...

...

28, ఫిబ్రవరి 2011, సోమవారం

మానవ ప్రయాణంపై ఒక సమీక్ష!

మానవ ప్రయాణం - కథాజగత్ పోటీ         
         
         ఈ కథ చదవాలంటే మీరు ఇక్కడ చదవొచ్చు.

         వారణాసి నాగలక్ష్మిగారి  ఈ కథ నాకు ఎందుకు నచ్చిందంటే అన్ని రకాలుగానూ సుఖంగా వున్నా కూడా మానవుడికి ఇంకా ఈ అసంతృప్తి ఎందుకనుకుంటూ దానిని మానవుల జీవన విధాన పరిణామక్రియకి అనుసంధానించి కథ చెప్పడమనేది అంత తేలికైన విషయం కాదు. అందుకే నాకు నచ్చింది. 
            

            జీవన్మరణాలనేవి మానవ జీవితం లో్ జరిగేవే. పుట్టాక మనిషి ఎలా జీవించాడో, జీవిస్తున్నాడో మనకి తెలుస్తుంది. భౌతికంగా కనిపిస్తుంది. కాని మరణానికి చేరువయిన మనిషి అంతరంగాన్ని శతాబ్దాలుగా మానవ జీవనవిధాన పరిణామదశతో పోల్చి చెప్పడమన్నది మామూలు విషయం కాదు. అక్కడే కథ మొదలౌతుంది.
            
                మనిషి ఆటవిక దశ నుండి, పరిపాలనాధికారం కోసం యుధ్ధాలు చేసే కాలం దాటి, బానిసత్వ శృంఖలాల నుండి బయటపడేందుకు స్వతంత్ర పోరాటం సాగించే అధ్యాయం ముగించుకుని, స్వతంత్ర భారత దేశంలో రైతుల ఆత్మహత్యల పర్వం దాటి, సాంకేతిక విద్యని సమర్ధవంతంగా వుపయోగించుకుంటూ, తన చుట్టూ వాతావరణాన్ని తనకు అనుకూలంగా మార్చుకోగలిగే నవ నాగరిక సమాజం వరకూ సాగించిన ప్రయాణం ఈ కథలో చెప్పబడింది.
             
                 నవనాగరిక సమాజం ఏర్పడ్డాక , ఈ కథలో ప్రధానపాత్ర అయిన "మానవ్" తను విలాసంగా బ్రతకడానికి అన్ని హంగులూ అమర్చుకుని కూడా, దానితో తృప్తి పడలేక ఇంకా ఏదో చేసెయ్యాలనే తపనతో చేసిన పనే "బంగీ జంపింగ్". దీనినే "థ్రిల్" అంటుంటారు కొంతమంది. ఇది ప్రమాదకరమని తెలిసికూడా ప్రమాదం అంచులకి వెళ్ళినప్పుడు ఎలా వుంటుందో ననే ఒకరకమైన థ్రిల్ కోసం చేసిన సాహసం. ఆ సమయంలో అతను మరణం అంచులను స్పృశించినప్పుడు కలిగే భావాల మాలికే ఈ కథ.            

                   ఒకప్పుడు కడుపు కింత తిండి, అది దొరికాక ఎండావానలకు రక్షణగా బట్ట, అదీ దొరికాక స్థిరనివాసాలు ఏర్పరచుకోవడంలో వుండడానికో ఇల్లూ ఇలాంటివన్నీ ప్రాధమికావసరాలు. రోజులు గడిచేలొద్దీ ఆ తిండిలోనే రకరకాల రుచులు, కట్టుకునే బట్టలోనే వివిధరీతులు, ఆఖరికి నివసించే ఇల్లు కూడా రూపాలు మారడమే కాదు దాని భావాలు కూడా మారిపోతూ వచ్చింది.
           
                 ప్రకృతికి అనుగుణంగా మెలగవలసిన ఈ పాంచభౌతిక శరీరం కోసం ప్రకృతి లోని వనరు లన్నింటినీ పీల్చి పిప్పిచేసి కృత్రిమంగా తన విలాసాల కోసం వినియోగించుకుంటున్న ఈ నవ నాగరిక మానవుడు ఇంకా ఏదో కావాలనీ, ఇంకా ఏదో సాధించాలనీ తహతహలాడిపోతున్నాడు. దేనికోసం అతని తపన? ఇంకా ఏమి సాధించాలని అతని ఆతృత? మరి మనిషికి ఇంక తృప్తి అంటూ వుండదా..
                
