...

...

28, నవంబర్ 2009, శనివారం

అంతర్ముఖం, మరో రెండు కథలు!

అతడు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నించాడు?

అతడిని ఋషివర్యుడు ఎందుకు వారించాడు?

అతడి జీ(వి)తంపై ఎందరి బ్రతుకులు ఆధారపడి వున్నాయి?

ఋషివర్యుని జ్ఞానబోధ అతడిపై ఏమైనా ప్రభావం చూపిందా?

క్రమశిక్షణాలోపమే ఆత్మహత్యలకు కారణమా?

ఇంతకీ అతడు ఆత్మహత్య చేసుకున్నాడా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే అడపా చిరంజీవి గారి డైరెక్టు కథ 'అంతర్ముఖం' కథాజగత్‌లో చదవండి. పనిలో పనిగా అరుణపప్పు గారి 'ఏకాంతంతో చివరిదాకా!', వడలి రాధాకృష్ణగారి 'కొలువు' కథలు కూడా చూడండి. మీ అభిప్రాయాలు తెలుసుకోవాలని మేము ఉబలాట పడుతున్నాము.

బక్రీద్ శుభాకాంక్షలు!!!


బ్లాగ్మిత్రులందరికీ ఈద్ ఉల్ జుహా పర్వదిన శుభాకాంక్షలు!!!

25, నవంబర్ 2009, బుధవారం

మిత్ర సమాగమము - చిత్ర మాలిక!

నవంబరు 14,15 తారీఖులలో కలిసిన మా మిత్ర బృందపు విశేషాలు ఈ క్రింది ఫోటోల్లో!
















23, నవంబర్ 2009, సోమవారం

ధిక్కార స్వరం!

శ్రీ పంతుల జోగారావుగారి కథానిక ధిక్కార స్వరం కథాజగత్ వెబ్‌సైట్‌లో చదవండి.
ఈ కథపై మీ అమూల్యమైన అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నాము.

22, నవంబర్ 2009, ఆదివారం

బుడ్డా వెంగళరెడ్డి పై సమీక్ష!!!

మా అబ్జ క్రియేషన్స్ సాహిత్య సాంస్కృతిక సంస్థ ప్రచురించిన ఎస్.డి.వి అజీజ్ గారి చారిత్రక నవల బుడ్డా వెంగళ రెడ్డి పై 22-11-2009 ఆంధ్రభూమి దిన పత్రిక ఆదివారం అనుబంధంలో పాలంకి సత్యనారాయణ గారు సమీక్షించారు.
ఇక్కడ చదవండి.


20, నవంబర్ 2009, శుక్రవారం

వస్తున్నాయొస్తున్నాయి...

వర్తమాన తెలుగు కథానికా కదంబం కథాజగత్‌లో త్వరలో వెలువడనున్న కథల వివరాలు.

1.అడపా చిరంజీవి - అంతర్ముఖం √

2.యర్రమిల్లి విజయలక్ష్మి - అమ్మ చెట్టు √

3.వడలి రాధాకృష్ణ - కొలువు √

4.రావూరి భరధ్వాజ - ఆహిరి √

5.శ్రీరాగి - కుడి ఎడమైతే √

6.వియోగి- వసంత కోకిల √

7.విశాల వియోగి - శృతిలేని రాగం √

8.రమ్య - రాంగు సుబ్బారావు √

9.కోడూరి శ్రీరామమూర్తి - తెరతీయగరాదా... √

10.సిద్దెంకి యాదగిరి - కీలెర్గిన వాత √


మీరు చేయ వలసినదల్లా కొంచెం సమయం వెచ్చించి ఈ కథలన్నీ చదవటమే!

17, నవంబర్ 2009, మంగళవారం

బాల్యమిత్రుల అపురూప సమ్మేళనం!!!

