...

...

30, మే 2012, బుధవారం

మంచి పుస్తకం!

దూరదర్శన్ సప్తగిరి ఛానెల్‌లో మే నెల 21వ తేదీ ఉదయం 9.00గంటలకు ప్రసారమైన తెలుగుతోట సాహిత్య సంచికా కార్యక్రమంలో మంచి పుస్తకం శీర్షిక క్రింద శ్రీ గోవిందరాజు రామకృష్ణారావుగారు సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం పుస్తకం గురించి ప్రసంగించారు. ఆ ప్రసంగం తాలూకు విడియో క్లిప్పింగు ఇక్కడ.


20, మే 2012, ఆదివారం

మా బాదం చెట్టు కథపై లాస్య రామకృష్ణ విశ్లేషణ!

              ఆంధ్రపాఠకుల ఆహ్లద రచయిత మల్లాది వేంకట  కృష్ణమూర్తి . పాఠకుల హృదయాలలో ఆయన  స్థానం సుస్థిరం.  . సరళమైన భాష, సుస్పష్టమైన శైలి ఆయన సొంతం.            మల్లాది గారి 'మా బాదం చెట్టు ' కధ నన్ను బాగా ఆకర్షించింది. టైటిల్ చూడగానే నన్ను చిన్ననాటి రోజులకి అక్షరాలనే టైం మెషిన్ తో ఈ కథ  తీసుకెళ్ళిపొయింది. ఉత్తుమపురుష(first person) లో ఈ కథ సాగింది.

     సంక్షిప్తంగా ఈ కథ గురించి చెప్పుకోవాల్సి వస్తే తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంటున్న కథానాయకుడు తన ఇంట్లొనున్న  బాదం చెట్టు విశేషాల గురించి తలచుకుని ఆ మదురానుభూతుల్ని మనతో పంచుకుంటాడు. బాల్యం లొ బాదం చెట్టుతొ అల్లుకుపోయిన తన అనుబంధాన్ని గుర్తుచేస్తు తను వివరించే ప్రతి అంశం ప్రతి ఒక్కరికి బాల్యపు రోజులని  గుర్తుచేస్తుంది.

      కథనం బాదం చెట్టు చుట్టూ తిరిగినా, నిజానికి ఇది మధ్యతరగతి కుటుంబాలలొని  అనుబంధాలని స్ప్రుశిస్తుంది అనడానికి ఈ వాక్యాలే  ఉదాహరణ "మా నాన్నగారు ఆఫీస్ నించి రాగానే దొడ్లో తొట్లోని నీళ్ళతో కాళ్ళు కడుక్కుని, ఓ సారి బాదం చెట్టు దగ్గర ఆగి తన చేతులతో కింది కొమ్మని ముట్టుకునేవారు. అంతదాకా చిరాగ్గా ఉండే మా నాన్నగారిలో చిరాకంతా తక్షణం మాయమయ్యేది. ప్రశాంతంగా, చిరునవ్వుతో ఇంట్లోకి వచ్చేవారు. పిల్లలందర్నీ పలకరించాకే, మా అమ్మ ఇచ్చే కాఫీ గ్లాసుని అందుకునే వారు. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళేటప్పుడు  మళ్ళి బాదం చెట్టుదగ్గరి వెళ్ళి కింది కొమ్మనుంచి ఏదో అందుకున్నట్లుగా నటించి ఆఫీస్‌కి  వెళ్ళిపోయేవారు.   మా నాన్నగారి సంతానంలో మేం ఎవరం మా ఆఫీస్ సమస్యల వల్ల కలిగే చీకాకుని ఇంట్లోని కుటుంబ సభ్యుల మీద చూపించి ఎరగం. మా నాన్నగారు మాకు ఈ విషయంలో ఆదర్శంగా ఉండటానికే ఆ బాదం చెట్టుని వాడుకుని ఉంటారని నాకు పెద్దయ్యాక అర్థమైంది." 

      ఎంతో సున్నితంగా తల్లి ప్రేమని కూడా రచయిత ఈ మాటల ద్వారా  చాలా అందంగా చిత్రీకరించారు.

