...

...

30, మే 2010, ఆదివారం

పాపం! నారాయణరావు


    "ఐదువందలిచ్చి ఫౌరన్ పార్క్‌నుంచి బయట పడండి. లేకపోతే..."

    "డబ్బుల్లేవయ్యా బాబు..."

    "అడ్డమైన పనులకూ, ఆ తర్వాత రోగాలకూ వేలకు వేలు పెట్టొచ్చుగాని, యిజ్జత్ గాపాడుకోనీకి..."

    మరో రెండొందలు కలిపి షేక్‌హ్యాండిస్తున్నట్టుగా వాడి చేతిలో పెట్టి గబగబా అక్కడ్నుండి బయటపడ్డారా మొగుడ్స్ - పెళ్లామ్స్.

    "తన సొమ్మే అయినా దాచుకుని తినమన్నారు పెద్దలు. కాకపోతే... ఏం చోద్యమండీ... యిది."

    ఆ చోద్యమేమిటో తెలుసుకోవాలంటే కన్నోజు లక్ష్మీకాంతం గారి కథ పాపం! నారాయణరావును కథాజగత్‌లో చదవండి. 

29, మే 2010, శనివారం

తిలోత్తమ

                    ఇంతకు ముందు టపాలో రంభను వర్ణిస్తూ ఒక పద్యం చదివారు కదా! ఇప్పుడు మరో అప్సరస తిలోత్తమపై ఒక పద్యాన్ని చదవండి. 


ll గుత్తపు పట్టుఱైకబిగి కుట్టు పటుక్కున( బిక్కటిల్లి స్వా
    యత్తము( దప్పి పోబ్రిదిలి యబ్బుర పుబ్బగు గబ్బిగుబ్బలు
    వ్వెత్తున నోత్తరించివలపింపగవుంగిటనించి పల్లుకెం
    పొత్తిలి మోవితేనె( జవులూర( గొనెన్"విధు"డా"తిలోత్తమన్"


                         ఈ పద్యం నారునాగనార్య (1903-1973)గారి 'తిలోత్తమాసాహసికము' లోనిది. ఈ కవిగారి వీరపూజ, శ్రీపృథ్వీరాజవిజయము అనే వీర రస ప్రధాన కావ్యాలు సుప్రసిద్ధాలు. వీర రసాన్ని ఎంత చక్కగా పోషించారో అంతే చిక్కగా శృంగార రసాన్ని కూడా వీరు మథించినారు. "మా పండితుడు, ముసలితనములో నప్సరసలతోడి సంబంధము నెందుకు పెట్టుకొన్నాడో! ముసలి తనమును రెండవ బాల్యమన్నారు పెద్దలు." అని పుట్టపర్తి నారాయణాచార్యుల వారన్న మాటలో వింత లేదు. నిజంగా ముసలితనంలో శృంగారం ఉప్పొంగుతుందనే విషయాన్ని ఈ కవి ధృడపరచినారు. ఈ పద్యం ప్రాచిన కవుల ప్రబంధాలలోని శృంగారానికి ఏమాత్రం తీసి పోదు కదా!   

26, మే 2010, బుధవారం

ఔరా!

ఈ రోజు పేపర్లో నన్నాకర్షించిన వార్త.23, మే 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 9 సమాధానాలు!


అడ్డం: 
1. అల్లసాని పెద్దనకు రాయలవారు తొడిగినది ఇదియె?                               - గండపెండేరమె
3. మగువ జీవితాన్ని ఈ పత్రికతో పోల్చారు దాశరథి.                                  - మల్లెతీగ  (ఈ పేరుతో ఒక మాసపత్రిక వస్తోంది)
5.కారుతున్న రైలుసదనములో దాగున్న 'నానో' కర్షకులు :-)                      - సన్నకారు రైతులు (నానో కారు చిన్నదే కదా!)
7. HDFC బ్యాంకులో దాచిన అంకగణితపు భాగమేనా సారూ?                      - గ.సా.భా (గరిష్ట సామాన్య భాజకం Highest Common Factor)
9. మొదట్లో తడబడిన బాడీగార్డుకు చివరనుంచి రెండో అక్షరం మటుమాయం. - గఅంరక్షుడు (అంగరక్షకుడు)  
10. బంగారు మురుగు                                                                              - స్వర్ణకంకణం
11. మంచి గొంతుక                                                                                   - సుస్వరం
14. లలామ రకం కతల్లో సులభ సాధ్యం.                                                      - కరతలామలకం
15. తలవాకిలి                                                                                           - ముఖద్వారం
16. కవిసార్వభౌమునికి జరిగిన ఒకానొక సత్కారము. 