ఈ నవంబర్ 14, 15 తారీఖుల్లో మా చిన్ననాటి స్నేహితులం అందరం హైదరాబాదులో కలిశాం. గుత్తిలో మాల్టస్‌స్మిత్ జూనియర్ కళాశాలలో తొమ్మిది, పది తరగతులు మేమందరం కలిసి చదివినాము. ఇరవైతొమ్మిదేళ్ళ నాటి ముచ్చట అది. ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఈ రెండు రోజులూ సరదాగా గడిపాము.

మంజునాథ సెట్టి, గంగవరం సత్యనారాయణ, మురళీకృష్ణ, జగదీష్, జగన్నాథం, గోవర్ధన గిరిధరరెడ్డి, ఇనాయతుల్లా, బషీర్, రఫీక్, వెంకటేష్, కేశవచంద్ర, చంద్రశేఖరరెడ్డి(బాబు), బాలరాజు, రఘునందన్, ఇసాక్, మోహన్‌రావ్, ఫయాజ్, నజీర్, పి.రమేష్, నాగేశ్వరరెడ్డి, నేను ఈ సమాగమంలో వున్నాము. గుత్తి, అనంతపురం, కర్నూలు, నంద్యాల, గుంతకల్లు, హైదరాబాదు, గదగ్, గోదావరిఖని, హిందూపురం ఇలా వివిధ ప్రాంతాలనుండి వచ్చాము. మాలో కొందరు టీచర్లు, కొందరు లాయర్లు, కొందరు వ్యాపారస్తులు, ఒకడు లెక్చరర్, మరొకడు ప్రొఫెసర్. ఒకడు ప్రొడక్షన్ మేనేజర్, ఒకడు ఫైనాన్షియల్ కన్సల్టెంట్. ఒకడు ఇండస్ట్రియలిస్ట్. ఒకడు ఆర్కిటెక్ట్. మరొకడు రాజకీయ నాయకుడు ఇలా అన్ని రకాల జీవన పథగాములము ఉన్నాము. మాలో ఒకడు తరచూ విదేశాలకు వెళ్తూ ఉంటాడు. ఒకడైతే మొదటిసారి హైదరాబాదు చూశాడు. ఇలా భిన్న జీవన విధానాలు కలిగిన మమ్మలనందరినీ కలిపింది ఒక్కటే. అదే స్నేహం. సంఘం కప్పిన ముసుగులను తొలగించుకుని మేము అందరం అరే ఒరే అంటూ ఎటువంటి భేషజాలూ లేకుండా ఈ రెండు రోజులూ గడిపాము.

