...

...

31, డిసెంబర్ 2010, శుక్రవారం

నూతన సంవత్సర శుభాకాంక్షలు!!!


మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నూతన సంవత్సరం (2011) సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు!

భరత సుతుడా మేలుకో! -16

145.ముప్పదేండ్లుగ నలుబదేండ్లుగ
       తీర్పునెరుగని వ్యాజ్యమున్నను
       కోర్టులిచ్చట సిగ్గుపడవుగ
       భరత సుతుడా మేలుకో!

146.నీవు గెలిచిన నేను ధర్నా
       నేను గెలిచిన నీవు ధర్నా
       కోర్టుతీర్పుకు విలువలేదిక
       భరత సుతుడా మేలుకో!

147.న్యాయ మమ్మెడు దుకాణముగా
       న్యాయస్థానము మారిపోవగ
       న్యాయదేవత ఏడ్చుచున్నది
       భరత సుతుడా మేలుకో!

148.నిరసనకు మరి త్యాగనిరతికి
       ఆత్మహత్యయె గొప్ప స్ఫూర్తిగ
       చెప్పువారల దునుము కొరకని
       భరత సుతుడా మేలుకో!

149.శవమునడ్డము పెట్టి ధర్నాల్
       చేయుచుందురు కోర్కె తీరగ
       శవము సాధనమగుట పతనము
       భరత సుతుడా మేలుకో!

150.'బి.టి.'విత్తుల కూరగాయలు
       తినుచు జనులు చచ్చుచుండగ
       జనము తగ్గుటకిదియె మేలట
       భరత సుతుడా మేలుకో!

151.పొట్టపగులగ మెక్కి ఇంకను
       పరులఁగాల్చుక తినుటె బ్రతుకను
       భావమొదవెను దేశమందున
       భరత సుతుడా మేలుకో!

152.ధర్మరాజును ధర్మదేవత
       ధర్మయముడిట పుట్టియున్నను
       ధర్మమెరుగని జాతియైనది
       భరత సుతుడా మేలుకో!

153.కన్ను నడువదు కాలు చూడదు
      అయిననూ అవి కలిసియున్నవి
      ఒకరి క్షేమము నొకరు అరయగ
      భరత సుతుడా మేలుకో!

154.మంచి మాటను ఆచరింపగ
       గుండె దిటువును కూర్చుకొనవలె
       నిచ్చజచ్చెడు పిరికివైతివి
       భరత సుతుడా మేలుకో!

155.వారసులమై పుట్టినందుకు
       కీర్తిశేషులు సిగ్గుపడియెడు
       విధముగా మన బ్రతుకులున్నవి
       భరత సుతుడా మేలుకో! 


- వరిగొండ కాంతారావు  
  

30, డిసెంబర్ 2010, గురువారం

భరత సుతుడా మేలుకో! -15

134.వందేమాతర మనెడు గీతము
       పాడవలదని 'ఫత్వా'వచ్చెను
       భరతమాతకు పాడెగట్టిరి
       భరత సుతుడా మేలుకో!

135.జెండా నెరుగని దేశముండున
      గీతమెరుగని జాతియుండున
      వందేమాతర మన్న దోషమ?
      భరత సుతుడా మేలుకో!

136.నేడు గీతము వలదనందురు
       రేపు సరిహద్ లేదనందురు
      ఆగడాలకు అంతమెక్కడ
      భరత సుతుడా మేలుకో
!

137.భూమి వల్లనె మనిషి పుట్టువు
       ధరణి వల్లనె మనిషి మనుగడ
       నేలతల్లికి మ్రొక్క నఘమట
       భరత సుతుడా మేలుకో!

138.మనలో మనమే కొట్టుకొనగా
       పరులు ఏలుట కొచ్చినారట
      మరల ఇప్పుడు అదే తంతుగ
      భరత సుతుడా మేలుకో!

139.పైడి మోజుతొ సంకెలందున
       ఇష్టపూర్తిగ చిక్కుకొంటిమి
       పసిడి కత్తితొ వాడు సిద్ధము
       భరత సుతుడా మేలుకో!

140.అన్నదమ్ములు తన్నుకొందురు
       పరుల పంచన బ్రతుకుచుందురు
       ఇదియే స్వేచ్చని తెలుపుచుందురు
       భరత సుతుడా మేలుకో!

141.మనకు తోచదు చెబితె వినము
       హిందూ దేశపు ఖర్మకాలెను
       మనిషికిప్పుడు కాళ్ళు నాలుగు
       భరత సుతుడా మేలుకో!

142.దేశమనగా మట్టి సాక్షిగ
       మనిషి మనిషికి లంకె భావన
       లంకె లేదన దేశద్రోహము
       భరత సుతుడా మేలుకో!