నిలువు:
1.కడివెడు పాలు : ఖరము :: గరిటెడు పాలు : ____                                   - గంగిగోవు
2. 'జహంగీరు 18వ భార్య'కెన్ని లక్షలు 'కన్యాశుల్కం 19దా'?                        - మెహరున్నీసా   (మెహర్ అంటే కన్యాశుల్కం ఉన్నీస్ అంటే హిందీలో పంతొమ్మిది. నూర్జహాన్ అసలు పేరు మెహరున్నీసా!)
4. పదిహేడో నెంబరు పురాణం.                                                                     - గరుడపురాణం (అష్టాదశపురాణాల్లో గరుడపురాణము పదిహేడవది)
5.తెలుగు న్యూసు పేపరు.                                                                            - సమాచార పత్రిక
6.శీర్షాసనం వేసిన కంసుడు మొదలైన శత్రువులు.                                          - లుకుటకందిసాకం (కంస ఆది కంటకులు)
7. రంగడు సుశీలల మధ్య కఠినము.                                                              - గడుసు
8. పరమాణు సంఖ్య 15కల మూలకము.                                                       - భాస్వరం 
9. ఏనుగు సవారీ ఒక సత్కారమేనా?                                                             - గజారోహణము
12.పిల్లంగోవి ఈ బ్లాగరి కలంపేరు.                                                                  - స్వరలాసిక    (పిల్లనగ్రోవికి ఉన్న పర్యాయపదాలలో ఇదొకటి. ఈ పేరుతో నేను అప్పుడప్పుడు పత్రికల్లో రచనలు చేస్తుంటాను.)
13. ఇక్కడ బావిలోన వెలసిన వినాయకుడు కొలువై ఉన్నాడు.                          - కాణిపాకం (చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం)
21, మే 2010, శుక్రవారం

రంభ వర్ణనము

రంభ(సినీ నటి కాదు అప్సరస)ను వర్ణించే పద్యం ఇక్కడ చదివి ఆస్వాదించండి.


సీ. కుంభికుంభ స్మయాలంభ, సత్కుచకుంభ
               పీత తనూజిత శాత కుంభ
   సారంగ కరరుచిరోరు రంభాస్తంభ
               నిశ్చలయౌవనాన్విత విజృంభ
   కుంభినీ ధరవరోజ్జృంభ కటీదంభ
               శుభద్విలాస సంస్తంభకుంభ
   యాయజూకముదావహాగళితారంభ
               మల్లికా కోరక - మంజు జంభ


గీ. బంభర వినీలకేశ కుసుంభవర్ణ
     శుంభ దంశుక కనదవష్టంభమునను
     జంభదనుజారి గొల్వ నదంభరక్తి
     రంభ చనుదెంచె నధిక సంరంభమునను.

ఇంత సొగసైన పద్యాన్ని వ్రాసిన కవి పుంగవుడెవరో కనుక్కోగలరా?

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 9


ఆధారాలు: 

అడ్డం: 
1. అల్లసాని పెద్దనకు రాయలవారు తొడిగినది ఇదియె?
3. మగువ జీవితాన్ని ఈ పత్రికతో పోల్చారు దాశరథి.
5.కారుతున్న రైలుసదనములో దాగున్న 'నానో' కర్షకులు :-)
7. HDFC బ్యాంకులో దాచిన అంకగణితపు భాగమేనా సారూ?
9. మొదట్లో తడబడిన బాడీగార్డుకు చివరనుంచి రెండో అక్షరం మటుమాయం.
10. బంగారు మురుగు
11. మంచి గొంతుక
14. లలామ రకం కతల్లో సులభ సాధ్యం.
15. తలవాకిలి
16. కవిసార్వభౌమునికి జరిగిన ఒకానొక సత్కారము. 

నిలువు:
1.కడివెడు పాలు : ఖరము :: గరిటెడు పాలు : ____
2. 'జహంగీరు 18వ భార్య'కెన్ని లక్షలు 'కన్యాశుల్కం 19దా'? 
4. పదిహేడో నెంబరు పురాణం.
5.తెలుగు న్యూసు పేపరు. 
6.శీర్షాసనం వేసిన కంసుడు మొదలైన శత్రువులు.
7. రంగడు సుశీలల మధ్య కఠినము.
8. పరమాణు సంఖ్య 15కల మూలకము.
9. ఏనుగు సవారీ ఒక సత్కారమేనా? 
12.పిల్లంగోవి ఈ బ్లాగరి కలంపేరు.
13. ఇక్కడ బావిలోన వెలసిన వినాయకుడు కొలువై ఉన్నాడు. 


20, మే 2010, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 8 సమాధానాలు!

