...

...

28, మార్చి 2009, శనివారం

గోదావరీ తీరం

" ఇక్కడ గోదావరి నీళ్ళు అటువంటివయ్యా! గోదావరీ తీరంలో ధర్మం, న్యాయం, నీతి ముప్పేటలై గోదాట్లో పారుతుంటాయ్" అంటున్నారు డా||మంతెన గారు తమ కథ గోదావరీ తీరం కథలో. అందులో నిజమెంతుందో ఈ కథను మా కథాజగత్ బ్లాగులో చదివి మీరే నిర్ణయించుకోండి.

20, మార్చి 2009, శుక్రవారం

పుస్తక సమీక్ష! - 7 రియల్ స్టొరీస్

[పుస్తకం పేరు: రియల్ స్టోరీస్ రచన: కస్తూరి మురళీ కృష్ణ, పేజీలు: 296 వెల:రూ.125/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్, సూర్యా రావు పేట, విజయవాడ -2 మరియు దోమల్ గూడ, హైదరాబాద్ -29]
ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్ చూసినా లేదా ఏ దిన పత్రిక ఆదివారం అనుబంధం చదివినా అందులో క్రైం స్టోరీ తప్పక కనిపిస్తుంది. ఆసక్తిగొలిపే ఈ క్రైం స్టొరీల ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో సమాజంలోని నేర ప్రవృత్తిపై ఎంతో కొంత ఉంటుంది. కస్తూరి మురళీకృష్ణ మొదట్లో రియల్ స్టొరీస్ పేరుతో క్రైం స్టొరీలనే రాసినా క్రమంగా వాటి దిశను క్రైం నుండి ఆత్మ విశ్వాసం పెంచే స్ఫూర్తివంతమైన వాస్తవ గాథల వైపుకు మళ్ళించారు. వాస్తవ సంఘటనలను ఆధారం చేసుకుని కొంత కల్పనను జోడించి పాఠకునికి ఆసక్తి రేపే విధంగా రాసిన ఈ కథలు మానవ జీవితంలోని అనేక వైఫల్యాలను, వైకల్యాలను, ఆటంకాలను అనుకూలంగా మలచుకుని లోకానికి ధైర్యంగా ఎదురునిలిచిన వారిని మనకు చూపిస్తాయి. నిరాశ నిస్పృహలనుండి ఆశ వైపుకు మనలను తీసుకు వెళతాయి.
సమస్యలను హింస మొదలైన అనాగరిక చర్యల ద్వారా కాకుండా చట్ట బద్ధమైన న్యాయ పోరాటం ద్వారా పరిష్కరించుకొన వచ్చని కేటీ అనే ఒక మహిళ నిరూపిస్తుంది. అమెరికా సైనికులు బర్మా ప్రజలపై జరుపుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూ అమెరికా కోర్టులలో కేసు వేసి 12 సంవత్సరాల పాటు శాంతియుత న్యాయ పోరాటం చేసి చివరకు బాధితులకు నష్ట పరిహారం చెల్లించేటట్లుగా చేసి పునరావాసం, విద్య ఆరోగ్య వసతులును వారికి కల్పించేటట్లు చేయగలిగింది ఈ సాధారణ మహిళ.
తన పూర్వీకుల వృత్తాంతాన్ని తెలుసుకునే ప్రయత్నంలో నీగ్రోల బానిస బ్రతుకును, వారి దారిద్రాన్ని, శ్వేత జాతీయుల అహంకారాన్ని, సంకుచితత్వాన్ని చూసి తన తెల్ల బంధువులైన ‘బ్యూమోంట్‌’లపై నీల్ హెన్రీ ద్వేషం పెంచుకుంటాడు. ఒకప్పుడు తాము దౌర్భాగ్యమైన జీవితం గడిపినా కష్టపడి ఒక్కో మెట్టూ ఎక్కుతూ పైకి వచ్చారు. తెల్లవారిమన్న జాత్యహంకారంతో విఱ్ఱవీగిన బూమోంట్‌లు కష్టాల పాలయ్యారు. ఈ సత్యం తెలుసుకున్న హెన్రీలో ద్వేషం నశిస్తుంది. తాము చేసిన తప్పులకు తర్వాతి తరంవారు శిక్ష అనుభవిస్తారనే విషయం ఈ కథ ద్వారా బోధ పడుతుంది.