              "అమ్మా! ఆ బాదం చెట్టుని ఎవరు కనుక్కున్నారు?" 
             "నువ్వేరా, నీ చిన్నప్పుడు ఓ రోజు నువ్వు నా దగ్గరకి పరిగెత్తుకు వచ్చి చెప్పావు."
               మా మధ్య రెండు మూడు రోజులకోసారి ఈ సంభాషణ జరిగేది. 
ఇప్పుడనిపిస్తోంది, అది నిజమై ఉండదని. ఎందుకంటే నేను బాల్యంలో ఉండగానే అది బాగా ఎదిగి కాయలు కాస్తోంది.
     నేను కనిపెట్టానని చెప్పి నన్ను బాల్యంలో మా అమ్మ ఆనందింప చేసిన ఆ చెట్టు వంక తృప్తిగా చూసి వెనక్కి తిరిగాను. 

      అంతే కాకుండా, అక్కచెల్లెళ్ళు, అన్నదమ్ములతో  మరియు స్నెహితులతో కథానాయకుడికి ఉన్న అనుబంధానికి  నిలయం అయ్యింది బాదం చెట్టు.

        ఇంచుమించుగా ప్రతి ఒక్క పాఠకుడికి  కథానాయకుడి  బాల్యంలొ తమకి తమ బాల్యం ప్రతిబింబించే విధంగా రచయిత కథనం సాగించారు. నిద్ర లేవ గానె బాదం చెట్టు కిందకి పండి రాలిన బాదం కాయల కోసం పరిగెత్తటం, బాదం ఆకులలో ఫలహారం తినడం, బాదం కొమ్మలకి ఉయ్యాలలు  వెయ్యటం, చెట్టు నీడలో బొమ్మల పెళ్ళిల్లు ఇంక ఎన్నెన్నొ ఆటలు చిన్న చిన్న పొట్లాటలతొ మదురమైన జ్ఞాపకాలు తీయని కలలాగ కంటి ముందు కదులుతుంది.

       ఈ నాటి హడావిడి  జీవితాలలో ఇప్పటి పిల్లలకి  ఇలాంటి మధురానుభూతులు కరువవుతున్నాయి అని రచయిత హృదయాన్ని స్పృసించే విధంగా  చెప్పారు. కథ చివర్లొ కథానాయకుడు తన పాత ఇంటి దగ్గరున్న బాదం చెట్టు ని చూడడానికి  వెళ్ళి ఒక సారి అ బాదం రుచి చుసి "నేనుండే కాంక్రీట్ జంగిల్‌లో మా పిల్లలకి ఇంతవరకూ బాదం పప్పు రుచి తెలీదు" అని అనుకోవడం మనల్ని ఆలొచింపజేస్తుంది.

- లాస్య రామకృష్ణ 

16, మే 2012, బుధవారం

15, మే 2012, మంగళవారం

టి.శ్రీరంగస్వామిగారి పరిశీలన!

