...

...

21, డిసెంబర్ 2013, శనివారం

రెండు కథలు!

ఇందూరమణగారి జగన్నాటకం, ఎ.శ్రీధర్‌గారి కలిమి కథాజగత్‌లో ఇటీవల కొత్తగా చేరిన కథలు!

17, డిసెంబర్ 2013, మంగళవారం

60మంత్స్ ఇండస్ట్రీ ఇక్కడ!

అయిదు వసంతాలు పూర్తి చేసుకుని ఆరవ సంవత్సరంలోకి అడుగిడుతున్న సందర్భంగా బ్లాగు మిత్రులు మరియు తురుపుముక్క శ్రేయోభిలాషులందరికీ వినమ్రమైన నమస్కారాలు!

16, డిసెంబర్ 2013, సోమవారం

3, డిసెంబర్ 2013, మంగళవారం

గురి



కళింగాంధ్రకు చెందిన యువ కథారచయిత మల్లిపురం జగదీశ్ కథ గురి కథాజగత్‌లో చదవండి.

1, డిసెంబర్ 2013, ఆదివారం

కథా ప్రహేళిక

"--రామాకనవేమిరా రచయిత--" "--ప్రభాకర్ మందార కథ--" ఊహాచిత్రం ఆవిష్కరణ సభ ఉందని ఫేస్‌బుక్ ద్వారా ఆహ్వానం అందగానే లామకాన్ "--జయంతి పాపారావు కథ--" అయినా  "--డి.కె.చదువులబాబు/పంజాల జగన్నాథం కథ--" అంటూ బయలుదేరాను. ఈ ఊహాచిత్రం "--వనజ వనమాలి కథ--" అని తెలుసు  అదీకాక ఇది అతని "--ఆదివిష్ణు కథ--" కాబట్టి వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. అదీ కాక సభ తర్వాత "--ఎస్వీ కృష్ణజయంతి కథ--"తో కూడిన "--తమ్మెర రాధిక కథ--" వుంటుందని ఒక "--తాడికొండ కె.శివకుమారశర్మ కథ--". అదీకాక పోతే "--సతీష్ చందర్ కథ--" లేదా  కాఫీయో కనీసం "--ఆచంట హైమవతి కథ--" అయినా దక్కుతుందని "--దిలావర్ కథ--". అలా ఆశించడంలో తప్పులేదు. ఎందుకంటే సత్యప్రసాద్ "--భమిడిపాటి గౌరీశంకర్ కథ--" అనే "--కాకాని చక్రపాణి కథ--" లేనివాడు కాదని నాకు తెలుసు కాబట్టి.

"--కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ--" లెహెర్, హెలెన్, జయమాలిని, మమైత్‌ఖాన్ ఇంకా ఎవరెవరో వస్తారని గాభరా పెట్టేశారు. కానీ "--జడా సుబ్బారావు కథ--" కూడాలేదు. సరే అక్కడ "--వింజమూరి అచ్యుతరామయ్య కథ--"లా మిగిలిపోతానేమోనని అనుమానం కలిగి "--అరుణపప్పు కథ--" వుండటం ఇష్టంలేక "--ఒక కన్నీటి చుక్క రచయిత--"కు ఫోన్ చేశాను "--సగ్గు రాజయ్యకథ--" అందామని. కానీ వారి ఫోన్ స్విచ్చాఫ్ అని వచ్చింది. రికార్డింగులో బిజీగా వున్నారు కాబోలు. లామకాన్ దగ్గరకు వెళ్ళగానే అరిపిరాల సత్యప్రసాద్ కనిపించి విష్ చేసి లోపల కూర్చోమని చెప్పారు. "--గుడిపాటి కథ--" "--రామాచంద్రమౌళి కథ--"గా కనిపించింది. "--ఆవంత్స సోమసుందర్ కథ--" ఎవరూ రారని సరిపెట్టుకుని ఓ మూల కుర్చీలో కూర్చున్నాను. తర్వాత కొద్దికొద్దిగా జనం రాసాగారు. అరిపిరాల బోర్ కొట్టకుండా ఒక కథాప్రహేళిక ఇచ్చారు. దానికి "--తేజోమూర్తుల ప్రకాశరావు కథ" ఆలోచిస్తూ కూర్చున్నాను.  "--తాడిగిరి పోతరాజు కథ--" అనంతరం సభ మొదలయ్యింది. "--అంజనం రచయిత--" పరిచయవాక్యాలు పలికి "--ధనలక్ష్మి రచయిత--"గారిని, "--నాన్నంటే! రచయిత--"గారిని, కుప్పిలి పద్మగారిని, జి.ఆర్.మహర్షి గారిని వేదిక మీదికి ఆహ్వానించారు. జగన్నాథ శర్మగారు పుస్తకాన్ని ఆవిష్కరించి మొదటి ప్రతిని రచయిత తండ్రిగారికి అందించారు. వక్తలు మాట్లాడడం మొదలు పెట్టారు. "--హెచ్చార్కె కథ--" ముంచుకొస్తుందని సభ మధ్యలోనే నిష్క్రమించడానికి ఉపక్రమించాను. హాలు బయటికి రాగానే టేబుల్ పైన ఉన్న పుస్తకాలను చూచి వంద రూపాయలను తీసి ఒక కాపీ కొన్నాను. కౌంటర్‌లో వున్న వ్యక్తి ఇచ్చిన "--గరిశకుర్తి రాజేంద్ర కథ--" జేబులో పెట్టుకుని బయట పడ్డాను. 

26, నవంబర్ 2013, మంగళవారం

విమర్శలకు దిక్సూచి

జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు పుస్తకం గురించి డా.తిరునగరి ఆంధ్రప్రభ దినపత్రిక సాహితీగవాక్షం పేజీలో సమీక్ష చేశారు.

22, నవంబర్ 2013, శుక్రవారం

కథాకుటుంబం


అంతర్జాల కథావేదిక కథాజగత్‌లో కథకుల సంబంధ బాంధవ్యాలను పరికిస్తే ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తున్నాయి. ఒకే కుటుంబం నుండి ఎక్కువగా నలుగురు రచయితలు [తండ్రి(శ్రీరాగి), కొడుకు(వియోగి), కోడలు(విశాల వియోగి), కూతురు(రమ్య)] కథాజగత్‌లో స్థానం పదిలపరచుకోగా తరువాతి స్థానాన్ని నంబూరి పరిపూర్ణ(తల్లి), దాసరి శిరీష(కూతురు), దాసరి అమరేంద్రల(కొడుకు) కుటుంబం దక్కించుకుంది. ఇప్పటివరకూ 13 జంటలు(భార్యాభర్తలు)* కథాజగత్ రచయితలు కాగా తల్లి-కూతురు, తండ్రి-కూతురు, మామ-అల్లుడు, పిన్ని- అక్క కొడుకుల కాంబినేషన్ కూడా ఈ కథాజగత్‌లో చూడవచ్చు. మునుముందు ఇంకా ఎక్కువమంది బంధుగణాన్ని కథాజగత్‌లో చూడబోతున్నారు.     