పాలస్తీనాలో క్షణ క్షణం బ్రతుకు భయంతో జీవితం గడుపుతున్న అహ్మద్ అనే కుర్రాడు బ్రిటీష్ పౌరురాలైన తన తల్లి ఐలీన్ దగ్గరకు చేరేందుకు అష్ట కష్టాలు పడి పట్టుదలతో ఇజ్రాయెల్ లోని బ్రిటీష్ దౌత్య కార్యాలయానికి చేరడం ‘ఎగిరి వచ్చిన పావురం’ అనే కథలో చదువుతాము. మనిషి ఎంత నాగరీకుడైనా అతనిలోని బలహీనత అతడిని రాక్షసునిగా మారుస్తుంది అనే నిజాన్ని జాన్ రాబె తన 'ద రేప్ ఆఫ్ నాన్‌కింగ్' అనే పుస్తకంలో తెలియజేస్తుంది. రెండవ ప్రపంచ యుద్ధంలో నాంకింగ్ ప్రాంతంలో చైనీయులపై జపాన్ సైనికులు జరిపిన అకృత్యాలను జాన్ రాబె ఈ పుస్తకం ద్వారా ప్రపంచానికి చాటి చెప్పి సంచలనాన్ని సృష్టించింది. మావో జెడాంగ్ ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం ప్రారంభ దశలో సిద్ధాంతాల ముసుగులో చైనాలో జరిగిన అత్యాచారాలను, దుష్కృత్యాలను లై జెన్‌షెంగ్ అనే ఫొటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి ప్రపంచానికి ప్రదర్శించి చైనాతో సహా అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. ఈ కథల ద్వారా కస్తూరి మురళీ కృష్ణ ప్రపంచానికి మానవత్వ విలువలను గుర్తు చేస్తున్న ఒక మహిళను, ఒక కళాకారుడినీ పరిచయం చేస్తున్నారు.
నిజాలను నిర్భయంగా ప్రచురించే పత్రికా సంపాదకుడు గుడ్లో ఆత్మవిశ్వాసంతో అధికారులు చేస్తున్న అవినీతిపై పోరాడి గెలుస్తాడు ‘నిప్పులా తాకిన నిజం’ అనే కథలో. శిశు జననం అన్నది భగవంతుడి అద్భుతమైన సృజనాత్మకమైన కళా ప్రదర్శనకు నిదర్శనం అంటూ భ్రూణ హత్యకు తన వ్యతిరేకతను రచయిత పలికిస్తాడు ‘మరణం నుంచి జీవితం’ అనే కథలొ ఒక పాత్ర ద్వారా. జన్యు సంబంధిత వ్యాధితో పుట్టిన క్షణం నుండీ మరణం పొంచి ఉందని తెలిసీ అమూల్యమైన జీవితాన్ని ప్రతి క్షణం ఆనందంగా, అర్థవంతంగా గడపాలనే బ్రియాన్ కథ హృదయాన్ని కదిలిస్తుంది. మెదడు ఎదగని తన సోదరి జూడిత్‌కు ప్రేమను పంచి ఆమెలోని సృజనాత్మక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిన జాయ్స్ కథ పాఠకులకు సంతోషాన్ని కలిగిస్తుంది.
ఆత్మ స్థైర్యంతో, గుండె నిబ్బరంతో మాఫియా ముఠాల ఆటను కట్టించిన ‘టెరెస్సా’ కథ, పట్టుదల ఆత్మ విశ్వాశాలతో మృత్యువుతో పోరాడి గెలిచిన అభినవ సావిత్రి ‘జీన్ ఫ్లాయ్‌డ్’ కథ, చిన్నతనంలో ఏర్పడిన మానసిక వ్యాధికి కృంగి కృశించిపోకుండా మానసిక శాస్త్రవేత్తగా మారిన ‘డంకన్’ కథ ఇలా ప్రతి కథా పాఠకులను ఆకట్టుకుంటాయి. ఈ కథలలోని వ్యక్తులు ఆత్మస్థయిర్యం, ధైర్యం, సాహసం,పట్టుదల,ప్రేమ, శాంతియుత పోరాటం,మానవత్వం,బాధ్యత, విశ్వాసం,కారుణ్యం,దాతృత్వం మొదలైన లక్షణాల ద్వారా ప్రపంచాన్ని జయించిన తీరు పాఠకులకు స్ఫూర్తిని కలిగించి జీవితం పట్ల ఆశావహ దృక్పథాన్ని కలిగిస్తుంది. రచయిత తాను అనుకొన్న లక్ష్యాన్ని ఈ పుస్తకం ద్వారా సాధించడం మరో రియల్ స్టోరీ!
ఈవారం జనవార్త మార్చి 15-21,2009 లో ప్రచురితం

