...

...

29, నవంబర్ 2010, సోమవారం

మరో ప్రహేళిక - సమాధానాలు!

     రాధ చేసెడి దివ్య సాధనంబదియేది?                  -  ఆరాధ
              దీపను గూడిన తాపసెవడు?              - సాందీపని
    లయగల్గునటువంటి నయమైన స్థలమేది?      - నిలయము
               సన యిచ్చు చెరగని యానతేది?       - శాసనము
    మహిలో రిచా జూపు రోహితమ్మెట్టిది?            - హరిచాపం
               వండి రియా తిను తిండియేది?         - బిరియాని 
    సరదా సదా కను సర్పంబు యదియేది?        - విసదారి
              మించెడు రతి చేతి సంచి యేది?        - కరతిత్తి

27, నవంబర్ 2010, శనివారం

మరో ప్రహేళిక !!

ఊకదంపుడుగారి కోరిక మేరకు మరొక ప్రహేళిక


సీ. రాధ చేసెడి దివ్య సాధనంబదియేది? 
              దీపను గూడిన తాపసెవడు? 
    లయగల్గునటువంటి నయమైన స్థలమేది? 
               సన యిచ్చు చెరగని యానతేది?
    మహిలో రిచా జూపు రోహితమ్మెట్టిది? 
               వండి రియా తిను తిండియేది? 
    సరదా సదా కను సర్పంబు యదియేది? 
              మించెడు రతి చేతి సంచి యేది? 


తే.గీ. అన్నిటనుజూడ నాలుగు యక్షరములు 
        నడిమి రెండక్షరములందె జూడ గలరు 
       చెప్ప గల్గిన వాడెపో గొప్పవాడు
       చెప్పకుండిన సర్వజ్ఞు డొప్పుగాను.

26, నవంబర్ 2010, శుక్రవారం

ఆదర్శం -ఆచరణ


 "ప్రపంచంలో ఎన్నో రకాల యుద్ధాలుంటాయి. అయితే మనిషి తన మనసుతో చేసే యుద్దం అన్నింటినీ మించిన మహా సంగ్రామం లాంటిది"
 - స్వామి శివానంద.

             మనిషి తన అంతరంగంలో అనునిత్యం పోరాడుతూనే వుంటాడు. తన ఆలోచనలు, ఆచరణలు, ప్రవర్తన న్యాయమైనవా? కావా? నిజాయితీతో కూడినదా? కాదా? అని మథన పడుతూనే వుంటాడు. ఈ అంతర్మథనం నుండే అతని వ్యక్తిత్వం బయటపడుతుంది. మనిషి తన జీవితంలో ఆదర్శాలను, నీతి నియమాలను, బాధ్యతలను, మార్పులను, తృప్తి - అసంతృప్తులను, జయాపజయాలను ఎదుర్కొనక తప్పదు.
           