13, నవంబర్ 2013, బుధవారం

మునిసురేష్ పిళ్లె కథ

డిగ్రీ పూర్తవుతున్న సమయంలో... తమ సొంత పత్రిక ‘ఆదర్శిని’లో రాసిన ‘ఆ రోజు’ కథ చదివి.. శ్రీ మధురాంతకం రాజారాం గారు... స్వయంగా .... ‘‘శ్రీకాళహస్తి ప్రాంతాల్లో రచయితలు లేని లోటు నీ వల్ల తీరుతుందని అనుకుం’’టున్నానంటూ ఉత్తరం రాయడం అనేది... సురేష్ జీవితంలో తన కథలకు పొందిన అతి పెద్ద కితాబు.  


అలా కీ.శే.మధురాంతకం రాజారాం గారి మెప్పు పొందిన కె.ఎ.మునిసురేష్ పిళ్లె కథ ఆ రోజు... కథాజగత్‌లో చదివి ఆనందించండి.

9, నవంబర్ 2013, శనివారం

సృష్టి అమూల్యం

ప్రభాకర్ మందార గారి కథ సృష్టి నండూరి సుందరీ నాగమణి గారి కథ అమూల్యం కథాజగత్‌లో కొత్తగా చేరాయి. చదవండి.

8, నవంబర్ 2013, శుక్రవారం

అక్టోబరు నెల కథ!

అక్టోబరు నెలలో అంటే (1-10-2013 నుండి 31-10-2013)గూగుల్ అనలిటిక్స్ గణాంకాల ప్రకారం కథాజగత్‌లో ఎక్కువమంది చదివిన కథ ఏదో తెలుసుకోవాలంటే ఇక్కడ నొక్కండి.

2, నవంబర్ 2013, శనివారం

సామాజిక'వల'యం

ఆకునూరి మురళీకృష్ణ గారి కథానిక కథాజగత్‌లో చదవండి.

29, అక్టోబర్ 2013, మంగళవారం

Goodreads Book Giveaway



Goodreads Book Giveaway


సాహితీ విరూపాక్షుడు విద్వాన్ విశ్వం by Kodihalli Murali Mohan


Enter to win


20, అక్టోబర్ 2013, ఆదివారం

విద్వాన్ విశ్వం జయంతి నేడు.

విద్వాన్ విశ్వం జయంతి సందర్భంగా గత ఏడాది సూర్యలో వ్రాసిన ఆర్టికల్.

13, అక్టోబర్ 2013, ఆదివారం

వైశ్వనాథము వివాదాలమయమూ...

   
       పళ్ళున్న చెట్టుకే రాళ్ళదెబ్బలు అని సామెత. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కీర్తిశేషులు కవిసామ్రాట్  విశ్వనాథ సత్యనారాయణ సాహిత్యాన్ని అభిమానించే వారున్నట్టే విమర్శించేవారు కూడా వున్నారు. 60వ దశకంనుండీ విశ్వనాథ రచనలపై వాదవివాదాలు, విమర్శ ప్రతివిమర్శలు, సవాళ్లు ప్రతిసవాళ్లు చాలాకాలం కొనసాగింది. ఇటీవలి కాలంలో మళ్లీ బ్లాగుల్లోనూ, ఫేస్‌బుక్‌లోనూ విశ్వనాథ సాహిత్యంపై విశ్లేషణలు మొదలు కావడంతో పాత సంగతులను తిరగ తోడుతున్నాను కాస్త కాలక్షేపమవుతుందని. ఇక్కడ వెలువరిస్తున్న అభిప్రాయాలేవీ నా స్వంతం కాదని గుర్తించమనవి.

           1. 1961 జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబరు, అక్టోబరు భారతి సంచికలలో కొత్త సత్యనారాయణ చౌదరి అనే ఆయన విశ్వనాథ విశ్వామిత్రసృష్టి, విశ్వనాథ వైలక్షణ్యము, విశ్వనాథ - ప్రయోగ వైలక్షణ్యము, మరో రెండు వ్యాసాలూ వరుసగా ప్రకటించారు. అంతకు ముందు బందరు నుండి వెలువడే తెలుగువిద్యార్థి పత్రికలో కూడా రామాయణ కల్పవృక్ష కావ్యపరిశీలన గావించారు.  రామాయణ కల్పవృక్షం కావ్యంపై తొలి విమర్శాపరంపర ఈ వ్యాసాలు.

          కల్పవృక్షములో ఆడ-మగ పాత్రలు ముప్పాతిక మువ్వీసం విశ్వనాథ మనోవృత్తికి సూటిగా సరిపోయిందంటారు చౌదరిగారు. ప్రత్యేక ముద్ర పొందిన ఆ పాత్రలలో విశ్వామిత్ర పాత్రను తీసుకుని వాల్మీకి సృష్టించిన విశ్వామిత్రునికి, వైశ్వనాథ విశ్వామిత్రునకీ వున్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపారు. "ఈ విశ్వనాథుని విశ్వామిత్రుడొక దొంగ సన్నాసి. ఆ చూపులు - ఆ నవ్వులు, ఆ దెప్పిళ్లు - ఆ దాగుడు మూతలు ఆ వెకలి నవ్వులు రోత వేయుచున్నవి. ఇక్కడ అక్షరాల కవీశ్వరుని తత్త్వమే విశ్వామిత్రపాత్రలో దూరి యింత పని చేసెనేమోయని స్ఫురించుచున్నది.ఈ కావ్యమునకు విశిష్టత మాట ఎట్లున్నను, బంగారు వంటి బ్రహ్మర్షి, మహామేథావి, మహా తేజస్వి  అయిన విశ్వామిత్రుడు, వట్టి భ్రష్టుడై, వెకిలియై, టక్కరియై అసభ్య ప్రవర్తనముచే నవ్వులపాలయ్యెనని " అంటారు. ఇంకా కల్పవృక్షంలోని న్యూనోపమల్ని, అనుచిత అసంబద్ధ పద ప్రయోగాల్నీ చర్చించారు. మేనకా దుష్యంతుల శృంగార ఘట్టాన్ని వర్ణించిన పద్యాలనే కొన్ని కొన్ని మార్పులు చేసి  సీతారాముల శృంగార వర్ణనలో సైతం అప్పుతెచ్చుకున్నారని ఆక్షేపిస్తారు. గ్రాంథికమని పేరుపెట్టుకొనిన కావ్యంలో గొబ్బరికాయలు, బునాదులు, గానుగ పుల్లలు వంటి పరుషాది పదములను శిష్టులంగీకరింపరని కొత్త సత్యనారాయణ చౌదరిగారి అభియోగం. ఇంకా కల్పవృక్షములోని వింతప్రయోగములను, నిరర్థక, అప్రయుక్త, క్లిష్ట, పరుష, గ్రామ్య, ప్రక్రమభంగ, వచన వ్యత్యాస, వైరి సమాస, విరుద్ధ, విపరీత థీప్రద, పతత్ప్రకర్ష, వ్యాకీర్ణాది దోషాలను ఎత్తి చూపారు. 