                     అన్నీ అనుభవిస్తూకూడా ఇంకా ఏదో కావాలనుకుంటూ తృప్తి లేకుండా పరుగులు పెట్టే ఈ మనిషి అసలైన తృప్తి ఎక్కడుందో తెలుసుకుందుకు ఎఫ్ఫుడైనా ప్రయత్నించాడా? నిజంగా చెప్పాలంటే మనిషికి తృప్తి అన్నది బైట ఎక్కడో లేదనీ, అతని లోకి అతను చూసుకుంటే అతనిలోనే వుందనీ తెలుస్తుంది. మనిషి అంతర్ముఖుడైతే కలిగే ఆత్మతృప్తి మరింక ఎక్కడా కనపడదు. అసలైన ఆ విషయం తెలీక మానవుడు అంతరిక్షానికి ప్రయాణించగలిగి కూడా ఇంకా ఏదో తెలీని తపనతో కొట్టుకుపోతున్నాడు. మనిషి తనలోకి తను చూసుకోకపోవడం వల్లే ఈ తపనంతా.
         
                 చివరలో మానవ్ అవిశ్రాంత ప్రయాణం మళ్ళీ మొదలయ్యింది అనే మాటతో ముగిసిన ఈ కథ చరిత్ర పునరావృత మవుతుందన్న సత్యాన్ని మరోసారి చెప్పినట్టయింది.   
- శ్రీలలిత 

(సౌజన్యం:శ్రీలలిత)

27, ఫిబ్రవరి 2011, ఆదివారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 39


ఆధారాలు:
1.  సన్నాజాజి కి గున్నా మావికి  మల్లెమాల పెళ్ళికుదిర్చింది ఈ సినిమాలోనే! (3,3)
3. టీ.వీ సీరియళ్ళకు దీన్ని మించిన పోలిక లేదు!(4)
5. ఇ.వి.వి, నరేష్‌ల కాంబినేషన్‌లో 1992లో వచ్చిన సినిమా!(7)
7. పెండ్లాము(3)
9. ఆవు ఒక __ ____.(2,3) 
10. తుహినశైలం.(5)
11. మొసలి కుడి నుండి ఎడమకు!(3)
14. రివర్సులో కాన్స్టిట్యూయన్సీ (4,3)
15. ఆడిదము సూరనకుగల టైటిల్!(4)
16. చంద్రమోహన్, సిద్ధార్థ ఇద్దరూ హీరోలుగా నటించిన వేర్వేరు సినిమాలు పేరు ఒక్కటే!(3,3)
నిలువు:
1. ముక్కోతి కొమ్మచ్చిని మనకు అందివ్వకుండానే జనతా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్ళిపోయిన రచయిత.(4)
2. గీతాసింగ్, అల్లరి నరేష్‌లు నటించిన వెకిలి సినిమా.(5)
4. తోడా లివ లేవో, గుడి
    ఘోడాయే నివ్వలేవొ కొమరుగ దలపన్
    బోడెమ్మ చాకలివలె
    బేడా యిచ్చెదవు దూడ పేడా అరయన్
 
పై పద్యం పానుగంటివారి ఈ ప్రహసనంలోనిది(6)
5. జంజం అంటూ చేసుకునే పెళ్ళి(7)
6. భాజపా దృష్టిలో ప్రత్యేకంగా అద్వానీ దృష్టిలో మన్మోహన్ సింగ్ ఒక ____ ___.(4,3)
7. క్వార్టరు RUM కొట్టిన కపోతం.(3)
8. పట్టపురాణి శీర్షాసనం వేసింది.(3)
9. సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి ద్వైమాసపత్రిక(3,3)
12. దయచూపు(5)
13. కర్ణాటకలోని అన్నపూర్ణేశ్వరీ దేవి వెలసిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం(4)

25, ఫిబ్రవరి 2011, శుక్రవారం

కథను వ్రాయండి!

తెలుగుకథలకు అంతర్జాలంలో ప్రాచుర్యం కల్పించే లక్ష్యంతో ముందుకు సాగుతున్న కథాజగత్ మీ రచనా సామర్థ్యాన్ని పరీక్షించే చర్యకు పూనుకొంటున్నది. దీన్ని ఒక సవాలుగా తీసుకుని ఈ క్రింది నియమాలను పాటిస్తూ ఒక చక్కని కథను వ్రాసి పంపండి.