            తెలుగునాట పేరున్న రచయితలలో అజీజ్‌గారు ఒకరు. వీరు కథ, నాటకం, నవల మొదలైన ప్రక్రియలలో తమదంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అజీజ్‌గారి కలం నుండి జాలువారిన కొన్ని కథల కూర్పే "మనిషి" కథల సంపుటి. ఈ సంపుటిలోని కథలలో మనకు మానవీయ విలువలపై స్పష్టమైన దృక్పథం కనిపిస్తుంది. ప్రతి మనిషి జీవితంలో ఓ మంచి పని చేసి, వెలకట్టలేని ఆత్మతృప్తిని మిగుల్చుకోవాలి అంటారు ఒక కథలో. దేవుళ్ళ పేర, పెళ్ళి పేర, పుట్టినరోజు పేర, తద్దినాల పేర పెట్టే ఖర్చులో కొంత శాతమైనా అనాథలకు ఖర్చు చేయాలని సూచిస్తారు మరో కథలో. ధనం, కులం, మతం, గోత్రం, సంప్రదాయం వల్ల సాధ్య పడనిది ప్రేమ వల్లే సాధ్యపడుతుందని రేపటి తరం కథలో నిరూపిస్తారు రచయిత. ఏ సమాజంలో పుట్టి, ఏ సమాజంలో పెరిగి, ఏ సమాజం ద్వారా డబ్బు సంపాదిస్తున్నామో, అలాంటి సమాజానికి చేతనైన మంచి చేయలేక పోవడం అనైతికం అని రచయిత అభిప్రాయం. ఈ విషయాన్నే అనైతికం, రుణం, మనిషి, బాధ్యత కథలలో బలంగా చెబుతున్నారు. ఆదర్శాలనేవి కేవలం రచనల్లోనో, ఉపన్యాసాల్లోనో కాక నిజ జీవితంలో ఉండాలన్నది అజీజ్‌గారి గట్టి నమ్మకం. ఈ విషయం దాదాపు వీరి కథలన్నింట్లోనూ కనిపిస్తుంది. మనిషి   కథలో కొడుకును రిజిస్టర్ మ్యారేజి చేసుకొమ్మని చెప్పడంలోనూ, ఆదర్శం, మారాలి మనం కథల్లో కులాంతర వివాహం జరిపించడంలోనూ, రుణం కథలో అనాథలకు ఉపాధి చూపించడంలోనూ ఈ విషయం స్పష్టమౌతుంది. ఆమె నవ్వులో... అన్న కథలో ముగింపు వాక్యల్లో 'ఆమె నవ్వులో అమ్మతనం కనిపించింది' ఈ భావన నిజంగా ఆ కథకు గొప్పదనం చేకూర్చటమే కాక ఉదాత్తతను సంతరించుకునేలా  చేసింది. 
పాలకుల్లో స్వార్థం, అధికారుల్లో నిర్లక్ష్యం, అవినీతి, ప్రజానీకంలో ఉదాసీనత వీటన్నిటిపై రచయిత ఉక్రోషం ఉప్పెన కథగా రూపొందింది. ఎర్రకాగితాలు కథలో ఎదుటివారి అవసరాన్ని తనకు అవకాశంగా మార్చుకునే అంజిబాబు, అంతరంగాలు కథలో సుధాకర్‌కు కనువిప్పు కలిగించిన పల్లీలు అమ్మేవాడు, ఆదెమ్మ కథలో మాతృత్వం కోసం ఎలాంటి పైనికైనా సిద్ధపడే స్త్రీమూర్తి వంటి వారు సమాజంలో విభిన్నమైన వ్యక్తిత్వాలకు ప్రతీకలు. 


           ఈ కథలన్నీ అజీజ్‌గారికి సమాజం పట్ల ఉన్న అవగాహనకు, పరిశీలనకు, నిబద్ధతకు అద్దం పడుతున్నాయి. ఇవి కడదాకా చదివిస్తాయి. ఆలోచనల్ను రేకెత్తిస్తాయి. ఈ కథలు చదివి మనం ఏ కొంచమైనా ప్రభావితులమైతే రచయిత విజయం సాధించినట్లే. ఈ పుస్తకానికి ప్రయోజనం ఒనగూరినట్లే. అందులో నాకేమాత్రం సందేహం లేదు. మీకు కూడా ఉండదని పుస్తకం చదివిన తర్వాత నిస్సంకోచంగా ఒప్పుకుంటారు.

-కోడీహళ్లి మురళీమోహన్
                            (మనిషి కథాసంపుటికి వ్రాసిన 'ముందు'మాట)

సత్యం!

టి.శ్రీవల్లీ రాధిక గారి కథానిక సత్యం కథాజగత్‌లో చదవండి.

25, నవంబర్ 2010, గురువారం

పత్తేదారు కథ!

కథాజగత్‌లో ఈసారి డిటెక్టివ్ కథ ప్రకటించబడింది. కథ పేరు మూడో మనిషి! రచయిత్రి వింధ్యవాసిని. కథ చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.

23, నవంబర్ 2010, మంగళవారం

శ్రీదేవీ మురళీధర్ అమ్మమ్మగారిల్లు !

శ్రీదేవీ మురళీధర్ గారి కథ అమ్మమ్మగారిల్లు కథాజగత్‌లో చదవండి.

20, నవంబర్ 2010, శనివారం

పోరంకి దక్షిణామూర్తి కథ!

సుప్రసిద్ధ కథకుడు డా.పోరంకి దక్షిణామూర్తి గారి కథ వెన్నెల పండిన వేళ ఇప్పుడు కథాజగత్‌లో మీకోసం! 

???