ఈసారి సిద్ధార్థ్ మినహా  ఎందుకో పజిల్‌పై  శీతకన్ను వేశారందరూ :-) సిద్ధార్థ్ గారికి అభినందనలు. పజిల్ సమాధానాలు కింద ఇస్తున్నాను.అడ్డం: 
1. తిరుమల క్షేత్రానికి తొలి గడప.                                                                                               - దేవుని కడప (కడప పట్టణానికి సమీపంలో ఉన్న శ్రీ లక్ష్మీవెంకటేశ్వర స్వామి క్షేత్రము)
3. ఇది కుడుతుంటే తీపిగుంటదా అయినా నీవు కన్ను కొడుతుంటే వెన్నలొస్తది అని వేటూరి పాట.   - తేనెటీగ (తేనెటీగ కుడుతుంటే తీపిగుంటదా ... అని పంతులమ్మ సినిమాలోని పాట.వేటూరి రచనకు రాజన్ - నాగేంద్ర సంగీతం కూర్చారు.)
5. మాయ జలతారు నవలా రచయిత అంటే ఎలా అర్థం అవుతుంది? ఆ నవలపేరు మార్చారు కద! - రావూరి భరద్వాజ (భరద్వాజగారి ప్రఖ్యాత నవల 'పాకుడురాళ్లు' కు మొదట మాయజలతారు అనే పేరు పెట్టారు. శీలా వీర్రాజు గారి సలహా మేరకు దాన్ని 'పాకుడురాళ్లు'గా పేరు మార్చారు.) 
7. ఈమె ఎన్టీఆర్ జాతీయ అవార్డు గ్రహీత నిజము నమ్ము!                                                           - జమున
9. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పుస్తకం కొత్తదుప్పటి దీనికి ఓ ఉదాహరణ.                                    - కథాసంపుటి
10.'ఎదురులేని మనిషి' రచయిత్రి వీరగంధం సుబ్బారావు మాజీ భార్యా?                                       - లక్ష్మీపార్వతి  (లక్ష్మీపార్వతి రచించిన ఎన్టీయార్ జీవితచరిత్ర పేరు ఎదురులేని మనిషి)    
11. నేపాలు లంకలలో నిక్షిప్తమైన కటాహము తిరగబడింది.                                                         - లంపాక (కటాహము = కపాలము)
14. వుసిముసి నగమున దాగున్న హాసవిశేషము.                                                              - ముసిముసి నగవు 
15. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సంఘటనలకు నెలవు ఇక్కడే!     - నందిగ్రామ్ 
16. గోవిందరాజులు సుబ్బారావును తలచుకోగానే గుర్తుకొచ్చే పాత్ర.                                       - మాయల మరాఠి   ( 'బాలనాగమ్మ' సినిమాలో మాయల మరాఠీగా వీరు ప్రేక్షకుల విశేష ప్రశంసలను పొందారు.)


నిలువు:
1.కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్... ఈ పాట ఎవరిది? వసుదేవుడిదా?          - దేవదాసు
2. విశ్వావసు తరువాతి అవమానము.                                                                                - పరాభవము (తెలుగు సంవత్సరాలలో విశ్వావసు తర్వాత వచ్చేది పరాభవ)
4. ఆల్ ఇండియా రేడియోను ఇలా పిలిస్తే మీరొప్పుకోరు.                                                        - గగన భారతి (ఆకాశవాణికి పర్యాయపదం గగనభారతి)
5. అవతార పురుషుడి అసలు ఎజెండా                                                                                - రాక్షస సంహారము
6.'ఆమె చెప్పిన కథలు అను పన్నెండు తేనెసాల కథలు' రచయిత.                                       - జయంతి పాపారావు
7. క్లిష్టమైన మృగరాజు.                                                                                                     - జటిలం (సింహానికి జటిలము అనే పేరు ఉంది) 
8. కానల కరిగెడిది కాదు ఈ వెత.                                                                                      - నలక (నలక అంటే బాధ. కానీ అడవులకు వెళ్లేటంత బాధ కాకపోవచ్చు.) 
9. అడ్డం 9 వంటిదే కానీ ఎక్కువమంది వండివార్చినది.                                                        - కథాసంకలనం
12.దీన్ని చూడ్డమంటే చాలా మంది చెవులు కోసుకుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా!                    - పాత సినిమా
13. నిపుణుడు,నిష్ణాతుడు అనే అర్థంలో వాడుతారు ఈ వేద పండితుడిని.                               - ఘనాపాఠి17, మే 2010, సోమవారం

జుట్టుమామ

డా.ఎం.వి.రమణారెడ్డిగారి కథ జుట్టుమామ కథాజగత్‌లో చదివి ఆనందించండి. ఈ కథపై మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. అట్లాగే ముందుముందు రాబోయే ఈ క్రింది కథలను కూడా చదవండి.

1.కన్నోజు లక్ష్మీకాంతం - పాపం! నారాయణరావు
2.తిరుమలశ్రీ - ఎలిబీ
3.వరిగొండ కాంతారావు - అంతిమం
4.అంబికా అనంత్ -  కొడిగట్టరాని చిరుదీపాలు
5.నాగసూరి వేణుగొపాల్ -రిగ్గింగ్
6.పాతూరి అన్నపూర్ణ - ముళ్ళకంచె
7.తాడిగిరి పోతరాజు - నిరవధిక నిరీక్షణ

8.కె.వి.నరేందర్ - కల్లోలం
9.రమగమిని - ఆలోకనం
10.ఈతకోట సుబ్బారావు - కాశీబుగ్గ
11. గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు - పన్నూబోయె పరువూబోయె 

16, మే 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 8ఆధారాలు: 

అడ్డం: 
1. తిరుమల క్షేత్రానికి తొలి గడప.
3. ఇది కుడుతుంటే తీపిగుంటదా అయినా నీవు కన్ను కొడుతుంటే వెన్నలొస్తది అని వేటూరి పాట.
5. మాయ జలతారు నవలా రచయిత అంటే ఎలా అర్థం అవుతుంది? ఆ నవలపేరు మార్చారు కద!
7. ఈమె ఎన్టీఆర్ జాతీయ అవార్డు గ్రహీత నిజము నమ్ము!
9. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి పుస్తకం కొత్తదుప్పటి దీనికి ఓ ఉదాహరణ.
10.'ఎదురులేని మనిషి' రచయిత్రి వీరగంధం సుబ్బారావు మాజీ భార్యా?
11. నేపాలు లంకలలో నిక్షిప్తమైన కటాహము తిరగబడింది.
14. వుసిముసి నగమున దాగున్న హాసవిశేషము.
15. ఆ మధ్య పశ్చిమ బెంగాల్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టిన సంఘటనలకు నెలవు ఇక్కడే!
16. గోవిందరాజులు సుబ్బారావును తలచుకోగానే గుర్తుకొచ్చే పాత్ర.  

