...

...

26, జులై 2009, ఆదివారం

'నవ్య వీక్లీ' శ్రీశ్రీ ప్రత్యేక సంచికపై 3 విశ్లేషణలు!!!

నవ్య వీక్లీ శ్రీశ్రీ ప్రత్యేక సంచిక(17-6-2009)లోని విషయాలపై ఇంతకు ముందు శ్రీశ్రీని కించపరచడం మానలేరా?! అంటూ ఒక టపాలో నా అభిప్రాయాన్ని తెలియజేయడం జరిగింది. ఆ టపాకు విశేషమైన స్పందన వచ్చింది. ఈ ప్రత్యేక సంచికపై పత్రికలలో మూడు విశ్లేషణలు చదవడం సంభవించింది. అందులో ఒకటి నా అభిప్రాయలకు దగ్గరగా వుంది. మిగతా రెండు వ్యాసాలు వేరువేరు దృష్టికోణాల్లో ఈ సంచికపై విశ్లేషించాయి. ఈ మూడు వ్యాసాలను తురుపుముక్క పాఠకులకు పరిచయం చేయాలనిపించింది. వీటిలో రెండు ప్రజాసాహితి మాసపత్రిక జూలై 2009 సంచికలో ప్రచురింప బడగా మరొకటి ఈవారం జనవార్త వార పత్రికలో నాగసూరి వేణుగోపాల్ గారు 'మీడియా నాడి' కాలమ్‌లో వ్రాశారు. ఈ మూడు విశ్లేషణలూ మీ కోసం!

1.కాస్త ఖేదం - కాస్త మోదం


'నవ్య' అనేది ఆంధ్రజ్యోతి యాజమాన్యంచే నడపబడుతున్న "వీక్లీ". ఈ వార పత్రిక 17-06-2009 సంచికని మహాకవి శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా వెలువరించారు. షుమారు 25 మంది ప్రసిద్ధులైన వారు శ్రీశ్రీతో వారి అనుభవాల్ని 'నవ్య'వారి అభ్యర్థనపై రాశారు. ఈ సంచిక వెలువడిన 10వ తేదీ సాయంత్రానికే దాని కాపీలు దొరకలేదు(గుంటూరులో). శ్రీశ్రీ శతజయంతి సంవత్సరంలో ఇదొక ఆనందిచదగ్గ విషయం.

అయితే ఎంతో అపురూపంగా తీసుకెళ్ళిన సంచిక తెరిస్తే ఎక్కువ మంది పెద్దలు తమ అనుభవాల్ని చెత్తచెత్తగా రాశారు.

శ్రీశ్రీని తెల్సిన వాళ్ళందరికీ ఆయన తాగుతాడని తెల్సు. దీన్ని రహస్యంగా ఉంచాలని ఆయనగాని, ఆయన అభిమానులుగాని ఏనాడూ ప్రయత్నించలేదు. విషయాన్ని చెప్పే సందర్భంలో అనివార్యమైతే దాన్ని గూర్చి ప్రస్తావించడం అప్రస్తుతం కాకపోవచ్చు. కాని అదే పనిగా ఆయన సురాపానం నుండి మూత్రీకరణ వరకు ప్రస్తావించటం - అందులోనూ లబ్ద ప్రతిష్టులైన వారు చేయడం సరికాదు.

"తాను రాసి పారేసిన గీతాలు
గుబాళిస్తుండగా
తాగి పారేసిన
సీసాల కంపెందుకు" అనే గీతాన్ని కాళోజి గారు రాశారు. అది శ్రీశ్రీయే తన్ను గురించి రాసుకున్నాడని ఈ సంచికలో రాసిన వారున్నారు. శ్రీశ్రీ ఏమి రాశాడో కూడా తెలియని వాళ్ళ చేత అనుభవాలను రాయించవలసిన దుర్గతి తెలుగుదేశం లోని సాహితీ వాతారణానికి ఇంకా కల్గలేదు.

శ్రీశ్రీతో బాగా పరిచయం వున్న నిఖిలేశ్వర్, భూమన్, చలసాని లాంటి వాళ్ళు కూడా యే కారణంగానో గాని శ్రీశ్రీతో అనుభవాల్ని సరిగ్గా పంచుకోలేకపోయారు. అసలు పరిచయమే లేని డా.యాకూబ్ గారి స్పందనే అందరికన్నా బాగుంది. శ్రీశ్రీ వ్యక్తిగత అనుభవాలకు తిరుపతి పరిసరాలకి పరిమితం చేయకుండా రచనలు ఆహ్వానిస్తే ఇంకొంచెం మంచి రచనలు, శ్రీశ్రీని మరికొంత బాగా ఆవిష్కరించే రచనలు వచ్చేవేమో.

(ప్రజాసాహితి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక జూలై 2009 సౌజన్యంతో)

** * * * * * * * * * * * * * *

2.సాహిత్య సంచికగా నవ్య ప్రయోగం - నాగసూరి వేణుగోపాల్

మహాకవి శ్రీశ్రీ ప్రత్యేక సంచికగా 'నవ్య' వీక్లీ చేసిన ప్రయత్నం ఎంతో చక్కగా ఫలించింది. బహుగొప్పగా గుర్తుండిపోతుంది. జర్నలిజం పలురకాల విశేషణాలతో తీవ్రంగా విమర్శలకు గురవుతున్న కాలంలో ఇటువంటి ప్రయోగం ఎడారిలో ఒయాసిస్సులా ఆశలు రేపుతోంది. 'భారతి' వంటి సాహిత్య పత్రికను అగ్రశ్రేణి దినపత్రిక నడిపే కాలమయితే ఇందులో విస్మయం కలిగించే కోణం ఉండేదికాదు. అసలు జర్నలిజానికి గౌరవం, ఆదరణ లేని చెడ్డకాలమిది. అందువల్లనే నవ్య వీక్లీ ప్రయోగానికి ఇంతగా అభినందనలు అవసరం.