143.కూల్చి  పేల్చుచు దేశనాశము
     చేయువారికి హక్కులుండును
     వారిగాఁవగ సంఘముండును
     భరత సుతుడా మేలుకో!

144.'తల్లి' అనగనె లోకమంతకు
       తల్లిగా గుర్తెరుగవలెగద
       తల్లి ఎవతను మాటవచ్చెను
       భరత సుతుడా మేలుకో! 


- వరిగొండ కాంతారావు  
 

29, డిసెంబర్ 2010, బుధవారం

భరత సుతుడా మేలుకో! -14

123.మంచి అమ్మకు మంచి పుత్రులు
       మంచి పుత్రులె మంచి పౌరులు
       మంచి పౌరులె మంచి దేశము
       భరత సుతుడా మేలుకో!

124.ఇల్లు నాశనమగుట వల్లనె
       దేశనాశము సంభవించును
       ఇంటితీరును చక్కదిద్దగ
       భరత సుతుడా మేలుకో!

125.మంచి గృహమన మంచి గ్రామము
      మంచి గ్రామము మంచి దేశము
      గృహమె దేశము ఎంచిచూడగ
      భరత సుతుడా మేలుకో!

126.భరతదేశమ్మెందుకిదియో
       ఇచట పుట్టిన వారలందరు
       ఎరుగకుండుట దేశద్రోహము
      భరత సుతుడా మేలుకో!

127.ఇచటి దేహపు కణములన్నియు
       భరత దేశపు మట్టి కణములు
       కాదనినచో వదలిపొమ్మన
       భరత సుతుడా మేలుకో!

128.ఆంగ్ల భాషలొ భరతదేశ
       మ్మర్థమవ్వదు ఏరికైనను
       భావదాస్యము మానుకొనుటకు
       భరత సుతుడా మేలుకో!

129.జాతి సంస్కృతి కగ్గిపెట్టెడు
       రచనలన్నియు గొప్పవేనట
       గృహము దగ్ధము కాకమునుపే
       భరత సుతుడా మేలుకో!

130.మనలో మనకే కుమ్ములాటలు
       పరులు మొత్తగ మిన్నకుందుము
       స్వపర భేదము మరచిపోతిమి
       భరత సుతుడా మేలుకో!

131.దేశనేతలు చంపబడుదురు
       దోషులెవరో తెలియకుందురు
       సిగ్గునెఱుగని దేశమైనది
       భరత సుతుడా మేలుకో!

132.గడియ గడియకు పిరికితనముతొ
       చచ్చువారలు భరతభూమిలొ
       ఏల పుట్టిరొ దేవునడుగగ
       భరత సుతుడా మేలుకో!

133.మనసు బానిస ఒడలు బానిస
       వెరశి మొత్తము మనిషి బానిస
       జాతి సంపద బానిసత్వమ?
       భరత సుతుడా మేలుకో!

- వరిగొండ కాంతారావు

భరత సుతుడా మేలుకో! -13

112.ఆడువారల రొష్టుపెట్టెడు
      వారలాడకు లొంగువారలు
     పిల్లి పెంపుడు పురుషుడాయెను
      భరత సుతుడా మేలుకో!

113.అమ్మకమ్మకు మూలమమ్మయె
       పురుషునకు సౌభాగ్యమబ్బదు
       మంచి చెడులకు అమ్మె మూలము
       భరత సుతుడా మేలుకో! 


114.భర్తవంశము మ్రోయవచ్చిన
      వనిత భర్తను తెగడుచుండిన
      సంతు మొత్తము కాంతి రహితము
      భరత సుతుడా మేలుకో!
 

                       115.భర్తహేతువు భార్యదుఃఖము
                             వంశనాశక కాలఘంటిక
                             ఎఱుగజాలని భర్తలెందరొ
                             భరత సుతుడా మేలుకో!

116.ఆచితూచుచు మాటలాడగ
       భార్యాభర్తల బంధమేటికి
       వేశ్యావిటులతొ పనులు జరుగును
       భరత సుతుడా మేలుకో!

                       117.ఆలుమగలలొ ప్రేమపుట్టును
                              ప్రేమ యందే శిశువు పుట్టువు
                              ప్రేమ తేనెకు గృహము పట్టని
                              భరత సుతుడా మేలుకో!

118.బంధువర్గము వలదువలదని
       తల్లిదండ్రులు నేర్పియుండగ
       కన్నవారిని సంతువలదనె
       భరత సుతుడా మేలుకో!

                     119.భార్యాభర్తలు మాటలందున
                           నాదినాదని స్ఫర్థపూనిన
                          మూడుముళ్ళకు చేటువచ్చును
                          భరత సుతుడా మేలుకో!

120.అవునన్నచొ లొంగిపోవుట
       కాదనుటయె స్వేచ్ఛ అనడము
      కాపురాలను కూల్చు సూత్రము
      భరత సుతుడా మేలుకో!