18, మార్చి 2009, బుధవారం

పుస్తక సమీక్ష! -6 అక్షరాంజలి

(పుస్తకం పేరు: అక్షరాంజలి. పేజీలు 288, వెల: రూ.125/- ప్రతులకు: ఎమెస్కో బుక్స్, సూర్యా రావు పేట, విజయవాడ -2 మరియు దోమల్ గూడ, హైదరాబాద్ -29)
ప్రఖ్యాత యువ రచయితగా, కాలమిస్టుగా మనకు తెలిసిన కస్తూరి మురళీకృష్ణ కలం నుండి వెలువడిన పుస్తకమిది. ఒక ప్రముఖ వార పత్రికలో అక్షరాంజలి శీర్షిక పేరుతో ప్రపంచ సాహిత్యంలో విశిష్టమైనవిగా భావించిన నవలలను కొన్నింటిని పరిచయం చేయగా వాటిలో 50 పరిచయాలను ఎంపిక చేసి ఈ పుస్తక రూపంలో ప్రస్తుతం మనకు ఎమెస్కో వారు అందిస్తున్నారు. ఈ మొత్తం యాభై నవలలను సాంఘిక నవలలు, ఉద్యమ నవలలు, తాత్త్విక నవలలు, వినోదాత్మక నవలలు, సైన్స్‌ఫిక్షన్ నవలలు అనే ఐదు భాగాలుగా విభజించారు. ఈ వ్యాసాలన్నీ రచయితకు ప్రపంచ సాహిత్యంతో ఉన్న పరిచయాన్ని, అభిరుచిని, ఆకళింపును స్పష్టం చేస్తున్నాయి. తాను పరిచయం చేయదలచుకున్న నవలను పాఠకులకు ఆసక్తి కలిగించే విధంగా వ్రాయడం కస్తూరి మురళీకృష్ణ ప్రత్యేకత. కేవలం నవలలోని కథను పరిచయం చేయడం మాత్రమే కాకుండా ఆ నవలాకర్త జీవిత విశేషాలు, ఆ రచయిత ఇతర రచనలు, ఆ నవల నేపథ్యం, ఆ నవల వెలువడిన అనంతరం వచ్చిన స్పందన, ఆ నవలకు వచ్చిన పురస్కారాలు, ఆ నవలపై తన అభిప్రాయం వగైరా అన్నీ వ్రాస్తారీ పుస్తకంలో. దానితో ఆ నవలపై పాఠకునికి ఒక స్పష్టమైన అభిప్రాయం కలుగుతుంది.
ప్రపంచంలో ఏ ప్రాంతమైనా ప్రజల ఆలోచనలు, అవసరాలు, ప్రవర్తనలు, ఆకాంక్షలు ఒకే విధంగా ఉంటాయన్న విషయం ఈ పుస్తకం చదివితే అర్థమౌతుంది. పేద ధనిక తారతమ్యం, వర్ణ రూప భేదాలు, ఆత్మవంచన, ద్వంద్వ ప్రవృత్తి, మనుష్యుల మానసిక ప్రకోపాలు ఏ మారుమూలనైనా ఏకస్వారూప్యతను కలిగిఉంటాయని ఈ పుస్తకం ద్వారా తెలుసుకోవచ్చు. ఇతర దేశాలపై సగటు భారతీయుడికున్న అభిప్రాయాలను ఈ వ్యాసాలను చదివితే మార్చుకోవాల్సి వుంటుంది. ప్రతి చోటా వెలుగు చీకటి రెండూ వుంటాయని చీకటి కోణాన్ని తెలిపే రచనలకు ప్రజల నుండి, సమాజం నుండి విశేష స్పందన వస్తుందని అవగతమౌతుంది. భూతల స్వర్గమని మనం భావిస్తున్న అమెరికా ముసుగును తొలగించి అసలు రూపాన్ని చూపిస్తుంది సింక్లెయిర్ లూయిస్ రచించిన 'బాబిట్', అప్టాన్ సింక్లెయిర్ రచించిన 'ది జంగిల్' అనే గ్రంథాలు. అవినీతి, మోసం అనే పదాలకు ఆమడ దూరం