ప్రత్యేక సంచికలు రావడం విశేషం కాదు. సుంకర సత్యనారాయణగారిపై 'ప్రజాసాహితి' మాసపత్రిక బృహత్తర సంచిక ఇటీవల వెలువరించింది. ఇదేరీతిలో చిన్న పత్రికలు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఒక పూర్తి స్థాయి వాణిజ్య పత్రిక ఇలా పూర్తి స్థాయిలో ఒక సాహిత్య ప్రయత్నం చేయడం ఈ కాలంలో గొప్పదే! ఈ సంచికను చూడగానే శ్రీశ్రీ పోయినపుడు జ్యోతిచిత్ర సినిమా వార పత్రిక ఒక వారం శ్రీశ్రీ సంచికగా వెలువరించిన విషయం గుర్తుకు వచ్చింది. అలాగే దాదాపు అదే సమయంలో పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి నేతృత్వంలో ఆంధ్రజ్యోతి వార పత్రిక కూడా శ్రీశ్రీ మీద సంచిక వెలువరించింది. అయితే ఆంధ్రజ్యోతి వార పత్రిక కన్న 'జ్యోతిచిత్ర' సినిమా వార పత్రిక ప్రయత్నం సాపేక్షికంగా సాహసం అనిపించింది. అందులో సంగతులు కేవలం సినిమా రంగానికే పరిమితం కాకపోవడం విశేషం. తర్వాత 90వ దశకం తొలి సంవత్సరంలో ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రిక కేవలం కవితలు మాత్రమే ఒక సంచికలో ప్రచురించే ప్రయోగం చేసింది. ఆ సంచికలో దాదాపు 108 కవితలు ప్రచురింపబడ్డాయి. సీరియల్‌స్, జ్యోతిష్యం వంటి ఫీచర్లు తప్పా మిగతా పేజీలన్నీ కవితలకోసం కేటాయించారు. శ్రీశ్రీ సంచికను చూడగానే ఈ జ్ఞాపకాలన్నీ అలా మెదలుతున్నాయి. ముఖచిత్రంగా పినిశెట్టిగారి చిత్రణ నుంచి చివరి అట్ట లోపలి పేజీలో శైశవగీతి దాకా సుమారు అరవై అంశాలున్నాయి. అంటే మొత్తం 76 పేజీల్లో 56 దాకా శ్రీశ్రీ పరం అయిపోయాయి. కేవలం నాలుగు సీరియల్స్, ప్రకటనలు, ఉత్తరాలు, జ్యోతిష్యం, పంచాంగం వంటి శీర్షికలు తప్పా మిగతా శీర్షికలు కూడా శ్రీశ్రీమయం అయిపోయాయి. దాంతో వారు(శ్రీశ్రీ) రాసిన కథలూ,కవితలు, కబుర్లతో పాటు ఆయన అనురాగాలు - అనుబంధాలు, ఆత్మీయతలు-అల్లరి చేష్టలతో నవ్య వీక్లి ప్రత్యేక సంచిక (వారే చెప్పుకున్నట్టు) తయారైంది. శ్రీశ్రీ జవాబులు, కవితలు, కథ, పదబంధ ప్రహేళికలతో పాటు వర్తమాన సాహితీ వేత్తలు (దాదాపు నలభైమందికి పైగా) చెప్పిన విశేషాలు ఈ సంచికలో చోటు చేసుకున్నాయి. శ్రీశ్రీ రాసిన అంశాలు తప్పా మరేమిటీ పునర్ముద్రణ కాకపోవడం మంచి వ్యూహం. అలాగే సినిమా రంగపు విశేషాలు కూడా ప్రధానం కాకపోవడం మంచి ఎత్తుగడే! దీని వల్ల ప్రయోగం సీరియస్‌గా సాగిందని చెప్పుకోవాలి. అదే సమయంలో సిగరెట్ తాగుతున్న శ్రీశ్రీ ఫోటోను ప్రతిపేజీలో ప్రచురించడంలో నిర్ణయం వెనుక ఆలోచన ఉందో లేదో కానీ- ఈ విషయంలో మనకు శ్రీశ్రీ ఆదర్శం కానక్కరలేదు. అలాగే నలభై మంది పైగా రచయితలలో రచయిత్రులు కేవలం నలుగురు మాత్రం కావడం లోటే!

అద్దేపల్లి, రావికొండలరావు, ఇనాక్, కేతు, చలసాని ప్రసాద్, వసంతలక్ష్మి, అదృష్టదీపక్, చాయాదేవి, పాపినేని, ఎం.వి.రమణారెడ్డి, మునిసుందరం, తనికెళ్ళ భరణి, ఓల్గా, శ్రీపతి, భూమన్ ఇలా ఎంతో మంది శ్రీశ్రీతో తమ అనుబంధం పంచుకుంటూ శ్రీశ్రీ కబుర్లు చెప్పారు. అన్నీ కూడా దాదాపు వైయక్తికమైన కోణంలో వివరించబడటంతో హాయిగా చదివించేస్తాయి. అంతా లబ్దప్రతిష్టులే కాకుండా మరికొందరితో కూడా వ్యాసాలు రాయించడంతో నిండుదనం వచ్చింది. ఇంద్రధనస్సులో శ్రీకాంతశర్మ శ్రీశ్రీ గురించి చెప్పడం కష్టమైన విషయం కాదు కానీ స్పోర్ట్స్‌కాలమ్ 'క్రీడాభిరామం' కూడా శ్రీశ్రీ గురించి రాయడం అభినందనీయమే! అలాగే శేఖర్‌టూన్స్ శ్రీశ్రీ సిరిసిరిమువ్వలతో గలగలలాడటం, సరసి కార్టూన్ శ్రీశ్రీ కవితాపాదాలపై ఉండటం గొప్ప విషయమే! పజిల్ స్థానంలో శ్రీశ్రీ ప్రహేళికను సమాధానాలతో పాటు ఇవ్వడం సముచితమే! ఇనాక్ ఇంటిపేరులో అచ్చుతప్పు రావడం కన్న చలసాని ప్రసాద్ కాస్త చలసాని ప్రసాదరావు అయిపోవడం పెద్ద పొరపాటే! ఇంకా చేయాలనడానికి అంతం ఉండదు. అయితే మంచి ప్రయత్నం చేశారని నవ్య వీక్లి యాజమాన్యాన్ని, సంపాదకవర్గాన్ని తప్పక అభినందించాలి.

