...

...

30, డిసెంబర్ 2012, ఆదివారం

తీగలాగితే...


తీగలాగితే...
                                                - స్వరలాసిక

"ఎడిటర్ గారికి - ఈ వారం మీ పత్రికలో ప్రచురించిన సూరిబాబు గారి గులాబిముళ్ళు కథ ఇంటర్‌నెట్ నుండి కాపీ కొట్టబడింది. పాత్రల పేర్లు మార్చి క్లైమాక్స్ కొంచెం మార్చినంత మాత్రాన పాఠకులు కనుక్కోలేరని సూరిబాబు భావించినట్టున్నారు. ఇరవై ఏళ్ల క్రితం అయితే సూరిబాబు లాంటి రచయితల ఆటలు సాగేవి. ఇప్పుడలా కాదు. సమాచార విప్లవం ఇలాంటి రచయితల అసలు స్వరూపాన్ని బయట పెట్టేస్తోంది. ఈ కథకు మూలమైన ఇంగ్లీషు కథ ప్రచురింపబడిన వెబ్‌సైట్ యు.ఆర్.ఎల్. లింకును క్రింద ఇస్తున్నాను. చదివి నా ఆరోపణ నిజం అవునో కాదో మీరే నిర్ధారించుకోండి. మూల రచయిత పర్మిషన్ తీసుకుని కథను అనువదించి ఉంటే ఆ విషయం పాఠకులకు తెలియజేయాల్సిన బాధ్యత కూడా సదరు రచయితకు ఉంటుంది. మన పత్రికలు ఇలాంటి కాపీ కథలను అరికట్టడానికి కొన్ని ఎథిక్స్ పాటించాలి. కాపీరాయుళ్లను బ్లాక్‌లిస్ట్‌లో ఉంచి వారి రచనలను బహిష్కరించాలి. అప్పుడే పాఠకులను గౌరవించినట్లు అవుతుంది. గమనించగలరు - పరమానందం" అదీ ఇ-మెయిల్ సారాంశం.

 ఆ మెయిల్ చదువి నవ్వుకున్నాను. సూరిబాబు గత మూడు దశాబ్దాలుగా తెలుగు పత్రికారంగాన్ని దున్నేస్తున్న గొప్ప రచయిత. అతని కథలు,సీరియళ్లు,ఫీచర్లు దాదాపు అన్ని తెలుగుపత్రికల్లోనూ వస్తోంది. అలాంటి రచయితను వదులుకోవడానికి మేమే కాదు ఏ పత్రికా సిద్ధంగా లేదు.

ఈ పత్రికలో సబ్ఎడిటర్‌గా చేరకముందు నుండీ తను  సూరిబాబు అభిమాని. పాఠకుల అభిరుచుల్ని ఎప్పటికప్పుడు పసిగట్టి వాటికి అనుగుణంగా రచనలు చేయడం సూరిబాబుకు మాత్రమే తెలిసిన విద్య. కాబట్టే ఇంతకాలంగా ఆంధ్రుల అభిమాన రచయితగా వెలుగొందుతున్నాడు. అలాంటి సూరిబాబుపై ఇతనెవడో చేసిన ఆరోపణను సీరియస్‌గా తీసుకోలేము.

అయినా ఇప్పుడు నైతికవిలువలకు అర్థం పూర్తిగా మారిపోయింది. ఇదివరకటిలా మడి కట్టుకుని కూర్చోవటం ఇప్పుడున్న పోటీ వాతావరణంలో కుదరని పని. మీడియా విస్తరించిన కొద్దీ రచనలకూ, రచయితలకూ డిమాండ్ పెరిగింది. అందులోనూ సూరిబాబులాంటి రచయితలకు మరీ డిమాండ్ పెరిగిపోయింది. అయినా ఏ రచయితైనా ఎన్నని కొత్త కొత్త కథలను సృష్టించగలడు? ఇప్పుడు తెలుగులో సృజన సేచురేషన్ పాయింటును దాటిపోయింది. కాబట్టి కొత్త అయిడియాలకు రచయితలు ఇతర భాషా రచనల వైపు చూస్తున్నారు. పత్రికల వాళ్లు కూడా ఈ పరిణామాల్ని చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. అంతేకాదు రచయితలకు కొన్ని హింట్లను పత్రికలే యిస్తున్నాయి. తను కూడా సూరిబాబుకు "ఈ ప్లాట్ చూడు గురూ మనకు పనికి వస్తుందేమో" అని కొన్ని పాత విదేశీ కథలను అందించిన సందర్భాలు అనేకం. 

