...

...

29, డిసెంబర్ 2008, సోమవారం

ప్రకటన

బ్లాగ్మితృలారా!
అతిత్వరలో తురుపుముక్కలో ఈ క్రింది పుస్తకాలు సమీక్షింప బడతాయి.
హిరణ్య రాజ్యం - వేంపల్లి గంగాధర్
పొగచూరిన ఆకాశం - అద్దేపల్లి రామమోహన రావు
మగ్గం బతుకు - రాధేయ
సాహితీ సౌరభం - రేగులపాటి కిషన్ రావు
కడప కథ - తవ్వా ఒబుల్‌రెడ్డి
సమాచారం బాట సంచలనాల వేట - నాగసూరి వేణుగోపాల్
ఢమరుక్స్ - ఏటూరి నాగేంద్ర రావు
సాహిత్యం ఎందుకు చదవాలి? - తిరుమల శ్రీనివాసాచార్య
సుదర్శనం - మోపిదేవి విజయగోపాల్
కిరణ బాణాలు - గురజాడ అప్పారవు
పద్యం - రసనైవేద్యం - దోరవేటి
మొగిలి పూలు - రేగులపాటి విజయలక్ష్మి
ఇందిరాగేయాలు - సత్యవాడ(ఓగేటి) ఇందిరా దేవి
అక్షతలు - అయ్యదేవర పురుషోత్తమ రావు
హృదయంగతం - బద్ది నాగేశ్వర రావు
హైకూ సమయం - శంకర
హైకూ భావనలు - శంకర
తుఫాను ముందటి ప్రశాంతి - రాధేయ
అతడే.... - టి.రాజారాం
నెలవంక - కందేపి రాణీ ప్రసాద్
పిట్టలేని లోకం - అద్దేపల్లి ప్రభు
కాకి గోల - పాలపర్తి జ్యోతిష్మతి
స్తుతి వైజయంతి - సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి
ఇందిరాదర్శనం - సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి
ఆనంద ధార - సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి
మాతెలుగు తల్లికి మల్లె పూదండ - సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి
అమృత వర్షిణి - సత్యవాడ(ఓగేటి) ఇందిరాదేవి
స్పర్శ - జాలాది రత్న సుధీర్
సంబంధం - గుమ్మా ప్రసాద రావు
ఆ కథలూ.... ఈ కథలూ...! - ఎం.వి.జే.భువనేశ్వర రావు
ఉత్తమ నాయకత్వం - బుడ్డిగ సుబ్బరాయన్
మునిసుందరం సాంఘిక రూపకాలు - ఎస్. మునిసుందరం
ఖండిత - వి.ప్రతిమ
వర విక్రయం - ఐతా చంద్రయ్య
కుంకుమ రేఖ - ఐతా చంద్రయ్య
స్వేచ్చా జీవులు - ఐతా చంద్రయ్య
తెలుగు కథా సమాలోచనం - సమాలోచన
పిట్సుభర్గ వేంకటేశ శతకము - కసిరెడ్డి
అమాస పున్నాలు - కసిరెడ్డి
వెలుగుకు వెనుక - అయ్యగారి శ్రీనివాస రావు
అదవి పూలు - అయ్యగారి శ్రీనివాస రావు
సబల - అనంత లక్ష్మి
స్వర్ణ భారతి - అనంత లక్ష్మి
అసిధార - కస్తూరి మురళీ కృష్ణ
వాస్తవం - చిట్టా దామోదర శాస్త్రి
మధుమాసం - చిట్టా దామోదర శాస్త్రి
అనుగ్రహం - చిట్టా దామోదర శాస్త్రి
అపురూప కథా వీధి - చిట్టా దామోదర శాస్త్రి
ఆనందామృత కథా వీధి - చిట్టా దామోదర శాస్త్రి
నక్షత్రేష్టి - చిట్టా దామోదర శాస్త్రి
ఆపాత మధుర కథా వీధి - చిట్టా దామోదర శాస్త్రి
కథలూ - కబుర్లూ - కొత్తింటి సునంద
తప్పక చదివి మీ స్పందనను తెలపండి.

