి విశ్వనాథ సత్యనారాయణ ప్రసాదించిన బిరుదు.

5.పరవస్తు చిన్నయగారి జగమెరిగిన బిరుదనామము.

7.నలంతిఘల్ చక్రవర్తుల ఠంయాల లక్ష్మీనృసింహాచార్యులవారి బిరుదు.

8.సాహిత్య చిచ్చరపిడుగు బిరుదాంచితుడీ సినీకవి.

13.ఉమర్ అలీషా బిరుదులలో ఒకానొకటి.

14.అవధానసరస్వతులలో ఒకరు ఈ పేరాలవారు.

15.మరో సినీగేయకవి వీటూరి వెంకట సత్యసూర్యనారాయణమూర్తిగారి టైటిల్.

నిలువు:

1.వానమామలై వరదాచార్యులు, బులుసు వేంకటేశ్వర్లు, జహంగీర్ మహమ్మద్‌గార్ల కామన్ బిరుదు.

3.పోతుకూచి సాంబశివరావుగారి సార్థక బిరుదము.

4.గన్నాబత్తుల సుబ్బారావుగారి బిరుదము.

6.చక్రవర్తుల లక్ష్మీనరసమ్మగారినీ ఈమెతో పోలుస్తారు.

9.మందడి వేంకటకృష్ణ కవిగారి బిరుదనామము.

10.భమిడిపాటి కామేశ్వరరావు మరియు శంకరనారాయణ గార్లకు ఉన్న బిరుదు.

11.మల్లెమాల సుందరరామిరెడ్డి ఇలా ప్రసిద్ధులు.

12.దేవులపల్లి వెంకట కృష్ణశాస్త్రి ఆంధ్ర __.



5, ఏప్రిల్ 2014, శనివారం

మార్చ్ నెల కథ!

మార్చి నెలలో కథాజగత్‌లోఎక్కువ మంది చదివిన కథ ఏదో తెలుసుకోవాలంటే ఇక్కడ   నొక్కండి.
గూగుల్ అనలిటిక్స్ గణాంకాల ఆధారంగా

24, మార్చి 2014, సోమవారం

బహుమతి

2013 నోముల పురస్కారం పొందిన వల్లభాపురం జనార్దనగారి బహుమతి కథ ఇప్పుడు కథాజగత్‌లో! 
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bahumati---vallabhapuram-janardhana

18, మార్చి 2014, మంగళవారం

ఊగులోడు


ఆర్.రాఘవరెడ్డి కథ ఊగులోడు కథాజగత్‌లో

17, మార్చి 2014, సోమవారం

మెదడుకు మేత! -11

కల్పలతలో అడిగిన మరికొన్ని ప్రశ్నలు.

1.రాజులు రత్నాలు వనితలు వజ్రాలు ఒక్కమాటలో ఇమిడ్చి వ్రాయండి.

2.రత్నమును వనితను లక్ష్మిని భూమిని కెమ్మోవిని ఒకమాటలో ఇమిడ్చి వ్రాయండి.


3.ఈ క్రింది వాక్యమును పూర్తిగా వ్రాయండి.
కి
చూడరు
బడుటకు
చూడరు.
లో
బల
వంతుని
ము
చేతి
తమ
వచ్చు
శత్రువుల
వారు






4.ఒక చిత్తరవులో విష్ణుమూర్తి మరియు తలుపు తెరిచియున్న గృహము కలదు. ఈ పట్టణమేది?

5.నిముషములో ఒకసారి ముహూర్తములో రెండుసార్లు కనిపిస్తుంది కాని రాత్రియందు కాని పగలుయందు కాని కానరానిది ఏమిటి?