                      121.మాట మీరుట మాట తగ్గుట
                             పతికి పత్నికి సహజ విషయము
                             వారి మధ్యన చట్టమొచ్చెను
                             భరత సుతుడా మేలుకో!

122.అనుమతించిన మేరకే
       శృంగారమనుచును చట్టమొచ్చెను
       భార్యాభర్తకు సాక్షి కావలె
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు  

28, డిసెంబర్ 2010, మంగళవారం

భరత సుతుడా మేలుకో! -12

101.తల్లిదండ్రిగ మంచివారలె
       అత్తమామగ దుష్టులౌదురు
       కాపురమ్ములు కూలుచున్నవి
       భరత సుతుడా మేలుకో!

             102.ఎంచిచూడగ అత్తమామలు
                   ధూర్తులైనను తల్లిదండ్రులె
                   ఆదరించుచు శాంతినొందగ
                   భరత సుతుడా మేలుకో!

103.అమ్మవల్లనె దేహమొచ్చెను
       అమ్మవల్లనె నిలిచె ప్రాణము
       అమ్మలేదన గొప్పయౌనట
       భరత సుతుడా మేలుకో!

                 104.భార్య తల్లిని భర్త ప్రేమతొ
                        భర్త తల్లిని భార్య ప్రేమతొ
                        ఆదరించుటె విశ్వశాంతిగ
                        భరత సుతుడా మేలుకో!

105.భార్యభర్తలు మామగార్లను
       కన్నతండ్రిగ ఊహజేసిన
       లోకమంతయు క్షేమకరమిక
       భరత సుతుడా మేలుకో!

                  106.ప్రేమ మీరగ కూతురింటను
                         హద్దుమీరుచు చిచ్చుపెట్టెడు
                         తల్లిన్మించిన విషము లేదుగ
                         భరత సుతుడా మేలుకో!

107.నిప్పులందున కోడలనియెడు
       కందగడ్డను కాల్చుకొని తిను
       అత్తగారలు అడవి మనుషులు
       భరత సుతుడా మేలుకో!

                      108.భార్యాభర్తలు పాలుతేనెలు
                             అన్న విషయము మరచిపోయిరి
                             ఉప్పుగల్లున పాలుపగిలెను
                             భరత సుతుడా మేలుకో!

109.భర్తనదుపులొ ఉంచినానని
       సంతసించెడు భార్యయెప్పుడొ
       భర్త మనసును చంపివేఎను
       భరత సుతుడా మేలుకో!

                      110.చెప్పు క్రిందను తేలువోలెను
                             భార్యనదుపులొ పెట్టు భర్తలు
                             భార్య దృష్టిలొ లేని చందమె
                             భరత సుతుడా మేలుకో!

111.ఆడపడుచును అర్ధమొగుడన
       భర్తవలె కాపాడవలె గద
       మంచి సామెత వ్యర్థమైనది
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు  

26, డిసెంబర్ 2010, ఆదివారం

భరత సుతుడా మేలుకో! -11

92.ప్రజాస్వామ్యమునందు ఏలిక
    మాతృస్థానము ఓటు ప్రక్రియ
    మాతృహత్యకు పూనె నేలిక
    భరత సుతుడా మేలుకో! 
             

              93.తండ్రి త్యాగము చేసి చచ్చెను
                   కాన కొడుకుకు ఏలు హక్కట
                   ప్రజాస్వామ్యము మరచినారము
                   భరత సుతుడా మేలుకో!

94.దేశమేలగ ఇచట పుట్టుట
    అంత ముఖ్యము కాదనందురు
    పరుల జెండా మోతువా మరి
    భరత సుతుడా మేలుకో!

                  95.భార్యతో సంసారమైనను
                      అధిష్టానము ఆజ్ఞమేరకె
                      బానిసలు నీ పాలకులు మరి
                     భరత సుతుడా మేలుకో!

96.నాయకుండన వెంట తిరిగెడు
     వెధవలందరి పనులు జేసెడు
     వాడు అనుకొను రోజులొచ్చెను
     భరత సుతుడా మేలుకో!

              97.నేరగాళ్ళకు జూదగాళ్ళకు
                   అన్ని పార్టీల్టిక్కెటులిచ్చును
                  వారలేలెడు దేశమా ఇది
                  భరత సుతుడా మేలుకో!

98.ఎవని పాటికి వాడె రాజై
     తన సమస్యను తీర్చుకొనునట
     కడుపు నిండగ నోరు వలదట
    భరత సుతుడా మేలుకో!

              99.బూతు మాటలె నీతి యనుచును
                  పలుకుచుండెడు పెద్దవారలు
                 ఉద్యమాలను నడుపుచుండిరి
                భరత సుతుడా మేలుకో!

