...

...

29, నవంబర్ 2012, గురువారం

బ్రతక నేర్వని వాడు!


కథ అని చెప్పుకోవడానికి అన్ని విధాల అర్హత ఉన్న కథ!

...............

నేను ఎంతో ఇష్టంగా టైపు చేసిన కథ!

.................

దాసరి అమరేంద్ర గారి బ్రతకనేర్వనివాడు కథ!

.................

ఇప్పుడు కథాజగత్‌లో!

...............

20, నవంబర్ 2012, మంగళవారం

పేరు సూచించండి!

డాక్టర్ సర్దేశాయి తిరుమలరావు గారి గురించి నేను డా.నాగసూరి వేణుగోపాల్‌తో కలిసి తీసుకువస్తున్న పుస్తకం ఓ కొలిక్కి వచ్చింది. సుమారు 200 పేజీలు ఉండే ఈ పుస్తకంలో తిరుమలరావు గారు వ్రాసిన విమర్శావ్యాసాలు, నాటికలు, కథ, గ్రంథ విమర్శలు, పీఠికలు, సంపాదక లేఖలు, వారు వ్రాసిన 'సాహిత్య తత్వము - శివభారతదర్శనము', 'కన్యాశుల్క నాటక కళ' గ్రంథాలపై వెలువడిన పీఠికలు, సమీక్షలు తిరుమలరావు గారి జీవిత విశేషాలను వివరించే వ్యాసాలు, అనుబంధంగా తిరుమలరావుగారి ఫోటోలు, భారతిలో వారి రచనల జాబితా వగైరా ఉంటాయి. వీటితో పాటు ఆయిల్ టెక్నాలజీ రంగంలో సర్దేశాయి గారు చేసిన పరిశోధనలూ, వారి ఆధ్వర్యంలో అనంతపురంలోని తైల సాంకేతిక పరిశోధనా సంస్థ సాధించిన విజయాలూ వివరిస్తూ ఒక బృహత్ వ్యాసం ఈ పుస్తకానికి హైలైట్‌గా ఉండబోతోంది. ఈ పుస్తకానికి ఒక మంచి పేరును సూచించవలసిందిగా బ్లాగు మిత్రులను కోరుతున్నాను. పేరు పెద్దగా ఉండకూడదు. 'క్యాచీ' ఉండాలి. సర్దేశాయి తిరుమలరావు ముందుగాని, చివరన గాని ఒక విశేషణం జోడిస్తే ఎలా ఉంటుంది? (సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం మాదిరిగా) మీ సలహా సూచనల కోసం ఎదురుచూస్తున్నాను.       

13, నవంబర్ 2012, మంగళవారం

దీపావళి కానుక!

తురుపుముక్క, కథాజగత్ పాఠకులకూ శ్రేయోభిలాషులకూ మిత్రులకూ  దీపావళి శుభాకాంక్షలు! ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి గారి శ్రుతి కథ మీకోసం ప్రత్యేకంగా అందిస్తున్నాం. చదివి ఆనందించండి.

12, నవంబర్ 2012, సోమవారం

అద్వైతం

అనిల్‌ప్రసాద్ లింగం గారి కథ అద్వైతం కథాజగత్‌లో చదవండి.

11, నవంబర్ 2012, ఆదివారం

కల్పన కథపై వనజవనమాలి గారి విశ్లేషణ!


ఆకాశంలో సగం అని ఘనంగా చెప్పుకునే మహిళల  చదువులు - ఉద్యోగాలు కుటుంబం అనే రారాజుని గెలిపించడానికి గృహిణి కర్తవ్యం ని నెరవేర్చడానికి.. ఎలా బలి తీసుకోబడుతున్నాయో.. ఈ కథ చెబు తుంది  . .. పురుష అహంకార, వరకట్న, కుటుంబ హింస లోలోతుల్లో ఎలా ఇంకా వేళ్ళూనుకునే  ఉన్నాయన్న సంగతిని.. మరవకూడదనుకుంటూ..ఆ పరిధిలోనే స్త్రీల   జీవితాలు వాటికి అనుగుణంగానే  మారతాయని, ఇంకా చెప్పాలంటే  మార్చబడతాయని ఈ  కథ చెపుతుంది.  

