...

...

28, జూన్ 2009, ఆదివారం

జగత్ కథ - డా. అక్కిరాజు రమాపతిరావు (మంజుశ్రీ)

(నా సంపాదకత్వంలో వెలువడిన కథాజగత్ పుస్తకంలోని పీఠికలో కొన్ని భాగాలు.)

"In the nineteenth century the invented story was used to do things that other literary forms- the poem, the essay - could not easily do; to give news about a changing society, to describe mental states ...." from prologue of - Beyond Belief - by V.S.Naipal.

వి.ఎస్.నయపాల్ గొప్ప రచయిత. విదేశాలలో పుట్టి పెరిగిన భారతీయ సంతతికి చెందినవాడు. భారత దేశమంటే భారతీయ మత సస్కృతులు, తరతరాల భారతీయ సామాజిక జీవితమంటే అభిమానమున్న రచయిత. అవగాహన ఉన్న రచయిత. ఆయనకు నాలుగేళ్ల కిందట నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఆయన సృజనాత్మక సాహిత్య రచనలు ఇంగ్లీషులోనే చేశాడు. ఆయనకు సాహిత్యానికే నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంగ్లాండ్‌లో చదువుకున్నాడు. కథాకథనంలో గొప్ప ప్రతిభావంతుడాయన. దేశ విదేశ యాత్రా వృత్తాంత రచనతో సుప్రసిద్ధుడు. కొత్తగా అంటే గత కొద్ది శతాబ్దాల కాలంలో ఇస్లామీకరణం చెందిన దేశాలలో ఆయన పర్యటించి అక్కడి జన జీవన వృత్తాంతాలను గాఢంగా విశ్లేషించి సామాజిక పరిణామాలకు స్పందించి రాసిన గ్రంథమే ఈ 'బియాండ్ బిలీఫ్' అనేది. ఈ గ్రంథానికి ఉపోద్ఘాతంగా కథన ప్రక్రియను గూర్చి రాసినవి పై ఇంగ్లీషు వాక్యాలు. కథనమంటే ఒక విషయాన్ని కథగా చెప్పడం. ఈ చెప్పడం నేర్పులో నయపాల్ అద్భుత ప్రజ్ఞాశాలి.

ఆయన పై చెప్పిన వాక్యాలలో భావం ఏమిటి? కథనం లేదా కథ చెప్పడం అనే ప్రక్రియ సారస్వత రీతులలో కొత్తది. అది పుట్టి సుమారు రెండు శతాబ్దాలే అయ్యింది. కవిత్వ ప్రక్రియ కాని, వ్యాసం కాని వెలువరించలేని జీవనానుభవాలను ఈ ప్రక్రియ సమర్థంగా, సంతృప్తికరంగా చిత్రీకరిస్తుంది. అసలు ఈ ప్రక్రియ అందుకే పుట్టింది. మారుతున్న సమాజాన్ని గూర్చి భోగట్టా, దాని వార్తాకథనం, మానసిక ప్రవృత్తుల విశ్లేషణ, చిత్తవృత్తుల చిత్రణ కోసం ఈ సాహిత్య ప్రక్రియ ఉద్దిష్టం.

కాబట్టి లోకమంతా కథా ప్రక్రియకు అనుగుణమైనదే. అవసరమైనదే. ప్రపంచమంతా కథలో ఇముడుతుంది. ఇమిడ్చవచ్చు. ప్రపంచంలోని వస్తువే కథా వస్తువు. ప్రపంచం వినా కథకు వస్తువు లేదు. అయితే కథా రచయిత దృష్టిలో ఎవరి ప్రపంచం వారిది. రాసేప్పుడు ఇదే ప్రపంచమనుకుంటాడు రచయిత. అట్లా అయితే తప్ప కలం సాగదు. కథ నడవదు. తనకు అవగాహన అయినంత మేరకు జగత్తును గూర్చే రాస్తాడు రచయిత. తన ముందు జగత్తు లేకపోతే కథ రాయలేడతడు. రాయడం కుదరదు. ప్రతి కథా అందువల్ల జగత్కథే అవుతుందనుకోవాలి. అట్లా అని కనీసం రచయిత భ్రమిస్తాడు. తన రచనని తాను ప్రేమిస్తాడు.

తెలుగు భాగవతంలో పోతన్నగారు 'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై తోచు పోలిక' అన్నట్లు కథా రచయితలకు కూడా ఈ జగత్తు అనే ప్రపంచం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధంగా అర్థమవుతుంది. సమాజంలో ఎందరు వ్యక్తులో, ఎన్ని ప్రవృత్తులో, ఎన్ని చిత్తవృత్తులో అన్ని కథలుంటాయి. రాయగలగాలే కాని ఎన్నో కథలు. 'ప్రపంచమొక పద్మవ్యూహం, కవిత్వమొక తీరని దాహం' అని శ్రీశ్రీ కూడా అందుకే అన్నాడేమో! అయితే ఆయన కవి కాబట్టి అట్లా అన్నాడు. కథా రచయితకు నిజంగా వర్తించ వలసిన భావమది.

