...

...

22, నవంబర్ 2015, ఆదివారం

మూడో కేసు!

ఈ టపాకు శీర్షిక కాస్త ఎబ్బెట్టుగా ఉండవచ్చేమో కానీ ఈ టపా మటుకు ఆసక్తిని కలిగిస్తుందనే అనుకుంటున్నాను. 
పుట్టపర్తి నారాయణాచార్యులు తాను వ్రాసిన పెనుకొండలక్ష్మి అనే కావ్యాన్ని విద్వాన్ పరీక్ష కోసం తానే చదివి పరీక్ష వ్రాయవలసి రావడం ఒక అపురూప  ఘట్టం. దీని గురించి సాహిత్యలోకంలో చాలామందికి తెలుసు. ఇలాంటి సంఘటనే వానమామలై వరదాచార్యుల జీవితంలో కూడా చోటు చేసుకుంది. తాను రచించిన మణిమాల కావ్యాన్ని ఆంధ్ర విశారద పరీక్షకోసం వానమామలై చదువవలసి వచ్చింది.  ఈ విషయం కూడా చాలా మందికి తెలిసే ఉండవచ్చు. అయితే ఆశ్చర్యకరంగా ఇలాంటి సంఘటనే మరో సాహితీమూర్తి జీవితంలో కూడా సంభవించడం బహుశా అతికొద్ది మంది దృష్టికే వచ్చి ఉంటుంది. ఆర్షవిద్యావిశారద జోస్యం జనార్దనశాస్త్రి తాను రచించిన మంత్రిత్రయం అనే రచన ఎస్.ఎస్.ఎల్.సి పరీక్షలలో ఇతనికే పాఠ్యగ్రంథం అయ్యింది. వీరిలో పుట్టపర్తి, జోస్యం వారలు అవధానాలు చేశారు. ఇద్దరికీ అనంతపురం జిల్లాతో అనుబంధం ఉంది. పుట్టపర్తి నారాయణాచార్యులు అనంతపురం జిల్లాలో జన్మించి కడపజిల్లా ప్రొద్దుటూరులో స్థిరపడితే, జోస్యం జనార్దనశాస్త్రి కర్నూలు జిల్లాలో జన్మించి అనంతపురం జిల్లా తాడిపత్రిలో నివసించారు. ఇక పుట్టపర్తి, వానమామలై ఉభయులకూ అభినవ కాళిదాస, అభినవ పోతన బిరుదులు ఉంటే జోస్యం వారికి అభినవ వేమన బిరుదు ఉండటం గమనార్హం!  

17, ఆగస్టు 2015, సోమవారం

సీమకథ సుగంధం

చిగురుకల అంతర్జాల మాసపత్రికలో మొదటితరం రాయలసీమకథలు పుస్తకం పరిచయం చేయబడింది. 


15, ఆగస్టు 2015, శనివారం

వన్నెతగ్గని అలనాటి కథలు

మిత్రులకు, శ్రేయోభిలాషులకు, తురుపుముక్క పాఠకులకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!


ఆంధ్రభూమి దినపత్రిక 15 ఆగస్టు 2015 సంచికలో ప్రచురితం

26, జులై 2015, ఆదివారం

రాయలసీమ కథారత్న పేటికలు

మొదటితరం రాయలసీమకథలు పుస్తకంపై చెన్నై ఆకాశవాణి బి స్టేషన్లో 25-07-2015 ఉదయం ప్రసారమైన తెలుగు కార్యక్రమంలో సమీక్ష వచ్చింది. సమీక్షించిన వారు ప్రముఖ కథారచయిత శ్రీవిరించిగారు! అదే సమీక్ష 20-07-2015 సోమవారం సూర్య దినపత్రిక అక్షరం పేజీలో ప్రచురింపబడింది. చదివి పుస్తకంపై శ్రీవిరించి గారి అభిప్రాయాన్ని తెలుసుకోండి.

