...

...

28, ఏప్రిల్ 2012, శనివారం

వానప్రస్థం కథపై జ్యోతిర్మయిగారి విశ్లేషణ!


       ఆలోచనా ధోరణిలోని వ్యత్యాసం గురించీ, ఆదర్శవంతమైన జీవన విధాన౦ గురించీ చెప్పే ఈ కథ, చక్కని కథనంతో ఆద్యంత౦ ఆసక్తికరంగా సాగుతుంది. ఈ కథలో అనురాగం, ఆత్మీయత మనకు అడుగడుగునా కనిపిస్తాయి. కథకు తగిన శీర్షిక 'వాన ప్రస్థం'.

      స్వదేశం వెళ్ళిన రాంబాబు, పొలం అమ్మే నిమిత్తం తమ ఊరికి వెళుతూ తన స్నేహితుని తల్లిదండ్రులైన మూర్తి, వర్ధనమ్మగార్లను కలుస్తాడు. ఆ దంపతులు వారి అభిమానంతో అతన్ని ఓ రోజు అక్కడే ఉండేలా ఒప్పిస్తారు. ఆ వయసులో వారి వ్యాపకాలు, తద్వారా చేసే సమాజ సేవ చూసి ముచ్చట పడతాడు రాంబాబు. సుఖమయ జీవనం కోసం ఆహారం విషయంలోనూ వారు తీసుకు౦టున్న శ్రద్ధ, వ్యాయామం, వారు ఆచరించే జీవన విధానం చూసి "నిజం చెప్పద్దూ - మీరిద్దరూ డెబ్బై దాటిన వాళ్ళల్లా కనిపించరు. ఏదో నిన్ననే అరవయ్యో పడిలో వచ్చిన వాళ్ళల్లా ఉన్నారు."  అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తాడు. 

       ఆ సమయంలోనే రాంబాబు, తన అక్క అనారోగ్యం విషయంగా, ఆవిడకు శారీరక రుగ్మత కంటే, మానసిక రుగ్మతే ఎక్కువగా ఉన్నట్లు చెప్తాడు. వారి సంభాషణల్లో ఆ దంపతుల మధ్య అవగాహన, కలసి పనిచేసుకోవడంలోని ఆనందం గురించి తెలుసుకుంటాడు. రాంబాబు అక్క, తన పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ, ఆ దంపతులు తమ పిల్లల గురించి ఆలోచించే విధానంలోనూ ఉన్న తేడాలను రచయిత స్పష్టంగా వ్యక్తీకరించారు.

       రచయిత, మూర్తి గారి ద్వారా చెప్పించిన ఈ మాటలు, ఈ కథకు ప్రాణమని చెప్పొచ్చు. 

'ఎక్స్పెక్టేషన్' అనేది అది కేన్సర్ లాంటిది. నిన్నూ నీ చుట్టూ ఉన్న వాళ్ళనీ కనిపించకుండా దహించేస్తుంది..."  అని చేప్తూ తమ ఆరోగ్య రహస్యం కూడా చెప్తారు. "మేం సంతోషంగా ఉంటాం. ఒకర్నొకరు తిట్టుకోం. తప్పులెన్నం. వీలయినంతా ఆనందంగా ఉండడానికి ప్రయత్నిస్తాం. అలాగే మా పిల్లల్నుండి మేం ఏమీ ఆశించం. ఇదే మా ఆనందానికి కారణం. మేం ఎవరినుండీ ఏదీ ఎక్స్పెక్ట్ చేయం." 


     కథ ముగింపులో రాంబాబు తన అక్క గురించి అనుకున్న మాట ఈ కథకు పరిపూర్ణతనిచ్చింది. ఈ కథలో మంచి సందేశం ఉంది. చిరకాలం గుర్తుండి పోయే కథ 'వాన ప్రస్థం'. 

     కథాజగత్ లో ప్రచురితమైన 'వానప్రస్థం' కథను మీరు ఇక్కడ చదవొచ్చు.  


(శర్కరి బ్లాగు సౌజన్యంతో)

16, ఏప్రిల్ 2012, సోమవారం

కస్తూరి పరిమళం

కృష్ణాజిల్లా చల్లపల్లి నుండి వెలువడుతున్న సన్‌ఫ్లవర్ వార పత్రిక తాజా సంచిక(18-4-2012)లో ప్రముఖ రచయిత విమర్శకులు కస్తూరి మురళీకృష్ణ సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పై బుక్ రివ్యూ వ్రాశారు. 


ఆ రివ్యూ తాలూకు పూర్తి పాఠం తురుపుముక్క పాఠకుల కోసం ఇక్కడ. 


తమ పూర్వీకులను, పెద్దలను, మహానుభావులను గౌరవించలేక పోవటం ఒక దారిద్రమయితే, వారిని గుర్తుంచుకోలేక పోవటము అంతకన్న దుర్భరమైన స్థితి. ప్రస్తుతం తెలుగు సాహిత్య రంగాన్ని అలాంటి దుస్థితి వేగవంతంగా అలముకుంటూ వస్తోంది. అనేక కారణాల వల్ల సాహిత్య ప్రపంచం ముక్కలు చెక్కలయి పోతోంది. విశాల విశ్వాన్ని ప్రతిబింబించవలసిన సాహితీవేత్తలు చిన్న చిన్న ప్రాంతాలకి, చిన్న చిన్న వీధులకీ పరిమితమైపోతున్నారు. పదిమందిని చేర్చుకోగలిగిన వాడు ఈనాడు తెలుగు సాహిత్య పథ నిర్దేశకుడై 'తనదే సాహిత్యం, తానే ఔన్నత్యం' అన్నట్టు చిందులు వేస్తూ సాహిత్య రంగాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలో 'విద్వాన్ విశ్వం' అన్న పేరు కొందరు పాతకాలపు సాహితీ ప్రియులకు తప్ప కొత్త తరం సాహిత్యాభిమానులకే కాదు రచయితలకూ తెలియకపోవటంలో ఆశ్చర్యం లేదు.  అందుకే ఇటీవలే ప్రచురితమై విద్వాన్ విశ్వం సాహిత్య సాగరంలోని తరగల నురుగుల తాలూకు తళుకుల రుచి చూపించే 'సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం' అన్న పుస్తకం అత్యంత ప్రాధాన్యాన్ని వహిస్తుంది.