తెలుగులో ఆధునికార్థంలో, ఆధునిక స్వరూప స్వభావాలతో కథా ప్రక్రియ పుట్టిన తర్వాత అంటే సుమారు నూరేళ్లలో ఒక లక్ష కథలు వచ్చి ఉండవచ్చేమో. సగటు సాలుసరి వెయ్యి కథలు వచ్చి ఉండవా అన్ని పత్రికలను, అందరు రచయితలను కలుపుకొంటే? పోనీ నాలెక్క అతిశయోక్తి అనో, ఉత్ప్రేక్ష అనో అనుకొంటే కొన్ని వేలు అనుకుందాం. అయినా ప్రపంచం అంతా కథలో ఇమడలేదు. వర్ణితం కాలేదు. పుష్పక విమానం లాగా ఎందరెక్కినా దానిలో చోటు ఉండనే ఉంటుంది. ఉండనే ఉంది. ఈ నూరేళ్ళలో తెలుగు కథా రచయితలలో కనీసం నూరుగురినైనా గొప్ప కథకులను పేర్కొనవచ్చు. గురజాడ నుంచి మొదలు పెట్టి ఇప్పటి వరకు ఒక వెయ్యి మంచి కథలనైనా ఎంచవచ్చు. దీనికి కావలసిన అధ్యయనమూ, ఆసుపాసులు, సమయం, సావకాశం కావాలి. రావాలి.

అసలు మంచి కథ అంటే ఏమిటి? మంచి కథ లేదా గొప్ప కథ అని ఎట్లా రాస్తే అంటారు? ఎందుకంటారు? ఎలా అంటారు? దాని ప్రమాణాలు ఏమిటి? ఎట్లా కొలుస్తాం దానిని? ఎట్లా విలువిస్తాం? అంటే నిత్య జీవితంలో తరచు ప్రాపంచికులకు (సామాజికులకు) ఎదురయ్యే ఒక సంఘటన లేదా ఒక సన్నివేశం ఉద్రేకభరిత, ఉద్వేగభరిత, సంఘర్షణ ఇద్దరు వ్యక్తుల మధ్య కాని, లేదా పదిమందికి సంబంధించినది కాని సంభవించినప్పుడు దానికి ప్రత్యక్ష సాక్షి అయిన స్పందనశీలుడైన వ్యక్తి అందులో జోక్యం కలించు కోవడం కాని, అదుపు చేయగలగడం కాని, ఆవేశకావేషాలను, అవ్వంచనీయ పర్యవసానాలను కొంతవరకైనా ఉపశమింప చేయగలగడం కాని నిర్వహించ గలిగినప్పుడు ఆయన నిర్వహించిన పాత్రతో ఒక గొప్ప లేదా మంచి కథా రచయిత రచనతో సాదృశ్యం చూపుతూ విశ్లేషణ పూర్వకంగా వివరించవచ్చు. ఉదాహరణకు వీధిలో (అది చిన్న ఊరైనా కావచ్చు, ఒక మోస్తరు పట్టణమైనా కావచ్చు, పెద్ద నగరమైనా కావచ్చు) బహు ఉద్రేకంగా రెచ్చిపోయి ఇద్దరు బలశాలురు చేయీ చేయీ, బుజమూ బుజమూ కలిపి జుట్టూ జుట్టూ దొరకబుచ్చుకునే సంఘర్షణ దృశ్యంలో దారినబోయే పెద్దమనిషి వాళ్ళిద్దరినీ సమీపించి తన రెండు చేతులతో వాళ్ళిద్దరినీ నిలువరించగలిగాడనుకొందాం. లేదా ఆ పెద్దమనిషి అపూర్వ వ్యక్తిత్వంతో వాళ్ళు తాత్కాలికంగానైనా రోజుతూ రొప్పుతూనైనా కాస్త ఎడమైనారనుకుందాం. ఆ పెద్దమనిషి అసలా ఉద్రిక్త సమస్య ఏమిటి? బహిరంగంగా అందుకు తలపడడంలో పర్యవసానాలు ఏమిటి?( ఎవరికైనా కాలో చెయ్యో విరగడమో, రక్తం పోవడమో, పోలీసులు పట్టుకెళ్ళడమో) అని గట్టిగా బోధించి ఒకరిని తన వెంటబెట్టుకొని వెళ్ళడమో, లేదా రక్షక భటుల పాలు చేయడమో చేస్తాడనుకుందాం. సమాజంలో దురన్యాయాలు, దౌర్జన్యాలు, అసబబులు, అపకారాలు, స్వార్థం, క్రౌర్యం, ద్వేషం, దుఃఖం, కపటం, మోసం, వంచన, మానసిక దురుద్రేకాలు, బలహీనతలు, హింస ఉంటూనే ఉంటాయి కదా! ఇవి లేకపోతే ప్రపంచం లేదు. ఇవి స్పర్థిస్తున్నపుడు బలవంతుడు, గుణవంతుడు, ధర్మాగ్రహ పక్షపాతి తన చేతులు చాచి అదుపు లేదా నిరోధకానికి పూనుకోవడం ధర్మం కదా! న్యాయం కదా! తాత్కాలికంగానైనా ఉపశమింప చేయాలి కదా! తక్షణ నష్టాన్ని అరికట్టాలి కదా! సాహిత్యం కర్తవ్యమది. బాధ్యత అది. జవాబుదారీ తనమది. అయితే వయసు చాలని ఏ కౌమార వయస్కుడో, వయసు మళ్ళిన ఏ వృద్ధుడో ఘర్షిస్తున్న వ్యకులను వారించలేడు. అన్యాయాలను, అక్రమాలను బోధించలేడు. వాళ్ళు ఆ 'పెద్దమనిషి'ని లెక్కచెయ్యరు సరికదా ఈసడిస్తారు. తోసివేస్తారు. పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు స్వీయహాని కూడా జరగవచ్చు ఈ తీర్పరికి. నేర్పరితనం అంటే బలం, వయస్సు, లోకానుభవం, అనుశాసకత్వం, వ్యక్తి ఓడ్డు పొడుగులతో ఒక ధాటి ఉన్నప్పుడు కాని ఘర్షణ వ్యక్తులపైన ఆయన మాట పనిచేయదు. అందువల్ల అటువంటి సందర్భాలలో సామాన్యులెవరూ సాధారణంగా ఆ జోలికి పోరు. ఆ దెబ్బలాటలు, ఆ వైషమ్యాలు, నష్టాలు, కష్టాలు అట్లా సాగిపోతూనే ఉంటాయి.

