...

...

26, ఆగస్టు 2012, ఆదివారం

పతంజలి శాస్త్రిగారి కథ!

తల్లావజ్ఝల పతంజలిశాస్త్రిగారి కథ గారడీ కథాజగత్‌లో చదవండి. అలాగే గంధం విజయలక్ష్మిగారి కథ హృదయం కూడా చదవండి.

15, ఆగస్టు 2012, బుధవారం

హతోస్మి!

పి.వి.సాయిసోమయాజులు గారి హతోస్మి కథానిక కథాజగత్‌లో చదవండి.

13, ఆగస్టు 2012, సోమవారం

చీకటి

కలల్ని అర్థం చేసుకుంటే మనకు మనం అర్థమవుతామా? ప్రముఖ కవి హెచ్చార్కె గారి చీకటి కథను కథాజగత్‌లో చదివి నిర్ధారించుకోండి.

11, ఆగస్టు 2012, శనివారం

టి.శ్రీవల్లీరాధిక గారి సత్యం కథపై విశ్లేషణ!!

                   నేను విశ్లేషణకు ఎంచుకున్న కథ టి. శ్రీవల్లీరాధిక గారి సత్యం. 


          ఈ కథ లో రచయిత్రి అద్వైత సిధ్ధాంతాన్ని చాలా సరళంగా ప్రతిపాదించారనిపించింది. అహంకారంతో ఏ విషయాన్నైనా ఇదింతే అని సిధ్ధాంతీకరించేస్తాం. సత్యాన్ని విభిన్నంగా వారి వారి భావావేశాల కనుగుణంగా విభజించుకుంటాం. 


          ఎన్నో ఏళ్ళుగా శైలజ ఇంట్లో పని చేసే సత్తెమ్మ ఒక నిరక్షరాస్యురాలు. స్పందన, తర్కం తెలియదు. కాని తన అనుభవసారంతో యజమానురాలి బలహీనతని భయంగా జమ కడుతుంది. అందుకే అంటుంది “నేనెక్కడ మానేస్తానో అని శైలజమ్మ కి భయం” అని. 


            భయం ఒక బలహీనత. దాన్ని అహంకారం మాటున దాచుకుని తన కన్నా తక్కువ స్థాయి వారిని అమానవీయంగా ఛీత్కరిస్తారు. ఇది శైలజ పాత్ర లో మనకి కనబడుతుంది. 


            సంతోష్ ని హూంకరించిన పూలచీరావిడ అహంకారం వెనుక అంతర్లీన శోకం కనిపిస్తుంది. పనిమనిషి పనిలోకి రాకపోతే మనం అచేతనులం. 


           ఈ భయ శోకాల మాయ కమ్ముకున్నపుడు విచక్షణ కోల్పోయి ఆధిక్యం చూపడం జరుగుతుంది. ఆ మాయ వీడిపోతే, ‘అవును ఇది ఇలా ఉంది కాబట్టి అది అలానే ఉంటుంది’ అన్న సత్తెమ్మ మాటలు అక్షర సత్యాలన్న విషయం అర్ధమవుతుంది. 


          ప్రతి వర్గం వారు ఒక సిధ్ధాంతాన్ని వారి ఆలోచనా ప్రాతిపదికగా తర్కించి విభేదిస్తారు. కాని ఒక నిర్వికార అనుభవసారంతో తనకి తెలిసిన ఒక సత్యాన్ని సత్తెమ్మ ఒక కొత్త కోణంలో చెప్పడం చాలా బాగుంది. 


           అయితే రచయిత్రి ఒకచోట ఇలా అంటారు. “ఏదో ఒక విషయాన్ని నమ్మడమే మన అందరికీ ఇష్టమయినపుడు దానికి అందరమూ సిధ్ధమయినపుడు అది అందరికీ అంతగా అలవాటయిన విషయమయినపుడు అందరమూ ఒకటే విషయాన్ని ఎందుకు నమ్మలేం? అసహనం, ఘర్షణా లేకుండా ఎందుకు ఉండలేం” అని. 