1. మొదటగా మీరు చేయాల్సింది శ్రీ పి.వి.బి.శ్రీరామమూర్తి గారి కథ పరిధి దాటిన వేళ చదవండి.

2.ఈ కథలో రచయిత వర్ధనమ్మ అనే పాత్ర పరంగా కథను నడిపించారు కదా. మీరు చేయాల్సిందల్లా ఇదే ఇతివృత్తాన్ని తీసుకుని వర్ధనమ్మ భర్త దృష్టితో ఆలోచించి ఆ కోణంలో కథను మీదైన శైలిలో తిరగవ్రాయండి.

3. మీకథను యూనికోడ్‌లో వ్రాసి mmkodihalli@gmail.com కు 12 మార్చి 2011 లోగా మెయిల్ చేయాలి.

4. గడువులోగా వచ్చిన కథలలో బాగా నచ్చిన కథ(ల)ను ఎంచుకుని కథాజగత్ లేదా తురుపుముక్కలో ప్రచురిస్తాము.

5. కథాజగత్ లేదా తురుపుముక్కలో మీ కథను ప్రకటించడమే మేము ఇవ్వబోయే గొప్ప బహుమతి.

6. కథ(ల) ఎంపికలో తుది నిర్ణయం మాదే.

7. మీరు పంపబోయే కథలను మీమీ బ్లాగుల్లో కానీ లేదా ఎక్కడైనా పత్రికల్లో గానీ నిరభ్యంతరంగా ప్రచురించుకోవచ్చు. అయితే ఫలితాలు ప్రకటించే వరకూ ప్రచురించకుండా ఉంటే బాగుంటుంది. 

ఇంకెందుకు ఆలస్యం? మీ బుఱ్ఱకు పని పెట్టండి.         

23, ఫిబ్రవరి 2011, బుధవారం

వాస్తవిక జీవితంలో ఎదురైన సంఘటనలే...

ఒఖ్ఖ రెండు రూపాయలు.. రచన. జి.ఎస్.లక్ష్మి .

పిల్లలు , వృద్ధులు ఒకే విధమైన మనస్తత్వం కలవారు. వారిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటారు. పిల్లలను చిన్నప్పటినుండి గారాబంగా పెంచి పెద్ద చేయడం, చదువులు ఇలా ఇవే తమ లక్ష్యంగా తల్లితండ్రులు ఉంటారు. తమ కోరికలకంటే పిల్లల కోరికలు ముందు తీర్చాలని అనుకుంటారు. క్రమంలో తమ ఆశయాలు , ఆశలను కూడా వదులుకుంటారు. అలాగే తమ తల్లితండ్రులను కూడా ఒక బాధ్యతగా తీసుకుంటారు. ఇది ఒకప్పటి తరం మాట అనుకోండి. కాని ఈనాడు ఉమ్మడి కుటుంబం సంగతి పక్కన పెడితే అసలు తల్లితండ్రులు కూడా భారమైపోతున్నారు కొందరు పుత్ర రత్నాలకు. తమపిల్లలతోనే సతమతమవుతూ తల్లితండ్రుల గురించి శ్రద్ధ తీసుకునే, ఆలోచించే సమయం, ఓపిక వారికి ఉండడం లేదు. ఒకోసారి తల్లితండ్రులు ఇంటిలోని వారికి అడ్డంకిగా కూడా కనిపిస్తారు. వాళ్ళ మాటలు రుచించవు. చాదస్తం అని కొట్టి పడేస్తారు. వీళ్ళ మాటలేంటి వినేది? మాకు తెలీదా ? అని హుంకరిస్తారు.