ఇదొక విలక్షణమైన పుస్తకం. సూక్ష్మంలో రచయితగా, మేధావిగా వ్యక్తిగా  విద్వాన్ విశ్వం విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుందీ పుస్తకం. ఈ పుస్తకంలోని నాలుగు అధ్యాయాలలో విశ్వం గురించి ఇతరులు రాసిన రాతలు, విశ్వం నడిపిన శీర్షికలు, సమీక్షలు, సందేశాలు, ఇంటర్వ్యూలను పొందుపరచారు. ఇవి వరుసగానయినా చదువుకోవచ్చు లేక పోతే మధ్యనుంచయినా చదువుకోవచ్చు. ఇతరులు విశ్వం గురించి రాసిన రాతలు చదివి విశ్వం రచనలు చదివితే, ఇతరులు విశ్వం రచనల ఔన్నత్యాన్ని ఎంత చక్కగా విశ్లేషించారో, ఆనాటి విమర్శకుల స్థాయి ఎంత ఉన్నతమో బోధపడుతుంది.  అలాకాక, ముందుగా విశ్వం రచనలు చదివి, ఇతరుల విశ్లేషణలు చదివితే, కొండంతటి విశ్వం రచనలను అద్దమంత పరిధిలో ఇమిడ్చేందుకు ఆనాటి విమర్శకులు, పండితులు ఎంత శ్రమ పడ్డారో బోధ పడుతుంది. ఏది ఏమైనా ఈ పుస్తకం చదువుతుంటే, మన తెలుగు సాహిత్య ప్రపంచం ఒకప్పుడు ఎంతటి మేరు శిఖర సమాన వ్యక్తిత్వాలతో, విమర్శన విద్యా విచక్షణులతో, సారస్వత విశారదులతో నిండి వుండేదో తెలుస్తుంది.  అలాంటి అత్యద్భుతమైన సాహిత్యం మనదనీ, దానికి మనం వారసులమనీ గర్వించాలనిపిస్తుంది.

ముఖ్యంగా, ఈ పుస్తకంలో అత్యంత ఆనందం కలిగించే అంశం భాష. 'శ్రీ విద్వాన్ విశ్వం గారు' అంటూ దివాకర్ల వేంకటావధాని వ్యాసంతో ఆరంభిస్తే, చివరి రచన 'గోర్కీ జీవితం' వరకూ తెలుగు భాషలోని సౌందర్యం, గొప్పదనం, లేత కొబ్బరి నీళ్లలోని తీయదనం లాంటి మాధుర్యం అడుగడుగునా ద్యోతకమవుతూంటుంది. పదం పదం చిలుకుతూంటుంది. ఇప్పటి సాహిత్యంతో తుప్పు పట్టిన చెవులు, కళ్లు, మేధల కొక్కసారి అమృతం లభించినంత ఆనందం కలుగుతుంది.

సాహిత్యం పట్ల ఏమాత్రం ఆసక్తి ఉన్న వారయినా తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం ఇది. ప్రస్తుత పరిస్థితులలో ఈ పుస్తకం ఎంతో ప్రాధాన్యం వహిస్తుంది. ఎందుకంటే ఎన్నో సంస్థలు సాహిత్యం పేరిట కుప్పిగంతులు వేసి సాహిత్యాన్ని అభాసు పాలు చేస్తూంటే, ఇద్దరు వ్యక్తులు మరపున పడుతున్న ఒక మహా సాహితీవేత్త సాహిత్యాన్ని దుమ్ముదులిపి, సాహిత్యం ఇలా ఉంటుందంటూ సంస్థలు చేయలేని పనిని వ్యక్తుల వల్ల సాధ్యమవుతుందని నిరూపించారు. ఈ పుస్తకం ఇలాంటి అనేక విస్మృత మహా సాహితీవేత్తల సాహిత్యం వెలుగు చూడటానికి దోహద పడితే, బహుశా విశ్వంగారి సాహిత్య తపన సార్థకమయినట్టేననిపిస్తుంది. ఆయన రచనల్లో కనిపించే సమన్వయ వాదం, అవగాహన, లోతైన ఆలోచనలు, అర్హులకు తగిన గౌరవం లభించాలన్న ఆతృతలు వెరసి, ఒక గతించిన కాలపు అద్భుతమైన జ్ఞాపకాల సాక్ష్యంగా నిలుస్తుందీ "సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం" పుస్తకం. ఆలస్యంగానైనా విశ్వంగారికి అందిన అతి చక్కని నివాళి ఇది.


14, ఏప్రిల్ 2012, శనివారం

విభిన్న ధోరణులు     ఆరంభించకూడదు కాని, ఒకసారి ఏదో మొదలుపెట్టాక దాని అంతేమిటో చూడవలసిందే నన్నది ఒక పద్ధతి.

     ఏదో చూచాం, అయితే ఒకటీ, కాకపోతే రెండూ అనుకోవడం మరొక పద్ధతి.

     అసలు అవుతుందో కాదో ఎందుకు వచ్చిన శ్రమా - అని అసలు చేతులు ముడుచుకొని కూర్చోవడం మూడో పద్ధతి. 

     ఈ సంగతి పూర్వంనుంచీ కాస్త మాటల మార్పుతో పెద్దలు అంటున్న సంగతే.

     మూటికి ముమ్మారు ప్రయత్నించిచూచే వారేకాదు, ఎన్నిసార్లైనా సరేనని కంకణం విడవకుండా కూర్చునేవారు కొందరు. 

     అసలు అశ్వత్త ప్రదక్షిణం ఆరంభించీ ఆరంభించకనే కడుపు తడివి చూచుకునే వారు కొందరు. 

    ఎంత కాలంమారినా, ఎంతగా పరిస్థితులు మారినా ఇదేమో మారడం లేదు.