7, జులై 2015, మంగళవారం

పుస్తక సమీక్ష - 33 గోదావరి పుష్కరాలు - మధురానుభూతులు

[పుస్తకం పేరు : గోదావరి పుష్కరాలు - నా అనుభవాలు, రచన: డాιι సప్పా దుర్గాప్రసాద్, పేజీలు: 36, వెల: రూ30/-, ప్రతులకు: నటరాజ నృత్య నికేతన్, దానవాయిపేట, రాజమండ్రి]
“నృత్య ప్రపూర్ణ” డాιι సప్పా దుర్గాప్రసాద్  గోదావరి పుష్కరాలతో తనకున్న అనుబంధాన్ని వివరించిన చిన్ని పుస్తకం ఇది. 1920 నుండి 1956 వరకు వచ్చిన నాలుగు గోదావరి పుష్కరాల గురించి తెలుసుకున్న విశేషాలను, 1967 నుండి 2003 వరకు వచ్చిన నాలుగు గోదావరి పుష్కరాల గురించి తెలిసిన విశేషాలను కళ్ళకు కట్టినట్టు వివరించారు రచయిత.   చివరి రెండు పుష్కరాలలో, అంటే 1991, 2003 సంవత్సరాలలో వచ్చిన గోదావరి పుష్కరాలలో,  దుర్గా ప్రసాద్‌గారు క్రియాశీలక  పాత్రను నిర్వహించారు. పుష్కరాల సాంస్కృతిక సలహా సంఘ సభ్యుడిగా వ్యవహరించారు. "పుష్కర తీర్థం", "భక్త అన్నమయ్య", "ఓంకార గణపతి" మొదలైన నృత్య రూపకాలకు సంగీత, నృత్య దర్శకత్వం వహించి శిష్యులతో కలిసి ప్రదర్శించారు. "ఆంధ్ర నాట్య" ప్రదర్శనలు ఇచ్చారు. "పుష్కర గౌతమి" అనే నృత్య రూపకాన్ని రచించి దూరదర్శన్ కోసం దర్శకత్వం వహించి నిర్మించారు. ప్రముఖ చలనచిత్ర దర్శకుడు  కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో "గోదావరి పుష్కర స్వాగత గీతా"నికి నృత్య దర్శకత్వం నెరవేర్చి అందులో నృత్యం చేశారు. వీరి ఈ కార్యక్రమాలన్నీ పుష్కరాల సమయంలో ప్రజామోదాన్ని పొంది విజయవంతమయ్యాయి.  ఈ పుష్కరాల సందర్భంగా వీరికి ప్రభుత్వం నుంచి సన్మాన సత్కారాలు జరిగాయి. ఈ పుష్కరాల వలన శ్రీయుతులు పంతం పద్మనాభం, ఎ.సి.వై.రెడ్డి, రావుల సూర్యనారాయణ మూర్తి, మాడుగుల నాగఫణి శర్మ, రాజీవ్ శర్మ, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కె.రాఘవేంద్రరావు, సునీల్ వర్మ,జవహర్ రెడ్డి మొదలైన ప్రముఖ వ్యక్తులతో వీరికి పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ పుష్కరాలు సప్పా దుర్గాప్రసాద్‌గారి నాట్య కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేయడానికి దోహదపడ్డాయి. పవిత్రమైన గోదావరీ పుష్కరాల నిర్వహణ అనే చారిత్రక ఘట్టాలలో భాగం వహించడం సప్పా దుర్గా ప్రసాద్ గారి పూర్వజన్మ సుకృతం. ఈ మధురమైన విశేషాలను దుర్గాప్రసాద్‌గారు ఈ చిన్ని పుస్తకంలో నమోదు చేశారు.  
  అంతే కాకుండా   పుష్కరుడంటే ఎవరు? అతని జన్మ వృత్తాంతం ఏమిటి? ఏయే రాశులలో ఏయే నదులకు పుష్కరాలు వస్తాయి? మొదలైన ప్రశ్నలకు ఈ పుస్తకంలో సవివరమైన సమాధానాలు లభిస్తాయి.  ఈ పుస్తకంలో పొందుపరచిన చిత్రపటాలు పాఠకులను అలరిస్తూ ఈ పుస్తకానికి వన్నె తెచ్చాయి.   ఈ ఏడాది జరుగనున్న గోదావరీ పుష్కరాలు కూడా వీరికి విశేషమైన అనుభవాలను,  సశేషమైన తియ్యటి అనుభూతులను మిగులుస్తుందని ఆశిద్దాం.