ఉంటుందని మనం భావించే కమ్యూనిష్టు, సోషలిస్టు దేశాలలో ప్రత్యేకించి రష్యాలో తద్భిన్నంగా అవినీతి, దుర్భర జీవితం, అవకతవకలు మొదలైన వాటిని గురించి 'డెడ్‌సోల్స్(నికొలాయ్ వాసిల్యేవిచ్ గొగోల్)', 'వన్‌డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇవాన్ డెనిసోవిచ్(అలెక్జాండర్ సోల్జెనెస్తిన్)' నవలలు బట్టబయలు చేస్తే స్వేచ్చా శృంగారంలోని డొల్ల తనాన్ని 'మదాం బోవరీ(గుస్తావ్ ఫ్లాబెర్ట్)', 'ఎస్(జాన్ అప్‌డైక్)', 'ఫియర్ ఆఫ్ ఫ్లైయింగ్(ఎరికా జాంగ్)' నవలలు ఎత్తి చూపిస్తాయి. నీగ్రో బానిస బ్రతుకులను ప్రతిబింబించే 'టు కిల్ ఎ మోకింగ్ బర్డ్(హార్పర్ లీ)' , 'ది గ్రాస్ ఈజ్ సింగింగ్(డోరిస్ లెస్సింగ్)' 'ది కలర్ పర్పుల్(అలైస్ వాకర్)' అంకుల్ టామ్స్ కాబిన్(హారియట్ బీచర్ స్టోవ్)', రూట్స్(అలెక్స్ హేలీ) మొదలైన నవలల పరిచయం ఈ పుస్తకంలో ఉంది. సి.పి.స్నో రచన 'ది మాస్టర్స్'లోని రాజకీయపు ఎత్తుగడలు నేటి రాజకీయాలకు ఏ మాత్రం తీసిపోవు. హోనోర్ డి బాల్జాక్ నవల 'ఓల్డ్ మాన్ గోరోత్' బంధుత్వాలు, ప్రేమానుబంధాలు డబ్బుతో ముడిపడివుండటాన్ని,మానవ జీవితంలోని నిష్ఫలత్వాన్ని చక్కగా ఎత్తిచూపుతోంది. ఇంకా ఈ పుస్తకంలో మన తెలుగు వారికి సుపరిచితమైన అలెక్స్ హేలీ 'రూట్స్', చార్లెస్ డికెన్స్ 'డేవిడ్ కాపర్ ఫీల్డ్', మాక్జిం గోర్కీ 'ది మదర్', మారియోపుజో 'ది గాడ్ ఫాదర్' మొదలైన పుస్తక పరిచయాలున్నాయి.
కస్తూరి మురళీకృష్ణ గారు ఎంపిక చేసుకున్న నవలలన్నీ ఆయా రచయితల జీవితంలో అనుభవించిన లేదా చూసిన ఘటనలను ఆధారంగా వెలువడినవి కావడం గమనించదగ్గ విషయం. ఈ నవలలన్నీ ఆయా రచయితల 'జీవిత చరిత్రలు'గా మనం అనుకోవచ్చు. రచనా శైలిలోనూ, సంవిధానంలోను, సన్నివేశ కల్పనలోనూ, సాహితీ సృజనలోనూ వివిధ దేశాల రచయితల ప్రతిభను ఈ పుస్తకం మనకు చూపెడుతుంది. ఆ రచనలు వెలువడిన కాలంలో కొన్ని రచనలకు తగిన గుర్తింపు రాకపోయినా తర్వాతి కాలంలో వాటిని 'క్లాసిక్'గా గుర్తించబడిన తీరు చూస్తే మంచి రచనలకు ఎప్పటికైనా ప్రశస్తి లభిస్తుందని తేలిపోతుంది. ప్రపంచ నవలా సాహిత్యాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేసి వారికి ఒక విశాల దృక్పథాన్ని చుపిస్తున్న కస్తూరి మురళీకృష్ణ నిజంగా అభినందనీయులు.
ఈవారం జనవార్త మార్చి 15-21,2009 లో ప్రచురితం