ఇదంతా ఏమిటి? ఏ అంతరార్థాన్ని చెప్పటానికి ఈ సాదృశ్యం, ఈ సమాజ జీవిత దృశ్యాల, నేరమనస్కుల ప్రస్తావన? అంటే కథా రచయిత సమాజ సంఘర్షణలలో, లోపాలలో, అనర్థకాలలో జోక్యం కలిగించుకోగల, మంచి చెడ్డల విచక్షణ సమాజం పాటించేట్లు చెప్పగల, చేయగల సత్తా కలవాడై ఉండాలని చెప్పడానికే. సమర్థుడు కాకపోతే అతడు చేయగలిగిందేమీ ఉండదు. పైగా ఈసడింపుకూ, అప్రయోజకత్వానికీ గురి అవుతాడు. కథా రచయిత సామర్థ్యానికీ ఇందులో సాదృశ్యముంది. ఆయన రచనలో శిల్పం, ఎత్తుగడ, ముగింపు, పాత్రల మనోభావ ఉన్మీలన, కళ, అసలు వస్తువును ఎంచుకోవడంలో అతని సామర్థ్యం ఉంటుంది. అప్పుడే రచయిత సామర్థ్యం, ప్రతిభ వెలికి వస్తాయి. రచయితలో సాహిత్య స్పందనశీలం ఉన్నప్పుడే అతడు లేదా ఆమెనుంచి మంచి రచన ఒక్కక్కసారి గొప్ప రచన ఆశించగలం.

కథారచన ఫోటోగ్రఫీ వంటిది కాదు. సృజనాత్మకమైన చిత్రకళ వంటిది. వర్ణ చిత్రకళ వంటిది. ఫోటోగ్రఫీలో కూడా సృజనాత్మకత లేకపోలేదు. కాని సాంకేతిక విజ్ఞాన పరికర సాహాయ్యం ఉంటుంది. ఒకొక్కసారి ప్రతిభావంతుడు కాని చిత్రకళాకారుడికంటె ఫోటోగ్రాఫర్ తీసిన బొమ్మే అందంగా ఉండి ఉండవచ్చు. కాని సృజనాత్మకత లోకాన్ని చూసినంత మాత్రం చేత అలవడదు. అవగాహన చేసుకోగలగాలి. ఆర్తి కావాలి. ఆత్మీయత కావాలి లోకంతో. అప్పుడే కళాకారుడికి తన కళలో యోగసిద్ధి కలుగుతుంది. ఫుటోగ్రఫీ వృత్తినిపుణులలో కూడా అందరూ గొప్ప ప్రతిభావంతులనిపించు కోవటం లేదు కదా! అట్లానే కవులైనా, నాటకకర్తలైనా, సాహిత్య తత్త్వవేత్తలైనా, కథారచయితలైనానూ.

మంచి రచయిత అనిపించుకోవాలంటే, మంచి రచన చేయాలంటే లోకాన్ని అర్థం చేసుకోవడం ఎంత అగత్యమో, ఎంత అవసరమో, గొప్ప సాహిత్యాన్ని అధ్యయనం చేయడం కూడా అంతకన్న అధిక ప్రయోజనం. గొప్ప రచయితలు లోకాన్ని మనం అర్థం చేసుకొనేట్లు చేస్తారు. మనకెంతో ఆసరా అవుతారు.