(సాహితీకిరణం మాసపత్రిక జూలై 2015 సంచికలో ప్రచురితం)

4, జులై 2015, శనివారం

కొలాజ్

పత్రికలలో స్వైరవిహారం చేస్తున్న మొదటి తరం రాయలసీమకథలు 

11, జూన్ 2015, గురువారం

దత్త


(శ్రీ సాధనపత్రిక 08-09-1928 సంచిక నుండి)

8, మే 2015, శుక్రవారం

మొదటి తరం రాయలసీమ కథలు!

మొదటి తరం రాయలసీమ కథలు పేరుతో ఒక కొత్త పుస్తకాన్ని అతి త్వరలో ప్రచురిస్తున్నామని తెలిపేందుకు సంతోషిస్తున్నాము. జనవినోదిని, హిందూసుందరి, సౌందర్యవల్లి, శారద, శ్రీసాధనపత్రిక, తెనుగుతల్లి, విజయవాణి, చిత్రగుప్త మొదలైన పత్రికలనుండి సేకరించిన 42 కథలు ఈ సంకలనంలో ఉంటాయి. ఈ కథలన్నీ క్రీ.శ.1882 - 1944ల మధ్య ప్రకటించబడ్డాయి. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ యువపురస్కార గ్రహీత అప్పిరెడ్డి హరినాథరెడ్డి సంపాదకుడు. ఈ పుస్తకంలో కథలతో పాటు కథాలక్షణాలను వివరించే ఒక వ్యాసం 1927 జనవరి 15వ తేదీ శ్రీ సాధనపత్రికనుండి సేకరించినది అనుబంధంగా ఇస్తున్నాము. హెచ్.నంజుండరావు వ్రాసిన ఈ వ్యాసం చాలా విలువైనదని చదివిన వాళ్ళందరూ అంగీకరిస్తారు. ఇంకా ఈ పుస్తకానికి కేతు విశ్వనాథరెడ్డి, సింగమనేని నారాయణలు వ్రాసిన పీఠికలుంటాయి. సరే సంపాదకుని ముందుమాట, ప్రచురణకర్త (అంటే నేను వ్రాసిన ) నోటు ఎలాగూ ఉంటాయి. ఈ పుస్తకం వెల 200/-. బహుశా మే నెల చివరి వారంలో వెలువడనున్న ఈ పుస్తకాన్ని నేడే రిజర్వు చేసుకోండి. 

24, ఏప్రిల్ 2015, శుక్రవారం

పుస్తక సమీక్ష - 32 నాగావళి నుంచి మంజీర వరకు


[పుస్తకం పేరు: నాగావళి నుంచి మంజీర వరకు, రచన:రావి కొండలరావు, వెల: రూ.150/-, పేజీలు:184, ప్రతులకు: ఆర్కే బుక్స్,502, సన్నీ రెసిడెన్సీ, 166, మోతీనగర్, హైదరాబాదు - 18 మరియు అన్ని ముఖ్యమైన పుస్తకశాలలు]  

ప్రముఖ నటుడు, జర్నలిస్టు, హాస్య రచయిత, నాటక రంగ ప్రముఖుడు అయిన రావికొండలరావు గారి జ్ఞాపకాల దొంతర ఈ పుస్తకం.  తనకు పరిచయం ఉన్న ప్రతి ఒక్క ప్రముఖుణ్ణి, సామాన్యులను, అసామాన్యులను ఈ పుస్తకంలో స్మరణకు తెచ్చుకున్నారు రావి కొండల్రాయుడు ఉరఫ్ రావి కొండల్రావు. ఈ మధ్య కాలంలో వెలువడిన పుస్తకాలలో ఇది ఒక మంచి పుస్తకం అని చెప్పవచ్చు. రచయిత గారి జీవిత విశేషాల సంగతి ఎలా ఉన్నా తెలుగు సినిమా చరిత్రలో స్వర్ణయుగం అని చెప్పుకునే కాలం నాటి చలనచిత్ర విశేషాలు ఈ పుస్తకంలో రికార్డు కావడం విశేషం. బాపురమణ 'కు' ('లకు' కాదు) అంకితమివ్వబడిన ఈ పుస్తకం చక్కని గెటప్‌తో పాఠకులకు అందుబాటు ధరలో వెలువడటం అభినందనీయం.  పుస్తకం కొనడానికి వెచ్చించిన డబ్బు గిట్టుబాటు అయ్యిందన్న తృప్తిని మిగిలిస్తుంది.