పరీక్షల్లో గాంధీని గురించి వ్యాసం వ్రాయమంటే, చదువుకొన్నది ఒక్క ఆవు వ్యాసమే కాబట్టి ,'గాంధీ గొప్పవాడు. ఆయనకి ఒక ఆవు ఉండేది. ఆవు సాధు జంతువు.ఆవుకు నాలుగు కాళ్ళుండును...' అని అక్కడి నుంచి ఆవు గురించి వ్రాసిపడేసాడట వెనకటికి ఒకడు. అలా ఉంది నేడు తెలంగాణా వీరాభిమానుల పరిస్థితి. తెలంగాణాతో సంబంధం ఉన్నా, లేకపోయినా ఏవిషయాన్నైనా వారు నేర్పుగా తెలంగాణాకు జరుగుతున్న అన్యాయంగా చిత్రించగలరు. కాదంటారా? ఈ క్రింది వార్త చదవండి. మీకే తెలుస్తుంది.
    

నిర్వాహకులకు లేని ఉద్దేశాలను అంటగట్టి ప్రాంతీయతతో సంబంధంలేని కార్యక్రమాన్ని అడ్డుకోవడం చూస్తుంటే మీకేమనిపిస్తుంది?

17, నవంబర్ 2010, బుధవారం

బక్రీద్ శుభాకాంక్షలు!!!


మిత్రులందరికీ ఈద్ ఉల్ జుహా పర్వదిన శుభాకాంక్షలు!

16, నవంబర్ 2010, మంగళవారం

ప్రాడ్వివాక గో సంవాదము!

దిష్టిబొమ్మలు జడ్జిగారి కాఫీకి ఎలా ఎసరు పెట్టాయో తెలుసుకోవాలంటే కథాజగత్‌లో ప్రకటించిన వేంపల్లి రెడ్డి నాగరాజుగారి కథ పరి'పాల'న చదివితీరాల్సిందే! 

15, నవంబర్ 2010, సోమవారం

ఈ కథ చదివారా?

సత్యం మందపాటి గారి కథ సౌమ్య కథాజగత్‌లో ప్రకటించబడింది. చదవండి

14, నవంబర్ 2010, ఆదివారం

దీని భావమిదియె!

దీని భావమేమి అంటూ నేను ఇచ్చిన ఈ ప్రహేళికకు స్పందించిన ప్రతిఒక్కరికి ధన్యవాదాలు!


సీ. లీడరు తాతకు లీలగ తనయుడై

           నట్టియతని బావ నలరు బోడి

    సంగడించిన వాని సంప్రీతురాలి పె

           నిమిటికి తమ్ముడు నిజముగాను

    ఆతని తండ్రికి అత్త కొడుకు టెక్కు

           తెఱగునకధిపతి తఱచి చూడ

    మూడవయవతారముచె ప్రభావితుడైన

           శూరుని కనుగొన శోకలేమి!

తే.గీ. అతడు వితతమొనర్చిన ఆశయముల

       ననుసరించిన దివ్యగుణ యశకీర్తి

       చేసిన సముద్యమమునకు చేరుగడ

       సర్వసాక్షి యొసగు గాక సంపదలను!!

శ్రీయుతులు భైరవభట్ల కామేశ్వర రావు, ఊకదంపుడు, అజ్ఞాత గార్లు కొంతవరకు దీనిని సాధించారు. వారికి నా అభినందనలు. పై ప్రహేళికకు నేను అనుకున్న సమాధానం ఇది.
లీడరు - రానా (లీడర్ సినిమా హీరో!)