ఏ రచన అయినా అది చదివే పాఠకుని స్థాయిని బట్టి బాగోగుల సాపేక్షతను ప్రస్తావించాల్సి ఉంటుంది. పాఠకుల స్థాయితో బాటే రచయిత స్థాయి కూడా ఎప్పటికప్పుడు ఎదగాల్సి ఉంటుంది. 'క్షణ క్షణే యన్నవతా ముపైతి'లాగా రచయిత శిల్పం, లోకం పట్ల ఆర్తి, అవగాహన, సాహిత్య స్పందన విస్తరించుకోవలసి ఉంటుంది.

27, జూన్ 2009, శనివారం

సమస్యాపూరణం!

సమస్య : సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్

కొన్ని పూరణలు :

సందర్భం : ఒక అభాగ్యుడు, తన తల్లి తనతో ఉండటానికి రాగానే ...
1. మతి తప్పిన వాడయ్యెన్ !
సతి చాయాదేవి, మాత సూర్యా కాంతం
గతమెప్పుడు కలవని పిత-
సతి, సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్! - కృష్ణ కొండక



2. మతిబోయెనేమి మీకున్?
అతి తెలివికి పోదురేల? అమెరిక నందై
న తమకిది సాధ్యమౌనా!-
సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టన్ - కృష్ణ కొండక

3. సతి యొకతె అండ మిచ్చిన
రతి యెరుగని పడతి యొకతె పిండము మోయన్
సుతుడెదిగి జంగమాయెను
సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్ - విస్సావఝల ప్రభాకర్


4. అతిభక్తు డయిన పురుషుడు
సుతార్థి యగుచు గుడులెల్ల చుట్టుచు నొకచో
వ్రత నిస్ఠను సత్రంపు వ
సతి, సతి కలయంగనొక్క సాధువు పుట్టెన్. - శ్యామల రావ్


5. గతి లేకన్ పస లేకన్
గుతగుత మని వ్రాయనేల దినకరుచే పూ-
రితమును జదివిన తెలియును:
సతి సతి కలయంగ నొక్క సాధువు పుట్టెన్ - కె. సదానంద

6. సతి పతి శిరసున నుండెడి
అతి మోహన రూపి, వెన్నెలల నిచ్చెడి రే
డతి ప్రీతి పంచ ద్వే విం-
సతి సతి కలయంగనొక్క సాధువు పుట్టెన్ - చిలుకూరి సత్యదేవ్


పై పూరణలు నుండి తెలు(గు)సా(హిత్యం) ఫోరం నుండి గ్రహించబడ్డాయి. చతురులైన బ్లాగుమిత్రులు ఎవరైనా ఇదే సమస్యను పూరించమని కోరుతున్నాను.

బతకనివ్వండి

సీనియర్ కథారచయితలలో ఒకరైన శ్రీ విహారి (జె.ఎస్.మూర్తి) గారి కథ బతకనివ్వండి కథాజగత్ బ్లాగులో చదివి మీ అభిప్రాయం తెలియజేయండి.

22, జూన్ 2009, సోమవారం

పుస్తక సమీక్ష! -11 తీవ్రవాదం

[పుస్తకం పేరు: తీవ్రవాదం, రచయిత: కస్తూరి మురళీ కృష్ణ, పేజీలు: 264, వెల: రూ.100/- , ప్రతులకు: పాలపిట్ట బుక్స్, 16-11-20/6/1/1, విజయ సాయి రెసిడెన్సీ, సలీం నగర్, మలక్‌పేట్, హైదరాబాద్ 500 036]

పాపులర్ రచయిత కస్తూరి మురళీ కృష్ణ వారం వారం వ్రాస్తున్న రాజకీయ కాలమ్ పవర్ పాలిటిక్స్‌లో తీవ్రవాదానికి సంబంధిచిన 35 వ్యాసాలను ఎంపిక చేసి ఈ సంపుటంలో ప్రకటించారు.ఈ వ్యాసాలన్నీ 2000-2008 సం.ల మధ్య కాలంలో వెలువడినవే. తీవ్రవాదం అంటే ఏమిటో, దాని పుట్టు పూర్వోత్తరాలు, ప్రపంచ వ్యాప్తంగా దాని విశ్వరూపం, తీవ్రవాదానికి కారణాలు, ప్రేరణలు, ఈ సమస్యపై లోతైన విశ్లేషణ వగైరా ఈ వ్యాసాల్లో చర్చింప బడింది.

ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇజ్రాయిల్, ఇండొనేషియా,బంగ్లా దేశ్,లైబీరియా, సూడాన్, కంబోడియా, థాయ్‌లాండ్, సింగపూర్, ఫిలిప్పీన్స్, చైనా, మలేషియా, టర్కీ,చెచెన్యా,సౌదీ అరేబియా, స్పెయిన్, శ్రీలంక మొదలైన దేశాలలోని తీవ్రవాద కార్యకలాపాలనే కాక మన దేశంలోని ఈశాన్య రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, గుజరాత్ వంటి రాష్ట్రాలు, ముంబయ్,హైదరాబాద్ వంటి నగరాలలో జరిగిన తీవ్రవాద దుశ్చర్యలపై ఈ వ్యాసాలలో సమగ్రంగా చర్చింపబడింది. ఈ దుశ్చర్యలకు కారణమైన రాజకీయ, సాంఘిక, మత పరమైన కారణాలు వివరించబడింది. తాలిబాన్, ఆల్‌ఖైదా, లష్కర్-ఎ-తొయిబా, ఎల్.టి.టి.ఈ., వంటి ఉగ్రవాద సంస్థల గురించి ఈ పుస్తకంలో సమగ్రమైన సమాచారం లభిస్తుంది.