*    *    * 


     కాంటర్బరీ నుంచి ఈ వారం వచ్చిన ఒక వార్త ప్రకారం డొరొథీ బటర్ అనే ఆవిడ కారు నడపడంలో శిక్షణ పొందుతూ వచ్చింది. 

     ఎలాగో ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలై ఆ లైసెన్సు కాస్తా సంపాదించి మగని మెప్పు పొందాలనుకున్నది.

     కడకు, "ఒకట, రెంట, మూట ఒనరంగ నాల్గింట" కూడా చూచింది. ప్రతిసారీ అపజయమే తనపాలబడ సాగింది. 

     కడపటిసారి అయ్యా నేనిక నా మగనికి మొగం చూపించలేను - నన్ను ఉత్తీర్ణురాలిని చెయ్యమని రవాణాశాఖ ఉద్యోగికి పది పౌనులు లంచమివ్వబోయింది.

    అతగాడు కాస్త శఠుడేమో పైకి తెలియ జేయగా, న్యాయాధికారి మరో 25 వడ్డించాడు.

    ఎందుకమ్మా ఇలా చేశావంటే తుదకు ఆ మాటే చెప్పింది. మరీ అపజయం పొంది మగనికి మొహం చూపించే సాహసం లేక పోయిందట.

    మరి ఈవారంలోనే వచ్చిన మరొక వార్త చూడండి:

    లండన్‌లో ఆర్థర్ రీస్ అనే అతనూ ఇలాగే కారు డ్రైవింగ్ లైసెన్సుకోసం ఒకటా రెంటా మూటా నాల్గింటా కాదు, పదిహేడంటే పదిహేడు మారులు పరీక్షకు వెళ్లాడు.

    ప్రతీసారీ పాపం నెగ్గలేక పోతూ వచ్చాడు.

    ఇక తనకూ విసుగెత్తిందో ఏమో పాపం! ఒక పని చేశాడు...

    ఇక ఇదేం లాభం లేదనుకొని నాటకాల్లో విదూషక పాత్రలు ధరించడానికి తాను నిర్ణయించుకొన్నట్టు ప్రకటించాడు. 

    పైగా అతను మోటార్లు నడపడంగూర్చీ, ఈ డ్రైవింగ్ పరీక్షలగూర్చీ వ్యంగ్య చిత్రాలు విపరీతంగా వేసి అందులో సెబాసనిపించుకో దలచు కున్నట్టున్నాడు.

   అదీ ఇదీ చాలు పొట్టపోసుకునేందు కనుకున్నాడేమో మరి!

*    *    *  


       ఒకరేమో ఓటమికి సహించలేక ఎలాగో గెలుపు సంపాదించాలని లంచమివ్వడానికైనా దిగి తుదకు కులం పోయినా సుఖం దక్కలేదనిపించు కున్నారు. 

    మరొకరేమో అన్నిమారులు ఓపికగా వెళ్లి వెళ్లి ఎటూకాకపోయేసరికి, అందులోనే తన అనుభూతులను కాస్త నవ్వుటాలగా తీసుకొని, స్వయంగానే ఉన్న హాస్యదృష్టిని మరింత పెంచుకొని ఏవో హాస్య చిత్రాలూ అవీ గీసుకుంటూ, ఏవో హాస్యగాని వేషాలు వేసుకుంటూ ఆ అపజయాన్ని విస్మరించి విజయం సాధించాలని చూస్తున్నారు. 

    ఎవరి దారి వారిది.

*    *    *

     ఒక్కొక్క మనస్తత్వం ఒక్కొక్క రకం.

     ఒకే పరిస్థితిలో ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తారు. 

     ఒకరు ప్రతి చిన్న విషయానికీ కలగిపోయి, కంగారు పడిపోయి, తల పగులగొట్టుకుని తహతహపడిపోతారు. 

    మరొకరు మిన్ను విరిగి మీద పడినా చెక్కు చెదరకుండా ఓరిమి క్రక్కదలి పోకుండా, దిమ్మతిరిగి పోకుండా చిరునవ్వు నవ్వివేస్తారు. 

    తన్ను తనే చూచి నవ్వుకోగల మనః పాటవం కలవారు కొందరుకాగా, కాస్త వేలిమీద గోరు మొలిస్తే కళవళపడిపోయేవారు కొందరు. 

    ఈ విభిన్న మనస్తత్వాల మూలంగానే లోకం ఇంత విభిన్నంగా కనబడు తున్నది. 

    ఏవో కొన్ని సమానధర్మాలున్నా ఈ విభిన్నతలెక్కువ.

     పట్టువిడుపు లెరిగినవారేమో గెలుపూ ఓటమీ అన్నదంత పట్టించుకోకుండా, ఎటైనా తమ స్థైర్యం కోల్పోకుండా ముందుకు అడుగు వేస్తారు. 

   అది తెలియనివారేమో కాస్త ఎదురుదెబ్బ తగలగానే బెంబేలెత్తిపోతారు. 

   ఇందులో ఏది మంచీ, ఏది చెడ్డా అన్న ప్రశ్న లేదు. 

   అదో పద్ధతి, ఇదో పద్ధతి. అంతే.


- విశ్వం

(విద్వాన్ విశ్వంగారు నిర్వహించిన మాణిక్యవీణ శీర్షిక క్రింద ఆంధ్రప్రభ దినపత్రిక 5 జూన్ 1966నాటి సంచికలో ప్రచురింపబడిన వ్యాసం ఇది. ఇలాంటి మరికొన్ని వ్యాసాలు, తెలుపు నలుపు శీర్షికతో వచ్చిన కొన్ని వ్యాసాలు సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంలో చదవవచ్చు)   
కథాజగత్‌లో వెలువడనున్న కొన్ని కథల వివరాలు!


ఈ క్రింది కథలు త్వరలో కథాజగత్‌లో రాబోతున్నాయి!


1. శీలా వీర్రాజు - నీడ


2. శీలా సుభద్రాదేవి - రంగుల వల


3. గోనుగుంట మురళీకృష్ణ - అంతరాలు


4. కె.వాసవదత్త రమణ - చివరికి మిగిలేది 

11, ఏప్రిల్ 2012, బుధవారం

నవ్య వీక్లీలో పుస్తక సమీక్ష!