100.కోట్లకొలదిగ ప్రజల ధనమును
       కొల్లగొట్టిన పాలకులకిక
       పదవి విడిచిన శిక్షయుండదు
       భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు  

25, డిసెంబర్ 2010, శనివారం

భరత సుతుడా మేలుకో! -10

83.మూడు రంగుల జెండా ఒక్కటె
     దేశముకు మరి కాంగ్రేసుకు
     పార్టి జెండా మార్చవలెగద
     భరత సుతుడా మేలుకో!
                       

                       
                       84.ఉగ్రవాదుల కాళ్ళుపట్టుకు
                            తీవ్రవాదుల చుబుకమట్టుకు
                            బ్రతుకుచున్నది మన ప్రభుత్వము
                            భరత సుతుడా మేలుకో!


85.మన ప్రభుత్వము నడుపువారలు
     'తుంగఁద్రొక్కుము రాజ్యాంగము'
      అనెడు ధూర్తుల పాదదాసులు
      భరత సుతుడా మేలుకో!

                       
                        86.నక్క కుక్కా పిల్లి ఎలుకలు
                             మనల నేలెడు వారి పేర్లట
                             ఏలువారే చెప్పుచుండిరి
                             భరత సుతుడా మేలుకో!


87.ధార్తరాష్ట్రులు శకుని కర్ణులు
     చట్టసభలలొ నిండిపోయిరి
     ప్రజల దుఃఖము భీష్మ వేదన
     భరత సుతుడా మేలుకో!

                             
                             88.ఊళ్ళు మునిగెడు వఱదలొచ్చును
                                  వేల శవములు కుళ్ళుచుండును
                                  పదవి మార్చగ బేరసారాల్
                                  భరత సుతుడా మేలుకో!


89.గద్దెనెక్కిన వారలందరు
    చెదలవోలెను రాజ్యాంగము
    తినగనేర్చిరి వారినాపగ
    భరత సుతుడా మేలుకో!

                        
                         90.న్యాయస్థానము ఉరిని వేయగ
                              తీయుధైర్యము లేని ప్రభుతలు
                              ప్రాణముండిన శవము మాదిరి
                              భరత సుతుడా మేలుకో!


91.దేశమొక్కటి ఇరు ప్రధానులు
     రాజ్యాంగము రాజకీయము
    దేశమికపై ముక్కచెక్కలు
    భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు  

భరత సుతుడా మేలుకో! -9

74.శీలమెరుగని ఓటు కొడుకుల
     సంతతి తలపైన మోసిన
     ఇనకులశ్రీ తిలకమేడ్చును
     భరత సుతుడా మేలుకో!
                            
                             75.మనలనేలెడు వారలందరు
                                  మనచె ఎన్నిక అయినవారలు
                                  ప్రజకు వేరుగ ప్రభుత లేదుగ
                                  భరత సుతుడా మేలుకో!

76.ఎన్నికల నువు నమ్మకున్నను
     నీదు ఓటుతొ గెలువకున్నను
     గెలుచువాడే పాలకుడు మరి
     భరత సుతుడా మేలుకో!

                         

                         77.ధూర్తుడైనను నీచుడైనను
                              మోముపై ఉమివేయదగినను
                              మనమె అతనిని ఎన్నుకొంటిమి
                              భరత సుతుడా మేలుకో!

78.దేశద్రోహుల పాలనమ్మున
    జాతిరక్షణ ఎండమావియె
    తపన లేమియె దేశద్రోహము
    భరత సుతుడా మేలుకో!

                           79.దేశనేతకు పక్షపాతము
                               దేశ ప్రజలకు పక్షవాతము
                              దేశమాతకు అశ్రుపాతము
                              భరత సుతుడా మేలుకో!

80.తప్పు చేసెడు భార్య భర్తను
     త్రాగుబోతుగ మార్చినట్టుల
     ప్రజల జార్చెడు ప్రభుత వచ్చెను
     భరత సుతుడా మేలుకో!

                           81.నోటికొచ్చిన రీతి వాగుట
                               రెచ్చగొట్టుట చిచ్చువెట్టుట
                               రాజకీయమ్మనుట పాడియె
                              భరత సుతుడా మేలుకో!

82.దేశమమ్మగ ప్రజలు అడ్డని
    మత్తులోపల ప్రజల నిలుపగ
    దీక్ష బూనిన ప్రభుతలున్నవి
    భరత సుతుడా మేలుకో!

- వరిగొండ కాంతారావు  

24, డిసెంబర్ 2010, శుక్రవారం

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 35 సమాధానాలు!

ఈ పజిల్‌ను పూరించడానికి ప్రయత్నించిన చదువరి, ఆ.సౌమ్య మరియు భమిడిపాటి సూర్యలక్ష్మి గార్లకు అభినందనలు!