           ఈ పై వాక్యాలలో "ఐతే అది అందరికీ అంతగా అలవాటయిన విషయమైనపుడు" అన్నదానికన్న “అయితే అది అందరికీ అంతగా ఆచరణాత్మకమైన విషయమైనపుడు” అని ఉంటే బాగుండు ననిపించింది. 

            మొత్తమ్మీద మానవ స్వభావంలో బహీనతలు, భయాలు వాటి మాటున ”సత్యం“ అన్నది విభిన్నంగా తోచడం, అదే అహంకారాన్ని కాస్త పక్కన పెట్టి నిశితంగా గమనిస్తే సత్యం ఒక్కటే అన్నది బాగా విశ్లేషించారు రచయిత్రి.

- లలితారాణి

(సాహితీసంహిత బ్లాగు సౌజన్యంతో)

ఒక్క కథ!

డా.ఎం.హరికిషన్ గారి ఒక్క కథ కథాజగత్‌లో చదవండి.

10, ఆగస్టు 2012, శుక్రవారం

విద్వాన్ విశ్వం గారి 'మాణిక్యవీణ'

          ఈ మధ్యకాలంలో చాలా రకాల పుస్తకాలు ప్రచురణ జరుగుతున్నమాట వాస్తవమే అయినా, నాణ్యత కలిగి నాల్గురోజులట్టిపెట్టుకోవచ్చనుకునే పుస్తకాలు మాత్రం బహుకొద్దిగానే కనిపిస్తున్నా అందులో ఒకటిగా డా.నాగసూరి వేణుగోపాల్, కోడీహళ్లి మురళీమోహన్ గార్ల సంపాదకత్వంలో వచ్చిన 'సాహితీ విరూపాక్షుడు - విదాన్ విశ్వం' అనే గ్రంథాన్ని నిర్మొహమాటంగా చేర్చుకోవచ్చని కచ్చితంగా చెప్పుకోవచ్చు.

         దాదాపుగా నాలుగు దశాబ్దాల క్రితమే సాహితీ రసజ్ఞుల మదిని "మాణిక్య వీణ"తో రంజింపజేసిన మహోత్కృష్ఠుడు మన విద్వాన్ విశ్వమనే సంగతి యీనాటి సోకాల్డ్ కవులూ, రచయితలకు అంతగా తెలియక పోవచ్చునని చెప్పడం అతిశయోక్తేమీ కాదు. మాణిక్యవీణ, ప్రమదావనం శీర్షికల గురించి 'ఆంధ్రప్రభ' ఎప్పుడొస్తుందా అని ఎదురు చూపులు చూసిన వాళ్లల్లో నేనూ ఒకడినని గర్వంగా చెప్పుకుంటున్నాను. మరో మూడేళ్లు గడిస్తే విశ్వంగారి శతజయంతి వస్తున్న తరుణంలో మన సాహితీ పిపాసులిద్దరూ కలిసి అన్ని రకాలుగా శ్రమించి ఎంతో శ్రమకోర్చి యింత గొప్ప పుస్తకాన్ని తీసుకురావడం మనందరం ఆనందించాల్సిన విషయమే మరి. కథలో కవితలో రాసి అచ్చేసుకుంటే యింత విశేషించి చెప్పుకోవాల్సిన పన్లేదు. కానీ ఒక చరిత్ర రాయాలన్నా, ఒక వ్యక్తి గురించి జీవిత కథ రాయాలన్నా ఆయా వ్యక్తుల గురించి విషయ సేకరణ చేసి రాయడమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదని మనందరికీ తెలుసు. సమాచారమంతా పకడ్బందీగా వుందడమే కాకుండా ప్రతిపేజీ జవాబుదారిగా వుండాలి కాబడ్డి అన్ని పేజీలను ఆచితూచి అచ్చేయాలి మరి.