28, డిసెంబర్ 2008, ఆదివారం

పుస్తక సమీక్ష - 2 స్వాతిముత్యాలు, నెమలి కనులు

సాంప్రదాయ కవిత్వానికి కాలం చెల్లింది అనే విమర్శకు సమాధానంగా ఇప్పుడు అక్కడక్కడా పద్య రచనలు వెలువడుతునే వున్నాయి. కూచిపూడి నాట్యాచారునిగా, కళాకారునిగా, శాస్త్రీయ నాట్య రూపక కర్తగా, రచయితగా, కవిగా బహుముఖ ప్రతిభ కనపరుస్తున్న యువకుడు శ్రీ దండిభొట్ల వైకుంఠ నారాయణ మూర్తి కలం నుండి వెలువడిన శతక రచన " స్వాతిముత్యం " కూడా పై విమర్శకు ఒక రకమైన సమాధానమే! "మూర్తి పలుకు స్వాతి ముత్యమొలుకు" అనే మకుటంతో వెలువడిన ఈ పుస్తకంలో కవి తన మనసులోని భావనలకు అద్భుతంగా కవిత్వ రూపమిచ్చినారు.సామజిక విశ్లేషణలు ఈ శతకంలో కోకొల్లలు.కవి పరిశీలనాసక్తికి, రచనా ప్రతిభకు ఈ శతకమొక అచ్చమైన ప్రామాణ్యము. ఇంద్ర పదవి కన్న ఆంధ్ర యశము మిన్న అంటూ తమ భాషాభిమానాన్ని చాటుతున్నారు. ముళ్ళ చెట్లకు నీరు పోసి పెంచినా అవి మన రక్తాన్ని చూసినట్లు వంచకులకు మేలు చేయతగదని కవి అంటారు. సంస్కార గుణం జన్మతః అలవడుతుందని కవి భావన.భూమిపై పనికి రాని వస్తువు లేదని, లౌక్యుడు ఎటువంటి స్థితినైనా ఎదుర్కోగలడని, విఫలమైనా విడువక ప్రయత్నిస్తే గెలుపు దక్కుతుందని, కుజనుల గుంపులో మంచివారుండజాలరని ఇలా సామాజిక సత్యాలను ఎన్నో కవి ఈ శతకంలో పేర్కొన్నారు.అందమైన ఆటవెలదులతో అలరించే ఈ శతకము సాహిత్య ప్రియులందరూ ఆహ్వానించ తగినది.
మచ్చుకు రెండు పద్యాలు ఆస్వాదిద్దాం.

అవసరమ్ము కలుగ అరి కూడ స్వజనుండు
లేనివేళ హితుడె కానివాడు
మధువు చేదుకాదె మధుమేహ రోగికి
మూర్తి పలుకు స్వాతి ముత్యమొలుకు.

గంగిరెద్దు లయకు కాలు కదల్చును
మంచి పాట విన్న మబ్బు కరగు
కళను వీడు నరుడు కంటక హృదయుండు
మూర్తి పలుకు స్వాతి ముత్యమొలుకు.


ఈ యువకవి మరో కవితా సంపుటి నెమలి కనులు. చతుష్పాద పద్యాలనే కాక ద్విపదలను కూడా నైపుణ్యంగా వ్రాయగలరని నిరూపిస్తుంది ఈ పుస్తకం. ద్విపదలంటే ఛందోబద్ధమైన ద్విపదలు కావండోయ్! రెండు లైన్ల ఆధునిక కవితలన్నమాట. అల్పాక్షరాలలో అనల్పార్థాలను వ్యక్తం చేస్తున్నాయి ఈ నెమలి కనులు. వీటిలో ఎన్నెన్నో సూక్తులూ, నిత్యసత్యాలు వున్నాయి. చమత్కారాలు, వ్యంగ్యాలు కనిపిస్తాయి. పక్షులకు తెలియవు మోసాలు/ అందుకే వాటికక్కర లేవు వీసాలు, హారతి కర్పూరం-ప్రేయసి/ పచ్చ కర్పూరం- భార్య, అనురాగం అణువంతున్నా చాలు/ చినుకుకే నెమలి పులకించదా?, నిశ్చలంలో నీరే నిలువుటద్దం/ ప్రశాంతతలోనే పరమార్థం ఈ పంక్తులు చాలవా కవి ప్రతిభను బేరీజు వేయడానికి?

[స్వాతిముత్యాలు, నెమలి కనులు ఈ రెండు కృతుల రచన శ్రీ దండిభొట్ల వైకుంఠ నారాయణ మూర్తి, వెల చెరి 50రూ.లు(విదేశాలకు 5 $) ప్రతులకు దండిభొట్ల, ఫ్లాట్ నెం. 301, సత్యసాయి నిలయం, ఓల్డ్ మల్కాజిగిరి, రామాలయం ఎదురుగా, సికిందరాబాదు 500 047]

25, డిసెంబర్ 2008, గురువారం

ఏం పుస్తకాలు ఉచితంగా ఇవ్వకూడదా?