           2. 1961 అక్టోబరు 15 విజయదశమినాడు చెన్నపురి ఆంధ్ర మహాసభ వారు విశ్వనాథ సత్యనారాయణగారిని సన్మానించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ "నామీద ఒక ప్రఖ్యాత పత్రికలో విమర్శలు వస్తున్నాయి. ఈ విమర్శలు వ్రాస్తున్నవారు పండితులే. ప్రచురిస్తున్న వారు పండితులే. అయితే ఈ విమర్శలు ఎంతవరకు సమంజసం, ఎంతవరకు నిలుస్తాయి అని వారు ఆలోచించడంలేదు. విద్వాంసులైనవారే ఇలా ఎందుకు చేస్తున్నారో బోధపడకుండా ఉంది. అసలు ఇలా చేయడం భావ్యమా? న్యాయమా? ఇది భాషాద్రోహం కాదా? సాహిత్యానికి తీరని అపచారం కాదా? ఈపని భారతి పత్రిక మర్యాదకు తగునా? నేను పెద్దవాణ్ణి అయ్యాను. బహుశా ఎంతోకాలం జీవించను. నాపైన కోపంవుంటే పిస్తోలుతో కాల్చవచ్చునే. మేడ మీద ఒంటరిగా పడుకుని ఉంటాను. చిన్న సల్ఫ్యూరిక్ యాసిడ్‌బుడ్డి విసిరితే చాలునే కోపం తీర్చుకొనడానికి. అలా చేయక ఇలా చేయడం ఎందుకు. నేను తప్పులు వ్రాయలేదని అనను. కాని, పత్రికలో చూపించినవి మాత్రం, దోషాలు కావని సంస్కృతంలో ఎ,బి,సి,డీలు వచ్చిన వాడైనా చెప్పగలడు. అయినా భారతి వీనిని ప్రచురిస్తూ ఉంది. భారతి ప్రసిద్ధి, స్థాయి ఇదివరకే పోయింది. ఇప్పటి దాని స్థితి వీనిని బట్టి తెలుస్తున్నది. ఇకనైనా వీనిని వ్రాయవలదని ఆ రచయితకు, ప్రచురించవలదని ఆ పత్రికవారికి విజ్ఞప్తి చేస్తున్నాను" అంటూ తన ఆవేదనను తెలియజేశారు.  అదే సభలో శ్రీశ్రీగారు మాట్లాడుతూ విశ్వనాథవారి గురువుగారైన చెళ్లపిళ్ల వెంకటశాస్త్రుల వారు ద్రాక్షాపాకంలో రచనలు సాగించగా విశ్వనాథ సత్యనారాయణగారు పాషాణపాకంలో వ్రాస్తారని ఆరోపించారు. తనకు సంస్కృతం రాకపోయినా, వాల్మీకిరామాయణం చదివితే అర్థమయినట్టే ఉంటుందని, కాని విశ్వనాథవారు వ్రాసిన రామాయణం చదివితే తనకు తెలుగు బాగా వచ్చినా ఏమీ అర్థం కాదనీ, అలా ఎందుకు వ్రాయాలనీ ప్రశ్నించారు. అంతకు ముందు యామిజాల పద్మనాభస్వామి ప్రసంగిస్తూ విశ్వనాథపై వస్తున్న విమర్శలకు సమాధానాలు తాము వ్రాయగలమని శపథం చేశారు.  

            3. ఈ సన్మానం తరువాత చాలా చర్చ జరిగింది. అవన్నీ ఆంధ్రపత్రిక సారస్వతానుబంధంలో వచ్చింది. ఈ చర్చనంతటినీ భారతి 40 పేజీల అనుబంధంగా 1962జనవరిలో తీసుకువచ్చారు. చాలామంది పండితులు ఈ చర్చలో తమతమ అభిప్రాయాలను తెలియజేశారు. విశ్వనాథ సత్యనారాయణ, కొత్త సత్యనారాయణ చౌదరి, శ్రీశ్రీలే కాకుండా ఈ చర్చలో ఆవుల గోపాలకృష్ణమూర్తి,సి.కనకాంబరరాజు,కె.లక్ష్మీనారాయణ, కాదంబరి వెంకటరత్నం, ఎన్.టి.పి.వి.రామానుజాచార్యులు, వక్కలంక రామారావు,వావిలాల రామమూర్తి, తుమ్మల సీతారామమూర్తి, జంధ్యాల వెంకటేశ్వర్లు, ధూళిపాళ శ్రీరామమూర్తి, శాంతిశ్రీ, శనగపల్లి సుబ్బారావు, పి.శ్రీనివాసరావు, తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు, వడ్లమూడి గోపాలకృష్ణయ్య, స.ధర్మారావు, మోచర్ల కౌస్తుభమణి, జి.వి.కె.ఎన్ మూర్తి,వి.కస్తూరి, ఆలపాటి వరదయ్య మొదలైన వారు పాల్గొన్నారు. కొంతమంది విశ్వనాథ పక్షం వాదించగా, మరికొంతమంది వ్యతిరేకంగా వాదించారు. కొందరు పండితుల సమక్షంలో సభ ఏర్పాటు చేసి కల్పవృక్షంలోని గుణదోషాలపై నిర్ణయించాలని కొన్ని ప్రతిపాదనలు వచ్చాయి. కొంతమంది హేళన చేశారు. అయితే ఒకరు చేసిన ఈ వ్యాఖ్య గమనిచదగింది. "అసలు చర్చ ఇంత రభసగాను, రగడగాను తయారవడానికి రామాయణ కల్పవృక్ష విమర్శ నిమిత్త మాత్రమయిందిగాని అసలు ఈ కచ్చకు మూలకందము వేరే ఉన్నది. అది విశ్వనాథవారు చేసే ప్రసంగాలు, వారి శిష్యులు చేసే ప్రచారము, సాహిత్య రంగంలో వారంటే ఉన్న ప్రాతికూల్యం, దాలిగుంటలో నిప్పులాగా ఇన్నాళ్ళు రాజుకుంటూ,రాజుకుంటూ ఉంది. అది ఇవ్వాళ భగ్గుమని లేచింది. విశ్వనాథ వారు నన్నయ,తిక్కనలతో సమానులేకాక, వారికంటే కూడా ఘనులని వారి శిష్యకోటిలో కొందరు ప్రచారం సాగిస్తూ వచ్చారు. ఎవరన్నా కాదంటే కొట్టడానికి వస్తారు. విశ్వనాథవారు కూడా స్వయంగా అది నమ్ముతారు."

        4. తరువాత దాలిగుంటలోని నిప్పు 1980లో మరోసారి భగ్గుమంది. దాని గురించి తరువాత వ్రాస్తాను.           
   


11, అక్టోబర్ 2013, శుక్రవారం

సెప్టెంబరు నెల కథ!