       ఈ గ్రంథాన్ని విశ్వజీవి, విశ్వరూపి, విశ్వభావి, విశ్వమేవ పేర్లతో నాల్గు భాగాలుగా విభజించి ఆయా సమాచారాన్ని యివ్వడం జరిగింది. "విశ్వజీవి"లో కల్లూరు అహోబలరావు, డా.దివాకర్ల వేంకటావధాని, తిరుమల రామచంద్ర, విశ్వనాథ సత్యనారాయణ, ఆరుద్ర, దాశరథి, అద్దేపల్లి, మాలతీచందూర్, రాళ్లపల్లి, భూమన్, డా.నాగసూరిలాంటి ఇరవై ఒక్క సాహితీదిగ్గజాలతో "విశ్వం"గారి పరిచయాన్ని వ్యాసాల రూపంలో అందించడం వలన వారికి సంబంధించిన పూర్తి సమాచారం మనకు తెలిసిపోతుంది. వీరు రాయలసీమ రత్నమే అయినా తెలుగు వారందరితో పాటు తెలుగు ప్రేమించే వారెక్కడున్నా అందరి హృదయాలను దోచుకున్న అద్వితీయ సాహితీమూర్తి మన "విశ్వం"గారు.

       వీరు చాలా రకాల రచనలు చేసినప్పటికీ ఎన్నటికీ మరిచిపోలేని కావ్యం "పెన్నేటి పాట". ఆనాటి భారతి లాంటి పత్రికలన్నీ వీరి రచనల్ని అచ్చసుకోవడమే గాకుండా కావాలని వీరి చేత రాయించుకునేవారని చదివినప్పుడు ఆనందిచకుండా వుండలేము. వీరి మొదటిపేరు విశ్వరూపచారిగా వున్నప్పటికీ విశ్వరూపశాస్త్రిగా మారి ఆ తర్వాత విద్వాన్ విశ్వంగా మనందరికీ సుపరిచితులైన వీరికి బాల్యం నుండే సాహిత్యాభిలాష వున్నందుకు సంకృతాంధ్ర, ఆంగ్ల భాషల్లో కూడా మంచి పాండిత్యం సంపాదించి ఇరువదేళ్ల వయసులోనే "విరికన్నె" కావ్యాన్ని పాఠకులకందించినందుకు సాహితీలోకం వీరినెప్పుడూ మరిచిపోదు. పద్యం, గద్యం, వ్యాసం, అనువాదం లాంటి అన్ని ప్రక్రియల్లోనూ వీరికి రచనా వ్యాసంగం మీద మంచి పట్టుండేది. "మీజాన్"లాంటి చాలా రకాల పత్రికల్లో పనిచేసినప్పటికి "ఆంధ్ర ప్రభ" ద్వారానే చాలా మంది సాహితీ ప్రియుల ఎదల్లో పదిలంగా వుండిపోయారు. ఈరోజు బాగా పేరు సంపాదించుకున్న రచయిత్రులందరూ, వీరు ప్రభలో పనిచేస్తున్నప్పుడు రచనలు పంపించి వీరి చేత ప్రోత్సహింపబడినామాణిక్యవీణ'లో వీరు స్పృశించని విషయమంటూ ఏదీలేదు. వ్యంగ్య ధోరణిలో అందరినీ ఆకట్టుకొనే తీరుగా 'మాణిక్యవీణ' చేసిన రాగాలాపనను సాహితీ మిత్రులెవరూ మరిచిపోరు. తెలుపు-నలుపు వ్యాసాల్లో గూడా వీరు చాలావిషాయాలను మనకు తెలపడం జరిగింది. వీరి రచనాశైలిని అనుకరిస్తే బావుండుననుకునే వాళ్లు ఎంతో మంది వుండేవారు.  