నిలువు:
1.కుడి ఎడమైతె పొరపాటు లేదోయ్, ఓడి పోలేదోయ్... ఈ పాట ఎవరిది? వసుదేవుడిదా?
2. విశ్వావసు తరువాతి అవమానము.
4. ఆల్ ఇండియా రేడియోను ఇలా పిలిస్తే మీరొప్పుకోరు.
5. అవతార పురుషుడి అసలు ఎజెండా
6.'ఆమె చెప్పిన కథలు అను పన్నెండు తేనెసాల కథలు' రచయిత.
7. క్లిష్టమైన మృగరాజు.
8. కానల కరిగెడిది కాదు ఈ వెత.
9. అడ్డం 9 వంటిదే కానీ ఎక్కువమంది వండివార్చినది.
12.దీన్ని చూడ్డమంటే చాలా మంది చెవులు కోసుకుంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా!
13. నిపుణుడు,నిష్ణాతుడు అనే అర్థంలో వాడుతారు ఈ వేద పండితుడిని. 14, మే 2010, శుక్రవారం

కవిహృదయం!

వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో డి.కె.చదువులబాబు, పంజాల జగన్నాథం గార్ల కథలు ప్రకటించబడ్డాయి. ఈ రెండు కథలకు టైటిల్ నేను సైతం... ఇందులో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేనప్పటికీ ఈ పేరు పెట్టడానికి వెనుక ఈ రచయితల కవి హృదయం ఒకేలా ఉండటం మాత్రం గమనించవలసిన విషయం. రెండు కథల్లోనూ చివర కథానాయకుడు తన ఆస్తిని అంతటిని వృద్ధ అనాథ ఆశ్రమాలకు ఇవ్వడం ఒకే కథాశీర్షికకు ఊతమిస్తుంది. ఈ రచయితల కవిహృదయం తెలుసుకోవాలంటే ఆ కథలను చదవడమే ఏకైక మార్గం.       

11, మే 2010, మంగళవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 7ఆధారాలు:

అడ్డం:

1.నలమహారాజు పాయస సేవనములో టైమ్ మేనేజ్‌మెంట్.
3.జంపాల ఉమామహేశ్వరరావు మనకు ఇలా సుపరిచితుడు.
5.కవిబ్రహ్మ, ఉభయ కవి మిత్రుడే కాని కొంచెం తడబడ్డాడు.
7.భరాగో ఈ కథలు వ్రాశారు.
9.గణతంత్ర దినోత్సవంనాడు రాష్ట్రపతి బహూకరించే ఒకానొక  గ్యాలంటరీ అవార్డు.
10.కన్నుల పండుగ లాంటిదే మరో ఇంద్రియానిది.
11.మా సీమయందు ప్రార్థనా స్థలంబు కలదో?
14.చేనేత దీనికి ఒక ఎక్జాంపుల్.
15.పూర్తిగా నెరిసిన తలను పోల్చడానికి ఇంతకంటే మంచి ఉపమానం ఉందా?
16.యండమూరి నవల థ్రిల్లర్ ఆధారంగా నిర్మించబడ్డ సినిమా.

నిలువు:

1.సేమియా పాయసమురా నిరాకరించకు.
2.కంటిచుక్క ఈ హీరోయిన్.
4.లష్కరు.
5.డోన్ట్ బి కన్ఫ్యూజ్‌డ్
6.ప్రచండమైన నిపుణత్వము.
7.అనక్రమ హి.. హి..
8.ఈ డేవిడ్ తెలుగోడే!
9.నామలింగానుశాసనమ్
12.ఆటవెలదితోనో, తేటగీతితోనో జతగూడనిదే దీనికి కుదరదు.
13.హరి సద్దుమణిగిన ఎల్ల(ల్లా)?

10, మే 2010, సోమవారం

పుస్తక సమీక్ష -16 ఓటర్లకొకమాట


[పుస్తకం: ఓటర్లకొకమాట,  రచన: కీ.శే.అంబటిపూడి వెంకటరత్నం, పేజీలు:44, వెల:రూ.40/-, ప్రతులకు: శ్రీ ఎ.వి.సుబ్రహ్మణ్యం శాస్త్రి, ఇ.నెం.బి-19/18-65/3 ఫ్లాట్ నెం.103, శ్రీసాయినివాస్, వెస్ట్ వెంకటాపురం, ఎం.యి.ఎస్.కాలనీ,అల్వాల్, సికింద్రాబాద్ 500 015 సెల్:9949849583]

                      అంబటిపూడి వారి పేరు వినగానే వెంటనే స్ఫురించేది వారు స్థాపించిన సాహితీ మేఖల. ఈ సంస్థ నల్గొండ జిల్లాలోనే కాక యావత్ తెలంగాణా ప్రాంతంలో విశేషమైన ప్రాచుర్యాన్ని పొందింది.