నిజానికి ఇటువంటి ప్రయత్నాల వల్ల ప్రయోజనం ఏమిటి? పత్రికలకు లాభమా? కాదా?- అని కూడా చూడాలి. సాహితీ వేత్తలు అభినందించడం లేదా ఫలానా కోణం, ఫలానా రచయిత చోటు చేసుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేయడం సహజమే! కానీ దీన్ని దాటి వాణిజ్యపరంగా పరిశీలించినపుడు ఏమిటి అని ఆలోచించాలి. ఒక సంచికను ఇలా సాహిత్య ప్రత్యేక సంచికగా తేవడం ఆర్థిక భారం కాకపోయినా, సగటు పాఠకుడు సంచికను ఎంతవరకు ఆదరిస్తాడనే ప్రశ్న ఎదురవుతుంది. గతంలో నార్ల వెంకటేశ్వరరావు గారు సంపాదకుడుగా గురజాడ అప్పారావుగారి ఫోటోను ముఖచిత్రంగా ఆంధ్రజ్యోతి సచిత్రవారపత్రికను ఒక వారం వెలువరించారు. ఆ వారం చాలా సంచికలు తిరిగివచ్చాయని నార్లగారు పేర్కొన్నట్టు నా జ్ఞాపకం. అందువల్ల ఇటువంటి సమస్య తప్పదు. అయితే ఈ సంచిక కారణంగా లభించిన పాజిటివ్ ప్రచారం ఎనలేనిది. దీన్ని ఇతరత్రా కొలవలేం. అది కేవలం అనుభవించి పలువరించడమే! అందువల్ల పత్రికకు స్థూలంగా లాభమే! అంతకు మించి 'నవ్యా తొలుత 'సరసం'గా కించిత్ అశ్లీలంగా సాగేదనే విమర్శ కలిగివుండేది. కానీ ఇటీవల రచయితలతో ఇంటర్వ్యూలు చేయడం, ఇప్పుడు శ్రీశ్రీ సంచిక రావడంతో అటువంటి ముద్ర పూర్వపక్షం అయిపోయింది. కనీసం అపుడపుడైనా ఇలాంటి ప్రయత్నం జరగాలి. ప్రాంతీయ సాహిత్యం నేపథ్యంగా, కళలు నేపథ్యంగా ఇలాంటి సంచికలు ఆరు నెలలకోసారి అయినా వెలువరిస్తే మంచిది. మిగతా పత్రికలకు ఈ ప్రయోగం స్ఫూర్తి అవుతుంది. ఏదిఏమైనా ఇతర వారపత్రికల కన్నా గౌరవమైన స్థానాన్ని 'నవ్య'వీక్లీ ఇలా పొందడం అభినందనీయమే!

[ఈవారం జనవార్త రాజకీయ సామాజికార్థిక వారపత్రిక జూన్28-జూలై 4,2009 సంచిక సౌజన్యంతో]

** * * * * * * * * * * * * * *

3.శ్రీశ్రీపై 'నవ్య వీక్లీ' ప్రత్యేక సంచిక- వ్యాపార దృక్పథం - పినాకిని, హైదరాబాదు

'గౌరవిస్తే గౌరవింపబడతామ'ని శ్రీశ్రీపై ప్రత్యేక సంచికను 'నవ్య' వెలువరించింది. శ్రీశ్రీలోని అనుకూలాంశాలను, ఆయన ఏ ప్రాపంచిక దృక్పథం వైపుకి పయనించాడన్న నిర్దిష్ట ఆలోచనకు పాఠకుడ్ని రానీయకుండా చేసిందీ సంచిక. సంచికలో కొన్ని ముఖ్యమైన వివరాలు, చాలామందికి తెలియని కొన్ని సంఘటనలు వున్నప్పటికీ ముందుగా అనుకూల అంశాలుగా రాయాలనిపించడం లేదు- ఎందుకంటే శ్రీశ్రీలోని నెగెటివ్ షేడ్స్ ఎక్కువగా మా తరానికి 'నవ్య' పరిచయం చేసింది కనుక నేను కూడా ఈ సంచిక నెగెటివ్ షేడ్‌నే ముందుగా చెప్పాలనుకుంటున్నాను.

'తాజ్‌మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వర'ని ప్రశ్నించిన శ్రీశ్రీకున్న దృక్పథం ఖచ్చితంగా మార్క్సిస్టు ప్రాపంచిక దృక్పథం. ఈ పాదంలోని అర్థం ఈ సంచికలో అభిప్రాయాలు చెప్పిన ఎక్కువ మందికి తెలియదనీ, కొందరికి తెలిసినా తెలియనట్లు మాట్లాడారనీ, ఒకరిద్దరు ఈనాటికీ సంస్థల్లో వున్నవారు అవి తప్ప మిగిలినవి రాశారనీ అనిపిస్తోంది. కొందరు వ్యక్తులుగా మిగిలిపోయి శ్రీశ్రీని ఒక వ్యక్తిగా చిత్రించారు. ఆయనలో వ్యక్తిగతంగా వీరికున్న అనుభవాలు రాదామని బయల్దేరి తమకెలా వుపయోగపడ్డారో రాసుకున్నవారున్నారు. శ్రీశ్రీ సమాజానికుపయోగపడమని చెప్పింది వీళ్ళెంత వరకు పాటించారో ఎవరూ ఒక్కముక్క చెప్పలేదు. రాసేవాళ్ళు అలా రాస్తే శ్రీశ్రీనుంచి ఉత్తేజం పొందిన ఈ ప్రముఖుల నుంచి కూడా ఈనాటితరం ఉత్తేజం పొందేవారు. ప్రతి ఒక్కరూ మీటింగ్ పెట్టారని, అక్కడకు శ్రీశ్రీ వచ్చాడని, ఏ రైల్‌లో వచ్చాడు? వేరుశెనగ కాయలు ఎక్కడ తిన్నారు? మందు ఎక్కడ కొన్నారు? ఇలా చెప్పారు. తప్ప ఆ మీటింగ్‌లు ఏ సమస్యల మీద పెట్టారు. ఎవరెవరు లేదా ఎంతమంది కార్యకర్తలు ఎన్ని వత్తిడుల నడుమ ఆ పన్లు చేశారు? ఏ ఒక్కరూ పరిశీలించలేదని అర్థమవుతుంది. రాళ్ళెత్తిన కూలీలెవరో వీరికి తెలియకనే అలా రాయలేదు. రాసిన వారి పరిమితులు, అనుభవాలు, అడిగిన వారి పరిమితుల్ని అర్థంచేసుకుందామనుకున్నా నష్టం శ్రీశ్రీకి జరిగినట్టు పైకి కనిపించినా శ్రీశ్రీ నమ్మిన ప్రాపంచిక దృక్పథానికి నష్టం కలిగించారు.

"మహాప్రస్థానం సామూహిక ఉద్యమాలకు, తిరుగుబాట్లకు ప్రేరణ ఇస్తుందని చాలామంది అనుకుంటారు. కానీ జీవితంలోని ప్రతి ఘట్టంలో, ప్రేమలో, బంధంలో, ఆప్తుల మరణంలో, లోకం ఇచ్చిన శాపాలలో, నేను చేసిన తిరుగుబాట్లలో నా చేయిపట్టుకుని నన్ను నడిపించే నేస్తం మహాప్రస్థానమే"నంటున్నారు ఓల్గా గారు. సామూహిక ఉద్యమాలకు ప్రేరణ ఇవ్వదనేనా దీనర్థం. లేక అవసరం లేదనా? శ్రీశ్రీ వ్యక్తి కాదు శక్తి అన్నంత వరకూ అందరూ ఒప్పుకొంటున్నారు. 1970ల శ్రీశ్రీని చెప్పి అంతకు ముందు శ్రీశ్రీని వదిలేస్తే ఈ శక్తి ఆకాశంలోంచి ఊడిపడ్డ మెరుపులా కన్పిస్తాడు. అప్పుడు శ్రీశ్రీ రెండు మహావిప్లవాల నడుమ, రెండు మహా యుద్ధ సంక్షోభాల నడుమ మార్క్సిజాన్ని స్వీకరించి, స్వయంకృషిని జోడించి సాహితీ పరిణతిని సాధించాడన్న వాస్తవం మరుగున పెట్టినట్లవుతుంది. "పూవు పుట్టగానే పరిమళించును"అని రాసుకొని, శ్రీశ్రీ బ్రతికినంతకాలం ఏ ఫ్యూడల్ భావజాలాన్ని సాహిత్య రూపాల్లో తెగనరుకుతూ వచ్చాడో దాన్నే, శ్రీశ్రీకి ఆపాదించి దిన వారపత్రికలు సాహిత్య చరిత్రగా నిక్షిప్తం చేసినట్లుగా వుంది.