కల్పన, సుదీర అనే ఇద్దరు విద్యాధికులు, మాజీ ఉన్నత ఉద్యోగినులు అయిన తల్లుల గురించి వారి ఆవేదనాభరితమైన ముచ్చట్లలో.. మనం ఈ కథని చదువుతూ..  మహిళల విద్యా ఉద్యోగ అవకాశాలని, శక్తి యుక్తులని సామర్ధ్యాన్ని పెళ్లి, కుటుంబం, పిల్లలు అనే  కారణాలతో  తల్లి అనే  పాత్రని ఎంతో   ప్రేమ భరితంగాను చేస్తే  భార్యగా  బరువు-భాద్యతలు వారిని  ఎలా నిస్తేజంగా  చేస్తాయో తెలుసుకుంటాం.  మారని పురుష ప్రపంచ వైఖరిని గమనిస్తూ.. దుయ్యబడుతూ  ముందుకు సాగుతాం.

ఉన్నత ఉద్యగం చేసి లక్షలు సంపాదిస్తున్న కల్పనకి వరకట్న బాధ తప్పలేదు. అత్తగారి ఆజ్ఞానుసారాలు, ఆడబడచు ఆరళ్ళు, భర్త సహకార లేమి వీటన్నిటి మద్య.. అమితంగా నలిగి చదువు ఉద్యగం ఇచ్చిన భరోసాతో.. పోరాడి గెలిచినా మళ్ళీ వివాహమనే వ్యాపారములో.. లాభాన్ని లెక్కించుకుని.. భర్తతో కలసి ఉండటానికే ఇష్టపడుతుంది. ఇంటా-బయట చాకిరితో.. తల్లిగా తన అవసరాన్ని బిడ్డకి అందించలేని అసహాయతనంలో.. ఉద్యోగం వదులుకోవడం, భర్త అహంకారం లాటి విషయాలు  అన్నీ యెంత ఒత్తిడికి   గురిచేసి.. గృహిణిగా మిగిల్చాయో.. జీవితం  ఎంత వేదనా భరితం అయ్యిందో.. చదువుతుంటే.. ఇది  ఒక్క కల్పన సమస్య మాత్రమేనా అనిపిస్తుంది.  లక్షలాది మంది మహిళల కత్తిమీదసాములాటి  ఇంటి-ఉద్యోగ భాద్యత..లో.. నలిగి పోతున్నారో..అనిపిస్తుంది. పురుషుల సహకార లేమితో.. నలిగిపోతున్నఉద్యోగులైన  ఆడకూతుర్లే  కనిపించారు. 

చదువుకుని ఉద్యోగం చేసి,డబ్బు సంపాదిస్తున్నానే  ధీమాతో.. మొగుడికి ఎదురు తిరిగి మాట్లాడటం, కేసులు పెట్టడం చేస్తున్నారు. అది లేకపోబట్టే కాపురాలు చక్కబెట్టు కుంటాం అని తీర్మానిన్చుకోవడం కన్నా తప్పిదం ఇంకోటి   ఉండదేమో!  స్త్రీల ఆర్ధిక స్వాతంత్ర్యం లభించవచ్చు. ఆర్ధిక స్వేచ్చ లేకుండా.. తమ సంపాదన అంతా.. భర్త చేతికి అందించి.. ఎన్ని ఇక్కట్లుని మౌనంగా సహిస్తారో.. చాలా సందర్భాలలో  మనం రుజువు పరచగలం. 