23, డిసెంబర్ 2010, గురువారం

భరత సుతుడా మేలుకో! -8

65.మాటమార్చెడు వెధవలెందరొ
     మనలనేలగ గద్దెనెక్కిరి
     వెధవలందరి గద్దెదించగ
     భరత సుతుడా మేలుకో!

                    66.దేశమందలి పౌరులెల్లరు
                         ప్రజల హక్కులు పాలనావిధి
                         నెఱిగియుండుటె ప్రజాస్వామ్యము
                         భరత సుతుడా మేలుకో!

67.ప్రజలనిద్దుర ప్రజాస్వామ్యము
    నందు ముప్పును కలుగజేయును
    జాగరూకతె దేశ రక్షణ
    భరత సుతుడా మేలుకో!

                   68.మనమె ఎంపిక చేసినారము
                        వాడె నెత్తిన చేయివెట్టగ
                        మనమె ముక్కలు చెక్కలైతిమి
                        భరత సుతుడా మేలుకో!

69.ప్రజల పేరిట ప్రజలకొరకని
    ప్రజలనొత్తుట కమ్యూనిజము
    ప్రజల స్వర్గము పగటి స్వప్నము
    భరత సుతుడా మేలుకో!

                     70.రాక్షసత్వము చాలనందున
                          దేశధ్వంసము నెమ్మదైనది
                          ప్రభుత దక్షత కాదనెఱుగగ
                          భరత సుతుడా మేలుకో!

71.ప్రజాస్వామ్యపు స్ఫూర్తినెఱుగని
    మూర్ఖులను మనమెన్నుకొంటిమి
    తప్పు మనదని తెలుసుకొనుటకు
    భరత సుతుడా మేలుకో!

                     72.ప్రభుత ఆస్తులు తగులబడగా
                          సంతసమ్మున గంతులేస్తిమి
                          ఆస్తి మనదని తెలియమైతిమి
                          భరత సుతుడా మేలుకో!

73.శీలహీనులు జ్ఞానశూన్యులు
     చట్ట సభలకు ఎంపికవగా
     దేశమంతయు భ్రష్టువట్టెను
     భరత సుతుడా మేలుకో! 


- వరిగొండ కాంతారావు  

 

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 35


ఆధారాలు:
1. ఓణీ.
3. డిక్షనరీ.
5. వేదం వెంకటరాయ శాస్త్రి గారి బిరుదము.
7. లీడరు తాతకు లీలగ తనయుడైనట్టియతని బావ యలరు బోడి తడబడింది :)
9. ముళ్లపూడి వెంకటరమణ జ్ఞాపకాల ఆట! 
10. తేవర్ మగన్‌కు తెలుగు డబ్బింగ్ సినిమా. నాలుగో అక్షరం మాయం!
11. పంచాంగములలో ఒకదాన్ని వ్యాకరణంలో వెదకండి.
14. గజేంద్రమోక్షంలోని  సుప్రసిద్ధ పద్యము. పోతన విరచితము.
15. నిలువు 1తో కలిపి భరత సుతుడిని మేలుకొలుపుతున్న కవి.
16. సిఫారసు.
నిలువు:
1. చూడుము అడ్డము15.
2. మునవాహుజు :))
4.అమర గురుడు.
5. సౌదాగర్ చిత్రంతో బాలివుడ్‌లో అడుగు పెట్టిన తార. దీర్ఘాంతం.
6. తెలుగు కందమునకు యతి ప్రాస నియమములున్నవి. మరి కన్నడ కందమునకు? 
7. అబ్బాయిలు అందమైన అమ్మాయిని లేదా అమ్మాయిలు అందమైన అబ్బాయిని అచ్చికబుచ్చిక లాడి చేసుకోవలసినది.  
8. చూపు,పేరు లేదా చిహ్నము.
9.అందమైన బావను దీనితో పోల్చాడు ఒక సినీగేయకవి. అయితే అది హ్రస్వాంతమై ఐదో అక్షరం కాస్తా కొండెక్కి కూర్చుంది. 
12. వెండికొండ.
13. సల్మాను ఖాన్  ఒక మహమ్మదీయుడే.

22, డిసెంబర్ 2010, బుధవారం

భరత సుతుడా మేలుకో! -7

56.ఓటు కొనడము పెట్టుబడిగా
     దేశమమ్మెడు దుకాణాలను
     నడుపు వారల పాలనమ్మిది
     భరత సుతుడా మేలుకో!

                            57.ప్రజల ఓటుతొ గెలిచియుండియు
                                 ప్రజల ఇష్టము చెల్లదనియెడు
                                నీచులను మరి తరిమికొట్టగ
                                భరత సుతుడా మేలుకో!

58.ప్రజలనమ్మెడు వారలందరు
     ప్రజలు నమ్మిన పెద్దమనుషులె
     ద్రోహమన్నది వృత్తియైనది
     భరత సుతుడా మేలుకో!