ఈ తీవ్రవాద సమస్య పరిష్కారానికి కావలసిన మార్గాల అన్వేషణ గూర్చి ఈ పుస్తకంలో కూలంకషంగా వివరించబడింది. దీన్ని ప్రాంతీయ సమస్యగా కాకుండా ప్రపంచ సమస్యగా పరిగణించాలి. ప్రభుత్వాలు ప్రజలలోని అసంతృప్తి, అభద్రతాభావాలను పోగొట్టి ప్రజల విశ్వాసాలను చూరగొనాలి. అలాగే ధృఢమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవాలి. రాజకీయ నాయకులు తమ అధికార దాహం, స్వార్థం వదిలి దేశభవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని విచక్షణ ప్రదర్శించాలి. దేశ సరిహద్దులను కట్టుదిట్టం చేసి, అక్రమ రవాణాను, చొరబాటుదార్లను అరికట్టాలి. వలస వచ్చేవారిని, దొంగతంగా దేశంలో ప్రవేశించే వారిని ఏరివేయాలి. దేశద్రోహ చర్యలకు పాల్పడేవారిని ఎవరినైనా సరే నిర్దాక్షిణ్యంగా శిక్షించాలి. తాము పెంచి పోషిస్తున్న ఉగ్రవాదం చివరకు తమకే ముప్పుగా పరిణమిస్తుందని అన్ని దేశాలు గ్రహించాలి.

అయితే అన్ని ప్రాంతాల తీవ్రవాద సమస్యలకూ ఒకే రకమైన పరిష్కారం సాధ్యం కాదు. అక్కడి చారిత్రక, రాజకీయ పరిస్థితులు సమస్యను ప్రభావితం చేస్తాయి. మనం తీవ్రవాదం అని భావిస్తున్న దానిని అది ఆచరించేవారు హక్కుల పోరాటంగానో, స్వాతంత్ర్య సమరంగానో భావిస్తున్నారు. శాంతి సాధనకు సైనిక చర్య ఒక్కటే మార్గం కాదు.

తీవ్రవాదుల మానసిక ప్రవర్తనను విశ్లేషిస్తూ రచయిత కస్తూరి ఒక చోట వారు పబ్లిసిటీని కోరుకుంటారని అంటున్నారు. నిజమే. మన మీడియా ఇస్తున్న పబ్లిసిటీ కారణంగానే తీవ్రవాదులు ఇంకా పేట్రేగి పోతున్నారు. మన మీడియా, రచయితలు ఈ సమస్యపై ఎంత తక్కువగా స్పందిస్తే అంత తీవ్రవాదాన్ని తగ్గించిన వారమౌతాము.

మొత్తం మీద ఈ పుస్తకం తీవ్రవాదంపై పాఠకునికి ఒక స్పష్టమైన, సంపూర్ణమైన అవగాహనను కలిగిస్తుంది. ఆ మేరకు రచయితా, ప్రచురణ కర్తా విజయం సాధించినట్లే.

15, జూన్ 2009, సోమవారం

మానసవీణ - ఐతా చంద్రయ్య కథ

పండక్కి మామ గారింటికి వచ్చిన సుధీర్ మనసులో పెద్ద ప్లాన్ వేసుకున్నాడు. మరదలికి అమెరికా సంబంధం చూసి పెళ్ళి చేసి అమెరికా పంపిస్తే మామ గారి పట్నం బంగళా నొక్కెయ్య వచ్చని సుధీర్ ఆశ. అయితే సుదీర్ ఆశలపై మరదలు మానస ఎలా నీళ్లు చల్లిందో తెలుసుకోవాలంటే ఐతా చంద్రయ్య వ్రాసిన మానసవీణ కథ చదవాల్సిందే. నవ్య వీక్లీ ఫిబ్రవరి 11, 2009 సంచికలో వచ్చిన ఈ కథ మీకోసం కథాజగత్‌లో ఉంచాం. చదివి మీ అభిప్రాయం చెప్పండి.