నవ్య వీక్లీ ఏప్రిల్18,2012 సంచికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకంపై రామరాజ భూషణుడు వ్రాసిన సమీక్ష ప్రచురించారు. 


ఈ వ్యాసం పూర్తి పాఠం ఇదిగో.

ప్రవహించే నది విద్వాన్ విశ్వం


సమీక్ష : రామరాజ భూషణుడు


          మహాత్మాగాంధీని హాఫ్ నేకెడ్ ఫకీర్ అని గేలి చేసిన ప్రబుద్ధులే అనతికాలంలో (ఇటీవలే) 'ఆ మహాత్మునికి జీవించి ఉండగా నోబెల్ శాంతి బహుమతిని ఇచ్చి సత్కరించుకోలేక పోయాం' అని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు శతాబ్దాల వారి పాలనా తామసత్వమే మనకీ అబ్బింది. సర్వత్రా ఉపన్యాసభారాలే తప్ప ఓ జాతి భాషోన్నతికి, దాని పరిపుష్ఠికి తద్వారా ఆ ప్రాంతాభ్యున్నతికీ అహరహం బహుముఖీన సేవలందించిన మహనీయులను ఆలస్యంగా గౌరవించుకోవడం మనకలవాటైన విద్యే! మాతృభాషకు గొప్ప సేవలు అందించిన అలాంటి మహనీయులలో ఒకరు విద్వాన్ విశ్వం. 

                  'కడుపు కాలిన వాడు ప్రజా కవి. కడుపు నిండిన వాడు సినీ కవి' అన్నాడో ప్రబుద్ధుడు. కానీ కాలిన కడుపుల, ఎండిన డొక్కల ఎడారి బతుకుల దీనస్థితిని సాహితీ రూపాలలో గ్రంథస్థం చేసి, రాయలసీమ కన్నీటి పాటను కోటి గొంతుల కిన్నెర పాటగా మలిచి, నీటి చుక్కకోసం పెన్నేటి పాటగా సుళ్ళు తిరిగిన మానవతావాది విశ్వం. సాహిత్యం, పత్రికా రచన, స్వాతంత్ర్యోద్యమంలో చేసిన కృషీ ముప్పేటగా ఆయన జీవితాన్ని పెనవేసుకు పోయాయి. సాంఘిక వ్యవస్థ పూర్తిగా మారాలని ఆయన తపన చెందారు. అందుకే ఆయన నిజంగా సాహితీ విరూపాక్షుడయ్యారు. 

                 విశ్వంజీ విరాడ్రూపానికి దోసిలి పట్టి అర్ఘ్యమర్పించిన చందంగా డాక్టర్ నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్‌ల సంపాదకత్వంలో వెలువరించిన సంకలనమిది. విశ్వంజీ హృదయావిష్కరణ, ఆయన జీవితం, సాహిత్యం, వారిపై ఎంతోమంది ప్రముఖుల అభిప్రాయ మాలికలు, వారితో పరిచయాలను వివరిస్తూ ఆ సాహితీ పూర్ణచంద్రుని శతజయంతి (2015) సందర్భాన్ని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని వెలువరించారు. 

            బాల సాహిత్యంతో సహా అనేక శీర్షికలతో ఆబాలగోపాలాన్నీ అలరించిన అక్షర యోధుడు. 16 వయసులోనే విరికన్నె వంటి కావ్య రచనతో సత్కారమాలలందుకున్న సృజనజీవి. 'భారతి'లో సాహితీ వ్యాసాలు, సమీక్షలు, పద్య గేయ రచనలు చేశారు. ఆకాశవాణి నాటకాలు రాశారు. 

          బళ్ళ మీద, కాలి నడకనా, ఊరూరా తిరిగిన స్వాతంత్ర్య సమరయోధుడు. వార మాస పత్రికలంటే ఉబుసుపోని కబుర్ల కుప్పలు కావనీ మానసిక సామాజిక చైతన్యానికి దోహదం చేసేవనీ నిరూపించారు. ఆయనో ప్రవహించే నది. పురోగమించే సమాజం. జనం గుండె చప్పుడు. జీవితాన్ని వివిధ కోణాల నుండి అర్థం చేసుకున్న విశ్వం తన సాహిత్యంలో సామాన్య ప్రజల జీవితాన్ని అతి సహజంగా ప్రతిబింబింపజేశారు. అజ్ఞాన సంహారమే దైవత్వ సిద్ధి. అజ్ఞాన సంహారమే ఆత్మ సందర్శన మార్గం. భారతీయ వాఙ్మయ దృక్పథమూ అదే!తమసోమా జ్యోతిర్గమయా అంటూ అపౌరుషేయాలు చూపిన మార్గమే విశ్వం మార్గం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న విశ్వం ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల లాభం లేదనీ, మూఢనమ్మకాల్లో, అజ్ఞానాంధకారంలో మగ్గుతున్న భారతీయ జనసామాన్యానికి 'సాహిత్య ఉగ్గు' పట్టించాలని విశ్వసించి రాజకీయం నుండి వైదొలగి సాహిత్యమార్గంలో అక్షరతుణీరమయ్యాడు. జనం గుండెల్లో నిలిచి, కవన సేవలో పునీతమైనవాడు.

                        సంస్కృతాంధ్రాలు, ఆంగ్ల భాష అధ్యయనం, స్వయంకృషితో అర్థశాస్త్రం, మనస్తత్వ శాస్త్రాల్లో సమగ్ర జ్ఞానం సంపాదించిన వాడు. పాఠశాల పండితుడు. పాత్రికేయ ప్రముఖుడు. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రజ్యోతి దినపత్రికలలో సేవలందించారు. అటు కాంగ్రెస్ వాదులూ, ఇటు విప్లవ వాధులూ కూడా ఆయనకు స్నేహితులే! ఆయన సుధీర్ఘ సాహితీ ప్రయాణంలో సంస్కృత, పాశ్చాత్య భాషల నుండి అపరిమిత సంఖ్యలో గ్రంథాలను ఆంధ్రీకరించినవాడు. రష్యన్ సారస్వతాన్ని మనకందించారు. బెర్నార్డ్ షా వంటివారి నాటకాలను అనువదించారు. కిరాతార్జునీయం, మేఘ సందేశం, దశకుమార చరిత్ర, వచనం చేయడంతో పాటు బాణుడి 'కాదంబరి'ని తెలుగులో అందించి విశిష్టస్థానం పొందినవాడు. నీతిచంద్రికను సరళమైన తెలుగులో (చందమామ) అందించారు. 1938లో నవ్యసాహిత్య మాలను స్థాపించి జన సాహితీ వికాసానికి కృషి చేసినవారు. ముఖ్యంగా ఆంధ్రప్రభ ద్వారా గొప్ప సాహితీ సేవలు అందించారు. 