శ్రీశ్రీ సమాజ మార్పులో, సాంస్కృతిక రంగంలో, సాహిత్య రంగంలో ప్రజలు కోల్పోతున్న హక్కుల విషయంలో సామాజిక శక్తులతో భుజంభుజం కలిపి ఎలా నడిచాడో ఒక్క ముక్కైనా ఈ సంచికలో లేనందుకు అలా వుండాలని కోరుకోవడం అత్యాశే అవుతుందేమోనన్న సందేహంతో ఇలా స్పందిస్తున్నాను. అల్పవిషయాల చుట్టూ,భావుకత చూట్టూ పరిభ్రమించేవారి రచనలు ఈ సంచికలో ఎక్కువ వ్యాసాలు కనబడుతున్నాయి. ఇలాంటి ప్రత్యేక సంచికలింకెన్నో తేవచ్చు. శ్రీశ్రీతోడి అనుభవాలు అనంతం. అన్నట్టు ఈ సంచికలో నిజాయితీతో చెప్పిన వారు లేరా అని ఎవరన్నా అడగొచ్చు. తమ పరిమితుల్ని చెప్పుకున్న జర్నలిస్టులూ,సినీరంగంవారూ, అభిమానులూ, శ్రీశ్రీలాగా చిన్నపిల్లల్లా భోళాగా చెప్పుకున్న వాళ్ళ సంఖ్య తక్కువేమీ కాదు. ఈ సంవత్సరాన్ని శ్రీశ్రీనామ సంవత్సరంగా చెప్పడం చాలా గొప్పగా వుంది. ఈ సంచికకి పేరు తెచ్చేది మిత్రుడు పినిశెట్టి కుంచెలోంచి ఒకనాటి శ్రీశ్రీ తీక్షణతని చెక్కిన ముఖచిత్రమేనని నాకనిపిస్తుంది.

ఈ సంచిక ద్వారా శ్రీశ్రీ గౌరవం నిజంగా పెరిగివుంటే, 'నవ్య' కూడా గౌరవింపబడేదే. వ్యాపారస్తుల గౌరవాల గరిమనాభి లాభం దగ్గరేవుంటుందేమో!

(ప్రజాసాహితి సాహిత్య సాంస్కృతికోద్యమ మాసపత్రిక జూలై 2009 సౌజన్యంతో)

20, జులై 2009, సోమవారం

చిన్ని... చిన్ని... ఆశ

డాక్టర్. దిలావర్ గారి కథ చిన్ని... చిన్ని... ఆశ కథ కథాజగత్‌ లో ప్రకటించ బడింది. ఈ కథను తప్పక చదవండి. ఈ కథలోని విషయాలపై చర్చకు ఆహ్వానిస్తున్నాం.

14, జులై 2009, మంగళవారం

పుస్తక సమీక్ష! -13 కన్నోజు కవిత

[పుస్తకం: కన్నోజు కవిత, రచన: కన్నోజు లక్ష్మీకాంతం, పేజీలు: 107, వెల: రూ70/-, ప్రతులకు: ఇం.నెం.18-3-463/1/175/1, రాజన్న బావి, ఫలక్‌నుమా, హైదరాబాద్.]

ఈ కవితాసంకలంలో 50 కవితలున్నాయి. ఈ కవితలన్నీ సరళంగానూ, స్పష్టంగానూ చక్కని భావాలను వెల్లడిస్తున్నాయి. ఈ కవితల్లో వస్తువైవిధ్యత విస్తృతంగా ఉంది. పల్లెల పట్ల తమ అభిమానాన్ని చాటే కవితలు కొన్ని, నగరంలోని మురికివాడలను, లేబర్ అడ్డాలను వర్ణించే కవితలు కొన్ని ఉన్నాయి. పర్యావరణం, దాని పరిరక్షణ పట్ల కన్నోజు లక్ష్మీకాంతం గారికి ఉన్న అవగాహన కాపాడుకుందాం,ధరిత్రి, పర్యావరణమంటే...!, ప్రకృతిని చూసిగూడా....! అనే కవితలలో స్పష్టమౌతున్నది.

"ప్రగతెప్పుడూ ప్రతిఫలం కోరకున్నా
నిర్దయగా ఛిద్రం చేస్తున్న మనం
నింపాదిగా ఆలోచించాలి" అంటారు.

మానవత్వం, జాగృతి కావాలి, సంస్కృతిని కాపాడుకుందాం మొదలైన కవితలు కవి మనోభిలాషను వ్యక్తం చేస్తున్నాయి. తల్లిదండ్రులను పలుకరించే తీరికలేని పిల్లల తీరుపట్ల కవి ఆవేదన చెందుతున్నారు. నగరాలలోని డాంబికాలు, ఊర్లలోని అనురాగాల నడుమ వ్యత్యాసాలను చేతికర్ర కవితలో చక్కగా తెలుపుతున్నారు. అమ్మను అద్దంతో పోలుస్తూ కన్నోజువారు 'అమ్మను అర్థం చేసుకోవడానికి జీవితకాలం సరిపోద'నే సత్యాన్ని చాటుతున్నారు. గతంలో ఎంత ఎబ్బెట్టుగా ఉన్నా దాన్ని అసహ్యించుకోకూడదంటున్నారు వెనక్కి తిరిగి చూడండి అనే కవితలో. కమ్యూనికేషన్ రంగంలో ఎంత పురోగమించినా ఉత్తరాలను రాసే అలవాటును మానకూడదంటున్నారు.

"ఉత్తరం రాసి చూడండి
అనుబంధాన్ని డిపాజిట్ చేయండి" అని ప్రవచిస్తున్నారు.

కవులు రచయితలను ఉద్దేశిస్తూ కన్నోజు లక్ష్మీకాంతం గారు వారికి ఇలా మార్గనిదేశనం చేస్తున్నారు.