14, జూన్ 2009, ఆదివారం

శతజయంతి ఉత్సవాలు

రెండ్రోజులుగా ఇంట్లో 'నెట్' మొరాయించటంతో పొద్దున సైబర్‌కేఫ్‌కు వెళ్ళి నా టపా పై వచ్చిన కౌంటర్లు చదివి సమాధానం వ్రాస్తుండగా సాహితీ మిత్రుడు తంగిరాల చక్రవర్తి నుండి ఫోన్ వచ్చింది తెలుగు విశ్వవిద్యాలయంలో శ్రీశ్రీ పై సభ జరుగుతోంది పోలేదా అంటూ. ఎప్పుడు అని అడిగాను. ఇప్పుడే, ఓల్గా కండక్ట్ చేస్తోంది అన్నారు. శ్రీశ్రీ మత్తు ఇంకా దిగక పోవడంతో ఆ సభకు హాజరు కావాలని డిసైడ్ అయ్యాను.నేను నిక్కుకుంటూ నీలుగుకుంటూ సభ జరుగుతున్న తెలుగు విశ్వవిద్యాలయం చేరెసరికి మధ్యాహ్నం ఒంటిగంట దాటింది.(మధ్యలో క్యాట్రిడ్జ్ రీఫిల్ చేయించుకునే పని తగిలింది మరి.)అక్కడికి వెళ్లే సరికి ఉదయం సెషన్ పూర్తయ్యి అందరూ భోజనాలకు వెళ్తున్నారు. హాలు బయట వరండాలో నిల్చుని అక్కడ ప్రదర్శిస్తున్న పుస్తకాల వైపు చూస్తున్నాను. టీవీ గొట్టం ముందు నిలబడి ఎ.బి.కె.ప్రసాద్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు. మరో చానల్ కెమెరా ముందు ఓల్గా శ్రీశ్రీ మహాప్రస్థానం కవితను గట్టిగా వినిపిస్తున్నారు. ఇంటర్వ్యూ పూర్తయ్యిందేమో ఓల్గా గారు వెళ్తూ నన్ను భోజనం చెయ్యమని రిక్వెస్ట్ చేశారు.బాహుశా నన్ను మీడియా పర్సన్ అని అనుకున్నారేమో! మొదట మొహమాట పడినా ఆత్మారాముడి ఆదేశంతో భోజనం చేసే వైపుకు వెళ్ళక తప్పలేదు. తెలిసిన మొఖాలేవీ కన్పించక పోవడంతో అనవసరంగా బుక్ అయ్యానేమో అని అనిపించింది. క్యూలో పళ్లెం పట్టుకుని నిలబడి వాళ్లు వడ్డించినవేవో తీసుకుంటూ ఇవతలకు వచ్చాను.ఇదేదో ప్రైవేట్ ఫంక్షన్‌లా ఉంది. ఎక్కువ మంది ఆడవాళ్లే కనిపిస్తున్నారు. తింటూ సింగమనేని గారిని విష్ చేసి పరిచయం చేసుకున్నాను. మా జిల్లా వాడే కావడంతో కొంత బాగానే మాట్లాడారు. ఇంతలో ఎవరో వచ్చి ఆయనతో మాట్లాడ సాగారు. ఈ లోగా వొరప్రసాద్ కనిపించడంతో అటు వెళ్ళాను. అతనితో మాట్లాడుతూ భోజనం అయ్యిందనిపించాను. హమ్మయ్య అనుకుంటూ హాల్‌లో ఒక ఫ్యాను చూసుకుని దాని కింద కూర్చొన్నాను. అప్పుడు తెలిసింది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది ఆస్మిత అనే మహిళా రచయితల సంస్థ అని. కొడవటిగంటి కుటుంబరావు, సుద్దాల హనుమంతు, శ్రీశ్రీ, మహీధర రామమోహన రావు గారల శతజయంతులతో పాటు మధురవాణి పాత్రకు కూడ శతజయంతిని ఉమ్మడిగా ఈరోజు నిర్వహిస్తున్నారని అర్థమయ్యింది.ఉదయం కార్యక్రమంలో సుద్దాల హనుమంతు, శ్రీశ్రీ, కొకులపై సింగమనేని, అశోక్‌తేజ తదితరులు మాట్లాడారని తెలిసింది. మధ్యాహ్నం సరిగ్గా 2.30గంటలకు సభ ప్రారంభమయ్యింది.మొదట పదినిమిషాలు కొండపల్లి కోటేశ్వరమ్మ మహీధర రామ మోహన రావు గారి గురించి తన జ్ఞాపకాలను పంచుకున్నారు. మధ్యలో ఓల్గా గారు మధురవాణి, మహీధరల గురించి ఒక ఇరవై నిమిషాలు ప్రసంగించారు. మిగతా సమయమంతా శ్రీశ్రీ కవితాగానంతో గడిచింది. శ్రీశ్రీ రాసిన కవితలను చదువుతూ వచ్చిన వారంతా సభికులను మరో ప్రపంచంలోకి తీసుకు వెళ్ళారు.కవితాపఠనం చేసిన వారిలో ఎన్.వేణుగోపాల్, మృణాళిని, చిల్లర భవానీ దేవి, దర్భశయనం, కొండవీటి సత్యవతి,వొర ప్రసాద్, సత్యభాస్కర్, కందుకూరి శ్రీరాములు,అక్కినేని కుటుంబరావు మొదలైనవారున్నారు. చివర్లో యాకూబ్ గానం చేసిన జగన్నాథ రథ చక్రాలతో సభ ముగిసింది. శ్రీశ్రీ శత జయంతి కార్యక్రమాన్ని ఎలా జరుపుకోవాలో ఆస్మిత సంస్థ చేసి చూపించింది. ఈ సభలో శ్రీశ్రీ కవితా గానం విన్న తర్వాత అంతకు ముందు శ్రీశ్రీ పై వ్రాసిన టపాలో నేను పడిన ఆవేదన అంతా మటుమాయం అయ్యింది. మూడు గంటలు వృథా కాకుండా ఒక మంచి కార్యక్రమం చూసిన ఆనందం కలిగింది. అన్నట్లు శ్రీశ్రీ కవితాపఠనం చేసిన వారిలో మన బ్లాగరు కూడా ఉన్నారండోయ్! అతడు/ఆమె ఎవరో నేను చెప్పను. సస్పెన్స్. మీరే గెస్ చెయ్యండి!!!