సెప్టెంబరు నెలలో (అంటే 01-09-2013 నుండి 30-09-2013 వరకు) కథాజగత్‌లో ఎక్కువమంది చదివిన కథ కోసం ఇక్కడ నొక్కండి.

10, అక్టోబర్ 2013, గురువారం

అవ్వ పేరే ముసలమ్మ!

పెద్దకథకి, చిన్ననవలకి మధ్య కల వ్యత్యాసమేమిటో తెలుసుకోవడానికి నేను అడిగినదానికి స్పందిస్తూ వీరాజీగారు అవ్వ పేరే ముసలమ్మ అని సమాధానమిచ్చారు. ఏ పేరుతో పిలిచినా ఒకటే అని వారి ఉద్దేశం కావచ్చు. So అవ్వ/ముసలమ్మ లాంటి ఆదివిష్ణు గారి తొలిమజిలీ కథాజగత్‌లో చదివి ఆనందించండి :-)

డా. సి.ఆనందారామం కథ!

ప్రఖ్యాత రచయిత్రి డాక్టర్ సి.ఆనందారామం గారి కథానిక నష్టఫలహారం కథాజగత్‌లో చదవండి. దక్షిణ భారత హిందీ ప్రచార సభ నడిపిన స్రవంతి మాసపత్రికలో 1981లో ఈ కథ ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయం చెప్పండి.  

5, అక్టోబర్ 2013, శనివారం

ప్రాచీనహోదా

పెయ్యేటి శ్రీదేవి గారి కథ ప్రాచీనహోదా కథాజగత్‌లో చదవండి.

1, అక్టోబర్ 2013, మంగళవారం

కమ్లి & గంగ

సమ్మెట ఉమాదేవిగారి కథ కమ్లి కథాజగత్‌లో చదవండి. అలాగే కొండవీటి సత్యవతి గారి గంగకి వరదొచ్చింది కూడా చదవండి.

25, సెప్టెంబర్ 2013, బుధవారం

శ్రీశ్రీ కవిత్వానికి పేరడీలు!!!

ఆధునిక తెలుగు కవిత్వంలో ఎక్కువగా పేరడీకి గురి అయ్యింది శ్రీశ్రీ వ్రాసిన కవిత్వమే. శ్రీశ్రీని లక్ష్యంగా పెట్టుకుని పేరడీలల్లిన వారెందరో! వారందరి పేరడీలలలో కొన్నింటిని ఒక చోట చేర్చి చదివించి ఆనందపరచడమే ఈ టపా లక్ష్యం. ఈ పేరడీల మాతృకలను సులభంగా తెలుసుకుంటారనే ఉద్దేశంతో వాటిని ఇక్కడ ఇవ్వటం లేదు.

1.మాగాయీ కందిపచ్చడీ
ఆవకాయీ పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారాకిల్లీ
సామానోయ్ సరదాపాటకు

తుప్పట్టిన మోటార్ చక్రం
తగ్గించిన చిమ్నీ దీపం
మహవూరిన రంపప్పొట్టూ
పంగల్చీలిన ట్రాం పట్టా
విసిరేసిన విస్తరి మెతుకులు
అచ్చమ్మ హోటేల్లో చేపలు
సామానోయ్ సరదాపాటకు

నడి నిశిలో తీతువు కూతా
పడి పోయిన బెబ్బులి వేటా
కర్రెక్కిన నల్లి నెత్తురూ
జుర్రేసిన ఉల్లికారమూ
చించేసిన కాలెండర్ షీట్
నపుంసకుడీ థాట్ డెవలప్మెంట్
సామానోయ్ సరదాపాటకు

త్రుళ్ళనిదీ కుళ్ళనిదీనీ
మళ్ళినదీ వెళ్ళినదీనీ
చచ్చేదీ లాభం లేనిది
ఈ జన్మకు పనికి రానిదీ
మనకెప్పుడు కలిసిరానిదీ
సామానోయ్ సరదాపాటకు -జరుక్ శాస్త్రి

2.పిలిచేదీ పిలిపించేదీ
చేరేదీ చేర్పించేదీ
ఆడేదీ ఆడించేదీ
బిరుదాలకు బదులిచ్చేదీ
కవిమతమున కలిసొచ్చేదీ
కవితేనోయ్ నవీన కవులకు
.................
.................
దినపత్రిక దిక్కుల వ్రాతలు
దీవించే సంపాదక నేతలు
అర్థానికి అకాడమీ దాతలు
పలుభాషల ప్రచురణ కర్తలు
కౌగిలి కోరే కృతిభర్తలు
కృత్రిమ సంఘం, కుంటి నడకలు
కావాలోయ్ నవీన కవులకు
.................
................. కాట్రగడ్డ
3.స్కాచ్ విస్కీ, స్పెన్సర్ సోడా
స్టేటెక్స్ ప్రెస్, గ్యాసు లైటరూ
తెల్లగ్లాసూ, చల్లని ఐసూ
మటన్ చిప్స్, బాయిల్డెగ్సూ
కావాలోయ్ నవకవనానికి

ఇరానీ తందూరీలూ
బిర్యానీ జింజెర్ చికెనూ
వీటిపక్క నుల్లి ముక్కలూ
వాటిమీద నిమ్మ చెక్కలూ
కావాలోయ్ నవకవనానికి

చైనీస్ బారూ
జపాను కారూ
ఇంగ్లండు ఫోర్కూ
రష్యా చాకూ
కావాలోయ్ నవకవనానికి

ఎక్కేదీ, కిక్కిచ్చేదీ
తాగాక తూగించేదీ
వూగిస్తూ వాగించేదీ
డేకిస్తూ డోకించేదీ
కావాలోయ్ నవకవనానికి

కవి వమనానికి
                    - తనికెళ్ల భరణి

4.ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం
c,a,t - కేటువి నీవై
r,a,t - రేటుని నేనై
రాతగ్గ కవిత్వం నీవై
పోతగ్గ ప్రభుత్వం నేనై
తిగ్మాంసూని కిరణంలాగా
ఎగ్మూరు స్టేషను నీవై
మారురంగు మణీలా లాగా
నోరులేను ముక్కను నేనై
కాలానికి ఆక్సిజన్ యిచ్చాం
ఏలాగో తగలడి చచ్చాం
2
పిక్ ఫోర్డువి నీవే ఐతే
రాక్ఫెల్లర్ నేనే ఐతే
నీ తల్లో దవనం తుంచీ
నా తల్లో నరకం పెంచీ
శాంథోం సిఖరం నీవై
ఆంథోనీ ఈడెన్ నేనై
గుడిలోపల దేవివె నీవై
మడికట్టిన పూజారిని నేనై
నీ కంకణ సౌభాగ్యంలో
నా జీవన దౌర్భాగ్యంలో
గది తలుపుకు గడియే వేద్దాం
పదిలంగా ముసుగేశేద్దాం
3
నా లోపలి నీవే మనమై
నీ లోపలి ఊరే నేనై
నీ పగిలిన చిలాయి చుక్కే
నా రగిలిన కొబ్బరి ముక్కే
నా తల్లో నరకం పెంచీ
నీ తల్లో దవనం తుంచీ
అఛ్ఛాడీ చేతివి నీవై
పిచ్చాడి ప్రలాపం నేనై
వడపప్పూ కొబ్బరి నీవై
తడికల గది కవితను నేనై
ఎగ్మూరు స్టేషన్ నీవై
నోరులేని బొమ్మను నేనై,
ఆనందం కంబళి ఐతే
అనురాగం సంబరమైతే
ఘనా- జటా పనసవు నీవై
వటా వటా వాగుడు నేనై
అన్నానికి ఆర్తివి నీవై
కన్నంలో తేలును నేనై
తాడుతెగిన పటంగివి నీవై
జోడులేని విహంగం నేనై
వ్యసనానికి హసనం తెద్దాం
హసనానికి మసనం తెద్దాం
(శ్రీramgaM శ్రీnivaasa Rao తన గేయాల్లో ముఖ్యంగా అద్వైతం అనే
గేయంలో చూపిన మర్గానికి కృతజ్ఞతో - తజ్ఞతతో) -జరుక్ శాస్త్రి