ఉద్యోగాలు చేసినంత కాలమ్ ఒకరికి లొంగకుండా తమ పిల్లలను దర్జాగా పెంచిన తల్లితండ్రులు రిటైరయ్యాక అదే కొడుకుల దగ్గర నిస్సహాయంగా ఉండవలసి వస్తుంది. పెత్తనం ఉండదు. వాళ్లకు భోజనం మాత్రమే అవసరం . అప్పుడప్పుడు మందులు .. అది తప్ప ముసలివాళ్ళకు ఇంకేం కావాలి అనుకుంటారు కొడుకు,కోడలు.. రిటైరైనంత మాత్రాన, సంపాదించనంత మాత్రాన వాళ్లకు ఆశలు,కోరికలు ఉండకూడదా. శారీరకంగా శక్తి ఉన్నంతవరకు కష్టపడుతూనే ఉంటారు. అపుడు తమకు కోరినవి కొనుక్కుంటారు. తింటారు. పిల్లలు సెటిల్ అయ్యి, రిటైరయ్యాక తీరిగ్గా ఉండడం మూలాన పెద్దవాళ్ళకు ఏవో కోరికలు ఉంటాయి. అవి ఎక్కువగా తిండి వస్తువులు, పుస్తకాలు, సినిమాలు, పూజలు గట్రా అయ్యుండొచ్చు. కాని వాటికి డబ్బులు కావాలిగా. ఉన్నదంతా కొడుకులకు ఊడ్చిపెడితే , చివరకు కొడుకు కోడలు దయాదాక్షిణ్యాల మీద బ్రతకాల్సి వస్తుంది. ముందే జాగ్రత్త పడి డబ్బు దాచుకుంటే వారి అవసరాలకు పనికొస్తుంది. ఒక్కోసారి ఇలా చేసిన చిక్కే . ముసలోళ్ళు ఎంత సొమ్ము దాచిపెట్టుకున్నారో ఏమో? కొడుకులకు, మనవళ్ళు , మనవరాళ్లకు ఇవ్వకుంటే ఎలా అని గొడవ మొదలవుతుంది. దాచుకుని పోయేటప్పుడు కట్టుకుపోతారా? అని పీక్కుతినేవాళ్ళు ఉన్నారు. అలాగే సొమ్ము కోసం కాట్ల కుక్కల్లా కొట్టుకునే సోదరీ , సోదరులు ఉన్నారు.

వాళ్ళ సొమ్ముకు ఆశపడ్డమే కాని అయ్యో వాళ్లకు ఏదైనా తినాలనిపిస్తుంది. వాళ్లకు ఇష్టమైనవి కొనుక్కోవాలనుకుంటారు. లేదా ఖర్చు పెట్టాలను కుంటారు అని కొంత సొమ్ము ఇద్దాము అని అనుకునే వాళ్ళు ఎందరు? పెన్షన్ గట్రా వస్తుంటే ఇంట్లోకే అవసరమోస్తుంది అని లాక్కోవడం తప్ప. పెళ్ళాం మాటలు విని తల్లిని గెంటేసి ఒంటరిని చేసిన కొడుకు , అదే తల్లి కాయకష్టం చేసి సంపాదిస్తుంటే తన భార్యతో కలిసి ఆమె సంపాదించిన డబ్బులు కూడా ప్రతి నెల తీసుకుంటాడు. బ్రతకడానికి తల్లికి ఇంత తిండి ఉంటే చాలు అని అనుకుంటారు. ఏమో! తామూ తల్లితండ్రులమవుతాము. ముసలివాళ్ళమూ అవుతాము. అపుడు తమకు పరిస్థితి రాదా? అన్న ఆలోచన రాదు. ఒకవేళ వచ్చినా భవిష్యత్తు ఎవరు చూడొచ్చారు? మా పిల్లలు బంగారం. అలా చేయరు అని అనుకుంటారు.

అందుకే పిల్లల్లారా!!! వృద్ధులైన తల్లితండ్రులను ఒక నిరుపయోగ వస్తువులా భావించకండి. వాళ్ళకూ ఎన్నో కోరికలు, ఖర్చులూ ఉంటాయి. అందుకు సొమ్ము అవసరమవుతుంది. లోటు రాకుండా చేయండి. ఎందుకు చేయాలని అన్న ఆలోచన వస్తే మిమ్మల్ని పెంచడానికి పెట్టడానికి పెట్టిన సొమ్ము తిరిగి ఇస్తున్నాం అను కొండి. మీకు మీరు కన్నవాళ్ళు అంటే ఎంత ప్రేమ , ఆప్యాయతో, మిమ్మల్ని కన్నవాళ్ళు కూడా అలాగే అని అపురూపంగా చూసుకోండి.