11, జూన్ 2009, గురువారం

శ్రీశ్రీని కించ పరచడం మానలేరా?!

నవ్య వీక్లీ ఈవారం శ్రీశ్రీ ప్రత్యేక సంచికను తీసుకు వచ్చింది. ప్రస్తుతం స్టాండ్స్‌లో ఉన్న ఈ సంచిక (17-6-2009)లో శ్రీశ్రీ రచనలు కవితా!ఓకవితా!, మానవుడా!, బాలల వత్సరం, చరమరాత్రి (కథ)లతో పాటు శ్రీశ్రీతో పరిచయమున్న ప్రముఖ సాహిత్య వేత్తల వ్యాసాలున్నాయి. అద్దేపల్లి రామమోహన్‌రావు, రావికొండలరావు, కొలకలూరి ఇనాక్, కేతు విశ్వనాథ రెడ్డి, చలసాని ప్రసాద్,అదృష్ట దీపక్, అబ్బూరి చాయాదేవి, పాపినేని శివశంకర్, ఎం.వి.రమణారెడ్డి, పంతుల జోగారావు, శైలకుమార్, బి.కె.ఈశ్వర్, శ్రీపతి, ఎన్.వేణు గోపాల్, ప్రయాగ రామకృష్ణ, ఎ.ఎన్.జగన్నాథ శర్మ, డి.వెంకట్రామయ్య,నిఖిలేశ్వర్, భూమన్ తదితరులు శ్రీశ్రీ తో తమ ప్రత్యక్ష అనుబంధాన్ని వివరిస్తే, వసంత లక్ష్మి, ఓల్గా తదితరులు శ్రీశ్రీ రచనలపై తమ వ్యాసాలను రాశారు. శ్రీశ్రీ సమగ్ర స్వరూపాన్ని ఆవిష్కరించడంలో ఈ ప్రత్యేక సంచిక కృతకృత్యమయ్యింది. సాహిత్యాభిలాషులందరూ ఈ ప్రత్యేక సంచికను కొని చదివి దాచుకోవలసినదిగా నేను రికమెండ్ చేస్తున్నాను.

శ్రీశ్రీ జీవితం ఒక తెరచిన పుస్తకం లాంటిది. ఆయన బలహీనతలను ఆయన ఎప్పుడూ దాచుకోలేదు. తన జీవిత చరిత్ర అనంతంలోను బయట అనేక సందర్భాలలోనూ తన బలహీనతల గురించి చెప్పుకున్నాడు.శ్రీశ్రీ జీవించి ఉన్నప్పుడు ఆయన వ్యక్తిగత జీవితం మీద, దుర్వ్యసనాల మీద అనేక దుమారం రేగింది. అదంతా బహిరంగ రహస్యమే.అయితే ఇన్నేళ్ల తరువాత కూడా ఆ మహాకవి మరణించిన తరువాత కూడా శ్రీశ్రీ శతజయంతి జరుపుకుంటున్న ఈ తరుణంలో ఆయనను జ్ఞాపకం చేసుకునే నెపంతో అనవసరమైన విషయాలను ప్రస్తావించడం ద్వారా ఆయన జీవితంపై బురద జల్లడం, ఆయన వ్యక్తిత్వాన్ని కించపరచడం వంటి చర్యలకు పూనుకోవడం హేయమనిపిస్తుంది. మన మధ్య లేని వ్యక్తిపై ఇలా వ్యక్తిత్వంపై దాడి చేయడం ఉద్దేశ్య పూర్వకంగానేమో అని అనుమానం కలుగక మానదు. ఈ పనికి పూనుకున్నది ప్రముఖ రచయితలంటే ఆశ్చర్యం కలుగకా మానదు.

ఈ రచయితలంతా కలిసి శ్రీశ్రీని ఒక తాగుబోతుగా మనకు పరిచయం చేస్తున్నారు అక్కడికేదో కొత్త విషయం కనుగొన్నట్టు.
అద్దేపల్లి గారు శ్రీశ్రీతో మరిచిపోలేని అనుభవాలు ఇలా తెలుపుతున్నారు.
ఆ రాత్రి వారిద్దరూ బస చెయ్యడానికి ఒక గెస్ట్‌హౌస్ తీసుకున్నాం. అక్కడ శ్రీశ్రీ, హరనాథ్, నేనూ, మరి నలుగురు విద్యార్థులు ఉన్నాం. వారిద్దరికీ మధువు కావాలి. అవి మద్య నిషేదం రోజులు. విద్యార్థుల్లో ఒక గొప్ప వ్యాపారస్థుడి కుమారుడున్నాడు. అతని ఇన్ఫ్లూయెన్స్ ఉపయోగించి మద్యం సీసాలు తెప్పించాలి....
...............
శ్రీశ్రీకి మద్యపానంలోని పరాకాష్ఠ దశ వచ్చింది.
...... శ్రీశ్రీ మధుపాన అనంతరం కుర్చీలో కూర్చొనే గాఢ నిద్ర పోతున్నాడు.......
....శ్రీశ్రీ క్రమక్రమంగా పైజామా పైకి లాగాడు. నిరాఘాటంగా మూత్రీకరణ జరిగింది.