                                       59.విత్తు సంకరముండవచ్చును
                                            మట్టి సంకరముండ జాలదు
                                            సంకరపు పాలన వచ్చెను
                                            భరత సుతుడా మేలుకో!

60.దేశమగ్నికి గుండమవగా
     చలిని కాగుటకుద్యమించెడు
     వారినెల్లరి దునుము కొరకని
     భరత సుతుడా మేలుకో!

                          61.కుక్కనక్కలు పీక్కు తినియెడు
                               కళేబరముగ మారె దేశము
                               ప్రాణశక్తిని నింపుకొరకని
                               భరత సుతుడా మేలుకో!

62.శవముపై పేలాల నేరుకు
     తినిరి వెనుకట పేదవారలు
     దేశనేతల వృత్తి నేడది
     భరత సుతుడా మేలుకో!

                                 63. నేతలకు మరి నీతిలేదని
                                       పలుకుచుండుట పాడియైనది
                                       నీతి కలిగిన ప్రజలు ఎక్కడ
                                       భరత సుతుడా మేలుకో!

64.ఓటు అస్త్రము ఓటు శస్త్రము
     వాడుటెరుగక నష్టపోతిమి
     అస్త్ర శస్త్రము విలువనెఱుగగ
     భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు  

21, డిసెంబర్ 2010, మంగళవారం

భరత సుతుడా మేలుకో! -6

47.దూరదర్శన ప్రవాహములన
     నేర శిక్షణకుచిత కేంద్రాల్
     ప్రజలు రాక్షసులవక మునుపే
     భరత సుతుడా మేలుకో!

                       48.సగము తెరపై చావు బ్రతుకులు
                            దాని ప్రక్కన అర్ధ నగ్నత
                           టి.వి.ఛానెల్స్ బ్రతుకులింతియె
                           భరత సుతుడా మేలుకో!

49.కాలిపోయెడు రక్తమోడెడు
     ఊపిరందక కొట్టుకొనియెడు
     జనుల చూపుటె టి.వి.పనియట
     భరత సుతుడా మేలుకో!

                            50.ఆడువారల సున్నితత్వము
                                 మంటగలసిన జాతిచచ్చును
                                 టి.వి.వారలకిదియే పనిగద
                                భరత సుతుడా మేలుకో!

51.తమదు లక్ష్యము చేరుకొరకని
    వార్తలొండెడు పత్రికలతో
    సత్యమాత్మకు హత్య నిత్యము
    భరత సుతుడా మేలుకో!

                         52.జరిగినల్లరి యథాతథముగ
                             మరల మరలను టి.వి. చూపగ
                             కొత్త అల్లరి జరుగుచుండును
                             భరత సుతుడా మేలుకో!

53.చిన్ని పాపల బూతు పాటలు
     పెద్ద పాపల బూతు డ్రెస్సులు
     టి.వి.లోపల గొప్ప ప్రోగ్రాం
     భరత సుతుడా మేలుకో!

                          54.చిన్ని బాలలకాయుక్షీణము
                              కలుగునట్లుగ మెచ్చుకొందురు
                              పెద్దవారలు టి.వి.లోపల
                              భరత సుతుడా మేలుకో!

55.న్యాయవాదియు న్యాయస్థానము
    తీర్పు చెప్పెడు న్యాయమూర్తియు
    గంపగుత్తగ 'మీడియా'నే
    భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు  

20, డిసెంబర్ 2010, సోమవారం

భరత సుతుడా మేలుకో! -5

37.దేశద్రోహము చేయుమని తన
     మతము చెప్పినదనెడు వానిని
     వదలివేయుట దేశద్రోహము
     భరత సుతుడా మేలుకో!

                                38.మతము మారని వారి బ్రోచుట
                                    కిచ్చగింపని దైవమన్నచో
                                    లోకబాంధవుడాతడెట్లగు
                                   భరత సుతుడా మేలుకో!

39.దేవుడొక్కడె లోకమంతకు
     అనుచు చెప్పెడి వారలందరు
     పరుల గుడులను కూల్చుచుందురు
    భరత సుతుడా మేలుకో!

                           40. మతము భాషనుబట్టి నామము
                                లెన్ని తీరుల మారియున్నను
                                అర్థమొక్కటె అదియె 'గుడి'కద
                                భరత సుతుడా మేలుకో!

41.మతము దేవుని చేరు మార్గము
    మాత్రమనుచును ఎఱుగలేకను
     గుడిని కూల్చుచు గుడిని కడుదురు
     భరత సుతుడా మేలుకో!

                       42. మతమునందున హెచ్చుతగ్గులు
                            దేవునందున భేదభావము
                            పొగరుబోతులు చూచుచుందురు
                            భరత సుతుడా మేలుకో!