లక్ష్మిగారి కథను చదివిన తర్వాత నా అనుభవాలను , అభిప్రాయాన్ని చెప్తున్నాను. కథలో చెప్పిన పరిస్థితులన్నీ కళ్ళారా చూసినవే .. ఒకసారి కాదు ఎన్నోసార్లు. పిల్లలను మార్చలేకున్నా తల్లితండ్రులను జాగ్రత్తగా ఉండమని చెప్తుంటాను. ఆస్ధిపాస్తులన్నీ పిల్లలకోసం ధారాదత్తం చేయకండి. మీ భవిష్యత్తు గురించి మీరే జాగ్రత్త పడండి. వయసు మీరినంత మాత్రాన ఒకరి మీద ఆధారపడవలసిన పని లేదు అని. మా పిల్లలకు కూడా చెప్తాను. మా గురించి మీరేమి బెంగ పడొద్దు. మీ జీవితం, మీ భవిష్యత్తు గురించి ఆలోచించండి. మీరు మా మీద ఆధారపడొద్దు. మేము మీ మీద ఆధారపడొద్దు అని..(సౌజన్యం : జ్యోతి)   

22, ఫిబ్రవరి 2011, మంగళవారం

ఏకాంతంతో చివరిదాకా

కథాజగత్ లోని కథల విశ్లేషణపై తురుఫుముక్క బ్లాగువారు పెట్టిన పోటీ లో విశ్లేషించటానికి నేను ఎంపిక చేసుకున్న కథ  ఏకాంతంతో చివరిదాకా  -అరుణ పప్పు గారిది.  ఇదే ఎంపిక చేసుకోవటానికి ముఖ్య కారణం చూడగానే ఆకర్షించిన కథ పేరు.  ఆ పేరు ఎందుకు పెట్టారా అని కథ చదివాను.  రెండవ ఆకర్షణ రచయిత్రి  పేరు.  తెలుగు బ్లాగు లోకానికి సుపరిచితమైన జర్నలిస్టు.  ఏం రాశారో చదవాలనే కుతూహలంతో చదివాను.

అబ్బాయి, అమ్మాయి రొటీన్ ప్రేమ కథలు కోరుకునేవారికి నచ్చకపోవచ్చీ కథ.  అనుబంధం, ఆత్మీయత అంతా ఒక నాటకం అనుకునేవారికి ట్రాష్ గా అనిపించవచ్చు.  మనసున మనసై అని పాడుకునేవారికి ఇష్టంగా అనిపించవచ్చు.  లోకోభిన్న రుచికదా.

అస్తిత్వంలో వున్న సాంఘిక, నైతిక సరిహద్దులు తనకు తానే సృష్టించు కున్నవన్న సంపూర్ణమైన అవగాహన గలిగినవాడు... వాటిని అధిగమించటానికి సంశయించని వాడు... కళాకారుడైనప్పుడు.... వాడు సంఘంలో ప్రస్ఫుటమైన అరాచకుడిగా కనపడ్డం చాలా చాలా సహజం.  ఉన్నతమైన భావ చిత్రీకరణకు అద్దం ఈ వాక్యం.  అంతరంగంలో ఎంత మధన జరిగివుంటే ఇలాంటి వాక్యాలు బయటకొస్తాయి.  అలాగే రచయిత్రి కళాకారుడి అరాచకత్వానికిచ్చిన అద్భుత నిర్వచనం ఈ కధని ఉన్నత స్ధానంలో నిలబెడుతుంది. 

మనిషి మనసుని చేతనపరిచేది ఆత్మీయుల చిన్ని ప్రోత్సాహాలు.  అలాంటి ప్రోత్సాహాలని, వాటిద్వారా పొందిన చేతనత్వాన్నీ అందంగా మలచారు కథలో...బొబ్బిలి వీణ దుమ్మయినా దులపాలనిపించటం, కార్టూన్లని కాపీ చెయ్యటం మానేశాననటంద్వారా.

మనుషులు వున్నప్పుడు ప్రేమించాలి, వాళ్ళకోసం చెయ్యాల్సిందేమైనా వుంటే బతికున్నప్పుడే చెయ్యాలి ... తనకి తోచిన మంచిని నిర్భయంగా చెప్పారు రచయిత్రి.  అంత సీరియస్ సంభాషణలో  కాళ్ళొకసారి ఫోన్లో పెట్టమ్మా దండం పెట్టుకుంటా...  రచయిత్రి హాస్య చతురతకి నిదర్శనం.

మధ్యలో అంతరాత్మ మందలింపులతో తరచి చూసుకునే వివేకం.... ఘనీభవించిన మౌనంలో కూడా దొరికే సమాధానాల గురించి చెప్పిన నేర్పు బాగుంది.