                       స్త్రీ మానసంరక్షణలో ప్రాణాలు కోల్పోయిన గుత్తి రైల్వే గేటుకీపర్ హంపన్న కథ (1893లో రాయలసీమలో జరిగిన ఘటన)ను 'ఒకనాడు' కావ్యంగా తీర్చిదిద్ది రాయలసీమ మానుషత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. ఈ పుస్తకం చదివితే విశ్వంగారి గురించి స్పష్టత వస్తుంది. ప్రతి జర్నలిష్టూ,రచయితా, పాఠకుడూ చదవాల్సిన సంకలనమిది. 

       

8, ఏప్రిల్ 2012, ఆదివారం

7, ఏప్రిల్ 2012, శనివారం

ఎర్రని ఎరుపు కథపై బామ్మగారి మాట!


అన్నదాత రైతు, రైతుల సంక్షేమమే ధ్యేయం అంటూ పల్లె బాటలు, రైతుబాటలు, పోరుబాటలు అంటూ ఎన్నో ఉద్యమాలు చేపట్టినా మునుపు కాలంలో వున్న పల్లెలకు, పల్లె ప్రజలకు ఇప్పుడున్న పల్లెలకు ఎంతో తేడా కనిపిస్తుంది. ఇళ్ళు కట్టుకోవడానికే కాక అనేక వాటికి బ్యాంకు రుణాలు ఇస్తూ ప్రభుత్వం సహకారం అందిస్తున్నా ప్రజల్లో ప్రేమానురాగాలు కరువై, రాజీలేని రాజకీయాలతో మారిపోయి, పంతాలు, కక్షలతో పల్లెలు అట్టుడికి పోతున్నాయి. వర్షాలు పడక, జలాలు ఇంకిపోయి, భూమి బీటలు బారి, ఎన్ని బోరు బావులు తవ్వినా ఇంకా లోతుకు పోవాల్సిన అవసరమే వస్తోంది. పచ్చగా బతికిన రైతు, వర్షాలు లేక , సేద్యం చెయ్యలేక నిస్సహాయంగా కొడుకు పంచన చేరాల్సి వచ్చే ఒక రైతు కథ “ ఎర్రని ఎరుపు “
వృధాప్యం లో ఆదరించని కన్న పిల్లలు, వారి నిరాదరణకు కృంగి పోయినా మళ్ళీ కొడుకు దగ్గరికి పోవడానికి ఇష్టపడని అభిమానం. మట్టి మీద మమకారంతో మళ్ళీ వెనక్కు పల్లెకు చేరినా, అభిమానాలు కరువై అనారోగ్యం దరిచేరడం, అనుకోని పరిస్థితిలో జైలు శిక్ష, చావే శరణ్యం అన్న నిర్ణయం, ఇంత జరిగినా ఎదుటి వ్యక్తికి హాని తలపెట్టని ఓ నిజాయితీ... ఇలా ఉత్కంఠభరితంగా నడిచే కథ .
జీవితానికి దగ్గరగా, చక్కని రచనా శైలితో మనసును కరిగించి కళ్ళు చెమర్చేలా చేస్తుంది. ఈ కథలో పచ్చని రైతు ఎదుర్కున్న సమస్యలు , వాటి కి  పరిష్కారంగా అతను తీసుకునే నిర్ణయంతో తన జీవితం “ఎర్రని ఎరుపు“ గా కనిపించి మనసును కలచివేస్తుంది .
ఇవేకాక ఆకట్టుకునే అంశం రచయిత విషయగమనం & సందర్భానుసార వాక్య ప్రయోగం . ఉదాహరణకి
“సాగునీటి మాట దేవుడెరుగు, తాగునీటికి అరమైలు వెళ్ళాల్సిన పరిస్థితి “
"కనీసం నాకడానికి పచ్చిక వాసన కనిపించక పశువులు దిగులు పడినాయి “
“వొంటరితనం చెడ్డ దైతే , వృద్దాప్యం అంతకన్నా చెడ్డది
జైలులో ప్రారంభమై జైలులోనే అంతమయ్యే ఈకథ కరువులో పల్లెల వాతావరణాన్ని, బాగా బతికిన రోజుల్లో అతని మంచి స్థితిని, కొడుకు దగ్గర జీవితాన్ని, కొడుకు నిస్సహాయతని అర్థం చేసుకుని అభిమానంతో వెనుతిరగడాన్నికన్నులకు కట్టినట్టు చెబుతుంది .
పల్లెలలో వచ్చిన మార్పులు, అధిక కూలి రేట్లతో మనుష్యులలో వచ్చిన బద్ధకం, ఆదరణ చూపని కుటుంబీకులు, వృద్దాప్యంలో తప్పని అనారోగ్యం, అన్నిటికి సమాధానం అతను తీసుకున్న నిర్ణయం చదివిన ప్రతిఒక్కరిని ఆలోచింప చేస్తుంది... అందుకే నాకు ఈ కథ నచ్చింది .
ఇంత చక్కని కథని అందించిన రచయిత టి.ఎస్.ఏ. కృష్ణమూర్తి గారు, అందరికి అందుబాటులో వుంచిన  కథాజగత్ అభినందనీయులు .

- లక్ష్మీ రాఘవ

(బామ్మగారి మాట బ్లాగు సౌజన్యంతో)

అక్కినేని కుటుంబరావు గారి కథ !