                   ఈ ప్రభోదాత్మక కావ్యాన్ని అంబటిపూడివారు 1955లో వ్రాసి ప్రకటించారు. ఐదున్నర దశాబ్దాలు గడిచినా నేటి పరిస్థితులకు కూడా ఈ రచన అనుగుణంగా ఉన్నదని భావించిన సాహితీ మేఖలవారు ఈ కావ్యాన్ని పునర్ముద్రించారు. 119 పద్యాలు కలిగిన ఈ రచనకు రాళ్ళబండి శ్రీరామమూర్తిగారి వ్యాఖ్యానం శోభనిస్తోంది.

                 ఎన్నికల ముందు నాయకులు పెట్టే ప్రలోభాలకు లొంగకుండా ఓటుహక్కును సద్వినియోగం చేసుకోమని ఓటరునుద్దేశించి అంబటిపూడి వెంకటరత్నంగారు చేసిన ఈ ఉద్బోధలో సామాజిక అసమానత, ఆర్థిక వ్యత్యాసం, ప్రజల మధ్య అనైక్యత మొదలైన అంశాలపై కవిగారి ఆందోళన కనిపిస్తోంది.

               గాంధీజీ, ఇందిరాగాంధీ, మాక్స్‌ముల్లర్ మొదలైన వారిపై కవిగారికున్న అభిమానం ఈ పద్యాల్లో ద్యోతకమౌతున్నాయి. పొట్టి శ్రీరాములు త్యాగనిరతిని ప్రశంసిస్తూ చెన్నపట్టణం ఆంధ్రులకు దక్కకపోవడానికి కారణమైన చక్రవర్తి రాజగోపాలాచారి దౌత్యాన్ని నిరసించారు. పాశ్చాత్య కవులైన షేక్స్‌పియర్, ఇలియట్, ఆర్నాల్డ్ తదితరుల పట్ల ఉన్న అభిమానం ఈ పద్యాల్లో కనిపిస్తుంది. పాఠకుల్లో రాజకీయ చైతన్యాన్ని, ప్రజా సమస్యలపీ స్పృహను కలిగింపజేసే ఈ రచన కవిగారి ప్రతిభా సంపత్తికి నిదర్శనం.

                       అంబటిపూడి వారి పద్యాలను చవి చూడటానికి మచ్చుకు రెండు ఇక్కడ చదవండి.

తినుటకు తిండి కట్టుకొన - తిన్నని బట్ట వచింప విద్దెయున్
మనకు హుళక్కియై మనసు - మాత్రము మిన్నున గాలిమేడ లే
పిన ఫలమేమి? యే ఘనులొ - పెద్దవి పెద్దవి గద్దెలందుకో
జనుటకు సాధనాల మయి - చంకలు గొట్టిన పొట్ట నిండునే.

'మీ వోటును మా కిం'డని 
మీ వెంట ధనమ్ము తోడ మేకొను వారల్
పూవిలుతులొ భూపతులొకొ!
మీ విజ్ఞత లెట్టియెట్టి మెలకువ గనునో?

[సాహితీ కిరణం మాసపత్రిక మే 2010 సంచికలో ప్రచురితం]

9, మే 2010, ఆదివారం

సౌశీల్యద్రౌపది ఆవిష్కరణ విశేషాలు!

పుస్తక సమీక్ష 15 - కడలి కెరటం

[పుస్తకం: కడలి కెరటం, రచన: యస్వీ కృష్ణ, పేజీలు:32, వెల:రూ.3/-, ప్రతులకు: జయంతి పబ్లికేషన్స్, 19-12 పి&టి కాలనీ, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్ -60]

                     ఈ పుస్తకానికి కొన్ని ప్రత్యేకతలున్నాయి. కేవలం ఒక కథ మాత్రమే పుస్తకంగా ముఖ్యంగా తెలుగుభాషలో వచ్చిన దాఖలాలు కనిపించటం లేదు. ఈ కడలి కెరటం అటువంటిదే. ఇది ఒకరకమైన సాహసోపేతమైన చర్య. కాపీరైట్ చట్టంపై వచ్చిన మొదటి కథ కూడా ఇదే.

                   32పేజీల ఈ చిన్ని పుస్తకంలో కథతో పాటు ఈ కథపై పలువురు ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు ఉన్నాయి. అవి సేమ్యా పాయసంలో కిస్‌మిస్ జీడిపప్పుల్లా ఈ పుస్తకంలో కథకు రుచిని ఇస్తున్నాయి.

