...

...

22, నవంబర్ 2015, ఆదివారం

మూడో కేసు!

ఈ టపాకు శీర్షిక కాస్త ఎబ్బెట్టుగా ఉండవచ్చేమో కానీ ఈ టపా మటుకు ఆసక్తిని కలిగిస్తుందనే అనుకుంటున్నాను. 
పుట్టపర్తి నారాయణాచార్యులు తాను వ్రాసిన పెనుకొండలక్ష్మి అనే కావ్యాన్ని విద్వాన్ పరీక్ష కోసం తానే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక అపురూప  ఘట్టం. దీని గురించి సాహిత్యలోకంలో చాలామందికి తెలుసు. ఇలాంటి సంఘటనే వానమామలై వరదాచార్యుల జీవితంలో కూడా చోటు చేసుకుంది. తాను రచించిన మణిమాల కావ్యాన్ని ఆంధ్ర విశారద పరీక్షకోసం వానమామలై చదువవలసి వచ్చింది.  ఈ విషయం కూడా చాలా మందికి తెలిసే ఉండవచ్చు. అయితే ఆశ్చర్యకరంగా ఇలాంటి సంఘటనే మరో సాహితీమూర్తి జీవితంలో కూడా సంభవించడం బహుశా అతికొద్ది మంది దృష్టికే వచ్చి ఉంటుంది. ఆర్షవిద్యావిశారద జోస్యం జనార్దనశాస్త్రి తాను రచించిన మంత్రిత్రయం అనే రచన ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలలో ఇతనికే పాఠ్యగ్రంథం అయ్యింది. వీరిలో పుట్టపర్తి, జోస్యం వారలు అవధానాలు చేశారు. ఇద్దరికీ అనంతపురం జిల్లాతో అనుబంధం ఉంది. పుట్టపర్తి నారాయణాచార్యులు అనంతపురం జిల్లాలో జన్మించి కడపజిల్లా ప్రొద్దుటూరులో స్థిరపడితే, జోస్యం జనార్దనశాస్త్రి కర్నూలు జిల్లాలో జన్మించి అనంతపురం జిల్లా తాడిపత్రిలో నివసించారు. ఇక పుట్టపర్తి, వానమామలై ఉభయులకూ అభినవ కాళిదాస, అభినవ పోతన బిరుదులు ఉంటే జోస్యం వారికి అభినవ వేమన బిరుదు ఉండటం గమనార్హం!