"ఒప్పించేరీతిలో, మెప్పించే తరహాలో
ఏదైనా వినిపించండీ
ఎంతైనా వినిపించండి"

"అర్థాలు వెదుక్కునేలా కాదు
అందరికీ అర్థమయ్యేలా రాయండి"

"ఉబుసుపోక రాయడం కాదూ
ఉత్తేజాన్నిచ్చే కవిత్వం రాయండి"

"గుండె లోతులోంచి ఆలోచిస్తూ
నిండు రచనల్ని ఆవిష్కరించండి"

కన్నోజు వారి కవిత్వం ఎక్కువ భాగం ప్రభోదాత్మకంగానే ఉన్నది. వీరి కవిత్వంలో వ్యంగ్యం అక్కడక్కడా తొంగిచూసినా అది తక్కువమోతాదులోనే ఉంది. మన సంస్కృతీ సంప్రదాయాలపైన అభిమానం, మానవత్వం పట్ల మమకారం, గ్రామసీమల పైన ప్రేమ, పర్యావరణం మీద అభిరుచి, మంచి రచనలకోసం ఆరాటం, కపట ప్రేమలపై నిరసన ఇవన్నీ కన్నోజు లక్ష్మీకాంతం గారిని కవిత్వం వ్రాయడానికి ప్రేరకాలుగా పనిచేశాయి.

ఈ కవి ఇంతకు ముందు 'చార్మినార్ నానీ'ల పేరుతో ఒక పుస్తకాన్ని ప్రకటించినట్టూ, దానిపై పలువురు ప్రముఖులు ప్రశంసల వెల్లువ కురిపించినట్లూ ఈ పుస్తకంలో సమాచారం ఉంది. ఈ నానీల పుస్తకం పలు సాహితీ సంస్థల నుండి పురస్కారాలను పొందడం విశేషం. ఈ'కన్నోజు కవిత'కూడా 'చార్మినార్ నానీ'లవలె మంచి పేరు గడిస్తుందని ఆశిస్తున్నాను.

[సాహితీ కిరణం మాస పత్రిక జూలై 2009 సంచిక నుండి]

13, జులై 2009, సోమవారం

రుణం

"రేయ్! నీ ఆలోచనా విధానంలోనే లోపముంది. నువ్వూ, నీలాంటివారు సమాజం గురించి, వ్యక్తులగురించి అవగాహన చేసుకొన్న తీరులో లోపముంది. మనిషి తనకు తానుగా బ్రతుకుతూ, తన పరిధి మేరా ఇతరులకు ఎలా సాయపడగలను అని ఆలోచించాలి. అంతేకాని పూర్తిగా ఇతరులకోసమే జీవించాలని నేను చెప్పడం లేదు. ప్రతీ మనిషీ ఇలాంటి దృక్పథం విధిగా అలవర్చుకోవాలి. చదువు రాని వారి విషయం వదిలేయ్! విద్యావంతులైన మనలాంటి వారు, ఉద్యోగస్థులు, లాయర్లు, అధ్యాపకులు, డాక్టర్లు, ఇంజనీర్లు, వ్యాపరస్థులు, విద్య నేర్చి ఏదో ఒక రంగంలో కృషి చేస్తున్నవారు, వివిధ వృత్తులు చేపట్టిన వారు, మేధావి వర్గం అని పిలువబడే వారు ఈ విధమైన ఆలోచనా ధోరణిని అలవరుచుకోవాలి. అంతేకాని కేవలం 'నా ఇల్లు, నా వాళ్లు, వాళ్ల బాగోగులే జీవితం' అన్న పంథాలో జీవించరాదు. 'నేను ఏ సమాజం నుంచయితే తిండి, బట్ట సంపాదించుకో గలుగుతున్నానో, అలాంటి సమాజానికి నా వంతు బాధ్యతగా ఎంతో కొంత మంచి చేసి చావాలి' అన్న ఆలోచనా సరళి కలిగి వుండాలి. అప్పుడే మనం నేర్చిన విద్యకు, వ్యక్తిగా మన జీవితానికి ఓ ప్రయోజనం చేకూరుతుంది. మనిష్ తన పరిథిలోనే ఇతరులకు సాయం చేయడానికి ఎన్నో మార్గాలున్నాయి. కాకపోతే, ఎవరికి వారు, తమకేమీ పట్టనట్లుగా మార్గాలగురించి ఆలోచించటం లేదంతే! విద్యావంతులు, మేథావి వర్గంగా పిలువబడుతున్నవారే తమకేమీ పట్టనట్లుగా కేవలం తమ స్వార్థానికే ప్రాధాన్యత ఇస్తూ పోతే, చివరికి సమాజంలో మంచి అన్నది కరువై, ఎటుచూసినా అశాంతి ప్రబలి అది విధ్వంసక ధోరణికి దారితీస్తుంది. సమాజాన్ని ఓ విషవలయంగా మార్చేస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నదదే!"

పై అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తున్నారా? పై సంభాషణ ఎవరిపై ఎలాంటి ప్రభావం చూపింది? తెలుసుకోవాలంటే ఎస్.డి.వి.అజీజ్‌గారి కథ రుణం చదవండి.

9, జులై 2009, గురువారం

పుస్తక సమీక్ష! -12 బాసుగారి కుక్కగారు

[పుస్తకం పేరు: బాసుగారి కుక్కగారు, రచన: వియోగి, పుటలు:100, వెల: రూ.100/-, ప్రాప్తి స్థానం: శ్రీ కోపల్లె విజయ ప్రసాదు, 87/395, కమలానగర్, బి క్యాంపు, కర్నూలు 518 002 మరియు విశాలాంధ్ర పుస్తక కేంద్రాలు]