                   కడలి కెరటం కథ మధ్యాహ్నం రెండున్నర గంటలకు ప్రారంభమై రాత్రి సుమారు ఏడు ఏడున్నర గంటలకు ముగుస్తుంది. ఈ ఐదు గంటల వ్యవధిలో రెండు మూడేళ్ళ కథను వివరిస్తారు రచయిత. ఈ కథలో హీరో కూడా ఒక రచయితే. కథానాయకుడు జైలులో అడుగుపెట్టడంతో మొదలై జైలు నుండి బయటకు రావటంతో కథ ముగుస్తుంది. చర్లపల్లిలోని ఓపెన్ ఎయిర్ జైలు గురించి కథలో చక్కగా వర్ణించబడింది. ఈ జైలు గురించి వచ్చిన మొదటి కథ కూడా ఇదే కాబోలు. మనకు సినిమాల్లోనూ, నవలల్లోనూ పరిచయం ఉన్న సెంట్రల్ జైలుకు పూర్తి భిన్నంగా ఉంటుంది ఈ కథలోని జైలు. ఈ జైలు వర్ణన కాస్త విస్మయాన్ని కలిగిస్తుంది. జైలు లోపల వెడల్పాటి రోడ్లు, చుట్టూ చెట్లు, పార్కులు, విశాలమైన భవనాలు వీటిని వివరిస్తూ యూనివర్సిటీ క్యాంపస్‌లా ఉంది అంటారు. ఒక చోట ఈజైలును ప్రకృతి చికిత్సాలయంతో పోలుస్తున్నారు. మరో చోట ర్యాగింగ్ లేని మెడికల్ కాలేజితో పోలుస్తున్నారు రచయిత. ఇక కథలోకి వెళితే అమర్ ఒక రచయిత. అతని రచనల్లో సత్తా ఉన్నా సాహిత్య ప్రపంచంలో అతనికి పరిచయాలు లేకపోవడం వలన అవి ప్రచురణకు నోచుకునేవి కావు. అలాంటి సమయంలో ఓ ఛోటా రచయిత్రి ఇతని రచనలను కొని తన పేరుతో ప్రచురించుకుంటానని ప్రలోభ పెడుతుంది. ఆర్థికంగా కలిసివస్తుందని ఒప్పుకుంటాడు అమర్. ఆ విధంగా అతను ఘోస్ట్‌రైటర్‌గా మారి సదరు రచయిత్రి ఉత్తమరచయిత్రిగా ఎదగడానికి ఉపయోగపడతాడు. రెండేళ్ళు సాఫీగా నడుస్తుంది ఈ వ్యవహారం. అతడు తన పేరును అచ్చులో చూసుకోవాలనే కోరిక బలపడటంతో ఒక నవలను వ్రాసి తన పేరుతో ఒక పత్రికకు పోటీకి పంపుతాడు. ఆనవలకు బహుమతి వస్తుంది. అతనికి పేరు రావడం చూసి ఈర్ష్యతో తట్టుకోలేని ఆ రచయిత్రి ఆ నవల సీరియల్‌గా పత్రికలో ప్రారంభం కాకముందే తన పేరుతో రిలీజ్ చేసుకుని అమర్‌పై తన రచనని కాపీ కొట్టాడని కేసు బనాయించి కోర్టుకీడ్చి, జైలుకు రిమాండ్‌కు పంపిస్తుంది. అంతేకాక తన పరపతితో అతని ఉద్యోగాన్ని ఊడబెరికిస్తుంది. ఇదీ కథ. ఈ కథను జైల్లో వినడానికి సదానంద్ అనే పాత్ర సృష్టించబడింది. ఆ సదానంద్ జైలుకు రావడానికి అతనికో నేరచరిత్ర కల్పించబడింది. సదానంద్‌ను సాధువుగా చూపించటానికి అతని భార్యను నీచపాత్రగా చూపాల్సి వచ్చింది. ఇక్కడే మనకు యస్వీ కృష్ణ గారి  ప్రతిభ కనిపిస్తుంది. చివరకు అమర్ తన నవలను కన్నబిడ్డతో సమానంగా పేర్కొనడంతో కథ ముగింపు రక్తి కట్టించింది

                  ఈ కథలో అమర్ పాత్రపై మనకు సానుభూతి కలుగుతుంది. అయితే అమర్ తాను ఘోస్ట్‌రైటర్‌గా మారటాన్ని - పేగుతెంచుకుని పుట్టిన బిడ్డల్నైనా పెంచి పోషించే స్థోమత లేనప్పుడు ఆ బాధ్యత వహించి, వారికి మంచి జీవితాన్నిచ్చి వెలుగులోకి తీసుకురాగల శక్తిసామర్థ్యాలున్న వారికి దత్తత ఇవ్వడంలో తప్పులేదనే - పోలికతో సమర్థించుకోవడం మాత్రం ఆక్షేపణీయం.

                 'నేనొక రచయితను. ఈ మాట ఇక్కడ చెప్పుకున్నంత ధైర్యంగా, బాహాటంగా బయట చెప్పుకోలేని పరిస్థితి నాది' అంటాడు అమర్ ఒక చోట. ఈ దుస్థితి ఏ రచయితకూ రాకూడదు. 

                 సింగిల్ టీ ఖర్చుతో ఓక మంచి కథను అందించిన యస్వీ కృష్ణ అభినందనీయుడు. రచయితా, పబ్లిషరూ ఒకరే అయితే ఆ పుస్తకం రచయిత అభిరుచికి తగ్గట్టుగా మంచి గెటప్‌తో వెలువడుతుంది అనడానికి ఈ పుస్తకం ఓ మచ్చు తునక.