ఈ కథలో సుధీర  చెప్పిన  మానస కథ  ఆఖరికి సుధీర  కథ కూడా.. చదువుకుని ఉద్యోగం చేస్తూ..  రెండు పడవలపై కాళ్ళు ఉంచి జీవన ప్రయాణం చేయలేక  కుటుంబం కోసం, బిడ్డల కోసం  హౌస్ వైఫ్ గా మిగిలినవారే!  ఉద్యోగం పురుష లక్షణంగా.. మగవాళ్ళు మారనూ లేదు. స్త్రీలకి సహకారం అందించడం లేదు.  .కొంతలో కొంత ఈ కథ లో స్త్రీలు తమ ఆసక్తుల   మేరకు ఇకబెన క్లాస్స్ లకి వెళ్ళడం, దూర విద్యా కోర్సులలో చేరి చదువుకోవడం కొంత హర్షించ తగ్గ విషయమే! చాలా మంది స్త్రీలకి ఆసక్తి ఉన్నా అలాటి అవకాశం లభించనే లభించదు. అలాగే  కథ ముగింపులో స్త్రీల జీవితాలలో.. కనీసం  మంచి చెడు నిర్ణయం తీసుకోవడానికైనా... మన నిర్ణయం మనం తీసుకోవడానికి అయినా.. తప్పనిసరిగా చదువుకుని ఉండాలి అనడం కూడా ఆవేదనగానే ఉంది. చదివిన చదువులు, సంపాదించిన లోకజ్ఞానం అందుకు మాత్రమె ఉపయోగమా? సమాజంలో సగ భాగం అయిన స్త్రీకి సమాజ భాద్యత లేకుండా.. కుటుంబానికే పరిమితం కావడమో, కాబడటమో చీకటి లోకంలోనే ఉన్నట్లు అనిపించక మానదు. 

 నాకు ఈ కథలో నచ్చిన విషయం ఏమంటే  స్త్రీల అభివృద్ధి వెనుక దాగిన అణచివేత పై  తెలియని ఆవేదన ఉంది. అది మనలని చుట్టుముట్టుతుంది. ఆధునిక కాలం అమ్మాయిల చదువులు, ఉన్నత ఉద్యోగాలు.. సంపాదన అంటూ.. ఆకాశానికి.. ఎత్తేయడం.. అందరికి కనిపించే బాహ్యకోణం. ఇంటా బయట చాకిరి చేస్తూ.. పాత కొత్త తరాల మద్య సంధి కాలంలో..  స్త్రీలు ఎంత నలిగిపోతున్నారో అన్న దానికి..  కథ  దర్పణం పట్టింది. ఆర్ధిక సమానత్వం కల్గిన స్త్రీని.. భార్యగా అంగీకరించలేని.. సమాజంలోనే మనం ఉన్నాం. ఇప్పుడు స్త్రీలకి..చదువు ఉద్యోగాలతో పాటు అన్నీ ఉన్నాయి.. వరకట్నం, వేధింపులు, ఆదిపత్య ధోరణి ని భరించాల్సి రావడం.. ఇంకా అనేక సాంఘిక సమస్యలు... అన్ని ఉన్నా.. స్త్రీ లో మాతృత్వం కి.. పెద్దపీట.. వేయడం. .స్త్రీఅత్వానికే చిహ్నంగా..  ముగింపు.. కధకి వన్నె తెచ్చింది.. వాస్తవం కూడా.. అదే..! కధని.. ఇంకా బాగా వ్రాయవచ్చు. కల్పన తన గురించి చెప్పడంలో.. ఇంకా సున్నితత్వం ఉండాల్సిన్చినదేమో అనిపించినది, అవసరమనిపించిది. అఫ్ కోర్సు..ఇన్ని సమస్యలని ఫేస్ చేసిన స్త్రీలకి.. సున్నితత్వం  కూడా పోతుందిఅనుకోవచ్చు. . .. చక్కని..కధ అని అనలేను.. వాస్తవములు..అంటాను. ఆ ఆవేదన తోనే ఈ కథని విశ్లేషించాను  కూడా..

 "తల్లిదండ్రుల తరం మారి ఆడపిల్లలు చదువుకోవాలని కొడుకులతో సమానంగా చదువు చెప్పించింది. కానీ చూశారా మగవాడు మారలేదు. మగవాడి తల్లిదండ్రుల పాత్ర మారలేదు. ఇప్పుడు మనకు అభ్యుదయం పేరిట అదనపు బరువు బాధ్యతలు''.   

ఇది నూటికి నూరు శాతం నిజం.