14వ తేదీ ఉదయం 6 గంటలకు హోటల్ అతిథి ఇన్‌లో మా మిత్రులకు స్వాగతం పలికాము నేనూ, సత్య. అందరూ గుత్తి నుండి ఒక మినీ బస్సులో వచ్చారు. పలకరించడాలూ, గుర్తించడాలూ (కొందరిని చాలా ఏళ్ళ తరువాత మొదటి సారి కలిశాం) అన్నీ అయిన తరువాత అందరం రూముల్లో సెటిలై స్నానాలు ముగించుకుని తయ్యారయ్యాము. హోటల్ టెర్రేస్ పైన బ్రేక్‌ఫాస్ట్ తీసుకున్నాము. ఈ లోగా మోహన్‌రావూ, మురళీకృష్ణా మాతో జాయిన్ అయ్యారు. అందరం అదే మినీ బస్సులో గోల్కొండకు వెళ్ళాము. నలభై దాటిన మేమందరం పడుచు యువకుల్లా హుషారుగా జోకులేసుకుంటూ గోల్కొండ కోటను దర్శించాము. సుమారు రెండు గంటలు గోల్కొండలో గడిపిన తర్వాత కుతుబ్ షాహీ టూంబ్స్ చూశాము. గుత్తిలో జీవించిన వాళ్ళము కొండలూ, గోరీలు మాకు కొత్త కాకపోయినప్పటికీ గోల్కొండ పురాతన వైభవం మామిత్రులను ఆకర్షించింది. తర్వాత మధ్యాహ్నం పూర్ణ హోటల్లో భోజనాలు ముగించుకుని స్నోవరల్డ్ వైపు దారి తీశాము. స్నోవరల్డ్ లో మేమంతా చిన్న పిల్లల్లా మారిపోయాము. ఓ గంట సేపు మా ఆనందానికి అవధులు లేవు. ఆ తర్వాత అక్కడి నుండి బిర్లా మందిర్‌కు వెళ్ళాము. కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో బిర్లా మందిర్ రద్దీగా ఉంది. బాలాజీ దర్శనం చేసుకుని కోఠీలో కొందరు షాపింగ్ చేసి రాత్రి పదకొండు గంటలకు మా హోటల్ చేరుకున్నాము. ముందుగానే ఆర్డర్ ఇచ్చిన మెనూ ప్రకారం హోటల్ డాబాపై మా అందరికీ ఫుడ్ సర్వ్ చేయబడింది. కొందరు వెజిటేరియన్లు. మరికొందరు శనివారం కాబట్టి వెజిటేరియన్లు. మిగతా వారందరూ ఎన్.వీలు. కొందరు లిక్కర్ తీసుకున్నారు. షరా మామూలుగానే శనివారం కాబట్టి కొందరు మందుకు దూరంగా ఉండి మా గ్రూపులో కలిశారు. వోడ్కా, 12యేళ్ళ పాతదైన షివాస్ రీగల్ వాళ్ళు సేవించింది. తాగిన మైకంలో మా మిత్రులు చేసిన అల్లరి భరిస్తూ రాత్రి ఒంటిగంటవరకు మేలుకున్నాము.

మరుసటి రోజు ఉదయమే గదగ్ నుండి రమేష్, కర్నూలు నుండి రఘు వచ్చారు. అందరం తయ్యారయ్యేసరికి తొమ్మిది గంటలు దాటింది. అన్నీ సర్దుకుని హోటల్ వెకేట్ చేసి పక్కనే ఉన్న కామత్ హోటల్లో బ్రేక్‌ఫాస్ట్ కానిచ్చి రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాము. రామోజీ ఫిల్మ్ సిటీలో మేము చూసినవి మూవీ మాజిక్, ఫిల్మీ దునియా, స్టంట్ షో, ఫన్ షో, స్పిరిట్ ఆఫ్ రామోజి ఫిల్మ్ సిటీ, బోరాసుర వగైరా. అక్కడ అన్నింటి కన్నా మమ్మల్ని బాగా అలరించింది రేంజర్ అనే కాంప్లిమెంటరీ రైడర్. దీన్లో మేము సవ్య దిశలో రెండు చక్కర్లు, అపసవ్య దిశలో రెండు చక్కర్లు కొడతాము. ఆకాశంలో పూర్తి తలక్రిందలుగా కొన్ని సెకెన్లు అలాగే ఉంటాము. అప్పుడు వేసే భయానికి నోరు కూడా పెగలదు. జీవితంలో ఇలాంటి అనుభవం ఒకసారైనా ఉండితీరాలి. సాయంత్రం ఆరుగంటల దాకా రామోజీ ఫిల్మ్ సిటీలో గడిపి అక్కడి నుండి నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతున్న ఒక ఎక్జిబిషన్‌కు వెళ్ళాము. అక్కడి రష్షులో ఎవరికీ షాపింగ్ చేయడానికి వీలు పడలేదు. మా ప్రమేయం లేకుండానే లోపలికి త్రోయబడి మా ప్రమేయం లేకుండానే బయటకు నెట్టివేయబడ్డాము. ఇక మేము విడిపోయే సమయం ఆసన్నమయింది. అందరం ఒకరికొకరు థాంక్స్ చెప్పుకున్నాము. వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి మేం మా యిళ్ళకి వెళ్ళిపోయాము. కొన్ని చిన్న చిన్న అసౌకర్యాలు మినహాయిస్తే మా పార్టీ విజయవంతమయ్యిందనే చెప్పాలి. ఈ పార్టీ తాలూకు ఫోటోలు త్వరలోనే మరో టపాలో మీముందు ఉంచుతాను.