5. రోడ్డు చరిత్ర చూచినా
ఏమున్నది గర్వ కారణం?
రహదారి చరిత్ర సమస్తం
ధూళి దూసర పరిన్యస్తం,
రహదారీ చరిత్ర సమస్తం
యాతా యాత జన సంయుక్తం
రహదారి చరిత్ర సమస్తం
పథిక వాహన ప్రయాణ సిక్తం,
భూంకార గర్జిత దిగ్భాగం
చక్రాంగ జ్వలిత సమస్తాంగం
రహదారి చరిత్ర సమస్తం
పైజమ్మాలను పాడుచేయడం
...................
...................
హైరోడ్డులు అశోకుళ్ళై
చరిత్రమున ప్రసిద్ధికెక్కెను
..............
..............
లారీరాజం, భారీబస్సూ
రోడ్డురోలర్ బ్రెన్గన్ కారీర్
ట్రాంకారూ ఏమైతేనేం
ఒత్తేయును టూత్పేస్టుల ట్యూబల్లే
.....................
.....................
ఒక కారును వేరొక కారూ
ఒక బస్సును వేరొక లారీ
చుంబించే క్షణమందున
రూల్సన్నీ దాగును యెచ్చట?
..................
..................
నడివీథికి సంగరముందా?
రహదారి వాలంబెంతుందీ?
పోసిన రాళ్ళూ నడిపిన్ బళ్ళూ
యివి కావోయ్ బాటల భాగ్యం
...................
...................
రహదారుల మధ్య దారిలో
అగుపించే హంతకులెవ్వరు?
ప్రక్కన పెట్టిన రోలర్ కాదోయ్
దాన్ని గుద్దిన బండ్లెన్ని?
...............
...............
గీతం? కాలంలో
సాధించినదీ పరిపూర్ణం?
జలసూత్రం? 'కలవింకం'?
చూపించిరి వికటత్వం
ఎగతాళుల ప్రతిబింబం?
భావం, కిష్కిందం
భాష్యం, బాంధవ్యం - మాచిరాజు దేవీప్రసాద్

6.ఏ పాప పైట జారినా
ఏ కాంతుడు ఏమి జేయునో?
పాపల పవిత్ర క్షేత్రం
పడుపు వృత్తి పూజా సత్రం
.................
.................
ఏ పడకను ఎందుకు వేసిరో
ఏ గడపకు సూత్రముండునో?
నిమిషాలు పరుషాలు
నిష్పలితుల జీవితం వ్యర్థం!
.................
.................. -కాట్రగడ్డ

7.ఏ లాబ్ చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
శాస్త్రజ్ఞుల చరిత్ర సమస్తం
పరదూషణ పరాయణత్వం

................
................

బలవంతులు విజ్ఞుల జాతిని
బానిసలను కావించారు
పారసైటులు రిసెర్చి గైడులై
చరిత్రన ప్రసిద్ధికెక్కారు
చల్లారిన ఉత్సాహాలు
మరణించిన అంతరాత్మలు
జెఆర్‌పిఎస్‌ల హాహాకారాలు
లాబుల్లో మూలుగుతున్నవి
టైపిస్టులు మెకానిక్కులు
డైరెక్టర్లు, రిజిస్ట్రారులు
మినిస్టర్లు అందరు కట్టిరి
రీసెర్చికి సజీవ సమాధి

ప్రఖ్యాత విశ్వవిద్యాలయంలో
విద్యార్థుల జీవనమెట్టిది
ప్రొఫెసరచ్చేసిన పేపర్ కాదోయ్
దాన్ని వ్రాసిన విద్యార్థెవడు?
................ -కవన శర్మ

8.ఏ సినిమా చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం
ఈ సినిమాల చరిత్ర సమస్తం
ప్రొడ్యూసర్లను కాల్చుకు తినటం
....................
....................
ఒక పిక్చర్ నింకొక పిక్చర్
ఒక యాక్టర్ నింకొక యాక్టర్
పీడించే సినీ ధర్మం
ఇంకానా? ఇకపై సాగదు
ఏ సినిమా ఎందుకు తీసిరో
ఏ పిక్చర్ ఎన్నాళ్ళుందో
జయలలితా జ్యోతిర్లక్ష్మీ
ఇవికావోయ్ సినిమాల్సారం
.................
చిత్రసీమ నాగరికతలో

ఎకస్ట్రాల జీవనమెట్టిది?
చలన చిత్ర నిర్మాణానికి
సిగ్గొదిలిన శ్రీమంతులెందరు?
సినీ ప్రపంచం పద్మవ్యూహం
సినిమా ఒక తీరని దాహం -పురాణం సుబ్రహ్మణ్య శర్మ

9.ఏ సినిమా చరిత్ర చూసినా
ఏమున్నది గర్వకారణం?
సినీమాల చరిత్ర సమస్తం
నరపీడన పారాయణత్వం

సినిమాల చరిత్ర సమస్తం
స్టార్ హీరోల పాద సేవనం
సినిమాల చరిత్ర సమస్తం
చెంచాల వీరవిహారం

సూపర్స్టార్ పాత్ర ప్రధానం
తారాగణ అతివికారం
సినిమాల చరిత్ర సమస్తం
ప్రేక్షకులను కాల్చుకు తినడం

దర్శకుడే హీరొయిన్లచే
వ్యభిచారం చేయించాడా?
పరకాంతలు తెలుగు భామలై
సినీరంగమున ప్రసిద్ధికెక్కిరి

రాసక్రీడలు లేని చోటు టా
లీవుడ్ లో వెదకిన దొరకదు
హీరోయిన్ తడిసె వర్షమున
లేకుంటే హీరో స్వేదములో

కల్లోలిత సంసారాలు
దిగజారిన సంస్కారాలు
అపహాస్యపు హాహాకారం
సినిమాల్లో నీలుగుతున్నవి

అవివేకం అతిమూర్ఖత్వం
రీమేకులు కాపీ కథలూ
మాయలతో మారు పేర్లతో
సినిమాల్లో కనిపిస్తున్నవి

ఏయన్నార్ ఎంటీవోడు
శొభన్ సూపర్ స్టార్ కృష్ణ
చిరంజీవో ఎవడైతేనేం?
ఒకొక్కడూ శిరభక్షకుడు

నాగార్జున వెంకటేషులు
బాలయ్య పవన్ కల్యాణులు
మహేష్ బాబు ఉదయ్ కిరణ్ చేసిరి
మెదళ్ళతో రస పానీయం

అభిమానుల సందోహంలో
మీడియా ప్రకంపనలలో
ప్రకటనల పరంపరలో
సినిమాలను తీసిన మనుష్యులు

అంతా తమ ప్రయోజకత్వం
తామే ఇక సామ్రాట్టులమని
స్థాపించిన స్టూడియోలు
నిర్మించిన ఫిల్మ్ సిటీలూ

ప్రేక్షకుల చీత్కారంతో
పడిపోయెను పేకమేడలై
పరస్పరం సంగ్రహించిన
స్టోరీలతో సినిమా పుట్టెను

సహజమైన కథానికలు
మధురమైన సినీసంగీతం
అర్థమయ్యే మాటలు, పాటలు
ఇంకానా? ఇకపై ఉండవు

ఒక మహిళకు ఒకరే భర్త
ఒక పురుషునఒకరే పత్ని
ఉండే ఏ సినిమా అయినా
ఇంకానా? ఇకపై ఆడదు

మెగాస్టార్ ఘరానా మొగుడు
గోల్డ్ స్టార్ సమరసింహుడు
యువసామ్రాట్ మాస్ బాస్ బాస్ మాస్
సూపర్ హీరోలే అందరూ

పావలాకి రూపాయి నటన
హీరోయిన్ బికినీ వీక్షణ
సెంటిమెంటల్ చావబాదుడు
కలిపేస్తే సినిమా అయ్యెను

ఏ స్తాలిన్ ఎవడిని నరికెనో
లక్ష్మీ, మాస్ ఏ స్టేప్పేసెనో
నరసిమ్హుడి కంటిచూపులు
ఇంతేనా సినిమా అంటే?

ఏ షూటింగ్ ఎక్కడ జరిగెనో
ఏ సినిమా ఎన్నాళ్ళాడెనో
రికార్డులు గాసిప్ రచనలు
ఇదీ సినీ పత్రికల సారం

హాలివుడ్ వాడిపారేసిన
ఫార్మ్యులా ల జోలికి పోని
కథలేవో కావాలిప్పుడు
వినకుంటే ఇక వాళ్ళిష్టం

ముచ్చటైన సన్నివేశం
వెనకనున్న రచయిత ఎవ్వరు?
మణిరత్నం చీకటి షాట్లో
పనిచేసిన లైట్ బాయ్ ఎవ్వడు?

ఆకాశపు విన్యాసాల్లో
స్టంట్ మేన్ల సాహసమెట్టిది?
హీరోల స్టెప్పులు కాదోయ్
అవి నేర్పిన మేస్టర్ ఎవ్వడు?

ఏ పోరి ఎవడితో తిరిగెనో
ఏ గుంటడు ఎవతిని తార్చెనో
న్యూస్ చానెళ్ళ స్పై కేం స్టింగులు
సృష్టించెను గందరగోళం

పదికోట్లతో తీసిన చిత్రం
అది చూసిన ప్రేక్షకులెవ్వరు?
ఆ సినిమా ఏ కాలంలో
సాధించిన దే పరమార్ధం?

ఏ కథనం ఏ సంగీతం?
ఏ మధనం ఏ సాహిత్యం?
ఏ జన్మల పాపమీ చిత్రం?
ఏం చేస్తాం? ఏమీ చెయ్యలేం!! -మలక్‌పేట్ రౌడీ



10.నిజంగానే నిఖిల ఆంధ్రం
నిండు హర్షం వషిస్తుందా?
భోజనానికి నిజంగానే
భోగ కాలం రహిస్తుందా?
నిజంగానే నిజంగానే
నిఖిల ఆంధ్రం హసిస్తుందా?
తినకముందే మొహం మొత్తే
మోహన్ దాల్ నశిస్తుందా?
................
................
పెరటి కోయిల కరకు కూతల
అరవ భాష్యం శమిస్తుందా?
కరిలు యిరికిన పరువు నరకము
మరచు కాలం క్రమిస్తుందా?
................
................ - మాచిరాజు దేవీప్రసాద్

11.ఏరి తల్లీ నిరుడు మురిసిన
ఇనప రచయితలు
కృష్ణశాస్త్ర పుటుష్ట్రపక్షి
దారితప్పిన నారిబాబూ
ప్రైజు ఫైటరు పాపరాజూ
పలక రెంచేత?
ప్రజాస్వామ్యపు పెళ్ళికోసం
పండితా నారాధ్యుడాడిన
వంద కల్లల పంది పిల్లల
ఆంధ్ర పత్రిక ఎక్కడమ్మా?
ఎక్కడమ్మా ఎలక గొంతుక
పిలక శాస్త్రుల పనికి మాలిన
తలకు మించిన వెలకు తగ్గిన
రణగొణ ధ్వనులు
ఏవి తల్లీ నిరుడు మురిసిన
హిమసమూహములు - శ్రీశ్రీ

12.ఏవితల్లీ నిరుడు మండిన
ఎండు తాటాకుల్
............
దుర్గబాయీ భర్గు రాణీ
భీకరాన న స్పీకరేది?
లోకైక లీడరు రైతు రంగా
బూకరింపుల బాకులెక్కడ?
ఎన్నికల నోరు తెరిచి కాలం
ఎందరిని కబళించెనమ్మా?
ఏదతల్లీ నిరుడు కురిసిన
వడగళ్ళ గడబిడలు
............ -ఆరుద్ర

13. ...............
అసెంబ్లీలో నిరుడు నిలుచుని
హాలు గడగడలాడు స్వరమున
లోపముల పైకెత్తి చూపిన
లోక సేవకు లేరి తల్లీ?
..............
.............. -చొప్పకట్ల చంద్రమౌళి

14.నందమూరి రామరాయని
నినద భీషణ శంఖమెక్కడ?
నెత్తికెక్కిన అహంభావపు
బజారు భాషల వక్తలేరీ
ఏవి తల్లీ నిరుడు విరిసిన
తెలుగు చోద్యాలు?
................
................
తెలుగు నేతల జాతిపీతల
కోతిమూకల తోకలెక్కడ
పచ్చకార్డులు విసిరి కాలం
పారిపోయిన జాడలేవీ?
.............
.............. -అబ్బూరి వరదరాజేశ్వర రావు