ఓరుగల్లు నుండి వెలువడుతున్న ఏకైక సాహిత్య మాసపత్రిక ప్రసారిక మే 2012 సంచికలో "సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం" గ్రంథాన్ని డా.టి.శ్రీరంగస్వామి గారు సమీక్షించారు. ఆ వ్యాసం పూర్తి పాఠం యథాతథంగా ఇక్కడ చదవండి.
         విద్వాన్ విశ్వం అనగానే మనకు తొలుతగా గుర్తుకువచ్చేది" పెన్నేటిపాట " . ఈ కావ్యంతో ఆయన పెన్నానది పరీవాహక ప్రాంతంలోని వెతలతోపాటుగా, రాయలసీమ బతుకునే పుటలకెక్కించారు. విద్వాన్ విశ్వం గారు ఆంధ్రప్రభ పత్రికలో సంపాదకులుగా పని చేసారు. బహుముఖ ప్రజ్ఞాశాలురు, కేవలం ఆంధ్రప్రభకు మాత్రమె  కాకుండా ఆయన మీజాన్, ప్రజాశక్తి, నవ్య సాహితీ పక్షపత్రిక, ఆంధ్రదిన పత్రిక, ఆంధ్రజ్యోతి మొదలగు పత్రికలకు సంపాదకులుగా పని చేసినారు. విశ్వంగారు కావ్యాలు, కథలు, విమర్శ, సమీక్ష, అనువాదాలు, ఇలా అనేకములు అందించినారు. చిలుకూరి నారాయణరావు గారికి 'విరికన్నె'కావ్యమును'1935 లో అంకితము ఇచ్చినారు. రాతలూ-గీతలూ; పాపం; నాహృదయం; పెన్నేటిపాట ; ఒకనాడు; మొదలగుక్రుతులను అందించినారు. చెకోవ్,రోమారోలా, ఇబ్సన్, బెర్నార్డ్ షా, ఓప్లే హార్డీ, పామీదత్తుల సాహిత్యమును తెలుగులోకి అందించినారు. వేదములను, ఋగ్మంత్రములను కూడా తెలుగులోకి అనువదించినారు. విశ్వంగారు పత్రికలలో నిర్వహించిన శేర్శికలు మాణిక్యవీణ, తెలుపు-నలుపు విశ్వంగారి నిశిత చూపుకు ప్రతిబింబాలుగా నిలుస్తాయి.  
              బహుముఖ ప్రజ్ఞావంతులైన శ్రీమాన్ విశ్వంగారికి రావలసిన పేరు రాలేదేమోననిపిస్తుంది. అలాగే దేవులపల్లి రామానుజరావు గారికి కూడా వర్తిస్తుంది అనిపిస్తుంది. పి.వి.నరసింహారావు గారు రాజకీయాలలోకి వెళ్ళడం వలన ఆయన లోని సాహిత్యకారుడు ప్రజల మనస్సులలో మరుగున పడిపోయాడనిపిస్తుంది. విద్వాన్ విశ్వం(21 -10 -1915 - 20 -10 -1987) 72 ఏళ్ళవయసులో  కనుమరుగు అయిపోయారు. మరో పాతిక  సంవత్సరాల తరవాత విద్వాన్ విశ్వంగారి గురించి తెలుసుకొనే నిమిత్తం, భావి సాహిత్యకారులకు ఆయన సాహిత్యమును, ఆయన పాండిత్య ప్రకర్షను పరిచయం చేసే నిమిత్తం సంపాదకులు "సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం" పేరుతొ ఈ పుస్తకాన్ని అందించినారు. ఈ గ్రంధాన్ని నాలుగు భాగాలుగా విభజించినారు. విశ్వజీవి (విశ్వం గారిపై వచ్చిన వ్యాసాలను); విశ్వరూపి (విశ్వం గారు నిర్వహించిన శీర్షికలు, కొన్ని వ్యాసాలు); విశ్వభావి (పీఠికలు,సమీక్షలు);విశ్వమేవ(సందేశాలు,ఇంటర్వ్యూలు)చేర్చారు.                                                                         
          విశ్వం గారి గురించి తెలుసుకోనేవారికి ఇవి బాగా వుపయోగపడుతవి. 1915 సంవత్సరం  వారి శత జయంతి సంవత్సరం. అప్పటికి తెలుగు సాహిత్యరంగం, ఆయన అభిమానులు, రాయలసీమ సాహితి బృందం ఆయన రచనలనన్నిటిని వెలుగులోనికి తెస్తే  ఆయనను మనం చిరంజీవిని చేసినవారము అవుతాము. ఒక జీవత్ కృతిని వెలువరించిన సంపాదకులకు నా అభినందనలు అందచేస్తున్నాను.    

11, మే 2012, శుక్రవారం

నేటి నిజంలో విద్వాన్ విశ్వం!

ఈ రోజు (10 మే 2012) నేటి నిజం దినపత్రికలో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై తంగిరాల చక్రవర్తి గారి సమీక్ష ప్రచురితమైంది. 

ఆ రివ్యూ తాలూకు పూర్తి పాఠమిదిగో!