ప్రముఖ రచయిత, దర్శకులు, నిర్మాత ‘భద్రం కొడుకో’     ‘పాతనగరంలో పనివాడు’, ‘గులాబీలు’, ‘తోడు’, ‘అమూల్యం’ వంటి అమూల్యమైన చిత్రాలను అందించిన అక్కినేని కుటుంబరావు గారి కథ క్యాన్సిల్! క్యాన్సిల్!! కథాజగత్‌లో.

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

మొలకల పున్నమి

వేంపల్లి గంగాధర్ కథలపై సుమారు ఐదేళ్ల క్రితమే వ్రాసిన సమీక్షా వ్యాసం ఇది. తాడికొండ కె.శివకుమార శర్మ కథ!

టాంక్‌బండ్‌పైనున్న విగ్రహాల విధ్వంసంపై స్పందించి వ్రాసిన  కథ చిన్న ఆశ కథాజగత్‌లో చదవండి.  

శ్రీవారూ..! ఏమిటిలాగయ్యారు..!

"ఏవండీ! మీ శ్రీవారు ఈమధ్యన విప్లవ వీరుడి మల్లే విజృంభిస్తున్నారట. ఉండాల్లెండి. అటువంటి వాళ్ళు నూటికో కోటికో తమ జీవితాలనుద్యమాలకే అంకితం చేసిన వాళ్లుంటారు... మా వారా! ఉత్త పిరిగ్గొడ్డు. ఏది అడగాలన్నా సరే బెంబేలెత్తిపోతుంటారు." అంటూ భర్తను పొగిడితే మురిసిపోయేది మానేసి ఆ యిల్లాలు మొఖం మొటమొటలాడ్చడం వెనక దాగున్న కారణం ఏమిటి? తెలుసుకోవాలంటే కె.కె.రఘునందన గారి కథ కథాజగత్‌లో చదవాల్సిందే! 

4, ఏప్రిల్ 2012, బుధవారం

ఏకాకి కథపై కళ్యాణ చక్రవర్తి విశ్లేషణ!


కథ  :  ఏకాకి
రచయిత : వింజమూరి అచ్యుతరామయ్య

బంధాలు అనుబంధాలు ఎలా అల్లుకుంటాయో చెప్పలేము ఎంత దూరం నిలిచుంటాయో చెప్పలేము. తమ ప్రయోజనాల కోసం కలిగించుకునేవి కొన్నైతే కాలంతో పాటు మసులుకునేవి కొన్ని. కథలో ఈ విషయం చాలా ప్రస్పుటంగా కనిపిస్తోంది. ఎన్ని ఆస్తి పాస్తులున్నా ఐశ్వర్యాలు వున్నా తోడు నీడగా సాటి మనిషి లేకుంటే ఆ జీవితం వ్యర్ధమని రచయిత గారు చక్కగా వివరించారు. 

జానకమ్మ:
జానకమ్మ గారి పాత్ర చాల ముఖ్యమైంది. ఆప్యాయత ప్రేమానురాగాలకు నోచుకోని ఆవిడ వాటికి ఎంతగా పరితపించారో అర్ధమౌతోంది. తనకు సాయం చేసారనే ఒకే ఒక్క కారణం చేత తన ఇంటినే వారికి రాసించారు. ఇక్కడ ప్రేమానురాగాల విలువ అన్నది తెలుస్తుంది. మనిషికి కావలసింది ఆస్తిపాస్తులు కావు ప్రేమనురగాలనే కథాంశం ఎంతో బాగుంది.

ఇంట్లో  అద్దెకున్న కుర్రాళ్ళు :
జానకమ్మ గారి ఇంట్లో అద్దెకున్న కుర్రాళ్ళు తమ అవసరం తీరగానే వారి దారిన వారు వెళ్ళిపోయారు. మన జీవితంలో కూడా ఎంతో మంది అలా వచ్చి వెళుతుంటారు .వారి అవసరాలు తీరాక వెళ్ళిపోతుంటారు. వారిని ఎందుకు అని ప్రశ్నించే హక్కు మనకు ఉండదు. మన అవసారాలను గ్రహించగలిగితే మానవత్వం ఉన్నవారౌతారు లేకుంటే స్వార్ధ పరులౌతారు.

రామనాథ్ :
ఇంకా రామనాథ్ గారి విషయానికొస్తే భోగాలకు అలవాటైన రామనాథ్ కట్టుకున్న ఇల్లాలిని సైతం వుదాసించి తను ఏమి పోగొట్టుకుంటుంన్నాడో కూడా తెలియని పరిస్థితులలో కనిపిస్తారు. ఎట్టి మనిషైనా మంచితనం వున్నవాడైనా అవకాసం వచినప్పుడు పెడదోవ పడితే ఎవ్వరు వారిని కాపాడలేరు అనడానికి ఈ పాత్ర ఒక ఉదాహరణ. పైగా వేటినైతే చులకనగా పట్టించుకోమో అవే పెను భూతమై మనమీద భారమై కూర్చుంటాయి అనే ముగింపు అలాంటివారికి ఓ గుణపాఠం.

సుశీల :
సుశీల పాత్ర చాలా గొప్పది. ఇల్లాలిగా తన బర్తకు సేవలు చేస్తూ. జానకమ్మ గారికి చేతోడు వాదోడుగా వుంటూ. తన ఇష్టా ఇష్టాలను సైతం వదులుకొని జీవితాన్ని గడిపింది. ఒక్క మాటలో చెప్పాలంటే నిస్వార్ధపరురాలు. జానకమ్మగారైనా తన స్వార్ధం కోసం వారిని ఆదరించారని చెపచ్చు కాని. సుశీల ఎటువంటిది ఆశించక జానకమ్మ గారికి సేవలు చేసింది. ఇలాంటి బార్యను పట్టించుకోని భర్త కష్టాల పాలు కాక తప్పదు. కాని చివర సుశీల పడిన మానసిక క్షోభ కాస్త బాధపెట్టింది. మంచివారికి కాలం లేదు.

నీతి :
జీవితం మధ్యలో వచ్చే భోగాలకు మోసపోయి జీవితాన్నే వదులుకోకూడదు.