మన రచయితలు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి తమ తమ రచనలను పుస్తకాల రూపంలో ప్రచురిస్తున్నారు.ఆ పుస్తకాలను పలువురు చదివి తమ అభిప్రాయాలను ప్రకటించాలని ప్రతి రచయితా కోరుకొంటాడు. తమ పుస్తకాలు సరియైన పాఠకుని చేతికి చేరాలని ఆశిస్తాడు ప్రతి రచయితా.తాము ప్రచురించిన పుస్తకాలతో లాభాలను గడించి దానితో జీవిక కొనసాగించాలని మామూలు రచయితలెవరూ కోరుకోవడం లేదు. తాము పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తే అదే పదివేలు అనుకొనే రచయితలెందరో. అయితే పుస్తకంలో ఎంత పస వున్నా అది పాఠకుని దృష్టికి తీసుకు రావడానికి రచయిత బ్రహ్మ ప్రయత్నమే చేయాల్సి వుంటుంది. తమ పుస్తకాలకు తగిన ప్రచారం ఇవ్వడం ప్రస్తుతం గగన కుసుమంగా వున్నది. ప్రస్తుత తరుణంలో పత్రికలలో పుస్తక సమీక్షలే పుస్తకాలకు కొంతలోకొంత ప్రచారాన్ని కల్పిస్తున్నాయి. ఆ సమీక్షలైనా ఆ పత్రికల ఇష్టాయిష్టాలపై, దయాదాక్షిణ్యాలపై ఆధారపడి వుంటుంది.ఈ సమీక్షలకు తక్షణం లభించే స్పందనకూడా ఆ రచయితలు ఆశించినంతగా ఉంటుందని అనుకోవడం అసాధ్యం. పుస్తకాలనైతే ఎలాగో ప్రచురిస్తున్నారుగానీ వాటిని అమ్ముకొనే నేర్పును మాత్రం చాలామంది రచయితలు అలవరచుకోలేక పోతున్నారు. పేరున్న పుస్తక విక్రేతలపై భారం వేసి వారు అమ్మి పెట్టే ఒకటి రెండు ప్రతులకోసం చకోర పక్షుల్లా ఎదురుచూస్తూ వుంటారు మన రచయితలు.తమ పుస్తకాలను అమ్ముకోవడానికి మరో ఆధారం గ్రంధాలయాలు. అయితే గ్రంధాలయాలలో కొనుగోళ్లు ఆయా గ్రంధాలయాధికారుల అభిరుచులపై, నిధుల లభ్యతపై ఆధారపడిఉంటుంది.ఇటువంటి పరిస్థితులలో రచయితలు తమ పుస్తకాలను ఉచితంగా ఇవ్వకుండా ఏం చేయాలి? ఇంట్లో కట్టలుకట్టలుగా పడిఉండే బదులు వాటిని ఉచితంగానైనా సరే ఇచ్చి చదివించేలా చేయడం మంచిదా? కాదా? ఉచితంగా ఇవ్వగలం గాని వాటిని చదివించడం మాత్రం మన చేతుల్లో ఉందా?అంత ఖర్చు పెట్టి ప్రచురించి ఉచితంగా కాంప్లిమెంటరీల రూపంలో తోటి రచయితలకు, స్నేహితులకు, తెలిసిన వారికి ఇవ్వడం తప్పు అని గుడిపాటి, కస్తూరిమురళీకృష్ణ మొదలైన అనేక మంది రచయితల నిశ్చితాభిప్రాయం. వింజమూరి అచ్యుతరామయ్య లాంటివారు కాంప్లిమెంటరీ కాపీ ఇచ్చినా సున్నితంగా తిరస్కరించి మన మనసు నొప్పించకుండా ఆ పుస్తకం వెలలొ కొంత మొత్తం చెల్లించి ఆ పుస్తకాన్ని తీసుకుంటారు. అందరూ అచ్యుతరామయ్యలైతే నాకు ఈ టపా రాసే శ్రమ వుండేదికాదు కదా? మొదటి ఏడాది మాత్రం ఎవ్వరికీ కాంప్లిమెంటరి కాపీలు ఇవ్వవద్దని వేదగిరి రాంబాబు ఒకసారి నాతో అన్నారు. ఎంతో అనుభవంతో చెప్పిన మాట అది. అయ్యగారి శ్రీనివాస రావు లాంటి రచయితలు తమ పుస్తకాలను ఉచితంగా ఇవ్వరు. ఎంతోకొంత సొమ్ము పెట్టి తమ పుస్తకాలను కొనేలా మనలను ఒప్పిస్తారు. ఇది నిజంగా, మనస్ఫూర్తిగా ఆహ్వానించదగ్గ ప్రయత్నమే. ఇటువంటి ప్రతిభ మన రచయితలందరికీ ఉంటే ఎంత బావుణ్ణు? అటువంటి ప్రతిభ లేని రచయితలు తమ పుస్తకాలను ఇష్టపడి చదివే వారికి మనస్ఫూర్తిగా ఇవ్వగలిగితే ఫ్రీగా ఇవ్వడం తప్పు కాదని, తప్పనిదని నా అభిప్రాయం.