నాగావళి శ్రీకాకుళం తీరంలో ప్రవహించే నది. మంజీర హైదరాబాదు సమీపంలో ఉన్న నది. శ్రీకాకుళం నుంచి హైదరాబాదు దాకా సాగిన జీవిత ప్రస్థానాన్ని రచయిత ఈ పుస్తకంలో వివరించారు. తిరుమల రామచంద్రగారి హంపీ నుంచి హరప్పా దాక ఈ పుస్తకానికి స్ఫూర్తిని కలిగించి ఉండొచ్చు.  ఆర్.కె.రావు, చక్రపాణి, తిమ్మరాజు శివరావు, సి.హెచ్.నారాయణరావు, గండికోట జోగినాథం, సి.ఎస్.ఆర్.ఆంజనేయులు, నల్లరామ్మూర్తి, గోవిందరాజు సుబ్బారావు, న్యాయపతి రాఘవరావు, బాపు, ముళ్లపూడి వెంకటరమణ, వడ్డాది పాపయ్య, సఖ్ఖరి కృష్ణారావు , గరిమెళ్లరామ్మూర్తి, ప్రయాగ నరసింహశాస్త్రి, బాలాంత్రపు రజనీకాంతరావు, భానుమతి, కొడవటిగంటి కుటుంబరావు, ఎం.ఎస్.రామారావు, జి.వరలక్ష్మి, మద్దాలి శర్మ, పూడిపెద్ది లక్ష్మణమూర్తి(పూలమూర్తి), సదాశివరావు, రేలంగి వెంకట్రామయ్య, సదాశివరావు, చదలవాడ కుటుంబరావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎన్.టి.రామారావు, ఘంటసాల, సుందరశివరావు, సుంకర ప్రభాకరరావు, రావి ధర్మారావు, బి.ఎన్.రెడ్డి,సి.పుల్లయ్య, వల్లభజోశ్యుల శ్రీరామమూర్తి, మల్లాది వెంకటకృష్ణశర్మ, శ్యామలరావు, కమలాకర కామేశ్వరరావు, డాక్టర్ రాజారావు, మాస్టర్ మల్లేశ్వరరావు, ముద్దుకృష్ణ, కాశీనాథ్ తాతా, నార్ల వేంకటేశ్వరరావు, ఎన్.జగన్నాథ్, కళ్యాణసుందరీ జగన్నాథ్, మాధవపెద్ది సత్యం, హరనాథ్, ఆత్రేయ, బండారు చిట్టిబాబు, పెండ్యాల నాగేశ్వరరావు, ద్వారం వేంకటస్వామి నాయుడు, ఆదిభట్ల నారాయణదాసు, కళావర్ రింగ్, ఉప్పులూరి కాళిదాసు, శ్రీశ్రీ, నిర్మలమ్మ, జె.వి.సోమయాజులు, జె.వి.రమణమూర్తి, కె.వి.రావు, బి.సరోజాదేవి, డి.వి.నరసరాజు, పింగళి నాగేంద్రరావు, మద్దిపట్ల సూరి, మల్లాది రామకృష్ణశాస్త్రి,దైతా గోపాలం,ఆరుద్ర,అంజలీదేవి,చౌదరి, వీర్రాజు, చిత్తూరు నాగయ్య మొదలైన వారి (పైన పేర్కొన్న జాబితాకు రెట్టింపు మంది) గురించి అంతో ఇంతో తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలి. రావి కొండలరావు హాస్య రచయిత కాబట్టి పుస్తకం నిండా బోలెడన్ని చమత్కారాలు, హాస్యాలు, ఒకటి ఒకటిన్నర కుళ్ళు జోకులు కనిపిస్తాయి. ఈ పుస్తకంలో చాలా విలువైన ఫోటోలు, సినిమా స్టిల్స్, నాటకాల స్టిల్స్ రంగుల్లోనూ తెలుపు నలుపుల్లోనూ దర్శనమిచ్చి పాఠకులను రంజింపజేస్తాయి. 