[సాహితీ కిరణం మాసపత్రిక మే 2010 సంచికలో ప్రచురితం]      

8, మే 2010, శనివారం

పుస్తక సమీక్ష -14 సౌశీల్య ద్రౌపది

                మన పురాణకావ్యాలు రామాయణ భారతాలను ఎందరో ఎన్నోరకాలుగా విశ్లేషిస్తున్నారు. వారివారి అవగాహనకు అక్షర రూపం కల్పించి గ్రంథస్తం చేస్తున్నారు. ఎవరెన్ని రకాలుగా వ్రాసినా ఆ రచనలకు విశేషమైన ప్రాధాన్యం లభిస్తోంది. దానికి కారణం మూల రచనలైన వ్యాస భారతం, వాల్మీకి రామాయణాల వైశిష్ట్యమే.  ప్రస్తుతం కస్తూరి మురళీకృష్ణ మహాభారతంలోని ద్రౌపది పాత్రను తీసుకుని ఆ పాత్ర ఆధారంగా భారత కథను మనకు సౌశీల్య ద్రౌపది అనే పేరుతో ఒక నవలిక రూపంలో అందిస్తున్నారు.

              ఈ రచన నేపథ్యాన్ని రచయిత తన ముందు మాటలో చాలా వివరంగా తెలిపారు. ఇటీవలి కాలంలో మన భారతీయ ధర్మానికి ప్రతీకలైన పురాణ పాత్రలను దిగజారుస్తూ జరుగుతున్న దుష్ప్రయత్నాలకు, వాటికి లభిస్తున్న ప్రచారాలకు సమాధానంగా ఇటువంటి రచనల అవసరాన్ని గుర్తించారు రచయిత. దాని పర్యవసానమే ఈ సౌశీల్య ద్రౌపది.

               కృష్ణుని నిర్యాణానంతరం ద్రౌపది పాండవులతో కలిసి హిమాలయాలకు పయనించడంతో ఈ కథ ప్రారంభమౌతుంది. ఆమె పాండవులందరి కంటె ముందు తనువు చాలిస్తుంది. భీమసేనుడు తమ కంటే ముందు ద్రౌపది మరణించడానికి కారణం గురించి ధర్మరాజును ప్రశ్నిస్తాడు. ధర్మరాజు సమాధానం విన్న ద్రౌపది తనపై వచ్చిన అపోహను తలచుకుని నవ్వు కుంటుంది. తన జీవితంలో తాను అనుభవించిన అపోహలు, అవమానాలు, అపార్థాలను గుర్తు చేసుకుంటుంది.

               కారణ జన్మురాలైన ద్రౌపదిని అర్జునుడు మత్స్యయంత్ర ఛేదనతో చేపట్టటం, పాండవులు ఆమెను తీసుకుని కుంతివద్దకు వచ్చి భిక్ష తెచ్చామని చెప్తే ఆమె భిక్ష ఏమిటో చూడకుండా ఐదుగురినీ పంచుకోమనటం, తల్లి మాటను జవదాటని పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకోవటానికి సిద్ధ పడటం, ఐదుగురు భర్తలను పొందటానికి కారణము వ్యాసుని ద్వారా తెలుసుకోవటం,  నియమోంఘల్లన చేసిన అర్జునుడు తీర్థయాత్రలకు వెళ్ళి ఉలూచి, చిత్రాంగద, సుభద్రాదులను పెళ్ళి చేసుకుని రావటం, సుభద్ర అభిమన్యుడికి, ద్రౌపది ఉపపాండవులకు జన్మనివ్వటం, ధర్మజుని రాజసూయ యాగము, మయసభలో సుయోధనుని పరాభవము, ద్యుతక్రీడలో ధర్మరాజు ద్రౌపదితో సహా సర్వం ఓడిపోవటం, ద్రౌపది వస్త్రాపహరణ, పాండవుల వనవాస అజ్ఞాతవాసాలు, సైంధవ పరాభవము, కీచకవధ, రాయబారాలు, కురుక్షేత్ర సంగ్రామం, ఉపపాండవుల వధ, అశ్వత్థామ ప్రాణదానం  ఇలా కథ సాగిపోతుంది. ఆయా సందర్భాలలో ద్రౌపది ఎదుర్కొన్న అవమానాలు, పడిన మానసిక సంఘర్షణ, క్షోభ, చూపిన సంస్కారం, నిండు సభలో అధర్మాన్ని ప్రశ్నించే తెగువ, తన పట్ల అనుచితంగా వర్తించేవారిపై చూపే క్రోధం, తనను అవమానించిన వారి నాశనం పట్ల నిర్లిప్తత, కనీసం ఒక తల్లికైనా పుత్రశోకం తప్పించాలన్న ఔన్నత్యం, క్షమాగుణం వీటన్నిటినీ రచయిత చక్కగా పాఠకుల కళ్ళముందు ఉంచుతున్నారు.

               ఒక స్త్రీని చులకన భావంతో చూసి లైంగికవస్తువులా భావించే కాముకులకు ఈ నవల కనువిప్పు కలిగిస్తుంది. మురళీకృష్ణ గారి శైలి ఆద్యంతం చదివించేలా వుంది. ఒకటి రెండు అక్షరదోషాలున్నా అవి పఠనానికి ఆటంకం కావు. ఇంత మంచి రచనను అందించిన రచయితకు నా అభినందనలు.

              96 పేజీలున్న ఈ పుస్తకం వెల 50రూపాయలు మాత్రమే. కొనదలచినవారు నవోదయ బుక్‌హౌస్, కాచిగూడ క్రాస్‌రోడ్స్, హైదరాబాదు వారిని సంప్రదించండి.(ఫోన్ 040- 24652387)

6, మే 2010, గురువారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 6 సమాధానాలు!