ఐతే సూరిబాబు ఏ కథను కాపీ(నిజానికి మేం ఎడిటర్లం కాపీ అనే పదాన్ని వాడకూడదు. ఇన్స్పిరేషన్‌ లేదా ఇన్‌ఫ్లూయన్స్ అనాలి) చేసినా ఎవరూ సులభంగా కనుక్కోలేంత పకడ్బందీగా ఆ కథను మార్చివేసి స్వంత కథ అనిపించేటట్టు చేస్తాడు. అలాంటిది ఈ పరమానందమెవడో గట్టి పిండమే సూరిబాబు ఫలానా కథ ఫలానా చోటనుండి కాపీకొట్టాడని చెప్పగలుగుతున్నాడు.        

ఈ గులాబిముళ్లు కథకు మూల కథ ఎలా వుంటుందో తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆ మెయిల్‌లో ఇచ్చిన లింక్‌ను నొక్కాను. ఫిక్షన్ మాఫియా డాట్ నెట్ అనే వెబ్‌సైటులో అలెక్స్ అనే రచయిత రాసిన డార్క్ ఎకో అనే కథ ఓపెన్ అయ్యింది.

జాగ్రత్తగా పరిశిలిస్తే తప్ప ఈ కథకూ గులాబిముళ్లు కథకూ ఒకటే ప్లాట్ అని అర్థం కాదు. అయితే నన్ను అంతకన్నా ఆశ్చర్య పరచిన విషయం మరొకటుంది. ఇదే కథను నేను రెండ్రోజుల క్రితం చదివాను. వృత్తి(?)లో భాగంగా పాతికేళ్లనాటి పాత ఇలస్ట్రేటెడ్ వీక్లీ తిరగేస్తుంటే కనిపించి చదివింప జేసిన కథ అచ్చం ఇలాగే ఉంది!

వెంటనే లైబ్రరీకి పరుగులాంటి నడకతో చేరాను. కార్పొరేట్ మీడియా సంస్థ నుండి వెలువడుతున్న మా పత్రికకు అతిపెద్ద లైబ్రరీనే ఉంది. రెండ్రోజుల క్రితం చదివిన ఇలస్ట్రేటెడ్ వీక్లీ బౌండ్‌ను రేక్ నుండి తీసి ఆ కథకోసం వెదకసాగాను. 

ఎక్కువ శ్రమపడకుండానే ఆ కథ కనిపించింది. శ్రద్ధగా మరోసారి చదివాను. కథ పేరు ది పర్పుల్ కలర్ హ్యాండ్ బాగ్. రచయిత్రి అనితా నంబూద్రి. సందేహం లేదు ఈ కథను చదివే డార్క్ ఎకో కథ రాసి ఉంటాడు ఆ రచయిత. సునామీ, రిసెషన్ లాంటి కొత్తపదాలు కొన్ని చొప్పించి పాత కథను కొత్తగా మలిచాడు అలెక్స్.

ఆ బైండు పుస్తకాన్ని మూసేస్తుండగా ఒక పేజీలో లెటర్స్ టు ఎడిటర్ శీర్షికలో పర్పుల్ హ్యాండ్ బ్యాగ్ అనే పదాలు కనిపించాయి. ఆ ఉత్తరం చదివాను. ఆ కథ పడిన నాలుగు వారాల తర్వాతి సంచిక అది. ఎవరో అనితా నంబూద్రి కథ ఒక చైనీస్ కథకు మక్కీకి మక్కీ కాపీ అని రాశారు. ఆ కథ పేరూ, కథా రచయిత పేరూ, ఆ కథ ప్రచురించిన చైనా పత్రిక తేదీ వివరాలు అన్నీ ఆ ఉత్తరంలో ఉన్నాయి.