ప్రముఖ కథారచయిత వియోగి తెలుగుతల్లికి చేసిన హాస్యకథాభిషేకం ఈ పుస్తకం. ఈ కథలు చాలామటుకు వివిధ పత్రికలలో ప్రకటింపబడినవే. వియోగిగారు ఈ కథలలో మన నిత్య వ్యవహార జీవనంలో తారసపడే సంఘటనలను హాస్యంగా చిత్రించారు. ఎదుటివారి కష్టాలు, కన్నీళ్ళు కొందరికి నవ్వును కలిగిస్తాయి. అటువంటి పైశాచికమైన ఆనందాన్ని కలిగించే కథలు ఈ సంపుటిలో ఉన్నాయి. అధికారుల మెప్పుకోసం ఉద్యోగులు పడే తంటాలు కొన్ని కథల్లో చూపిస్తే, భీమా పాలసీలు ఇప్పించడానికి ఏజెంట్లు పడే తిప్పలు ఇంకో కథలో వివరించబడింది. ష్యూరిటీ కోసం సంతకం చేసిన పాపానికి కోర్టులకెక్కి చేతి చమురు వదిలించుకునే అమాయక ప్రాణి ఒక కథలో కనిపిస్తే, అనవసరమైన ఆడంబరాలకు పోయి చేయి కాల్చుకునే సగటు జీవులు, స్కీముల పేరుతో సులభంగా సంపాదన చేయాలని ప్రయాసపడే వ్యక్తులు కొన్ని కథల్లో తారసపడతారు. సన్మానాలకై తాపత్రయ పడే వారి అవస్థలు ఒక కథలో చదువుతాము. వాస్తు, జాతకాలను మూర్కంగా నమ్మి తద్వారా అనుభవించే కష్టాలు మరో రెండు కథల్లో వర్ణించబడింది. మనసు చేతిలో మనిషి కీలుబొమ్మ అనే విషయం తలలో తేలు కథద్వారా విదితమవుతుంది. ప్రతివిషయాన్ని వ్యతిరేకంగా ఆలోచించే వ్యక్తి చివరకు కడగండ్ల పాలు కావడం తథాస్తు దేవతలు కథలో అగుపిస్తుంది. తన బాహ్య సౌందర్యంతో గర్వించిన యువతి చివరకు అనాకారిగా మారి చింతించడం అందం కథకు ఇతివృత్తం. పెళ్లిచూపులకు వెళ్లిన ఇద్దరు యువకుల్లో పెళ్ళికొడుకెవరో తెలియక అయోమయంలో పడితే వుత్పన్నమయ్యే హాస్యం తికమక కథలో చూడవచ్చు. పిచ్చివారి ప్రేలాపనలు వెర్రికో పుర్రె కథలోను, సెల్‌ఫోన్‌ల వలన అనుభవించే నరకాన్ని సెల్ బాబోయ్ హెల్ కథలోను దర్శించవచ్చు. ఈ లోకంలో ఎవరికీ ఎవరిపైనా మంచి అభిప్రాయం ఉండదని, మనిషి ఎదుట నవ్వుతూ పలకరించినా, స్నేహంగా మెసలినా మనసులో మాత్రం సదరు వ్యక్తిపై దురభిప్రాయాన్ని కలిగి ఉంటారని రచయిత సదభిప్రాయం అనే కథలో అంటారు. ఈ కథలన్నింటిలోను రచయిత సన్నివేశపరమైన హాస్యానికే ప్రాధాన్యతనిచ్చారు. ఈ కథల్లో హాస్యం పలచగా ఉందనిపిస్తోంది.

[జాగృతి సామాజిక రాజకీయ వారపత్రిక 6 జులై 2009 సంచికలో ముద్రితం]

6, జులై 2009, సోమవారం

ఓగేటి ఇందిరాదేవి చారిత్రక నవలలు - సంక్షిప్త పరిచయం

బహుముఖ ప్రజ్ఞాశాలి శ్రీమతి సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవిగారు మే 23వ తేదీన కన్నుమూశారన్న వార్త సాహితీలోకాన్ని కృంగదీసింది. ఇందిరాదేవిగారు కథ, నవల, వ్యాసం, నాటకం, సాహిత్య రూపకం, గేయం, శతకం తదితర అన్ని ప్రక్రియల్లోనూ విరివిగా రచనలు చేసి పాఠకుల అభిమానాన్ని చూరగొన్న విదుషీమణి.సుమారు నాలుగున్నర దశాబ్దాలకు పైగా నిర్విరామంగా రచనలు చేసిన వీరు తమ జీవిత కాలంలో అనేక ప్రతిష్టాకరమైన పురస్కారాలను పొందారు.తెలుగు విశ్వవిద్యాలయం వారి ధర్మ నిధి పురస్కారం, నోరి నరసింహ శాస్త్రి స్మారక పురస్కారం అందులో పేర్కొన దగినవి.సాంఘిక, పౌరాణిక, చారిత్రక, ఆధ్యాత్మక విషయాలలో వీరు తమ సాహిత్యాన్ని వెలువరించినా చారిత్రక రచనలపై ప్రత్యేకమైన అభిమానాన్ని చాటుకున్నారు.

చరిత్ర పట్ల వీరికి ఉన్న మక్కువ వీరి రచనలలో ప్రస్ఫుటమయ్యింది.కాకతీయుల శాసనాలపై వీరు విశేషమైన పరిశోధన గావించారు.అమృతవర్షిణి,ఆనంద ధార, కోటలో నారాజు, నిరుడు కురిసిన హిమ సమూహములు అనే నాలుగు నవలలతో పాటు కాకతీయ వైభవం అనే నాటకం వీరిని అగ్రశ్రేణి చారిత్రక రచయిత్రిగా నిలబెడుతోంది.వీరి చారిత్రక నవలలను ఈ వ్యాసంలో పరిచయం చేసుకుందాం.

అమృత వర్షిణి: ఈ నవలలో రచయిత్రి కన్నడ కవిత్రయంగా పేరుపొందిన రన్న, పొన్న, పంప కవులలో పొన్న, పంప కవులను తెలుగువారిగా నిరూపించే ప్రయత్నం చేశారు.పంప మహాకవి చాళుక్య చక్రవర్తి రెండవ అరికేసరి కోరిక మేరకు మహాభారత కావ్యాన్ని కన్నడంలో విక్రమార్జున విజయం పేరుతో రచిస్తాడు. పంప కవి సోదరుడు జిన వల్లభుడు తన స్నేహితుడైన మల్లియ రేచనను ప్రోత్సహించి కవిజనాశ్రయం అనే చందశ్శాస్త్ర గ్రంధాన్ని తెలుగులో వ్రాయిస్తాడు. పంప కవి చరిత్రతో ప్రారంభమైన ఈ నవల నన్నయ ఆంధ్ర మహా భారత రచనతో ముగుస్తుంది. విక్రమార్జున విజయం, కవిజనాశ్రయం, ఆంధ్ర మహాభారతం కావ్యాల ఆవిష్కరణకు దారితీసిన పరిస్థితులకు సంబంధించిన ఇతివృత్తం ఈ నవలలోని వస్తువు.ఆ కాలంలో జైన, వైదిక మతాల మధ్య సంబంధాలు, కన్నడాంధ్ర భాషల మధ్య సయోధ్య మొదలైన విషయాలు చిత్రీకరించారు రచయిత్రి ఈ నవలలో. శృంగార, హాస్య, కరుణ, వీర రసాలను రచయిత్రి ఈ నవలలో చక్కగా పోషించారు.