ఈ పుస్తకంలో కొన్ని ఆరోపణలు చేస్తారు రావి కొండలరావు. అయితే అవి ఆరోపణలని అనిపించకుండా చాలా లౌక్యంగా వ్రాశారు.

అవి:

1.ఎ.నాగేశ్వరరావు తనకు ఆటోగ్రాఫు ఇవ్వలేదు. (పేజీ 30)

2.అతను యెవరు? సినిమాకి మాటల రచయితగా ఇతని పేరు వేయలేదు. కారణం అన్నయ్య ఆర్.కె.రావు(?)

3.ఉప్పులూరి కాళిదాసు ఆనందవాణి పత్రికలో పనిచేయించుకుని డబ్బులు ఎగ్గొట్టారు.  

4.వి.ఎ.కె.రంగారావు తనకు కావలసిన రికార్డును ఇవ్వడానికి ఏడాదిన్నర తిప్పుకున్నారు. అలాగే వడ్డాది పాపయ్య తన పత్రిక ముఖచిత్రం వేయడానికి కొంతకాలం చుట్టూ తిప్పించుకున్నారు.

5.తెలుగు స్వతంత్రలో సబ్ ఎడిటర్‌గా పనిచేసిన కె.రామలక్ష్మి తన కథలు రెండింటిని రిజెక్ట్ చేశారు.

పైన పేర్కొన్నవన్నీ నిజమే కావచ్చు కాని వాటిని పాఠకులతో పంచుకుంటే ఏం ఉపయోగం?

ఉత్తమ పుస్తకం కాకపోయినా ఈ మధ్య కాలంలో వెలువడిన మంచిపుస్తకంగా దీనిని పరిగణించవచ్చు.
  

17, ఫిబ్రవరి 2015, మంగళవారం

తెవికీలో ఇద్దరు తిరపతోళ్లు

తిరుపతిలో ఈ నెల 14,15 తేదీల్లో జరిగిన తెలుగు వికీపీడియా పదకొండవ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొనడం ఇద్దరు తిరుపతికి చెందిన రచయితల వ్యాసాలు వికీపీడియాలో వ్రాయడానికి కారణం అయ్యింది. లేకపోతే ఈ ఇద్దరి గురించిన వ్యాసాలు తెలుగు వికీపీడియాలో కనిపించడానికి మరికొంత కాలం పట్టేదేమో! ఈ సమావేశాల్లో సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్య మాట్లాడుతూ ముందు రోజు మరణించిన ఎస్.మునిసుందరం గురించి ఇంటర్నెట్‌లో వెదికితే సరైన సమాచరం లభించలేదని అన్నారు. రచయిత ఎస్.మునిసుందరం మరణ వార్త అక్కడే తెలిసింది. మునిసుందరం గారు నాకు పరిచయం నా కథాజగత్ ద్వారా. అతని కథ రాయలమ్మ కథాజగత్‌లో ఉంది. అతని చారిత్రక పౌరాణిక నాటకాలపై నా సమీక్ష చదివి వారు నాకు ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. ఆదిత్యగారి వ్యాఖ్యకు స్పందించి ఆ రోజే తెలుగు వికీపీడీయాలో మునిసుందరం గారిపై ఒక వ్యాసాన్ని వ్రాశాను. దానిని ఇక్కడ చదవండి. ఆ వ్యాసంలో మునిసుందరం గారికి నూతలపాటి గంగాధరం సాహితీ కుటుంబం తో ఉన్న అనుబంధం తెలిసి నూతలపాటి గంగాధరం గురించి కూడా ఒక వ్యాసం తెలుగు వికీపీడియాలో వ్రాయడం జరిగింది. ఈ వ్యాసాలు చదివి ఆసక్తి కలిగిన వారు ఎవరైన ఈ వ్యాసాలను ఇంకా మెరుగు పరచమని కోరుతున్నాను.