నాకు ఉత్సుకత మరింతగా పెరగ సాగింది. దీని సంగతి ఏమిటో పూర్తిగా తేల్చాలని మనసులో ఒక స్థిర నిర్ణయానికి వచ్చాను. ఫేస్‌బుక్‌లో మిత్రుడైన జెంగ్ లాంగ్ కు ఈ వివరాలన్నీ ఇస్తూ అసలు సంగతి కనుక్కోమని ఒక ఇ-మెయిల్ పెట్టాను. వారం రోజుల లోపే అతని నుండి రిప్లై వచ్చింది. 

నేను పేర్కొన్న చైనీస్ రచయిత తనకు స్నేహితుడేననీ, అతడిని నేను పంపిన వివరాలు అడిగితే ఆ కథ వ్రాసింది ఆ రచయితేనని తెలిసిందనీ, ప్రచురించిన పత్రిక వివరాలు అన్నీ సరిపోయాయని లాంగ్ బదులు ఇచ్చాడు. తనకు ఆ కథ రాయడానికి ప్రేరణ ఇండియాలోని రాకేష్ వర్మ అనే రచయిత రాసిన అంధేరే ఖులా దర్వాజా అనే హిందీ కథ అనీ ఆ కథను అప్పట్లో వస్తున్న నయీ దునియా అనే పత్రికలో చదివాననీ సదరు రచయిత లాంగ్‌కు వివరించినట్టు ఆ మెయిల్ లోని సారాంశం.  

నాకు భలే ఆశ్చర్యం వేసింది. ఆ అంధేరే ఖులా దర్వాజా కథ విషయమై అప్పట్లో పెద్ద దుమారమే లేచింది. ఆ కథ ఒక  కన్నడ  కథనుండి కాపీ అయినట్టు ఆ విషయం కోర్టుదాకా వెళ్ళినట్టు నాకు బాగా జ్ఞాపకం. ఇక నా అన్వేషణ 'నయీ దునియా'పై పడింది. చాలా కష్టపడితేగానీ ఆ కథ పడిన పత్రిక సంచిక తరువాతి సంచికలూ దొరకలేదు. మొత్తానికి ఎలాగైతేనేం సాధించాను. అంధేరే... కథ పూర్తిగా చదివాను. మధ్యలో చైనీస్ కథ చదవలేదు కానీ పర్పుల్... కథకూ ఈ కథకూ ఎక్కువ పోలికలే కనిపించాయి.

ఇక నయీ దునియా పాత సంచికలనుండి ఆ కన్నడ కథ కూపీలాగాను. కథ పేరు మొదివే హుడిగి. రాసింది రామణ్ణ శ్యానభోగ. సంపిగె అనే పత్రికలో వచ్చింది. నా అదృష్టం కొద్దీ నాకు కన్నడం చదవడం మాట్లాడటం వచ్చు. ఒక రెండు వారాలు కష్టపడిన తరువాత ఆ సంపిగె పత్రిక సంపాదించగలిగాను. ఆత్రంగా మొదివే హుడిగి (పెళ్ళి కూతురు) కోసం చూశాను. దొరికింది. ఆ కథ పూర్తిగా చదివాక ఆశ్చర్యం నుండి తేరుకోవడానికి నాకు చాలా సమయమే పట్టింది.              

మరుసటి రోజు సూరిబాబు నా సీటు వద్దకు వచ్చాడు తన వీక్లీ ఫీచర్ అందివ్వడానికి. "కూర్చో గురూ! నీకో ఇంట్రెస్టింగ్ విషయం చెబుతాను" అంటూ పరమానందం మెయిల్ నుండి మొదివే హుడిగి దాకా అంతా పూసగుచ్చినట్టు వివరించాను. నా మాటలు వింటున్నప్పుడు అతని మొహంలో రంగులు మారసాగాయి. చివరగా మొదివే హుడిగి కథను టూకీగా తెలుగులో చెప్పినప్పుడు అతని మొహంలో ఆశ్చర్యంతో కూడిన చిరునవ్వు కనిపించింది. 