ఆనందధార: అమృత వర్షిణి నవలలో నన్నయ్య గురించి వ్రాస్తే, ఈ నవలలో తిక్కన గారి చరిత్ర ఉంది. కాకతీ రుద్రమ దేవిని తండ్రి గణపతి దేవుడు అల్లారు ముద్దుగాపెంచి అన్నివిద్యలూ నేర్పిస్తాడు. గణపతి దేవుని మరణానంతరం రుద్రమ మహారాణి అవుతుంది. అడుగడుగునా ఆటంకాలను ఎదుర్కుంటూ రుద్రమదేవి దేశ రక్షణ కోసం శౌర్యాన్ని ప్రదర్శిస్తుంది. శత్రు రాజుల దండయాత్రలో రుద్రమను రక్షించబోయి ఆమె ప్రియసఖి వకుళ, భర్త వీరభద్రుడు, రామప్ప ప్రాణాలు త్యజిస్తారు. ఈ నవలలో సన్నివేశలన్ని అద్భుతంగా ఉండి, ఉత్కంఠమైన మలుపులు తిరుగుతూ పాఠకులను ఆకట్టుకుంటుంది. ఈ నవల దూరదర్శన్‌లో ధారావాహికగా ప్రసారమయ్యింది.

కోటలో నారాజు: ఈ నవలకూడా కాకతీయుల చరిత్రకు సంబంధించినదే. ఆనందధారలో రుద్రమదేవి హృదయం ఆవిష్కరింపబడితే ఈ నవల కోటలో నారాజు లో ప్రతాపరుద్రుడి పరాక్రమాన్నీ, రసికతనూ చూస్తాము.కాకతీయ ప్రభువు గణపతి దేవ చక్రవర్తి మరణించాక అతని పుత్రిక రుద్రమ దేవికి పట్టం కడతారు. మగ సంతానం లేని కారణంగా ప్రతాపరుద్రుని దత్తత తీసుకుని అతనికి రాచరికపు విద్యలలో శిక్షణనిప్పిస్తుంది రుద్రమ్మ. ప్రతాపరుద్రునికి యుక్తవయసు రాగానే యువరాజ పట్టాభిషేకం జరిపిస్తుంది. ఆ పట్టాభిషేక మహోత్సవంలో మాచలదేవి అనే నర్తకి నాట్య ప్రదర్శనకు మోహితుడై ఆమెను రాజనర్తకిగా నియమిస్తాడు ప్రతాపరుద్రుడు. అంబదేవ మహారాజుపై జరిగిన యుద్ధంలో రుద్రమదేవిని మోసంతో మట్టుపెడతాడు అంబదేవుడు. రుద్రమదేవి మరణంతో ఓరుగల్లు శోకతప్త మౌతుంది. అంబదేవుడిపై ప్రతాపరుద్రుడు దండెత్తి అతడిని సంహరిస్తాడు. ఆ తర్వాత గోదావరీ తీరంలో ఢిల్లీ సైన్యాన్ని ఎదిరించి ఓడిస్తాడు. ఓతమిపాలైన ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఓరుగల్లు మీదికి సైన్యాన్ని పంపిస్తాడు. ఆ తురుష్క సైన్యం నెల రోజుల పాటు ముట్టడించి కొందరు రాజద్రోహుల సహాయంతో కోటలోకి ఆహార పదార్థాలను ప్రవేశించకుండా చేస్తుంది. విధి వక్రించి ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైన్యానికి లొంగిపోతాడు. ఇదీ స్థూలంగా ఈ నవలలోని కథ. అయితే ఈ కథను నడపడానికి రచయిత్రి కొన్ని సాంఘిక పాత్రలను కల్పించి పాఠకులకు విసుగు కలగ కుండా నవలను చక్కగా నడిపారు.

నిరుడు కురిసిన హిమ సమూహములు: ఇది ఒకరకంగా ఇందిరాదేవిగారి స్వీయ చరిత్ర అనుకోవచ్చు. ఇందులో స్వేచ్చ అనే పాత్ర ఇందిరాదేవి గారిదే. తమ పూర్వీకుల కుటుంబ చరిత్రను భారత స్వాతంత్రోద్యమంతో మేళవించి ఈ రచన చేశారు ఇందిరా దేవిగారు. గాంధీ సిద్ధాంతాలు, స్వావలంబన సిద్ధాంతము, గ్రామస్వరాజ్యము,మద్యపాన వ్యతిరేక ఉద్యమం మొదలైన విషయాలు ఈ నవలలో ఉన్నాయి. ఈ నవలలో ఆనాటి సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను రచయిత్రి ఆవిష్కరిస్తున్నారు. ఆనాటి సంఘ దురాచారాలను చూచాయగా ప్రస్తావించారు. విధవా వివాహాలు, వర్ణాంతర వివాహాలు, సహపంక్తి భోజనాలు మొదలైన సంఘ సంస్కరణల ప్రసక్తి ఈ నవలలో ఉంది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో సాహిత్య రంగంలో జరిగిన పురోగతి దీనిలో చూపబడింది.

ఈ నవలలన్నీ శ్రీమతి ఓగేటి ఇందిరాదేవి గారి సామర్థ్యానికి ప్రతీకలుగా నిలిచాయి. వీరి రచనలు ఎక్కడా పాఠకులకు విసుగు కలిగించకుండా అత్యంతాసక్తితో చదివిస్తాయి. సందర్భానుసారం ఈ నవలలో అక్కడక్కడా ప్రముఖ కవుల కవిత్వం, అనేక పాటలు, పద్యాలు, జానపద గేయాలు వాడుకున్నారు. ఫై నవలలు ఇందిరాదేవిగారికి చారిత్రక నవలా రచయిత్రిగా ఆంధ్ర సాహిత్యంలో ఒక సుస్థిర స్థానాన్ని కల్పిస్తున్నాయి. శ్రీమతి ఓగేటి ఇందిరాదేవి గారు భౌతికంగా దూరమైనా తమ రచనల ద్వారా పాఠకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్నారు.
(మూసీ సాహిత్య సాంస్కృతిక చారిత్రక మాస పత్రిక జూలై - 2009 సంచికలో ప్రచురితం)

5, జులై 2009, ఆదివారం

ఇప్పుడు ఇరానీ చాయ్ మరింత ప్రియం!!!

అవును. ఇరానీ చాయ్ రేటు పెంచేశారు.

ఒకటో తారీకు నుండి ఇరానీ చాయ్ కప్పు ఆర్రూపాయలు!

ఈ ఇరానీ చాయ్‌కి జంట నగర వాసులతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు.

హైదరాబాద్ సంస్కృతిలో ఇరానీ చాయ్ ఒక భాగంగా మారిపోయింది.

బ్లాక్ టీ, లెమన్ టీ, చాక్లెట్ టీ ఇలా టీలలో ఎన్ని రకాలున్నా అవి ఇరానీ చాయ్ రుచి ముందు దిగదుడుపే.

నలుగురు దోస్తులు కలిశారంటే ఇరానీ హోటల్లో తీన్ మే చార్ చాయ్ తాగాల్సిందే. గంటలకు గంటలు బాతాఖానీ కొట్టాల్సిందే.

అన్ని ఋతువులలోనూ అన్ని సమయాల్లోను ఇరానీ హోటళ్లు కళకళ లాడుతూ ఉంటుంది.