అడ్డం:  

1. రెబల్ స్టార్ కృష్ణంరాజు తొలిచిత్రం                                                                                            - చిలక గోరింక           
3. రాజనావ్వులో  ప్రేమ నశించిన బహుమతి దొరుకుతుంది వెదకండి.                                    -  నజరానా
5. భక్త తుకారాం సినిమాలో డా.సినారె దీనికి టైమ్ అయిందని సుశీలతో పాట పాడిస్తున్నాడు.         -  పూజకు వేళాయెరా
7.శకము, మశకములలో సామ్యము సమయానికి చెందినదా?                                                  - శకము               
9.సిపాయి చిన్నయ్య నా సామిరంగ అంటూ పాడుతున్న పాటలో మొదటి పదములు.                     - నా జన్మభూమి
10.పాద ప్రతిన సరిచేస్తే ప్రపోజల్.                                                                                                - ప్రతిపాదన
11.అతని విషయాల్లో సంతృప్తి కలదు.                                                                                        - తనివి
14.కృష్ణా పత్రిక వ్యవస్థాపక సంపాదకులు.                                                                                   - ముట్నూరి కృష్ణారావు
15.దాశరథి రచించిన కావ్యం.                                                                                                    - రుద్రవీణ
16.ఈ సీతాకోక చిలుక మాటే మంత్రము మనసే బంధము అని కార్తీక్‌తో కలిసి పాడుతోంది.              - ముచ్చర్ల అరుణ


నిలువు:
1. నీ చెలిమీ నేడె కోరితినీ అంటున్న నార్ల వారు.                                                                        - చిరంజీవి                                                                                                
2. కళాప్రదర్శనకు ప్లాట్‌ఫాం అనొచ్చా?                                                                                      - కళావేదిక 
4. ఉత్తర హరివంశము వ్రాసింది సోమనాటర్జీయా? న... న...                                                - నాచన సోమన
5. గత పుట్టుకకు సంబంధించిన తెలివిడి.                                                                                 - పూర్వజన్మ జ్ఞానము
6. మడిసన్నాక కూసింత కలాపోశన ఉండాలని ప్రవచించిన నట విరాట్.                                       - రావు గోపాలరావు
7. కసాయివాడు.                                                                                                                   - శమిత
8. ట్టుచెవిరా                                                                                                                          -  ముప్రవి
9. ఈ హిందీ సినిమా నటుడు నానా ప(దార్థములు) పుచ్చుకునే వాడు.(taker)                            - నానాపటేకరు
12. నిత్య అనే అమ్మాయి చేసే పని రొటీనా?                                                                               - నిత్యకృత్యము
13. లేడీస్ టైలర్ వంశీ వెతుకులాట.                                                                                         - అన్వేషణ


ఈ పజిల్‌ను పూరించిన కంది శంకరయ్య గారికి అభినందనలు.

5, మే 2010, బుధవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 6


ఆధారాలు:
అడ్డం:  

1. రెబల్ స్టార్ కృష్ణంరాజు తొలిచిత్రం
3. రాజనాల నవ్వులో  ప్రేమ నశించిన బహుమతి దొరుకుతుంది వెదకండి.
5. భక్త తుకారాం సినిమాలో డా.సినారె దీనికి టైమ్ అయిందని సుశీలతో పాట పాడిస్తున్నాడు.
7.శకలము, మశకములలో సామ్యము సమయానికి చెందినదా?
9.సిపాయి చిన్నయ్య నా సామిరంగ అంటూ పాడుతున్న పాటలో మొదటి పదములు.
10.పాద ప్రతిన సరిచేస్తే ప్రపోజల్.
11.అతని విషయాల్లో సంతృప్తి కలదు.
14.కృష్ణా పత్రిక వ్యవస్థాపక సంపాదకులు.
15.దాశరథి రచించిన కావ్యం.
16.ఈ సీతాకోక చిలుక మాటే మంత్రము మనసే బంధము అని కార్తీక్‌తో కలిసి పాడుతోంది.


నిలువు:
1. నీ చెలిమీ నేడె కోరితినీ అంటున్న నార్ల వారు.
2. కళాప్రదర్శనకు ప్లాట్‌ఫాం అనొచ్చా?
4. ఉత్తర హరివంశము వ్రాసింది సోమనాథ చటర్జీయా? న... న... 
5. గత పుట్టుకకు సంబంధించిన తెలివిడి. 
6. మడిసన్నాక కూసింత కలాపోశన ఉండాలని ప్రవచించిన నట విరాట్.
7. కసాయివాడు.
8. ట్టుచెవిరా
9. ఈ హిందీ సినిమా నటుడు నానా ప(దార్థములు) పుచ్చుకునే వాడు. 
12. నిత్య అనే అమ్మాయి చేసే పని రొటీనా?
13. లేడీస్ టైలర్ వంశీ వెతుకులాట. 


  

2, మే 2010, ఆదివారం

చదవండి

 డా.బి.వి.ఎన్.స్వామిగారి కథ పగలు, రాత్రి... ఒక మెలకువ  కథాజగత్‌లో చదవండి.