43.ఇహమునందున పట్టుకొరకని
     పరమునడ్డము పెట్టుకొనియెడు
    గోముఖమ్ముల పులుల దునుమగ
   భరత సుతుడా మేలుకో!

                               44. హిందూ మతమును కించపరచుట
                                     బుద్ధిమంతుల గొప్పతనమట
                                     జాతి పతనము దేశహితమా
                                     భరత సుతుడా మేలుకో!

45.మట్టి హిందువు నీరు హిందువు
    అగ్ని హిందువు గాలి హిందువు
   మనిషి గూర్చియె మసక యున్నది
    భరత సుతుడా మేలుకో!

                                   46.మనది మూర్ఖపు సంప్రదాయము
                                        అనుచు మనలను మార్చుకొరకని
                                        మూర్ఖ బోధలు చేయుచుందురు
                                        భరత సుతుడా మేలుకో!


- వరిగొండ కాంతారావు    

19, డిసెంబర్ 2010, ఆదివారం

భరత సుతుడా మేలుకో! -4

27.అన్ని మతములు సమమెనందురు
     కొన్ని మతముల విడిగ జూతురు
     అందువల్లనె ద్వేషమొదవును
     భరత సుతుడా మేలుకో!

                        28.ఇరుల విషమును చిమ్ము జోడుతొ
                             వెలుగు చూడగ వెఱపు చెందెడు
                             రాములేడను దనుజుఁదునుమగ
                             భరత సుతుడా మేలుకో!

29. కలియుగమ్మున పరాశర స్మృతి
      యొక్కటే ప్రామాణ్యమైనను
     ఎఱుగ జాలక మనువుఁదిట్టిరి
     భరత సుతుడా మేలుకో!

                              30.'మనువు మనువ'ని తిట్టువారలు
                                   మనువు వ్రాసిన స్మృతిని చదువరు
                                   గొఱ్ఱె దాటుగ తిట్టుచుందురు
                                   భరత సుతుడా మేలుకో!

31.పరులు నీకై దైవ ప్రార్థన
    చేతురట మరి సంతసమ్మే
    మతము మారుట షరాయట మరి
    భరత సుతుడా మేలుకో!

                       32.మతము మార్చిన పిదపనే మరి
                            మృత్యుముఖమున నున్నవానికి
                            గొంతులోపల నీరు పడునట
                            భరత సుతుడా మేలుకో
!

33.మతము మారిన చదువు పదవీ
     మతము మారిన కారు బంగ్లా
     మతము మార్చుట వాణిజ్యము
     భరత సుతుడా
మేలుకో!

                            34.'మాకు ఒక్కడె దేవు'డనుచును
                                 'మీరు మూర్ఖులు కనుక పెక్క'ను
                                 వెక్కిరింపుకు వెతల నొందక
                                 భరత సుతుడా మేలుకో!

35.దేవుడొక్కొడె పేర్లు వేలని
    విజ్ఞులెందరొ చెప్పియున్నను
    తెలివిలేమితొ వెక్కిరింతురు
    భరత సుతుడా
మేలుకో!

                                 36.తాము నమ్మిన మతపు సారము
                                      నెఱుగకుండిన కూళలందరు
                                      పరుల మతమును వెక్కిరింతురు

                                     భరత సుతుడా మేలుకో!

- వరిగొండ కాంతారావు        

అక్కిరాజు భట్టిప్రోలు కథ!

అక్కిరాజు భట్టిప్రోలుగారి జంధ్యం కథ కథాజగత్‌లో ప్రకటించబడింది.

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 34 సమాధానాలు!

18, డిసెంబర్ 2010, శనివారం

భరత సుతుడా మేలుకో! -3

17.మతము పేరిట 'పాక్'వానిని
     సమర్థించెడు శీలహీనుల
     నోట్లకొరకని బుజ్జగింతురు
    భరత సుతుడా మేలుకో!

                              
                               18.'పాక్'వానికి బుద్ధి చెప్పగ
                                    అమెరికా అనుమతులు కావలె
                                    మూడు రంగులు సిగ్గుపడినవి
                                    భరత సుతుడా మేలుకో!


19.మాతృదేశపు కిరీటానికి
     'పాక్'వారల కాలితాపులు
     తాకుచున్నను మిన్నకుంటిమి
     భరత సుతుడా మేలుకో!

                             
                             20.అమెరికా కాల్జోళ్ళు తుడుచుట
                                  బ్రిటిషువానికి మోకరిల్లుట
                                  గొప్పబ్రతుకుకు తప్పదట మరి
                                  భరత సుతుడా మేలుకో!


21.ఇటలి పాదము కడిగి నీళ్ళను
     తీర్థముగ సేవించకుండిన
     దేశమేలెడు శక్తి రాదట
     భరత సుతుడా మేలుకో!