"ఇప్పుడు జ్ఞాపకం వస్తోంది. ఈ రామణ్ణ అనే అతను నా కథను కన్నడంలోకి అనువదించడానికి నా పర్మిషన్ అడిగాడు. నేను నా అనుమతిని తెలుపుతూ ఉత్తరం రాశాను కూడా. అయితే తర్వాత అతని నుండి ఏ కమ్యూనికేషన్ లేదు. ఆ సంగతి నేనూ మరిచి పోయాను"

"వారినీ! గులాబి ముళ్ళు కథకి మూలం 'దులపర బుల్లోడ' కథా? నా కథను నేనే కాపీ కొట్టానన్నమాట" సూరిబాబు వదనంపై నవ్వులు మొగ్గలు వేశాయి.

నేనూ చిద్విలాసంగా నవ్వాను. ఆ బుల్లోడి కథకు మూలకథను అన్వేషించాలనే ఆలోచన నా మనసులో క్రమేపీ రూపు కట్టుకోసాగింది.   

(ఆంధ్రప్రభ దినపత్రిక ఆదివారం 30-12-2012 సంచికలో ప్రచురితం)


మళ్ళీ ఓ కథ!

నా కథ ఒకటి నవ్య వీక్లీలో 2008 ఫిబ్రవరి 27 సంచికలో ప్రచురింపబడింది. బహుమానం దాని పేరు. ఆ కథకు మంచి స్పందనే లభించింది. భద్రాచలంలో జరిగిన జాగృతి కథారచయితల సమ్మేళనంలోనూ, కడపలో జరిగిన అరసం మహాసభలలోనూ, విజయవాడలో జరిగిన ప్రపంచ రచయితల మహాసభలలోనూ పాల్గొనడానికి ఈ కథే కారణం అని నా ప్రగాఢ నమ్మకం. ఈ కథను తన కథాసాగరమథనంలో సమీక్షించిన తరువాతే కస్తూరి మురళీకృష్ణ గారితో పరిచయం ఏర్పడి అది గాఢ స్నేహంగా పరిణమించింది. ఇదే కథను కోపల్లె మణినాథ్‌గారు కథావిశ్లేషణపోటీ కొరకు విశ్లేషించారు. అన్నింటికంటే ముఖ్యంగా చెప్పుకోదగిన విషయం ఏమిటంటే కథావార్షిక 2008లో చదువదగిన కథల జాబితాలో చోటు చేసుకోవడం. ఈ సోదంతా ఎందుకు చెబుతున్నానంటే మళ్ళీ ఇన్నాళ్ళకు అంటే నాలుగున్నరేళ్ల తరువాత నా కథ ప్రింటయింది. ఈ రోజు అంటే 30-12-2012 ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో నా కథ తీగలాగితే... ప్రచురితమయింది. సరదాగా వ్రాసిన ఈ కథను చదివి మీ అభిప్రాయం చెప్పండి. 

24, డిసెంబర్ 2012, సోమవారం

పెద్దిభొట్లకు కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం!

ప్రముఖ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్యగారికి ఇటీవల కేంద్రసాహిత్య అకాడెమీ పురస్కారం ప్రకటించ సందర్భంగా వారికి నా శుభాకాంక్షలు. ఈ రోజు సాక్షి సాహిత్యం పేజీలో వచ్చిన వ్యాఖ్య ఇక్కడ చదవండి.


పైన పేర్కొన్న అంతర్జాతీయ ప్రమాణాలను అవలీలగా అతిక్రమించిన కళాఖాండాలలో ఒకటి కథాజగత్‌లో ప్రకటించడం మా అదృష్టం.

18, డిసెంబర్ 2012, మంగళవారం

సలీం రెండోభార్య

కాంచన మృగం, కాలుతున్న పూలతోట, రూపాయి చెట్టు, నిశ్శబ్ద సంగీతం వగైరా రచనలతో పేరు పొందిన ప్రముఖ రచయిత సలీం గారి కథ  రెండోభార్య కథాజగత్‌లో చదవండి.  

7, డిసెంబర్ 2012, శుక్రవారం

రవీందర్ కథ

పసునూరి రవీందర్ కథ అవుటాఫ్ కవరేజ్ ఏరియా ఇప్పుడు కథాజగత్‌లో చదవండి. 