అతని తాత - రామానాయుడు
అతని తనయుడు - వెంకటేష్
అతని బావను - నాగార్జునను
అలరు బోడిన్ - అమలను (అలరుబోడి = భార్య)
సంగడించిన వాడు - రామ్‌గోపాల్ వర్మ (సంగడించుట అంటే జతపఱచుట అని అర్థం. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన శివ షూటింగ్ సమయంలోనే అమల నాగార్జునల మధ్య ప్రేమ అంకురించి పెళ్ళికి దారితీసింది. ఆ విధంగా వారిని జతకలిపిన వాడు వర్మ.)
వాని సంప్రీతురాలు - శ్రీదేవి (రామ్‌గోపాల్ వర్మ శ్రీదేవిని తన ప్రేయసిగా ఈ మధ్య సాక్షి ఫన్‌డేలోని ఒక శీర్షికలో తెగ చెప్పుకుంటున్నాడు. సంప్రీతి అంటే ప్రేమ.)
ఆమె పెనిమిటి - బోనీ కపూర్
అతనికి తమ్ముడు - అనిల్ (కపూర్).
ఇంతవరకు లౌకిక భాగము. తరువాతిది పౌరాణికము.
అనిలుని తండ్రి - శ్రీకృష్ణుడు (అష్టమహిషుల్లో ఒకరైన మిత్రవిందకు శ్రీకృష్ణుని కలిగిన సంతానంలో  అనిలుడు ఒకడు)
అతని అత్తకొడుకు - అర్జునుడు.
అర్జునుని టెక్కు తెఱగు - ఆంజనేయుడు (టెక్కు = జెండా,తెఱగు = గుర్తు)
అతనికి అధిపతి - రాముడు (అధిపతి = ప్రభువు)
రాముని మూడవ అవతారము - బుద్ధావతారం(రామ, కృష్ణ, బుద్ధ) 

ఇక చారిత్రకము.
బుద్ధునిచే ప్రభావితుడైన శూరుడు - అశోకుడు 
అతడు వితతమొనర్చిన ఆశయములు - శాంతి అహింసలు (వితతము = ప్రచారము)
వాటిని అనుసరించిన వ్యక్తి - గాంధి మహాత్ముడు.
అతను చేసిన సముధ్యమము - ఉప్పు సత్యాగ్రహము
దానికి చేరుగడ - దండి (చేరుగడ = నెలవు, స్థానము)
భగవంతుడు దండిగా (మెండుగా,సమృద్ధిగా) సంపదలను ఇచ్చుగాక అని ఈ పద్యం తాత్పర్యం. 

11, నవంబర్ 2010, గురువారం

దీనిభావమేమి?

శ్రీ కంది శంకరయ్యగారు తమ శంకరాభరణం బ్లాగులో ఇస్తున్న ప్రహేళికలు చూసి పొందిన ప్రేరణతో ఈ ప్రహేళికను తయారు చేశాను. ఈ పద్యంలో నేను చెప్పదలచినది ఏమిటోవివరించండి.

సీ. లీడరు తాతకు లీలగ తనయుడై
           నట్టియతని బావ నలరు బోడి
    సంగడించిన వాని సంప్రీతురాలి పె
           నిమిటికి తమ్ముడు నిజముగాను
    ఆతని తండ్రికి అత్త కొడుకు టెక్కు
           తెఱగునకధిపతి తఱచి చూడ
    మూడవయవతారముచె ప్రభావితుడైన
           శూరుని కనుగొన శోకలేమి!

తే.గీ. అతడు వితతమొనర్చిన ఆశయముల
       ననుసరించిన దివ్యగుణ యశకీర్తి
       చేసిన సముద్యమమునకు చేరుగడ
       సర్వసాక్షి యొసగు గాక సంపదలను!!

ఈ ప్రహేళికలోని ప్రత్యేకత ఏమిటంటే దీనిలో మూడు అంశాలున్నాయి. ఎరుపు రంగులో ఉన్నది లౌకిక అంశము అంటే ప్రస్తుత రాజకీయాలు, సినిమాలు, గాలి కబుర్లు మొదలైన వాటి ఆధారంగా చేసుకుని తయారు చేసినది అన్నమాట. ఇక ఆకుపచ్చ రంగులో ఉన్న భాగము పౌరాణిక సంబంధమైనది. అలాగే నీలం రంగులో ఉన్నది చారిత్రక అంశాలతో కూడినది. ఒక దానిలోనుండి మరో అంశానికి పోయినపుడు ఆ భాగంలోని పాత్రతో అన్వయించుకోవాలి. ఉదాహరణకు లౌకిక భాగములో సినీ నటుడు కృష్ణ చివరగా వచ్చాడనుకోండి అది పౌరాణిక భాగంలో వచ్చేసరికి శ్రీకృష్ణునిగా అన్వయించుకోవాలి. అర్థమయింది కదా ఇక ప్రయత్నించండి.

8, నవంబర్ 2010, సోమవారం

నన్ను కనుక్కోండి!