23, డిసెంబర్ 2008, మంగళవారం

పుస్తక సమీక్ష ! -1 గోపాలం

పుస్తక పఠనం నాకు అత్యంత ఇష్టమైన అభిరుచి. ఈమధ్య పుస్తకాలు చదవడం బాగా తగ్గినప్పటికినీ వీలు చిక్కినప్పుడల్లా చదవడానికే ప్రయత్నిస్తున్నాను. ఈ మధ్య కొన్ని పుస్తకాలను కొన్ని పత్రికలలొ సమీక్షించడం వలన నాకు చాలామంది రచయితలతో పరిచయం ఏర్పడింది. కొన్ని సభలకు హాజరు అయ్యే అవకాశమూ దక్కింది. ఫలితంగా ఆయా రచయితల పుస్తకాలను కాంప్లిమెంటరీ గా పొందే అదృష్టం లభించింది. కొందరు తమ పుస్తకాలను పోష్టు ద్వారా పంపి సమీక్షించాల్సిందిగా కోరారు. ఆవిధంగా ఇప్పుడు నాదగ్గర పుస్తకాలు పేరుకు పొయాయి. వాటిని అన్నింటినీ చదివి ఈ శీర్షికలో పరిచయం చేయడానికి ప్రయత్నం చేస్తాను.
ప్రస్తుతం నేను మీకు పరిచయం చేస్తున్నది ఎనుగంటి వేణుగోపాల్ వ్రాసిన హాస్య కథల సంపుటి గోపాలం గురించి. ఎనుగంటి వేణుగోపాల్ నాకు భద్రాచలంలో జాగృతి పత్రిక వారు నిర్వహించిన తెలుగు కథారచయితల సమ్మేళనంలొ పరిచయమయ్యారు. ఆ రెండు రోజుల్లో సన్నిహిత మిత్రుడైనారు. అంతకు ముందే వేణుగోపాల్ కథల పుస్తకం అమ్మా నాన్నా చదివి వుండటంతొ అతనిపై ఒక అభిమానం ఏర్పడింది. వేణుగోపాల్ ఎంతో అభిమానంగా పంపిన ఈ గోపాలం పుస్తకాన్ని అంతే అభిమానంతో చదివాను.
ఈ పుస్తకంలో 12 కథలున్నాయి. ఈ కథలన్నిట్లోనూ గోపాలం కథానాయకుడు. యమలోకం లో భూలోకం అనే కథ మాత్రం దీనికి మినహాయింపు. ఇతడో స్పెషల్ క్యారెక్టర్. ఇతడి చర్యలు బోలెడు హాస్యాన్ని పండిస్తాయి.ప్రేమించి పెళ్ళాడాలనే గోపాలం కోరిక ఎలా అభాసు పాలయ్యిందో రామవ్వ గారి మనవడు కథలోను, గోపాలం ప్రేమ కథ అనే కథలోను రచయిత చక్కగా హాస్యం చిందేలా వర్ణించారు. వీరివీరి గుమ్మడి వీరి బాధేంటి? అనే కథలో గోపాలం చేష్టలు ఇరుగుపొరుగు మగవాళ్ళకు కంటగింపుగా ఉన్నా అతని ప్రవర్తనకు అసలు కారణం తెలిసి వారంతా గోపాలాన్ని చివర్లో ఓదారుస్తారు. కాన్వెంటు స్కూళ్లలో అడ్మిషన్లకై తల్లిదండ్రులు పడే తిప్పలను పాపం గోపాలం కథలో వివరిస్తారు వేణుగోపాల్. తెలుగు టి.వి.చానళ్లపై, అవి చూపే కార్యక్రమాలపై ఒక మంచి సెటైర్ యమలోకం లో భూలోకం అనే కథ.'టచ్ మి నాట్'లాగుండే సూపరింటెండెంట్ కు మన గోపాలం ఇచ్చిన షాక్ తగిన శాస్తి కథలో నవ్వును తెప్పిస్తుంది. వింత వింత కోరికలతో చంపుకుతింటున్న భార్య రోగం కుదర్చడానికి గోపాలం పన్నిన ఎత్తుగడ కథ మలుపు తిరిగింది లో చదివి మనసారా పాఠకులు నవ్వుకోవచ్చు. కవులు, రచయితలపై వేణుగోపాల్ విసిరిన వ్యంగ్యాస్త్రం కవి గోపాలం అనే కథ. మతిమఱుపు వలన జనించే హాస్యాన్ని గోపాలం నాలిక్కరుచుకున్నాడు అనే కథలో బాగా పండించారు రచయిత. తనపై అధికారిని అర్థం చేసుకొవడంలో విఫలమై అతనిపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలనుకున్న ఉద్యోగి చివరకు పశ్చాత్తాప పడే వైనం బాస్ స్.. కథలోను, భవిష్యత్తులొ జరగబోయే సంఘటనల ఊహ 2057 కథలోను, సెల్ ఫోన్ల ప్రహసనాన్ని నన్ను దోచుకొందువటే కథలోను చదవ వచ్చు.
ఈ కథలు హాయిగా చదివించేస్తాయి అన్న ముళ్ళపూడి వెంకటరమణ, రావికొండల రావు గార్ల అభిప్రాయంతో ఎవరూ విభేదించలేరు. అయితే ఎనుగంటి వేణుగోపాల్ హాస్య రచనలకన్నా సీరియస్ రచనలు బాగా చేస్తారు అని నాకు అనిపించింది. అంటే హాస్య రచనలు బాగా చేయరని కాదు. సీరియస్ రచనలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నా విజ్ఞప్తి.
ఇంకా ఈ గోపాలం పుస్తకంలో నాకు బాగా నచ్చిన అంశం దీని ప్రచురణకు ప్రకటనల ద్వారా ధన సేకరణ చేయడం. సొంతంగా చేతి చమురు వదిలించుకుని పుస్తకాలను ప్రచురించుకుని బాధ పడే అనేక మంది రచయితలకు ఎనుగంటి వేణుగోపాల్ ఒక ఆదర్శంగా నిలుస్తారు. బాపు ముఖచిత్రంతో అందంగా వెలువడిన ఈ పుస్తకాన్ని కొని (వెల రూ.70/- మాత్రమే) చదవాలనిపిస్తే రచయిత ఫోన్ నెంబరు 9440236055 కు సంప్రదించండి.