15, మార్చి 2009, ఆదివారం

వానరాయుడి పాట

వేంపల్లి గంగాధర్ వ్రాసిన కథ 'వానరాయుడి పాట' నా కథాజగత్ బ్లాగులో చదవండి.ఈ కథపై మీ అభిప్రాయం చెప్పండి.

1, మార్చి 2009, ఆదివారం

పుస్తక సమీక్ష! - 5 కోటలో నారాజు

గ్రంథావలోకనమ్ నుండి
[కోటలో నారాజు(చారిత్రక నవల) రచన: శ్రీమతి సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి ప్రతులకు: ఓగేటి పబ్లికేషన్స్,3-6-470,ఫ్లాట్ నెం.103,పావని సత్యా కాంప్లెక్స్,రోడ్‌నెం.6,హిమాయత్ నగర్ హైదరాబాద్ 500 029 పేజీలు:150 వెల:రూ.100/-]
పుస్తకాలు చదవడమే గగనమైన ఈ కాలంలో చారిత్రక నవలలు చదివే వారు వుంటారా? అనే అనుమానం కలగడం సహజం. దీనిని నివృత్తి చేస్తూ సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి గారి కలం నుండి ఒక మంచి నవల కోటలో నారాజు వెలువడింది. ఆద్యంతమూ ఆసక్తిగా చదివించే గుణం కలిగిన ఈ నవల కాకతీయుల చరిత్ర ప్రత్యేకించి ప్రతాపరుద్రుని చరిత్ర నేపథ్యంగా సాగుతుంది.
కాకతీయుల చరిత్ర పట్ల శ్రీమతి ఇందిరాదేవి గారికి ఒక ప్రత్యేకమైన అభిమానం వున్నది. కాకతీయ శాసనాలపై వీరు సుధీర్ఘమైన పరిశోధన గావించారు. వీరు ఇదివరకే కాకతీయ వైభవం అనే రుపకాన్నీ, ఆనంద ధార అనే నవలనూ రచించారు. ప్రస్తుత నవల కాకతీయుల చరిత్రపై వీరికి కల అభిరుచిని ఇనుమడింప జేస్తున్నది.
కాకతీయ ప్రభువు గణపతిదేవ చక్రవర్తి మరణించాక అతని పుత్రిక రుద్రమదేవికి పట్టాభిషేకం చేయ నిశ్చయిస్తారు మహామాత్యుడు శివదేవయ్య, తిక్కన సోమయాజి. ఐతే ఏకశిలానగరంలో నెలకొన్న వ్యతిరేకత దృష్ట్యా కృష్ణాతీరం వెలంగపూడి అగ్రహారం వద్ద రుద్రమదేవి పట్టాభిషేకం అంగరంగవైభవంగా జరుగుతుంది. మగసంతానం లేని కారణంగా ప్రతాపరుద్రుడిని దత్తత చేసుకొని అతడికి రాచరికపు విద్యలలో శిక్షణనిప్పిస్తుంది. ప్రతాపరుద్రుడికి యుక్త వయసు రాగానే విశాలాక్షి అనే కన్యనిచ్చి వివాహం చేస్తుంది. వెనువెంటనే యువరాజ పట్టాభిషేకం కూడా జరిపిస్తుంది రుద్రమదేవి. ఆ పట్టాభిషేక మహోత్సవంలో మాచలదేవి అనే నర్తకి నాట్య ప్రదర్శనను చూసి ఆమెను మోహించి రాజనర్తకిగా నియమిస్తాడు ప్రతాపరుద్రుడు. అంబదేవ మహారాజుపై యుద్ధానికి వెళ్లుతుంది రుద్రమదేవి. మోసంతో రుద్రమదేవిని మట్టు పెడతాడు అంబదేవుడు. రుద్రమదేవి మరణంతో ఓరుగల్లు సామ్రాజ్యం శోకతప్తమౌతుంది. అంబదేవుడిపై ప్రతాపరుద్రుడు దండెత్తి అతడిని సంహరిస్తాడు. ఆ తరువాత ఢిల్లీ సైన్యాన్ని గోదావరీతీరంలో ఎదిరించి ఓడిస్తాడు. ఢిల్లీ సుల్తాను అల్లావుద్దీన్ ఖిల్జీ ఓడిపోయి వూరుకోలేదు. మళ్ళీ ఆరేళ్ళ తర్వాత ఓరుగల్లు మీదికి సైన్యాన్ని పంపిస్తాడు. ఆ తురుష్క సైన్యం నెలరోజులు ముట్టడించి కొందరు ద్రోహులను ప్రలోభపెట్టి కోటలోనికి ఆహార పదార్థాలను ప్రవేశించకుండా చేస్తుంది. విధి వక్రించి చివరకు ప్రతాపరుద్రుడు ఢిల్లీ సైన్యానికి లొంగిపోతాడు. ఇదీ స్థూలంగా ఈ నవలలోని కథ.
ఐతే ఈ కథాంశాన్ని తెలియజేయడానికి రచయిత్రి కొన్ని కల్పిత పాత్రలను సృష్టించారు. లాస్య అనే యువతి తన మిత్రబృందంతో వరంగల్లుకు పిక్నిక్‌కు వెళుతుంది. ఓరుగల్లు విజయ తోరణాలను దర్శిస్తుంది. అక్కడ నుండి ఆమె వింతగా ప్రవర్తించడం మొదలౌతుంది. తనను మాచల్దేవిగా ఊహించుకుంటుంది. తన చుట్టూ ఉన్నవారిని విద్యానాథ కవిగా, మేచయ నాయకునిగా, జాయప సేనానిగా ఇలా సంబోధిస్తూ ఉంటుంది. లాస్య ప్రవర్తనకు వారి ఇంట్లోని వారు చింతిస్తారు. ఆమెను మామూలు మనిషిగా మార్చడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేస్తారు. చివరకు లాస్య వంశీ అనే అతన్ని పెళ్ళి చేసుకొనడంతో కథ సుఖాంతమవుతుంది.
కథ ఎక్కడా విసుగు కలగకుండా రచయిత్రి ఎంతో సమర్థవంతంగా వ్రాశారు. పాల్కురికి, రాయప్రోలు, పుట్టపర్తి, మధునాపంతుల తదితర కవుల కవిత్వాన్ని సందర్భానుసారంగా 'కోట్' చేయడం బాగుంది. కాకతళీయంగానో, లేక కాకతీయంగానో లాస్యను పెళ్ళి చేసుకొనే వంశీ కూడా తనను తాను ప్రతాపరుద్రుడిగా భ్రమించడం దీనిలో కొసమెరుపు.
(నేటినిజం, అక్టోబరు2007)