15.చక్ర పొంగళి ప్లేటు ఎచ్చట ?
రవ్వ లాడూ ఉండలెచ్చట ?
ఏవి సర్వర్ ! ఆర్డరిచ్చిన
ఇడ్లి పెసరట్టూ ?
శ్రీనాధ మహా కవీంద్రుని
జిహ్వాగ్రమున కరంగిన
వంటకాల్ నేడెక్కడయ్యా
కలవు ? చూపించు !
విజయరాఘవ మందిరంలో
వినిపించిన త్రేన్పు లెచ్చట?
గోప బాలురు నాడు మెక్కిన
మాగాయ పచ్చడేది తండ్రీ !
వేడి సాంబార్ సెగల కేళీ
లోచనోత్సవ రోచులేవీ ?
ఉల్లి వేసిన గట్టి పకోడీ
కర కర ధ్వనులెక్కడయ్యా !
ఎక్కడయ్యా నల్లనయ్యకు
విదురుడిచ్చిన మేటి విందు ?
ఖ్యాతినొందిన భీమ పాకపు
ఘుమ ఘుమలవి ఏవి తండ్రీ !
ఉల్లి దోశ, వడా సాంబార్
మిరప బజ్జీ, సేమ్యాకిచిడీ
రుచుల దేల్చెడి టిఫిన్లేవీ
కానరావేమీ ?
నీళ్ళు తెచ్చిన గాజు గ్లాసును
నేడు కడిగిన జాడ లేవీ ?
ఏవి తండ్రీ ! ఆర్డరిచ్చిన
ఇడ్లి పెసరట్టూ ? -పంతుల జోగారావు

16.అవాకులన్నీ
చెవాకులన్నీ
మహారచనలై మహిలో నిండగ
ఎగబడి చదివే పాఠకులుండగ
విరామ మెరుగక పరిశ్రమిస్తూ
అహోరాత్రులూ అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కె కవిపుంగవులకు
వారికి జరిపే సమ్‌మానాలకు
బిరుదుల మాలకు
దుశ్శాలువలకు
కరతాళాలకు ఖరీదు లేదోయ్
..................
..................
నరాల బిగువూ
కరాల సత్తువ
నవలల వర్షం కురిపించాలని
అవి సినిమాగా తీయించాలని
నవల రచనల కార్ఖానాలను
ప్రారంభిస్తూ
తెగవ్రా(యి)స్తూ
ఆంధ్ర పాఠకుల అలరించే యీ
అశేష రచనా విశేషమందున
సహజత్వానికి
సరళత్వానికి
నవరసాలకూ కథాంశాలకూ
డిమాండు తగ్గే సూచన లేదోయ్
....................
.................... -జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు
17.నేను సైతం
తెల్లజుట్టుకు
నల్లరంగును కొనుక్కొచ్చాను
నేను సైతం
నల్లరంగును
తెల్లజుట్టుకి రాసి దువ్వాను.
యింత చేసీ
యింత క్రితమే
తిరుపతయ్యకు జుట్టునిచ్చాను
................... -జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

18.నేను సైతం కులమతాలకు లొంగిపోయి ఓటు వేశాను
నేను సైతం నీతి లేని నాయకులనే ఎన్నుకున్నాను
నేను సైతం పచ్చనోట్ల జిలుగుబిలుగుల కమ్ముడుపోయాను
నేను సైతం దేశమాతకు లెక్కలేని తూట్లుపొడిచాను


శిశిర ఋతువే గ్రీష్మమైనా ధరణీతాపం గుర్తురాలేదే!
మంచుకొండలు కరిగిపోయినా రాతిమనసులో చలనమేలేదే!
లక్షలాది రూకలముందు భూమి విలువే తెలియనేలేదే!
నేను సైతం మానవాళి అంతానికి కారణమయ్యాను

లంచగొండులు డబ్బులడిగితే నాకునేనుగా ఒప్పుకోలేదా?
తక్కినవారిని సైతమీదారిలో వెళ్ళమనినే ప్రోత్సహించలేదా?
దేశవ్యాప్త మహమ్మారి అవినీతికినే కారణంకాదా?
నేను సైతం కోరి నీతిని హత్యచేసిన భ్రష్టుడనయ్యాను

సాటినరులే నేలకూలినా అంతరాత్మకి జాలిలేదసలు
నాకు ముఖ్యం ప్రపంచంలో నేను నా భార్య నా సుతులు
ఎక్కడైనా ఎప్పుడైనా కానరావే మానవుల వెతలు
నేను సైతాన్ జన్మనెత్తి నాకు నేనే శత్రువయ్యాను! -మలక్పేట్ రౌడీ


19. ...............
అరే ప్రకాశం
ఒరే గణేశం
ఆకలి లోకం పిలిచింది
పదండి ముందుకు
పదండి తిండికి
పోదాం పోదాం హోటల్‌కి
................ -జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు

20.నాగుపాము
కర్రసామూ
పిల్లమోమూ
సిల్లీగా చూడకు దేన్నీ
సిన్మామయమేనోయ్ అన్నీ
................
................
పరిశ్ర మొక చక్రవ్యూహం
ఎక్‌స్ట్రా దొక దిగంబరదేహం
................
................ -విద్యారణ్య కామ్లేకర్

21.పాలసీసా
నేతిడబ్బా
మందు బిళ్ళా
నిఖార్సుగా చూడకు దేన్నీ
కల్తీ మయమేనోయ్ అన్నీ
................
................
కళ్ళూడేదాకా చూడు
కాళ్ళరిగేదాకా తిరుగు
వ్యాపారమొక పద్మవ్యూహం
కల్తీ ఒక తీరని దాహం
..............
.............. -వి.వి.సుబ్బారావు

22.తౌడు బస్తాలు
అరటి గెలలు
ఆవకాయ జాడీలు
కావేవీ రవాణా కనర్హం
అవునౌను లగేజీ ముఖ్యం
.................
................. - గూటూరి

23.ఇతరేతర శక్తులు లేస్తే
పడిపోవును పేకమేడలై
వేషాలతో మోసాల్ చేసి
సినిమా డైలాగులు చెప్తే
ఓట్లు పడే రోజులు పోయాయ్
సినీ టైపు మాయాజాలం
ఇంకానా, ఇకపై సాగదు
...............
...............
ధనముంటే జరగని పని
భారతమంతా వెదికిన దొరకదు
గతమంతా గడిచే,'ట్రిక్కు'లతో
కాకుంటే వాగ్దానాలతో
.............
............. -జాగర్లపూడి సత్యనారాయణ

24.బూతుని
కామోద్రేకాన్ని
గుప్తాంగ విన్యాసాన్ని నేను
డోలు వాయిస్తే విప్లవం
కాలు జాడిస్తే నర్తనం
వలువ వేదికమీద్ వస్త్ర సన్యాసం
....................
స్తనాలు
విదిలించిన జఘనాలు
వళీ ఆవళులు నా పెట్టుబడులు
నా ఊహ రతీదేవి జోల
కామకేళీ హేల
నా గానం జంబల్ ఊళ
...............
కామాంధులు
మోహావేశులు కామ కేళికి వీక్షకులు
రిరంసువులు నా ప్రేక్షకులు
నేనొక అశుద్ధం
నా దొక దుర్గంధం
అసహ్యం అశ్లీలం నా మార్గం -ప్రసేన్