6, డిసెంబర్ 2012, గురువారం

వదరుబోతు

పానుగంటివారి సాక్షి వ్యాసాలకు ధీటుగా అనంతపురం ప్రాంతం నుండి 1917 ప్రాంతంలో వెలువడిన వదరుబోతు వ్యాసాలలో మచ్చుకు ఒకటి ఇక్కడ చదవండి.

4, డిసెంబర్ 2012, మంగళవారం

రాధేయకు నచ్చిన రచన!

సాహిత్య ప్రస్థానం మాసపత్రిక డిసెంబరు 2012 సంచికలో నచ్చిన రచన శీర్షిక క్రింద ప్రముఖ కవి, ఉమ్మిడిశెట్టి సాహితీ అవార్డు వ్యవస్థాపకులు డాక్టర్ రాధేయ గారు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకం పై తమ అభిప్రాయాన్ని వ్రాశారు. ఆ వ్యాసం తాలూకు పూర్తి పాఠం ఇక్కడ చదవండి.

కరువు సీమ సాహితీరత్నం - విద్వాన్‌ విశ్వం !!

    అచట నొకనాడు పండె ముత్యాల చాలు

    అచట నొకపుడు నిండె కావ్యాల జాలు

    అచట నొకపుడు కురిసె భాష్యాల జల్లు

    విరిసెనటనాడు వేయంచు విచ్చుకత్తి...  అంటూ

    రాయలసీమ గతకాలపు వైభవాన్ని కీర్తించిన కవి విద్వాన్‌విశ్వం సీమవర్తమాన కన్నీటి చరిత్రను, వాస్తవిక చారిత్రక అనుభవాల్ని జీవన చిత్రాలుగా కళ్ళకు కట్టాడు. అంతేకాదు సీమ భవిష్యత్తులో ఏర్పడబోయే ఎడారిఛాయల్ని ముందే పసిగట్టి, పెన్నా తీర ప్రాంత ప్రజల కడగండ్లను ఆర్ధ్రంగా పలికిన కావ్యం 'పెన్నేటి పాట'ను సాహితీ చరిత్ర మర్చిపోదు. ఈ కావ్యం చదువుతున్నంత సేపూ 'సీమ ప్రజల గుండె తడియారదు'.    విద్వాన్‌ విశ్వం గతాన్ని మాత్రమే చెప్పలేదు. మొత్తం మానవ సమాజం పట్ల అంతులేని ఆర్తికి పర్యాయపదమై పెన్నేటి పాటగా ప్రతిధ్వనించాడు. ఇందులో సహజమైన మానవ నుడికారం తొణికిసలాడింది.

    'సాహితీ విరూపాక్షుడు విద్వాన్‌ విశ్వం' పేరుతో ఆయన సాహితీ జీవితాన్ని విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ, అంటూ నాలుగు అధ్యాయాలుగా విభజించి మన కందించిన సంపాదకులు డా. నాగసూరి వేణుగోపాల్‌, కోడిహళ్ళి మురళీ మోహన్‌ గార్లను మనసారా అభినందిస్తున్నాను. ఇందులో ఉద్దండులైన సాహితీవేత్తలు డా. దివాకర్ల వెంకటావధాని, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, తిరుమల రామచంద్ర, వేలూరి శివరామశాస్త్రి, విశ్వనాధ సత్యనారాయణ, ఆరుద్ర, దాశరధి వంటి ప్రముఖులు విద్వాన్‌ విశ్వం గారిని అంచనా వేసిన తీరును, వారి కావ్య ప్రతిభా పాండిత్యాలను విశ్లేషించే వ్యాసాలను పొందుపరిచారు. ఇవి వర్తమాన సాహితీ తరానికిఎంతో స్ఫూరిని అందిస్తాయి.  

    1956లో రాసిన పెన్నేటిపాట నేటికీ సజీవమైనదే. కళ తప్పిన పల్లెసీమలు, కనుమరుగైపోతున్న మన సాంస్కృతిక శోభను తలపింపజేస్తుంది. పల్లెసీమల వ్యథార్థ దృశ్యకావ్యమే పెన్నేటిపాటగా అవతరించింది. వస్తువు రూపంతో ఇతివృత్తం చక్కగా ఇమిడిపోయింది. ఎంత వివరించినా, ఎంత వ్యాఖ్యానించినా తరగని సాహిత్యపు గని. రాయలసీమ పలుకుబళ్ళు వారి నాలుక మీద నాట్యమాడాయి.