అలాగే ఒక మహాద్భుత అనుభవానికి సంబంధించిన జ్ఞాపకాన్ని బుధ్ధితో బేరీజు వేసుకుని తుడిపేసేంత వెర్రితనం నాకు లేదు మరి......ఉన్నతమైన భావ వ్యక్తీకరణ, చక్కని రచనా శైలి, కథలో అంతర్లీనంగా సాగే మానవత్వ, మమతల విలువలు, అర్ధం చేసుకుంటూ చదవాల్సిన కథ ఇది.  అర్ధమయితే మరచి పోలేని కధ... వెరసి ఒక ఉత్తమ కథ.

కథాజగత్తులోని శ్రీమతి అరుణ పప్పుగారి ఈ ఏకాంతంతో చివరిదాకా మీరు కూడా కొంచెం రుచి చూడండి.  లింకు ఇదుగో.....
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/ekantanto-civaridaka---aruna-pappu
- పి.ఎస్.ఎం.లక్ష్మి

(సౌజన్యం: అంతరంగ తరంగాలు) 

21, ఫిబ్రవరి 2011, సోమవారం

అంతర్ముఖం - కథావిశ్లేషణ


అంతర్ముఖం..రచన:అడపా చిరంజీవి 

జీవితం ఒక వరం,ఒక బహుమతి,ఒక అనుభూతి.ఇలాంటి ఎన్నో విశేషణాలకు ఆధారం జీవితం.జీవించడం తెలిసినవారికి జీవితమొక మురళీనాదం,వీణాగానం.జీవించడంలో లయ ఉండాలి.జీవితాన్ని శృతి చేయడమెలాగో తెలియాలి.లయబద్ధమైన,శృతిపక్వమైన జీవితం జీవన వేదమే!

మరయితే జీవితం అందరికీ వరమేనా?కాదు..జీవితం మాకు వరం కాదు, మాకు జీవితమొక శాపం అంటారు మరి కొందరు.అందుకే జీవితానికి చరమగీతం పాడాలనుకుంటారు. మనిషి అస్తిత్వానికి జీవించడమే మార్గం. ఎన్నో జన్మలక్కరలేదు ఒక్కసారి మాత్రమే జీవించగలిగే జీవితాన్ని సరియైన పంథాలో జీవిస్తే చాలు.

చేతకానితనం, అశక్తత, భయం, విరక్తి, విసుగు - ఇవన్నీ సంఘర్షణకు కారణాలే. సమస్యలను పరిష్కరించుకోలేక, సంఘర్షణకు తలవంచిన ఓ వ్యక్తి జీవితం చివరికెలాంటిమలుపు తిరిగిందో విశ్లేషణాభరితంగా చెప్పే కథే అడపా చిరంజీవి రచించిన అంతర్ముఖం.

సాధారణంగా మరణవేదన సహజమరణాలలో లేదా ప్రమాదాలలో మరణించేవారికి అనుభవైకవేద్యం.కాని ఇక్కడ మరణించేందుకు ఏ పద్ధతిని ఎంచుకోవాలో తెలియక మరణవేదనకు గురవుతాడు ఒక వ్యక్తి.చివరకు శిఖరాగ్రమే తనను క్రిందకు తోసి పైకి పంపగల చక్కటి మార్గం అనుకుని ఆచరణ దిశగా అడుగులు కదపాలనుకుంటాడు.

సరిగ్గా ఆ క్షణం అతడి భుజంపై పడ్డ చెయ్యి, ఆవ్యక్తిని ఆ దుష్ట క్షణానికి దూరంచేస్తుంది. అయ్యో!ఆత్మహత్యలతో అమాయకంగా ప్రాణాలు పోగొట్టుకున్న అభాగ్యులకు ఇలాంటి చెయ్యి దొరకివుంటే, అనుకున్నప్పుడు మనసులు కలుక్కుమనక మానవు.ఆ చెయ్యినందించిన ఋషివర్యుడు తనతోపాటు ఆ వ్యక్తిని తన ఆశ్రమానికి తీసుకుని వెళ్లి తన శిష్యులద్వారా అతనికి భోజనం, వ్యాహ్యాళి,పడక ఏర్పాటు చేస్తాడు. అక్కడ లభించిన ప్రశాంతత అతడిలో మరణించాలనే నిరాశను దూరంచేసి బతకాలనే ఆశను కల్పిస్తుంది.అసలు కథ ఇక్కడ మొదలవుతుంది. ఋషి సంధించిన ప్రశ్నావళి అతడిలో ఆలోచనలను కదుపుతుంది. అతడికి జీవితంపై ఆశ ఎందుకు తగ్గిందో తెలుసుకోవాలనుకుంటాడు ఋషి. ఆర్థిక ఇబ్బందులే తనను ఆవేదనకు గురి చేస్తున్నాయంటాడు ఆవ్యక్తి.