       పుస్తకంలోని రెండవ విభాగం విశ్వరూపిలో తెలుపు-నలుపు, మాణిక్యవీణ,ఎలిజీ లాంటి తొమ్మిది విభాగాలు మనక్కనిపించి చాలా విషయాల గురించి మనకు తెలుపుతాయి. మూడవ విభాగం విశ్వభావిలో నామాట, ప్రవేశిక, గోర్కీజీవితం లాంటి తొమ్మిది భాగాలు మనల్ని చాలా ఇంటరెస్టింగ్‌గా చదివిసతాయి. పుస్తకంలోని చివరిభాగం విశ్వమేవలో ఆశంస, ముఖాముఖి, జీవితంలోంచి కొత్త కవుల ప్రభవం పేరుతో ముడు ముఖ్యమైన విభాగాలు కన్పిస్తాయి. ఇందులో శ్రీశ్రీతో విశ్వంగారి సంభాషణ మనల్ని మళ్లీమళ్లీ చదివిస్తుంది. 


       మాణిక్యవీణ ద్వారానే మనందరికీ దగ్గరై, ఆత్మీయుడుగా కలిసిపోయిన విద్వాన్ విశ్వం గారి సాహితీసేవ, వీరి రచనావ్యాసంగం, రాసిన అనువదించిన పుస్తకాలగురించి చాలా మందికి తెలియకపోవచ్చు. స్వాతంత్ర్యానికి ముందునుంచే ఆనాటి కాల పరిస్థితులననుసరించి అప్పటి సాహితీపెద్దల సహచర్యంతో బెజవాడగోపాలరెడ్డి,నీలం సంజీవరెడ్డి గారి లాంటి రాజకీయ పెద్దల పరిచయాల్తో వీరు చేసిన సాహితీ కృషి గురించి ఎంతజెప్పినా తక్కువేనని యీ గ్రంథం ద్వారా తెలుస్తోంది మనకు. ఆనాటి సాంఘీక పరిస్థితుల ననుసరించి వ్రాసిన వీరి రచనల్లోని కాఠిన్యతకు అప్పటి ప్రభుత్వం విశ్వంగారిని కొంతకాలం జైలులో గూడా పెట్టడం జరిగిందట. నాణానికి ఒకవైపు  మాత్రమే చూపినట్లు వీరి గురించి కాసింతనే తెలిసిన మనకందరికీ యీ పుస్తకం ద్వారా చాలా విషయాలు తెలిసొస్తాయి. అలనాటి "మాణిక్యవీణ"ను చదివి, నెమరేసుకుంటున్న సాహితీ మిత్రులందరూ యీ "సాహితీవిరూపాక్షుడు-విద్వాన్ విశ్వం" పుస్తకాన్ని తప్పకుండా చదివితీరాలి. సమీక్షలో చాలా విషయాలు చెప్పడం కుదరదు కాబట్టి చదువరులకూ, సాహితీ ప్రియులకు చాలా విలువైన పుస్తకంగా తెచ్చిన సంపాదకులు డా.నాగసూరి వేణుగోపాల్,కోడీహళ్లి మురళీమోహన్ గార్లను ఎంత అభినందించినా తక్కువే మరి.

       వీరి సంపాదకత్వంలో మరో ఉత్తమపుస్తకం త్వరలో వస్తున్నట్టు తెలిసి చాలా సంతోషిస్తున్నాను. 


- కన్నోజు లక్ష్మీకాంతం

(సాహితీకిరణం మాసపత్రిక ఆగస్టు-2012 సంచికనుండి)   

3, ఆగస్టు 2012, శుక్రవారం

సామాన్యుని సమాధి

ఇటీవలే(05-07-2012) అఖిల భారతీయ సాహిత్య సమ్మేళన్, భోపాల్ నుండి సంస్కృతీ సమ్మాన్ పురస్కారాన్ని అందుకున్న కళాప్రపూర్ణ డాక్టర్ పోతుకూచి సాంబశివరావు గారి కలం నుండి జాలువారిన కథానిక సామాన్యుని సమాధి కథాజగత్‌లో   చదవండి.