మొత్తానికి రచయిత గారు చాలా చక్కగా కథను అందించారు. ఇది కథ కాదు మన నిజ జీవితంలో ఎదురయ్యే అనుభవమే అని కూడా చెపచ్చు. వింజమూరి అచ్యుతరామయ్య గారికి మా ధన్యవాదాలు .


"లోకా సమస్తా సుఖినో భవంతు"

(నాలో మాట బ్లాగు సౌజన్యంతో)

3, ఏప్రిల్ 2012, మంగళవారం

రాచపాళెం వారి సమీక్ష!


బ్లాగుమిత్రులు, శ్రేయోభిలాషులందరికీ  శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా తురుపుముక్క శుభాకాంక్షలు అందజేస్తోంది. శ్రీరామచంద్రుని కరుణా కటాక్షవీక్షణాలు మీపై మెండుగా ఉండాలని కోరుకుంటున్నాం.


ఈ రోజు ఆంధ్రభూమి దినపత్రిక 'అక్షర' పేజీలో సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై డా.రాచపాళెం చంద్ర శేఖర రెడ్డిగారి విపులమైన సమీక్ష ప్రచురితమైంది. చదవండి. 


సమీక్ష పూర్తి పాఠం ఈ క్రింద చదవండి.


     తెలుగు సాహిత్య రంగంలో ఇప్పుడు నాలుగు పనులు జరుగుతున్నాయి. 1. రచయితల సాహిత్య సర్వస్వ ప్రచురణ 2. షష్టిపూర్తి, శతజయంతుల సందర్భంగా రచయితలపైన విశే్లషణలతో ప్రత్యేక సంచికల విడుదల, 3. బహుమతుల పురస్కారాల హడావిడి 4. కొత్తగా వచ్చిన రచనను అనేక స్థలాలలో ఆవిష్కరించి సమీక్షలు చేయించడం. వీటిలో దేనితోనూ సంబంధం లేని వ్యాస సంకలనం ‘‘సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం.’’ విద్వాన్ విశ్వం మీద అనేకులు ఇదివరకే రాసిన విమర్శలు, విశ్వంగారి రచనలలో ఎన్నిక చేసిన విమర్శలు, ఫ్యూచర్లూ, సమీక్షలతో కూడిన సంచిక ఇది. నాగసూరి వేణుగోపాల్, కొడీహళ్ళి మురళీమోహన్‌లు దీనికి సంపాదకులు.

      మరో మూడేళ్ళలో విద్వాన్ విశ్వం శత జయంతి (2015) జరగబోతున్నది. అప్పుడు విశ్వం గురించి ఏమిచేయాలో నిర్ణయించుకోడానికి వీలుగా ఇప్పటికే ఆయన మీద వచ్చిన విశే్లషణల్ని ఈ సంచికలో చేర్చారు. విద్వాన్ విశ్వం కవి, నవలా రచయిత, పాత్రికేయుడు, కాలమ్ రచయిత, సమీక్షకుడు, అనువాదకుడు, ప్రగతిశీల చింతనాశీలి, కార్యకర్త, స్వాతంత్య్రానంతరం అభ్యుదయ సాహిత్యానికి రాయలసీమనుండి పుట్టుకొచ్చిన ప్రతినిధులలో ఒకరు విశ్వం. మాణిక్యవీణ, నలుపుతెలుపు శీర్షికలతో సాహితీ సామాజికాంశాలను వ్యాఖ్యానించిన పాత్రికేయ రచయిత అయిన విశ్వం వామపక్ష రాజకీయ క్రియాశీలి. ఈ వాస్తవాలను ప్రతిబింబిస్తున్నది ఈ సంకలనం.

           విద్వాన్ విశ్వం అనగానే ‘విశ్వం’ అనే పదం చుట్టూ సంచరిస్తారు అందరూ. ఈ సంపాదకులు కూడా ఈ సంచికను నాలుగు భాగాలుగా విభజించి విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ అని పేర్లు పెట్టారు. ఈ నాలుగు పదాలూ విశ్వానివే అయినా సంపాదకులు వాటిని అర్థవంతంగా ఉపయోగించుకున్నారు. విశ్వజీవిలో విశ్వంమీద ఇరవయ్యొక్క మంది రాసిన వ్యాసాలు చేర్చారు. తక్కిన మూడు భాగాలలో విశ్వం నిర్వహించిన మాణిక్యవీణ, నలుపు తెలుపు శీర్షికలనుండి ఎన్నిక చేసిన సాహితీ సామాజిక వ్యాసాలు, విశ్వం రాసిన పీఠికలు, సమీక్షలు, ఆయన ఇచ్చిన సందేశాలు, ఇంటర్వ్యూలు ఉన్నాయి.

          కల్లూరు అహోబలరావు విశ్వంను మానవతావాదిగా నిర్వచించగా, విశ్వనాథ గొప్ప జాతీయవాదిగా పేర్కొన్నారు. ఎం.ఎ రెడ్డి సాటిలేని మేటి సాహిత్యరత్న దీపమని వర్ణించగా సమాజశ్రేయస్సుకు పాటుబడిన సాహితీ ఋత్విక్కుగా కలువగుంట రామమూర్తి నిర్ధారించారు. యాదాటి కాశీపతి విశ్వం కవిత్వంలో విశ్వమే ప్రదర్శితమైందని కొనియాడారు. పెన్నేటి కావ్యం గురించి విమర్శకులు విస్తృతంగా అభిప్రాయాలు చెప్పారు. అది సీమ రైతాంగ హృదయవేదన అని ఏటుకూరి బలరామమూర్తి అంటే, సీమ దారిద్య్రం దైన్యం కలిగించిన నిర్వేదసారంగా భూమాన్ పేర్కొన్నారు. నిస్సహాయ నిర్వేదంలోనూ కావ్యకమనీయత దెబ్బతినలేదని రాళ్ళపల్లి పేర్కొన్నారు. విశ్వం వైదుష్యంలాగే ఆయన సాహిత్యం కూడా వైవిధ్యశోభితమని దివాకర్ల వివరించగా, ఆయన సాహిత్యంలో సర్వమానవ సౌహార్దం పట్ల తపన ఉందన్నారు రాళ్ళపల్లి. ఒక ప్రాంత నిర్దిష్ట జీవిత చిత్రణ  పెన్నేటి పాటతోనే మొదలైందని అద్దేపల్లి పేర్కొనగా, తనకు తెలంగాణా అంటే ఆవేశం వచ్చినట్లు విశ్వానికి రాయలసీమ అనగానే ఆవేశం పొంగుకు వస్తుందని దాశరథి పరవశించారు.