మరి అతని జీతంపై ఆధారపడ్డ ఇంటి యజమాని, బియ్యం, సరకులను అమ్మే వ్యాపారి, క్షురకుడు, రవాణా సౌకర్యాన్ని అందించే ప్రభుత్వము---ఇలా ఆధారపడ్డవారు ఆవ్యక్తి మరణంతో ఎంత నష్టపోతారో వివరిస్తాడు ఋషి. కోరుకున్నవేవి అందుబాటులోకి రావనే బెంగ ఆవ్యక్తిని తొలుస్తూనే వుంటుంది. చివరికతడు ఋషి మాటలలోని ఆంతర్యాన్ని గ్రహించి తన అసంగత ధోరణిని విడనాడడం ఆశావహమార్పు. కథలోని కీలకాంశం ఇదే!ఏ మనిషి ఆత్మహత్య చేసుకోకూడదు.

మనిషికి కావలసిన కనీసవసరాలు తిండి, బట్ట, నీడ. ఇవికాక కోరి కావాలనుకున్న అవసరాలు మనిషిని వక్రమార్గాన ఆలోచింప చేస్తాయి. మంచి మార్కులు రాలేదని,ఉద్యోగాలు పోయాయని, జీతం చాలదని, ఈ జీవించే జీవితం బాగాలేదని ఇలాంటి వక్రపుటాలోచనలతో జీవితాన్ని మరణానికి ఎరగా వెయ్యడం మనిషి ఆలోచనాశూన్యతను తెలియచేస్తుంది. కోరికలే బాధకు, ఆవేదనకు,సంఘర్షణకు మూలకారణం. చివరికి తీరని కోరికలే మరణ మృదంగాలుగా మారి దుర్బల హృదయులను ఆత్మహత్యలకు ప్రేరేపించి ఆత్మీయులకు తీరని శోకానికి గురిచేస్తున్నాయి. జీవితంలో ఒక్కసారే జీవించగలిగే మానవ జన్మ చరితార్థంకావాలి అనే నిజాన్ని ఈ కథ చక్కగా ఉద్భోదించింది. అసలీకథ బలహీన మనస్కులకు పాఠ్యాంశం కావాలి. వారి జీవితాలను శృతిచేయగల జీవన కృతి అనదగ్గ కథ అంతర్ముఖం.  

- C.ఉమాదేవి 

 

20, ఫిబ్రవరి 2011, ఆదివారం

అబ్బూరి ఛాయాదేవి గారి కథ భారంపై శ్రీలలితగారి సమీక్ష!

          ఈ కథ వాస్తవాన్ని అద్దం లా చూపించిన కథ కనుక నాకు చాలా నచ్చింది.

           పెద్దవారయిపోయి, రిటైరయిన తల్లితండ్రులు వాళ్ళిద్దరే ఒకరికి ఒకరు ఆసరాగా వుంటున్న రోజులివి. పిల్లల వుద్యోగ బాధ్యతల గురించి అర్ధం చేసుకున్న తల్లితండ్రులు వారినుంచి ఎటువంటి సహకారమూ ఆశించకుండా, వారికి భారమవకుండా శేషజీవితాన్ని గడుపుతున్న రోజులివి. కాని ఎంత సర్దు కుందామని ప్రయత్నించినా ఒక్కొక్క బలహీనమైన క్షణం లో తమ తమ పిల్లల దగ్గరినుంచి సాయం అందక పోయినా కనీసం మాటల్లో నైనా ఓదార్పు కనపడితే చూడాలను కోవడం కూడా అత్యాశ గానే అయిపోయింది.

          అలా ఆశించిన ఒక తల్లే అవని. తనూ, భార్యా, పిల్లలు మాత్రమే తన కుటుంబం అనుకునే ఈ రోజుల్లో భార్య తల్లితండ్రుల యోగ క్షేమాలను ఎవరు కనుక్కుంటారు. కాని ఒక్కగానొక్క కూతురిని అపురూపంగా పెంచి, ఒక అయ్య చేతిలో పెట్టి, "అల్లుడివైనా కొడుకువైనా నీవే బాబూ" అంటున్న అత్తామామల మీద ఏమాత్రం అభిమానం చూపించని అల్లుడు, తన కాపురం నిలబెట్టుకుందుకు(అవకాశవాది లాగ) భర్త మాట జవదాటని కూతురూ, ఆప్యాయంగా చేరదీద్దామనుకుంటున్న మనవడిని కూడా దగ్గరికి చేరనీయక పోవడం వలన వచ్చిన బాధా... ఇవన్నీ అవనిని బాధ పెడుతూంటాయి.