విప్లవ ఋషి - విద్వాన్ విశ్వం

కన్నీటి నుడులెన్నో కూర్చి పెన్నేటి పాటగా తీర్చి/ రాళ్లలో మేల్కొల్పినావు  రసదిగ్ధ భావామృతార్చి/ మాణిక్య వీణపై నీవు మత్యంగుళులు సాచినావు/ పదునైన లోకవృత్తాలు అదునెరిగి పలికించినావు అంటారు పద్మభూషణ్ డా.సి.నారాయణరెడ్డి విద్వాన్ విశ్వం గార్ని శ్లాఘించుతూ... నాటి సి.పి..జాతీయ కార్యదర్శి చండ్ర రాజేశ్వరరావు మొదలు దాశరథి, ఆరుద్ర, విశ్వనాథ సత్యనారాయణ, మిక్కిలినేని, మాలతీ చందూర్, మహీధర రామ్మోహనరావు, ఏటుకూరి బలరామమూర్తి, వేలూరి శివరామ శాస్త్రి, తిరుమల రామచంద్ర, రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ,దివాకర్ల వేంకటావధాని గార్ల విలువైన అభిప్రాయాలు విద్వాన్ విశ్వంగారి సాహితీ విరూపాక్షుణ్ని చూపిస్తాయి. అకాడెమీలు, సాహిత్య సంస్థలు, సాంసృతిక శాఖలు చేయాల్సిన మహత్తర పని సాహితీ పిపాసులైన సామాన్యులు బృహత్గ్రంథానికి సంపాదకత్వం (ప్రచురణ భారం) నెత్తికెత్తుకోవడం శ్లాఘనీయమైన అంశం. పీఠికలో అన్నట్లు విద్వాన్ విశ్వం గారిపై కనీసం 10-12 పి.హెచ్.డిలు చేయాల్సిన సాహితీ కృషి వుంది. ప్రాచీన కావ్యాలపై పట్టు వామ పక్ష భావజాలంతో రచనలు చేయగల కవులు అరుదుగా వుంటారు. శేషేంద్ర, దాశరథి వారి కోవకే చెందుతారు విద్వాన్ విశ్వంగారు కూడా. గోర్కీని ఎంత గొప్పగా ఆదరిస్తారో కాళిదాసు కవిత్వాన్ని, బాణుడి వచనాన్ని అదే స్థాయిలో ఆరాధిస్తారు. విశ్వం అనగానే గొప్ప సమన్వయం తారస పడుతుంది వీరి రచనల్లో. పాళీ భాషలో గుణాఢ్యుడు రచించిన 'కథాసరిత్సాగరం'ను సంస్కృతంలోకి సోమదేవ సూరి అనువదిస్తే దాన్ని 12 సంపుటాలుగా ఆంధ్రీకరించారు విద్వాన్ విశ్వ్వం. దీన్ని గొప్ప కాంట్రిబ్యూషన్గా చెప్పాల్సి వుంది. మీజాన్ పత్రిక నుండి టి.టి.డి ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిదాకా ఎన్నో ఎత్తులు ఎదిగిన విద్వాన్ విశ్వంగారి సాహితీ కృషిని ప్రధానాంశాలతో చక్కగా సంపాదకులు పుస్తకాన్ని రూపొందించారు. రసహృదయుల్ని అలరింపజేశారు.
బాణుడు సంస్కృతంలో రాసిన కాదంబరి తెలుగులోకి అనువదించిన సాహసీ, సాహితీవేత్తా విశ్వం గారు. రాయలసీమ కన్నీటి పాటే విశ్వంగారి పెన్నేటి పాట. దీన్ని తెలుగుసాహిత్యంలో సువర్ణ లిఖితంగా పేర్కొనాలి. కష్టజీవుల కన్నీటి పాట సీమాంధ్రలో ప్రచురణకు నోచుకోక పోతే 1956లో తెలంగాణా రచయితల సంఘం ప్రచురించడం దానికి రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ పీఠిక రాయడం విశేషం. 1935లోనే వీరి విరికన్నె కావ్యాన్ని చిలుకూరి వారికి అంకితం ఇవ్వడం దగ్గరనుండి తెలుపు - నలుపు, మాణిక్యవీణ, సాహితీ వ్యాస సమీక్షలు... ఇలా... ఎన్నో... ఎన్నెన్నో... అంశాలు పుస్తకంలో సువాసనలు గుబాళించే గొప్ప అక్షర మాలగా యీ గ్రంథాన్ని సాహితీప్రియులకు అందించిన అబ్జ క్రియేషన్స్ ఎంతైనా అభినందనీయులు. శ్రీశ్రీ చేసిన ఇంటర్వ్యూ గ్రంథానికి హైలైట్. యాదాటి కాశీపతి, డా.అద్దేపల్లి వ్యాసాలు బాగున్నాయి. ప్రతికవి, రచయిత అధ్యయనం చేయాల్సిన కవుల్లో విద్వాన్ విశ్వం ఒకరు. అభ్యుదయ సాహిత్య ఆలోచనాపరుల కరదీపిక గ్రంథం.     
- తంగిరాల చక్రవర్తి 

8, మే 2012, మంగళవారం

పుస్తకం డాట్ నెట్‌లో సాహితీవిరూపాక్షుడు!


పుసక్తం.నెట్‌లో సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై శ్రీ వడ్డి ఓంప్రకాశ్ నారాయణగారు సమీక్షించారు. దానికి సంబంధించిన లింకు ఇదిగో!

7, మే 2012, సోమవారం

పరవశ రచన

సాహితీవిరూపాక్షుడు విద్వాన్ విశ్వం గ్రంథంపై సుజాత పట్వారి గారి అభిప్రాయం ఈ రోజు (7-5-2012) సాక్షి దినపత్రిక సాహిత్యం పేజీలో రీడింగ్ రూమ్ శీర్షికన వెలువడింది. చదవండి.