13, నవంబర్ 2009, శుక్రవారం

చెప్పుకోండి చూద్దాం!

కొండ నుండు నెమలి కోరిన పాలిచ్చు
పశువు శిశువు తోడ పలుక నేర్చు
వనిత వేదములను వల్లించు చుండును
బ్రాహ్మణుండు కాకి పలలము తిను.


ఇదెలా సాధ్యమో ఎవరైనా వివరించ గలరా!

3, నవంబర్ 2009, మంగళవారం

బుడ్డా వెంగళరెడ్డి


ఎస్.డి.వి.అజీజ్ రచించిన బుడ్డా వెంగళరెడ్డి చారిత్రక నవల మా సంస్థ తరఫున ప్రచురించిన విషయం తెలిసినదే. ఇప్పుడు ఆ పుస్తకం హైదరాబాదులోని ప్రముఖ పుస్తకాల దుకాణాలలో అంటే విశాలాంధ్ర, నవోదయ, తెలుగుబుక్ హౌస్, దిశపుస్తకకెంద్రం, ప్రజాశక్తి, సహచర బుక్‌మార్క్,సాహిత్యనికేతన్, ఆంధ్ర సారస్వత పరిషత్ మొదలైన చోట్ల లభిస్తుంది. ఆంధ్ర దేశంలో ఉన్న విశాలాంధ్ర, ప్రజాశక్తి వారి బ్రాంచీలలో కూడా లభ్యమవుతుంది. విదేశాలలో ఉన్న వారు ఈ పుస్తకాన్ని కొనుగోలు చేయదలిస్తే ఎ.వి.కె.ఎఫ్. వారి బుక్ లింక్‌ను చూడండి. వెల కేవలం యాభై రూపాయలు మాత్రమే కాబట్టి వీలున్న వారు ఈ పుస్తకాన్ని కొని చదవమని నా విన్నపం.

2, నవంబర్ 2009, సోమవారం

పరాకు మానిసి!

ఒక పదాన్ని గానీ పదబంధాన్ని గానీ వెనుకనుండి చదివినా ముందునుండి చదివినా ఒకేలా ఉంటే దానిని ఇంగ్లీషులో palindrome అని అంటారు. ఉదా:- కిటికి, వికటకవి, మందారదామం వగైరా. ఇలాంటి palindromeతో కూడిన ఒక సంభాషణను ఎప్పుడో చిన్నప్పుడు చదివాను. దీనిని శ్రీశ్రీ కృష్ణశాస్త్రుల మధ్య నడిచిన సంభాషణగా ఊహించి ఎంత చక్కగా అల్లారో చూడండి.

కృ.శా. : రారా శ్రీశ్రీ రారా!
శ్రీశ్రీ : యాటికిరా కిటియా!
కృ.శా. : సినిమాకురా పరాకు మానిసి!
శ్రీశ్రీ : రాలేనులేరా!


సరదాగా గమ్మత్తుగా లేదూ!

1, నవంబర్ 2009, ఆదివారం

కథాజగత్‌లో మరో రెండు కథలు!

వర్తమాన కథా కదంబం ఆధునిక తెలుగు కథానిక శత వార్షికోత్సవాల కానుక కథాజగత్ వెబ్‌సైటులో కొత్తగా రెండు కథలు చేరాయి. మొదటిది స్వాతి శ్రీపాద రచించిన ఎర అనే కథ. రెండవది డా.టీ.సంపత్‌కుమార్ వ్రాసిన మSheన్ అనే కథ. వీటిల్లో ఎర డైరెక్టు కథ కాగా మsheన్ స్త్రీవాద పత్రిక భూమికలో ఆగస్టు 2008లో ప్రచురింపబడింది. చదివి మీ అభిప్రాయాన్ని తెలపండి.