19, డిసెంబర్ 2008, శుక్రవారం

నా గోడు ! -1

నాకు దినచర్య వ్రాసుకునే అలవాటు మొదటి నించీ లేదు. ఇకపై అప్పుడప్పుడూ నా గోడును ఇక్కడ మీకు వినిపిస్తాను. ఈరోజు సాయంత్రం కస్తూరి మురళీ కృష్ణతో కలిసి హైదరాబాద్ బుక్ ఫెయిర్ లో నా పుస్తకాలను రచయితల స్టాల్ లో పెట్టాను. ఆ స్టాల్ లో మాతో పాటు మరో ఇద్దరు మాత్రమే తమ పుస్తకాలను ఉంచారు. ఒకరు గుంటూరు నుంచీ వస్తే మరొకరు హైదరాబాద్ నుంచి వచ్చారు. స్టాల్ అంతా బోసిగా ఉంది. మా అదృష్టం కొద్దీ ఒక్కరు కూడా మా స్టాల్ వైపుకు రాలేదు. కర్ర ఎల్లారెడ్డి, జగన్ రెడ్డి తదితరులు వచ్చారు కాని పుస్తకాలవైపు చూడనే లేదు. బహుశా రేపటి నుంచీ ప్రదర్శకుల సంఖ్య పెరగ వచ్చు. అప్పుడు మా స్టాల్ కు కూడ చూడడానికి కొందరు వస్తారు అని ఆశిస్తున్నాను. కస్తూరి తమ బ్లాగర్లను మా స్టాల్ కు పట్టుకొచ్చారు. మహేష్ కస్తూరి పుస్తకాలను కొన్నారు. మా కొట్లో మొదటి బోణీ కావడం మాకు ఆనందాన్నిచ్చింది. మహేష్ గారికి ధన్యవాదాలు. ఈ పది రోజుల్లో నా పుస్తకం ఒకటైనా అమ్ముడు పోదా? వేచి చూడాలి.

17, డిసెంబర్ 2008, బుధవారం

స్వాగతం!!

ఓ సైబర్ స్రష్టలారా! నెట్ వరిష్టులారా!! బ్లాగాగ్రేసరులారా!!! ఇక పై మీ ఆట కట్టు. తురుపుముక్కను విసురుతున్నాను కాచుకోండి.