ఈ చాయ్‌ని తాగడంలో బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడి ప్రజలు. కొందరు సాసర్లలో ఒంచుకుని నోటితో జుర్రుకుంటూ తాగితే ఇంకొందరు ఉస్మానియా బిస్కట్ చాయ్‌లో ముంచి తింటూ కొద్ది కొద్దిగా చాయ్‌ని సిప్ చేస్తూ తాగుతారు.

ఈ ఇరానీ చాయ్ మహత్యాన్ని పొగుడుతూ తెలుగులో కవితలు, పద్యాలు, దండకాలు గట్రా వచ్చాయో లేదో నాకు తెలియదు కానీ ఈ చాయ్ సేవించి మహత్తరమైన తెలుగు ఉర్దూ కవిత్వాలు వెలువడినాయని మాత్రం నేను గట్టిగా చెప్పగలను.

ముఖ్యమైన సాహిత్య చర్చలు ఈ ఇరానీ హోటళ్లలోనే జరిగేవట!

హైదరాబాదీయులు ఉట్టి భోళా మనుషులు.

ఒక కప్పు చాయ్ త్రాగిస్తే చాలు ఎవరైనా సరే ఇట్టే మిత్రులుగా మారిపోతారు.

మనం ఎంత గొప్ప విజయం సాధించినా ఇక్కడి ప్రజలకు పెద్ద పెద్ద విందులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇరానీ హోటళ్లలో చాయ్ పార్టీ ఇచ్చినా చాలు మహదానంద పడిపోతారు.

ఈ చాయ్ విషయంలో ఇక్కడివారికి ఒక నియమం ఉంది. చాయ్‌ను ఎవరు తాగడానికి ఆఫర్ చేస్తారో వారే ఆ చాయ్ బిల్లు కట్టాలి. తెలియక పొరబాటున వేరొకరు బిల్లు కడితే తాగడానికి రమ్మన్న ఎదుటి వ్యక్తి అవమానంగా ఫీల్ అవుతాడు. ఒక్కోసారి అది వారిద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని బెడిసి కొట్టొచ్చు.


మన పురాణ కాలంలోనే ఈ ఇరానీ చాయ్ ఉండి ఉంటే మనం చదివే పురాణ కథలు మరోలా ఉండేవి.

రాక్షసులకు ఈ ఇరానీ చాయ్ రుచి తెలిసుంటే అమృతం కోసం తాపత్రయ పడేవారు కాదు. తమ దాయాదులకు దాన్ని వదిలి పెట్టేవారు.

పరమ శివుడు గరళాన్ని కాబట్టి అలా గొంతులో మ్రింగ కుండా ఉంచుకోగలిగాడు కానీ అదే గరం గరం ఇరానీ చాయ్ అయితే మ్రింగ కుండా ఉండగలగడం అతని తరం అయ్యేది కాదు.

అసలు సంజయుడు, శ్రీకృష్ణుడు కౌరవుల వద్దకు రాయబారానికి వచ్చినప్పుడు దుర్యోధనుడు వారికి ఇరానీ చాయ్ ఇచ్చి గౌరవించి ఉంటే మహాభారత సంగ్రామం జరిగి ఉండేదా?

ఇంత ప్రాధాన్యత కలిగిన ఇరానీ చాయ్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 40 పైసలకు దొరికేది.

తరువాత్తరువాత దీని ధర 50 పైసలు, 60 పైసలు, 75 పైసలు, ఒక రూపాయి, రూపాయి పావలా, రూపాయిన్నర, రూపాయి ముప్పావలా, రెండ్రూపాయలు, రెండున్నర, మూడురూపాయలు, నాలుగు రూపాయలు ఇలా పెరుగుతూ వచ్చింది.

మొన్నమొన్నటి వరకు ఈ ఇరానీ చాయ్ ఐదు రూపాయలకు దొరికేది.

ఇప్పుడు ఆరు రూపాయలు చేశారు.

మా ఆవిడ కిలో కంది పప్పు 72రూపాయలైందని గోల పెడుతోంటే నేను అంతగా పట్టించుకోలేదు.

కానీ చాయ్ ధర పెరిగిందంటే మాత్రం మనసులో విలవిల లాడుతున్నాను.

కేంద్ర ప్రభుత్వం పెట్రో ఉత్పత్తులపై సబ్సిడీ ఇచ్చి వాటి ధరలను అదుపు చేసినట్లు ఇక్కడి బల్దియా ఇరానీ చాయ్ పై సబ్సిడీ ప్రకటించాలి.

1, జులై 2009, బుధవారం

కథావార్షిక 2008 లో నా కథ!

మీరు సరిగ్గానే చదివారు.కీర్తిశేషులు మధురాంతకం రాజారాం స్మృత్యర్థం ఏర్పాటయిన మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ(తిరుపతి) 1999 నుండి ప్రతి యేటా కథావార్షిక పేరుతో కథా సంకలనాన్ని ప్రచురిస్తున్నది.డాక్టర్ వి.ఆర్.రాసాని, మధురాంతకం నరేంద్రగార్లు ఈ కథావార్షికలకు సంపాదకత్వం వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం వివిధ తెలుగు పత్రికలలో వచ్చిన కథలలో కొన్నింటిని ఎంచుకుని ఈ కథావార్షికలో ప్రచురిస్తున్నారు.ఈ సంస్థ కథావార్షిక ప్రచురించటంతో పాటు ప్రతి యేటా ఒక కథా సంపుటిని ఎంపిక చేసి ఆ కథారచయితకు కథాకోకిల పురస్కారం ప్రదానం చేస్తున్నది.2008 సంవత్సరానికిగాను కథాకోకిల పురస్కారం చిలుకూరి దేవపుత్ర రచించిన బందీ అనే కథాసంపుటికి లభించింది.2008లో వెలువడిన కథలలో తొమ్మిదింటిని ఎంపికచేసి, కథాకోకిల పురస్కారం పొందిన కథాసంపుటి నుండి బందీ అనే కథను వెరసి పది కథలను ఈ కథావార్షిక 2008లో ప్రచురించారు.ఇంకా ఈ పుస్తకంలో ఆడెపు లక్ష్మీపతి గారి '2008 కథా సాహిత్య సింహావలోకనం' అనే సమగ్రమైన వ్యాసం ఉంది.అంతే కాకుండా పుస్తకం చివరలో 2008లో వెలువడిన కథలలో చదువదగిన కథలు అంటూ ఒక 50 కథల జాబితా ఇచ్చారు.ఆ యేడాది వచ్చిన వందల కథల్లో వడపోసి ఈ 50 కథలను ఎంపిక చేసారన్నమాట.ఈ చదువదగిన కథల జాబితాలో నా కథ బహుమానం కూడా ఉంది.అదీ సంగతి!