కేతు విశ్వనాథరెడ్డి తన వ్యాసంలో ఎలా శ్రీశ్రీని డీఫేం చేస్తున్నారో చూడండి.
ఆయన అరచేతుల చొక్కా చిరిగి ఉంది.పైజామా కూడా అంత బాగాలేదు. మరో ఇస్త్రీ చేసిన బట్టల జతలేదు. అప్పటి కప్పుడు ఆలోచించి ..... చెన్నారెడ్డి ఇంటికి వెళ్లి బట్టలు తెచ్చాడు. శ్రీశ్రీ ఒక్క ముక్క మాట్లాడకుండానే ప్రవక్త లాంటి చిరునవ్వుతో ఆ దుస్తులు వేసుకున్నాడు. టక్ చేసుకున్న ఆ దుస్తులతోనే అందరం ఫోటొ దిగాం.

ఇంతవరకు ఓర్చుకోవచ్చు. ఇది చదవండి.
... ఒకటి రెండు రోజుల్లో మద్రాసు వెళ్తారనగా ఆయనకు సరిగ్గా మంచి దుస్తులు లేని విషయాన్ని బంగోరె పసిగట్టాడు. యిద్దరం తిరుపతిలోని గాంధీరోడ్‌లో తీర్థకట్ట వీధికి ఆనుకుని మేడ మీద ఉన్న టైలర్ వద్దకు వెళ్లాం. తెల్లటి శ్రీశ్రీ మార్కు బట్టను కొని నాలుగు జతలు కుట్టించి తెచ్చాము.... శ్రీశ్రీకి నాలుగు జతల బట్టలు కుట్టించి ఉంటే కుట్టించి ఉండొచ్చు గాక. ఆ విషయాన్ని పేర్కొని శ్రీశ్రీ దారిద్ర్యాన్ని ఇప్పుడు ప్రస్తావించడం సబబేనా?
ఇక శ్రీశ్రీ తాగుడుకు సంబంధించి కేతు విశ్వనాథరెడ్డి ఇలా చెబుతున్నారు. .... సభానంతరం ఆ రాత్రి సన్నిహిత మిత్రులం ఓ ఐదారు మంది పార్టీ ఏర్పాటు చేసుకున్నాం..... శ్రీశ్రీకి కావలసిన ఏర్పట్లు ఉదయం నుంచీ చేయనే చేశాం. ఆ రాత్రికీ చేశాం.......
"ఇంకా వుందా" అనడిగాడు..... మాలోమేము గుసగుసలాడుకుని రమ్ము తెప్పించాము.....
తిరుపతిలో ఎక్సైజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్‌గా పని చేస్తున్న కవి శ్రీశ్రీ అభిమాని మా మిత్రుడు సమ్మద్ రెండు 'రాయల్ చాలెంజ్' సీసాలు తెచ్చి నా చేతికి ఇచ్చి "అవి మద్రాసుకు చేరే ఏర్పాట్లు చెయ్యండి" అన్నాడు
. ఈ విషయాలన్నీ పేర్కొనడం అవసరమా?

ఇక కొలకలూరి ఇనాక్ గారి వ్యాసం కొంచెం, కొంచెం ఏమిటి పూర్తి తేడాగా ఉంది. శ్రీశ్రీ వర్ణ వివక్షత పాటిస్తాడన్న అర్థం వచ్చేటట్లు ఈ వ్యాసం కొనసాగుతుంది. కుమ్మరి కమ్మరి సాలెల అన్నారు గానీ మాలలు మాదిగలు అనలేదని అరోపిస్తున్నారు.తనతో తోడుండి భోజనం చేయమంటే తిరస్కరించి కుల వివక్షతను పాటించి ఆనేరం శ్రీశ్రీ పై వెయ్యడం ఇనాక్‌కే చెల్లుతుంది.

ఇంకా శ్రీశ్రీ మందు పురాణాన్ని ప్రస్తావించిన వారిలో అబ్బూరి చాయాదేవి, ఎం.వి.రమణా రెడ్డి, మురారి మొదలైనవారున్నారు.

శ్రీశ్రీ మద్యం గొడవ ఇన్నాళ్లైనా ఇలా కొనసాగించడం కేవలం యాదృచ్చికమేనా? లేక ఇంకా కుట్ర జరుగుతోందా? ఏది ఏమైనా శ్రీశ్రీ ఘనతకు లవలేశమైనా నష్టం వాటిల్లదు.