తెలుగు కథానికా శతజయంతి ముగింపు ఉత్సవాల సందర్భంగా తీసిన గ్రూప్ ఫోటో ఇది. దీనిలో నేను ఎక్కడ ఉన్నానో కనుక్కోండి. అలాగే ఈ ఫొటోలో ఉన్నవారిలో ఎంతమందిని గుర్తించగలరో ప్రయత్నించి చూడండి. ఈ ఫోటో  శ్రీ సి.బి.రావు గారు తీశారు. వారికి ధన్యవాదాలు.

7, నవంబర్ 2010, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 32 సమాధానాలు!


రుక్కుతల్లి!

ప్రముఖ చిత్రకారుడు బాలి కలం నుండి వెలువడిన కథ రుక్కుతల్లి కథాజగత్‌లో ప్రకటింపబడింది. ఈ కథను చదివి దీనిలో సెంటిమెంట్ ఏ మేరకు పండిదో తెలియజేయండి.

6, నవంబర్ 2010, శనివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 32



ఆధారాలు: 
అడ్డం: 
1. సింపుల్‌గా దీర్ఘ కాలిక కార్యాచరణ ప్రణాళిక.
3. పిచ్చాస్పత్రికి పేరుపొందిన ప్రాంతం లేదా ఉల్లి తిరగబడింది.
5. ఈ పండుగని నిన్ననే జరుపుకున్నాం! 
7. సూర్యుడు తడబడ్డాడు పాపం!
9. హితాన్ని వదిలిన మేలుజాతి ముత్యము కుడి నుండి ఎడమకు .
10. కుమారస్వామి. జిత్తులమారి కాదు :) 
11. శాసనాలలో కనిపించిన తొలి తెలుగు పదం వివాదాస్పదమైంది
14. రుక్కాయిగా పేరు పొందిన జరూక్‌శాస్త్రి.
15. తెనాలి రామకృష్ణ సినిమాలో భానుమతి పాత్ర పేరు.
16. సూర్యుడే! కమలమిత్ర కాదు సుమా!
నిలువు:
1. కరణా చూడవయా వరముజూపవయా... అనే పాట ఈ సినిమాలోనిది.
2. రంగురంగుల గుర్రం తడబడింది.
4. తాపీ చాణక్య దర్శకత్వంలో చిలకలపూడి సీతారామాంజనేయులు నటించిన 1958నాటి ఈ సినిమాలో బాలయ్య హీరో! 
5. తెలుగులో స్టార్‌వార్!
6. ఆరుద్రను ఇలా పిలిస్తే పలికేవాడా?
7. కోశాగారము.
8. అవ్వాయిచువ్వాయి, కాకరపూవ్వత్తు, చిచ్చుబుడ్డి, భూచక్రం, విష్ణుచక్రం లేదా సిసింద్రి!
9. పండిత జగన్నాథ రాయలు, డాక్టర్ మహీధర నళినీమోహన్ మొదలైనవారి జన్మస్థానానికి పూర్వరూపం!
12. ప్రమధ గణాల లీడర్!
13. నిలువు 8కి ఆపోజిట్టు అనుకోవచ్చు. శబ్దాన్ని ఇచ్చేది! 

యానాం రాజుగారి కథ!

 'ఒక దేశంలో రెండు బిల్డింగులు కూలిపోతే... లోకానికి వచ్చే తిప్పలు అన్నీ ఇన్నీనా?' అని వాపోతున్నారు దాట్ల దేవదానం రాజుగారు చైతన్య స్రవంతి ధోరణిలో సాగే తమ కథ లోపలిసడిలో. ఈ కథను వర్తమాన కథాకదంబం కథాజగత్‌లో చదవండి.

5, నవంబర్ 2010, శుక్రవారం

దీపావళి శుభాకాంక్షలు!!!

మిత్రులు,శ్రేయోభిలాషులు అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈ దీపావళి మీ జీవితంలో కొత్తవెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము.

2, నవంబర్ 2010, మంగళవారం

కాంత-కనకం-కరక్కాయ

వాసుదేవ్‌గారి కథ కాంత-కనకం-కరక్కాయ కథాజగత్‌లో ప్రకటించాము. దయచేసి చదవండి.

1, నవంబర్ 2010, సోమవారం

దీక్షితులుగారి కథ!

సభాసురభి డి.శ్రీనివాసదీక్షితులు గారి కథ నన్ను మన్నించరూ? కథాజగత్‌లో ప్రకటించబడింది. చారిత్రకాంశము కల ఈ కథను చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.