25.ఇవేమిటీ వింత పరిస్థితులు - పార్టీలో కుమ్ములాట
ఇవేమిటా రణగొణ ధ్వనులు - ఫిరాయింపులు
అవేమిటా గుసగుసలు - పదవీ వ్యామోహం
ఎచటికి పోతావీ రాత్రి - అవతలి పార్టీకి -బి.విజయశేఖర్

26.మరో కంచం మరో లంచం మరో మంచం పిలిచింది
పదండి విందుకు పదండి కాసుకు పోదాంపోదాం పదవుల్లోకి
కాళ్ళు మొక్కుతూ కథల్ చెప్పుతూ పదవి కోసం సిగ్గు విడుస్తూ
ఎత్తులేద్దాం చిత్తుచేద్దాం కనబడలేదా
తరతరాల పదవి పిశాచం -కమలారాం

27. ఆ…!

నిశ్శబ్దంగా
నిరాహారదీక్షమానేస్తే
నిర్దాక్షిణ్యంగా వీరు-
నిరాహారంగా
నీరో రాజును కుదిపేస్తే
నిబిడాశ్చర్యంతో వీరే…
 -  ఊకదంపుడు.   
28పఠితలార !
భ్రష్టులార !
కవితాసర్ప దష్టులార !
బుర్ర కాలి,
పనికి మాలి,
కవి*** రథచక్రపు
టిరుసులలో పడి నలిగిన
దీనులార !
హీనులార !
దారి లేని, జోడు లేని
పక్షులార ! భిక్షులార !
తలపు వలన పరిచ్యుతులు,
భాష వలన తిరస్కృతులు,
పఠనానికి బహిష్కృతులు
వస్తున్నారొస్తున్నారొస్తున్నారొస్తున్నారు!
జితాసువులు,
చ్యుతాశయులు,
హృతాశ్రయులు,
హతాశులై
ఉడాయించండుడాయించండి!
మీ రక్తం, మరిగి మరిగి
మీ నాడులు కదలి కదలి
మీ ప్రేవులు డోకి డోకి
ఉడాయించండుడాయించండి!
ఓ కవితానివిష్టులార !
ఓ కవితావశిష్టులార !
పఠితలార !
భ్రష్టులార !
కవితాసర్ప దష్టులార !
ఉడాయించండుడాయించండి !
వస్తున్నా యొస్తున్నాయి...
రాతరాని,
భాషలేని,
రాతగాని కవిచక్రాల్ !
రాతగాని కవిచక్రాల్ !
కవిచక్రాల్,
కవిచక్రాల్,
కవిచక్రాల్, కవిచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి !
పఠితలార !
భ్రష్టులార !
మొయిల్దారిని
బయల్దేరిని
కవిచక్రాల్, కవిచక్రా
లొస్తున్నా యొస్తున్నాయి !
కవితాచలం కదిలింది,
భాషాచలం కరిగింది,
కపాలాచలం పగిలింది
కవితాచలం,
భాషాచలం,
కపాలాచలం, హృదయాచలం...
మహానగా లెగురుతున్నాయి !
మూర్ఖరథం కదులుతున్నాది !
చూర్ణమాన
ఘూర్ణమాన
దీర్ణమాన శిరమస్తకాల్
గిరగిరగిర తిరుగుతున్నాయి !
పఠితలార !
భ్రష్టులార !
కవితాసర్ప దష్టులార !
పోపొండో ! పొండో! పొండి!
వూరిమధ్య నీరింకిన
చెరువుపక్క, చెట్టునీడ
కలాలతో, కైతలతో,
ఎటు చూస్తే అటు కవులు,
అటు దుఃఖం, పటునిరాశ
కవిసాలలు, ఉరికొయ్యలు,
కవితలతో ఘోరహత్య !
దగాపడిన పఠితలార !
మీ బాధలు నే నెరుగుదును...
వడలో, కడు
జడిలో, పెను
చలిలో తెగనవసి కుములు
మీ బాధలు, మీ గాధలు
అవగాహన నాకవుతాయి
పఠితలార !
భ్రష్టులార !
దగాపడిన తమ్ములార !
మీ కోసం కలం పట్టక ,
ఆకసపు దారులంట
అడావుడిగ వెళిపోయే,
అరుచుకుంటు వెళిపోయే
రాతగాని కవిచక్రాల్,
రథచక్ర ప్రళయఘోష
గోరీమార్గం పట్టిస్తాను !
కవి *** వేసిన
కవితాగ్ని రగిలిందట !
కవితాగ్ని పొగిలిందట !
కవితాగ్ని !
కవితాగ్ని !
కవితాగ్ని పటాలుమని
ప్రపంచాన్ని భయపెట్టింది !
అరెఝా ! ఝా!
ఝుటక్, ఫటక్ ...
హింసనణచ
ధ్వంసరచన
ధ్వంసరచన
హింసరచన
విషవాయువు, మరఫిరంగి,
టార్పీడో, టోర్నిడో!
అది విలయం,
అది సమరం,
అటో యిటో తెగిపోతుంది ?
సంరంభం,
సంక్షోభం,
సమ్మర్దన, సంఘర్షణ !
హాలహలం పొలమారింది !
కోలాహలం చెలరేగింది !
పఠితలార !
భ్రష్టులార !
ఇది కవనం,
ఇది సమరం !
ఈ యెగిరిన ఇనుప దుడ్డు,
ఈ పండిన భావ పెంట,
పాఠకులను తూలగొట్టి,
హృదయాలను తుడిచిపెట్టి,
దుర్గంధం,
దౌర్భాగ్యం,
దురదృష్టం
కవిభావం,
పునాదులై ఇళ్లు కూలాయ్,
జనావళికి అశుభం పూచి
అశాంతి, అశాంతి, అశాంతి, అశాంతి
జగమంతా జయిస్తుంది,
ఈ స్వప్నం నిజమవుతుంది !
ఈ నరకం ఋజువవుతుంది !
పఠితలార !
భ్రష్టులార !
కవితాసర్పదష్టులార !
దగాపడిన తమ్ములార !
ఉడాయించండుడాయించండి!
వచ్చేశాయ్ , విచ్చేశాయ్,
రాతరాని,
భాషలేని,
రాతగాని కవిచక్రాల్,
రాతగాని కవిచక్రాల్
కవిచక్రాల్,
కవిచక్రాల్,
కవిచక్రాల్, కవిచక్రాల్,
పోపొండో ! పొండో! పొండి!
ఈ లోకం మీది కాదండి!

మీ రాజ్యం మీకు రాలేదండి - వంశీమోహన్ మాగంటి
ఇలా పేరడీలు వ్రాయడం శ్రీశ్రీ కవిత్వానికి గౌరప్రదమైన స్థానాన్ని కల్పించటమే అవుతుంది