(వనజవనమాలి బ్లాగు సౌజన్యంతో)

వాసంత తుషారం

"మావాణ్ణి చూడటానికి వచ్చినారేమమ్మ మీరు - అదృష్టవంతుడమ్మా మావాడు - రండమ్మా రండి" అంటూ వెంకటలక్ష్మమ్మ సంబరపడటానికి కారణమేమిటి? తెలుసుకోవాలంటే ప్రముఖ కథకుడు సింగమనేని నారాయణ కథ వాసంత తుషారం కథను కథాజగత్‌లో చదవండి. తప్పక చదవాల్సిన కథ యిది. 

4, నవంబర్ 2012, ఆదివారం

'అంతర్ముఖం' అంతరార్థం!


అడపా చిరంజీవిగారి అంతర్ముఖం  కథ నాకు ఎంతగానో నచ్చింది. ఆత్మహత్యకు సిధ్ధపడ్డ వ్యక్తి  నిర్ణయం  మార్చుకుని ఆత్మహత్య వద్దని నిర్ణయింప చేసే కధలలో ఒకటి.   మనిషిలోని మనసుకి ఒత్తిడి, నిరాశ కలిగినప్పుడు దానినుంచి విముక్తి చెందటానికి,  శరీరాన్ని కూడా బలవంతంగా అంతం చేసి ఆత్మహత్య  ద్వారా అన్ని సమస్యలకీ  పరిష్కారం దొరుకుతుందను కోవటం  చాలా మూర్ఖత్వం. ఆత్మహత్య  పరిష్కారం కాదన్న  విషయాన్ని చాలా చక్కగా కథలో ఇమిడ్చారు. ఆత్మహత్య చేసుకునే ముందు పడే వేదనని రచయిత    క్లుప్తంగానైనా, ఎంతో బాగా వర్ణించారు.
జీవితమంటే జీవించ తగ్గదన్న అర్థం స్ఫురిస్తుంది. కాని జీవితంలో ఎంత మంది జీవితాలు జీవించటానికి హితముగానూ, జీవించ తగ్గవిగాను ఉన్నాయని ఆనందిస్తున్నారు అని ప్రశ్నిస్తే?... దానికి అనేకానేక హేతువులతోనూ, సమర్థింపులతోనూ  కొరతలతోనూ కూడుకున్న జవాబులు లభిస్తాయి. ఎంతో తాత్వికత కలిగిన మనుషులు తప్ప తమ జీవితాలను  నిండుగానూ తృప్తికరంగానూ పరిగణించలేరు. సాధారణ మానవులు తమ జీవితాలను నిండుతనం లోపించటానికి అనేకానేక కారణాలను పేర్కొంటారు.  కొందరు తీరని ఆశలని  పేర్కొంటే, మరికొందరు జీవిత పరమావధిని అందుకోలేక పోయామని బాధ పడవచ్చు. 
ఇహ పర సుఖాలను ప్రతివారు  వారి వారి  పరిధికి తగ్గట్టు కాంక్షించవచ్చు, కాని పుట్టిన ప్రతి జీవి తన మరణాన్ని గురించి తనకు తెలియకుండానే ఒక ఊహకి అందని కధని  అల్లుకుంటాడు. జనులంతా తమ ప్రమేయం లేకుండానే  ఈ భువిలోకి రావటం జరుగుతుంది... అలానే ఏదో ఒక నాడు తమ ప్రమేయం లేకుండానే ఈ జగతిని వీడి పోవలసి ఉంటుంది... ఈ రెండిటికీ కూడా కొందరు  భగవంతుడిని నమ్మితే మరికొందరు  ఏదో అలౌకిక శక్తి కారణమని నమ్ముతారు. మన జీవన    మరణాలను  మన కర్మలే నిర్ణయిస్తాయన్న  విషయాన్ని మన కర్మ సిధ్ధాంతం బోధిస్తోంది. సాధ్యమైనంత  సంతోషంగా మలచు కోవలసిన జీవితాన్ని అసంతృప్తితో అంతం చేసుకోవడం ఏ విధంగా న్యాయం ?   