          ప్రాచ్య విద్యలు చదివి సామ్యవాదం వైపు మొగ్గిన ప్రజ్ఞావంతులు కొందరిలో విశ్వం ఒకరని ఆరుద్ర అంటే, సంప్రదాయాన్ని ఆదరించినా ఛాందసాన్ని అంగీకరించని వ్యక్తిగా పున్నమరాజు పేర్కొన్నారు. తన లాంటి రచయిత్రులంతా పైకి రావడానికి విశ్వం ప్రోత్సాహమే కారణమని మాలతీచందూర్ చెప్పుకోగా, అపారమైన అనుభవంతో విశ్వం నేర్చుకున్నది ఆత్మవిశ్వాసమన్నారు మిక్కిలినేని. మాణిక్యవీణ ఆయన విస్తృత పరిజ్ఞానానికి సాక్ష్యమని మహీధర కీర్తించగా, అందులో ఆయన చేసిన హితబోధ నేటి రాజకీయ నాయకులకు కూడా అనుసరణీయాలన్నారు వెలుదండ. విభిన్న వాదాలతో గిడసబారిపోయే ప్రస్తుత పరిస్థితిలో విశ్వం విశాల దృక్పథం ఎంతో వాంఛనీయమని నాగసూరి వేణుగోపాల్ అభిప్రాయపడ్డారు. ఆయనకు సీమ సమస్తమూ తెలుసని ‘సీమసాహితి’ తొలి సంచిక సంపాదకీయం పేర్కొంది.

         విశ్వం వ్యాసాలలో మనకు రతనాల వంటి అభిప్రాయాలెన్నో లభిస్తాయి. ‘‘ఈ నవ్యకావ్య ప్రపంచాన్ని కొత్త కొలమానాలతో కొలవవలసి వస్తున్నది.’’ అంటూ ఆధునిక కవిత్వ పరిశీలనకు కొత్త ప్రమాణాల అవసరాన్ని పేర్కొన్నారు. అయిదున్నర దశాబ్దాల క్రితం, ఇది నేటికీ శిరోధార్యం. రాయలసీమ కరువుమీద 1955లో పెనే్నటి పాట రాసినా 1970లో దేశవ్యాప్తంగా 84 జిల్లాలలో వచ్చిన కరువును గుర్తించారు. ప్రపంచీకరణవల్ల ప్రపంచం ఒక కుగ్రామం అవుతున్నదని ప్రచారం జరుగుతున్నది ఇవాళ. విశ్వం 1971లో దేశాలకూ ఖండాలకు మధ్యనున్న దూరమే కాదు గ్రహాలకూ ఉపగ్రహాలకూ మధ్యనున్న దూరంకూడా తగ్గిపోతున్నదని గుర్తించారు విశ్వం. స్వరాజ్యం నిజమైన ప్రజారాజ్యం చెయ్యడానికి విప్లవం తీసుకురావాలన్న విశ్వం మాట కాలం చెల్లిందనగలమా! 1914లో కట్టమంచి చెబితే పండితులు విసుక్కున్నారు గాని విశ్వం ‘‘ఏ సందర్భంలో ఏది ఉచితమో దానిని సమర్థంగా ఉపయోగించుకోవడంలోనే కవి చరితార్థుడౌతాడు’’అని ప్రబోధించారు. ‘తెలుపు నలుపు’ శీర్షిక విశ్వంను సాహిత్య తత్వవేత్తగా అధ్యయనం చెయ్యవలసిన అవసరాన్ని గుర్తుచేస్తుండగా మాణిక్యవీణ ఆయన సామాజికాలోచనలను వివరిస్తున్నారు. అడివి బాపిరాజు, తరిమెల నాగిరెడ్డి, మాడపాటి హనుమంతరావు, కాళిదాసు ‘మేఘసందేశం’, దాశరథి ‘తిమిరంతో సమరం’, రంగనాయకమ్మ ‘కళ ఎందుకు?’, కరుణకుమార ‘బిళ్ళల మొలత్రాడు’ వంటి రచయితలు, రచనలను విశే్లషించారు విశ్వం. ఇదంతా చూస్తే విశ్వంను రచయితగానే గాక, సాహిత్యతత్వవేత్తగా, సాహిత్య విమర్శకుడుగా కూడా చూడవలసి ఉందనిపిస్తుంది. చివర నాగసూరి విశ్వంతోనూ, విశ్వం శ్రీశ్రీతోనూ చేసిన సంభాషణలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. నేటి తరం కవులు, రచయితలు తెలుసుకోవలసిన విషయాలతో ఈ సంచికను సమకూర్చిన సంపాదకులకు అభినందనలు.

- రాచపాళం చంద్రశేఖరరెడ్డి 

2, ఏప్రిల్ 2012, సోమవారం

కినిగె.కాంలో విద్వాన్ విశ్వం!

సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథం ఇప్పుడు కినిగె.కాం ద్వారా ఇ-బుక్ రూపంలో విశ్వవ్యాప్తంగా సాహితీప్రియులకు అందుబాటులో వుంది. కినిగె వారు ఈ పుస్తకంపై ఇరవై శాతం డిస్కౌంటు కూడా ఇస్తున్నారు. అంటే 160రూపాయలకే మీరు ఈ పుస్తకాన్ని కొని చదవవచ్చు. ఇంకా ఈ పుస్తకాన్ని అద్దెకు చదివే సౌలభ్యం కూడా వుంది. అంతే కాకుండా ప్రింటు పుస్తకం (20% డిస్కౌంటుతో) కావాలన్నా కినిగె ద్వారా ఆర్డరు చేయవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకో దలచినవారు ఈ క్రింది లంకెను నొక్కండి.