         అసలు ఒకరు మనల్ని చూడాలనీ, మన తదనంతరం ఆస్తి వాళ్లకే వెడుతుంది కనుక అప్పుడప్పుడయినా తమ బాగోగులు వాళ్ళు కనుక్కుంటూ వుండాలనీ ఆశించడం తప్పు. బ్రతికున్నప్పుడయినా సరే, తర్వాతయినా సరే మనం మరొకరికి భారం కాకూడదు. అవని కూడా అలాగే తన కూతురికి భారం కావాలనుకోలేదు. కూతురు నుంచి డబ్బూ ఆశించలెదు, మనిషి సాయమూ ఆశించలేదు. కాని ఒక్క చిన్న ఓదార్పు మాట. "ఫరవాలేదమ్మా, నీకు నే నున్నానమ్మా.." అనే ఒక్క మనసును చల్లబరిచే మాట. దాని కోసం తపించి పోయింది. కాని పాపం ఆమెకి కూతురి నుంచి ఆ మాత్రం ఓదార్పు మాట కూడా రాలేదు.

               కారణం.. అలా పొరపాటున అయినా ఒక్క ఓదార్పు మాటంటే తల్లితండ్రుల భారం తనమీద ఎక్కడ పడిపోతుందోనని కూతురు కుసుమ అనుకోవడం వల్లే అనిపిస్తుంది. చాలా కుటుంబాల లో ఏ విషయం లోనైనా నిర్ణయం తీసుకోవలసింది భర్తే. దానిని అక్షరాలా ఆచరించడం వరకే భార్య బాధ్యత. అదే సంప్రదాయాన్ని అనుసరించింది కుసుమ కూడా. భర్త మాటని కాదని తను చిక్కుల్లో పడదలుచుకోలేదు. సాఫీగా సాగిపోతున్నప్పుడు లేనిపోని కష్టం యెందుకు అనుకుంది. కాని తల్లి పడే మనోవ్యధ అర్ధం చేసుకో లేక పోయింది.

               మన చుట్టూ ఇలాంటివాళ్ళు చాలామంది కనిపిస్తారు. ఏదో మాట్లాడతారు తప్పితే మనసుతో ఆలోచించరు. నిజంగా కనక మనసుతో ఆలోచిస్తే, అమ్మా నాన్న యింటికి వస్తున్నారంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించాలి. కాని స్వంత ఆలోచన అంటూ లేనివారికి, లేకపోతే మనసులో మాట బైటకి చెప్పే అవకాశం లేనివారికి, అదీకాక కుసుమ లాగా భర్త మాటే వేదంగా శిరసా వహించే వాళ్ళకి తల్లితండ్రులు తమ యింటికి వచ్చి యిబ్బంది పెట్టడం యిష్టం వుండక తప్పించుకుంటుంటారు.

          కూతురు తనని కనీసం మనసులో మాట కూడా చెప్పుకోలేనంత పరాయి దానిగా చూడడం అవనికి మరీ బాధగా అనిపిస్తుంది. కూతురితో తనకు వున్న యిలాంటి అనుభవాలన్నీ స్నేహితురాలితో చెప్పుకుని తన మనసులోని భారాన్ని దించుకుంటుంది.

            అదంతా సానుభూతిగా విని, స్నేహితురాలిచ్చిన సలహాకి అమాయకంగా, జాలిగా చూస్తుంది అవని.

           ఈ ఆఖరిమాట చదువుతున్నప్పుడు మనసు కలుక్కుమంటుంది.

           ఈ కథను మీరు ఇక్కడ చదవవచ్చు.
http://www.kathajagat.com/katha-jagattuloki-adugidandi/bharam---abburi-chayadevi

- శ్రీలలిత
(సౌజన్యం - శ్రీ లలిత)

గగనతలంలో సముద్రతీరాన...!

గోవా కోల్వా బీచిలో మేము కాప్చర్ చేసిన ప్యారాసెయిలింగ్ దృశ్యాలు


.