                                  
                                   22.భరతమాతకు పాదపీఠము
                                        లంకదేశపు అగ్నికీలల
                                        తమిళపాదము కాలుచున్నది
                                        భరత సుతుడా మేలుకో!


23.ఎచటనైనను ఎప్పుడైనను
     భారతీయుని తన్నవచ్చును
     అడుగజాలని ప్రభుతలున్నవి
     భరత సుతుడా మేలుకో!
                                 
                                
                               24.ఉగ్రవాదికి జిహాదీలకు
                                    నక్సలైటుకు ప్రభుత్వాలకు
                                    మందుగుండును అమ్మునమెరిక
                                    భరత సుతుడా మేలుకో!


25.వియత్నామో ఖందహారమొ
     లోకమంతట చిచ్చువెట్టగ
     'శాంతి నోబెల్'అమెరికాకే
     భరత సుతుడా మేలుకో!

                           
                            26.బంగ్లాదేశము నుండి పనులకు
                                 దొంగతనముగ వచ్చువారలు
                                 పౌరులై మనకోట్లు వేతురు
                                 భరత సుతుడా మేలుకో!



- వరిగొండ కాంతారావు        

క్రాస్‌వర్డు పజిలు సాల్వుము - 34


ఆధారాలు:
 
1. హెలీకాప్టరు.
3. సంచారి బాణములలో దీపావళి సరుకును వెదుకుము.
5. ఈ సైన్సు మేకప్‌కు సంబంధించినది కాదండోయ్!
7. కఱకుదనం తొట్రు పడింది.
9. గెలుపు నగారా! 
10. కేసీయార్ ఐ లవ్యూ చెప్పింది ఇతనికే :)
11. తిమురున్న మిట్టూరోడిని పిలిస్తే నియుక్తుడు పలుకుతాడా!
14. పార్వతి. హిమవంతుడి కూతురు కదా!
15. భజసనభజసనభయ
16. 'ఎందుకోయీ తోటమాలీ అంతులేని యాతనా...' అంటూ భానుమతి పాడింది ఈ సినిమాలోనే.
 
నిలువు:
 
1. సర్పమును కడుపులో దాచుకున్న ఋషిపత్ని.
2. బర్బర సేన!
4. 'కాంచన మృగం' కథా రచయిత.
5. కంప్యూటర్ పరిభాషలో డిఫాల్ట్ వేల్యూ!
6. వయసుడిగిన బ్రహ్మచారికి పోలిక. కాకపోతే నాలుగో అక్షరం కాస్త ముందుకెళ్లింది. 
7. హిందుస్తానీ భాషలో ఆశ్రయము,గతి. 
8. ఆంగ్ల భాషలో వలసరాజ్యం.
9. ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా గిన్నిసుబుక్‌లో ఎక్కిన తెలుగు వనిత.
12. ఈ నేల విస్తృతమైనదే కాని తలక్రిందలయ్యింది.
13. లంగా ఉన్న ప్రాంతం. 

17, డిసెంబర్ 2010, శుక్రవారం

భరత సుతుడా మేలుకో! -2

9.'మీది కాదరుణాచల'మ్మని
   చైనావారలు అరచుచుండగ
   మనది మనదని గొణుగుచుంటిమి
   భరత సుతుడా మేలుకో!

                                     10.చైనా నేలిన నేత పేరిట
                                          గద్దెనెక్కగ దేశమగ్నికి
                                          ఆహుతిచ్చెడు వారి దునుమగ
                                          భరత సుతుడా మేలుకో!

11.పేల్చి కూల్చుచు గద్దె నెక్కుటె
     శ్రేష్ఠ మార్గమ్మనుచు చెప్పెడు
     రాక్షసాథము నణచుకొరకని
     భరత సుతుడా మేలుకో!

                                     12.కాశ్మీరములేని భారత
                                          దేశపటమును చైనావారలు
                                          పంచినను మన రక్తముడుకదు
                                          భరత సుతుడా మేలుకో!

13.ఓడిపోతిమి గడ్డి కూడా
   మొలవదనుచును వదిలిపెడితిమి
   మానమెరుగని దేశమా ఇది
   భరత సుతుడా మేలుకో!

                                      14.ఆక్రమిత కాశ్మీరమందున
                                           'పాక్'వారలు ఫ్యాక్టరీలను
                                           పెట్టుకొనుటకు చైనా సాయం
                                           భరత సుతుడా మేలుకో!

15.మనదె దేశము మనదె పాలన
   తిరుగబోవగ చైనావారలు
   ఆంక్షలిడుచో అడుగజాలము
   భరత సుతుడా మేలుకో!

                             16.తల్లి భారతి చీరకొంగును
                                  చైనావారలు లాగుచుండగ
                                 మిన్నకుండెడు కొడుకులేటికి
                                 భరత సుతుడా మేలుకో!

- వరిగొండ కాంతారావు