    సాహిత్య చరిత్రలో విశ్వంగారి స్థానం విశిష్టమైనది. వారు వ్యాసం రాసినా, పద్యం రాసినా, సమీక్షలు చేసినా తమదైన శైలితో, విషయ వైవిధ్యంతో తొణికసలాడుతూ వుంటాయి. పెన్నానదీ తీర ప్రాంతంలోని సీమ ప్రజల స్వభావాన్ని, వారి గుండె చప్పుళ్ళను సమాజానికందించారు. వారి రచనల్లో అడుగడుగునా వారి ప్రతిభావ్యక్తిత్వం గోచరమవుతుంది.

    ఎన్ని కావ్యాలు వచ్చినా జీవిత చిత్రణలో, భాషలో, భావ వ్యక్తీకరణలో రాయలసీమకు ప్రాతినిథ్యం వహించే కావ్యం పెన్నేటిపాట. కవితావేశంలో పెన్నేటి పాట. మహాప్రస్థానానికి దీటైన కావ్యం. ఇరవయ్యవ శతాబ్దంలో కండగల భాషను సృష్టించుకున్న అతి తక్కువ కావ్యాలలో 'పెన్నేటి పాట' ఒకటి అని ప్రముఖ విమర్శకులు వల్లంపాటి పేర్కొన్నారు.

    విశ్వంగారు సంస్కృతంలో ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందిన కాదంబరి, కిరాతార్జునీయం, దశకుమార చరిత్ర, మేఘసందేశం కావ్యాలను తెలుగులో చక్కటి రసానుభూతితో అనువదించాడు. అంతే కాదు విరికన్నె, మహాశిల్పి, నాహృదయం, మహాసంకల్పం వంటి కావ్యాలను రచించారు. ఆంగ్ల భాష నుండి, రష్యన్‌ భాష నుండి ఆధునిక సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. అంతేకాదు - ఆంధ్రప్రభ వారపత్రికలో వారి 'మాణిక్యవీణ'  విశ్వం గారి విశ్వరూపానికి అద్దంపడతాయి.

    జర్నలిజం కోర్సును భోధిస్తున్న అనేక విశ్వ విద్యాలయాల్లో ఈ వ్యాసాలను పాఠ్యాంశాలుగా పెట్టవలసిన అవసరం ఎంతో ఉంది.  

    విశ్వంగారు, కావ్యంరాసినా, వ్యాసం రాసినా, గేయం రాసినా అది సామాజిక ప్రాధాన్యత సంతరించుకున్నదే తప్ప ఇతరంకాదు. నిజానికి ఆయనే ఒక మానవతావాది. పత్రికా రంగంలో ఉన్నతమైన విలువలను నిలబెట్టిన సత్సంప్రదాయవాది. కరువు సీమలో పుట్టిన కాంతరత్నం. 2015లో విద్వాన్‌ విశ్వంగారి శతజయంతిని జరుపుకోబోయే సందర్భంలోనైనా ప్రభుత్వం ఎటూ చెయ్యదు కాబట్టి తెలుగు విశ్వవిద్యాలయమైనా లేదా సాహిత్య సంస్థలైనా పూనుకొని వారి వివిధ రచనల సమగ్ర సంపుటాలను తీసుకువచ్చే కృషిని ఇప్పటి నుండే ప్రారంభించాలని నా సూచన. కొంతలో కొంతయినా అబ్జక్రియేషన్స్‌ సంస్థ పక్షాన ఈ పుస్తకాన్ని వెలువరించినందుకు సంపాదకుల్ని మరోసారి అభినందిస్తూ వర్తమానతరం సాహితీ మిత్రులు విశ్వం గారి మానవతావాదాన్ని అందిపుచ్చుకోవడానికైనా ఈ పుస్తకాన్ని కొని, చదివి తీరాలి !