ఆత్మహత్యకి సిధ్ధ పడ్డవారిచే అన్యులు బలవంతంగా  కారణాలని చెప్పించటం కాక ప్రశాంతతని సృష్టించి అతడి చేతే కారణాలని ఆసాంతం  ఋషివర్యుడు  చెప్పించిన శైలి  బాగుంది.
ప్రభుత్వ ఉద్యోగులు మితమైన ఆదాయంతో కనీస  అవసరాలని కూడా తీర్చుకోలేక, సమాజంలోని పలువురి విలాసవంతమైన జీవితాల్ని చూసి, తాము  కనీస  కోరికలను కూడా  తీర్చుకోలేక పోతున్నామేనని బాధ పడుతున్నట్లు దైనీయంగానూ, దాన్ని సమర్థిస్తున్నట్లు   సన్నివేశాన్ని సృష్టించి, దాన్ని   విశ్లేషణాత్మకమైన  కోణం వైపుకు మళ్ళించిన తీరు కధకే హైలైటు. ప్రతీ మనిషి జీవించటం ద్వారా సమాజంలో మరికొంత మందికి బతికే అవకాశం లభిస్తోందన్న పాయింటు పాఠకులని కూడా అలోచింప చేస్తుంది. ప్రతీ మనిషి తన స్థాయినుంచి పై  మెట్టుకి ఎదగాలన్న తపనతో పడే పోరాటాని సమర్ధిస్తున్నట్లు వ్రాస్తూనే, అసంబధ్ధమైన కోరికలు ఆవరించటమే అన్నిట్లకీ మూల కారణమని, వాటిని  తృణ ప్రాయంగా ఎంచి విముక్తి చెందిన నాడే జీవితం చరితార్ధమౌతుందని మునివర్యునిచే చెప్పించి, మార్మికమైన నీతిని, కథ ద్వారా బోధించారు రచయిత.  
అరి షడ్వర్గాలని జయించేటంతటి గొప్పతనం సామాన్య మనుషులలో లేక పోయినా ఉద్రేకంతో తీసుకునే నిర్ణయాలని  జయించటానికి తాత్కాలికంగా వాటిని వాయిదా వేయటమే  మంచి ఉపాయమని  సూచించించారు. మరీ పొడుగైన కథలు చదివే తీరిక యువతకి ఉండదు, క్లుప్తతలోనె కథా వస్తువు, నీతి విశ్లేషణ, ఇలా ఎన్నెన్నో చొప్పించిన ఘనత రచయితది.   హీరో ఆత్మహత్యని వాయిదా వేయడం అతన్ని అంతర్ముఖునిగా మారుస్తుంది...
జీవితంలో ధ్యేయాలని,  ఆకంక్షలని, ప్రేమించిన మనస్సులని అందుకోలేక డిప్రెషన్నుకిలోనై   నిరాశతో దుడుకుగా,  ఆత్మహత్యలనే  శరణు  జొచ్చుతున్న యువత,  తమ సన్నిహితులకి  తమ మరణం ఎంతటి దుఃఖానికి  గురి చేస్తుందో ఆలోచించి క్షణికమైన ఉద్రిక్తతను అదుపులో పెట్టుకున్నట్లైతే  ఎన్నెన్నొ యువ జీవాలు కాపాడ బడుతాయి. 
కథకి ముఖ్యుడైన హీరోకి గాని, ఋషివర్యునికి గాని, ఏ పేరూ  పెట్టకుండానే ఆ పాత్రధారులని గూర్చి లోతుగా చదువరిని  ఆలోచింప చేసే రచయిత కథా శిల్పం మెచ్చుకో తగ్గది. ఋషి అతడిని అంతర్ముఖినిగా చేసి ఆలోచింప చేసి, ఇంకే బోధనల్ని, జీవిత సులువుల్ని మళ్ళీ బోధించకుండా ధ్యానంలో మునిగి పోవటం కథకి ఎంతో గంభీరత్వాన్ని  అందిస్తుంది. 
హీరొకి మరణం నుంచి  విముఖత ఏర్పరచి బ్రతుకుపై ఇష్టం కలిగినప్పుడు వచ్చే ఉప్పెనలాంటి ఆనందానుభూతికి  పాఠకులని కూడా కొని పొయి హేతువాదాన్ని ద్రుఢ  పరిచిన రచయిత ప్రశంసనీయులు.  

- లక్ష్మీమాధవ్

(భావతరంగాలు బ్లాగు సౌజన్యంతో)